కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 4/1 పేజీలు 10-15
  • సర్వమానవాళి కొరకైన గ్రంథం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సర్వమానవాళి కొరకైన గ్రంథం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రపంచంలో అత్యధికంగా పంచిపెట్టబడిన గ్రంథం
  • భద్రపర్చబడిన విధానాన్ని గూర్చిన అసమానమైన రికార్డు
  • మానవాళి సజీవ భాషల్లోకి
  • విశ్వాసయోగ్యమైనది
  • సజీవ భాషల్ని “మాట్లాడే” గ్రంథం
    సర్వమానవాళి కొరకైన గ్రంథం
  • ఈ గ్రంథమెలా తప్పించుకొని నిలిచింది?
    సర్వమానవాళి కొరకైన గ్రంథం
  • బైబిలు మన వరకు ఎలా వచ్చింది?
    తేజరిల్లు!: బైబిలు మన వరకు ఎలా వచ్చింది?
  • దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 4/1 పేజీలు 10-15

సర్వమానవాళి కొరకైన గ్రంథం

“దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.

1. బైబిల్ని గురించి తాను ఏమనుకుంటున్నాడో చెప్పమని అడిగినప్పుడు ఒక ప్రొఫెసరు ఎలా ప్రతిస్పందించాడు, మరి ఆయన ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు?

ఒక ప్రొఫెసరు ఒకనాటి ఆదివారం మధ్యాహ్నవేళ ఇంటి దగ్గరే ఉన్నాడు, సందర్శకులు వస్తారని ఆయన ఎదురు చూడడం లేదు. కానీ మన క్రైస్తవ సహోదరీల్లో ఒకరు ఆయన ఇంటిని సందర్శించినప్పుడు, ఆయన ఆమె చెప్పేదాన్ని విన్నాడు. ఆమె ఆయన్ని ఆకట్టుకునే అంశాలైన కాలుష్యాన్ని గూర్చీ, భూమి భవిష్యత్తును గూర్చీ మాట్లాడింది. అయితే, ఆ చర్చలో ఆమె బైబిల్ని పరిచయం చేసినప్పుడు, ఆయనలో సందేహం తలెత్తినట్టు కనబడింది. అందుకని ఆయన బైబిల్ని గురించి ఏమనుకుంటున్నాడని ఆమె అడిగింది.

“అది కొంతమంది తెలివైన వ్యక్తులు రాసిన ఓ మంచి గ్రంథమే, కానీ బైబిల్ని అంత గంభీరంగా తీసుకోనవసరంలేదు” అని ఆయన ప్రత్యుత్తరమిచ్చాడు.

“మీరెప్పుడైనా బైబిల్ని చదివారా?” అని ఆమె ప్రశ్నించింది.

అందుకు తడబడినవాడై, ఆ ప్రొఫెసరు తాను చదవలేదని ఒప్పుకోవాల్సివచ్చింది.

తర్వాత ఆమె ఇలా అడిగింది. “మీరెన్నడూ చదవని ఓ గ్రంథాన్ని గురించి అంత కచ్చితంగా మీరెలా చెప్పగలరు?”

మన సహోదరి సహేతుకంగానే తర్కించింది. బైబిల్ని చదివి, ఆ తర్వాత దాని గురించి ఓ అభిప్రాయాన్ని ఏర్పర్చుకోవాలని ఆ ప్రొఫెసర్‌ నిర్ణయించుకున్నాడు.

2, 3. అనేకమంది ప్రజల విషయంలో బైబిలు ఎందుకు బూజు పట్టిన పుస్తకంగా ఉంది, ఇది మన ముందు ఏ సవాల్ని ఉంచుతుంది?

2 అలాంటి అభిప్రాయం ఉన్నది ఆ ప్రొఫెసరు ఒక్కరికే కాదు. బైబిల్ని తాము వ్యక్తిగతంగా ఎన్నడూ చదవకపోయినా, అనేకమంది ప్రజలకు దాని విషయంలో నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. వాళ్లు బైబిలు ప్రతినొకదాన్ని కల్గివుండొచ్చు. వాళ్లు దాని సాహిత్య విలువలనూ, చారిత్రక విలువలనూ గుర్తించి ఉండొచ్చు. కానీ అనేకమందికైతే, అనేకమందికైతే, అది బూజుపట్టిన పుస్తకమే. ‘బైబిల్ని చదవడానికి నాకు సమయంలేదని’ కొంతమంది అంటారు. ‘అలాంటి అతి ప్రాచీన గ్రంథం ఎలా నా జీవితానికి సంబంధించినదై ఉండగలదు?’ అని ఇతరులు ఆలోచనలో పడతారు. అలాంటి అభిప్రాయాలు మనకొక నిజమైన సవాలుగా నిలుస్తాయి. బైబిలు “దైవావేశము వలన కలిగిన[దనీ,] . . . ఉపదేశించుటకు . . . ప్రయోజనకరమై యున్న[దనీ]” యెహోవాసాక్షులు దృఢంగా విశ్వసిస్తారు. (2 తిమోతి 3:16) అయితే, జాతి, తెగ, వర్గ నేపథ్యాలేవైనా సరే, బైబిల్ని పరిశీలించేలా ప్రజలను మనమెలా ఒప్పించగలం?

3 బైబిలు మన పరిశీలనకు యోగ్యమైనదనడానికి గల కొన్ని కారణాలను మనం చర్చిద్దాం. ఇలాంటి చర్చ పరిచర్య చేస్తున్నప్పుడు మనం కలుసుకొనబోయే వారితో తర్కించడానికి మనల్ని సంసిద్ధుల్ని చేయగలదు, బైబిలు చెబుతున్నదాన్ని పరిశీలించేలా వారిని బహుశా ఒప్పించగలదు. అదే సమయంలో, బైబిలు తాను చెప్పుకుంటున్నట్లుగా అది నిజంగానే “దేవుని వాక్యము” అనే మన సొంత విశ్వాసాన్ని ఈ పునఃసమీక్ష బలపర్చాలి.—హెబ్రీయులు 4:12.

ప్రపంచంలో అత్యధికంగా పంచిపెట్టబడిన గ్రంథం

4. అత్యంత విస్తృతంగా పంచిపెట్టబడిన గ్రంథం బైబిలేనని ఎందుకు చెప్పవచ్చు?

4 మొదటి కారణం, ఇంతవరకూ మానవ చరిత్రలోనే అత్యంత విస్తృతంగా పంచిపెట్టబడిన, ఎక్కువ భాషల్లోకి అనువదించబడిన గ్రంథం బైబిలే గనుక అది పరిశీలనకు తగినదే. 500కన్నా ఎక్కువ సంవత్సరాల క్రిందట, ముద్రణ కొరకు ఉపయోగించే టైప్‌ ఫేసుల్ని సులభంగా మార్చుకోవడానికి వీలయ్యే విధంగా మార్చబడిన, యోహానస్‌ గూటెన్‌బర్గ్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో మొదటి బైబిలు ప్రతి ముద్రించబడింది. అప్పటినుండీ 400 కోట్ల బైబిలు ప్రతులు—పూర్తి బైబిలుగానీ లేక దాన్లో కొన్ని భాగాలుగానీ—ముద్రించబడ్డాయని అంచనావేయబడింది. 1996 నాటికి పూర్తి బైబిల్నిగానీ లేక దానిలోని కొన్ని భాగాల్నిగానీ 2,167కన్నా ఎక్కువ భాషల్లోకీ మాండలికాల్లోకీ అనువదించడం జరిగింది.a మానవజాతిలోని 90 శాతంకన్నా ఎక్కువ మంది ప్రజలు, బైబిల్లోని కనీసం కొంత భాగాన్నైనా తమ సొంత భాషలో చదువుకోవడానికి అవకాశమేర్పడింది. ఏ ఇతర గ్రంథమూ, అది మతపరమైనదైనా కాకపోయినా సరే, దీని దరిదాపులకు కూడా చేరుకోలేదు!

5. బైబిలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని మనం ఎందుకు ఎదురుచూడాలి?

5 బైబిలు దేవుని వాక్యమని గణాంక వివరణలు మాత్రమే రుజువు చేయలేవు. అయితే, దేవుని ప్రేరేపిత రాత నివేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని మనం నిశ్చయంగా ఎదురుచూడాలి. బైబిలే మనకిలా చెబుతోంది: “దేవుడు పక్షపాతి కా[డు] . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35) ఇతర గ్రంథాలవలెగాక, బైబిలు అనేక దేశాల సరిహద్దుల్ని దాటి, జాతి వర్గ ప్రతిబంధకాలను అధిగమించింది. నిజంగా, బైబిలు సర్వమానవాళి కొరకైన గ్రంథం.

భద్రపర్చబడిన విధానాన్ని గూర్చిన అసమానమైన రికార్డు

6, 7. బైబిలు మూల ప్రతుల్లో ఏవీ ఉనికిలో లేకపోవడం ఎందుకు ఆశ్చర్యపర్చనక్కర్లేదు, మరి ఇది ఏ ప్రశ్నను లేవదీస్తుంది?

6 బైబిలు పరిశీలనకు యోగ్యమైనదనడానికి మరొక కారణం ఉంది. అది ప్రకృతిసిద్ధమైన ఆటంకాలనూ, మానవ ఆటంకాలనూ తప్పించుకొని నిలిచింది. తీవ్రమైన అవరోధాలను ఎదుర్కున్నా అది భద్రపర్చబడిన విధానాన్ని గూర్చిన రికార్డు, ప్రాచీన గ్రంథాల్లో నిజంగా అసమానమైనది.

7 బైబిలు రచయితలు తమ మాటలను సిరాతో (పపైరస్‌ అనే పేరుగల ఈజిప్షియన్‌ మొక్కనుండి చేయబడిన) పపైరస్‌పైనా, (జంతు చర్మాలనుండి చేయబడిన) పార్చమెన్ట్‌పైనా రాసినట్లు రుజువుల్నిబట్టి తెలుస్తోంది.b (యోబు 8:11) అయితే, రాతకు ఉపయోగించబడిన అలాంటి పదార్థాలకు ప్రకృతిసిద్ధమైన శత్రువులున్నాయి. ఆస్కార్‌ పారట్‌ అనే పండితుడు ఇలా వివరిస్తున్నాడు: “రాతకు ఉపయోగించబడే ఈ రెండు పదార్థాలూ తేమవల్లా, బూజువల్లా, వివిధ పురుగులవల్లా కలిగే ఒకే విధమైన అపాయంలో ఉన్నాయి. ఆరుబయటగానీ లేక తేమవున్న గదిలోగానీ ఉన్న కాగితమూ, దృఢంగావున్న తోలు సహితం ఎంత సుళువుగా పాడైపోతాయో దైనందిన జీవితానుభవమునుబట్టి మనకు బాగా తెలుసు.” కాబట్టి మూల ప్రతుల్లో ఏవీ ఉనికిలో ఉన్నట్టు తెలియకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు; అవి బహుశా ఎంతో కాలం క్రిందటే శిథిలమైపోయి ఉంటాయి. అయితే, బైబిలు మూల ప్రతులు ప్రకృతిసిద్ధమయిన శత్రువుల చేతిలో నాశనమైనట్లైతే, బైబిలు ఎలా తప్పించుకొని నిలిచింది?

8. శతాబ్దాలుగా, బైబిలు రాతలు ఎలా భద్రపర్చబడ్డాయి?

8 మూల రాతప్రతులు రాయబడిన వెంటనే, చేతిరాత నకళ్లను తయారుచేయడం ఆరంభమైంది. ధర్మశాస్త్రాన్నీ, పరిశుద్ధ లేఖనాల్లోని ఇతర భాగాలనూ నకలురాయడం ప్రాచీన ఇశ్రాయేలులో నిజానికో వృత్తిగా మారింది. ఉదాహరణకు, యాజకుడైన ఎజ్రా “మోషేయొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రి” అని వర్ణించబడ్డాడు. (ఎజ్రా 7:6, 11; పోల్చండి కీర్తన 45:1.) అయితే, రాయబడిన ఆ నకళ్లు కూడా నశ్వరమైనవే; చివరకు వాటిని కూడా ఇతర చేతిరాత ప్రతులలోకి తిరగరాయాల్సి వచ్చేది. ఇలా నకళ్లకు ప్రతి నకళ్లను రాసే పద్ధతి శతాబ్దాల తరబడి కొనసాగింది. మానవులు పరిపూర్ణులుకారు గనుక లేఖికులు చేసిన తప్పులు బైబిలు మూల పాఠాన్ని తీవ్రంగా మార్చేశాయా? మార్చలేదని కోకొల్లలుగా లభ్యమౌతున్న రుజువులు చెబుతున్నాయి!

9. బైబిలు లేఖికులు చూపిన అత్యంత శ్రద్ధనూ, కచ్చితత్వాన్నీ మసరెట్‌ల మాదిరి ఎలా ఉదాహరించింది?

9 లేఖికులు నకళ్లు రాయడంలో మంచి ప్రావీణ్యాన్ని కల్గివుండడమేగాక తాము నకలురాసే మాటల ఎడల వారు అపారమైన గౌరవాన్ని కల్గివుండేవారు. “లేఖికుడు” అని అనువదించబడిన హెబ్రీ పదమనేది లెక్కించడంతో, రాయడంతో సంబంధంవున్న పదం. లేఖికులు చూపిన అత్యంత శ్రద్ధనూ, కచ్చితత్వాన్నీ ఉదాహరించేందుకు సా.శ. ఆరవ శతాబ్దానికీ, పదవ శతాబ్దానికీ మధ్య కాలంలో జీవించిన, [హెబ్రీ] లేఖనాల లేఖికులైన మసరెట్‌లను పరిశీలించండి. పండితుడు థామస్‌ హార్ట్‌వల్‌ హొర్న్‌ చెప్పినట్లుగా, “హెబ్రీ లేఖనాలన్నింటిలో హెబ్రీ అక్షరమాలనందలి ఒక్కో అక్షరం ఎన్నిసార్లు కన్పిస్తుందో” వాళ్లు లెక్కించేవారు. దాని భావం ఏమైవుందో ఆలోచించండి! ఒక్క అక్షరమైనా వదిలివేయబడకుండా జాగ్రత్త తీసుకునేందుకు, అంకితభావంగల ఈ లేఖికులు తాము నకలురాసే పదాల్ని మాత్రమేగాక అక్షరాల్ని కూడా లెక్కపెట్టారు. ఒక పండితుని అంచనా ప్రకారంగా, వాళ్లు హెబ్రీ లేఖనాల్లో మొత్తం 8,15,140 అక్షరాల్ని లెక్కించినట్లు భోగట్టా! అలాంటి శ్రద్ధతోకూడిన కృషి అత్యున్నతమైన కచ్చితత్వానికి హామీనిస్తుంది.

10. ఆధునిక అనువాదాలు వేటిపై ఆధారపడ్డాయో ఆ హెబ్రీ గ్రీకు పాఠ్య గ్రంథాలు, మూల రచయితల పదాలకు కచ్చితంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయనడానికి ఏ శక్తివంతమైన రుజువుంది?

10 నిజానికి, ఆధునిక అనువాదాలు వేటిపై ఆధారపడ్డాయో ఆ హెబ్రీ గ్రీకు పాఠ్య గ్రంథాలు, మూల రచయితల పదాలకు విశేషమైన నమ్మకత్వంతో ప్రాతినిధ్యం వహిస్తున్నాయని విశ్వసించడానికి శక్తివంతమైన రుజువుంది. ఆ రుజువు, తప్పించుకొని మన కాలం వరకూ నిలిచివున్న బైబిలు చేతిరాతప్రతుల వేలాది నకళ్లలో అంటే, మొత్తంగాగానీ లేక కొన్ని భాగాలుగాగానీ లభ్యమౌతున్నాయని అంచనావేయబడిన 6,000 హెబ్రీ లేఖన ప్రతుల్లోనూ, దాదాపు 5,000 క్రైస్తవ గ్రీకు లేఖన ప్రతుల్లోనూ కనబడుతోంది. ఉనికిలో ఉన్న అనేక చేతిరాత ప్రతులను జాగ్రత్తగానూ, తులనాత్మకంగానూ విశ్లేషణ చేయడం, మూలపాఠ్య పండితులు నకళ్ళు రాసిన వారు చేసిన తప్పుల్ని పట్టుకొని, అసలు గ్రంథంలోని విషయాన్ని నిర్ధారించగలిగేలా చేసింది. అందుకే, హెబ్రీ లేఖనాల మూల పాఠంపై వ్యాఖ్యానిస్తూ, పండితుడు విలియమ్‌ హెచ్‌. గ్రీన్‌ ఈ విధంగా చెప్పగలిగాడు: “ప్రాచీనకాలానికి చెందిన ఏ ఇతర గ్రంథమూ ఇంత ఖచ్చితంగా అందించబడలేదని నిర్వివాదంగా చెప్పవచ్చు.” క్రైస్తవ గ్రీకు లేఖనాల విషయంలో కూడా అదే విధమైన నమ్మకాన్ని ఉంచవచ్చు.

11. మొదటి పేతురు 1:24, 25ల వెలుగులో, ఏ కారణాన్నిబట్టి బైబిలు మన కాలం వరకూ తప్పించుకొని నిలిచివుంది?

11 మూల ప్రతుల స్థానంలో చేతిరాత ప్రతులు—వాటిలో ఉన్న అమూల్యమైన సందేశంతోపాటుగా—రాకపోయినట్లైతే బైబిలు ఎంత సులభంగా నాశనమైపోయి ఉండేదో కదా! అది తప్పించుకొని నిలచి ఉండడానికి గల ఏకైక కారణం యెహోవా తన వాక్యాన్ని భద్రపర్చి, కాపాడడమే. 1 పేతురు 1:24లో బైబిలే ఇలా చెబుతోంది: “సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.”

మానవాళి సజీవ భాషల్లోకి

12. శతాబ్దాలుగా చేతితో నకళ్లు ప్రతినకళ్లు రాయబడడమేగాక, బైబిలు ఎదుర్కొన్న మరొక ఆటంకం ఏమిటి?

12 శతాబ్దాల తరబడి నకళ్లకు ప్రతినకళ్లు రాయబడిన తర్వాత కూడా తప్పించుకొని నిలిచివుండడమే ఎంతో సవాలుతో కూడినదై ఉండగా, బైబిలు మరొక ఆటంకాన్ని అంటే సమకాలీన భాషల్లోనికి అనువదించబడే విషయంలో ఆటంకాన్ని ఎదుర్కొంది. ప్రజల హృదయాలను చేరేలా బైబిలు వారి భాషల్లో మాట్లాడాలి. అయితే, బైబిల్ని అనువదించడం—దానిలోవున్న 1,100 కన్నా ఎక్కువ అధ్యాయాల్నీ, 31,000 కన్నా ఎక్కువ వచనాల్నీ అనువదించడం—అంత సులభమైన విషయం కాదు. అయినప్పటికీ, అంకితభావంగల అనువాదకులు శతాబ్దాలుగా ఈ సవాలును ఆనందంగా చేపట్టారు. కొన్నిసార్లు అధిగమించలేనివన్నట్లు అనిపించిన అవాంతరాలను ఎదుర్కున్నారు.

13, 14. (ఎ) ఆఫ్రికాలో 19వ శతాబ్దపు తొలి భాగంలో బైబిలు అనువాదకుడైన రాబర్ట్‌ మఫత్‌ ఏ సవాల్ని ఎదుర్కొన్నాడు? (బి) లూకా సువార్త స్వానా భాష మాట్లాడే ప్రజలకు తమ సొంత భాషలో అందుబాటులోనికి వచ్చినప్పుడు వాళ్లెలా ప్రతిస్పందించారు?

13 ఉదాహరణకు, ఆఫ్రికా భాషల్లోనికి బైబిలు ఎలా అనువదించబడిందో పరిశీలించండి. 1800 సంవత్సరంలో, ఆఫ్రికా మొత్తం మీదచూస్తే దాదాపు ఓ డజను భాషలకు మాత్రమే లిపి ఉండేది. వాడుకలోవున్న వందలాది ఇతర భాషలకు లిపిలేదు. రాబర్ట్‌ మఫత్‌ వంటి బైబిలు అనువాదకులు ఎదుర్కొన్న సవాలిదే. 1821లో, మఫత్‌ తన 25వ ఏట, దక్షిణాఫ్రికాలో స్వానా భాష మాట్లాడే ప్రజలమధ్య ప్రచారపు పనిని ప్రారంభించాడు. లిపిలేని వారి భాషను నేర్చుకునేందుకు, ఆయన ప్రజల్లో కలిసిపోయేవాడు. మఫత్‌ పట్టుదలను విడువలేదు. బాలశిక్షల లేక నిఘంటువుల సహాయంలేకుండానే చివరకు ఆయన భాషపై పట్టును సంపాదించి, దానికి లిపిని రూపొందించాడు. కొంతమంది స్వానా దేశస్థులకు ఆ లిపిని చదవడం నేర్పించాడు. స్వానావారి మధ్య ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన తర్వాత, 1829లో మఫత్‌ లూకా సువార్తను అనువదించడం పూర్తిచేశాడు. అటు తర్వాత ఆయనిలా తెలియజేశాడు: “పరిశుద్ధ లూకా [సువార్త] ప్రతుల్ని తీసుకునేందుకు ప్రజలు వందలాది మైళ్ల దూరం నుండి రావడం నాకు తెలుసు. . . . వాళ్లు పరిశుద్ధ లూకా [సువార్త] ప్రతుల్ని తీసుకొని, వాటిని పట్టుకొని ఏడ్వడాన్నీ, వాటిని గుండెలకు హత్తుకోవడాన్నీ, కృతజ్ఞతా బాష్పాల్ని రాల్చడాన్నీ చూశాను. ‘మీరు మీ కన్నీళ్లతో మీ పుస్తకాల్ని పాడుచేసుకుంటారు’ అని నేను ఎంతోమందితో చెప్పేంతవరకూ వాళ్లలాగే చేశారు.” లూకా సువార్తను చదువుతున్న అనేకమంది ప్రజల్ని చూసి, మీ దగ్గరున్నది ఏమిటని వారిని అడిగిన ఒక ఆఫ్రికా వ్యక్తి గురించి మఫత్‌ చెప్పాడు. ఆయన అడిగిన ఆ ప్రశ్నకు వాళ్లు “ఇది దేవుని వాక్యం” అని ప్రత్యుత్తరమిచ్చారు. “అది మాట్లాడుతుందా?” అని ఆయన అడిగాడు. “అవును, అది హృదయాలతో మాట్లాడుతుంది” అని వాళ్లు చెప్పారు.

14 మఫత్‌ వంటి అంకితభావంగల అనువాదకులు, అనేకమంది ఆఫ్రికన్లకు రాతపూర్వకంగా సంభాషణను సాగించే మొట్టమొదటి అవకాశాన్ని ఇచ్చారు. అయితే, అనువాదకులు ఆఫ్రికా ప్రజలకు మరింత విలువైన ఓ బహుమానాన్ని అంటే వాళ్ల సొంత భాషలో బైబిల్ని ఇచ్చారు. అంతేగాక, మఫత్‌ స్వానా భాషకు దైవికనామాన్ని పరిచయంచేసి, దాన్ని తన అనువాదమంతటిలో సంగతంగా ఉపయోగించాడు.c ఆ విధంగా, స్వానా ప్రజలు బైబిల్ని “యెహోవా నోరు” అని పిలిచారు.—కీర్తన 83:18.

15. బైబిలు నేడు మరింత సజీవంగా ఎందుకుంది?

15 ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇతర అనువాదకులు ఇదే విధమైన ఆటంకాల్ని ఎదుర్కొన్నారు. బైబిల్ని అనువదించేందుకు కొంతమంది తమ ప్రాణాల్ని కూడా పణంగా పెట్టారు. దీన్ని గురించి ఆలోచించండి: బైబిలు ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో మాత్రమే ఉండివుంటే, అది ఎప్పుడో “గతించిపోయి” ఉండేది, ఎందుకంటే కాలక్రమేణా ఆ భాషలను ప్రజలు పూర్తిగా మర్చిపోయారు, భూమిమీద అనేక ప్రాంతాల్లో ఆ భాషల గురించి తెలియనే తెలియదు. కానీ, బైబిలు సజీవంగా ఉంది, ఎందుకంటే ఏ ఇతర గ్రంథంవలేగాక అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో వారి సొంతభాషలో ‘మాట్లాడగలదు.’ తత్ఫలితంగా, దాని సందేశం ‘[దాని] విశ్వాసులలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.’ (1 థెస్సలొనీకయులు 2:13) ది జెరూసలేమ్‌ బైబిల్‌ ఇలా అనువదించింది: “దాన్ని విశ్వసించు మీలో అది ఇప్పటికీ సజీవమైన శక్తిగా నిలిచివుంది.”

విశ్వాసయోగ్యమైనది

16, 17. (ఎ) బైబిలు విశ్వసించదగినదై ఉండాలంటే, ఏ రుజువు ఉండాలి? (బి) బైబిలు రచయితయైన మోషే నిష్కాపట్యాన్ని ఉదాహరించడానికి ఒక ఉదాహరణను ఇవ్వండి.

16 ‘బైబిలు నిజంగా విశ్వసించదగినదేనా?’ అని కొందరు ఆలోచనలో పడవచ్చు. ‘నిజంగా జీవించిన ప్రజల్నీ, అసలు ఉనికిలోవున్న స్థలాల్నీ, మరి వాస్తవంగా జరిగిన సంఘటనల్నీ ఇది తెలియజేస్తోందా?’ మనం దాన్ని విశ్వసించాలంటే, అది జాగ్రత్తగల, నిజాయితీపరులైన రచయితలచే రాయబడిందనడానికి రుజువుండాలి. బైబిల్ని పరిశీలించడానికి గల మరొక కారణానికి ఇది మనల్ని నడిపిస్తుంది: ఇది కచ్చితమైనదీ విశ్వసించదగినదీ అనడానికి బలమైన రుజువుంది.

17 నిజాయితీపరులైన రచయితలు కేవలం విజయాల్నేగాక పరాజయాల్నీ, సాఫల్యాల్నేగాక వైఫల్యాల్నీ నివేదిస్తారు. బైబిలు రచయితలు అలాంటి నిష్పక్షపాత వైఖరిని చూపించారు. ఉదాహరణకు, మోషే నిష్కాపట్యాన్ని పరిశీలించండి. విశ్వసనీయంగా మోషే నివేదించిన విషయాల్లో ఆయనకు వాక్పటిమలేకపోవడం అంటే ఆయన దృక్కోణం నుండి చూస్తే తనను ఇశ్రాయేలు నాయకునిగా అనర్హుణ్ణి చేసిన విషయమూ (నిర్గమకాండము 4:10); వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా ఆయన్ను ఆటంకపర్చిన ఆయన చేసిన గంభీరమైన తప్పిదమూ (సంఖ్యాకాండము 20:9-12; 27:12-14); బంగారు దూడ విగ్రహాన్ని చేయడంలో తిరుగుబాటు దారులైన ఇశ్రాయేలీయులకు సహకరించిన తన సహోదరుడైన అహరోను ప్రక్కదారి పట్టిన వైనమూ (నిర్గమకాండము 32:1-6); తన సహోదరియైన మిర్యాము చేసిన తిరుగుబాటూ, ఆమె పొందిన అవమానకరమైన శిక్షా (సంఖ్యాకాండము 12:1-3, 10); తన అన్న కుమారులైన నాదాబు అబీహుల నిర్లక్ష్యవైఖరీ (లేవీయకాండము 10:1, 2); దేవుని ప్రజలు పదేపదే ఫిర్యాదుచేయడమూ, సణుక్కోవడమూ చేరివున్నాయి. (నిర్గమకాండము 14:11, 12; సంఖ్యాకాండము 14:1-10) అలా నిష్కపటంగానూ, యథార్థంగానూ నివేదించడం సత్యం ఎడల ఉన్న యథార్ధమైన శ్రద్ధను సూచించడంలేదా? బైబిలు రచయితలు తాము ప్రేమించిన వ్యక్తులను గూర్చిన, తమ ప్రజలను గూర్చిన, చివరకు తమ్మును గూర్చిన ప్రతికూలమైన వాటిని నివేదించడానికి సుముఖతను చూపించారు గనుక వారి రచనల్ని విశ్వసించడానికి తగిన కారణం లేదంటారా?

18. బైబిలు రచయితల రచనలు విశ్వసించదగినవని ఏది ధ్రువపరుస్తుంది?

18 బైబిలు రచయితలు చూపించిన అనుగుణ్యత కూడా వారి రచనలు విశ్వసించదగినవని ధ్రువపరుస్తాయి. దాదాపు 1,600 సంవత్సరాల కాలనిడివిలో నలభైమంది వ్యక్తులు చేసిన రచనల్లో, మరీ చిన్న చిన్న వివరణల విషయంలో కూడా పొందిక కలిగి ఉండడం నిజంగా గమనార్హమైన విషయం. అయితే, ఈ పొందిక లాలూచీ పడ్డారేమోననే సందేహాల్ని రేకెత్తించేలా ఎంతో జాగ్రత్తగా ఏర్పర్చింది కాదు. దానికి భిన్నంగా, వివిధ వివరణల్లోని పొందిక ఉద్దేశపూర్వకమైనది కాదనే విషయం సుస్పష్టమే; తరచుగా ఈ పొందికనేది అనుకోకుండా జరిగినదే.

19. యేసు అప్పగించబడడాన్ని గూర్చిన సువార్త వృత్తాంతాలు, వాటి మధ్యనున్న పొందిక స్పష్టంగా ఉద్దేశపూర్వకమైనది కాదని ఎలా బయల్పరుస్తున్నాయి?

19 ఉదాహరణకు, యేసు అప్పగించబడిన రాత్రి జరిగిన ఒక సంఘటనను పరిశీలించండి. శిష్యుల్లో ఒకరు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుణ్ణి కొట్టి వాని చెవిని తెగనరికారని సువార్త రచయితలు నలుగురూ నివేదించారు. అయితే, యేసు “వాని చెవి ముట్టి బాగుచేసెను” అని లూకా మాత్రమే మనకు చెబుతున్నాడు. (లూకా 22:51) కానీ “ప్రియుడైన వైద్యుడు” అని పిలువబడిన రచయిత నుండి మనం ఎదురు చూసేదదే కాదంటారా? (కొలొస్సయులు 4:14) అక్కడున్న శిష్యులందరిలో ఖడ్గాన్ని ఉపయోగించింది పేతురేనని యోహాను వృత్తాంతం మనకు చెబుతోంది, దూకుడుతనంగానూ, ఉద్రేకిగానూ ఉండే పేతురు స్వభావరీత్యా చూస్తే, ఆ వాస్తవం ఆశ్చర్యాన్ని కల్గించదు. (యోహాను 18:10; పోల్చండి మత్తయి 16:22, 23, యోహాను 21:7, 8.) అనవసరమన్నట్లుగా కనబడుతున్న ఓ వివరణను యోహాను ఇలా నివేదిస్తున్నాడు: “ఆ దాసునిపేరు మల్కు.” యోహాను మాత్రమే ఆ వ్యక్తి పేరును ఎందుకు తెలియజేశాడు? ఆ వివరణ, కొన్ని వచనాల తర్వాత యోహాను వృత్తాంతంలో మాత్రమే ఈ క్రింది విధంగా తెలియజేయబడిన ఓ అప్రధానమైన వాస్తవం ద్వారా ఇవ్వబడింది: యోహాను “ప్రధానయాజకునికి నెళవైనవాడు.” ఆయన ప్రధానయాజకుని ఇంటివారికి కూడా నెళవైనవాడే; సేవకులకు ఆయనతో పరిచయంవుంది, మరి ఆయనకూ వారితో పరిచయంవుంది.d (యోహాను 18:10, 15, 16) కాబట్టి, ఆ గాయపడిన వ్యక్తి ఇతర సువార్త రచయితలకు పరిచయం లేనందున వాళ్లు అతని పేరును ప్రస్తావించకపోగా యోహాను మాత్రమే అతని పేరును ప్రస్తావించడం సహజమే. ఈ వివరణల మధ్యనున్న పొందిక విశేషమైనది, అయినా, అది స్పష్టంగా ఉద్దేశపూర్వకమైనది కాదు. అలాంటి ఉదాహరణలు బైబిలంతటిలో అనేకం ఉన్నాయి.

20. యథార్థహృదయులైన ప్రజలు బైబిలు గురించి ఏం తెలుసుకోవాల్సిన అవసరముంది?

20 కాబట్టి మనం బైబిల్ని నమ్మగలమా? తప్పకుండా! బైబిలు రచయితల నిష్పక్షపాతవైఖరీ, బైబిల్లో అంతర్గతంగావున్న పొందికా, సత్యం యొక్క దోషరహితమైన స్వభావాన్ని గూర్చిన ‘వాఙ్మూలాన్ని’ ఇస్తున్నాయి. బైబిలు ‘సత్యదేవుడైన యెహోవా’ ప్రేరేపిత వాక్యం గనుక దాన్ని తాము విశ్వసించవచ్చని యథార్థహృదయులైన ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముంది. (కీర్తన 31:5) బైబిలు సర్వమానవాళి కొరకైన గ్రంథమని చెప్పడానికి మరితర కారణాలున్నాయి, వాటిని తర్వాతి శీర్షిక చర్చిస్తుంది.

[అధస్సూచీలు]

a గణాంక వివరణలు యునైటెడ్‌ బైబిల్‌ సొసైటీస్‌ ప్రచురించిన లెక్కలపై ఆధారపడి ఉన్నాయి.

b తాను రోమ్‌లో రెండవసారి ఖైదులో ఉన్న కాలంలో, పౌలు “పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని” రమ్మని తిమోతిని అడిగాడు. (2 తిమోతి 4:13) పౌలు తాను ఖైదులో ఉన్న కాలంలో వాటిని పఠించగలిగేలా ఆయన బహుశా హెబ్రీ లేఖనాల్లో భాగాలను తీసుకొని రమ్మని అడుగుతున్నాడు. “ముఖ్యంగా చర్మపు కాగితములు” అనే పదబంధం, పపైరస్‌ పుస్తకాలూ, మరితర చర్మపు పుస్తకాలూ చేరివున్నాయని సూచించవచ్చు.

c 1838లో, మఫత్‌ క్రైస్తవ గ్రీకు లేఖనాల అనువాదాన్ని పూర్తిచేశాడు. తోటిపనివాని సహాయంతో, 1857లో ఆయన హెబ్రీ లేఖనాల్ని అనువదించడం పూర్తిచేశాడు.

d ప్రధాన యాజకునితోనూ, అతని ఇంటివారితోనూ యోహానుకున్న పరిచయం ఆ వృత్తాంతంలో తర్వాత చూపించబడింది. ప్రధాన యాజకుని సేవకుల్లో మరొకడు పేతురు యేసుతోపాటు ఉన్న శిష్యుల్లో ఒకడని ఫిర్యాదు చేసినప్పుడు, ఆ ఫిర్యాదు చేసిన దాసుడు “పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువు” అని యోహాను వివరిస్తున్నాడు.—యోహాను 18:26.

మీరెలా జవాబిస్తారు?

◻ బైబిలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉండాల్సిన గ్రంథంగా ఉండాలని మనం ఎందుకు అపేక్షించాలి?

◻ బైబిలు కచ్చితమైన రీతిలో భద్రపర్చబడిందనడానికి ఏ రుజువు ఉంది?

◻ బైబిల్ని అనువదించిన వాళ్లు ఏ ఆటంకాల్ని ఎదుర్కొన్నారు?

◻ బైబిలు రచనలు విశ్వసించదగినవని ఏది ధ్రువపరుస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి