కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 4/15 పేజీలు 20-23
  • బర్నబా—“ఆదరణ పుత్రుడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బర్నబా—“ఆదరణ పుత్రుడు”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉదారతగల సహాయకుడు
  • అంతియొకయలో
  • ఒక ప్రత్యేక మిషనరీ నియామకం
  • సున్నతిని గురించిన వివాదం
  • “తీవ్రమైన వాదము”
  • ‘పవిత్రశక్తితో, సంతోషంతో నింపబడ్డారు’
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • ‘యెహోవా అధికారంతో ధైర్యంగా మాట్లాడారు’
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • యెహోవా ప్రజలు విశ్వాసమందు స్థిరపరచబడిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • క్రైస్తవ మిషనరీ సేవకు ప్రేరేపిత లేఖన మాదిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 4/15 పేజీలు 20-23

బర్నబా—“ఆదరణ పుత్రుడు”

ఒక స్నేహితుని నుండి మీరు చివరిసారి ఆదరణ పొందింది ఎప్పుడు? మీరు ఎవరికైనా ఇటీవలనే ఎప్పుడు ఆదరణనిచ్చారో జ్ఞాపకముందా? మనందరికీ అప్పుడప్పుడూ ప్రోత్సాహం అవసరమౌతుంది, దాన్ని ప్రేమపూర్వకంగా అందించే వారిని మనమెంతగా మెచ్చుకుంటామో కదా! ఆదరణనివ్వడం అనేది వినేందుకూ, అర్థం చేసుకునేందుకూ, సహాయపడేందుకూ సమయాన్ని వెచ్చించడమనే భావాన్ని కలిగివుంది. అలా చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?

అలాంటి సంసిద్ధతను ఎంతో ఆదర్శప్రాయమైన రీతిలో ప్రదర్శించిన ఒక వ్యక్తి బర్నబా, ఆయన “పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు.” (అపొస్తలుల కార్యములు 11:24) బర్నబాను గురించి అలా ఎందుకు చెప్పవచ్చు? ఆ విధమైన వర్ణనకు యోగ్యుడయ్యేందుకు ఆయనేమి చేశాడు?

ఉదారతగల సహాయకుడు

ఆయన అసలు పేరు యోసేపు, అయితే ఆయన స్వభావాన్ని చక్కగా వర్ణించే, “ఆదరణ పుత్రుడు” అనే అర్థంగల బర్నబా అనే వర్ణనాత్మక విశేషనామాన్ని అపొస్తలులు ఆయనకు పెట్టారు.a (అపొస్తలుల కార్యములు 4:36, అధఃస్సూచి) క్రైస్తవ సంఘం అప్పుడే ఏర్పడింది. బర్నబా మునుపు యేసు శిష్యుల్లో ఒకడై ఉండివుంటాడని కొందరు భావిస్తున్నారు. (లూకా 10:1, 2) అది వాస్తవం అయినా కాకపోయినా, ఈ వ్యక్తి మాత్రం చాలా చక్కని రీతిలో ప్రవర్తించాడు.

సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత కొంతకాలానికే, కుప్రకు చెందిన లేవీయుడైన బర్నబా కొంత భూమిని స్వచ్ఛందంగా అమ్మివేసి ఆ డబ్బును అపొస్తలులకిచ్చాడు. ఆయన అలా ఎందుకు చేశాడు? ఆ సమయంలో యెరూషలేములోని క్రైస్తవుల్లో “ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను” అని అపొస్తలుల కార్యములలోని వృత్తాంతం మనకు చెబుతోంది. అవసరత ఉందనే విషయాన్ని బర్నబా గమనించాడని స్పష్టమౌతుంది, దాని గురించి తనకు వీలైనది ఆయన సహృదయంతో చేశాడు. (అపొస్తలుల కార్యములు 4:34-37) ఆయన కాస్తో కూస్తో ఉన్న మనిషే అయివుంటాడు, అయితే రాజ్యాసక్తులను పెంపొందించడానికి ఆయన తన వస్తువులను ఉపయోగించేందుకూ, తాను అందుబాటులో ఉండేందుకూ ఎంతమాత్రమూ సంకోచించలేదు.b “ప్రజలకు ప్రోత్సాహం అవసరమైందని లేక ఆయా పరిస్థితుల్లో ప్రోత్సాహం అవసరమైందని బర్నబా కనుగొన్నప్పుడు, ఆయన తన యథాశక్తి ప్రోత్సహించాడు,” అని ఎఫ్‌. ఎఫ్‌ బ్రూస్‌ చెబుతున్నాడు. ఆయన మనకు కనిపించే రెండవ వృత్తాంతంనుండి ఈ విషయం స్పష్టమౌతుంది.

సా.శ. 36 ప్రాంతంలో, ఈసరికల్లా క్రైస్తవుడైన తార్సువాడైన సౌలు (భవిష్యత్‌ అపొస్తలుడైన పౌలు) యెరూషలేము సంఘాన్ని కలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు “గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.” ఆయన యథార్థంగా మారుమనస్సు చెందాడనీ, అది సంఘాన్ని మరింత వినాశనం చేసేందుకు ఆయన చేసిన కపటోపాయం కాదనీ ఆయన సంఘాన్ని ఎలా ఒప్పించగలడు? “బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలులయొద్దకు తోడుకొని”వచ్చాడు.—అపొస్తలుల కార్యములు 9:26, 27; గలతీయులు 1:13, 18, 19.

బర్నబా సౌలును ఎందుకు నమ్మాడు అనే విషయం చెప్పబడలేదు. ఏది ఏమైనప్పటికీ, సౌలు చెప్పినది విని, నిరాశాజనకమైనదని అనిపించే ఈ పరిస్థితినుండి బయటపడేందుకు ఆయనకు సహాయం చేయడం ద్వారా ఈ “ఆదరణ పుత్రుడు” తన విశేషనామానికి తగిన విధంగా వ్యవహరించాడు. సౌలు తర్వాత తన స్వంత ప్రాంతమైన తార్సుకు తిరిగి వెళ్లినప్పటికీ, ఈ ఇద్దరు పురుషుల మధ్య స్నేహం ఏర్పడింది. రాబోయే సంవత్సరాల్లో, అది ఎంతో ప్రాముఖ్యమైన పర్యవసానాలను కలిగి ఉండవలసి ఉంది.—అపొస్తలుల కార్యములు 9:30.

అంతియొకయలో

సా.శ. 45 ప్రాంతంలో, సిరియానందలి అంతియొకయలో అసాధారణ అభివృద్ధి జరుగుతుందనే వార్త అంటే ఆ నగరంలోని గ్రీకు మాట్లాడే నివాసులు అనేకమంది విశ్వాసులౌతున్నారనే వార్త యెరూషలేముకు చేరుకుంది. ఆ విషయాన్ని పరిశీలించేందుకూ సువార్త పనిని సంస్థీకరించేందుకూ ఆ సంఘం బర్నబాను పంపించింది. వాళ్లు ఎంతో జ్ఞానయుక్తమైన ఎంపిక చేశారు. లూకా ఇలా చెబుతున్నాడు: “అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షమున చేరిరి.”—అపొస్తలుల కార్యములు 11:22-24.

ఆయన చేసింది అంతే కాదు. జూసప్పే రీకోటీ అనే పండితుడి అభిప్రాయం ప్రకారం, “బర్నబా కార్యశూరుడు, అంత చక్కని ఆశాజనకమైన అభివృద్ధి మూలంగా పుష్కలమైన పంటలు పండేలా చేసేందుకు కష్టించి పని చేయవలసిన అవసరముందని ఆయన వెంటనే గుర్తించాడు. కాబట్టి కోత పని వారు ప్రాముఖ్యంగా అవసరమై ఉన్నారు.” బర్నబా కుప్రకు చెందిన వాడు గనుక, అన్యులతో వ్యవహరించడం బహుశ ఆయనకు అలవాటే. అన్యజనులకు ప్రకటించడంలో తాను ప్రత్యేకంగా యోగ్యుడనని ఆయన భావించి ఉండవచ్చు. అయితే ఈ ఉల్లాసవంతమైన, ప్రోత్సాహకరమైన కార్యకలాపంలో ఇతరులను నిమగ్నం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు.

బర్నబా సౌలును జ్ఞాపకం చేసుకున్నాడు. సౌలు మారుమనస్సు చెందినప్పుడు, ఆయన ‘అన్యజనుల యెదుట యేసు నామము భరించుటకు ఏర్పరచబడిన సాధనమైయున్నాడని’ అననీయకు ప్రవచనార్థకంగా బయల్పర్చబడిన విషయాన్ని గురించి బర్నబాకు తప్పకుండా తెలిసే ఉంటుంది. (అపొస్తలుల కార్యములు 9:15) కాబట్టి సౌలును వెదికేందుకు బర్నబా తార్సుకు బయల్దేరాడు, అక్కడకు చేరుకునేందుకు 200 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది. ఒక సంవత్సరం వరకూ వాళ్లిద్దరూ భాగస్వాములుగా కలిసి పని చేశారు, ఈ సమయంలోనే “మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.”—అపొస్తలుల కార్యములు 11:25, 26.

క్లౌదియ చక్రవర్తి పరిపాలనలో, రోమా సామ్రాజ్యంలోని విభిన్న ప్రాంతాల్లో తీవ్రమైన కరవు ఏర్పడింది. యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌ ప్రకారం, యెరూషలేములో “ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైనవేవీ లేనందున అనేకమంది ప్రజలు చనిపోయారు.” కనుకనే, “ప్రతివాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దల యొద్దకు దానిని పంపిరి.” ఆ నియామకాన్ని పూర్తిగా నెరవేర్చిన తర్వాత, ఆ ఇరువురూ యోహాను మార్కుతో పాటూ అంతియొకయకు తిరిగి వచ్చిరి, అక్కడ వారు సంఘంలోని ప్రవక్తలు మరియు బోధకుల్లో సభ్యులుగా పరిగణించబడ్డారు.—అపొస్తలుల కార్యములు 11:29, 30; 12:25; 13:1.

ఒక ప్రత్యేక మిషనరీ నియామకం

అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. “వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ—నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను.” ఒక్కసారి ఆలోచించండి! వీరిరువురికీ ప్రత్యేక నియామకం ఇవ్వబడాలని యెహోవా ఆత్మ ఆజ్ఞాపించింది. “కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూకయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.” కాబట్టి బర్నబాను కూడా అపొస్తలుడని లేక పంపబడిన వాడని పిలవడం సమంజసంగానే ఉంటుంది.—అపొస్తలుల కార్యములు 13:2, 4; 14:14.

కుప్రలో ప్రయాణించి, ఆ ద్వీపం యొక్క రోమా ప్రాంతీయ గవర్నరైన సెర్గి పౌలును క్రైస్తవునిగా మార్చిన తర్వాత, వారు ఆసియా మైనరు యొక్క దక్షిణ తీరంపైనున్న పెర్గేకు బయల్దేరి వెళ్లారు. యోహాను మార్కు వారిని విడిచిపెట్టి యెరూషలేముకు వెళ్ళిపోయింది అక్కడినుండే. (అపొస్తలుల కార్యములు 13:13) బర్నబా మరింత అనుభవంగల భాగస్వామి గనుక, బహుశ అప్పటి వరకూ ఆయనకు ప్రముఖ పాత్ర ఉండినదనిపిస్తుంది. అయితే ఈ సమయంనుండి (ఇప్పుడు పౌలని పిలువబడుతున్న) సౌలు నాయకత్వం తీసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 13:7, 13, 16; 15:2 పోల్చండి.) ఈ మార్పును బట్టి బర్నబా నొచ్చుకొని ఉంటాడా? లేదు, యెహోవా తన భాగస్వామిని కూడా శక్తివంతమైన విధంగా ఉపయోగిస్తున్నాడని సాత్వికంగా గుర్తించగలిగిన పరిణతి గల క్రైస్తవుడు ఆయన. వారి ద్వారా, ఇతర ప్రాంతాలు కూడా సువార్తను వినాలని యెహోవా సంకల్పించాడు.

వాస్తవానికి, పిసిదియానందలి అంతియొకయలో వారిరువురూ కూడా బయటకు వెళ్ళగొట్టబడటానికి ముందు, ఆ ప్రాంతవాసులంతా కూడా పౌలు బర్నబాలనుండి దేవుని వాక్యాన్ని విన్నారు, మరి అనేకులు ఆ వర్తమానాన్ని అంగీకరించారు. (అపొస్తలుల కార్యములు 13:43, 48-52) ఈకొనియలో “అనేకులు, యూదులును గ్రీసు దేశస్థులును విశ్వసించిరి.” అక్కడ కాస్త ఎక్కువ సమయాన్నే గడిపేందుకు, ‘వారిచేత సూచకక్రియలను అద్భుతములను చేయించి, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండిన ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాటలాడుచు’ ఉండేందుకు ఇది పౌలు బర్నబాలను పురికొల్పింది. తమను రాళ్ళు రువ్వి చంపాలని వారు పథకం వేశారనే విషయం తెలుసుకుని, వీరిరువురూ జ్ఞానయుక్తంగా అక్కడనుండి పారిపోయి, లుకయొనియ, లుస్త్ర మరియు దెర్బేలలో తమ పనిని కొనసాగించారు. లుస్త్రలో తమ జీవితాలకే ముప్పు తీసుకొచ్చే అనుభవాలు ఎదురైనప్పటికీ, పౌలు బర్నబాలిరువురూ “శిష్యుల మనస్సులను దృఢపరచి—విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరిం[చడంలో]” కొనసాగారు.—అపొస్తలుల కార్యములు 14:1-7, 19-22.

క్రియాశీలురైన ఈ ఇద్దరు ప్రచారకులూ తమను భయపెట్టేందుకు దేనినీ అనుమతించలేదు. దానికి బదులుగా, వారు ఇదివరకే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్న ప్రాంతాల్లోని క్రొత్త క్రైస్తవులను ప్రోత్సహించేందుకు తిరిగి వచ్చారు. అందులో, బహుశ క్రొత్త సంఘాల్లోని యోగ్యులైన పురుషులు నాయకత్వం వహించేందుకు వారికి సహాయపడటం కూడా చేరివుంది.

సున్నతిని గురించిన వివాదం

సా.శ. 33 పెంతెకొస్తునుండి దాదాపు 16 సంవత్సరాల తర్వాత, సున్నతిని గురించిన వివాదంలోని ఒక ప్రాముఖ్యమైన ఘట్టంలో బర్నబా కూడా ఉన్నాడు. “కొందరు యూదయనుండి [సిరియానందలి అంతియొకయకు] వచ్చి—మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతిపొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.” అది సరికాదని పౌలు బర్నబాలకు తమ అనుభవం ద్వారా తెలుసు, వారు ఆ విషయాన్ని ఖండించారు. తమ అధికారాన్ని నొక్కి చెప్పే బదులు, యావన్మంది సహోదరుల ప్రయోజనం నిమిత్తమై ఈ ప్రశ్నను తేల్చాలని వారు గుర్తించారు. కాబట్టి వారు తమ ప్రశ్నను యెరూషలేములోని పరిపాలక సభకు తెలియజేశారు, అక్కడ వారి నివేదికలు ఆ వివాదాన్ని సరిచేసేందుకు సహాయం చేశాయి. దాని తర్వాత, అంతియొకయలోని సహోదరులకు ఈ నిర్ణయాన్ని గురించి తెలియజేయవలసిన నియామకాన్ని అందుకున్న వారిలో, “మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన . . . మన ప్రియులు” అని పిలువబడిన పౌలు బర్నబాలు కూడా ఉన్నారు. పరిపాలక సభ నుండి వచ్చిన ఈ ఉత్తరం చదువబడి, ప్రసంగాలు ఇవ్వబడిన తర్వాత, సంఘస్థులు “ఆదరణ పొంది సంతోషించిరి” మరియు “స్థిర”పడిరి.—అపొస్తలుల కార్యములు 15:1, 2, 4, 25-32.

“తీవ్రమైన వాదము”

ఆయన్ను గురించిన ఇన్ని అనుకూల వృత్తాంతాలను తెలుసుకున్న తర్వాత, మనం బర్నబా అంత మాదిరికరంగా ఎన్నడూ జీవించలేమని భావించవచ్చు. అయినప్పటికీ, ఈ “ఆదరణ పుత్రుడు” కూడా మనందరి వలెనే అపరిపూర్ణుడై ఉన్నాడు. తానూ పౌలు కలిసి సంఘాలను దర్శించేందుకు రెండవ మిషనరీ యాత్ర ప్రారంభించాలని అనుకుంటుండగా, ఒక అభిప్రాయభేదం తలెత్తింది. బర్నబా తన బంధువైన యోహాను మార్కును తమ వెంట తీసుకెళ్లాలని తీర్మానించాడు, అయితే తమ మొదటి మిషనరీ యాత్రలో యోహాను మార్కు తమను వదిలి వెళ్లిపోయాడు గనుక ఆయన్ను వెంటతీసుకెళ్లడం సరైన విషయం కాదని పౌలు భావించాడు. అప్పుడు “వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను; పౌలు సీలను ఏర్పరచుకొని” మరొక వైపుకు వెళ్లిపోయాడు.—అపొస్తలుల కార్యములు 15:36-40.

ఎంత విచారకరం! అయినప్పటికీ, ఈ సంఘటన మనకు బర్నబా వ్యక్తిత్వాన్ని గురించి ఒక విషయాన్ని చెబుతుంది. “ఆయన సాహసించి, మార్కును రెండవసారి నమ్మేందుకు సిద్ధపడటం బర్నబా వ్యక్తిత్వంలోని ఒక ఉన్నతమైన లక్షణంగానే పరిగణించబడుతుంది” అని ఒక పండితుడు చెబుతున్నాడు. ఆ రచయిత సూచిస్తున్న విధంగా, “మార్కుపై బర్నబా ఉంచిన విశ్వాసం మార్కు యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి” ఉంటుంది, మరియు “మార్కు సరిక్రొత్త దీక్షతో పని చేసేందుకు ఆయన్ని ప్రోత్సహించి” ఉంటుంది. ఆయన అలా నమ్మకాన్ని ప్రదర్శించడం సబబైన విషయంగా రుజువైంది, ఎందుకంటే క్రైస్తవ సేవలో మార్కు ఎంత ఉపయుక్తంగా ఉన్నాడనే విషయాన్ని పౌలు కూడా తర్వాత అంగీకరించాడు.—2 తిమోతి 4:11; కొలొస్సయులు 4:10 పోల్చండి.

కృంగిన వారి మాటలను వినేందుకు, వారిని అర్థం చేసుకునేందుకూ మరియు వారిని ప్రోత్సహించేందుకూ అలాగే ఏదైనా అవసరతను మనం గమనించినప్పుడు ఆచరణాత్మక సహాయాన్ని అందించేందుకూ బర్నబా యొక్క ఉదాహరణ మనలను పురికొల్పగలదు. తన సహోదరులకు సాత్వికంతోనూ ధైర్యంతోనూ సేవ చేసేందుకు ఆయనలో ఉన్న సుముఖతను గూర్చిన నివేదిక, అలాగే అది తీసుకువచ్చిన చక్కని ఫలితాలు కూడా మనకు ఎంతో గొప్ప ప్రోత్సాహమై ఉన్నాయి. నేడు మన సంఘాల్లో బర్నబావంటి వారిని కలిగి ఉండటం ఎంత గొప్ప దీవెనో కదా!

[అధస్సూచీలు]

a ఫలానా లక్షణం యొక్క “పుత్రుడు” అని ఎవరినైనా పిలవడం ఒక శ్రేష్ఠమైన గుణాన్ని నొక్కి చెబుతుంది. (ద్వితీయోపదేశకాండము 3:18, NW అధఃస్సూచి చూడండి.) మొదటి శతాబ్దంలో, ఒక వ్యక్తికున్న లక్షణాల వైపుకు అవధానాన్ని మళ్లించేందుకు విశేషనామాలను ఉపయోగించడం ఎంతో సాధారణమైన విషయం. (మార్కు 3:17 పోల్చండి.) అది ఒక విధంగా వారి గుర్తింపుగా ఉండేది.

b మోషే ధర్మశాస్త్రం ద్వారా స్థాపించబడిన విషయాన్ని పరిగణిస్తూ, లేవీయుడైన బర్నబాకు తన స్వంత భూమి ఎలా వచ్చిందని కొందరు ప్రశ్నించారు. (సంఖ్యాకాండము 18:20) అయితే, ఆ ఆస్తి పాలస్తీనాలోనిదా లేక కుప్రలోనిదా అనే సంగతి స్పష్టంగా లేదనే విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా, యెరూషలేము ప్రాంతంలో ఒక భూస్థాపనా స్థలాన్ని బర్నబా సంపాదించి ఉండే సాధ్యత కూడా ఉంది. సంగతేదైనప్పటికీ, ఇతరులకు సహాయం చేసేందుకు బర్నబా తన ఆస్తిని వదులుకున్నాడు.

[23వ పేజీలోని చిత్రం]

బర్నబా “పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి