అపరిపూర్ణ లోకంలో విశ్వాస్యత
“నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.” మీ విషయంలో కూడా ఇదే వాస్తవమని మీకనిపిస్తుందా? అపొస్తలుడైన పౌలుకు కూడా అదే సమస్య ఉందని తెలుసుకుని మీరు ప్రోత్సాహాన్ని పొందండి; అయినప్పటికీ ఆయన అత్యంత అసాధారణమైన క్రైస్తవ యథార్థతను చూపిన వ్యక్తి. అది ఒక పరస్పర విరుద్ధమైన విషయం కాదా? రోము నందలి క్రైస్తవులకు పౌలు తాను వ్రాసిన లేఖలో, ఆ సమస్యను విశ్లేషిస్తూ ఇలా వ్రాశాడు: “నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.” ఆయన ఏ పాపాన్ని సూచిస్తున్నాడు, యథార్థతగల వ్యక్తిగా ఉండటానికి ఆయన దాన్ని ఎలా అధిగమించాడు?—రోమీయులు 7:19, 20.
ఇంతకు ముందు తన లేఖలో, పౌలు ఇలా వ్రాశాడు: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” ఆ ‘ఒక మనుష్యుడు’ ఆదాము. (రోమీయులు 5:12, 14) ఆదాము సంబంధిత పాపం అంటే మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపమే, మానవజాతి సంప్రాప్తించుకున్న అపరిపూర్ణతలకు మూలం మరియు యథార్థతను కాపాడుకోవడం ఒక నిజమైన సవాలైయుండటానికి గల మూలకారణం.
పరిణామ సిద్ధాంతం పక్షంలో పండితులు సృష్టిని గురించిన బైబిలు వృత్తాంతాన్ని నిరాకరించినందున, “మొదటి పాపము” అని మునుపు పిలువబడిన పదాన్ని గూర్చి పౌలు యొక్క దృక్పథాన్ని నేడు అనేకులు అంగీకరించడం లేదు. రోమీయులు 5:12-14ను గురించిన ఒక ఆధునిక వ్యాఖ్యానం “ఆ మొత్తం వృత్తాంతాన్నే పండితులు పూర్తిగా ప్రక్కకు నెట్టేశారు” అని చెప్పింది. అయినప్పటికీ నూరు సంవత్సరాల క్రితం, “ఆదాము పాపం చేసినప్పుడు . . . అతడు తన సంతానాన్ని అంతటినీ ఆ పాపంతోనూ దాని పర్యవసానాలతోనూ కలంకితం చేశాడు”a అని బైబిలు వ్యాఖ్యానాలు సంగతంగా వివరించాయి.
యథార్థతను మొట్టమొదట కోల్పోవడం
మొదటి మానవుడైన ఆదాము ఉనికిని నేడు అనేకమంది ఎలా నిరాకరిస్తున్నారో అదే విధంగా అపవాదియైన సాతాను కూడా పురాణ గాథల్లోని ఒక పాత్రేనని కొట్టిపారేస్తున్నారు.b అయితే అతడు “సత్యమందు నిలిచినవాడు కాడు” అని అంటే, వేరే మాటల్లో చెప్పాలంటే అతడు విశ్వాసయోగ్యునిగా ఉండలేదని యేసుక్రీస్తు అంతటి ఘననీయమైన అధికారంగల వ్యక్తి తానే మనకు చెబుతున్నాడు. (యోహాను 8:44) వాస్తవానికి, సాతాను ప్రేరేపించినప్పుడే ఆదాము అతడి భార్యయైన హవ్వ యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేసి, పరీక్షించబడినప్పుడు తమ యథార్థతను కోల్పోపోయారు.—ఆదికాండము 3:1-19.
మనందరమూ కూడా ఆదాము వంశస్థులం గనుక, పాపం చేసే ప్రవృత్తి మనందరికీ వారసత్వంగా వచ్చింది. జ్ఞానియైన సొలొమోను ఇలా పేర్కొన్నాడు: “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.” (ప్రసంగి 7:20) అయిననూ, ఏ మానవుడైనా విశ్వాసయోగ్యంగా ఉండగలడు. అది ఎలా సాధ్యం? ఎందుకంటే యథార్థతను కాపాడుకోవడానికి పరిపూర్ణత అవసరం లేదు.
యథార్థతకుగల ఆధారం
ఇశ్రాయేలు రాజైన దావీదు అనేక తప్పిదాలను చేశాడు, బత్షెబతో ఆయనకున్న వ్యభిచార సంబంధాన్ని గురించిన విషయాలు కూడా అందులో ఇమిడివున్నాయి. (2 సమూయేలు 11:1-27) దావీదు చేసిన అనేక తప్పిదాలు ఆయన అపరిపూర్ణుడనే విషయాన్ని నొక్కి చెప్పేందుకు సహాయపడ్డాయి. అయితే యెహోవా ఆ వ్యక్తిలో ఏమి చూశాడు? దావీదు కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ, యెహోవా ఇలా చెప్పాడు: “నీ తండ్రియైన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృదయుడవై నీతిని బట్టి నడుచు”కొనుము. (ఇటాలిక్కులు మావి.) (1 రాజులు 9:4) దావీదు అన్ని తప్పిదాలు చేసినప్పటికీ, ఆయన కలిగివున్న మూల విశ్వాసయోగ్యతను యెహోవా గుర్తించాడు. ఎందుకు?
సొలొమోనుకు ఇలా చెప్పినప్పుడు దావీదు దానికి సమాధానమిచ్చాడు: “యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు.” (1 దినవృత్తాంతములు 28:9) దావీదు తప్పిదాలు చేశాడు, అయితే ఆయన దీనంగా ఉన్నాడు, ఆయన సరైనది చేయాలని కోరుకున్నాడు. ఆయనకు గద్దింపూ క్రమశిక్షణా ఇవ్వబడినప్పుడు దాన్ని ఎల్లప్పుడూ అంగీకరించాడు, వాస్తవానికి ఆయన అవి కావాలని అడిగాడు. “యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము” అన్నదే ఆయన విన్నపం. (కీర్తన 26:2) మరి దావీదు పరిశోధించపడ్డాడు. ఉదాహరణకు, బత్షెబతో ఆయన చేసిన పాపం ఫలితంగా ఏర్పడిన నిర్బంధాలు ఆయన జీవితాంతం వరకూ నిలిచాయి. అయినప్పటికీ, దావీదు తన పాపాలను సమర్థించుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. (2 సమూయేలు 12:1-12) మరింత ప్రాముఖ్యంగా, ఆయన సత్యారాధన నుండి ఎన్నడూ వైదొలగలేదు. ఆ కారణం మూలంగా, దావీదు యొక్క నిజాయితీతో కూడిన, హృదయపూర్వకమైన అనుతాపం మరియు పశ్చాతాపం మూలంగా, ఆయన పాపాలను క్షమించేందుకూ ఆయనను యథార్థతగల వ్యక్తిగా అంగీకరించేందుకూ యెహోవా సిద్ధపడ్డాడు.—కీర్తన 51 కూడా చూడండి.
పరీక్షించబడినప్పుడు విశ్వాసయోగ్యంగా ఉండటం
యేసు కనబరుస్తున్న యథార్థతను విఫలం చేసేందుకు అపవాదియైన సాతాను ఆయనను పరీక్షించాడు. ఆయన ఆదాముకు భిన్నంగా కష్టాలనూ శ్రమలనూ అనుభవిస్తూ తన యథార్థతను కాపాడుకోవలసి వచ్చింది, అయితే పరిపూర్ణ మానవునిగా ఆదాము ఒక దైవిక నియమానికి విధేయతను చూపమని ఉపదేశింపబడటం ద్వారా మాత్రమే పరీక్షించబడ్డాడు. దానికి తోడు, తన యథార్థతపైనే మానవకుటుంబం యొక్క విమోచన ఆధారపడి ఉందనే విషయాన్ని ఎరిగి ఉండటం ద్వారా కూడా యేసు మరింత ఒత్తిడికి లోనయ్యాడు.—హెబ్రీయులు 5:8, 9.
యేసు కలిగివున్న యథార్థతను కూలద్రోయాలనే తీర్మానంతో సాతాను, యేసు అతి బలహీనంగా ఉన్న క్షణంలో అంటే ఆయన అరణ్యంలో 40 దినాలు ధ్యానం చేస్తూ ఉపవాసం చేసిన తర్వాత ఆయనను సమీపించాడు. రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని; దేవదూతలు వచ్చి జోక్యం చేసుకుని ఆయనను కాపాడతారని అలా ఆయన మెస్సీయ అనే విషయానికి అది అద్భుత సూచననిస్తుంది గనుక దేవాలయ శిఖరం నుండి క్రిందకి దూకమని; మరియు సాతానుకు ఒకే ఒక్కసారి ‘సాగిలపడి నమస్కారము’ చేయడానికి మారుగా ఈ లోకరాజ్యాలన్నిటి పరిపాలనను అంగీకరించమని చెబుతూ అతడు యేసును మూడుసార్లు శోధించాడు. అయితే యేసు యెహోవా ఎడల తన యథార్థతను నిలుపుకుంటూ ప్రతి శోధననూ నిరాకరించాడు.—మత్తయి 4:1-11; లూకా 4:1-13.
యోబు యథార్థత
యోబు యథార్థత పరీక్షించబడినప్పుడు ఆయన దృఢంగా నిలిచిన విషయం సర్వవిధితమే. తనపైకి కష్టాల వెల్లువ ఎందుకు వచ్చిందో యోబుకు తెలియదన్నది ఆసక్తికరమైన విషయం. ఆయన స్వార్థపూరిత కారణాలతో దేవున్ని సేవిస్తున్నాడని ఆరోపించాడనీ తన శరీరాన్ని కాపాడుకునేందుకు ఆయన తన యథార్థతను ఇష్టపూర్వకంగా నిరాకరిస్తాడనీ చెబుతూ సాతాను తనకు అబద్ధపు ఉద్దేశాలను అంటగట్టాడనే విషయం యోబుకు తెలియదు. సాతానుది తప్పనే విషయాన్ని చూపేందుకు, యోబు కొన్ని భయంకరమైన కష్టాలను అనుభవించేందుకు దేవుడు అనుమతించాడు.—యోబు 1:6-12; 2:1-8.
ముగ్గురు అబద్ధ స్నేహితులు రంగంలోకి దిగారు. వారు దేవుని ప్రమాణాలనూ సంకల్పాలను గురించి ఉద్దేశ్యపూర్వకంగా తప్పుగా వర్ణించారు. యోబు భార్య కూడా వివాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం మూలంగా, తన భర్తకు తాను ఎంతో అవసరమైన ఈ సమయంలో ఆయనను ప్రోత్సహించడంలో విఫలమైంది. (యోబు 2:9-13) అయితే యోబు దృఢంగా నిలిచాడు. “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు.”—యోబు 27:5, 6.
యోబు యొక్క మహత్తరమైన ఉదాహరణ, అలాగే ఆయనతోపాటు బైబిలులో వ్రాయబడివున్న నమ్మకస్థులైన అనేకమంది ఇతర స్త్రీ పురుషుల యథార్థత కూడా సాతాను అబద్ధీకుడని నిరూపించాయి.
యథార్థత మరియు క్రైస్తవ పరిచర్య
యథార్థత అనే లక్షణాన్ని యెహోవా తన స్వంత సంతృప్తి కొరకు మాత్రమే గొప్పదైన దానిగా భావిస్తాడా? లేదు. మానవులమైన మనకు యథార్థత స్వతస్సిద్ధమూల్యాన్ని కలిగివుంది. మన ‘పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణమనస్సుతోను మన దేవుడైన యెహోవాను ప్రేమించమని’ యేసు ప్రబోధించింది మన ప్రయోజనం కొరకే. వాస్తవంగా అది “ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ,” మరి ఈ ఆజ్ఞకు విధేయత చూపడం యథార్థతగల ప్రతి ఒక్కరికి అంటే పురుషునికి, స్త్రీకి, పిల్లలకు సాధ్యమే. (మత్తయి 22:36-38) అందులో ఏమి ఇమిడి ఉంది మరియు దాని ప్రతిఫలాలేమిటి?
యథార్థతగల వ్యక్తిని ఆయన తోటి వ్యక్తులే కాదు అతి ప్రాముఖ్యంగా దేవుడు విశ్వసించవచ్చు. ఆయన మనస్సులోని స్వచ్ఛత ఆయన చర్యల్లో కనిపిస్తుంది; ఆయనలో వేషధారణ అసలు ఉండదు. ఆయన మోసం చేయడు లేక అవినీతిపరుడు కాదు. అపొస్తలుడైన పౌలు దాన్ని ఇలా చెప్పాడు: “కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము.”—2 కొరింథీయులు 4:2.
పౌలు క్రైస్తవ పరిచర్యకు సంబంధించిన దృక్ఫథాల గురించి ప్రస్తావించడాన్ని గమనించండి. ఒక క్రైస్తవ పరిచారకుని చర్యలు నీతియుక్తంగా లేకుంటే, ఆయన యథార్థతగల మనిషి కాకుంటే ఆయన ఇతరులకు ఎలా సేవ చేయగలడు? ఇటీవలనే రాజీనామా ఇచ్చిన, ఒక ఐరిష్ మత క్రమమునకు చెందిన మఠాధికారి విషయం ఆ సంగతిని చక్కగా ఉదహరిస్తుంది. “ఒక పిడోఫైల్ (శిశుకామ) ప్రీస్టు పిల్లలపై అత్యాచారం చేస్తున్నాడనే విషయం తెలిసిన తర్వాత కూడా చాలాకాలం అతడు పిల్లలతో పని చేసేందుకు తాను అనుమతించానని” అతడు అంగీకరించాడని ది ఇండిపెండెంట్ వార్తాపత్రిక చెబుతుంది. ఆ దుర్‌వ్యవహారం 24 సంవత్సరాల కంటే ఎక్కువకాలం పాటూ కొనసాగిందని ఆ వృత్తాంతం వివరించింది. ఆ ప్రీస్టుకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది, అయితే ఆ వ్యక్తి యొక్క పైఅధికారి చర్య తీసుకునేందుకు నైతిక యథార్థతను కలిగిలేనందున అన్ని సంవత్సరాల్లో అతడు ఎవరిపై అత్యాచారానికి పాల్పడ్డాడో ఆ పిల్లలకు కలిగిన వ్యధ గురించి ఆలోచించండి!
యథార్థత—ప్రతిఫలాలు
అపొస్తలుడైన యోహాను నిర్భయస్థుడు. వారి ప్రచండ ఉత్సుకత మూలంగా, ఆయననూ ఆయన సహోదరుడైన యాకోబును యేసు “ఉరిమెడు వారని” పిలిచాడు. (మార్కు 3:17) అసాధారణమైన యథార్థతను ప్రదర్శించిన వ్యక్తియగు యోహాను పేతురుతోపాటు కలిసి, యేసుతో తాను ఉన్నప్పుడు చూసిన, వినిన సంగతులను “చెప్పక యుండలేమని” యూదా పరిపాలకులకు వివరించాడు. “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అని చెప్పిన అపొస్తలుల్లో యోహాను కూడా ఉన్నాడు.—అపొస్తలుల కార్యములు 4:19, 20; 5:27-32.
యోహాను “దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును” పత్మాసు ద్వీపానికి పరవాసిగా పంపబడినప్పుడు, ఆయన తన 90వ పడి తుదిభాగంలో ఉండి ఉంటాడని అనిపిస్తుంది. (ప్రకటన 1:9) ఆ వయస్సులో, ఆయన తన పరిచర్య ముగిసిపోయిందని అనుకుని ఉండవచ్చు. ప్రకటన యొక్క ఉత్తేజకరమైన దర్శనాన్ని గురించి వ్రాయడమనే నియామకాన్ని అంతటి యథార్థతగల వ్యక్తికి మాత్రమే ఇవ్వవచ్చు. ఈ విషయంలో యోహాను నమ్మకంగా ఉన్నాడు. అది ఆయనకెంతటి గొప్ప ఆధిక్యతోకదా! మరిన్ని రానైయున్నాయి. తర్వాత, బహుశ ఎఫెసులో ఉన్నప్పుడు ఆయన తన సువార్త వృత్తాంతాన్నీ మూడు లేఖలనూ వ్రాశాడు. 70 సంవత్సరాల నమ్మకమైన విశ్వాసయోగ్యమైన సేవకు ప్రతిఫలంగా అలాంటి గొప్ప ఆధిక్యతలు ఆయనకు లభించాయి!
యథార్థతగల వ్యక్తిగా ఉండటం అత్యంత గొప్ప సంతృప్తినిస్తుంది. దేవుని దృష్టిలో విశ్వాసయోగ్యంగా ఉండటం నిత్య ప్రతిఫలాలను తీసుకువస్తుంది. నేడు, సత్యారాధికుల “గొప్ప సమూహము” నిత్యజీవాన్ని పొందే ఉత్తరాపేక్షతో, శాంతిసమాధానాల క్రొత్త లోకంలోనికి ప్రవేశించేందుకు సిద్ధం చేయబడుతోంది. (ప్రకటన 7:9) ఈ విధానం యొక్క శ్రమలూ దేవుని సేవకులపైకి సాతాను తీసుకువచ్చే అనేక సవాళ్లు ఉన్నప్పటికీ నైతికత, ఆరాధన వంటి ముఖ్యమైన విషయాల్లో యథార్థతను కలిగివుండాలి. యెహోవా అనుగ్రహించే శక్తి ద్వారా మీరు విజయం సాధించగలరనే నిశ్చయతను కలిగివుండండి!—ఫిలిప్పీయులు 4:13.
వర్ధమానాన్నీ భవిష్యత్తునూ గురించి మాట్లాడుతూ, యెహోవాకు కృతజ్ఞతా ప్రార్థన చేస్తూ కీర్తనల గ్రంథకర్తయైన దావీదు ఇలా చెప్పినప్పుడు ఆయన మనకందరికీ నిశ్చయతనిస్తున్నాడు: “నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. . . . యెహోవా . . . స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్.”—కీర్తన 41:12, 13.
[అధస్సూచీలు]
a వివిధ రచయితల క్లుప్త వ్యాఖ్యానాలుగల, ఆథరైజ్డ్ వర్షన్ ప్రకారం మన ప్రభువు మరియు రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క క్రొత్త నిబంధన (ఆంగ్లం) నందలి వ్యాఖ్యానం.
b సాతాను అనే పేరుకు “వ్యతిరేకించువాడు” అని, “అపవాది” అంటే “కొండెములు చెప్పువాడు” అని అర్థము.
[4వ పేజీలోని చిత్రం]
దావీదు తాను తప్పిదాలు చేసినప్పటికీ, విశ్వాసయోగ్యునిగా నిరూపించుకున్నాడు
[5వ పేజీలోని చిత్రం]
విశ్వాసయోగ్యత విషయంలో యేసు మనకు అతి చక్కని మాదిరినుంచాడు
[7వ పేజీలోని చిత్రం]
విశ్వాసయోగ్యంగా ఉండటం గొప్ప సంతృప్తినిస్తుంది