మన అమూల్యమైన విశ్వాసమును గట్టిగా పట్టుకొని ఉందాము!
“మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి.”—2 పేతురు 1:1.
1. తన అపొస్తలులను హెచ్చరిస్తూ యేసు ఏమి చెప్పాడు, అయినప్పటికీ, పేతురు ఏమని ప్రగల్భాలు పలికాడు?
యేసు తన అపొస్తలులందరూ తనను విడిచిపారిపోతారని తాను మరణించడానికి ముందురోజు సాయంకాలం అన్నాడు. వారిలో ఒకరైన పేతురు, “నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని” ప్రగల్భాలు పలికాడు. (మత్తయి 26:33) కానీ యేసుకు అసలు విషయం తెలుసు. అందుకే ఆ సందర్భంలోనే ఆయన పేతురుతో, “నీ నమ్మిక [“విశ్వాసం,” NW] తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని [“బలపరచుమని,” NW]” చెప్పాడు.—లూకా 22:32.
2. పేతురుకు అతినమ్మకం ఉన్నప్పటికీ, ఆయన విశ్వాసం బలహీనంగా ఉందని ఆయన యొక్క ఏ చర్యలు సూచించాయి?
2 తన విశ్వాసం గురించి అతినమ్మకం ఏర్పరచుకున్న పేతురు, ఆ రాత్రే యేసును కాదన్నాడు. తనకు క్రీస్తు తెలియదని ఆయన మూడుసార్లు బొంకాడు! (మత్తయి 26:69-75) ఆయన “మనసు తిరిగిన” తర్వాత, ‘నీ సహోదరులను బలపరచుమని’ తన ప్రభువు చెప్పిన మాటలు ఆయన చెవుల్లో బిగ్గరగా, స్పష్టంగా మారుమ్రోగి ఉండవచ్చు. ఆ ఆజ్ఞ పేతురు శేష జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది, బైబిలునందు భద్రపర్చబడివున్న ఆయన వ్రాసిన రెండు పత్రికలు దానికి నిదర్శనంగా ఉన్నాయి.
పేతురు తన పత్రికలను వ్రాయడానికి కారణం
3. పేతురు తన మొదటి పత్రికను ఎందుకు వ్రాశాడు?
3 యేసు మరణించిన దాదాపు 30 సంవత్సరాల తర్వాత, పేతురు తన మొదటి పత్రికను వ్రాశాడు, ఆయన దాన్ని ఈనాటి ఉత్తర, పశ్చిమ టర్కీ ప్రాంతాలైన పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియలలోని తన సహోదరులను ఉద్దేశించి వ్రాశాడు. (1 పేతురు 1:1) పేతురు ఎవరికైతే వ్రాశాడో వారిలో, సా.శ. 33 పెంతెకొస్తు నాడు క్రైస్తవులైన కొంతమంది యూదులు కూడా చేరివుంటారనడంలో సందేహం లేదు. (అపొస్తలుల కార్యములు 2:1, 7-9) వారిలోనే తమ వ్యతిరేకుల చేతుల్లో తీవ్రమైన శ్రమలను ఎదుర్కొంటున్న అన్యులు కూడా ఉన్నారు. (1 పేతురు 1:6, 7; 2:12, 19, 20; 3:13-17; 4:12-14) కాబట్టి ఈ సహోదరులను ప్రోత్సహించడానికి పేతురు వారికి వ్రాశాడు. వారు “[తమ] విశ్వాసమునకు ఫలమును, అనగా తమ ఆత్మల రక్షణను” పొందడానికి వారికి సహాయం చేయాలన్నది ఆయన సంకల్పం. అందుకే, ఆయన తన వీడ్కోలు ఉపదేశంలో ఇలా కోరాడు: “విశ్వాసమందు స్థిరులై [అపవాదిని] ఎదిరించుడి.”—1 పేతురు 1:9; 5:8-10.
4. పేతురు తన రెండవ పత్రికను ఎందుకు వ్రాశాడు?
4 ఆ తర్వాత పేతురు ఈ క్రైస్తవులకు రెండవ పత్రిక వ్రాశాడు. (2 పేతురు 3:1) ఎందుకు? ఎందుకంటే మరింత గొప్ప బెదిరింపు పొంచి ఉంది. దుర్నీతిపరులైన వ్యక్తులు తమ నీచ ప్రవర్తనను విశ్వాసుల మధ్య పెంపొందింపజేయడానికి ప్రయత్నిస్తూ, కొంతమందిని తప్పుదారి పట్టిస్తున్నారు! (2 పేతురు 2:1-3) అంతేగాక, పేతురు అపహాసకుల గురించి హెచ్చరించాడు. “అన్నిటి అంతము సమీపమైయున్నది” అని ఆయన తన మొదటి పత్రికలో వ్రాశాడు, ఇప్పుడు కొంతమంది అలాంటి తలంపును అపహాస్యం చేస్తున్నారని స్పష్టమౌతుంది. (1 పేతురు 4:7; 2 పేతురు 3:3, 4) మనం పేతురు వ్రాసిన రెండవ పత్రికను పరిశీలించి, సహోదరులు విశ్వాసమందు స్థిరులై ఉండడానికి వారిని అదెలా బలపర్చిందో చూద్దాము. ఈ మొదటి శీర్షికలో, మనం రెండవ పేతురు మొదటి అధ్యాయాన్ని పరిశీలిద్దాము.
మొదటి అధ్యాయం యొక్క ఉద్దేశం
5. సమస్యలను గూర్చిన చర్చ కొరకు పేతురు తన పాఠకులను ఎలా సిద్ధం చేశాడు?
5 గంభీరమైన సమస్యల గురించి పేతురు వెనువెంటనే ప్రస్తావించలేదు. బదులుగా, తన పాఠకులు క్రైస్తవులైనప్పుడు పొందిన దాని ఎడల వారికున్న మెప్పును పెంపొందింపజేయడం ద్వారా ఆయన ఈ సమస్యల చర్చకు మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన వారికి దేవుని అద్భుతమైన వాగ్దానాలను, బైబిలు ప్రవచనాల నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు రాజ్యాధికారాన్ని గూర్చి తాను వ్యక్తిగతంగా పొందిన దర్శనాన్ని గురించి, రూపాంతరాన్ని గురించి చెప్పడం ద్వారా ఆయనిది చేశాడు.—మత్తయి 17:1-8; 2 పేతురు 1:3, 4, 11, 16-21.
6, 7. (ఎ) పేతురు పత్రిక యొక్క ఉపోద్ఘాతం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (బి) మనం ఒకవేళ సలహా ఇస్తే, కొన్నిసార్లు దేన్ని అంగీకరించడం సహాయకరంగా ఉంటుంది?
6 పేతురు ఉపోద్ఘాతం నుండి మనమొక పాఠం నేర్చుకోవచ్చా? మనం ఎవరికైతే సలహా ఇవ్వబోతున్నామో వారితో మొదట, మనందరికీ ఎంతో విలువైనవైన గొప్ప రాజ్య నిరీక్షణాంశాలను గురించి పునఃసమీక్షిస్తే, సలహా మరింత అంగీకారయుక్తంగా ఉండదా? ఒక వ్యక్తిగత అనుభవాన్ని ఉపయోగించే విషయమేమిటి? బహుశా యేసు మరణం తర్వాత, పేతురు తాను రాజ్య మహిమలోని క్రీస్తును గూర్చిన దర్శనాన్ని చూడడాన్ని తరచూ చెప్పివుండవచ్చు.—మత్తయి 17:9.
7 పేతురు తన రెండవ పత్రికను వ్రాసే సమయానికి, మత్తయి వ్రాసిన సువార్త, అపొస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక విస్తృతంగా పంచిపెట్టబడి వుండే సాధ్యత ఎంతో ఉందని కూడా గుర్తుంచుకోండి. కాబట్టి పేతురు యొక్క మానవ వైఫల్యాలు, అలాగే ఆయన విశ్వాసాన్ని గూర్చిన వృత్తాంతం ఆయన సమకాలీనుల మధ్య ప్రసిద్ధి చెంది ఉండవచ్చు. (మత్తయి 16:21-23; గలతీయులు 2:11-14) అయితే ఇది ఆయనను నిర్భీతిగా మాట్లాడనీయకుండా చేయలేదు. వాస్తవానికి, ఇది తమ స్వంత బలహీనతల గురించి ఎరిగివున్న వారికి ఆయన పత్రికను మరింత ఆసక్తికరమైనదిగా ఉండేలా చేసివుండవచ్చు. కాబట్టి, సమస్యలున్నవారికి సహాయం చేసేటప్పుడు, మనం కూడా తప్పులు చేసే సాధ్యత ఉందని అంగీకరించడం ప్రభావవంతంగా ఉండదా?—రోమీయులు 3:23; గలతీయులు 6:1.
బలపర్చే అభినందన
8. పేతురు “విశ్వాసము” అనే పదాన్ని బహుశా ఏ భావంలో ఉపయోగించివుండవచ్చు?
8 ఇప్పుడు పేతురు అభినందనను పరిశీలించండి. ఆయన వెనువెంటనే విశ్వాసాన్ని గూర్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ, తన పాఠకులను “మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన” వారు అని సంబోధిస్తున్నాడు. (2 పేతురు 1:1) ఇక్కడ “విశ్వాసము” అనే పదానికి బహుశా “దృఢ నమ్మకం” అనే భావం ఉండవచ్చు, ఇది మొత్తం క్రైస్తవ నమ్మకాలు లేక బోధలను సూచిస్తుంది, అది కొన్నిసార్లు లేఖనాల్లో “సత్యము” అని పిలువబడింది. (గలతీయులు 5:7; 2 పేతురు 2:2; 2 యోహాను 1) “విశ్వాసము” అనే పదం, ఒక వ్యక్తిలో లేక ఒక విషయంలో ఉంచే ప్రగాఢ విశ్వాసం లేక పూర్ణ నమ్మకం అనే సాధారణ భావంతోకంటే తరచూ ఈ భావంతోనే ఉపయోగించబడుతుంది.—అపొస్తలుల కార్యములు 6:7; 2 కొరింథీయులు 13:5; గలతీయులు 6:10; ఎఫెసీయులు 4:5; యూదా 3.
9. పేతురు యొక్క అభినందన ప్రాముఖ్యంగా అన్యులకు ఎందుకు వాత్సల్యపూరితమైనదిగా అనిపించివుండవచ్చు?
9 పేతురు అభినందన ప్రాముఖ్యంగా అన్యులైన పాఠకులకు వాత్సల్యపూరితమైనదిగా అనిపించివుండవచ్చు. యూదులకు అన్యులతో ఎటువంటి సంబంధాలు ఉండేవి కావు, చివరికి క్రైస్తవులుగా మారిన యూదుల మధ్య కూడ అన్యులను తృణీకరించడం, వారి విషయంలో దురభిమానం చూపడం ప్రబలంగా ఉండేది. (లూకా 10:29-37; యోహాను 4:9; అపొస్తలుల కార్యములు 10:28) అయినప్పటికీ, జన్మతః యూదుడూ యేసుక్రీస్తు అపొస్తలుడూ అయిన పేతురు, తన పాఠకులు అంటే యూదులు మరియు అన్యులు ఒకే విశ్వాసాన్ని కలిగివున్నారని, ఆయనతోపాటు సమాన ఆధిక్యతను అనుభవిస్తున్నారని చెప్పాడు.
10. పేతురు అభినందన నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
10 నేడు మనకు పేతురు అభినందన నేర్పించే చక్కని పాఠాల గురించి ఆలోచించండి. దేవుడు పక్షపాతి కాడు; ఆయన ఒక జాతి లేక దేశం కంటే మరొకదాని ఎడల ఎక్కువ అభిమానం చూపించడు. (అపొస్తలుల కార్యములు 10:34, 35; 11:1, 17; 15:3-9) యేసు తానే స్వయంగా బోధించినట్లు, క్రైస్తవులందరూ సహోదరులు. మనలో ఎవ్వరమూ తాము ఉన్నతులమన్నట్లు భావించకూడదు. అంతేగాక, వాస్తవానికి మనం ప్రపంచవ్యాప్త సహోదరత్వాన్ని కల్గివున్నామని, పేతురుకు మరియు ఆయన తోటి అపొస్తలులకు ఉండిన అదే “అమూల్యమైన” విశ్వాసాన్ని కల్గివున్నామని పేతురు యొక్క అభినందన నొక్కి తెలియజేస్తోంది.—మత్తయి 23:8; 1 పేతురు 5:9.
జ్ఞానము మరియు దేవుని వాగ్దానాలు
11. అభినందన తర్వాత, పేతురు ఏ ముఖ్య విషయాలను నొక్కిచెప్పాడు?
11 పేతురు అభినందించిన తర్వాత ఇలా వ్రాస్తున్నాడు: “మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక.” మనకు కృప మరియు సమాధానము ఎలా విస్తరించాలి? ‘దేవుని యొక్క మరియు మన ప్రభువైన యేసు యొక్క కచ్చితమైన జ్ఞానము ద్వారా’ అని పేతురు సమాధానమిస్తున్నాడు. తర్వాత, ‘దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నదని’ చెబుతున్నాడు. కానీ ఈ ప్రాముఖ్యమైన వాటిని మనమెలా పొందుతాము? “తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవానిని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా.” అలా, దేవుని గూర్చిన, ఆయన కుమారుని గూర్చిన అనుభవజ్ఞానము అవసరమని పేతురు రెండుసార్లు నొక్కి చెబుతున్నాడు.—2 పేతురు 1:2, 3; యోహాను 17:3.
12. (ఎ) కచ్చితమైన జ్ఞానము యొక్క ప్రాముఖ్యతను పేతురు ఎందుకు నొక్కి తెలియజేశాడు? (బి) దేవుని వాగ్దానాలను అనుభవించడానికి, మనం ముందు ఏమి చేసి ఉండాలి?
12 రెండవ అధ్యాయంలో పేతురు ఎవరి గురించి హెచ్చరించాడో ఆ “అబద్ధబోధకులు” క్రైస్తవులను మోసగించడానికి “కల్పనావాక్యములు” ఉపయోగిస్తారు. వారు ఏ దుర్నీతి నుండైతే విడిపించబడ్డారో దానిలోకి మరలా వెళ్లేలా వారిని మోసగించడానికి ఆ విధంగా వాళ్లు ప్రయత్నిస్తారు. “ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవజ్ఞానము చేత” రక్షించబడి, ఆతర్వాత అలాంటి మోసానికి లోనైపోయేవారికి ఎదురయ్యే ఫలితాలు వినాశకరంగా ఉంటాయి. (2 పేతురు 2:1-3, 20) స్పష్టంగా, ఈ సమస్యను తర్వాత చర్చించాలనే ఉద్దేశంతో, దేవుని ఎదుట పరిశుభ్రమైన స్థానాన్ని కలిగివుండడంలో అనుభవజ్ఞానము యొక్క పాత్రను పేతురు తన పత్రిక ఆరంభంలోనే నొక్కి తెలియజేస్తున్నాడు. దేవుడు “మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. . . . దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను” అని పేతురు అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ, మన విశ్వాసములో అంతర్గత భాగమైన ఈ వాగ్దానములను అనుభవించడానికి, మనం మొదటిగా “దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును . . . తప్పించు”కోవాలని పేతురు చెబుతున్నాడు.—2 పేతురు 1:4.
13. అభిషిక్త క్రైస్తవులు మరియు “వేరే గొఱ్ఱెలు” దేనిని దృఢంగా చేపట్టడానికి నిశ్చయించుకున్నారు?
13 దేవుని వాగ్దానాలను మీరెలా దృష్టిస్తారు? అభిషిక్త క్రైస్తవుల శేషము దృష్టించే విధంగానేనా? పూర్తికాల పరిచర్యలో 75 కంటే ఎక్కువ సంవత్సరాలు గడిపిన, ఆనాటి వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ అధ్యక్షుడైన ఫ్రెడ్రిక్ ఫ్రాంజ్ 1991లో, క్రీస్తుతోపాటు పరిపాలించే నిరీక్షణగల వారి భావాలను ఇలా క్లుప్తీకరించాడు: “మేము ఈ ఘడియ వరకు గట్టిగా పట్టుకొనివున్నాము, దేవుడు తన ‘అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను’ తప్పక నెరవేరుస్తాడని వాస్తవంగా నిరూపించబడేంత వరకు మేము గట్టిగా పట్టుకొనే ఉంటాము.” సహోదరుడు ఫ్రాంజ్ పరలోక పునరుత్థానాన్ని గూర్చిన దేవుని వాగ్దానమందు నమ్మకం కల్గివుండి, తన 99వ ఏట మరణించేంత వరకు తన విశ్వాసాన్ని దృఢంగా పట్టుకొనేవున్నాడు. (1 కొరింథీయులు 15:42-44; ఫిలిప్పీయులు 3:13, 14; 2 తిమోతి 2:10-12) అలాగే, ప్రజలు నిరంతరం సంతోషంగా జీవించే భూపరదైసును గూర్చిన దేవుని వాగ్దానంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా లక్షలాదిమంది తమ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. వారిలో మీరూ ఒకరా?—లూకా 23:43; 2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4.
దేవుని వాగ్దానాలకు ప్రతిస్పందన
14. సద్గుణం విశ్వాసానికి అమర్చుకొనవలసిన మొదటి లక్షణమని పేతురు ఎందుకు చెప్పాడు?
14 దేవుడు చేసిన వాగ్దానాలనుబట్టి మనం ఆయన ఎడల కృతజ్ఞత కలిగివున్నామా? అలాగైతే, మనం దాన్ని ప్రదర్శించాలని పేతురు వాదిస్తున్నాడు. “ఆ హేతువు చేతనే” (దేవుడు మనకు ఎన్నో అమూల్యమైన వాగ్దానాలు అనుగ్రహించాడు గనుకనే) మనం చర్యగైకొనడానికి నిజంగా కృషి చేయాలి. కేవలం విశ్వాసంలో ఉన్నామని లేక కేవలం బైబిలు సత్యంతో మనకు పరిచయం ఉందని మనం సంతృప్తిపడలేము. అది మాత్రమే చాలదు! బహుశా పేతురు కాలంలో, సంఘాల్లోని కొందరు విశ్వాసం గురించి ఎంతో మాట్లాడుతూనే, దుర్నీతి ప్రవర్తనలో నిమగ్నమైపోయి ఉండవచ్చు. వారి ప్రవర్తన సద్గుణవంతమైనదై ఉండవలసిన అవసరం ఉంది, అందుకే పేతురు వారినిలా ప్రోత్సహిస్తున్నాడు: “మీ విశ్వాసమునందు సద్గుణమును . . . అమర్చుకొనుడి.”—2 పేతురు 1:5; యాకోబు 2:14-17.
15. (ఎ) విశ్వాసానికి సద్గుణం తర్వాత అమర్చుకొనవలసిన లక్షణం జ్ఞానమని ఎందుకు చెప్పబడింది? (బి) విశ్వాసాన్ని దృఢంగా పట్టుకొనడానికి మరే ఇతర లక్షణాలు మనల్ని సన్నద్ధులను చేస్తాయి?
15 సద్గుణము గురించి చెప్పిన తర్వాత, మన విశ్వాసానికి అమర్చుకొనవలసిన లేక జత చేయవలసిన మరితర ఆరు లక్షణాల గురించి పేతురు తెలియజేస్తున్నాడు. మనం “విశ్వాసమందు నిలుకడగా” ఉండాలంటే వీటిలో ప్రతీదీ అవసరమే. (1 కొరింథీయులు 16:13) అబద్ధ బోధకులు ‘లేఖనములను అపార్థము’ చేస్తూ ‘మోసకరమైన బోధలను’ వ్యాపింపజేస్తున్నారు గనుక, పేతురు జ్ఞానము ప్రాముఖ్యమైనదని ఆతర్వాత తెలియజేస్తూ ఇలా చెబుతున్నాడు: “సద్గుణమునందు జ్ఞానమును . . . అమర్చుకొనుడి.” ఆతర్వాత ఆయనిలా కొనసాగిస్తున్నాడు: “జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి.”—2 పేతురు 1:5-7; 2:12, 13; 3:16.
16. పేతురు చెప్పిన లక్షణాలను విశ్వాసానికి అమర్చుకుంటే ఏమి జరుగుతుంది, కానీ అమర్చుకోకపోతే ఏమి జరుగుతుంది?
16 ఈ ఏడు విషయాలు మన విశ్వాసానికి అమర్చబడినట్లైతే ఏమి జరుగుతుంది? పేతురిలా సమాధానమిస్తున్నాడు: “ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవ [“కచ్చితమైన,” NW] జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండచేయును.” (ఇటాలిక్కులు మావి.) (2 పేతురు 1:8) మరో వైపున, పేతురిలా చెబుతున్నాడు: “ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును.” (2 పేతురు 1:9) పేతురు “మీ,” “మన” అనే పదాల ఉపయోగం నుండి “ఎవనికి,” “వాడు” మరియు “తన” అనే పదాల ఉపయోగానికి మారడాన్ని గమనించండి. దుఃఖకరంగా, కొంతమంది గ్రుడ్డివారు, మరచిపోయేవారు, అపరిశుభ్రమైనవారూ అయివునప్పటికీ, పేతురు దయతో, తన పాఠకుడు వీరిలో ఒకడని సూచించడంలేదు.—2 పేతురు 2:2.
తన సహోదరులను బలపర్చడం
17. “ఇట్టి క్రియలను” అనుసరించమని పేతురు విజ్ఞప్తి చేయడానికి ఏది ఆయనను పురికొల్పి ఉంటుంది?
17 ప్రాముఖ్యంగా క్రొత్తవారు సుళువుగా మోసగించబడగలరని గుర్తించడం మూలంగా కావచ్చు, పేతురు దయగా వారినిలా ప్రోత్సహిస్తున్నాడు: “సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.” (2 పేతురు 1:10, 11; 2:18) తమ విశ్వాసానికి ఈ ఏడు విషయాలను అమర్చుకొనే అభిషిక్త క్రైస్తవులు పేతురు చెబుతున్నట్లుగా ఈ గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు: “మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.” (2 పేతురు 1:11) “వేరే గొఱ్ఱెలు” దేవుని రాజ్య భూపరిధిలో నిత్యజీవాన్ని స్వాస్థ్యంగా పొందుతారు.—యోహాను 10:16; మత్తయి 25:33, 34.
18. తన సహోదరులకు ‘ఎల్లప్పుడు జ్ఞాపకం’ చేయడానికి పేతురు ఎందుకు సిద్ధంగా ఉన్నాడు?
18 తన సహోదరులకు అలాంటి గొప్ప ప్రతిఫలం లభించాలని పేతురు యథార్థంగా కోరుకుంటున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.” (2 పేతురు 1:12) ఇక్కడ “స్థిరపరచబడియున్న” అని అనువదించబడిన స్టెరిజో అనే గ్రీకు పదాన్ని పేతురు ఉపయోగించాడు, కాని “నీ సహోదరులను బలపరచుమని” మునుపు యేసు పేతురుకిచ్చిన శక్తివంతమైన పురికొల్పులో ఆ పదం “బలపరచు” అని అనువదించబడింది. (లూకా 22:32, NW) ఆ పదోపయోగం, తన ప్రభువు నుండి పొందిన శక్తివంతమైన ఆజ్ఞ పేతురుకు జ్ఞాపకముందని సూచించవచ్చు. పేతురు ఇప్పుడిలా చెబుతున్నాడు: “నా గుడారమును [మానవ శరీరాన్ని] త్వరగా విడిచిపెట్టవలసివచ్చునని యెరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.”—2 పేతురు 1:13, 14.
19. మనకు నేడు ఏ సహాయకాలు అవసరం?
19 తన పాఠకులు “సత్యమందు స్థిరపరచబడియు”న్నారని పేతురు దయగా చెబుతున్నప్పటికీ, వారి విశ్వాసం బద్దలై పోయే అవకాశం ఉందని ఆయన గుర్తిస్తున్నాడు. (1 తిమోతి 1:19) తాను త్వరలోనే మరణించబోతున్నానని ఆయనకు తెలుసు గనుక, తన సహోదరులు తమను తాము ఆత్మీయంగా బలంగా ఉంచుకోవడానికి గుర్తుతెచ్చుకోగల విషయాలను ప్రస్తావించడం ద్వారా ఆయన వారిని బలపరుస్తున్నాడు. (2 పేతురు 1:15; 3:12, 13) అలాగే, మనం విశ్వాసమందు స్థిరంగా ఉండడానికి నేడు మనకు ఎడతెగని జ్ఞాపికలు అవసరం. మనమెవరమైనప్పటికీ లేక మనం సత్యంలో ఎంతకాలం నుండి ఉన్నప్పటికీ, మనం క్రమంగా బైబిలు చదవడాన్ని, వ్యక్తిగత పఠనాన్ని, సంఘ కూటాలకు హాజరవ్వడాన్ని నిర్లక్ష్యం చేయలేము. ఎంతో అలిసిపోయామనీ లేక కూటాల్లో పదే పదే ఒకే విషయం చెప్పబడుతుందనీ లేక కూటాలు ఆసక్తికరంగా ఉండడం లేదనీ కొందరు సాకులు చెప్పవచ్చు, కానీ మనలో ఎవరమైనా అతినమ్మకం గలవారమైతే ఎంత త్వరగా విశ్వాసాన్ని కోల్పోగలమో పేతురుకు తెలుసు.—మార్కు 14:66-72; 1 కొరింథీయులు 10:12; హెబ్రీయులు 10:24,25.
మన విశ్వాసానికి దృఢమైన ఆధారం
20, 21. రూపాంతరం పేతురు విశ్వాసాన్ని, నేడు మనతోసహా ఆయన పత్రికలు చదివేవారి విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది?
20 మన విశ్వాసం యుక్తిగా రూపించబడిన కల్పనలపై మాత్రమే ఆధారపడి ఉందా? అందుకు పేతురు గట్టిగా ఇలా ప్రతిస్పందిస్తున్నాడు: “చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి.” యేసు రాజ్యాధికారంలో ఉన్నప్పటి దర్శనాన్ని చూసినప్పుడు పేతురు, యాకోబు, యోహానులు ఆయనతోపాటే ఉన్నారు. పేతురు ఇలా వివరిస్తున్నాడు: “ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండినవారమై, ఆ శబ్దము ఆకాశమునుండి రాగా వింటిమి.”—2 పేతురు 1:16-18.
21 పేతురు, యాకోబు, యోహానులు ఆ దర్శనాన్ని చూసినప్పుడు, రాజ్యం వారికి వాస్తవంగా ఉంది! పేతురు ఇలా పేర్కొంటున్నాడు: “ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. . . . దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.” అవును, నేడు మనతో సహా పేతురు పత్రిక యొక్క పాఠకులు దేవుని రాజ్యాన్ని గూర్చిన ప్రవచనాలకు అవధానాన్నివ్వడానికి శక్తివంతమైన కారణం ఉంది. మనం ఏ విధంగా అవధానాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది? పేతురిలా సమాధానమిస్తున్నాడు: “తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది.”—2 పేతురు 1:19; దానియేలు 7:13, 14; యెషయా 9:6, 7.
22. (ఎ) మన హృదయాలను దేని విషయంలో అప్రమత్తంగా ఉంచుకోవలసిన అవసరం ఉంది? (బి) ప్రవచన వాక్యానికి మనం ఎలా అవధానాన్ని ఇవ్వవచ్చు?
22 ప్రవచన వాక్యపు ప్రకాశం లేకపోతే మన హృదయాలు అంధకారమైపోతాయి. కాని దానికి అవధానమివ్వడం ద్వారా, “వేకువచుక్క” అయిన యేసు క్రీస్తు రాజ్య మహిమలో ఉదయించే దినము వరకు క్రైస్తవుల హృదయాలు అప్రమత్తంగా ఉంచబడతాయి. (ప్రకటన 22:16) మనం నేడు ప్రవచన వాక్యానికి ఎలా అవధానాన్నిస్తాము? బైబిలు పఠనం ద్వారా, కూటాల కొరకు సిద్ధపడి వాటిలో పాల్గొనడం ద్వారా మరియు ‘వీటిని మనస్కరించి వీటియందే సాధకము చేసుకోవడం ద్వారా’ మనమలా చేయవచ్చు. (1 తిమోతి 4:15) ప్రవచన వాక్యం “చీకటిగల చోటున” (మన హృదయాల్లో) వెలిగే దీపంలా ఉండాలంటే, అది మనల్ని లోతుగా అంటే మన కోరికలను, భావాలను, ఉద్దేశాలను, లక్ష్యాలను ప్రభావితం చేయడానికి మనం అనుమతించాలి. మనం బైబిలు విద్యార్థులమై ఉండాలి, ఎందుకంటే పేతురు మొదటి అధ్యాయాన్ని ఇలా ముగిస్తున్నాడు: “ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్ట[దు]. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.”—2 పేతురు 1:20, 21.
23. రెండవ పేతురు మొదటి అధ్యాయం పాఠకులను దేనికి సిద్ధం చేసింది?
23 మన అమూల్యమైన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండడానికి పేతురు తన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో మనకు శక్తివంతమైన పురికొల్పునిచ్చాడు. తరువాతి గంభీరమైన విషయాలను పరిశీలించడానికి మనం ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. తర్వాతి శీర్షిక పేతురు వ్రాసిన రెండవ పత్రికలోని రెండవ అధ్యాయాన్ని చర్చిస్తుంది, అందులో అపొస్తలుడు సంఘాల్లోకి ప్రవేశించిన దుర్నీతికరమైన ప్రభావాల సవాలుతో వ్యవహరించాడు.
మీకు జ్ఞాపకం ఉన్నాయా?
▫ కచ్చితమైన జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను పేతురు ఎందుకు నొక్కిచెప్పాడు?
▫ విశ్వాసానికి అమర్చుకోవలసిన మొదటి లక్షణం సద్గుణమని చెప్పడానికి కారణమేమై ఉండవచ్చు?
▫ తన సహోదరులకు ఎల్లప్పుడూ జ్ఞాపికలను ఇవ్వడానికి పేతురు ఎందుకు సిద్ధంగా ఉన్నాడు?
▫ పేతురు మన విశ్వాసానికి ఏ గట్టి ఆధారాన్ని అందజేస్తున్నాడు?
[9వ పేజీలోని చిత్రం]
పేతురు బలహీనతలు ఆయన తన విశ్వాసాన్ని విడిచిపెట్టేలా చేయలేదు