కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 7/15 పేజీలు 29-31
  • “విధేయ హృదయం” మీకుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “విధేయ హృదయం” మీకుందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్ళకు విధేయ హృదయం ఉండింది
  • పాక్షిక విధేయత సరిపోదు
  • మీ విధేయత ఎంత సంపూర్ణమైనది?
  • విధేయ హృదయం ఆశీర్వాదాలను తెస్తుంది
  • మీ విధేయతను యెహోవా అమూల్యమైనదిగా పరిగణిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • “హృదయపూర్వకముగా లోబడి” ఉండేలా ఇతరులకు సహాయం చేయండి
    మన రాజ్య పరిచర్య—2005
  • క్రమశిక్షణను అంగీకరించుట ద్వారా విధేయత నేర్చుకొనండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యేసు “విధేయత నేర్చుకున్నాడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 7/15 పేజీలు 29-31

“విధేయ హృదయం” మీకుందా?

సొలొమోను ప్రాచీన ఇశ్రాయేలుకు రాజైనప్పుడు, తను అందుకు సమర్థుడు కాడని భావించాడు. కనుక, ఆయన జ్ఞానాన్నీ, తెలివినీ ఇవ్వమని దేవుడ్ని కోరుకున్నాడు. (2 దినవృత్తాంతములు 1:10) సొలొమోను ఇంకా ఇలా కూడా ప్రార్థించాడు: “నీ జనులకు న్యాయము తీర్చేందుకు నీ దాసుడనైన నాకు విధేయ హృదయమును దయచేయుము.” (1 రాజులు 3:9, NW) సొలొమోనుకు, “విధేయ హృదయము” ఉండి ఉంటే, ఆయన దైవిక నియమాలనూ, సూత్రాలను అనుసరించేవాడే, అలా యెహోవా అనుగ్రహాన్ని పొందేవాడే.

విధేయ హృదయం ఒక భారం కాదు, అది ఆనందానికి నెలవై ఉంటుంది. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3) నిశ్చయంగా, మనం దేవునికి విధేయత చూపాలి. అంతేకాదు, యెహోవా మన గొప్ప సృష్టికర్త. భూమీ, దాని మీద ఉన్న ప్రతిదీ, సమస్త వెండి, బంగారాలు కూడా ఆయనకు చెందినవే. కనుక, ఆయన మీద మనకు గల ప్రేమను వ్యక్తం చేసేందుకు మన ఆర్థిక వనరులను ఉపయోగించేందుకు దేవుడు మనకు అనుమతిస్తున్నప్పటికీ, నిజానికి మనం దేవుడికి భౌతికంగా ఏమీ ఇవ్వలేము. (1 దినవృత్తాంతములు 29:14) మనం తనను ప్రేమించాలని, తన చిత్తాన్ని చేస్తూ, వినయంగా తనతోపాటు నడవాలని యెహోవా కోరుకుంటున్నాడు.—మీకా 6:8.

ధర్మశాస్త్రంలో అన్నింటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏదని యేసును అడిగినప్పుడు, ఆయన ఇలా చెప్పాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.” (మత్తయి 22:36-38) ఆ ప్రేమను వ్యక్తం చేసే ఒక మార్గం దేవునికి విధేయత చూపడమే. కనుక, యెహోవా మనకు విధేయ హృదయాన్నివ్వాలన్నది మనలో ప్రతి ఒక్కరి ప్రార్థన అయ్యుండాలి.

వాళ్ళకు విధేయ హృదయం ఉండింది

విధేయ హృదయులైన అనేకుల మాదిరులు బైబిలులో సమృద్ధిగా ఉన్నాయి. ఉదాహరణకు, జీవాన్ని నిలబెట్టేందుకు, ఒక పెద్ద ఓడను నిర్మించమని యెహోవా నోవహుకు చెప్పాడు. అది ఎంతో బృహత్కార్యం. ఆ పనికి 40 లేదా 50 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఆధునికమైన శక్తివంతమైన ఉపకరణాలూ, మరితర పరికరాలూ లభ్యమౌతున్నప్పటికీ, నీటిలో తేలగల అంత పెద్ద నిర్మాణాన్ని నిర్మించడమంటే, అదో గొప్ప ఇంజనీరింగ్‌ ఘనకార్యమే. అంతేకాక, నోవహు ప్రజలకు హెచ్చరిక ఇవ్వవలసి ఉండింది. ఆ ప్రజలు ఆయనను అపహసించి ఉంటారు, ఎగతాళి చేసి ఉంటారు అన్నదానికి సందేహం లేదు. కానీ ఆయన అతి చిన్న విషయాల్లో కూడా విధేయత చూపాడు. ఆయన “చెప్పినట్లే చేసెను” అని బైబిలు చెబుతుంది. (ఆదికాండము 6:9, 22, క్యాథలిక్‌ అనువాదము; 2 పేతురు 2:5) అనేక సంవత్సరాలుగా నమ్మకంగా విధేయతను చూపిస్తూ నోవహు యెహోవా మీద తనకు గల ప్రేమని చూపించాడు. మనందరికీ ఎంత చక్కని మాదిరి!

పితరుడైన అబ్రాహాము విషయమే తీసుకోండి. సిరిసంపదలతో తులతూగుతున్న కల్దీయుల ఊరునుండి తానెరుగని దేశానికి తరలివెళ్ళమని దేవుడు తనకు చెప్పినప్పుడు అబ్రాహాము మరేమీ ప్రశ్నించకుండా అందుకు విధేయత చూపాడు. (హెబ్రీయులు 11:8) తన శేష జీవితంలో ఆయనా, ఆయన కుటుంబమూ గుడారాల్లో నివసించింది. ఆ దేశంలో పరదేశిగా నివసించనారంభించి, అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇస్సాకు అనే కుమారుడ్ని ప్రసాదిస్తూ దేవుడు ఆయననూ, విధేయతగల ఆయన భార్య శారానూ ఆశీర్వదించాడు. తన వార్ధక్యంలో జన్మించిన ఆ కుమారుడ్ని నూరేండ్ల వయస్సుగల అబ్రాహాము ఎంతగా ప్రేమించి ఉంటాడో గదా! కొన్ని సంవత్సరాల తర్వాత యెహోవా ఇస్సాకును దహనబలిగా అర్పించమని అబ్రాహామును అడిగాడు. (ఆదికాండము 22:1, 2) ఆ పని చేయాలన్న తలంపే అబ్రాహాముకు బాధ కలిగించి ఉంటుంది. అయినప్పటికీ, ఆయన యెహోవాను ప్రేమించాడు గనుకా, దేవుడు ఇస్సాకును మరణం నుండి పునరుత్థానం చేయవలసి వచ్చినప్పటికీ, ఇస్సాకు నుండే వాగ్దత్త సంతతి వస్తుందనీ ఆయన విశ్వసించాడు గనుకా విధేయతాపూర్వకంగా ఆ పని చేయడానికి బయల్దేరాడు. (హెబ్రీయులు 11:17-19) అయినప్పటికీ, అబ్రాహాము తన కుమారుడ్ని చంపబోతుండగా, యెహోవా ఆయనను ఆపి, “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను.” (ఆదికాండము 22:12) దైవభయంగల అబ్రాహాము విధేయత మూలంగా “యెహోవా స్నేహితుడు” అని పిలువబడ్డాడు.—యాకోబు 2:23, NW.

విధేయత విషయంలో యేసుక్రీస్తు మనకు శ్రేష్ఠమైన మాదిరిగా ఉన్నాడు. ఆయన తన మానవపూర్వ అస్తిత్వ కాలంలో, పరలోకంలో తన తండ్రికి విధేయతాపూర్వకంగా సేవ చేయడంలో ఆహ్లాదాన్ని పొందేవాడు. (సామెతలు 8:22-31) యేసు ఒక మానవుడుగా, ప్రతి విషయంలోనూ యెహోవాకు విధేయత చూపేవాడు. ఎల్లప్పుడూ ఆయన చిత్తాన్ని చేయడంలో ఆహ్లాదాన్ని పొందేవాడు. (కీర్తన 40:8; హెబ్రీయులు 10:9) అలా, యేసు, “నా అంతట నేనే యేమియుచేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని” సత్యసంధంగా చెప్పగలిగాడు. (యోహాను 8:28, 29) చివరకు, యెహోవా సర్వాధిపత్యాన్ని నిరూపించేందుకూ, విధేయతగల మానవజాతిని స్వతంత్రులనుగా చేసేందుకూ, అత్యంత అవమానకరమైన, వేదనభరితమైన మరణానికి గురౌతూ యేసు తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. నిజంగా, ‘ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, [హింసా కొయ్యపై మరణము పొందునంతగా, NW] విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.’ (ఫిలిప్పీయులు 2:8) విధేయ హృదయాన్ని కనబరచడంలో ఎంత చక్కని మాదిరి!

పాక్షిక విధేయత సరిపోదు

దేవునికి విధేయులమని చెప్పుకున్నవాళ్ళందరూ ఆయనకు నిజానికి విధేయత చూపలేదు. ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సౌలునే తీసుకోండి. దుష్టులైన అమాలేకీయులను సమూల నాశనం చేయమని దేవుడు ఆయనకు ఆదేశించాడు. (1 సమూయేలు 15:1-3) సౌలు వారిని ఒక దేశంగా నాశనం చేసినప్పటికీ, ఆయన వాళ్ళ రాజును చంపలేదు, వాళ్ళ గొర్రెల్లోనూ, పశువుల్లోనూ కొన్నింటిని సజీవంగా ఉంచేశాడు. “నీవు ఎందుచేత యెహోవా మాట వినక”పోతివని సమూయేలు అడిగాడు. దానికి జవాబుగా, “నేను యెహోవా మాట వి[న్నాను] . . . కానీ . . . నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱెలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని” సౌలు బదులిచ్చాడు. సంపూర్ణ విధేయత అవసరతను నొక్కిచెబుతూ, సమూయేలు ఇలా జవాబిచ్చాడు: “తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము. తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము[ను] గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెన”ని సమూయేలు బదులిచ్చాడు. (1 సమూయేలు 15:17-23) తన అవిధేయ హృదయం వల్ల సౌలు ఎంత నష్టపోయాడో!

విధేయ హృదయం కోసం ప్రార్థించిన జ్ఞానియైన సొలొమోను రాజు కూడా యెహోవాకు విధేయుడుగా కొనసాగలేదు. దైవిక చిత్తానికి విరుద్ధంగా, ఆయన విదేశీ స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆయన దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేందుకు వాళ్ళు కారకులయ్యారు. (నెహెమ్యా 13:23, 26) సొలొమోను విధేయ హృదయాన్ని కల్గివుండడంలో కొనసాగలేదు కనుక, దైవిక ప్రీతిని కోల్పోయాడు. ఇది మనకు ఒక హెచ్చరికే!

దీనర్థం యెహోవా మానవ సేవకులనుండి పరిపూర్ణతను కోరుకుంటాడని కాదు. ‘మనం మంటివారమని ఆయన జ్ఞాపకముంచుకుంటాడు.’ (కీర్తన 103:14) మనందరమూ తప్పకుండా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తాం. కానీ యెహోవాను ప్రీతిపర్చాలన్న హృదయపూర్వక కోరిక మనకు నిజంగా ఉందా అన్నది దేవుడు చూడగలడు. (2 దినవృత్తాంతములు 16:9) మానవ అసంపూర్ణత వల్ల మనం తప్పిదాలను చేసినప్పటికీ, పశ్చాత్తాపపడితే, యెహోవా “బహుగా క్షమించును” అన్న నమ్మకంతో, క్రీస్తు విమెచన క్రయధనం ఆధారంగా మనం క్షమాపణను కోరుకోవచ్చు. (యెషయా 55:7; 1 యోహాను 2:1, 2) మనం ఆధ్యాత్మికంగా కోలుకునేందుకూ, ఆరోగ్యకరమైన విశ్వాసాన్నీ, విధేయ హృదయాన్నీ కలిగివుండేందుకూ, ప్రేమపూర్వక క్రైస్తవ పెద్దల సహాయం కూడా అవసరం కావచ్చు.—యాకోబు 5:13-15; తీతు 2:2.

మీ విధేయత ఎంత సంపూర్ణమైనది?

యెహోవా సేవకులముగా, మనలో దాదాపు అందరూ నిస్సందేహంగా విధేయ హృదయాన్ని కలిగివున్నట్లు భావిస్తాము. రాజ్య ప్రకటనా పనిలో నేను పాల్గొనడం లేదా? తటస్థత సంబంధమైన ముఖ్యమైన వివాదాలు తలెత్తినప్పుడు నేను స్థిరంగా నిలబడడం లేదా? అపొస్తలుడైన పౌలు ఉద్బోధించినట్లు నేను కూటాలకు క్రమంగా హాజరు కావడం లేదా అని మనకై మనం తర్కించుకోవచ్చు. (మత్తయి 24:14; 28:19, 20; యోహాను 17:16; హెబ్రీయులు 10:24, 25) నిజమే, మొత్తం మీద యెహోవా ప్రజలు ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాల్లో హృదయపూర్వక విధేయతను కనబరుస్తారు.

కానీ, మన దైనందిన జీవితంలో, చాలా స్వల్పమైనవిగా అనిపించే విషయాల్లో మనమెలా ప్రవర్తిస్తుంటాం? యేసు ఇలా చెప్పాడు: “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.” (లూకా 16:10) కనుక, మనలో ప్రతి ఒక్కరమూ ఈ విధంగా ప్రశ్నించుకోవడం మంచిది: చాలా చిన్న విషయాల్లో, ఇతరులు తెలుసుకోలేని విషయాల్లో కూడా నేను విధేయ హృదయాన్ని కలిగివున్నానా?

తన ఇంటిలోపలి భాగంలో, ఆయనను ఇతరులు చూడలేని చోట కూడా, ‘నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించాను’ అని కీర్తనల రచయిత అంటున్నాడు. (కీర్తన 101:2) మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు, టీవీ ఆన్‌ చేయవచ్చు, సినిమా చూడడం మొదలుపెట్టవచ్చు. అక్కడే మీ విధేయత పరీక్షించబడగలదు. సినిమా అనైతిక విషయాలతో నిండివుండవచ్చు. ఈ కాలంలో ఇలాంటి సినిమాలనే చూపిస్తారని అనుకుంటూ అలా చూస్తూనే ఉంటారా? లేదా మీ విధేయ హృదయం ‘మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, వాటి పేరైనను ఎత్తకూడదు’ అన్న లేఖనాధార ఉత్తరువును అనుసరించడానికి మిమ్మల్ని పురికొల్పుతుందా? (ఎఫెసీయులు 5:3-5) ఆ కథ చాలా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ మీరు టీవీని కట్టేస్తారా? లేదా కార్యక్రమం హింసాత్మకంగా మారుతున్నట్లయితే, మీరు చానెల్‌ మార్చుతారా? “యెహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు” అని కీర్తన రచయిత పాడాడు.—కీర్తన 11:5.

విధేయ హృదయం ఆశీర్వాదాలను తెస్తుంది

నిజమే, మనం దేవుడికి చూపించే విధేయత నిజంగా హృదయం నుండి వస్తుందా అని చూసేందుకు, జీవితంలోని అనేక రంగాల్లో మనల్ని మనం పరిశీలించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. యెహోవా అంటే మనకున్న ప్రేమ మనం ఆయనను ప్రీతిపర్చేందుకు, తన వాక్యమైన బైబిలులో ఆయన మనకు చెబుతున్నదానిని చేసేందుకూ మనలను పురికొల్పాలి. యెహోవాతో సత్సంబంధాన్ని కాపాడుకునేందుకు విధేయ హృదయం మనకు సహాయపడుతుంది. వాస్తవానికి, మనం సంపూర్ణ విధేయులమైతే, ‘మన నోటి మాటలును మన హృదయ ధ్యానమును యెహోవా దృష్టికి అంగీకారములగును.’—కీర్తన 19:14.

యెహోవా మనలను ప్రేమిస్తాడు గనుక, మన మంచి కోసం ఆయన మనకు విధేయతను నేర్పిస్తాడు. దైవిక బోధకు పూర్ణహృదయంతో అవధానాన్నివ్వడం ద్వారా మనం చాలా గొప్ప ప్రయోజనాన్ని పొందవచ్చు. (యెషయా 48:17, 18) కనుక, తన వాక్యమైన బైబిలు, తన ఆత్మ, తన సంస్థ ద్వారా మన పరలోక తండ్రి మనకిచ్చే సహాయాన్ని సంతోషపూర్వకంగా స్వీకరిద్దాం. “ఇదే త్రోవ దీనిలో నడువుడి అని” మన వెనుకనుండి ఒక శబ్దం వినిపిస్తుందా అన్నంత చక్కగా మనకు బోధించబడుతుంది. (యెషయా 30:21) బైబిలూ, క్రైస్తవ ప్రచురణలూ, సంఘ కూటాల ద్వారా యెహోవా మనకు బోధిస్తుండగా, మనం వాటికి అవధానమిచ్చి, మనం నేర్చుకున్నవాటిని ఆచరణలో పెట్టి, ‘అన్ని విషయములందు విధేయులై’ ఉందుము గాక.—2 కొరింథీయులు 2:9.

విధేయ హృదయం ఎంతో ఆనందాన్నీ, మరిన్ని ఆశీర్వాదాలనూ తెస్తుంది. మనం యెహోవాను ఎంతో ప్రీతిపరుస్తూ, ఆయన హృదయానికి ఆనందాన్ని కలిగిస్తాం కనుక మనకు మనశ్శాంతి ఉంటుంది. (సామెతలు 27:11) విధేయత చూపే హృదయం మనం తప్పు చేయడానికి ప్రలోభపెట్టబడినప్పుడు మనకు రక్షణగా ఉంటుంది. అలా అయితే, మనం తప్పకుండా పరలోక తండ్రికి విధేయత చూపాలి, “నీ దాసుడనైన నాకు విధేయ హృదయమును దయచేయుము” అని ప్రార్థించాలి.

[29వ పేజీలోని చిత్రసౌజన్యం]

From the Self-Pronouncing Edition of the Holy Bible, containing the King James and the Revised versions

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి