అంతర్దృష్టితోనూ, ఒప్పించే సామర్థ్యంతోనూ బోధించండి
“జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి [“అంతర్దృష్టి,” NW] కలిగించును, వాని పెదవులకు విద్య [“ఒప్పించే సామర్థ్యాన్ని,” NW] విస్తరింపజేయును.”—సామెతలు 16:23.
1. దేవుని వాక్యాన్ని బోధించడంలో కేవలం సమాచారాన్ని తెలియజేయడంకంటే ఎక్కువే ఎందుకు ఇమిడివుంది?
దేవుని వాక్య బోధకులముగా మన లక్ష్యమేమిటంటే, మన విద్యార్థుల మనస్సులకు మాత్రమే గాక వారి హృదయాలకు కూడా ఆధ్యాత్మిక అంతర్దృష్టినివ్వాలన్నదే. (ఎఫెసీయులు 1:17) కాబట్టి బోధించడంలో కేవలం సమాచారాన్ని తెలియజేయడం కంటే ఎక్కువే ఇమిడివుంది. సామెతలు 16:23 ఇలా చెబుతుంది: “జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి [“అంతర్దృష్టి,” NW] కలిగించును, వాని పెదవులకు విద్య [“ఒప్పించే సామర్థ్యాన్ని,” NW] విస్తరింపజేయును.”
2. (ఎ) ఒప్పించడమంటే ఏమిటి? (బి) ఒప్పించే బోధకులై ఉండడం క్రైస్తవులందరికీ ఎలా సాధ్యం?
2 అపొస్తలుడైన పౌలు తన బోధనా పనిలో ఈ సూత్రాన్ని తప్పక అన్వయించుకున్నాడు. ఆయన కొరింథులో ఉన్నప్పుడు, “ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.” (అపొస్తలుల కార్యములు 18:4) ఒక ఆధికారిక మూలం ప్రకారం, ఇక్కడ ‘ఒప్పించడం’ అని అనువదించబడిన గ్రీకు పదానికి, “తర్క ప్రభావంతో లేక నైతిక తలంపుల ప్రభావంతో మనస్సులో మార్పు తీసుకురావడం” అని భావం. పౌలు ఒప్పింపజేసే వాదనలతో, ప్రజలు తమ ఆలోచనా విధానాన్నే మార్చుకునేలా వారిని ప్రేరేపించగలిగేవాడు. ఒప్పించే ఆయన సామర్థ్యం ఎంత అద్భుతంగా ఉండేదంటే, ఆయనంటే ఆయన శత్రువులు భయపడిపోయేవారు. (అపొస్తలుల కార్యములు 19:24-27) ఏదేమైనప్పటికీ, పౌలు చేసిన బోధ మానవ సామర్థ్యపు ప్రదర్శన కాదు. ఆయన కొరింథీయులకిలా చెప్పాడు: “మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని [“ఒప్పించే,” NW] మాటలను వినియోగింపక, పరిశుద్దాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.” (1 కొరింథీయులు 2:4) క్రైస్తవులందరూ యెహోవా దేవుని ఆత్మ సహాయాన్ని పొందవచ్చు గనుక, అందరూ ఒప్పించే బోధకులై ఉండవచ్చు. కాని ఎలా? ప్రభావవంతమైన బోధనా టెక్నిక్లను కొన్నింటిని మనం పరిశీలిద్దాము.
చక్కగా వినేవారై ఉండండి
3. ఇతరులకు బోధించేటప్పుడు అంతర్దృష్టి ఎందుకవసరం, మనం బైబిలు విద్యార్థి హృదయాన్ని ఎలా చేరవచ్చు?
3 బోధించడంలోని మొదటి టెక్నిక్ మాట్లాడడం కాదు గాని వినడం. సామెతలు 16:23 నందు పేర్కొనబడినట్లు, ఒప్పించడానికి మనకు అంతర్దృష్టి ఉండాలి. తాను ఎవరికైతే బోధించాడో వారి గురించి యేసుకు కచ్చితంగా అంతర్దృష్టి ఉండింది. “ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు” అని యోహాను 2:24 చెబుతుంది. కాని మనం ఎవరికైతే బోధిస్తున్నామో వారి హృదయాల్లో ఏముందో మనమెలా తెలుసుకోవచ్చు? ఒక మార్గమేమిటంటే, చక్కగా వినేవారై ఉండడమే. యాకోబు 1:19 ఇలా చెబుతుంది: ‘ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై యుండవలెను.’ నిజమే, అందరూ తమ తలంపులను వెంటనే వ్యక్తం చేయకపోవచ్చు. తమ పట్ల మనకున్న నిజమైన ఆసక్తిని గురించి మన బైబిలు విద్యార్థులు పూర్తిగా ఒప్పింపబడినప్పుడు, వారు తమ నిజమైన భావాలను వ్యక్తపర్చడానికి మరింత సుముఖంగా ఉండవచ్చు. దయతో కూడిన వివేచనాత్మకమైన ప్రశ్నలు హృదయాన్ని చేరడానికి తరచూ సహాయం చేసి, అలాంటి భావాలను ‘పైకి చేదుతాయి.’—సామెతలు 20:5.
4. క్రైస్తవ పెద్దలు ఎందుకు చక్కగా వినేవారై ఉండాలి?
4 ప్రాముఖ్యంగా, క్రైస్తవ పెద్దలు చక్కగా వినేవారై ఉండడం ముఖ్యం. అప్పుడే వాళ్లు నిజంగా “ప్రతి మనుష్యునికి [తాము] ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో తెలిసికొన”గల్గుతారు. (కొలొస్సయులు 4:6) “సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును” అని సామెతలు 18:13 హెచ్చరిస్తుంది. ఒక సహోదరి కొన్నిసార్లు కూటాలకు రాలేకపోయినందుకు, సదుద్దేశంగల ఇద్దరు పెద్దలు ఐహికసంబంధమైన విషయాలపై ఆమెకు హితబోధ చేశారు. తాను ఎందుకు హాజరుకాలేకపోయిందో చెప్పమని వాళ్లు తనను అడగనందుకు ఆ సహోదరి ఎంతగానో నొచ్చుకుంది. తాను ఇటీవలెనే చేయించుకున్న శస్త్ర చికిత్స నుండి కోలుకుంటోంది. కాబట్టి, మనం హితబోధ చేసే ముందు వినడం ఎంత ప్రాముఖ్యమో కదా!
5. సహోదరుల మధ్య తలెత్తే వివాదాలను పెద్దలు ఎలా పరిష్కరించవచ్చు?
5 పెద్దల విషయానికొస్తే, బోధించడంలో తరచూ ఇతరులకు హితబోధ చేయడం ఇమిడివుంటుంది. ఇక్కడ కూడా, చక్కగా వినేవారై ఉండడం ప్రాముఖ్యం. ముఖ్యంగా, తోటి క్రైస్తవుల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు వినడం మరెక్కువ అవసరం. కేవలం విన్న తర్వాతనే పెద్దలు ‘పక్షపాతములేకుండ తీర్పుతీర్చు తండ్రిని’ అనుకరించగల్గుతారు. (1 పేతురు 1:17) అలాంటి పరిస్థితుల్లో సాధారణంగా భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి, “వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయతే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును” అని సామెతలు 18:17 ఇస్తున్న సలహాను పెద్దలు మనస్సులో ఉంచుకోవడం మంచిది. ప్రభావవంతమైన బోధకుడు ఇరువర్గాలు చెప్పేదీ వింటాడు. ప్రార్థన చేయడం ద్వారా, ఆయన ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి దోహదపడతాడు. (యాకోబు 3:18) భావోద్వేగాలు తీవ్రరూపం దాల్చినప్పుడు, ఇద్దరూ ఒకరితో ఒకరు వాదులాడుకునే బదులు, ఒక్కో సహోదరుడు తన చింతల గురించి తనతోనే సూటిగా చెప్పడం మంచిదని ఆయన సూచించవచ్చు. పెద్ద, సముచితమైన ప్రశ్నలు వేయడం ద్వారా పరిశీలించబడుతున్న వివాదాంశాలను సరిచేయగల్గుతాడు. అనేక సందర్భాల్లో, వివాదాలకు కారణం తీవ్రమైన ద్వేషం కాదుగాని, విషయాలను గురించి అరమరికలు లేకుండా పరస్పరం సంభాషించుకోక పోవడమేనని తేలుతుంది. కాని బైబిలు సూత్రాలను గనుక ఉల్లంఘించడం జరిగితే, ప్రేమగల బోధకుడు ఇరువర్గాలు చెప్పేదీ విన్న తర్వాత, అంతర్దృష్టితో ఉపదేశించగల్గుతాడు.
సరళత విలువ
6. సరళంగా బోధించడంలో పౌలు మరియు యేసు ఎలా మాదిరి నుంచారు?
6 విషయాలను సరళంగా చెప్పడం మరొక విలువైన బోధనా నైపుణ్యం. నిజమే, బైబిలు విద్యార్థులు, “సమస్త పరిశుద్ధులతో” పాటు సత్యము యొక్క ‘వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించాలని’ మనం కోరుకుంటాము. (ఎఫెసీయులు 3:15) అద్భుతమైనవిగా, తరచూ సవాలుతో కూడినవిగా ఉండే అంశాలుగల బైబిలు సిద్ధాంతాలున్నాయి. (రోమీయులు 11:33) అయినప్పటికీ, పౌలు గ్రీకులకు ప్రకటించినప్పుడు, ఆయన “కొరతవేయబడిన క్రీస్తును” గురించిన సరళమైన సందేశంపైనే కేంద్రీకరించాడు. (1 కొరింథీయులు 2:1, 2, NW) అలాగే, యేసు సరళంగానూ, స్పష్టంగానూ ప్రకటించాడు. ఆయన తన కొండమీది ప్రసంగంలో, సరళమైన పదజాలాన్ని ఉపయోగించాడు. అయినప్పటికీ, దానిలో ఇంతకు మునుపెన్నడూ చెప్పబడనటువంటి కొన్ని లోతైన సత్యాలున్నాయి.—మత్తయి, 5-7 అధ్యాయాలు.
7. బైబిలు పఠనాలను నిర్వహించేటప్పుడు, మనం సరళంగా ఎలా బోధించవచ్చు?
7 అలాగే మనం బైబిలు పఠనాలను నిర్వహించేటప్పుడు సరళంగా బోధించాలి. ఎలా? “మరింత ప్రాముఖ్యమైన విషయాలపై” కేంద్రీకరించడం ద్వారా మనమలా చేయవచ్చు. (ఫిలిప్పీయులు 1:10, NW) లోతైన విషయాలను వివరించేటప్పుడు, మనం సరళమైన భాషలో మన ఉద్దేశాలను వ్యక్తపర్చడానికి ప్రయత్నించాలి. ప్రచురణలో ఉదాహరించబడిన బైబిలు లేఖనాలన్నింటినీ చదివి చర్చించే బదులు, మనం కీలకమైన లేఖనాలపైనే కేంద్రీకరించాలి. దీనికి మనం చక్కగా సిద్ధపడవలసి ఉంటుంది. ఎక్కువ ప్రాముఖ్యమైనవి కాని అంశాలచే దారి తప్పిపోకుండా జాగ్రత్త వహిస్తూ, వివరణలన్నింటితో విద్యార్థిని ఉక్కిరిబిక్కిరి చేయడాన్ని నివారించాలి. పాఠంతో సూటిగా సంబంధంలేని ప్రశ్న ఏదైనా విద్యార్థి అడిగితే పాఠం ముగిసిన తర్వాత దాన్ని చర్చిద్దామని మనం యుక్తిగా సూచించవచ్చు.
ప్రశ్నలను ప్రభావవంతంగా ఉపయోగించడం
8. యేసు ప్రశ్నలను ప్రభావవంతంగా ఎలా ఉపయోగించాడు?
8 మరో ఉపయోగకరమైన బోధనా నైపుణ్యం ఏమిటంటే, ప్రభావవంతమైన ప్రశ్నలు వేయడం. యేసుక్రీస్తు తన బోధనాపనిలో ప్రశ్నలను విస్తృతంగా ఉపయోగించాడు. ఉదాహరణకు, యేసు పేతురును, ‘సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలు చేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా? అని అడిగెను. అతడు—అన్యులయొద్దనే అని చెప్పగా యేసు—ఆలాగైతే కుమారులు స్వతంత్రులేనని అతనితో చెప్పెను.’ (మత్తయి 17:24-27) ఆలయంలో ఆరాధింపబడుతున్న వాని అద్వితీయ కుమారునిగా యేసుకు, ఆలయ పన్ను కట్టవలసిన బాధ్యత నిజానికి లేదు. కాని ప్రశ్నలను ప్రభావవంతంగా ఉపయోగించడం ద్వారా యేసు ఆ సత్యాన్ని తెలియజేశాడు. అలా పేతురు తనకు అప్పటికే తెలిసిన సమాచారం ఆధారంగా సరైన ముగింపుకు రావడానికి యేసు ఆయనకు సహాయం చేశాడు.
9. బైబిలు పఠనాల సమయంలో మనం ప్రశ్నలను ఎలా ఉపయోగించవచ్చు?
9 బైబిలు పఠనాల సమయంలో మనం ప్రశ్నలను ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు. ఒకవేళ ఒక విద్యార్థి తప్పు సమాధానం చెబితే, సరైన సమాధానాన్ని అతనికి తెల్పాలని మనకు ఎంతగానో అనిపించవచ్చు, కాని అలా చెబితే అతడు దాన్ని నిజంగా గుర్తుంచుకుంటాడా? ప్రశ్నలు వేయడం ద్వారా, విద్యార్థి సరైన ముగింపుకు వచ్చేలా సహాయం చేయడమే తరచూ శ్రేష్ఠమైన పనియై ఉంటుంది. ఉదాహరణకు, దైవిక నామాన్ని అతడు ఎందుకు ఉపయోగించాలి అనే దాన్ని గ్రహించడం అతనికి కష్టంగా ఉందనుకోండి. అప్పుడు, ‘మీకు మీ పేరు ప్రాముఖ్యమైనదా? . . . ఎందుకు? . . . ఎవరైనా మీ పేరు ఉపయోగించడానికి నిరాకరిస్తే మీరెలా భావిస్తారు? . . . మనం తన స్వకీయ నామాన్ని ఉపయోగించాలని దేవుడు కోరడం సహేతుకం కాదంటారా?’ అని మనం ప్రశ్నించవచ్చు.
10. మానసికంగా గాయపడిన వారికి సహాయం చేయడంలో పెద్దలు ప్రశ్నలను ఎలా ఉపయోగించవచ్చు?
10 మందను కాసేపనిలో కూడా పెద్దలు ప్రశ్నలను చక్కగా ఉపయోగించవచ్చు. సంఘంలోని చాలామంది సాతాను లోకం మూలంగా మానసికంగా దెబ్బతిన్నారు, గాయపర్చబడ్డారు. అలాంటి వాళ్లు తాము అపవిత్రులమనీ, ప్రేమించబడడానికి అనర్హులమనీ భావించవచ్చు. అలాంటి వ్యక్తితో, ‘మీరు అపవిత్రులని మీరనుకుంటున్నప్పటికీ, యెహోవా మిమ్మల్ని ఎలా దృష్టిస్తున్నాడు? మన ప్రేమగల పరలోక తండ్రి తన కుమారుడు మీ కోసం మరణించి, విమోచన క్రయధనం చెల్లించడానికి అనుమతించాడంటే దాని భావం, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని కాదా?’ అంటూ పెద్ద అతనితో తర్కించవచ్చు.—యోహాను 3:16.
11. వాక్యాలంకార ప్రశ్నల ద్వారా ఏ ఉద్దేశం నెరవేరుతుంది, బహిరంగంగా ప్రసంగించడంలో వాటిని ఎలా ఉపయోగించవచ్చు?
11 వాక్యాలంకార ప్రశ్నలు వేయడం మరో ఉపయోగకరమైన బోధనా నైపుణ్యం. వినేవారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అపేక్షించబడదు కాని, విషయాల గురించి తర్కించడానికి వారికి సహాయం లభిస్తుంది. ప్రాచీన కాలానికి చెందిన ప్రవక్తలు తమ శ్రోతలు లోతుగా ఆలోచించేలా చేసేందుకు తరచూ అలాంటి ప్రశ్నలు వేసేవారు. (యిర్మీయా 18:14, 15) అలాగే యేసు వాక్యాలంకార ప్రశ్నల్ని ప్రభావవంతంగా ఉపయోగించాడు. (మత్తయి 11:7-11) అలాంటి ప్రశ్నలు బహిరంగంగా ప్రసంగించేటప్పుడు ప్రాముఖ్యంగా ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. యెహోవాను సంతోషపర్చేందుకు పూర్ణాత్మతో ఆయన సేవ చేయాలి అని మాత్రం చెప్పేబదులు, ‘మనం నిజంగా పూర్ణాత్మతో సేవ చేయకపోతే, యెహోవా సంతోషిస్తాడా?’ అని ప్రశ్నించడం మరింత ప్రభావవంతంగా ఉండవచ్చు.
12. దృక్పథాలను తెలుసుకునే ప్రశ్నల విలువేమిటి?
12 బైబిలు విద్యార్థి తాను నేర్చుకుంటున్న దాన్ని నిజంగా నమ్ముతున్నాడా లేదా అనేది నిశ్చయించడంలో, దృక్పథాన్ని తెలుసుకునే ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి. (మత్తయి 16:13-16) వ్యభిచారం తప్పని ఒక విద్యార్థి సరిగ్గా సమాధానం చెప్పవచ్చు. కాని దానితోపాటు, నైతికత విషయంలో దేవుని ప్రమాణం గురించి వ్యక్తిగతంగా మీరెలా భావిస్తున్నారు? అది, మరీ నిర్బంధిస్తున్నట్లు అనిపిస్తుందా? మీరు దేవుని ప్రమాణాలను అనుసరిస్తారా లేదా అన్నది ప్రాముఖ్యమేనంటారా? వంటి ప్రశ్నలను ఎందుకు వేయకూడదు?
హృదయాన్ని చేరే ఉపమానాలు
13, 14. (ఎ) దేనినైనా ఉపమించడమంటే ఏమిటి? (బి) మంచి ఉపమానాలు ఎందుకు ప్రభావవంతమైనవిగా ఉంటాయి?
13 శ్రోతల మరియు బైబిలు విద్యార్థుల హృదయాన్ని చేరడానికి మరో మార్గం ప్రభావవంతమైన ఉపమానాలను ఉపయోగించడమే. “ఉపమానం” అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా, “ప్రక్కప్రక్కన ఉంచడం లేక కలిపి ఉంచడం” అని భావం. మీరు ఉపమించినప్పుడు, మీరు ఏదైనా ఒకదాన్ని వివరించడానికి దానివంటి దాన్నే ‘దాని ప్రక్కన ఉంచడం’ ద్వారా దాన్ని వివరిస్తారు. ఉదాహరణకు, యేసు ఇలా ప్రశ్నించాడు: “దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము?” సమాధానంగా యేసు సుపరిచితమైన ఆవగింజ గురించి ప్రస్తావించాడు.—మార్కు 4:30-32.
14 దేవుని ప్రవక్తలు ఎన్నో శక్తివంతమైన ఉపమానాలను ఉపయోగించారు. ఇశ్రాయేలీయులను శిక్షించడంలో దేవుని ఉపకరణంగా పని చేసిన అష్షూరీయులు విపరీతమైన క్రూరత్వానికి ఒడిగట్టినప్పుడు, యెషయా ఈ ఉపమానంతో వారి అహంకారాన్ని బయల్పరిచాడు: “గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా?” (యెషయా 10:15) ఇతరులకు బోధించేటప్పుడు, యేసు అలాగే ఉపమానాలను విస్తృతంగా ఉపయోగించాడు. “ఉపమానము లేక వారికి బోధింపలేదు” అని నివేదించబడింది. (మార్కు 4:34) మంచి ఉపమానాలు ప్రభావవంతంగా ఉంటాయి ఎందుకంటే అవి మనస్సుకూ, హృదయానికీ రెండింటికీ పని పెడతాయి. శ్రోతలు తమకు అప్పటికే తెలిసిన దానితో తాము వింటున్న దాన్ని పోల్చిచూడడం ద్వారా క్రొత్త సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి అవి దోహదపడతాయి.
15, 16. ఉపమానాలను ప్రభావవంతమైనవిగా ఏది చేస్తుంది? ఉదాహరణలు చెప్పండి.
15 నిజంగా హృదయాన్ని చేరగల ఉపమానాలను మనం ఎలా ఉపయోగించవచ్చు? మొట్టమొదటిగా, వివరించబడుతున్న విషయానికి ఉపమానం సాధ్యమైనంతమేరకు సమాంతరంగా ఉండాలి. పోలిక సరిగ్గా కుదరకపోతే, ఉపమానం శ్రోతలకు జ్ఞానాన్నిచ్చే బదులు వారి అవధానాన్ని ప్రక్కకు మళ్లిస్తుంది. మంచి ఉద్దేశంగల ఒక ప్రసంగీకుడు ఒకసారి, అభిషిక్త శేషము యేసుక్రీస్తు ఎడల కలిగివుండవలసిన వినయ దృక్పథాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తూ, వారిని నమ్మకమైన పెంపుడు కుక్కతో పోల్చాడు. కాని అలాంటి అప్రతిష్ఠకరమైన పోలిక నిజంగా సముచితమైనదేనా? బైబిలు అదే తలంపును ఎంతో ఆకర్షణీయమైన విధంగానూ, మర్యాదపూర్వకమైన విధంగానూ అందజేస్తోంది. అది, యేసు యొక్క 1,44,000 మంది అభిషిక్త అనుచరులను “తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తె”తో పోలుస్తుంది.—ప్రకటన 21:2.
16 ఉపమానాలు ప్రజల జీవితాలకు సంబంధించినవైనప్పుడు మరీ ప్రభావవంతంగా ఉంటాయి. వధింపబడిన గొఱ్ఱెపిల్లను గురించిన నాతాను ఉపమానం రాజైన దావీదు హృదయాన్ని ఎంతగానో తాకింది, ఎందుకంటే ఆయన తన యౌవనంలో గొఱ్రెలకాపరిగా పనిచేశాడు గనుక గొఱ్ఱెలంటే ఆయనకు ఎంతో మక్కువ. (1 సమూయేలు 16:11-13; 2 సమూయేలు 12:1-7) ఆ ఉపమానం ఒక ఎద్దును గూర్చినదైతే అంత ప్రభావవంతమైనదై ఉండకపోయేది. అదేవిధంగా, వైజ్ఞానిక సంఘటనల ఆధారంగా లేక అంతగా తెలియని చారిత్రక సంఘటనల ఆధారంగా చెప్పే ఉపమానాలు మన శ్రోతలకు అంత ప్రాముఖ్యమైనవై ఉండకపోవచ్చు. యేసు తన ఉపమానాలను అనుదిన జీవితం నుండి తీసుకున్నాడు. ఆయన ఆకాశ పక్షులు, అడవి పువ్వులు, వీధిలో ఆడుకునే పిల్లలు వంటి సర్వసాధారణమైన వాటి గురించి మాట్లాడాడు. (మత్తయి 5:15, 16; 6:26, 28) యేసు శ్రోతలు అలాంటి వాటిని సుళువుగా పోల్చుకోగలిగేవారు.
17. (ఎ) మనం ఉపమానాలను వేటిని ఆధారం చేసుకుని చెప్పవచ్చు? (బి) మన ప్రచురణల్లో ఉపయోగించబడిన ఉపమానాలను మనం మన విద్యార్థుల పరిస్థితులకు ఎలా అన్వయించవచ్చు?
17 మన పరిచర్యలో, సరళమైనవే అయినా ప్రభావవంతంగా ఉండే ఉపమానాలను ఉపయోగించగల ఎన్నో అవకాశాలు మనకు లభిస్తాయి. బాగా గమనించేవారై ఉండండి. (అపొస్తలుల కార్యములు 17:22, 23) బహుశ శ్రోత యొక్క పిల్లలను, ఇంటిని, ఉద్యోగాన్ని, లేక అలవాటును ఆధారం చేసుకుని ఒక ఉపమానం చెప్పవచ్చు. లేక పఠన సమాచారంలో మన కోసం ముందే ఇవ్వబడిన ఉపమానాలను మరింత ప్రభావవంతమైనవిగా చేసేందుకు, బైబిలు విద్యార్థి గురించి మనకు వ్యక్తిగతంగా తెలిసిన దాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలోని 8వ అధ్యాయంలోవున్న 14వ పేరాలోని ప్రభావవంతమైన ఉపమానాన్ని తీసుకోండి. పొరుగింటి వ్యక్తిచే నిందించబడిన ప్రేమగల తండ్రి గురించి అందులో చెప్పబడింది. తండ్రిగా ఉన్న మన బైబిలు విద్యార్థికి ఆ ఉపమానాన్ని ఎలా అన్వయింపజేయవచ్చుననేదాని గురించి మనం ముందుగా కొంత ఆలోచించవచ్చు.
లేఖనాలను నైపుణ్యవంతంగా చదవడం
18. మనం అనర్గళంగా చదివేవారిగా ఉండడానికి ఎందుకు కృషి చేయాలి?
18 “చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము” అని పౌలు తిమోతికి ఉద్బోధించాడు. (1 తిమోతి 4:13) మన బోధకు బైబిలు పునాది గనుక, దాన్ని అనర్గళంగా చదవగల్గడం ప్రయోజనకరమైనది. మోషేధర్మశాస్త్రాన్ని దేవుని ప్రజలకు చదివి వినిపించే ఆధిక్యత లేవీయులకు ఉండేది. అలా చదివేటప్పుడు వాళ్లు తడబడేవాళ్లా లేక భావరహితమైన విధంగా చదివేవాళ్లా? లేదు, నెహెమ్యా 8:8 నందు బైబిలిలా చెబుతుంది: “వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.”
19. మనం లేఖనాలను చదవడాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు?
19 చక్కని ప్రసంగీకులైవున్న కొంతమంది క్రైస్తవ పురుషులకు చదివే సామర్థ్యం అంతగా లేకపోవచ్చు. వాళ్లెలా మెరుగుపర్చుకోవచ్చు? అభ్యాసం చేయడం ద్వారానే. అవును, తాము అనర్గళంగా చదవగలిగేంత వరకు పదే పదే బిగ్గరగా చదవడం ద్వారా మెరుగుపర్చుకోవచ్చు. మీ భాషలో ఆడియో క్యాసెట్లు అందుబాటులో ఉంటే, అందులో చదువుతున్న వ్యక్తి భావం వచ్చేలా నొక్కి పలకడాన్నీ, స్వరభేదం చూపించడాన్నీ వినడం, అలాగే పేర్లనూ, అసాధారణమైన పదాలనూ ఎలా ఉచ్చరిస్తున్నాడన్నదాన్ని గమనించడం జ్ఞానయుక్తం. అభ్యాసముతో మహేరు-షాలాల్-హాష్-బజ్ వంటి పేర్లను కూడా ఎంతో సుళువుగా చదవవచ్చు.—యెషయా 8:1.
20. మనం ఎలా ‘మన బోధకు శ్రద్ధను’ ఇవ్వవచ్చు?
20 యెహోవా ప్రజలమైన మనకు, బోధకులుగా ఉపయోగించుకోబడే ఎంతటి ఆధిక్యత ఉందోకదా! కాబట్టి మనలో ప్రతి ఒక్కరం ఆ బాధ్యతను గంభీరంగా తీసుకుందాం. మనం ‘మనల్ని గూర్చి, మన బోధను గూర్చి ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగివుందాం.’ (1 తిమోతి 4:16) చక్కగా వినేవారిగా ఉండడం ద్వారానూ, సరళంగా బోధించడం ద్వారానూ, అంతర్దృష్టిగల ప్రశ్నలను వేయడం ద్వారానూ, ప్రభావవంతమైన ఉపమానాలను ఉపయోగించడం ద్వారానూ, లేఖనాలను నైపుణ్యవంతంగా చదవడం ద్వారానూ మనం మంచి బోధకులముగా ఉండగలం. యెహోవా తన సంస్థ ద్వారా అందజేస్తున్న తర్ఫీదు నుండి మనమందరం ప్రయోజనం పొందుదాం, ఎందుకంటే అది మనం “శిష్యునికి తగిన నోరు” కలిగివుండడానికి సహాయం చేస్తుంది. (యెషయా 50:4) బ్రోషూర్లు, ఆడియో క్యాసెట్లు, వీడియో క్యాసెట్లతో సహా మన పరిచర్య కోసం అందజేయబడుతున్న ఉపకరణాలన్నింటి నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందడం ద్వారా, మనం అంతర్దృష్టితోనూ, ఒప్పించే సామర్థ్యంతోనూ బోధించడాన్ని నేర్చుకోవచ్చు.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ చక్కగా వినేవారిగా ఉండడం మనకు మన బోధనా పనిలో ఎలా సహాయం చేయగలదు?
◻ సరళంగా బోధించడంలో మనం పౌలును, యేసును ఎలా అనుకరించవచ్చు?
◻ ఇతరులకు బోధించేటప్పుడు మనం ఏవిధమైన ప్రశ్నలను ఉపయోగించవచ్చు?
◻ ఏవిధమైన ఉపమానాలు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి?
◻ బహిరంగ చదువరులముగా మనం మన నైపుణ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు?
[16వ పేజీలోని చిత్రం]
మంచి బోధకుడు అవగాహనను ఏర్పరచుకోవడానికి వింటాడు
[18వ పేజీలోని చిత్రాలు]
యేసు తన ఉపమానాలను అనుదిన జీవితం నుండి తీసుకున్నాడు