మెలకువగా ఉండండి, తీవ్రంగా కృషిచేయండి!
“ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.”—మత్తయి 25:13.
1. అపొస్తలుడైన యోహాను దేని కోసం ఎదురు చూశాడు?
బైబిల్లోని చివరి మాటల్లో యేసు, “త్వరగా వచ్చుచున్నానని” వాగ్దానం చేశాడు. ఆయన అపొస్తలుడైన యోహాను ఇలా సమాధానమిచ్చాడు: “ఆమేన్! ప్రభువైన యేసూ, రమ్ము.” యేసు వస్తాడన్నదాంట్లో అపొస్తలునికి ఏ సందేహమూ లేదు. “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును [“ప్రత్యక్షత,” NW] [గ్రీకు, పరోసీయ] ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అని యేసును అడిగిన అపొస్తలులలో యోహాను కూడా ఉన్నాడు. అవును, యేసు భవిష్యద్ ప్రత్యక్షత కోసం యోహాను గట్టి నమ్మకంతో ఎదురు చూశాడు.—ప్రకటన 22:20; మత్తయి 24:3.
2. యేసు ప్రత్యక్షతకు సంబంధించి, చర్చీల్లో పరిస్థితి ఎలా ఉంది?
2 అలాంటి నమ్మకం నేడు అరుదుగా కనిపిస్తుంది. యేసు “రాకడ” గురించి అనేక చర్చీలకు ఒక అధికారిక సిద్ధాంతం ఉంది, కాని దాని కోసం నిజంగా ఎదురు చూసేది వాటి సభ్యుల్లో చాలా తక్కువమంది. వాళ్లు దానికి తగినట్లుగానే జీవిస్తారు. ద పరోసీయ ఇన్ ద న్యూ టెస్ట్‌మెంట్ అనే పుస్తకం ఇలా పేర్కొంటుంది: “చర్చీ జీవితంపై, తలంపుపై, పనిపై పరోసీయ నిరీక్షణ అంతంత మాత్రంగానే ప్రభావం కల్గివుంది. . . . పశ్చాత్తాపపడడం, సువార్త ప్రకటన పనిని కొనసాగించడం వంటి వాటిని చేపట్టడంలో చర్చీకి ఉండవలసిన అత్యవసర భావం బలహీనమైపోయింది, లేదా పూర్తిగా లేకుండాపోయింది.” కానీ అందరి విషయంలో అలా జరుగలేదు!
3. (ఎ) పరోసీయ గురించి నిజ క్రైస్తవులు ఎలా భావిస్తున్నారు? (బి) ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం ఏమి పరిశీలించాలి?
3 యేసు నిజ శిష్యులు ప్రస్తుత దుష్ట విధానాంతం కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నారు. మనం యథార్థంగా అలా ఎదురుచూస్తూ, యేసు ప్రత్యక్షతనందు ఇమిడివున్న దానంతటి విషయంలో సరైన దృక్పథాన్ని కల్గివుండి, దానికి అనుగుణంగా చర్య తీసుకోవలసిన అవసరం ఉంది. ‘అంతమువరకు సహించి రక్షింపబడడానికి’ అది మనకు సహాయం చేస్తుంది. (మత్తయి 24:13) మత్తయి 24, 25 అధ్యాయాలలో ఉన్న ప్రవచనాన్ని ఇచ్చేటప్పుడు, మనకు శాశ్వత ప్రయోజనం కలిగేలా మనం అన్వయించుకోగల జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని యేసు ఇచ్చాడు. 25వ అధ్యాయంలోవున్న ఉపమానాల గురించి బహుశ మీకు తెలిసే ఉండవచ్చు, వాటిలో పదిమంది కన్యకలను (బుద్ధిగల కన్యకలు, బుద్ధిలేని కన్యకలు) గురించిన ఉపమానం, తలాంతులను గురించిన ఉపమానం ఇమిడివున్నాయి. (మత్తయి 25:1-30) ఆ ఉపమానాల నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
ఐదుగురు కన్యకల వలె మెలకువగా ఉండండి!
4. కన్యకలను గురించిన ఉపమాన సారాంశమేమిటి?
4 మత్తయి 25:1-13నందున్న, కన్యకలను గురించిన ఉపమానాన్ని మీరు మళ్లీ చదవాలనుకోవచ్చు. అది యూదుల వైభవోపేతమైన వివాహ వేడుక. దానిలో పెండ్లికుమారుడు పెండ్లికుమార్తె తండ్రి ఇంటికి వెళ్లి అక్కడి నుండి ఆమెను తన ఇంటికి (లేక తన తండ్రి ఇంటికి) తీసుకువెళ్తాడు. అలాంటి ఊరేగింపులో వాద్యకారులూ, గాయకులూ కూడా ఉండవచ్చు, ఆ ఊరేగింపు చేరుకునే సమయం కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ఆ ఉపమానంలో, పెండ్లికుమారుని రాక కోసం ఆ పదిమంది కన్యకలు చాలా రాత్రి వరకు వేచివున్నారు. ఐదుగురు కన్యకలు బుద్ధిహీనంగా తమ దివిటీలకు కావల్సినంత నూనెను తెచ్చుకోలేదు. అందుకని నూనెను కొనుక్కోవడానికి వెళ్లాల్సి వచ్చింది. మిగతా ఐదుగురు బుద్ధిగలవారై, పెండ్లి కుమారుని రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో అవసరమైతే తమ దివిటీలలో నింపుకోవడానికి వీలుగా సిద్దెలలో అదనంగా నూనె తెచ్చుకున్నారు. పెండ్లికుమారుడు వచ్చినప్పుడు ఆయన కోసం ఎదురు చూస్తూ సంసిద్ధంగా ఉన్నది ఆ ఐదుగురే. పెండ్లి విందు లోపలకు ప్రవేశించడానికి వాళ్లకు మాత్రమే అనుమతి లభించింది. బుద్ధిలేని ఐదుగురు కన్యకలు తిరిగి వచ్చేసరికి, సమయం మించిపోయింది.
5. కన్యకలను గురించిన ఉపమానపు అలంకారిక భావంపై లేఖనాల వెలుగు ఎలా ప్రసరించబడింది?
5 ఈ ఉపమానంలోని అనేక అంశాలు సూచనార్థకమైనవని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, లేఖనాలు యేసును పెండ్లికుమారుడు అని చెప్తున్నాయి. (యోహాను 3:28-30) యేసు తనను పెండ్లి విందు ఏర్పాటు చేయబడిన ఒక రాజ కుమారునితో పోల్చుకున్నాడు. (మత్తయి 22:1-14) బైబిలు క్రీస్తును ఒక భర్తతో పోలుస్తుంది. (ఎఫెసీయులు 5:23) ఆసక్తికరంగా, అభిషిక్త క్రైస్తవులు మరో చోట క్రీస్తు “పెండ్లికుమార్తె”గా వర్ణించబడినప్పటికీ, ఈ ఉపమానంలో పెండ్లి కుమార్తె ప్రస్తావన లేదు. (యోహాను 3:29; ప్రకటన 19:6; 21:2, 9) అయితే అది పదిమంది కన్యకల గురించి మాట్లాడుతుంది, మరోచోట అభిషిక్తులు క్రీస్తుకు ప్రధానము చేయబడిన కన్యకతో పోల్చబడ్డారు.—2 కొరింథీయులు 11:2.a
6. కన్యకలను గురించిన ఉపమానాన్ని ముగించేటప్పుడు యేసు ఏ ఉద్బోధను ఇచ్చాడు?
6 అలాంటి వివరణలు, ఏవైనా ప్రవచనార్థక అన్వయింపులు మాత్రమే కాకుండా, ఈ ఉపమానం నుండి మనం నేర్చుకొనదగిన చక్కని సూత్రాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, యేసు ఈ మాటలతో దాన్ని ముగించాడని గమనించండి: “ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.” కాబట్టి మనలో ప్రతి ఒక్కరం, సమీపిస్తున్న ఈ దుష్ట విధానాంతం విషయంలో మెలకువగా, అప్రమత్తంగా ఉండవలసిన అవసరత గురించి ఈ ఉపమానం తెలియజేస్తుంది. మనం కచ్చితంగా ఒక తేదీని చెప్పలేకపోయినప్పటికీ, అంతం మాత్రం తప్పకుండా వస్తుంది. ఈ విషయంలో, రెండు వర్గాల కన్యకలు ప్రదర్శించిన దృక్పథాలను గమనించండి.
7. ఉపమానంలోని ఐదుగురు కన్యకలు ఏ భావంలో బుద్ధిలేనివారిగా నిరూపించుకున్నారు?
7 యేసు ఇలా చెప్పాడు: “వీరిలో అయదుగురు బుద్ధిలేనివారు.” పెండ్లికుమారుడు వస్తున్నాడని వాళ్లు నమ్మలేదు గనుక వాళ్లు బుద్ధిలేనివాళ్లా? వాళ్లు విలాసాలు అనుభవిస్తూ ఎక్కడో ఉన్నారా? లేక వాళ్లు మోసపోయారా? అవేవీ కాదు. ఈ ఐదుగురు ‘పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరారని’ యేసు చెప్పాడు. ఆయన వస్తున్నాడని వాళ్లకు తెలుసు, తాము కూడా అందులో పాల్గొనాలనీ, “పెండ్లి విందు”లో భాగం వహించాలనీ వాళ్లు ఇష్టపడ్డారు. అయితే, వాళ్లు తగినంతగా సిద్ధపడ్డారా? వాళ్లు ఆయన కోసం కొంతసేపటి వరకు అంటే “అర్ధరాత్రి” వరకు ఎదురు చూశారు. అంతేగానీ ఆయన రాక ఎప్పుడు వచ్చినా సరే, అంటే ఆయన రాక వాళ్లు ఎదురుచూసిన దానికన్నా కాస్త ముందైనా లేక కాస్త ఆలస్యమైనా సరే వాళ్లు సిద్ధపడిలేరు.
8. ఉపమానంలోని ఐదుగురు కన్యకలు బుద్ధిగలవారమని ఎలా నిరూపించుకున్నారు?
8 యేసు బుద్ధిగలవారు అని పిలిచిన మిగతా ఐదుగురు కన్యకలు కూడా పెండ్లి కుమారుని రాక కోసం ఎదురు చూస్తూ తమ దివిటీలను వెలిగించుకుని వెళ్లారు. వాళ్లు కూడా వేచి ఉండాల్సి వచ్చింది, కాని వాళ్లు “బుద్ధి” గలవారు. “బుద్ధి” అని అనువదించబడిన గ్రీకు పదం, “వివేకంగల, గ్రాహ్యతగల, ఆచరణాత్మకమైన వివేచనగల” అనే భావాలను కూడా అందజేస్తుంది. అవసరమైతే తమ దివిటీలను తిరిగి నింపుకోవడానికి అదనంగా తమ సిద్దెలలో నూనె తెచ్చుకోవడం ద్వారా ఈ ఐదుగురూ తాము బుద్ధిగలవారమని నిరూపించుకున్నారు. వాస్తవానికి, పెండ్లి కుమారుని కోసం సిద్ధంగా ఉండే విషయంలో వాళ్లు ఎంత శ్రద్ధ కల్గివున్నారంటే, వాళ్లు తమ నూనె ఇచ్చివేయడానికి సుముఖంగా లేరు. అలాంటి మెలకువ ఉంచకూడనిదానిపై చూపించినది కాదని, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ కన్యకలు అక్కడ ఉండడమూ, అదీ పూర్తిగా సిద్ధపడి ఉండడమూ నిరూపించాయి. ఆ “సిద్ధపడియున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయరి; అంతట తలుపు వేయబడెను.”
9, 10. కన్యకలను గురించి ఉపమాన ఉద్దేశమేమిటి, మనల్ని మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?
9 వివాహ వేడుకలో సరైన ప్రవర్తన కల్గివుండడం గురించో లేక మనకున్నదాన్ని ఇతరులతో పంచుకోవడం గురించో యేసు పాఠం బోధించడం లేదు. ఆయన చెప్తున్నదేమిటంటే: “ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.” మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘యేసు ప్రత్యక్షతకు సంబంధించి నేను నిజంగా మెలకువగా ఉన్నానా?’ యేసు ఇప్పుడు పరలోకంలో పరిపాలిస్తున్నాడని మనం నమ్ముతున్నాము, కాని ‘మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై రావడం’ అనే వాస్తవం మీద మనం మన మనస్సును ఎంతగా కేంద్రీకరిస్తున్నాము? (మత్తయి 24:30) పెండ్లి కుమారుని రాక, కన్యకలు మొదట ఆయనను కలవడానికి వెళ్లినప్పటికంటే “అర్ధరాత్రివేళ”కు కచ్చితంగా మరింత దగ్గరపడింది. అలాగే, ప్రస్తుత దుష్ట విధానాన్ని నాశనం చేయడానికి మనుష్య కుమారుని రాక, ఆయన రాక కోసం మనం ఎదురు చూడడం మొదలు పెట్టినప్పటికంటే ఇప్పుడు మరింత దగ్గరపడింది. (రోమీయులు 13:11-14) ఆ సమయం దగ్గరపడుతుండగా మరింత మెలకువగా ఉంటూ, మనం మన జాగరూకతను కాపాడుకుంటున్నామా?
10 ‘మెలకువగా ఉండుడి’ అనే ఆజ్ఞకు విధేయత చూపించడానికి ఎడతెగక అప్రమత్తంగా ఉండడం అవసరం. ఐదుగురు కన్యకలు తమ నూనె అయిపోయేంత వరకు చూస్తూ ఊరుకొని, ఆ తర్వాత నూనెను కొనితెచ్చుకోవడానికి వెళ్లారు. అదేవిధంగా ఒక క్రైస్తవుడు త్వరలోనే రానైయున్న యేసు కోసం తాను పూర్తిగా సిద్ధపడి ఉండకుండేలా ఏకాగ్రతను కోల్పోవచ్చు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులలో కొందరికి జరిగిందదే. నేడూ కొంతమందికి అదే జరుగవచ్చు. కాబట్టి ‘నాకూ అలాగే జరుగుతోందా?’ అని మనం ప్రశ్నించుకుందాం.—1 థెస్సలొనీకయులు 5:6-8; హెబ్రీయులు 2:1; 3:12; 12:3; ప్రకటన 16:15.
అంతం సమీపిస్తుండగా తీవ్రంగా కృషిచేయండి!
11. తర్వాత యేసు ఏ ఉపమానం చెప్పాడు, అది దేన్ని పోలివుంది?
11 యేసు తన తర్వాతి ఉపమానంలో, తన అనుచరులను తీవ్రంగా కృషి చేయమని ఉద్బోధించడం కన్నా ఎక్కువే చేశాడు. బుద్ధిగల, బుద్ధిలేని కన్యకల గురించి చెప్పిన తర్వాత, ఆయన తలాంతులను గూర్చిన ఉపమానాన్ని చెప్పాడు. (మత్తయి 25:14-30 చదవండి.) ఇది చాలా విషయాల్లో ఆయన మొదట చెప్పిన మీనాలను గురించిన ఉపమానాన్ని పోలివుంది. “దేవుని రాజ్యము వెంటనే అగుపడునని” చాలామంది “తలంచుటవలన” యేసు మీనాలను గురించిన ఆ ఉపమానాన్ని చెప్పాడు.—లూకా 19:11-27.
12. తలాంతులను గురించిన ఉపమాన సారాంశమేమిటి?
12 తలాంతులను గురించిన ఉపమానంలో, తాను దూరదేశానికి ప్రయాణమై వెళ్లడానికి ముందు ముగ్గురు దాసులను పిలిపించిన ఒక వ్యక్తి గురించి యేసు చెప్పాడు. ఆ వ్యక్తి ఒకరికి ఐదు తలాంతులను, మరొకరికి రెండు తలాంతులను, చివరి వ్యక్తికి కేవలం ఒక తలాంతును, అలా ‘ఎవరి సామర్థ్యం చొప్పున వారికి’ ఇచ్చాడు. బహుశ ఇది వెండి తలాంతు అయ్యుండవచ్చు, అప్పట్లో దాని ప్రామాణిక విలువ ఒక కూలివాడు 14 సంవత్సరాలపాటు శ్రమించి సంపాదించే మొత్తంతో సమానం, అంటే పెద్ద మొత్తమేనన్న మాట! ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు, తాను దూరంగా ఉన్న ఆ ‘బహు కాలంలో’ వాళ్లు ఏమి చేశారో చెప్పమని ఆయన తన దాసులను అడిగాడు. మొదటి ఇద్దరు దాసులు తమకు అప్పగించబడిన దాని విలువను రెండింతలు చేశారు. ఆయన “భళా” అని మెచ్చుకుని, వాళ్లిద్దరికీ మరింత బాధ్యతను ఇస్తానని వాగ్దానం చేసి, ‘మీ యజమానుని సంతోషములో పాలుపొందుడని’ అన్నాడు. ఒక తలాంతే ఇవ్వబడిన దాసుడు, తన యజమానుడు చాలా ఎక్కువగా ఆశించేవాడని ఆరోపిస్తూ, తనకివ్వబడిన తలాంతును ఏ విధమైన ప్రయోజనకరమైన పనికీ ఉపయోగించలేదు. అతడు డబ్బును దాచి ఉంచాడు. దాన్ని వడ్డీ వ్యాపారస్థుల దగ్గరన్నా పెట్టలేదు. కనీసం దానిపై వడ్డీయైనా వచ్చేది. అతడు తన యజమాని ఉద్దేశానికి వ్యతిరేకంగా పనిచేశాడు గనుక, యజమాని అతడ్ని ‘సోమరియైన చెడ్డదాసుడు’ అని పిలిచాడు. తత్ఫలితంగా, అతడి వద్ద నుండి ఆ తలాంతును తీసేసుకుని, “ఏడ్పును పండ్లు కొరుకుటయు” ఉండే వెలుపటి చీకటిలోనికి అతడిని త్రోసివేయడం జరిగింది.
13. ఉపమానంలోని యజమానిగా యేసు తనను తాను ఎలా నిరూపించుకున్నాడు?
13 మరోసారి, దీని గురించిన వివరాలను సూచనార్థక భావంలో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, దూరదేశానికి ప్రయాణమై వెళ్లిన వ్యక్తిగా ఉదహరించబడిన యేసు తన శిష్యులను విడిచి, పరలోకానికి వెళ్లి, తాను రాజ్యాధికారాన్ని పొందే వరకూ బహుకాలం వేచివున్నాడు.b (కీర్తన 110:1-4; అపొస్తలుల కార్యములు 2:34-36; రోమీయులు 8:34; హెబ్రీయులు 10:12, 13) అయితే మళ్లీ, మనమందరం మన జీవితంలో అన్వయించుకోవలసిన ఒక సమగ్రమైన పాఠాన్ని లేక సూత్రాన్ని గ్రహించవచ్చు. అదేమిటి?
14. తలాంతులను గూర్చిన ఉపమానం ఏ ప్రాముఖ్యమైన అవసరతను నొక్కి చెప్తుంది?
14 మన నిరీక్షణ పరలోకంలో అమర్త్యమైన జీవితమైనా లేక పరదైసు భూమిపై నిత్యజీవమైనా, మనం మన క్రైస్తవ కార్యకలాపాల్లో తీవ్రంగా కృషి చేయాలన్నది యేసు ఉపమానం నుండి స్పష్టమౌతుంది. వాస్తవానికి, ఈ ఉపమాన సందేశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే: తీవ్రమైన కృషి. ఈ విషయంలో సా.శ. 33 నుండి అపొస్తలులు మాదిరిని ఉంచారు. మనమిలా చదువుతాము: “ఇంకను అనేక విధములైన మాటలతో [పేతురు] సాక్ష్యమిచ్చి—మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.” (అపొస్తలుల కార్యములు 2:40-42) ఆయన తన కృషికి ఎంత చక్కని ప్రతిఫలాన్ని పొందాడు! క్రైస్తవ ప్రకటనా పనిలో ఇతరులు అపొస్తలులతో కలిసినప్పుడు, సువార్తను ‘సర్వలోకానికి వ్యాపింపజేయడంలో’ వాళ్లు కూడా తీవ్రంగా కృషిచేశారు.—కొలొస్సయులు 1:3-6, 23; 1 కొరింథీయులు 3:5-9.
15. తలాంతులను గూర్చిన ఉపమాన సారాంశాన్ని మనం ఏ ప్రత్యేకమైన విధంగా అన్వయించుకోవాలి?
15 ఈ ఉపమాన సందర్భాన్ని మనస్సులో ఉంచుకోండి—యేసు ప్రత్యక్షతను గురించిన ప్రవచనం. యేసు పరోసీయ ఇప్పుడు జరుగుతోందనడానికీ, అది త్వరలోనే ముగింపుకు చేరుకుంటుందనడానికీ మనకు తగినంత ఋజువు ఉంది. “అంతము”కు, క్రైస్తవులు చేయవలసిన పనికి యేసు పెట్టిన సంబంధాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) దీన్ని మనస్సులో ఉంచుకుని, మనం ఏ విధమైన దాసుని పోలివున్నాము? మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘నేను, బహుశ తన స్వంత విషయాలనైతే బాగా చక్కబెట్టుకుని, తనకు అప్పగించబడిన వాటిని దాచివుంచిన దాసునిలా ఉన్నాననడానికి కారణం ఉందా? లేక నేను మంచి, నమ్మకమైన దాసులవలె ఉన్నానని స్పష్టమౌతుందా? నేను యజమాని ఆస్తులను ప్రతి సందర్భంలోనూ వృద్ధి చేయాలని పూర్తిగా తీర్మానించుకున్నానా?’
ఆయన ప్రత్యక్షత సమయంలో మెలకువగా ఉండి, తీవ్రంగా కృషిచేయడం
16. మనం చర్చించిన రెండు ఉపమానాలు మీకు ఏ సందేశాన్ని ఇస్తున్నాయి?
16 అవును ఈ రెండు ఉపమానాలూ సూచనార్థకమైన, ప్రవచనార్థకమైన భావాన్ని కల్గివుండడమే గాక, అవి మనకు స్వయంగా యేసు నోటి నుండి స్పష్టమైన ప్రోత్సాహాన్ని అందజేస్తాయి. ఆయన ఇస్తున్న సందేశమిది: మెలకువగా ఉండండి; తీవ్రంగా కృషిచేయండి, మరిముఖ్యంగా క్రీస్తు పరోసీయ సూచన కనిపిస్తున్నప్పుడు. అంటే ఇప్పుడే. కనుక మనం నిజంగా మెలకువగా ఉంటున్నామా, తీవ్రంగా కృషి చేస్తున్నామా?
17, 18. యేసు ప్రత్యక్షత గురించి శిష్యుడైన యాకోబు ఏ ఉపదేశాన్ని ఇచ్చాడు?
17 యేసు చెప్పిన ప్రవచనాన్ని వినడానికి యేసు సహోదరుడైన యాకోబు ఒలీవల కొండ మీద లేడు; కాని తర్వాత ఆయన దాని గురించి తెలుసుకున్నాడు, దాని అర్థాన్ని ఆయన స్పష్టంగా గ్రహించాడు. ఆయనిలా వ్రాశాడు: “సహోదరులారా, ప్రభువు రాకడ [“ప్రత్యక్షత,” NW] వరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక [“ప్రత్యక్షత,” NW] సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.”—ఇటాలిక్కులు మావి. యాకోబు 5:7, 8.
18 తమ సంపదలను దుర్వినియోగం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడన్న హామీని ఇచ్చిన తర్వాత యాకోబు, చర్యను తీసుకునేలా యెహోవా కోసం ఎదురు చూసేటప్పుడు అసహనంగా ఉండవద్దని క్రైస్తవులను కోరాడు. అసహనంగా ఉండే క్రైస్తవుడు, జరిగిన తప్పులను తానే సరి దిద్దాలన్నట్లుగా ప్రతీకార దృక్పథంగల వానిగా తయారు కావచ్చు. అయితే అలా ఉండకూడదు, ఎందుకంటే తీర్పు తీర్చే సమయం తప్పక వస్తుంది. యాకోబు వివరించినట్లుగా, వ్యవసాయకుని గురించిన ఉదాహరణ దాన్ని ఉదాహరిస్తుంది.
19. ఇశ్రాయేలు రైతు ఏ విధమైన ఓపికను కనబరుస్తాడు?
19 విత్తనాలు జల్లిన ఇశ్రాయేలు రైతు, మొదట అవి మొలకెత్తడం కోసం, ఆ తర్వాత ఆ మొలకలు ఎదగడం కోసం, చివరికి కోత కోసం వేచి ఉండాలి. (లూకా 8:5-8; యోహాను 4:35) ఆ నెలల్లో, బహుశ చింత కలిగించే సమయాలు, పరిస్థితులు తలెత్తవచ్చు. తొలకరి వర్షాలు సకాలంలో కురుస్తాయా, తగినంతగా కురుస్తాయా? కడవరి వర్షాల సంగతేమిటి? క్రిమికీటకాలు లేక తుపాను పంటను నాశనం చేస్తుందా? (యోవేలు 1:4; 2:23-25 పోల్చండి.) ఏమైనప్పటికీ, మొత్తానికి ఇశ్రాయేలు రైతు యెహోవాపైనా, ఆయన ఏర్పరచిన ప్రకృతిపైనా నమ్మకముంచవచ్చు. (ద్వితీయోపదేశకాండము 11:14; యిర్మీయా 5:24) రైతు ఓపిక, నమ్మకమైన నిరీక్షణకు నిజంగా సరితూగుతుంది. తాను దేని కోసమైతే ఎదురు చూస్తున్నాడో అది వస్తుందని రైతు నమ్మకంగా తెలుసు. అది నిజంగా వస్తుంది!
20. యాకోబు ఉపదేశానికి అనుగుణంగా మనం సహనాన్ని ఎలా ప్రదర్శించవచ్చు?
20 కోతకాలం ఎప్పుడు వస్తుందనేదాని గురించి రైతుకు కొంత మేరకు తెలిసి ఉండివుండవచ్చు, అయితే యేసు ప్రత్యక్షత ఎప్పుడు వస్తుందనేది మొదటి శతాబ్దపు క్రైస్తవులు లెక్కించలేకపోయారు. అయితే అది తప్పక వస్తుంది. యాకోబు ఇలా వ్రాశాడు: “ప్రభువురాక [“ప్రత్యక్షత,” NW] సమీపించుచున్నది.” యాకోబు ఆ మాటలు వ్రాసే సమయానికి, క్రీస్తు ప్రత్యక్షతను గురించిన విస్తారమైన లేక భూవ్యాప్తమైన సూచన ఇంకా స్పష్టమవ్వలేదు. కాని ఇప్పుడైతే అది స్పష్టమైంది! కాబట్టి ఈ కాలంలో మనం ఎలా భావించాలి? సూచన నిజంగా స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని మనం చూస్తున్నాము. ‘సూచన నెరవేరడం నాకు కనిపిస్తోంది’ అని మనం కచ్చితంగా చెప్పగలం. ‘ప్రభువు ప్రత్యక్షత సమయంలో ఉన్నాం, దాని పరాకాష్ట త్వరలోనే’ అని మనం నమ్మకంగా చెప్పవచ్చు.
21. మనం ఏమి చేయడానికి కచ్చితంగా తీర్మానించుకుందాము?
21 ప్రభువు ప్రత్యక్షత త్వరలోనే ముగియనైవుంది గనుక, మనం చర్చించిన, యేసు చెప్పిన రెండు ఉపమానాలలోని ప్రాథమిక పాఠాలను హృదయంలోకి తీసుకుని అన్వయించుకోవడానికి ప్రత్యేకంగా మనకు గట్టి కారణం ఉంది. ఆయనిలా చెప్పాడు: “ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.” (మత్తయి 25:13) మనం మన క్రైస్తవ సేవలో ఆసక్తికలిగి ఉండడానికి నిస్సందేహంగా ఇదే మనకు సమయం. యేసు చెప్పిన విషయాన్ని మనం అర్థం చేసుకున్నామని మనం అనుదిన జీవితాల్లో చూపిద్దాము. మనం మెలకువగా ఉందాం! తీవ్రంగా కృషి చేద్దాం!
[అధస్సూచీలు]
a ఉపమానంలోని సూచనార్థక వివరాల కోసం, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన వెయ్యేళ్ల దేవుని రాజ్యం సమీపించింది (ఆంగ్లం) అనే పుస్తకంలోని 169-211 పేజీలను చూడండి.
b వెయ్యేళ్ల దేవుని రాజ్యం సమీపించింది (ఆంగ్లం) అనే పుస్తకంలోని 212-56 పేజీలను చూడండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ బుద్ధిగల, బుద్ధిలేని కన్యకలను గురించిన ఉపమానాల నుండి మీరు ఏ కీలక సందేశాన్ని నేర్చుకున్నారు?
◻ తలాంతులను గూర్చిన ఉపమానం ద్వారా, యేసు మీకు ఏ ప్రాథమిక ఉపదేశాన్ని ఇస్తున్నాడు?
◻ పరోసీయకు సంబంధించి మీ ఓపిక, ఏ భావంలో ఇశ్రాయేలు రైతు ఓపికను పోలివుంది?
◻ ఇది, ప్రత్యేకంగా ఎందుకు ఉత్తేజవంతమైన, సవాలుతోకూడిన సమయమై ఉంది?
[23వ పేజీలోని చిత్రాలు]
కన్యకలను గురించిన, తలాంతులను గురించిన ఉపమానాల నుండి మీరు ఏ పాఠాలు నేర్చుకుంటారు?