ఇశ్రాయేలు చరిత్రలో పండుగల మైలురాళ్లు
“ఏటికి మూడు మారులు, . . . నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడ[కూడదు].”—ద్వితీయోపదేశకాండము 16:16, 17.
1. బైబిలు కాలాల్లోని పండుగ సందర్భాల గురించి ఏమి చెప్పవచ్చు?
పండుగ గురించి మీరు ఆలోచించినప్పుడు మీ మనస్సులోనికి ఏమి వస్తుంది? ప్రాచీనకాలాల్లోని కొన్ని పండుగలు విశృంఖలమైన ప్రవర్తనతోనూ, అనైతికతతోనూ నిండిపోయి ఉన్నాయి. కొన్ని ఆధునిక దిన పండుగల విషయంలోనూ అది వాస్తవమే. కానీ ఇశ్రాయేలీయులకు దేవుని ధర్మశాస్త్రంలో వివరించబడిన పండుగలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అవి ఆనందదాయకమైన సందర్భాలైనప్పటికీ, “పరిశుద్ధసంఘములు” అని కూడా అవి వర్ణించబడ్డాయి.—లేవీయకాండము 23:2.
2. (ఎ) ఇశ్రాయేలీయుల పురుషులు సంవత్సరానికి మూడుసార్లు ఏమి చేయాల్సిన అవసరం ఉంది? (బి) ద్వితీయోపదేశకాండము 16:16లో ఉపయోగించబడిన పదం ప్రకారం, “పండుగ” అంటే ఏమిటి?
2 విశ్వసనీయులైన ఇశ్రాయేలు పురుషులు—తమ కుటుంబాలతోపాటు—‘యెహోవా ఏర్పరచుకొన్న స్థలమైన’ యెరూషలేముకు ప్రయాణం చేయడంలో సేదదీర్పుతో కూడిన ఆహ్లాదాన్ని అనుభవించేవారు. వారక్కడ మూడు గొప్ప పండుగలకు ఉదారంగా చందాలను ఇచ్చేవారు. (ద్వితీయోపదేశకాండము 16:16) ద్వితీయోపదేశకాండము 16:16లో “పండుగ” అని అనువదించబడిన హెబ్రీ పదాన్ని, “దేవుని అనుగ్రహాన్ని పొందిన కొన్ని అసాధారణమైన సంఘటనలను బలి అర్పణలతోనూ, విందులతోనూ ఆచరించే . . . గొప్ప ఆనందంతో కూడిన—సందర్భం” అని ఓల్డ్ టెస్టమెంట్ వర్డ్ స్టడీస్ అనే పుస్తకం నిర్వచిస్తుంది.a
గొప్ప పండుగల ప్రాముఖ్యత
3. మూడు వార్షిక పండుగలు ఏ ఆశీర్వాదాలను గుర్తుకుతెచ్చాయి?
3 ఇశ్రాయేలీయులది వ్యవసాయదారుల సమాజం గనుక, వారు వర్షం రూపంలో వచ్చే దేవుని ఆశీర్వాదంపై ఆధారపడేవారు. వసంత ఋతువు ఆరంభంలో యవలకోత, అదే ఋతువు చివర్లో గోధుమల కోత, వేసవికాలం చివర్లో మిగతా కోత—ఈ మూడు కోతలను సమకూర్చడమూ, మోషే ధర్మశాస్త్రంలోవున్న మూడు గొప్ప పండుగలు జరుపుకోవడమూ ఏకకాలంలో సంభవిస్తాయి. ఇవి అత్యానందకరమైన సందర్భాలు, వర్షచక్ర ఆధారభూతునికీ, ఉత్పాదకమైన నేలను చేసిన సృష్టికర్తకూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సందర్భాలు. కానీ పండుగల్లో ఇంకా చాలా ఇమిడివుంది.—ద్వితీయోపదేశకాండము 11:11-14.
4. మొదటి పండుగ ద్వారా ఏ చరిత్రాత్మక సంఘటన ఆచరించబడింది?
4 ప్రాచీన బైబిలు క్యాలెండరులోని మొదటి నెల అయిన నీసాను 15 నుండి 21 వరకు మొట్టమొదటి పండుగ జరుపుకోబడేది. ఆ నెల మన క్యాలెండరు ప్రకారం మార్చి నెలాఖరులోగానీ లేక ఏప్రిల్ తొలిభాగంలోగానీ వస్తుంది. అది పులియనిరొట్టెల పండుగ అని పిలువబడింది, అంతేగాక అది నీసాను 14న వచ్చే పస్కా జరిగిన తదనంతరం వెంటనే వస్తుంది గనుక అది “పస్కా పండుగ” అని కూడా పిలువబడింది. (లూకా 2:41; లేవీయకాండము 23:5, 6) ఐగుప్తులోని బాధలనుండి తాము పొందిన విడుదలను ఈ పండుగ ఇశ్రాయేలీయులకు గుర్తుకు తెచ్చేది, ఆ పులియనిరొట్టెలు “బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారము” అని పిలువబడ్డాయి. (ద్వితీయోపదేశకాండము 16:3) పిండికి పులిపిండి కలిపి, ఆ పిండి పులిసేంతవరకు వేచివుండడానికి కూడా సమయంలేనంత తొందరలో తాము ఐగుప్తును విడిచిపెట్టామన్న విషయాన్ని అది వారికి జ్ఞప్తికితెచ్చింది. (నిర్గమకాండము 12:34) ఈ పండుగ కాలంలో ఏ ఇశ్రాయేలీయుని ఇంట్లోనూ పులిసినరొట్టెలు ఏమాత్రం కనబడకూడదు. అన్యులతోసహా పండుగ జరుపుకునే వారెవరైనా, పులిసినరొట్టెలు తింటే వారికి మరణశిక్ష విధించాలి.—నిర్గమకాండము 12:19.
5. రెండవ పండుగ ద్వారా ఏ ఆధిక్యత జ్ఞప్తికి తేబడింది, ఆనందోత్సాహాల్లో ఎవరు కూడా భాగం వహించేలా చూడాల్సింది?
5 నీసాను 16 నుండి ఏడువారాల (49 రోజులు) తర్వాత, మూడవ నెల అయిన సివానులో 6వ దినాన రెండవ పండుగ జరుపుకోబడేది. అది మన క్యాలెండరులో మే చివర్లో వస్తుంది. (లేవీయకాండము 23:15, 16) దీన్నే వారాల పండుగ అని పిలిచేవారు (యేసు కాలంలో దాన్ని పెంతెకొస్తు అని కూడా పిలిచేవారు, ఆ పదానికి గ్రీకులో “యాభయ్యవ” అని అర్థం). సీనాయి పర్వతంవద్ద ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్ర నిబంధనలోనికి సంవత్సరంలోని ఏ సమయంలో ప్రవేశించారో ఇంచుమించు అదే సమయంలో ఈ పండుగ వస్తుంది. (నిర్గమకాండము 19:1, 2) ఈ పండుగ కాలంలో, విశ్వసనీయులైన ఇశ్రాయేలీయులు దేవుని పరిశుద్ధ జనాంగముగా తాము వేర్పరచబడడాన్ని గురించిన తమ ఆధిక్యతను గుర్తుకుతెచ్చుకుని ఉండవచ్చు. దేవుని ప్రత్యేక ప్రజగా ఉండడానికి వారు దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపాల్సిన అవసరం ఉంది, ఆ ధర్మశాస్త్రంలో అభాగ్యులైన ప్రజలపట్ల ప్రేమ పూర్వకమైన శ్రద్ధను కనపర్చి, వారు కూడా పండుగను ఆనందంతో అనుభవించేలా చేయాలి వంటి ఆజ్ఞలు ఉన్నాయి.—లేవీయకాండము 23:22; ద్వితీయోపదేశకాండము 16:10-12.
6. మూడవ పండుగ దేవుని ప్రజలకు ఏ అనుభవాన్ని గుర్తుకుతెచ్చింది?
6 మూడు గొప్ప వార్షిక పండుగల్లో చివరిదాన్ని ఫలసంగ్రహపు పండుగనీ, లేక పర్ణశాలల పండుగనీ పిలిచేవారు. అది తిష్రీ, లేదా ఏతానిమ్ అనే పేరుగల ఏడవ నెలలో 15 నుండి 21వ తేదీ వరకు జరుపుకోబడేది, మన క్యాలెండరు ప్రకారం అది అక్టోబరు తొలిభాగంలో వస్తుంది. (లేవీయకాండము 23:34) ఈ పండుగ జరిగే కాలంలో దేవుని ప్రజలు తమ గృహాలకు వెలుపలనో లేక తమ ఇండ్ల కప్పులపైనో చెట్ల కొమ్మలూ, ఆకులతో వేసుకున్న తాత్కాలిక నివాసాలలో (పర్ణశాలల్లో) నివసించేవారు. ఇది వారికి ఐగుప్తునుండి వాగ్దానం చేయబడిన దేశంలోనికి చేసిన 40 ఏండ్ల ప్రయాణాన్ని గుర్తుకుతెచ్చింది. ఆ 40 ఏండ్ల కాలంలో వారు తమ దైనందిన అవసరాల నిమిత్తం దేవునిపై ఆధారపడడం నేర్చుకోవల్సివచ్చింది.—లేవీయకాండము 23:42, 43; ద్వితీయోపదేశకాండము 8:15, 16.
7. ప్రాచీన ఇశ్రాయేలులోని పండుగ ఆచరణలను పునస్సమీక్షించడం నుండి మనం ఎలా ప్రయోజనం పొందుతాము?
7 దేవుని ప్రాచీన ప్రజల చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన పండుగల్లో కొన్నింటిని మనం పునస్సమీక్షిద్దాము. ఇది మనకు ప్రోత్సాహకరంగా ఉండాలి, ఎందుకంటే మనం కూడా క్రమంగా వారం వారమూ సమకూడాలనీ, సంవత్సరానికి మూడుసార్లు పెద్దపెద్ద సమావేశాలకు, సభలకు హాజరుకావాలనీ ఆహ్వానించబడ్డాము.—హెబ్రీయులు 10:24, 25.
దావీదు వంశంలోని రాజుల కాలంలో
8. (ఎ) సొలొమోను రాజు కాలంలో ఏ చరిత్రాత్మకమైన ఆచరణ జరిగింది? (బి) సాదృశ్యమైన పర్ణశాలల పండుగ యొక్క ఏ దివ్యమైన ముగింపు కొరకు మనం ఆశతో ఎదురుచూడవచ్చు?
8 దావీదు కుమారుడైన సొలొమోను రాజు విజయవంతమైన పరిపాలనలో ఒకసారి పర్ణశాలల పండుగ చరిత్రాత్మకమైన రీతిలో జరుపబడింది. పర్ణశాలల పండుగను జరుపుకునేందుకూ, మందిరపు ప్రతిష్ఠాపన కొరకూ వాగ్దానం చేయబడిన దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనుండి “బహు గొప్ప సమూహము” సమకూడింది. (2 దినవృత్తాంతములు 7:8) అది ముగిసిన తర్వాత, సొలొమోను రాజు దానికి హాజరైన ప్రజలను పంపివేసినప్పుడు, “వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులగు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనందహృదయులై తమ తమ గుడారములకు వెళ్లిపోయిరి.” (1 రాజులు 8:66) అది నిజంగా ఒక పండుగ మైలురాయే. గొప్ప సొలొమోను అయిన యేసుక్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలన అంతంలో సాదృశ్య పర్ణశాలల పండుగ దివ్యమైన ముగింపుకు చేరుకునే సమయం కొరకు దేవుని సేవకులు నేడు ఎదురుచూస్తున్నారు. (ప్రకటన 20:3, 7-10, 14, 15) ఆ సమయంలో పునరుత్థానులైన వారూ, అర్మగిద్దోను నుండి తప్పించుకున్న వారూ మాత్రమేగాక భూమిపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ యెహోవా దేవుని ఆనందంగా ఆరాధించడంలో ఏకమైవుంటారు.—జెకర్యా 14:16.
9-11. (ఎ) హిజ్కియా రాజు కాలంలో పండుగ మైలురాయిని చేరుకోవడానికి నడిపినదేమిటి? (బి) పదిగోత్రాల ఉత్తర రాజ్యంలోని చాలామంది ఏ మాదిరిని ఉంచారు, అది నేడు మనకు దేన్ని గుర్తుకుతెస్తుంది?
9 బైబిల్లో నివేదించబడిన తరువాతి విశిష్టమైన పండుగ, దుష్ట రాజైన ఆహాజు పరిపాలనానంతరం వచ్చింది, ఆయన మందిరాన్ని మూసివేయించి యూదా రాజ్యాన్ని భ్రష్టత్వంవైపుకి నడిపించాడు. ఆహాజు తర్వాత మంచి రాజైన హిజ్కియా వచ్చాడు. 25 ఏండ్ల వయస్సులో హిజ్కియా, తన పరిపాలనలోని మొదటి సంవత్సరంలో పునఃస్థాపనా సంస్కరణల గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆయన వెంటనే మందిరాన్ని తెరిపించి, దానికి మరమ్మతులు చేయించడానికి ఏర్పాట్లు చేశాడు. తర్వాత ఈ రాజు, ఉత్తరాన శత్రుభావంతో ఉన్న పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యానికి ఉత్తరాలు పంపి పస్కానూ, పులియనిరొట్టెల పండుగనూ ఆచరించడానికి రమ్మని వారిని ఆహ్వానించాడు. తోటివారు తమను గేలిచేసినప్పటికీ చాలామంది ఆ పండుగకు వచ్చారు.—2 దినవృత్తాంతములు 30:1, 10, 11, 18.
10 ఆ పండుగ జయప్రదమైందా? బైబిలు ఇలా నివేదిస్తుంది: “యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోషభరితులై పులియనిరొట్టెల పండుగను ఏడుదినములు ఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి.” (2 దినవృత్తాంతములు 30:21) నేటి దేవుని ప్రజలకు ఆనాటి ఇశ్రాయేలీయులు ఎంతటి చక్కని మాదిరిని ఉంచారు, నేడు వీరిలో చాలామంది సమావేశాలకు హాజరుకావడం కోసం ఎంతో వ్యతిరేకతను సహిస్తూ, ఎంతో దూరాలు ప్రయాణించి వస్తున్నారు!
11 ఉదాహరణకు, పోలండ్‌లో 1989లో నిర్వహించబడిన మూడు “దైవ భక్తి” జిల్లా సమావేశాలను పరిగణలోనికి తీసుకోండి. ఆ సమావేశాలు జరుగుతున్న సమయంలో యెహోవాసాక్షుల కార్యకలాపాలు నిషేధించబడిన మునుపటి సోవియట్ యూనియన్ నుండీ ఇంకా ఇతర తూర్పు యూరప్ దేశాలనుండీ పెద్ద సమూహాలుగా వచ్చినవారు, వాటికి హాజరైనవారి మొత్తం సంఖ్య అయిన 1,66,518 మందిలో ఉన్నారు. “ఈ సమావేశాలకు హాజరైన కొందరు మునుపెన్నడూ 15 లేక 20కన్నా ఎక్కువమంది యెహోవా ప్రజల్ని ఒకేచోట చూడలేదు. అంత పెద్ద సమావేశాలకు హాజరుకావడం వారికి అదే మొదటిసారి. తమతోపాటు కలిసి ప్రార్థనచేస్తూ, స్వరాలు కలిపి ఐక్యంగా యెహోవాకు స్తుతికీర్తనలు పాడుతూ ఉన్న వేలాదిమందిని స్టేడియంలలో చూసి వారి హృదయాలు మెప్పుదలతో ఉప్పొంగిపోయాయి” అని యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులుb (ఆంగ్లం) పుస్తకం 279వ పేజీలో నివేదిస్తుంది.
12. రాజైన యోషీయా పరిపాలనలో పండుగ మైలురాయిని చేరుకోవడానికి నడిపినదేమిటి?
12 హిజ్కియా మరణించిన తర్వాత యూదావారు మరలా మనష్షే, ఆమోను రాజుల పరిపాలన క్రింద అబద్ధ ఆరాధనలో పడిపోయారు. ఆ తర్వాత సత్యారాధనను పునఃస్థాపించడానికి ధైర్యంగా చర్యలు తీసుకున్న యౌవనుడైన యోషీయా అనే మరొక మంచి రాజు పరిపాలన వచ్చింది. 25 ఏండ్ల వయస్సులో యోషీయా మందిరాన్ని బాగుచేయడానికి ఆజ్ఞలను జారీచేశాడు. (2 దినవృత్తాంతములు 34:8) మరమ్మతు పనులు కొనసాగుతుండగా, మోషే వ్రాసిన ధర్మశాస్త్రం మందిరంలో దొరికింది. రాజైన యోషీయా తాను దేవుని ధర్మశాస్త్రంలో చదివినదాన్నిబట్టి బాగా కదిలించబడినవాడై దాన్ని ప్రజలందరికీ చదివి వినిపించడానికి ఏర్పాటు చేశాడు. (2 దినవృత్తాంతములు 34:14, 30) తర్వాత, అందులో వ్రాయబడినదాని ప్రకారం ఆయన పస్కా పండుగ ఆచరణ కొరకు ఏర్పాట్లను చేశాడు. ఆ ఆచరణకు కావాల్సినవాటిని ఉదారంగా ఇచ్చి రాజు కూడా చక్కని మాదిరిని ఉంచాడు. తత్ఫలితంగా, “ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కాపండుగ అంత ఘనముగా ఆచరింపబడియుండలేదు” అని బైబిలు నివేదిస్తుంది.—2 దినవృత్తాంతములు 35:7, 17, 18.
13. హిజ్కియా, యోషీయాలు ఆచరించిన పండుగలు మనకు నేడు దేన్ని గుర్తుకుతెస్తాయి?
13 హిజ్కియా, యోషీయాలు చేపట్టిన సంస్కరణలు, 1914లో యేసుక్రీస్తు రాజైన తర్వాత నిజ క్రైస్తవుల్లో సత్యారాధన అద్భుతంగా పునఃస్థాపించబడడానికి సమాంతరంగా ఉన్నాయి. ప్రాముఖ్యంగా యోషీయా సంస్కరణల విషయంలో వాస్తవమైనట్లుగా, ఈ ఆధునిక దిన పునఃస్థాపన దేవుని వాక్యంలో వ్రాయబడిన దానిపై ఆధారపడివుంది. అంతేగాక, హిజ్కియా యోషీయాల రోజుల్లో జరిగినదానికి సమాంతరంగా ఆధునిక దిన పునఃస్థాపనలో, బైబిలు ప్రవచనాల ఉత్తేజకరమైన వివరణలూ, బైబిలు సూత్రాల సమయోచితమైన అన్వయింపులూ ఇవ్వబడిన గమనార్హమైన సభలూ, సమావేశాలూ జరిగాయి. ఈ ఉపదేశాత్మక సందర్భాల్లో కలిగే ఆనందానికి బాప్తిస్మం పొందినవారి గొప్ప సంఖ్యలు మరింత ఆనందాన్ని చేకూర్చాయి. హిజ్కియా, యోషీయాల కాలాల్లో పశ్చాత్తాపం చెందిన ఇశ్రాయేలీయులవలెనే, క్రొత్తగా బాప్తిస్మం పొందినవారు క్రైస్తవమత సామ్రాజ్యపు, మిగతా సాతాను లోకపు దుష్ట అభ్యాసాలను విడిచిపెట్టారు. 1997లో 3,75,000కన్నా ఎక్కువమంది, తాము పరిశుద్ధ దేవుడైన యెహోవాకు సమర్పించుకున్నామన్న దానికి సూచనగా బాప్తిస్మం పొందారు—సగటున చూస్తే అది రోజుకి 1,000 మంది కన్నా ఎక్కువే.
చెరగొనిపోబడిన తర్వాత
14. సా.శ.పూ. 537లో ఒక పండుగ మైలురాయిని చేరుకోవడానికి నడిపినదేమిటి?
14 యోషీయా మరణించిన తర్వాత, దేశం మళ్లీ నీచమైన అబద్ధ ఆరాధనలోనికి కూరుకుపోయింది. చివరికి, సా.శ.పూ. 607లో యెరూషలేము మీదికి బబులోనీయుల సైన్యాలను రప్పించడం ద్వారా యెహోవా తన ప్రజలను శిక్షించాడు. ఆ పట్టణమూ, దానిలోవున్న మందిరమూ నాశనమయ్యాయి, ఆ దేశం నిర్మానుష్యమైంది. అటుతర్వాత యూదులు బబులోనులో 70 సంవత్సరాలపాటు చెరలో ఉన్నారు. అప్పుడు పశ్చాత్తాపం చెందిన యూదుల శేషాన్ని దేవుడు పునరుద్ధరించినప్పుడు, వారు వాగ్దానం చేయబడిన దేశానికి తిరిగివచ్చి సత్యారాధనను పునఃస్థాపించారు. వారు సా.శ.పూ. 537లో ఏడవ నెలలో శిథిలమైవున్న యెరూషలేము పట్టణానికి తిరిగివచ్చారు. వారు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, ధర్మశాస్త్ర నిబంధనలో ఉన్నట్లుగా అనుదిన బలులను క్రమంగా అర్పించడానికి ఒక బలిపీఠాన్ని కట్టడమే. మరొక చరిత్రాత్మకమైన పండుగ ఆచరణకు అది సరిగ్గా సమయము. “గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి[రి].”—ఎజ్రా 3:1-4.
15. సా.శ.పూ. 537లో పునరుద్ధరించబడిన శేషం ఎదుట ఏ పని ఉంది, 1919లో ఎటువంటి సమాంతరమైన పరిస్థితి ఏర్పడింది?
15 తిరిగివచ్చిన ఈ నిర్వాసితుల ఎదుట గొప్ప పని ఉంది—అది దేవుని మందిరాన్ని పునర్నిర్మించే పని, యెరూషలేమునూ దాని గోడల్నీ పునర్నిర్మించే పని. అసూయాపరులైన పొరుగువారు ఎంతగానో వ్యతిరేకించారు. మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు, అది “కార్యములు అల్పములై యున్న కాలము.” (జెకర్యా 4:10) ఆ పరిస్థితి 1919లో విశ్వసనీయులైన అభిషిక్తులు ఉన్న స్థితికి సమాంతరంగా ఉంది. మరువరాని ఆ సంవత్సరంలో, వారు అబద్ధమత ప్రపంచ సామ్రాజ్యమైన మహా బబులోను ఆధ్యాత్మిక చెరనుండి విడుదలపొందారు. వారి సంఖ్య అప్పుడు కేవలం కొన్ని వేలు మాత్రమే, వీరు లోకంతో శత్రుత్వాన్ని ఎదుర్కొన్నారు. దేవుని శత్రువులు సత్యారాధన పురోభివృద్ధిని ఆపగలరా? ఆ ప్రశ్నకు జవాబు, హెబ్రీ లేఖనాల్లో నమోదు చేయబడిన చివరి రెండు పండుగల ఆచరణలను గుర్తుకు తెస్తుంది.
16. సా.శ.పూ. 515లో జరిగిన ఒక పండుగ ప్రాముఖ్యత ఏమైవుంది?
16 చివరికి సా.శ.పూ. 515వ సంవత్సరంలోని అదారు నెలలో మందిరం పునర్నిర్మించబడింది, నీసాను వసంతకాల పండుగ జరుపుకోవడానికి అది సరిగ్గా సమయం. బైబిలు ఇలా నివేదిస్తుంది: “[వారు] పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.”—ఎజ్రా 6:21, 22.
17, 18. (ఎ) సా.శ.పూ. 455లో ఏ పండుగ మైలురాయిని చేరుకున్నారు? (బి) నేడు మనమూ అదే విధమైన పరిస్థితిలో ఎలా ఉన్నాము?
17 అరవై సంవత్సరాల తర్వాత, సా.శ.పూ. 455లో మరొక మైలురాయిని చేరుకున్నారు. ఆ సంవత్సరంలోని పర్ణశాలల పండుగ సమయానికల్లా యెరూషలేము గోడల పునర్నిర్మాణం ముగిసింది. బైబిలు ఇలా నివేదిస్తుంది: “చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను.”—నెహెమ్యా 8:17.
18 తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ దేవుని సత్యారాధన పునఃస్థాపించబడడం అనేది ఎంతటి మరువరాని సంఘటన! పరిస్థితి నేడు కూడా అదే విధంగా ఉంది. హింస, వ్యతిరేకతల పెనుగాలులు వీస్తున్నప్పటికీ, దేవుని రాజ్య సువార్తను ప్రకటించే గొప్ప పని భూమి నాలుగు చెరగులా వ్యాపించింది, దేవుని తీర్పు సందేశాలు సుదూరతీరాలకు వినిపించబడ్డాయి. (మత్తయి 24:14) అభిషిక్తులైన 1,44,000 మందిలోని శేషించినవారిని చివరిసారిగా ముద్రించడానికి సమయం దగ్గరపడుతుంది. ఈ అభిషిక్త శేషముతోపాటు “మంద ఒక్కటి”గా ఉండేలా, అన్ని జనాంగములలోనుండి 50 లక్షలకుపైగా ‘వేరే గొఱ్ఱెలైన’ వారి సహవాసులు సమకూర్చబడ్డారు. (యోహాను 10:16; ప్రకటన 7:3, 9, 10) పర్ణశాలల పండుగ యొక్క ప్రవచనాత్మక చిత్రం ఎంత అద్భుతంగా నెరవేరిందో కదా! సమకూర్చే ఈ గొప్ప పని నూతన లోకంలో కూడా కొనసాగుతుంది, ఆ సమయంలో పునరుత్థానులైన కోట్లాదిమందిని సాదృశ్యమైన పర్ణశాలల పండుగను ఆచరించడంలో చేరమని ఆహ్వానించడం జరుగుతుంది.—జెకర్యా 14:16-19.
సా.శ. మొదటి శతాబ్దంలో
19. సా.శ. 32లో జరిగిన పర్ణశాలల పండుగను అంత విశిష్టమైనదిగా చేసినదేమిటి?
19 బైబిలులో నమోదు చేయబడిన అత్యంత విశిష్టమైన పండుగ ఆచరణల్లో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు హాజరైన పండుగలు ఉన్నాయని నిస్సంశయంగా చెప్పవచ్చు. ఉదాహరణకు, యేసు సా.శ. 32వ సంవత్సరంలో పర్ణశాలల (లేక, గుడారాల) పండుగకు హాజరుకావడాన్ని పరిశీలించండి. ఆయన ఆ సందర్భాన్ని ప్రాముఖ్యమైన సత్యాల్ని బోధించడానికి ఉపయోగించుకున్నాడు, తన బోధకు ఆధారంగా హెబ్రీ లేఖనాల్ని ఉల్లేఖించాడు కూడా. (యోహాను 7:2, 14, 37-39) ఈ పండుగ సమయంలో మందిరం లోపలి ఆవరణములో నాలుగు పెద్ద దీపస్తంభాలను వెలిగించే ఆచారమనేది ఉండేది. చీకటి పడిన తర్వాత కూడా సాగే పండుగ కార్యకలాపాలను ఆనందించడానికది దోహదం చేసేది. “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని” యేసు అన్నప్పుడు, ఆయన ఈ పెద్ద పెద్ద దీపాలనే సూచించాడనే విషయం స్పష్టమౌతుంది.—యోహాను 8:12.
20. సా.శ. 33లో జరిగిన పస్కా ఎందుకంత విశిష్టమైనదిగా ఉంది?
20 అటుతర్వాత ప్రాముఖ్యమైన సంవత్సరమైన సా.శ. 33లో పస్కా, పులియనిరొట్టెల పండుగలు వచ్చాయి. ఆ పస్కా రోజున, యేసును ఆయన శత్రువులు చంపేశారు, ఆ విధంగా ఆయన “లోకపాపమును మోసికొనిపోవు”టకు చనిపోయి సాదృశ్యమైన పస్కా గొఱ్ఱెపిల్ల అయ్యాడు. (యోహాను 1:29; 1 కొరింథీయులు 5:7) మూడు రోజుల తర్వాత, నీసాను 16న యేసును అమర్త్యమైన ఆత్మ శరీరంతో దేవుడు పునరుత్థానం చేశాడు. ధర్మశాస్త్రంలో నిర్దేశించబడినట్లుగా యవలకోతలోని ప్రథమ ఫలాన్ని అర్పించాల్సిన సమయంలోనే ఇది జరిగింది. ఆ విధంగా, పునరుత్థానుడైన ప్రభువగు యేసుక్రీస్తు “నిద్రించినవారిలో ప్రథమఫలము” అయ్యాడు.—1 కొరింథీయులు 15:20.
21. సా.శ. 33వ సంవత్సరంలో పెంతెకొస్తు పండుగ రోజున ఏమి జరిగింది?
21 సా.శ. 33లోని పెంతెకొస్తు పండుగ నిజంగానే విశిష్టమైనది. ఆ రోజున 120 మంది యేసు శిష్యులతోపాటు, చాలామంది యూదులూ, యూదామత ప్రవిష్టులూ యెరూషలేములో సమకూడారు. పండుగ జరుగుతుండగా, పునరుత్థానుడైన ప్రభువగు యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధాత్మను 120 మంది మీద కుమ్మరించాడు. (అపొస్తలుల కార్యములు 1:15; 2:1-4, 33) ఆ విధంగా వారు అభిషేకించబడినవారై, యేసుక్రీస్తు మధ్యవర్తిత్వం నెరపుతున్న క్రొత్త నిబంధన ద్వారా దేవుడు క్రొత్తగా ఎంపిక చేసుకున్న జనాంగమయ్యారు. ఆ పండుగ సమయంలో, గోధుమకోతలోని ప్రథమఫలాల నుండి తయారుచేసిన రెండు పులిసిన రొట్టెలను యూదా ప్రధాన యాజకుడు దేవునికి అర్పించేవాడు. (లేవీయకాండము 23:15-17) ఈ పులిసిన రొట్టెలు 1,44,000 మంది అపరిపూర్ణ మానవులకు, అంటే ‘భూలోకమందు ఏలడానికీ,’ ‘ఒక రాజ్యముగాను యాజకులుగాను’ సేవచేయడానికీ యేసు ఎవరినైతే ‘దేవునికొరకు కొన్నాడో’ ఆ అపరిపూర్ణ మానవులకు చిత్రీకరణగా ఉన్నాయి. (ప్రకటన 5:9, 10; 14:1, 3) ఈ పరలోక పరిపాలకులు పాపభరిత మానవజాతిలోని రెండు శాఖలనుండి—యూదులనుండీ, అన్యులనుండీ—వస్తారన్న వాస్తవం కూడా ఆ రెండు పులిసినరొట్టెల ద్వారా చిత్రీకరించబడి ఉండవచ్చు.
22. (ఎ) ధర్మశాస్త్ర నిబంధనలోని పండుగలను క్రైస్తవులు ఎందుకు జరుపుకోరు? (బి) తర్వాతి శీర్షికలో మనం ఏమి పరిశీలిస్తాము?
22 సా.శ. 33వ సంవత్సరం పెంతెకొస్తునాడు క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చిందంటే, పాత ధర్మశాస్త్ర నిబంధన దేవుని దృష్టిలో ఇక విలువను కోల్పోయిందని అర్థం. (2 కొరింథీయులు 3:14; హెబ్రీయులు 9:15; 10:16) అభిషిక్త క్రైస్తవులు ధర్మశాస్త్రం లేకుండా ఉన్నారని దీనర్థం కాదు. వారు యేసుక్రీస్తు బోధించిన, తమ హృదయాలపై లిఖించబడిన దైవిక నియమం [దైవిక ధర్మశాస్త్రం] క్రిందికి వస్తారు. (గలతీయులు 6:2) అందుకని, పాత నిబంధనలో భాగమైవున్న ఆ మూడు వార్షిక పండుగలను క్రైస్తవులు ఆచరించరు. (కొలొస్సయులు 2:16, 17) అయినప్పటికీ, క్రైస్తవపూర్వకాలాల్లోని దేవుని సేవకులు చేసుకున్న పండుగలపట్లా, ఆరాధన కొరకైన మరితర కూటాలపట్లా వారు కలిగివున్న దృక్పథంనుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మన తర్వాతి శీర్షికలో, క్రైస్తవ సమావేశాలకు క్రమంగా హాజరుకావాల్సిన ఆవశ్యకతను ప్రశంసించడానికి అందర్నీ నిస్సందేహంగా పురికొల్పే ఉదాహరణలను మనం పరిశీలిద్దాము.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం), సంపుటి 1, పేజీ 820లో “పండుగ” అనే శీర్షిక క్రింద 1వ కాలమ్‌లోని 1, 3 పేరాలను కూడా చూడండి.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
పునస్సమీక్ష ప్రశ్నలు
◻ ఇశ్రాయేలీయుల మూడు గొప్ప పండుగలు ఏ సంకల్పాన్ని నెరవేర్చాయి?
◻ హిజ్కియా, యోషీయాల కాలంలోని పండుగల ప్రత్యేకతలు ఏమిటి?
◻ సా.శ.పూ. 455లో ఏ పండుగ మైలురాయిని చేరుకున్నారు, అది మనకు ఎందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది?
◻ సా.శ. 33వ సంవత్సరంలో జరిగిన పస్కా, పెంతెకొస్తు పండుగల విషయంలో అంత ప్రాముఖ్యంగా ఉన్నది ఏమిటి?
[12వ పేజీలోని బాక్సు]
నేడు మన కొరకొక పండుగ పాఠం
యేసు యొక్క పాపప్రాయశ్చిత్త బలి నుండి శాశ్వత ప్రయోజనం పొందబోయే వారందరూ పులియనిరొట్టెల పండుగ ద్వారా చిత్రీకరించబడిన దానికి అనుగుణ్యంగా జీవించాలి. యేసు విమోచన క్రయధన బలిద్వారా తాము ఈ దుష్ట లోకం నుండి విడుదలను పొందడాన్నిబట్టీ, పాపపు దోషశిక్ష నుండి విమోచించబడడాన్నిబట్టీ అభిషిక్త క్రైస్తవులు చేసుకునే ఆనందమయ ఆచరణే ఈ సాదృశ్య పండుగ. (గలతీయులు 1:4; కొలొస్సయులు 1:13, 14) అక్షరార్థమైన పండుగ ఏడు రోజులు కొనసాగింది—ఈ సంఖ్య బైబిలులో ఆధ్యాత్మిక సంపూర్ణత్వాన్ని సూచిస్తుంది. సాదృశ్యమైన పండుగ, అభిషిక్తుల క్రైస్తవ సంఘం భూమిపైన ఉన్నంత కాలమూ కొనసాగుతుంది, మరి దాన్ని ‘నిష్కాపట్యముతోను, సత్యముతోను’ ఆచరించాలి. దానర్థం సూచనార్థకమైన పులిసినపిండిని గూర్చి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. పులిసినపిండి బైబిలులో భ్రష్టమైన బోధలనూ, వేషధారణనూ, చెడుతనాన్నీ చిత్రీకరించేందుకు ఉపయోగించబడింది. యెహోవా యొక్క సత్యారాధికులు అటువంటి పులిసినపిండిపట్ల ద్వేషాన్ని ప్రదర్శించాలి, అది తమ స్వంత జీవితాలను భ్రష్టుపట్టించడానికీ, క్రైస్తవ సంఘపు పరిశుభ్రతను మలినపర్చడానికీ వాళ్లు అనుమతించకూడదు.—1 కొరింథీయులు 5:6-8; మత్తయి 16:6, 12.
[9వ పేజీలోని చిత్రం]
ప్రతి సంవత్సరం నీసాను 16న తొలి యవలకోతలోని ఒక పన అర్పించబడేది, అదే రోజున యేసు పునరుత్థానుడయ్యాడు
[10వ పేజీలోని చిత్రం]
యేసు “లోకమునకు వెలుగును” అని తనను తాను పిలుచుకున్నప్పుడు ఆయన బహుశ పండుగనాడు వెలిగించే జ్యోతులను సూచిస్తుండి ఉండవచ్చు