ఆనందాన్ని తెచ్చే కుటుంబ పఠనం
“తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును” అని బైబిలు చెబుతుంది. (సామెతలు 24:4) ఈ విలువగల సర్వ సంపదలో కేవలం వస్తు రూపమైన ధనం మాత్రమే కాదు గానీ నిజమైన ప్రేమ, దైవిక భయం, దృఢమైన విశ్వాసం కూడా ఇమిడి వున్నాయి. అలాంటి లక్షణాలు వాస్తవానికి సుసంపన్నమైన కుటుంబ జీవితాన్ని అందిస్తాయి. (సామెతలు 15:16, 17; 1 పేతురు 1:7) అయితే, వాటిని సంపాదించేందుకు మనం దేవుని జ్ఞానాన్ని మన గృహాల్లోకి తీసుకుని రావలసిన అవసరం ఉంది.
ఈ జ్ఞానాన్ని తన కుటుంబ సభ్యుల్లో పెంపొందించవలసిన బాధ్యత కుటుంబ పెద్దకు ఉంది. (ద్వితీయోపదేశకాండము 6:6, 7; ఎఫెసీయులు 5:25, 26; 6:4) దీనిని చేసేందుకు ఉన్న అత్యంత శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటి క్రమమైన కుటుంబ పఠనం. ఉపదేశాత్మకమైన మరియు ఆనందదాయకమైన విధంగా పఠనాన్ని నిర్వహిస్తే, అందులో భాగం వహించే వారికి అదెంత ఆనందాన్ని కలిగించగలదో కదా! కాబట్టి, ప్రభావవంతమైన కుటుంబ పఠనాన్ని నిర్వహించేందుకు ప్రాముఖ్యమైన కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాము.a
కుటుంబ పఠనం క్రమంగా నిర్వహించబడినప్పుడు అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వీలు కుదిరితే నిర్వహించవచ్చులే అని వదిలేస్తే లేక ఆ క్షణం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నిర్వహించవచ్చని ఉంటే దాన్ని సరైన పరిస్థితుల్లో కూడా క్రమంగా నిర్వహించేందుకు వీలు పడదు. కాబట్టి మీరు పఠనం కొరకు ‘సమయాన్ని పోనియ్యక సద్వినియోగం చేసుకోవాలి.’ (ఎఫెసీయులు 5:15-17) అందరికీ అనుకూలంగా ఉండే క్రమమైన సమయాన్ని నిర్ణయించగలగడం కూడా ఒక సవాలు కాగలదు. “మా కుటుంబ పఠనాన్ని క్రమంగా జరుపుకోవడం మాకు అసలు కుదిరేది కాదు” అని ఒక కుటుంబ పెద్ద ఒప్పుకున్నాడు. “మేము వేర్వేరు సమయాలను ప్రయత్నించి చూశాం, అయితే చివరకు సాయంత్రాల్లో కాస్త ఆలస్యంగా చేసుకోవడం మాకు కుదురుతుందని మేము గుర్తించాము. ఇప్పుడు మా కుటుంబ పఠనం క్రమంగా జరుగుతోంది.”
మీకు ఒకసారి సరిగ్గా అనువైన సమయం కుదిరిన తర్వాత, అడపా దడపా వచ్చే అవరోధాలు మీ పఠనాన్ని వెనక్కినెట్టకుండా ఉండేందుకు జాగ్రత్త వహించండి. “మేము పఠనం నిర్వహించుకుంటున్నప్పుడు సందర్శకులు వస్తే, పఠనం ముగిసేంత వరకూ ఆగమని నాన్న వాళ్లను అడిగేవాడు. మరి ఫోన్ వస్తే, మళ్లీ తర్వాత తానే ఫోన్ చేస్తానని ఆయన వాళ్లకు చెప్పేవాడు” అని ఇప్పుడు 33 సంవత్సరాల వయస్సుగల మారియాb జ్ఞాపకం చేసుకుంటోంది.
అయితే, దీని అర్థం మీరు మార్పులను చేసుకునేందుకు ఆస్కారమే లేదని కాదు. అత్యవసర పరిస్థితి లేక అనుకోని సంఘటనలు తలెత్తవచ్చు, మరి అప్పుడప్పుడూ పఠనాన్ని రద్దు చేయవలసిన లేక వాయిదా వేయవలసిన పరిస్థితి రావచ్చు. (ప్రసంగి 9:11) అయితే ఇవి ఏవీ కూడా మీ నిత్యక్రమానికి విఘాతం కలిగించకుండా జాగ్రత్త వహించండి.—ఫిలిప్పీయులు 3:16.
ఒక పఠనం ఎంతసేపు జరగాలి? ఒక కుమారున్నీ ఒక కుమార్తెనూ విజయవంతంగా పెంచి పెద్ద చేసిన రాబర్ట్, ఇలా చెబుతున్నాడు: “మా పఠనం సాధారణంగా ఒక గంటపాటు జరిగేది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, వారి అవధానాన్ని నిలిపి ఉంచేందుకు మేము కావలికోట పత్రికల్లోని పఠన శీర్షికల్లో నుండి కొన్ని పేరాలనూ, బైబిలు నుండి ఎన్నుకోబడిన వాక్యాలనూ ఇతర ప్రచురణల నుండి భాగాలనూ తీసుకోవడం ద్వారా విభిన్నమైన విషయాలను పరిశీలించే వాళ్లము.” మారియా ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “మా అక్కలూ నేనూ చాలా చిన్నగా ఉన్నప్పుడు, మా పఠనం వారంలో రెండు లేక మూడు సార్లు 20 నిమిషాలపాటు జరిగేది. మేము పెరిగి పెద్దవాళ్లం అవుతున్న కొద్దీ మా కుటుంబ పఠనాన్ని ఒక గంట పాటూ జరుపుకునే వాళ్లము.”
మనం ఏది పఠించాలి?
పఠనం కొరకు అందరూ సమకూడి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నను గురించి ఆలోచించడం ఆశాభంగానికీ విలువైన పఠన సమయాన్ని కోల్పోయేందుకూ దారి తీస్తుంది. పరిస్థితి అలాగుంటే, పిల్లలు ఎదురు చూసేందుకు ఎలాంటి ప్రత్యేకమైన విషయాలూ ఉండవు మరియు వారి ఆసక్తి త్వరలోనే సన్నగిల్లుతుంది. కాబట్టి ముందే సంస్థ యొక్క ప్రచురణల్లో ఒక దాన్ని ఎన్నుకోండి.
“నమ్మకమైన వాడునూ బుద్ధిమంతుడునైన దాసుడు” ఎన్నుకునేందుకు ప్రచురణలను పుష్కలంగా అందించాడు. (మత్తయి 24:45-47) కుటుంబంలోని వారు ఇంకా చదవని ఏదైనా ఒక పుస్తకాన్ని బహుశ మీరు ఎన్నుకోవచ్చు. మరి లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటులు మీ భాషలో లభ్యమౌతుంటే వాటిలోని ఎన్నుకోబడిన అంశాలను పరిశీలించడం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది! ఉదాహరణకు, జ్ఞాపకార్థ దినానికి ముందు వారంలో ప్రభువు రాత్రి భోజనానికి సంబంధించిన శీర్షికను మీరు పరిశీలించవచ్చు. అనేక కుటుంబాలు ప్రతి వారం కావలికోట పఠనాన్ని సిద్ధపడడంలో ఆనందిస్తారు. అయితే కావలికోటలోని మాధ్యమిక శీర్షికలు కూడా పఠనంలో పరిశీలించగల చక్కని విషయాలను అందించగలవు. కుటుంబం యొక్క ఆత్మీయ అవసరతలను గుర్తెరిగిన కుటుంబ పెద్ద, ఏ ప్రచురణలను పఠించాలనే విషయాన్ని నిర్ణయించేందుకు శ్రేష్ఠమైన స్థానంలో ఉంటాడు.
“పఠనంలో పరిశీలించబోయే ప్రచురణను మేము ఎల్లప్పుడూ ముందే ఎన్నుకుని ఉంచుకునే వాళ్లం” అని మారియా జ్ఞాపకం చేసుకుంటోంది. “అయితే ఒక ప్రశ్న తలెత్తినప్పుడు లేక స్కూల్లో ఏదైనా పరిస్థితి తలెత్తినప్పుడు, మేము దాని సంబంధిత సమాచారాన్ని పరిశీలించే వాళ్లము.” స్కూల్లో యౌవనులు ఎదుర్కునే సమస్యలు, డేటింగ్, పాఠ్యక్రమేతర కార్యకలాపాలు మరియు అలాంటివే మరితరములు తలెత్తుతాయి. అది జరిగినప్పుడు, ప్రస్తుత సమస్యతో వ్యవహరించే శీర్షికలను లేక ప్రచురణలను ఎన్నుకుని వాటిని పరిశీలించండి. ఇటీవలి కావలికోట లేక తేజరిల్లు! సంచికల్లోని సమాచారాన్ని మీరు మీ కుటుంబంతో వెంటనే పంచుకోవాలని ఇష్టపడితే, అలా చేసేందుకు సంకోచించకండి. అయితే, ఈ మార్పును గురించి మీరు మీ కుటుంబ సభ్యులకు ముందే తెలియజేయడం మంచిది. మరి ఒకసారి ఆ అవసరం తీరిన తర్వాత మీరు నియమించుకున్న సమాచారాన్ని మరల తప్పక పరిశీలించడం ప్రారంభించండి.
వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచండి
శాంతియుత పరిస్థితుల్లో మరింత శ్రేష్ఠంగా నేర్చుకోవచ్చు. (యాకోబు 3:18) కాబట్టి ఉత్కంఠరహితమైనదే అయినప్పటికీ గౌరవపూర్ణ వాతావరణాన్ని వృద్ధిపర్చండి. అమెరికాలోని ఒక కుటుంబ పెద్ద ఇలా చెబుతున్నాడు: “మేము లివింగ్ రూమ్‌లో అధ్యయనం చేసినా లేక వరండాలో చేసినా, ఒక పెద్ద గదిలో అందరమూ దూరం దూరంగా కూర్చునే బదులు దగ్గరగా కూర్చునేందుకు ప్రయత్నిస్తాము. అది మాలో ఆప్యాయతా భావాలను ఉత్పన్నం చేస్తుంది.” మారియా ఎంతో ఆనందంగా ఆ విషయాన్ని ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “ఆ వారం జరిగే పఠనాన్ని మా ఇంట్లోని ఏ భాగంలో చేసుకోవాలో ఎన్నుకునేందుకు నన్నూ మా అక్కల్నీ అనుమతించే వారు. ఇది మాకు సౌకర్యవంతంగా అనిపించేది.” తగినంత వెలుతురు, కూర్చునేందుకు చక్కని ఏర్పాట్లూ, ఉల్లాసభరితమైన, అల్లరీ గలాటాలేని పరిసరాలూ ప్రశాంతతను చేకూర్చుతాయి. పఠనం తర్వాత కుటుంబం కొరకు ఫలహారాన్ని ఏర్పాటు చేయడం కూడా ఆ సాయంత్రాన్ని ఆనందకరమైన దానిగా చేసేందుకు సహాయపడుతుంది.
కొన్ని కుటుంబాలు కొన్ని సందర్భాల్లో ఇతర కుటుంబాలను కూడా తమ పఠనంలో ఇముడ్చుకోవాలని ఇష్టపడతాయి, అది పఠనాన్ని మరింత ఆసక్తికరమైనదిగా చేస్తుంది, అలాగే విభిన్నమైన వ్యాఖ్యానాలను కూడా పొందగల్గుతారు. సత్యంలోకి క్రొత్తగా వచ్చిన వారు ఈ ఏర్పాటులో భాగం వహించేందుకు ఆహ్వానించబడినప్పుడు, అనుభవంగల కుటుంబపెద్ద కుటుంబ పఠనం నిర్వహించడాన్ని గమనించడం ద్వారా వాళ్లు ప్రయోజనం పొందగలరు.
బైబిలు పఠనం సజీవమైనదిగా ఉండేలా చేయండి
పిల్లల కొరకు పఠన సమయాలను ఉత్తేజకరంగా ఉండేట్లు చేయండి, అప్పుడు వాళ్లు ఆ సమయాల కొరకు ఆతురతతో ఎదురు చూస్తారు. చిన్న పిల్లలను బైబిలు దృశ్యాల చిత్రాలు గీయమని ప్రోత్సహించడం ద్వారా మీరు అలా చేయవచ్చు. సరైన సమయంలో, పిల్లలు బైబిలు సంఘటనలనూ నాటకాలనూ నటించేందుకు ఏర్పాటు చేయండి. చిన్న పిల్లలతో పఠనం జరిపేటప్పుడు వారితో క్రమమైన ప్రశ్నా జవాబుల పద్ధతినే అనుసరించనవసరం లేదు. చదవడం లేక బైబిలులోని ఫలానా వ్యక్తిని గురించి కథలు చెప్పడం, దైవిక సూత్రాలను వారిలో నింపేందుకు ఒక ఆనందకరమైన మార్గం. ఇంతకు ముందు ప్రస్తావించబడిన రాబర్ట్, ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “కొన్నిసార్లు మేము బైబిలు వాక్యాలను చదివేవాళ్లం, అప్పుడు ఒకొక్కరి పాత్రని ఒక్కొక్కరికి నియమించుకుని అలా చదివే వాళ్లం.” తమకు నచ్చిన పాత్రను ఎంచుకుని ఆ పాత్ర యొక్క భాగాన్ని చదివేందుకు పిల్లలను ఆహ్వానించవచ్చు.
పటాలనూ, చార్టులనూ ఉపయోగించడం, చర్చించబడుతున్న సంఘటనలు జరిగిన దేశం యొక్క ప్రాంతాలనూ పరిసర భాగాలనూ ఊహించుకునేందుకు పెద్దపిల్లలకు సహాయం చేస్తుంది. కాస్త ఊహాకల్పనతో కుటుంబ పఠనాన్ని ఉత్తేజకరంగానూ విభిన్నంగానూ చేసుకోవచ్చునన్నది స్పష్టం. అలా పిల్లలు దేవుని వాక్యం ఎడల అపేక్షను వృద్ధి చేసుకుంటారు.—1 పేతురు 2:2, 3.
భాగంవహించేందుకు అందరికీ సహాయపడండి
పిల్లలు పఠనంలో ఆనందించేందుకు వారు తాము కూడా అందులో భాగం వహిస్తున్నామని భావించాలి. అయితే వేర్వేరు వయస్సుల్లోని పిల్లలు భాగం వహించేలా చేయడం నిజంగా ఒక సవాలుగా ఉండగలదు. అయితే ఒక బైబిలు సూత్రం ఇలా పేర్కొంటుంది: ‘పైవిచారణ చేయువాడు జాగ్రత్తతో పని జరిగింపవలెను.’ (రోమీయులు 12:8) ఉత్తేజమనేది అంటువ్యాధిలా అందరికీ సోకుతుంది గనుక ఉత్తేజవంతంగా ఉండటం సహాయకరంగా ఉంటుంది.
రోనాల్డ్ తన ఐదేళ్ల పాప డైనాను పఠన సమాచారంలోని ఉప శీర్షికలు చదవమనీ చిత్రాలపై వ్యాఖ్యానించమనీ అడగడం ద్వారా పఠనంలో ఆమెను కూడా కలుపుకుంటాడు. గత సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినం దగ్గరపడుతుండగా, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకంలోని సంబంధిత చిత్రాలపై ఆయన అవధానాన్ని నిలిపాడు.c ఆయనిలా పేర్కొంటున్నాడు: “ఆ సంఘటన యొక్క ప్రాముఖ్యతను ఆమె అర్థం చేసుకునేందుకు అది ఆమెకు సహాయపడింది.”
తన పదేళ్ళ పాప మీషా విషయంలో రోనాల్డ్ ఒక అడుగు ముందుకు వెళ్ళాడు. “ఆ ఉపమానాలు ఏమిటీ అనే విషయాన్ని అర్థం చేసుకోవడమే కాక అది అందించే భావాలను కూడా అర్థం చేసుకోగల స్థాయికి మీషా వృద్ధి చెందింది” అని రోనాల్డ్ చెబుతున్నాడు. “కాబట్టి ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది!* పుస్తకాన్ని పరిశీలిస్తున్నప్పుడు, మేము ఆ చిత్రాలకున్న అర్థాన్ని గురించి పరిశీలించాము. అది ఆమెకు సహాయపడింది.”
పిల్లలు తమ యౌవన స్థాయికి చేరుకుంటుండగా, పరిశీలిస్తున్న సమాచారాన్ని ఆచరణాత్మకంగా అన్వయించుకునేందుకు వారిని ఆహ్వానించండి. పఠనం జరిగేటప్పుడు ప్రశ్నలు తలెత్తినప్పుడు, పరిశోధించవలసిన భాగాలను వారికి నియమించండి. 12 ఏళ్ల పాల్, డన్జియాన్స్ అండ్ డ్రాగన్స్ అనే ఆట ఇమిడివున్న, తన స్కూల్లో క్రొత్తగా ఏర్పడిన క్లబ్బు గురించి అడిగినప్పుడు రాబర్ట్ అదే చేశాడు. పాల్‌తో పాటు కుటుంబంలోని ఇతరులు కూడా వాచ్ టవర్ ప్రచురణల విషయసూచికలు (ఆంగ్లం) ఉపయోగిస్తూ సమాచారాన్ని వెదికారు, మరి వారు తమ కుటుంబ పఠనంలో దాన్ని పునఃపరిశీలించారు. “దాని ఫలితంగా, ఆ ఆటను క్రైస్తవులు ఆడకూడదని పాల్ వెంటనే అర్థం చేసుకున్నాడు” అని రాబర్ట్ చెబుతున్నాడు.
ఇతర సమయాల్లో కూడా రాబర్ట్ పరిశోధన చేసేందుకు నియమించాడు. ఆయన భార్య నాన్సీ ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “యేసు యొక్క అపొస్తలులను గురించి మేము పరిశోధన చేసినప్పుడు, ఒక్కో వారం ఒక్కొక్కరికి ఒక అపొస్తలుని గురించిన పరిశోధనా నియామకం ఇవ్వబడేది. కుటుంబ పఠనంలో పిల్లలు ఉత్సాహంగా తమ నివేదికలను అందించడాన్ని చూడటం ఎంత ఉత్తేజకరంగా ఉండేదో!” తమ స్వంతగా పరిశోధన చేయడం మరియు కుటుంబానికి ఆ సమాచారాన్ని అందించడం పిల్లలు ‘యెహోవా సన్నిధిని . . . ఎదిగేందుకు’ వారికి సహాయం చేస్తుంది.—1 సమూయేలు 2:20, 21.
ప్రశ్నలను అంటే ఉద్దేశాలను కనుక్కునే ప్రశ్నలనూ అలాగే అసలు విషయానికి నడిపించే ప్రశ్నలనూ అడగడం కూడా పిల్లలను పఠనంలో చేర్చుకునేందుకు ఒక చక్కని మార్గం. గొప్ప బోధకుడైన యేసు, “నీకేమి తోచుచున్నది?” వంటి, ఉద్దేశాన్ని కనుక్కునే ప్రశ్నలను అడిగాడు. (మత్తయి 17:25) “మాలో ఎవరమైనా ప్రశ్న అడిగినప్పుడు, మా తలిదండ్రులు మాకు సూటిగా సమాధానం చెప్పేవారు కాదు. మేము విషయాలను గురించి తర్కించేందుకు మాకు సహాయం చేస్తూ వాళ్లు ఎల్లప్పుడూ అసలు విషయానికి నడిపించే ప్రశ్నలను అడిగే వారు” అని మారియా జ్ఞాపకం చేసుకుంటోంది.
సంభాషించండి—విసిగించకండి!
కుటుంబంలోని వారందరూ తాము వెక్కిరించబడతాము అనే భయం లేకుండా తమ దృక్పథాలను మరియు భావాలను తెలుపగలిగినప్పుడు కుటుంబ పఠనంలోని ఆనందం వృద్ధి చెందుతుంది. అయితే “ఇతర సమయాల్లో ఒకరితోనొకరు మనస్సు విప్పి మాట్లాడుకోగల్గినప్పుడే కుటుంబ పఠనంలో చక్కని సంభాషణ ఉండేందుకు సాధ్యమౌతుంది” అని ఒక తండ్రి చెబుతున్నాడు. “పఠనం జరుగుతున్నప్పుడు మాత్రమే మీరు ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకుంటున్నట్లు నటించలేరు.” కాబట్టి, ‘అంతేనా? అదేదో ముఖ్యమైనదని నేను అనుకున్నానే’; ‘అదో అవివేకమైన మాట’; ‘అంతకంటే ఇంకేం చెప్పగలవు? అయినా నువ్వింకా పిల్లాడివే’ వంటి నొప్పించే అనాలోచిత వ్యాఖ్యానాలను నివారించండి. (సామెతలు 12:18) మీ పిల్లల ఎడల దయాపూర్వకంగా మరియు కరుణ కలిగి ఉండండి. (కీర్తన 103:13; మలాకీ 3:17) వాళ్లను బట్టి ఆనందించండి, వాళ్లు తాము నేర్చుకుంటున్న దానిని అన్వయించుకుంటుండగా వాళ్లకు మద్దతునివ్వండి.
కుటుంబ పఠన సమయంలోని వాతావరణం, ఉపదేశాన్ని అందుకునేందుకు పిల్లవాని మనస్సు సిద్ధంగా ఉండే విధంగా ఉండాలి. “మీరు పిల్లలను సరిదిద్దడం ప్రారంభించినప్పుడు పిల్లలు కాస్త ప్రతికూలంగా అవుతారు” అని నలుగురు పిల్లలను విజయవంతంగా పెంచిన తండ్రి వివరిస్తున్నాడు. అలాంటి వాతావరణంలో, సమాచారం బహుశ లోపలికి దిగదు. కాబట్టి పఠన సమయాలను క్రమశిక్షణనివ్వడానికీ శిక్షించడానికీ లభించిన అవకాశాలుగా మార్చకండి. ఇవి అవసరమైతే వాటిని తర్వాత ఒకొక్కరికీ వేర్వేరుగా ఇవ్వండి.
కృషి యోగ్యమైనదే
ఆత్మీయంగా సుసంపన్నమైన కుటుంబాన్ని నిర్మించుకునేందుకు సమయమూ కృషి అవసరం. అయితే కీర్తనల గ్రంథకర్త ఇలా ప్రకటిస్తున్నాడు: “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.” (కీర్తన 127:3) “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను [పిల్లలను]” పెంచే బాధ్యత తలిదండ్రులకు ఇవ్వబడింది. (ఎఫెసీయులు 6:4) కాబట్టి ప్రభావవంతమైన మరియు ఆనందమయ కుటుంబ పఠనాన్ని నిర్వహించేందుకు నైపుణ్యాలను వృద్ధి చేసుకోండి. మీ పిల్లలు “రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము” వాళ్లకు “నిర్మలమైన వాక్యమను పాల”ను అందించడంలో మీకు వీలైనదంతా చేయండి.—1 పేతురు 2:3; యోహాను 17:3.
[అధస్సూచీలు]
a కుటుంబ పఠనంలో పిల్లలకు సహాయం చేయడానికి సంబంధించిన అనేక సలహాలు ఈ శీర్షికలో అందించబడినప్పటికీ, ఆ విషయాలు పిల్లలు లేని కుటుంబాల్లోని పఠనానికి కూడా వర్తిస్తాయి.
b కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
c వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ ఇండియా ప్రచురించినది.