మీ ప్రార్థనలు “ధూపమువలె” సిద్ధంచేయబడుతున్నాయా?
‘నా ప్రార్థన ధూపమువలె ఉండును గాక.’—కీర్తన 141:2.
1, 2. ధూపము వేయడం దేన్ని సూచిస్తుంది?
ఇశ్రాయేలీయుల ఆరాధనా గుడారంలో ఉపయోగించడానికి పరిశుద్ధమైన ధూపాన్ని సిద్ధం చేయమని యెహోవా దేవుడు తన ప్రవక్తయైన మోషేకు ఆజ్ఞాపించాడు. దైవిక నిర్దేశనం ప్రకారం నాలుగు రకాల సుగంధ ద్రవ్యాల్ని మిళితం చేయాలి. (నిర్గమకాండము 30:34-38) నిజంగా అది సుగంధంగా ఉండేది.
2 ఇశ్రాయేలు జనాంగం ఏ ధర్మశాస్త్ర నిబంధనలోకి తీసుకోబడ్డారో దాని ప్రకారం, రోజు ధూపం వేయవలసి ఉండేది. (నిర్గమకాండము 30:7, 8) ధూపం వేయడానికి ప్రత్యేకమైన విశిష్టత ఏమైనా ఉందా? అవును ఉంది, అందుకే కీర్తన గ్రంథకర్త ఇలా పాడాడు: “నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ [యెహోవా దేవుని] దృష్టికి అంగీకారములగును గాక.” (కీర్తన 141:2) దేవుని పరలోక సింహాసనం చుట్టూ ఉన్నవారు ధూపద్రవ్యములతో నిండివున్న బంగారు పాత్రలను పట్టుకొని ఉన్నారని అపొస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో వర్ణిస్తున్నాడు. “[ధూపద్రవ్యములతో నిండివున్న] ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు” అని ప్రేరేపిత వృత్తాంతం చెబుతుంది. (ప్రకటన 5:8) కాబట్టి సుగంధ భరితమైన ధూపద్రవ్యములను వేయడం యెహోవా సేవకులు రాత్రింబగళ్లు అర్పించే అంగీకారయుక్తమైన ప్రార్థనలను సూచిస్తుంది.—1 థెస్సలొనీకయులు 3:9; హెబ్రీయులు 5:7.
3. ‘మన ప్రార్థనలను దేవుని ఎదుట ధూపం వలె సిద్ధం చేయడానికి’ మనకు ఏది సహాయం చేయాలి?
3 మన ప్రార్థనలు దేవునికి అంగీకారయుక్తమైనవిగా ఉండాలంటే, మనం యేసుక్రీస్తు నామమున ఆయనను ప్రార్థించాలి. (యోహాను 16:23, 24) కాని మనం మన ప్రార్థనల నాణ్యతను ఎలా మెరుగుపర్చుకోవచ్చు? కొన్ని లేఖనాధారిత ఉదాహరణలను పరిశీలించడం, మన ప్రార్థనలు యెహోవా యెదుట ధూపంవలె ఉండేలా సిద్ధం చేయడానికి మనకు సహాయం చేయాలి.—సామెతలు 15:8.
విశ్వాసంతో ప్రార్థనలు చేయండి
4. విశ్వాసం, అంగీకారయుక్తమైన ప్రార్థనతో ఎలా సంబంధం కల్గివుంది?
4 మన ప్రార్థనలు సుగంధ భరితమైన ధూపంగా పైకి—దేవుని దగ్గరికి వెళ్లాలంటే, మనం విశ్వాసంతో ప్రార్థించాలి. (హెబ్రీయులు 11:6) క్రైస్తవ పెద్దలు ఆధ్యాత్మికంగా రోగియైయున్న వ్యక్తి తాము ఇచ్చే లేఖనాధారిత సహాయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనుగొన్నప్పుడు, వారి “విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును.” (యాకోబు 5:15) విశ్వాసంతో చేసే ప్రార్థనలు, అలాగే దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా పఠించడం అనేవి మన పరలోక తండ్రికి ప్రీతిపాత్రమైనవి. “నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము” అని పాడినప్పుడు కీర్తన గ్రంథకర్త చక్కని దృక్పథాన్ని చూపించాడు. (కీర్తన 119:48, 66) మనం ‘చేతులెత్తి’ వినయంగా ప్రార్థిస్తూ, దేవుని ఆజ్ఞలకు అనుగుణ్యంగా నడుచుకోవడం ద్వారా విశ్వాసాన్ని కల్గివుందాము.
5. మనకు జ్ఞానం కొరవడితే మనమేమి చేయాలి?
5 ఒక సమస్యను ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానము మనకు కొరవడిందనుకోండి. బహుశ నిర్దిష్ట బైబిలు ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుందో లేదో మనకు కచ్చితంగా తెలియదనుకుందాము. ఇది మన ఆధ్యాత్మికతను బలహీనపర్చేందుకు అనుమతించే బదులు, మనం జ్ఞానం కోసం ప్రార్థిద్దాము. (గలతీయులు 5:7, 8; యాకోబు 1:5-7) అయితే, దేవుడు మనకు అద్భుతమైన రీతిగా జవాబివ్వాలని మనం ఎదురు చూడలేము. తన ప్రజలందరూ ఏమి చేయాలని ఆయన కోరుతున్నాడో దాన్ని చేయడం ద్వారా మనం మన ప్రార్థనలు యథార్థమైనవని చూపించవలసిన అవసరం ఉంది. ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేస్తున్న ప్రచురణల సహాయంతో, విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే విధంగా మనం లేఖనాలను పఠించడం అవసరం. (మత్తయి 24:45-47; యెహోషువ 1:7, 8) దేవుని ప్రజల కూటాల్లో క్రమంగా పాల్గొనడం ద్వారా మనం జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం కూడా అవసరం.—హెబ్రీయులు 10:24, 25.
6. (ఎ) మన కాలం గురించి, బైబిలు ప్రవచనాల నెరవేర్పు గురించి మనమందరం ఏమి గుర్తించాలి? (బి) యెహోవా నామం పరిశుద్ధ పర్చబడాలని మనం ఇప్పటికే ప్రార్థిస్తున్నట్లయితే, మనం ఇంకా ఏమి చేయాలి?
6 నేడు కొంతమంది క్రైస్తవులు, ఇప్పుడు మనం “అంత్యకాలము” యొక్క చివరి భాగంలో ఉన్నామనే విషయాన్ని తాము మరిచిపోయామని సూచిస్తూ, వ్యక్తిగతమైన గమ్యాలను, లక్ష్యాలను ఏర్పరచుకుంటున్నారు. (దానియేలు 12:4) అలాంటి వారు, 1914లో యెహోవా క్రీస్తును పరలోక రాజుగా నియమించినప్పుడు క్రీస్తు ప్రత్యక్షత ప్రారంభమైందనీ, ఆయన తన శత్రువుల మధ్యన పరిపాలిస్తున్నాడనీ చూపించే లేఖనాధార నిదర్శనమందు తమ విశ్వాసాన్ని పునరుద్దీపనం చేసుకోవాలని లేక బలపర్చుకోవాలని వారి తోటి విశ్వాసులు వారి కోసం ప్రార్థించడం సముచితంగా ఉంటుంది. (కీర్తన 110:1, 2; మత్తయి 24:3) “మహాబబులోను” అయిన అబద్ధమత నాశనం, యెహోవా ప్రజలపై మాగోగువాడైన గోగు చేసే సాతాను సంబంధమైన దాడి, అర్మగిద్దోను యుద్ధమందు సర్వశక్తిమంతుడైన దేవుడు వారిని కాపాడడం వంటి ప్రవచింపబడిన సంఘటనలన్నీ చాలా ఆకస్మికంగా అంటే సాపేక్షికంగా చాలాకొద్ది సమయంలోనే జరిగిపోతాయని మనమందరం గుర్తించాలి. (ప్రకటన 16:14, 15; 18:1-5; యెహెజ్కేలు 38:18-23) కాబట్టి ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండేందుకు దేవుని సహాయం కోసం మనం ప్రార్థిద్దాము. యెహోవా నామం పరిశుద్ధపర్చబడాలనీ, ఆయన రాజ్యం రావాలనీ, ఆయన చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లుగానే భూమి మీద కూడా నెరవేరాలనీ మనమందరం ఎడతెగక ప్రార్థిద్దాము. అవును, మనం విశ్వాసం కల్గివుంటూ, మన ప్రార్థనలు యథార్థమైనవనడానికి నిదర్శనాన్నిద్దాము. (మత్తయి 6:9, 10) వాస్తవానికి, యెహోవాను ప్రేమించేవారందరూ మొదట రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకి, అంతం రాకముందు సువార్తను ప్రకటించడంలో వీలైనంత ఎక్కువగా భాగం వహించుదురు గాక.—మత్తయి 6:33; 24:14.
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి
7. మొదటి దినవృత్తాంతములు 29:10-13 నందు కొంచెంగా వ్రాయబడివున్న దావీదు ప్రార్థన గురించి ఏది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది?
7 మన ప్రార్థనలను ‘ధూపమువలె సిద్ధం చేయడానికి’ మరో ప్రాముఖ్యమైన మార్గం ఏమిటంటే, హృదయపూర్వకంగా దేవుడ్ని స్తుతించడం, కృతజ్ఞతలు తెలియజేయడం. తానూ ఇశ్రాయేలు జనాంగమూ యెహోవా ఆలయ నిర్మాణానికి దోహదపడినప్పుడు రాజైన దావీదు అలాంటి ప్రార్థననే చేశాడు. దావీదు ఇలా ప్రార్థించాడు: “మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.”—1 దినవృత్తాంతములు 29:10-13.
8. (ఎ) కీర్తనలు 148 నుండి 150 నందున్న ఏ స్తుతి వచనాలు ప్రాముఖ్యంగా మీ హృదయాన్ని స్పృశిస్తున్నాయి? (బి) కీర్తన 27:4 నందు వ్యక్తపర్చబడిన భావాలే మనకూ ఉంటే, మనం ఏమి చేస్తాము?
8 స్తుతిని, కృతజ్ఞతను వ్యక్తపర్చే ఎంత చక్కని పదాలు! మన ప్రార్థనలు అంత అనర్గళంగా ఉండకపోయినప్పటికీ, అవి అంత హృదయపూర్వకంగానూ ఉండవచ్చు. కీర్తనల గ్రంథం కృతజ్ఞతా స్తుతులతో కూడిన ప్రార్థనలతో నిండివుంది. 148 నుండి 150 వరకున్న కీర్తనలలో స్తుతిని వ్యక్తపర్చే/తెలియజేసే చక్కని పదాలను కనుగొనవచ్చు. అనేక కీర్తనలలో దేవునిపట్ల గల కృతజ్ఞతాభావం వ్యక్తపర్చబడింది. దావీదు ఇలా పాడాడు: “యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.” (కీర్తన 27:4) సమాజముగా కూడిన యెహోవా ప్రజల కార్యకలాపాలన్నింటిలోనూ ఆసక్తితో పాల్గొనడం ద్వారా మనం అలాంటి ప్రార్థనలకు అనుగుణ్యంగా ప్రవర్తిద్దాము. (కీర్తన 26:12) ఇలా చేయడమూ, దేవుని వాక్యాన్ని ప్రతి రోజు ధ్యానించడమూ హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను సమీపించడానికి మనకు ఎన్నో కారణాలను ఇస్తాయి.
వినయంగా యెహోవా సహాయాన్ని అర్థించండి
9. రాజైన ఆసా ఎలా ప్రార్థించాడు, ఏ ఫలితంతో?
9 మనం యెహోవా సాక్షులముగా హృదయపూర్వకంగా ఆయన సేవ చేస్తున్నట్లయితే, సహాయం కొరకైన మన ప్రార్థనలను ఆయన తప్పక వింటాడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు. (యెషయా 43:10-12) యూదా రాజైన ఆసాను పరిశీలించండి. ఆయన చేసిన 41 సంవత్సరాల (సా.శ.పూ. 977-937) పరిపాలనలోని మొదటి 10 సంవత్సరాల్లో శాంతి నెలకొంది. తర్వాత ఐతియోపీయుడైన జీరా ఆధ్వర్యాన పదిలక్షలమందితో కూడిన సైన్యం యూదాపైకి దండెత్తింది. సంఖ్యలో తాము ఎంతో తక్కువగానే ఉన్నప్పటికీ, ఆసా, ఆయన సైన్యమూ దండెత్తి వచ్చిన వారిని ఎదుర్కోవడానికి బయల్దేరారు. అయితే, యుద్ధం ప్రారంభం కాకముందు ఆసా పట్టుదలతో ప్రార్థించాడు. విమోచించేందుకు యెహోవాకున్న శక్తిని ఆయన గుర్తించాడు. సహాయం కోసం అర్థిస్తూ రాజు ఇలా అన్నాడు: “నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి యున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొంద నియ్యకుము.” యెహోవా తన ఘనమైన నామము నిమిత్తం యూదాను రక్షించినప్పుడు సంపూర్ణ విజయం చేకూరింది. (2 దినవృత్తాంతములు 14:1-15) దేవుడు మనల్ని ఒక శ్రమ నుండి కాపాడినా లేక దాన్ని సహించడానికి మనల్ని బలపర్చినా, సహాయాన్ని కోరుతూ మనం చేసే ప్రార్థనలను ఆయన తప్పక వింటాడు.
10. ఏదైనా ఒక విషమ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియనప్పుడు, రాజైన యెహోషాపాతు ప్రార్థన ఎలా సహాయకరమైనదిగా నిరూపించబడగలదు?
10 ఏదైనా ఒక విషమ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియకపోతే, సహాయం కోసం మనం చేసే విజ్ఞాపనలను యెహోవా వింటాడనే నమ్మకాన్ని మనం కల్గివుండవచ్చు. దీనికి ఉదాహరణ, యూదా రాజైన యెహోషాపాతు కాలంలో జరిగింది, ఆయన 25 ఏళ్ల పరిపాలన సా.శ.పూ. 936లో ప్రారంభమైంది. మోయాబీయులు, అమ్మోనీయులు, శేయీరు మన్యవాసుల మూడు సైన్య సమూహాలు యూదాను జడిపించినప్పుడు, యెహోషాపాతు ఇలా వేడుకున్నాడు: “మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు.” శత్రువులు ఒకరినొకరు చంపుకునేలా వారి మధ్య గందరగోళాన్ని సృష్టించడం ద్వారా యెహోవా యూదా పక్షాన యుద్ధం చేశాడు. అలా వినయంగా చేసిన ఆ ప్రార్థనకు యెహోవా సమాధానమిచ్చాడు. ఫలితంగా, చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలు భీతి చెందాయి, యూదాలో శాంతి నెలకొంది. (2 దినవృత్తాంతములు 20:1-30) ఏదైనా విషమ పరిస్థితిని ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానం మనకు కొరవడినప్పుడు, యెహోషాపాతులా మనమిలా ప్రార్థించవచ్చు: ‘ఏమి చేయాలో మాకు తోచడం లేదు, యెహోవా నీవే మాకు దిక్కు.’ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన లేఖనాధార అంశాలను పరిశుద్ధాత్మ గుర్తు తెచ్చుకునేలా చేయవచ్చు, లేక మానవ అవగాహనకు అందని రీతిలో దేవుడు మనకు సహాయం చేయవచ్చు.—రోమీయులు 8:26, 27.
11. యెరూషలేము గోడకు సంబంధించి నెహెమ్యా తీసుకున్న చర్యల నుండి మనం ప్రార్థన గురించి ఏమి నేర్చుకోవచ్చు?
11 దేవుని సహాయం కోసం మనం ప్రార్థనలో పట్టుదల కల్గివుండవలసి ఉంటుంది. నాశనమైపోయిన యెరూషలేము గోడల గురించి, యూదా నివాసుల దీనావస్థ గురించి నెహెమ్యా ప్రలాపించాడు, ఏడ్చాడు, ఉపవాసమున్నాడు, రోజుల తరబడి ప్రార్థన చేశాడు. (నెహెమ్యా 1:1-11) ఆయన చేసిన ప్రార్థనలు సుగంధ భరితమైన ధూపములా దేవుని యొద్దకు చేరాయని స్పష్టమౌతుంది. ఒకరోజు పారసీక రాజైన అర్తహషస్త, “ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని” బాధపడుతున్న నెహెమ్యాను అడుగగా, “నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి”తినని నెహెమ్యా చెబుతున్నాడు. ఆ స్వల్ప మౌన ప్రార్థనకు సమాధానం లభించింది, ఎందుకంటే నాశనమైపోయిన గోడలను పునర్నిర్మించడానికి యెరూషలేముకు వెళ్లడం ద్వారా తన కోరికను తీర్చుకునే అవకాశం ఆయనకు లభించింది.—నెహెమ్యా 2:1-8.
ఎలా ప్రార్థించాలో యేసు మీకు బోధించేందుకు అవకాశమివ్వండి
12. యేసు నేర్పిన మాదిరి ప్రార్థనలోని ముఖ్యాంశాలను మీరు మీ సొంత మాటల్లో క్లుప్తంగా ఎలా చెబుతారు?
12 లేఖనాల్లో పొందుపర్చబడివున్న ప్రార్థనలన్నింటిలోకి, సుగంధ భరితమైన ధూపముగా యేసుక్రీస్తు సమర్పించిన మాదిరి ప్రార్థన ప్రాముఖ్యంగా నిర్దేశాత్మకమైనది. లూకా సువార్త ఇలా చెబుతుంది: “[యేసు] శిష్యులలో ఒకడు—ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను. అందుకాయన—మీరు ప్రార్థన చేయునప్పుడు—తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము; మేము మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను.” (లూకా 11:1-4; మత్తయి 6:9-13) పునరుచ్చరించడానికి కాదుగాని ఒక మాదిరిగా ఉండడానికి ఉద్దేశించబడిన ఈ ప్రార్థనను మనం పరిశీలిద్దాము.
13. “తండ్రీ, నీ నామము పరిశుద్ధపర్చబడును గాక” అనే మాటల ప్రాముఖ్యతను మీరెలా వివరిస్తారు?
13 “తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక.” (ఇటాలిక్కులు మావి.) యెహోవా సమర్పిత సేవకులకు ఆయనను తండ్రి అని సంబోధించే ప్రత్యేకమైన ఆధిక్యత ఉంది. ఏ సమస్య ఉన్నా పిల్లలు దయగల తండ్రిని వెంటనే సమీపించినట్లు, మనం క్రమంగా గౌరవపూర్వకంగా పూజ్యభావంతో దేవుణ్ని ప్రార్థించడంలో కొంత సమయాన్ని గడపాలి. (కీర్తన 103:13, 14) యెహోవా నామం పరిశుద్ధ పర్చబడడాన్ని గురించి మనకున్న శ్రద్ధ మన ప్రార్థనల్లో ప్రతిఫలించాలి, ఎందుకంటే దేవుని నామంపై వేయబడిన అపనిందలన్నీ తుడిచివేయబడాలని మనమెంతో అపేక్షిస్తున్నాము. అవును, యెహోవా నామం ప్రత్యేకపర్చబడి, పరిశుద్ధంగా లేక పవిత్రంగా ఎంచబడాలని మనం కోరుకుంటాము.—కీర్తన 5:11; 63:3, 4; 148:12, 13; యెహెజ్కేలు 38:23.
14. “నీ రాజ్యము వచ్చును గాక” అని ప్రార్థించడమంటే దాని భావమేమిటి?
14 “నీ రాజ్యము వచ్చును గాక.” (ఇటాలిక్కులు మావి.) రాజ్యమంటే యెహోవా కుమారుడైన యేసు చేతుల్లోను, ఇంకా ఆయనతోటి ‘పరిశుద్ధుల’ చేతుల్లోను ఉండే పరలోక మెస్సీయా ప్రభుత్వం ద్వారా వ్యక్తపర్చబడే యెహోవా ఆధిపత్యం. (దానియేలు 7:13, 14, 18, 27; ప్రకటన 20:6) దేవుని సర్వాధిపత్యాన్ని వ్యతిరేకించే భూ నివాసులందరినీ ఇక మీదట కన్పించకుండా నిర్మూలిస్తూ అది వారి పైకి త్వరలోనే “వచ్చును.” (దానియేలు 2:44) అప్పుడు యెహోవా చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లుగానే భూమి మీద నెరవేరుతుంది. (మత్తయి 6:10) విశ్వ సర్వాధిపతికి యథార్థంగా సేవ చేస్తున్న జీవులందరికీ అది ఎంతటి ఆనందాన్ని తెస్తుందో కదా!
15. “అనుదినాహారము” కోసం యెహోవాను అడగడం దేన్ని సూచిస్తుంది?
15 “మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము.” (ఇటాలిక్కులు మావి.) “అనుదినాహారము” కోసం యెహోవాను అడగడం, మనం పెద్ద మొత్తంలో కాదుగానీ మన అనుదిన అవసరాలకు తగినంతే అడుగడాన్ని సూచిస్తుంది. దేవుడు ఇస్తాడని మనం ఆయనయందు నమ్మకం కల్గివున్నప్పటికీ, ఆహారం, ఇంకా ఇతర అవసరమైనవి పొందడానికి మనం పని చేస్తూ మనకు అందుబాటులో ఉన్న సరైన మార్గాలన్నింటినీ ఉపయోగించుకుంటాము. (2 థెస్సలొనీకయులు 3:7-10) అయితే, మనం మన పరలోక దాతకు కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే వీటన్నిటి వెనుకా ఆయన ప్రేమ, జ్ఞానము, శక్తి ఉన్నాయి.—అపొస్తలుల కార్యములు 14:15-17.
16. దేవుని క్షమను మనం ఎలా పొందవచ్చు?
16 “మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము.” (ఇటాలిక్కులు మావి.) మనం అపరిపూర్ణులము పాపులము గనుక, మనం యెహోవా పరిపూర్ణ ప్రమాణాలను పూర్తిగా చేరుకోలేము. కాబట్టి యేసు విమోచనా క్రయధన బలి ఆధారంగా ఆయన క్షమ కోసం మనం వేడుకోవాలి. ‘ప్రార్థన ఆలకించేవాడు’ ఆ బలి విలువను మన పాపాలకు అన్వయించాలంటే, మనం పశ్చాత్తాపపడి, ఆయన ఏ క్రమశిక్షణను ఇచ్చినప్పటికీ దాన్ని తీసుకోవడానికి మనం సుముఖంగా ఉండాలి. (కీర్తన 65:2; రోమీయులు 5:8; 6:23; హెబ్రీయులు 12:4-11) అంతేగాక, మనకు వ్యతిరేకంగా పాపం చేసిన, ‘మనకచ్చియున్న వారిని మనం క్షమిస్తేనే’ దేవుని చేత క్షమించబడతామని మనం ఎదురు చూడవచ్చు.—మత్తయి 6:12, 14, 15.
17. “మమ్మును శోధనలోనికి తేకుము” అనే మాటల భావమేమిటి?
17 “మమ్మును శోధనలోనికి తేకుము.” (ఇటాలిక్కులు మావి.) యెహోవా కొన్ని సంగతులు జరుగడానికి కేవలం అనుమతించినప్పుడు యెహోవాయే వాటిని చేస్తున్నాడని బైబిలు కొన్నిసార్లు చెబుతుంది. (రూతు 1:20, 21) మనం పాపం చేసేలా దేవుడు మనల్ని శోధించడు. (యాకోబు 1:13) చెడు చేయాలనే శోధనలు అపవాది నుండి, పాపభరితమైన మన శరీరం నుండి, ఈ లోకం నుండి వస్తాయి. మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేలా సంగతుల్ని కల్పించే శోధకుడు సాతానే. (మత్తయి 4:3; 1 థెస్సలొనీకయులు 3:5) “మమ్మును శోధనలోనికి తేకుము” అని మనం విజ్ఞప్తి చేసినప్పుడు, ఆయనకు అవిధేయత చూపించేలా మనం శోధించబడినప్పుడు మనం తప్పిపోయేందుకు అనుమతించవద్దని దేవుణ్ని మనం అడుగుతున్నాము. మనం లొంగిపోకుండా, ‘దుష్టుడైన’ సాతానుకు చిక్కకుండా ఆయన మనకు నడిపింపునివ్వగల్గుతాడు.—మత్తయి 6:13; 1 కొరింథీయులు 10:13.
మీ ప్రార్థనలకు అనుగుణ్యంగా చర్యలు తీసుకోండి
18. ఆనందభరితమైన వివాహం కోసం, కుటుంబ జీవితం కోసం మనం చేసే ప్రార్థనలకు అనుగుణ్యంగా మనం ఎలా ప్రవర్తించవచ్చు?
18 యేసు నేర్పిన మాదిరి ప్రార్థనలో ప్రాథమికమైన అంశాలు చేర్చబడ్డాయి, కాని మనం దేని గురించైనా ప్రార్థించవచ్చు. ఉదాహరణకు, మనం ఆనందభరితమైన వివాహం కోసం మనకున్న కోరిక గురించి ప్రార్థించవచ్చు. వివాహం జరిగే వరకు పవిత్రతను కాపాడుకోవడానికి, మనం స్వయం-నియంత్రణ కోసం ప్రార్థించవచ్చు. అయితే మరి అవినీతికరమైన సాహిత్యానికి లేక వినోదానికి దూరంగా ఉండడం ద్వారా మనం మన ప్రార్థనలకు అనుగుణ్యంగా ప్రవర్తిద్దాము. “ప్రభువునందు మాత్రమే పెండ్లి” చేసుకోవాలని మనం దృఢ నిశ్చయత కల్గివుందాము. (1 కొరింథీయులు 7:39; ద్వితీయోపదేశకాండము 7:3, 4) వివాహమైన తర్వాత, దేవుని ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా, ఆనందాన్ని పొందాలని మనం చేసిన ప్రార్థనలకు అనుగుణ్యంగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. మనకు పిల్లలుంటే, వాళ్లు యెహోవా నమ్మకమైన సేవకులై ఉండాలని ప్రార్థించడం మాత్రమే సరిపోదు. బైబిలు పఠనం ద్వారా, వారితోపాటు క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవ్వడం ద్వారా వాళ్ల మనస్సుల్లో దేవుని సత్యాలను నాటేందుకు మనం చేయగలిగినదంతా తప్పకుండా చేయాలి.—ద్వితీయోపదేశకాండము 6:5-9; 31:12; సామెతలు 22:6.
19. మనం మన పరిచర్య గురించి ప్రార్థిస్తున్నట్లయితే మనమేమి చేయాలి?
19 పరిచర్యలో ఆశీర్వాదాల కోసం మనం ప్రార్థిస్తున్నామా? అలాగైతే రాజ్య ప్రకటన పనిలో అర్థవంతంగా పాల్గొనడం ద్వారా మనం అలాంటి ప్రార్థనలకు అనుగుణ్యంగా ప్రవర్తిద్దాము. ఇతరులు నిత్య జీవ మార్గంలోకి రావడానికి వారికి సహాయం చేసే అవకాశాల కోసం మనం ప్రార్థిస్తే, ఆసక్తిగల వారిని గురించిన వివరాలను చక్కగా వ్రాసి ఉంచుకుని, గృహ బైబిలు పఠనాలు నిర్వహించడానికి సమయాన్ని వెచ్చించేందుకు సంసిద్ధంగా ఉండాలి. ఒకవేళ మనం పయినీరుగా పూర్తికాల ప్రకటనా పని చేపట్టాలని కోరుకుంటుంటే అప్పుడేమిటి? మన ప్రకటనా కార్యకలాపాన్ని అధికం చేసుకోవడం ద్వారా, పయినీర్లతో కలిసి పరిచర్యలో పాల్గొనడం ద్వారా మనం మన ప్రార్థనలకు అనుగుణ్యంగా ఉండే చర్యలను తీసుకుందాము. అలాంటి చర్యలు తీసుకోవడం, మనం మన ప్రార్థనలకు అనుగుణ్యంగా ప్రవర్తిస్తున్నామని చూపిస్తుంది.
20. తర్వాతి శీర్షిక ఏ అంశాన్ని పరిశీలిస్తుంది?
20 మనం నమ్మకంగా యెహోవా సేవ చేస్తున్నట్లయితే, ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండే మన ప్రార్థనలకు ఆయన సమాధానం ఇస్తాడని మనం నమ్మకం కల్గివుండవచ్చు. (1 యోహాను 5:14, 15) బైబిల్లో వ్రాయబడివున్న కొన్ని ప్రార్థనలను పరిశీలించడం ద్వారా ప్రయోజనకరమైన అంశాలను తప్పకుండా పొందవచ్చు. ‘తమ ప్రార్థనలు యెహోవా ఎదుట ధూపము వలె’ ఉండాలని కోరుకుంటున్న వారికొరకైన ఇతర లేఖనాధార మార్గదర్శకాలను మా తర్వాతి శీర్షిక పరిశీలిస్తుంది.
మీరెలా సమాధానమిస్తారు?
◻ మనం ఎందుకు విశ్వాసంతో ప్రార్థించాలి?
◻ మన ప్రార్థనల్లో కృతజ్ఞతాస్తుతులు ఏ పాత్ర వహించాలి?
◻ ప్రార్థనలో మనం ఎందుకు నమ్మకంగా యెహోవా సహాయాన్ని కోరవచ్చు?
◻ మాదిరి ప్రార్థనలోని కొన్ని ముఖ్యాంశాలు ఏవి?
◻ మనం మన ప్రార్థనలకు అనుగుణ్యంగా ఎలా ప్రవర్తించవచ్చు?
[12వ పేజీలోని చిత్రం]
రాజైన యెహోషాపాతులా, కొన్నిసార్లు మనం ఇలా ప్రార్థించవలసి ఉంటుంది: ‘మేము ఏమి చేయాలో మాకు తోచడం లేదు, యెహోవా, నీవే మాకు దిక్కు’
[13వ పేజీలోని చిత్రం]
యేసు నేర్పిన మాదిరి ప్రార్థనకు అనుగుణ్యంగా మీరు ప్రార్థిస్తారా?