దేవునితో నడవడం—తొలి అడుగులు
“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”—యాకోబు 4:8.
1, 2. యెహోవాకు సేవ చేయడం ఒక గొప్ప ఆధిక్యత అని మీరు ఎందుకు చెబుతారు?
ఏళ్ల తరబడి అతడు ఖైదులో కష్టాల్ని అనుభవించాడు. ఆ తర్వాత, ఆ దేశ పరిపాలకుని ఎదుట హాజరవ్వమని అతనికి ఆజ్ఞ ఇవ్వబడింది. సంఘటనలు వేగంగా జరిగిపోయాయి. ఆ ఖైదీ ఊహించని విధంగా, అప్పట్లో భూమిపై ఉన్న అత్యంత శక్తిమంతుడైన రాజు వద్ద పనిచేసేవాడయ్యాడు. ఒకనాటి ఖైదీ, గొప్ప బాధ్యతాయుతమైన, ఎంతో ఉన్నతమైన పదవిని అలంకరించాడు. ఎవరి పాదాలైతే ఇనుప సంకెళ్లచేత బంధించబడ్డాయో ఆ యోసేపు ఇప్పుడు రాజుతో నడిచాడు!—ఆదికాండము 41:14, 39-43; కీర్తన 105:17, 18.
2 ఐగుప్తు రాజైన ఫరోకన్నా ఎంతో గొప్పవానికి సేవచేసే అవకాశం నేడు మానవులకు ఉంది. విశ్వ సర్వాధిపతి తన సేవ చేయడానికి మనల్నందర్నీ ఆహ్వానిస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుడగు యెహోవా సేవచేసి, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవడం ఎంత గొప్ప ఆధిక్యత! లేఖనాల్లో, మహాశక్తి, తేజస్సు, అలాగే ప్రశాంతతా, అందం, ఆహ్లాదకరం వంటివి ఆయనకు ముడిపెట్టబడ్డాయి. (యెహెజ్కేలు 1:26-28; ప్రకటన 4:1-3) ఆయన వ్యవహారాలన్నింటిలో ప్రేమ కనిపిస్తుంది. (1 యోహాను 4:8) ఆయన ఎన్నటికీ అబద్ధమాడడు. (సంఖ్యాకాండము 23:19) తన పట్ల యథార్థవంతులుగా ఉన్న వారిని యెహోవా ఎన్నడూ నిరుత్సాహపర్చడు. (కీర్తన 18:25) ఆయన నీతియుక్తమైన కట్టడలకు అనుగుణంగా మారడం ద్వారా, మనం నిత్యజీవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సంతోషకరమైన, అర్థవంతమైన జీవితాల్ని అనుభవించవచ్చు. (యోహాను 17:3) అలాంటి ఆశీర్వాదాలకూ, ఆధిక్యతలకూ సరితూగగల వేటినీ ఏ మానవ పరిపాలకుడూ ఇవ్వజాలడు.
3. ఏ విధంగా నోవహు ‘సత్య దేవునితో నడిచాడు’?
3 ఎంతో కాలం క్రిందట, మూల పురుషుడైన నోవహు దేవుని చిత్తానికీ, ఆయన సంకల్పానికీ అనుగుణంగా జీవించాలని నిశ్చయించుకున్నాడు. ఆయన్ని గురించి, బైబిలిలా చెబుతోంది: “నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు.” (ఆదికాండము 6:9) నిజమే, ఏ మానవుడూ ‘ఎప్పుడూ దేవుడ్ని చూడలేదు’ గనుక నోవహు యెహోవాతో అక్షరార్థంగా నడవలేదు. (యోహాను 1:18) దానికి బదులుగా, నోవహు దేవుడు తనకు చేయమని చెప్పినదాన్ని చేయడం ద్వారా దేవునితో నడిచాడు. ఎందుకంటే నోవహు యెహోవా చిత్తాన్ని చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు, ఆయన సర్వోన్నతుడైన దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని అనుభవించాడు. నోవహు వలెనే, నేడు లక్షలాది మంది యెహోవా దేవుని సలహా, ఉపదేశాలకు అనుగుణంగా జీవించడం ద్వారా ‘దేవునితో నడుస్తున్నారు.’ అలాంటి నడవడిని ఒకరెలా మొదలుపెడతారు?
ఖచ్చితమైన జ్ఞానం ఆవశ్యకం
4. యెహోవా తన ప్రజలకు ఎలా బోధిస్తున్నాడు?
4 యెహోవాతో నడవాలంటే మనం ఆయన్ని గురించి మొదట తెలుసుకోవాలి. యెషయా ప్రవక్త ఇలా ప్రవచించాడు: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి—యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.” (యెషయా 2:2, 3) అవును, ఆయన త్రోవలలో నడవడానికి అన్వేషించే వారందరికీ యెహోవా బోధిస్తాడనే నమ్మకాన్ని మనం కల్గివుండవచ్చు. యెహోవా తన వాక్యమైన బైబిల్ని దయచేశాడు. దాన్ని అర్థంచేసుకోవడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన అలా సహాయం చేసే ఒక మార్గం ఏమిటంటే ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారానే. (మత్తయి 24:45-47) ఈ ‘నమ్మకమైన దాసుని’ యెహోవా ఉపయోగిస్తూ బైబిలు ఆధారిత ప్రచురణల ద్వారా క్రైస్తవ కూటాల ద్వారా ఉచిత బైబిలు పఠన ఏర్పాటు ద్వారా ఆధ్యాత్మిక ఉపదేశాన్నిస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యాన్ని అర్థంచేసుకునేందుకు తన ప్రజలకు సహాయం చేస్తున్నాడు.—1 కొరింథీయులు 2:10-16.
5. లేఖనాధార సత్యం ఎందుకంత అమూల్యమైనది?
5 బైబిలు సత్యం కోసం మనం డబ్బును చెల్లించకపోయినా, అది అమూల్యమైనది. దేవుని వాక్యాన్ని మనం పఠిస్తుండగా, మనం దేవుని గురించి అంటే ఆయన నామాన్ని గురించీ, ఆయన వ్యక్తిత్వం గురించీ, ఆయన సంకల్పం గురించీ, మానవులతో ఆయన వ్యవహరించే తీరు గురించీ తెలుసుకుంటాం. అలాగే, మనం ఇక్కడ ఎందుకున్నాం? దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడు? భవిష్యత్తు ఏమిటి? మనం ఎందుకు వృద్ధాప్యానికి ఎదిగి మరణిస్తున్నాం? మరణానంతర జీవితం ఉందా? వంటి జీవితపు ప్రాథమిక ప్రశ్నలకు స్వతంత్రుల్ని చేసే జవాబుల్ని తెలుసుకుంటాం. అంతేగాక, మన విషయంలో దేవుని చిత్తమేమైవుందో అంటే, ఆయన్ని సంపూర్ణంగా ప్రీతిపర్చేందుకు మనమెలా నడవాలో తెలుసుకుంటాం. ఆయన కట్టడలు సహేతుకమైనవనీ, వాటికి అనుగుణంగా జీవించినప్పుడు అవెంతో ప్రయోజనకరమైనవిగా ఉంటాయనీ మనం తెలుసుకుంటాం. దేవుని ఉపదేశం లేకుండా, మనం అలాంటి విషయాల్ని ఎన్నటికీ అర్థంచేసుకోలేం.
6. ఖచ్చితమైన బైబిలు జ్ఞానం ఏ మార్గాన్ని వెంబడించేలా మనల్ని చేయగలదు?
6 బైబిలు సత్యం శక్తివంతమైనది, మన జీవితాల్లో మార్పుల్ని చేసుకునేలా అది మనల్ని ప్రేరేపిస్తుంది. (హెబ్రీయులు 4:12) లేఖనాల్లోని జ్ఞానాన్ని తీసుకోవడానికి ముందు, ‘ఈ ప్రపంచ ధర్మముచొప్పున’ మాత్రమే మనం నడవగలిగాం. (ఎఫెసీయులు 2:2) కానీ దేవుని వాక్యాన్ని గూర్చిన ఖచ్చితమైన జ్ఞానం, మన కోసం ఓ విభిన్నమైన మార్గాన్ని సవివరంగా ఏర్పాటు చేసింది గనుక, మనం యెహోవాను “సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొన”గలం. (కొలొస్సయులు 1:10) యావత్ విశ్వంలోనే ఎంతో దివ్యమైన వ్యక్తియైన యెహోవాతో నడవడంలో మన తొలి అడుగుల్ని వేయడం ఎంత ఆనందదాయకమైన విషయం!—లూకా 11:28.
రెండు ప్రాముఖ్యమైన అడుగులు —సమర్పణ, బాప్తిస్మం
7. దేవుని వాక్యాన్ని మనం పఠిస్తుండగా, మానవ నాయకత్వాన్ని గూర్చిన ఏ సత్యం తేటతెల్లమౌతుంది?
7 బైబిల్ని గూర్చిన మన అవగాహన విషయంలో మనం ఎదిగినప్పుడు, మనం మానవ వ్యవహారాల్నీ, దేవుని వాక్యపు ఆధ్యాత్మిక వెలుగులో మన సొంత జీవితాల్నీ పరిశీలించుకోవడం మొదలు పెడతాం. ఆ విధంగా ఒక ప్రాముఖ్యమైన సత్యం తేటతెల్లమౌతుంది. యిర్మీయా ప్రవక్త ఎంతో కాలం క్రిందటే ఆ సత్యాన్ని వ్యక్తపర్చాడు. ఆయనిలా రాశాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీయా 10:23) మానవులకు, అంటే మనందరికీ దేవుని నడిపింపు అవసరం.
8. (ఎ) దేవునికి సమర్పించుకునేలా ప్రజల్ని ఏది ప్రేరేపిస్తుంది? (బి) క్రైస్తవ సమర్పణ అంటే ఏమిటి?
8 ఈ ప్రాముఖ్యమైన వాస్తవాన్ని అర్థంచేసుకోవడం, యెహోవా నుండి వచ్చే నడిపింపును వెదికేలా మనల్నందర్నీ ప్రేరేపిస్తుంది. దేవుని పట్ల మనకున్న ప్రేమ, ఆయనకు మన జీవితాల్ని సమర్పించుకునేలా మనల్ని కదిలిస్తుంది. దేవునికి సమర్పణ చేసుకోవడమంటే, ఆయన్ని ప్రార్థనలో సమీపించి, ఆయనకు సేవ చేసేందుకు మన జీవితాల్ని ఉపయోగిస్తామనీ, నమ్మకంగా ఆయన త్రోవల్లో నడుస్తామనీ గంభీరంగా వాగ్దానం చేయడమే. అలా చేయడానికి, మనం యేసు మాదిరిని అనుసరిస్తాం. ఆయన దైవిక చిత్తాన్ని నెరవేర్చాలనే స్థిరమైన నిశ్చయంతో యెహోవాకు తననుతాను ముందుంచుకున్నాడు.—హెబ్రీయులు 10:7.
9. ఆ యా వ్యక్తులు తమ జీవితాల్ని యెహోవాకు ఎందుకు సమర్పించుకుంటారు?
9 యెహోవా దేవుడు తనకు సమర్పించుకోమని ఎవరినీ ఎప్పుడూ ఒత్తిడి చేయడు లేదా బలవంతం చేయడు. (పోల్చండి 2 కొరింథీయులు 9:7.) అంతేగాక, ఏదో క్షణికమైన ఉద్రేకాన్నిబట్టి ఒకరు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలని ఆయన అపేక్షించడు. బాప్తిస్మం తీసుకోవడానికి ముందు, ఒక వ్యక్తి శిష్యుడై ఉండాలి, అందుకుగాను జ్ఞానాన్ని గైకొనేందుకు తీవ్రమైన కృషి అవసరమౌతుంది. (మత్తయి 28:19, 20) ‘సజీవమైన, పరిశుద్ధమైన, దేవునికి అంగీకారమైన యాగంగా తమ శరీరాలనూ, తమ వివేచనాశక్తితో పరిశుద్ధ సేవనూ సమర్పించుకొనమని’ అప్పటికే బాప్తిస్మం తీసుకున్నవారికి పౌలు విన్నపం చేశాడు. (రోమీయులు 12:1 NW) అదే విధంగా మన వివేచనాశక్తిని అభ్యసించడంద్వారా మనం యెహోవా దేవునికి సమర్పణను చేసుకుంటాం. చేరివున్న వాటిని గురించి తెలుసుకొని, ఆ విషయంపై జాగ్రత్తగా వివేచించిన తర్వాత, మనం మన జీవితాన్ని దేవునికి ఇష్టపూర్వకంగానూ, ఆనందంగానూ సమర్పించుకుంటాం.—కీర్తన 110:3.
10. సమర్పణకు బాప్తిస్మంతో ఎలాంటి సంబంధం ఉంది?
10 దేవుని మార్గాల్లో నడుస్తామనే మన కృత నిశ్చయాన్ని వ్యక్తపర్చేందుకు ఆయన్ని ప్రార్థనలో ఆంతరంగికంగా సమీపించిన తర్వాత, తర్వాతి అడుగును మనం వేస్తాం. నీటిలో మనం బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన సమర్పణను అందరికీ బహిరంగపరుస్తాం. అది దేవుని చిత్తాన్ని చేస్తామని మనం చేసిన ప్రమాణాన్ని తెలియజేసే బహిరంగ ప్రకటనే. భూ సంబంధమైన తన పరిచర్య ప్రారంభంలో యేసుకు యోహాను బాప్తిస్మమిచ్చాడు. ఆ విధంగా యేసు మన కోసమొక మాదిరిని ఉంచాడు. (మత్తయి 3:13-17) తర్వాత, శిష్యుల్ని తయారుచేసి, వారికి బాప్తిస్మం ఇవ్వమని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి, యెహోవా దేవునితోపాటు నడవాలని అభిలషించే వారెవరికైనా సరే, సమర్పణా బాప్తిస్మాలు ఆవశ్యకమైన అడుగులు అయివున్నాయి.
11, 12. (ఎ) బాప్తిస్మం తీసుకోవడాన్ని వివాహానికి ఎలా పోల్చవచ్చు? (బి) యెహోవాతో మనకున్న సంబంధానికీ, భార్యా భర్తల సంబంధానికీ మధ్య ఏ సారూప్యాన్ని చూడవచ్చు?
11 సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్న యేసుక్రీస్తు శిష్యునిగా తయారవ్వడమనేది ఒక విధంగా వివాహం చేసుకోవడంలాంటిదే. అనేక దేశాల్లో, పెళ్లినాటికి ముందు జరగాల్సిన తంతు ఎంతో ఉంటుంది. అమ్మాయీ అబ్బాయీ ఒకరినొకరు చూసుకుంటారు, ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు, తర్వాత ప్రేమలో పడతారు. ఆ పైనే ప్రధానం జరుగుతుంది. ఆంతరంగికంగా నిశ్చయించుకున్నదాన్ని అంటే వైవాహిక బంధంలోకి ప్రవేశించి భార్యా భర్తలుగా కలిసి జీవించాలని నిశ్చయించుకున్న విషయాన్ని వివాహం బహిరంగపరుస్తుంది. ఆ ప్రత్యేక బాంధవ్యపు ఆరంభాన్ని బహిరంగంగా గుర్తించేదే వివాహము. ఆ తారీఖు వైవాహిక జీవితారంభాన్ని గుర్తిస్తుంది. దీనికి పోలికగానే, యెహోవాతో సమర్పిత అనుబంధంలో నడిచేందుకు సమర్పించుకున్న జీవితారంభాన్ని బాప్తిస్మం గుర్తిస్తుంది.
12 మరొక సారూప్యాన్ని పరిశీలించండి. వివాహ దినాంతరం, భార్యా భర్తల మధ్యనున్న ప్రేమ అంతకంతకూ పెరుగుతూ పరిణితి చెందుతుంది. ఒకరికొకరు మరింత సన్నిహితులయ్యేందుకు, వివాహ దంపతులు ఇరువురూ తమ వైవాహిక బంధాన్ని కాపాడుకునేందుకూ, బలపర్చుకునేందుకూ నిస్వార్థంగా కృషి చేయాలి. మనం దేవునితో వైవాహిక బంధంలోకి ప్రవేశించకపోయినా, మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని కాపాడుకునేందుకు మనం పనిచేయాలి. ఆయన చిత్తాన్ని చేసేందుకు మనం చేసే ప్రయత్నాల్ని ఆయన గమనిస్తాడు, గుర్తిస్తాడు, మరి మనకు సన్నిహితంగా వస్తాడు. “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని శిష్యుడైన యాకోబు రాశాడు.—యాకోబు 4:8.
యేసు అడుగుజాడల్లో నడవడం
13. దేవునితో నడుస్తూ ఉండడంలో, మనమెవరి మాదిరిని అనుసరించాలి?
13 యెహోవాతో నడిచేందుకు, యేసుక్రీస్తు ఉంచిన మాదిరికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (1 పేతురు 2:20, 21) యేసు పరిపూర్ణుడూ, మనం అపరిపూర్ణులమూ గనుక, ఆయన ఉంచిన మాదిరిని మనం పరిపూర్ణంగా అనుకరించలేకపోవచ్చు. అయినప్పటికీ, మనం ఆయన మాదిరిని యథాశక్తి అనుసరించాలని యెహోవా మన నుండి అపేక్షిస్తున్నాడు. సమర్పిత క్రైస్తవులు అనుకరించడానికి కృషి చేయాల్సిన ఐదు అంశాల్ని అంటే, యేసు జీవిత, పరిచర్యలకు సంబంధించిన ఐదు అంశాల్ని మనం పరిశీలిద్దాం.
14. దేవుని వాక్యాన్ని తెలుసుకోవడంలో ఏం చేరివుంది?
14 యేసుకు దేవుని వాక్యాన్ని గూర్చిన ఖచ్చితమైన, సమగ్రమైన జ్ఞానం ఉంది. తన పరిచర్య కాలంలో, యేసు హెబ్రీ లేఖనాల్లో నుండి తరచూ ఎత్తి చెప్పాడు. (లూకా 4:4, 8) దుష్టులైన ఆ కాలంనాటి మత నాయకులు కూడా లేఖనాల్లో నుండి ఎత్తి చెప్పేవారనుకోండి. (మత్తయి 22:23, 24) తేడా ఏమిటంటే, యేసు లేఖనాల భావాన్ని అర్థం చేసుకున్నాడు, వాటిని తన జీవితంలో అన్వయించుకున్నాడు. ధర్మశాస్త్రం గురించి మాత్రమేగాక, దాని స్ఫూర్తిని గురించి కూడా ఆయనకు తెలుసు. క్రీస్తు మాదిరిని మనం అనుసరిస్తుండగా, దేవుని వాక్యాన్ని అర్థంచేసుకునేందుకూ, దాని భావాన్నీ లేదా స్ఫూర్తినీ అర్థం చేసుకునేందుకూ మనం కూడా కృషి సల్పాలి. అలా చేయడం ద్వారా, ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించే’ దైవికంగా అంగీకరించబడిన పనివారిగా మనం తయారవ్వవచ్చు.—2 తిమోతి 2:15.
15. దేవుని గురించి మాట్లాడడంలో యేసు ఏ మాదిరిని ఉంచాడు?
15 క్రీస్తు తన పరలోకపు తండ్రిని గురించి ఇతరులతో మాట్లాడాడు. దేవుని వాక్యాన్ని గూర్చిన తన జ్ఞానాన్ని యేసు దాచుకోలేదు. ఆయన శత్రువులు సహితం ఆయన్ని ‘బోధకునిగా’ సంబోధించారు, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్లినా సరే, యెహోవా గురించీ, ఆయన సంకల్పాల్ని గురించీ ఇతరులతో మాట్లాడేవాడు. (మత్తయి 12:38) యేసు, దేవాలయ ప్రాంగణంలో, సమాజ మందిరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో బహిరంగంగా ప్రకటించాడు. (మార్కు 1:39; లూకా 8:1; యోహాను 18:20) ఆయన కనికరంతోనూ, దయతోనూ బోధించాడు, తాను సహాయంచేసిన వారిపట్ల ప్రేమను చూపించాడు. (మత్తయి 4:23) యేసు మాదిరిని అనుసరించే వ్యక్తులు, యెహోవా దేవుని గురించీ, ఆయన అద్భుతకరమైన సంకల్పాల్ని గురించీ ఇతరులకు బోధించేందుకు అనేకమైన స్థలాల్నీ, మార్గాల్నీ కనుగొంటారు.
16. యెహోవాను ఆరాధించే తోటి ఆరాధకులతో యేసు సంబంధం ఎంత సన్నిహితమైంది?
16 యెహోవాను ఆరాధించే ఇతరులతో యేసు సన్నిహిత సంబంధాన్ని కల్గివున్నాడు. ఒక సందర్భంలో యేసు సమూహంతో మాట్లాడుతుండగా, ఆయన తల్లీ, అవిశ్వాసులైన ఆయన సహోదరులూ ఆయనతో మాట్లాడేందుకు వచ్చారు. బైబిలు వృత్తాంతమిలా చెబుతోంది: “అప్పుడొకడు—ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి—నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి తన శిష్యులవైపు చెయ్యచాపి—ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియు ననెను.” (మత్తయి 12:47-50) యేసు తన కుటుంబాన్ని ఉపేక్షించాడని దానర్థంకాదు, ఎందుకంటే అటు తర్వాత జరిగిన సంఘటనలు ఆయన వారిని ఉపేక్షించలేదని తెలియజేస్తున్నాయి. (యోహాను 19:25-27) అయినప్పటికీ, తోటి విశ్వాసులపట్ల యేసుకున్న ప్రేమను ఆ వృత్తాంతం నొక్కి చెబుతోంది. అదే విధంగా నేడు, దేవునితో నడిచేవాళ్లు యెహోవా దేవుని ఇతర సేవకుల సహవాసాన్ని వెదకి, వారిని ప్రియంగా ప్రేమించేలా ఎదగాలి.—1 పేతురు 4:8.
17. తన పరలోకపు తండ్రి చిత్తాన్ని చేయడాన్ని గురించి యేసు ఎలా భావించాడు, అది మనల్ని ఎలా ప్రభావితం చేయాలి?
17 దైవిక చిత్తాన్ని చేయడం ద్వారా, యేసు తన పరలోకపు తండ్రిపట్ల ప్రేమను చూపించాడు. యేసు అన్ని విషయాల్లో యెహోవాకు లోబడ్డాడు. ఆయనిలా అన్నాడు: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” (యోహాను 4:34) క్రీస్తు ఇంకా ఇలా అన్నాడు: “ఆయన [దేవునికి] కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును.” (యోహాను 8:29) యేసు తన పరలోకపు తండ్రిని ఎంతగానో ప్రేమించి, “మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొ[న్నాడు].” (ఫిలిప్పీయులు 2:8) దానికి ప్రతిఫలంగా, యెహోవా యేసును ఆశీర్వదించి, తన తర్వాతి అధికారాన్ని ఘనతను పొందే స్థానానికి ఆయన్ని హెచ్చించాడు. (ఫిలిప్పీయులు 2:9-11) యేసువలే, దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తూ, ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయనపట్ల మనకున్న ప్రేమను మనం చూపిస్తాం.—1 యోహాను 5:3.
18. ప్రార్థన విషయంలో యేసు ఏ విధంగా మాదిరిని ఉంచాడు?
18 యేసు ప్రార్థనాపరుడు. ఆయన తాను బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రార్థించాడు. (లూకా 3:21) తన 12 మంది అపొస్తలుల్ని ఎంపికచేసుకోవడానికి ముందు, ఆయన రాత్రంతా ప్రార్థిస్తూ గడిపాడు. (లూకా 6:12, 13) ప్రార్థన ఎలా చేయాలో యేసు తన శిష్యులకు బోధించాడు. (లూకా 11:1-4) తాను మరణించడానికి ముందు రాత్రి, ఆయన తన శిష్యుల కోసం ప్రార్థించాడు, వారితో కలిసి కూడా ప్రార్థించాడు. (యోహాను 17:1-26) ప్రార్థన అనేది యేసు జీవితంలో ఒక ప్రాముఖ్యమైన భాగం. మనం ఆయన అనుచరులం గనుక అది మన జీవితంలో కూడా ఒక ప్రాముఖ్యమైన భాగమై ఉండాలి. ప్రార్థనలో విశ్వానికే సర్వాధిపతియైన వానితో మాట్లాడటం ఎంత ఘనతో గదా! అంతేగాక, యెహోవా ప్రార్థనలకు జవాబిస్తాడు, యోహాను ఇలా రాశాడు: “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము.”—1 యోహాను 5:14, 15.
19. (ఎ) యేసు చూపించిన ఏ లక్షణాల్ని మనం అనుకరించాలి? (బి) యేసు జీవితాన్నీ, పరిచర్యనూ అధ్యయనం చేయడం నుండి మనం ఏ యే విధాలుగా ప్రయోజనం పొందుతాం?
19 యేసుక్రీస్తు భూ సంబంధమైన జీవితాన్నీ, పరిచర్యనూ మరింత సన్నిహితంగా పరిశీలించడం నుండి నేర్చుకోదగినది ఎంతో ఉంది! ఆయన చూపించిన లక్షణాలైన ప్రేమ, కనికరం, దయ, బలం, సంతుల్యత, సహేతుకత, విధేయత, ధైర్యం, నిస్వార్థం వంటి వాటిని ధ్యానించండి. యేసును గురించి మనం ఎంత నేర్చుకుంటే ఆయన నమ్మకమైన అనుచరులుగా ఉండాలనే మన కోరిక అంత తీవ్రం అవుతుంది. యేసును గూర్చిన జ్ఞానం మనల్ని యెహోవా దగ్గరకు తీసుకెళ్తుంది. ఎందుకంటే, యేసు తన పరలోకపు తండ్రి యొక్క పరిపూర్ణ ప్రతిబింబమై ఉన్నాడు. “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని తాను చెప్పగల్గేంత సన్నిహితత్వం యెహోవాతో ఆయనకు ఉంది.—యోహాను 14:9.
మిమ్మల్ని బలపర్చే దేవునిపై నమ్మకం ఉంచండి
20. యెహోవాతో నడుస్తూ ఉండడంలో మనమెలా నమ్మకాన్ని సంపాదించవచ్చు?
20 పిల్లలు అప్పుడప్పుడే నడవడం నేర్చుకుంటున్నప్పుడు, వాళ్లు తప్పటడుగులు వేస్తారు. పడిపోమనే ధీమాతో నడవడాన్ని వాళ్లెలా నేర్చుకుంటారు? సాధనా పట్టుదలలతో మాత్రమే. యెహోవాతోపాటు నడుస్తున్న వాళ్లు నిశ్చింతగా, సాఫీగా నడవడానికి కృషిచేస్తారు. దానికి కూడా సమయం, పట్టుదల అవసరం. “మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము” అని పౌలు దేవునితో నడవడంలో పట్టుదలకున్న ప్రాముఖ్యతను సూచించాడు.—1 థెస్సలొనీకయులు 4:1.
21. మనం యెహోవాతో నడుస్తుండగా, మనమే ఆశీర్వాదాల్ని అనుభవించగలం?
21 మనల్ని మనం దేవునికి పూర్తిగా అంకితం చేసుకుంటే, ఆయనతో నడుస్తూ ఉండేలా మనకు ఆయన సహాయం చేస్తాడు. (యెషయా 40:29-31) తన మార్గాల్లో నడుస్తున్న వారికి ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలతో ఈ లోకం అందిస్తున్నదేదీ సాటిరాదు. ‘మనకు ప్రయోజనము కలుగునట్లు ఉపదేశము చేస్తున్నదీ, మనం నడవవలసిన త్రోవలో మనల్ని నడిపించేదీ’ ఆయనే. ‘మనం ఆయన ఆజ్ఞలను ఆలకించినట్లైతే, మన క్షేమము నదివలెను, మన నీతి సముద్రతరంగములవలెను ఉంటుంది.’ (యెషయా 48:17, 18) దేవునితో నడవాలని పిలిచిన ఆహ్వానాన్ని అంగీకరించి, నమ్మకంగా అలా నడవడం ద్వారా, ఆయనతో సమాధానాన్ని మనం నిరంతరం అనుభవించగలం.
మీరెలా ప్రతిస్పందిస్తారు?
◻ సత్య దేవునితో నడవడం ఎందుకు ఘనమైన విషయం?
◻ యెహోవాతో నడుస్తూ ఉండడంలో ఎందుకు పఠనం, సమర్పణా బాప్తిస్మాలు తొలి అడుగులై ఉన్నాయి?
◻ యేసు అడుగు జాడలను మనమెలా అనుసరించవచ్చు?
◻ మనం యెహోవాతో నడుస్తుండగా ఆయన మనల్ని బలపర్చగలడని మనకెలా తెలుసు?
[13వ పేజీలోని చిత్రాలు]
దేవునితో నడుస్తూ ఉండడంలో పఠనం, సమర్పణా బాప్తిస్మాలు తొలి అడుగులై ఉన్నాయి