రాజ్య ప్రచారకుల నివేదిక
మలావీలో సహనం దేవుని దీవెనలకు నడిపింది
యోసేపు యెహోవా యొక్క విశ్వసనీయుడైన సేవకుడు. (హెబ్రీయులు 11:22) ఆయన విశేషమైన సహనంగల వ్యక్తి కూడా. ఆయన్ను ఆయన స్వంత అన్నలే మోసగించినప్పటికీ, రెండుసార్లు దాసత్వానికి అమ్మబడినప్పటికీ, అబద్ధ ఆరోపణలపై తర్వాత చెరసాలలో వేయబడినప్పటికీ, యోసేపు నిరాశతో కృంగిపోలేదు. బదులుగా, యెహోవా దీవెన కొరకు వినయంతో వేచి చూస్తూ ఆయన సంవత్సరాల తరబడి హింసను ఓపికగా సహించాడు.—ఆదికాండము 37:23-28, 36; 39:11-20.
అదే విధంగా నేడు, మలావీ నందలి యెహోవాసాక్షులు దేవుని దీవెన కొరకు ఓపికతో ఎదురుచూశారు. ఈ క్రైస్తవ సాక్షులు 26 సంవత్సరాలుగా, ప్రభుత్వ నిషేధాలనూ, తీవ్రమైన వ్యతిరేకతనూ అనేక అత్యాచారాలనూ సహించారు. అయితే వారి సహనం ఫలించింది!
మలావీలో 1967 చివరి భాగంలో హింస చెలరేగినప్పుడు, దాదాపు 18,000 మంది రాజ్య ప్రచారకులు ఉన్నారు. అయితే 1997 సేవా సంవత్సరం 38,393 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యతో—అంటే నిషేధం ప్రారంభమైనప్పుడు ఉన్న వారికంటే రెండంతల కంటే ఎక్కువమంది—ప్రారంభమైందన్న విషయాన్ని సాక్షులు తెలుసుకున్నప్పుడు వారెంత ఆనందించి ఉంటారో ఊహించండి! అంతేకాకుండా, మలావీలో జరుపబడిన 13 “దైవిక శాంతి సందేశకులు” జిల్లా సమావేశాల హాజరు 1,17,000కు మించింది. వాస్తవంగానే, యెహోవా వారి విశ్వాసాన్నీ సహనాన్నీ దీవించాడు.
మచాకా అనే పేరుగల 14 సంవత్సరాల బాలుని అనుభవం ఈ దీవెనకు ఒక ఉదాహరణ. యెహోవాసాక్షులతో బైబిలును పఠించేందుకు ఒక ప్రతిపాదనను మచాకా అంగీకరించినప్పుడు, అతని తలిదండ్రులు చాలా కలత చెందారు. వారిలా చెప్పారు: “నీవు ఒక సాక్షి అవ్వాలనుకుంటే, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది.” అయితే, అతను తన పఠనాన్ని కొనసాగించడాన్ని ఈ బెదిరింపు నిరుత్సాహపర్చలేక పోయింది. దాని ఫలితంగా, మచాకా తలిదండ్రులు అతని బట్టలన్నీ తీసేసుకున్నారు. సహోదరులు ఈ పరిస్థితిని చూసి ప్రతిస్పందించి అతనికి మరిన్ని బట్టలు కొనిపెట్టారు. మచాకా తలిదండ్రులకు ఈ విషయం తెలిసినప్పుడు, అతనితో వారిలా చెప్పారు: “సాక్షులు నీకు మద్దతు ఇచ్చేటట్లయితే, నీవు ఇల్లు వదిలి వెళ్లి వాళ్లతోనే జీవించాల్సి ఉంటుంది.” విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, మచాకా ఇల్లు వదిలి వచ్చేశాడు, స్థానిక సంఘంలోని ఒక సాక్షి కుటుంబం అతడు తమతోపాటూ నివసించేందుకు అనుమతించింది.
మచాకా తలిదండ్రులకు ఎంత కోపం వచ్చిందంటే, సాక్షులకు అసలు తారసపడకుండా ఉండేందుకు వారు ఆ ప్రాంతంలో నుండి వెళ్లిపోవాలని తీర్మానించుకున్నారు. మచాకాకు ఈ విషయాన్ని బట్టి చాలా వ్యాకులత కలిగింది, కానీ “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును” అని చెబుతున్న కీర్తన 27:10ని సహోదరులు అతనితో చర్చించినప్పుడు అతనికి ఎంతో ఆదరణ లభించింది.
కొంత కాలానికి, మచాకా తలిదండ్రులు కాస్త మెత్తబడ్డారు, అతను ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. యెహోవాను సేవించాలనే వారి కుమారుని తీర్మానం వారిపై శక్తివంతమైన ప్రభావం చూపినట్లు అనిపిస్తుంది, ఎందుకంటే యెహోవాసాక్షులతో బైబిలు పఠించాలని వారు కూడా ఇష్టపడ్డారు! “దైవిక శాంతి సందేశకులు” జిల్లా సమావేశం యొక్క మూడు దినాలూ వారు హాజరయ్యారు, ఆ సమావేశం తర్వాత “నిజంగా, ఇది దేవుని సంస్థ” అని వారంతట వారే చెప్పేందుకు కదిలించబడ్డారు.
అవును, వ్యతిరేకత అనుభవించడం కష్టతరంగా ఉండవచ్చు, అయితే దేవుని యథార్థ సందేశకులు నిరాశ చెందరు. “శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను [“అంగీకృత స్థితిని,” NW]” కలిగిస్తుందని తెలిసి వారు ధైర్యంగా ముందుకు సాగిపోతారు. (రోమీయులు 5:3, 4) సహనం దేవుని దీవెనలను తెస్తుందని మలావీలోని యెహోవాసాక్షులు సరిగానే చెప్పగలరు.