కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 9/15 పేజీలు 21-26
  • యెహోవా నేడు మన నుండి ఏమి అడుగుతున్నాడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా నేడు మన నుండి ఏమి అడుగుతున్నాడు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా అడిగేవి
  • ప్రేమ ప్రాముఖ్యత
  • మనం మన ప్రేమను ఎలా నిరూపించుకుంటాము
  • అది ఎందుకు కష్టంగా అన్పిస్తుండవచ్చు
  • హృదయంలో ప్రేమకు సంబంధించిన ధర్మవిధి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • క్రైస్తవ సంఘంలో ప్రేమ, న్యాయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • దేవుడు ప్రేమించేవారిలో మీరూ ఉన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 9/15 పేజీలు 21-26

యెహోవా నేడు మన నుండి ఏమి అడుగుతున్నాడు?

“ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము . . . మేఘములోనుండి పుట్టెను.”—మత్తయి 17:5.

1. ధర్మశాస్త్రం దాని సంకల్పాన్ని ఎప్పుడు నెరవేర్చింది?

యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రాన్నిచ్చాడు, అందులో అనేక అంశాలు ఉన్నాయి. వాటిని గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి.” (హెబ్రీయులు 9:10) ఇశ్రాయేలీయుల్లోని కొద్దిమంది యేసును మెస్సీయాగా లేక క్రీస్తుగా స్వీకరించేలా ధర్మశాస్త్రం నడిపించినప్పుడు అది దాని సంకల్పాన్ని నెరవేర్చింది. అందుకని పౌలు ఇలా ప్రకటించాడు: “క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు.”—రోమీయులు 10:4; గలతీయులు 3:19-25; 4:4, 5.

2. ధర్మశాస్త్రం క్రింద ఎవరు ఉన్నారు, వారు దాన్నుండి ఎప్పుడు విడుదల చేయబడ్డారు?

2 దీనర్థం నేడు ధర్మశాస్త్రం మనకు వర్తించదనా? నిజానికి మానవజాతిలోని అత్యధికశాతం ధర్మశాస్త్రం క్రింద ఎన్నడూ లేరు, కీర్తనల గ్రంథకర్త ఇలా వివరించాడు: “[యెహోవా] తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియండలేదు; ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి.” (కీర్తన 147:19, 20) యేసు బలి ఆధారంగా దేవుడు క్రొత్త నిబంధనను స్థాపించినప్పుడు చివరికి ఇశ్రాయేలు జనాంగానికి కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన బాధ్యత ఇక ఎంతమాత్రం లేదు. (గలతీయులు 3:13; ఎఫెసీయులు 2:14, 15; కొలొస్సయులు 2:13, 14, 16) ధర్మశాస్త్రం ఇక ఎంతమాత్రం వర్తించనట్లైతే, నేడు యెహోవాను సేవించాలనుకునే వారి నుండి ఆయన ఏమి అడుగుతున్నాడు?

యెహోవా అడిగేవి

3, 4. (ఎ) యెహోవా నేడు ప్రాథమికంగా మన నుండి ఏమి అడుగుతున్నాడు? (బి) మనం యేసు అడుగుజాడల్ని ఎందుకు దగ్గరగా అనుసరించాలి?

3 యేసు పరిచర్య చివరి సంవత్సరంలో, ఆయన అపొస్తలులైన పేతురు, యాకోబు, యోహానులు ఆయనతోపాటు ఎత్తైన ఒక కొండమీదికి, బహుశ హెర్మోను పర్వతంపైన ఒక చరియ మీదకి వెళ్లారు. అక్కడ వారు యేసు అద్భుతమైన మహిమలో ఉన్న ప్రవచనాత్మక దర్శనాన్ని చూశారు, దేవుని స్వంత స్వరం ఇలా ప్రకటించడాన్ని విన్నారు: “ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము . . . మేఘములోనుండి పుట్టెను.” (మత్తయి 17:1-5) ప్రాథమికంగా, యెహోవా మన నుండి అడుగుతున్నది ఇది—తన కుమారుని మాట విని, ఆయన మాదిరిని అనుకరించడం, ఆయన బోధల్ని అనుసరించడం. (మత్తయి 16:24) అందుకనే అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “క్రీస్తు . . . మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరియుంచిపోయెను.”—1 పేతురు 2:21.

4 మనం యేసు అడుగుజాడల్ని ఎందుకు దగ్గరగా అనుసరించాలి? ఎందుకంటే ఆయన్ను అనుకరించడం ద్వారా మనం యెహోవా దేవుణ్ని అనుకరిస్తున్న వారమౌతాము. యేసు తన తండ్రిని సన్నిహితంగా ఎరిగి ఉన్నాడు, ఎందుకంటే ఆయన భూమ్మీదికి రాకమునుపు ఆయనతోపాటు లెక్కలేనన్ని కోట్ల సంవత్సరాలు గడిపాడు. (సామెతలు 8:22-31; యోహాను 8:23; 17:5; కొలొస్సయులు 1:15-17) భూమ్మీద ఉన్నప్పుడు యేసు తన తండ్రికి యథార్థతతో ప్రాతినిధ్యం వహించాడు. ఆయనిలా వివరించాడు: “తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నా[ను].” నిజానికి యేసు యెహోవాను ఎంత కచ్చితంగా అనుకరించాడంటే ఆయనిలా చెప్పగలిగాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.”—యోహాను 8:28; 14:9.

5. క్రైస్తవులు ఏ నియమం క్రింద ఉన్నారు, ఆ నియమం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది?

5 యేసు మాట వినడంలోను ఆయన్ను అనుకరించడంలోను ఏమి ఇమిడివుంది? దానర్థం ఏదైనా నియమం క్రింద ఉన్నట్లా? పౌలు ఇలా వ్రాశాడు: “నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కా[ను].” ఇక్కడ ఆయన, ఇశ్రాయేలుతో చేయబడిన “పాతనిబంధన”ను అంటే ధర్మశాస్త్ర నిబంధనను సూచిస్తున్నాడు. కానీ తాను “క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను” అని ఆయన ఒప్పుకున్నాడు. (1 కొరింథీయులు 9:20, 21; 2 కొరింథీయులు 3:14) పాత ధర్మశాస్త్ర నిబంధన సమాప్తి కావడంతో ఒక “క్రొత్త నిబంధన” అమలులోనికి వచ్చింది. అందులో, నేటి యెహోవా సేవకులందరూ విధేయత చూపించాల్సిన బాధ్యత ఉన్న “క్రీస్తు నియమము” ఉంది.—లూకా 22:20; గలతీయులు 6:2; హెబ్రీయులు 8:7-13.

6. “క్రీస్తు నియమమును” ఎలా వర్ణించవచ్చు, మనం దాన్ని ఎలా పాటించగలము?

6 “క్రీస్తు నియమమును” యెహోవా పాత ధర్మశాస్త్ర నిబంధన విషయంలో చేసినట్లుగా వివిధ వర్గాలుగా సంస్థీకరిస్తూ దాన్ని ఒక శాసన స్మృతిలా వ్రాసివుంచలేదు. క్రీస్తు అనుచరుల కోసం ఇవ్వబడిన ఈ క్రొత్త నియమములో చెయ్యవలసిన, చేయకూడని విస్తారమైన పనుల పట్టిక లేదు. అయితే, యెహోవా తన వాక్యంలో తన కుమారుని జీవితం, బోధలను గూర్చిన నాలుగు సంగ్రహమైన వృత్తాంతాలను మాత్రం భద్రపర్చాడు. అంతేగాక వ్యక్తిగత ప్రవర్తన, సంఘ వ్యవహారాలు, కుటుంబంలో ప్రవర్తన, మరితర విషయాలకు సంబంధించిన లిఖితపూర్వకమైన ఉపదేశాలను వ్రాయడానికి యేసు తొలి అనుచరుల్లో కొందరిని దేవుడు ప్రేరేపించాడు. (1 కొరింథీయులు 6:18; 14:26-35; ఎఫెసీయులు 5:21-33; హెబ్రీయులు 10:24, 25) మనం మన జీవితాలను యేసుక్రీస్తు చూపిన మాదిరికి అనుగుణ్యంగా, ఆయన ఇచ్చిన బోధలకు అనుగుణ్యంగా మార్చుకున్నప్పుడు, మొదటి శతాబ్దపు ప్రేరేపిత బైబిలు రచయితల సలహాల్ని పాటించినప్పుడు మనం “క్రీస్తు నియమమును” పాటిస్తున్నట్లు అర్థం. యెహోవా నేడు తన సేవకులను ఇదే అడుగుతున్నాడు.

ప్రేమ ప్రాముఖ్యత

7. యేసు తన అపొస్తలులతో ఆచరించిన చివరి పస్కా సమయంలో తన నియమ సారాన్ని ఎలా నొక్కిచెప్పాడు?

7 ధర్మశాస్త్రంలో ప్రేమ ప్రాముఖ్యమైనదే అయినప్పటికీ, క్రీస్తు నియమములో అది కేంద్రకంగా ఉంటుంది, లేక అదే అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం. యేసు తన అపొస్తలులతో కలిసి సా.శ. 33వ సంవత్సరపు పస్కాను ఆచరించడానికి సమకూడినప్పుడు ఈ వాస్తవాన్ని ఆయన నొక్కిచెప్పాడు. ఆ రాత్రి జరిగినదాన్ని గురించిన అపొస్తలుడైన యోహాను సారాంశం ప్రకారం, యేసు హృదయపు లోతుల్లోనుండి వచ్చిన మాటల్లో ప్రేమను గురించిన ప్రస్తావన 29 సార్లు ఉంది. ఇది అపొస్తలులకు ఆయన నియమంలోని సారాన్ని లేదా పరమార్థాన్ని నొక్కిచెప్పింది. గమనార్హమైన విషయం ఏమిటంటే, యోహాను ఆ మహత్వపూర్ణమైన రాత్రి జరిగిన సంఘటనల వర్ణనను ఈ మాటలతో ప్రారంభిస్తున్నాడు: “తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.”—యోహాను 13:1.

8. (ఎ) అపొస్తలుల్లో ఎప్పుడూ ఉన్న ఒక వివాదం గురించి మనకు ఏ సూచన ఉంది? (బి) యేసు తన అపొస్తలులకు నమ్రతను గురించి ఎలా ఒక పాఠాన్ని నేర్పించాడు?

8 యేసు తన అపొస్తలులను ప్రేమించాడు, చివరికి అధికారం, హోదాల కోసం వారిలో ఉన్న తీవ్రమైన వాంఛను అధిగమించడానికి వారికి సహాయం చేయడంలో తాను చేసిన ప్రయత్నాలు స్పష్టంగా నిష్ఫలమైనవిగా ఉన్నప్పటికీ ఆయన వారిని ప్రేమించాడు. వారు యెరూషలేముకు రావడానికి ఎన్నో నెలల క్రితం, ‘వారు తమలో ఎవరు గొప్పవాడని వాదించుకున్నారు.’ వారు పస్కా కోసం నగరానికి రావడానికి కొంచెం ముందు హోదాను గూర్చిన వివాదం మళ్లీ తలెత్తింది. (మార్కు 9:33-37; 10:35-45) అపొస్తలులు తామందరూ కలిసి చివరిసారిగా ఆచరించబోయే పస్కాను ఆచరించడానికి మేడ గదిలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనను బట్టి వారికిది ఎప్పుడూ ఉంటున్న సమస్య అని అర్థమౌతుంది. ఆ సందర్భంలో ఆచారానుసారంగా ఇతరుల పాదములు కడగటమనే అతిథి సేవలను చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. వారికి నమ్రత విషయంలో పాఠం నేర్పించడానికి యేసు తానే వారి పాదములు కడిగాడు.—యోహాను 13:2-15; 1 తిమోతి 5:9, 10.

9. చివరి పస్కా తర్వాత ఏర్పడిన పరిస్థితితో యేసు ఎలా వ్యవహరించాడు?

9 ఆ విధంగా పాఠం నేర్పించినప్పటికీ పస్కాను ఆచరించి, యేసు ఆసన్నమౌతున్న తన మరణానికి జ్ఞాపకార్థాన్ని ఏర్పరచిన తర్వాత మళ్లీ ఏం జరిగిందో గమనించండి. లూకా సువార్త వృత్తాంతం ఇలా చెబుతుంది: “తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పు[ట్టింది].” అపొస్తలులపై కోప్పడి వారిని మందలించడానికి బదులుగా, యేసు ఈ లోకంలోని అధికారదాహం గల పరిపాలకులకు భిన్నంగా ఉండాల్సిన అవసరాన్ని గురించి వారికి దయాపూర్వకంగా సలహా ఇచ్చాడు. (లూకా 22:24-27) అటుతర్వాత క్రీస్తు నియమానికి మూలరాయిగా పరిగణించబడగల ఒక ఆజ్ఞను ఆయన ఇచ్చాడు, ఆయనిలా అన్నాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.”—యోహాను 13:34.

10. యేసు తన శిష్యులకు ఏ ఆజ్ఞను ఇచ్చాడు, అందులో ఏమి ఇమిడివుంది?

10 క్రీస్తువంటి ప్రేమ ఎంత దూరం వెళ్లాలో యేసు ఆ రాత్రి చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు.” (యోహాను 15:12, 13) తన అనుచరులు పరిస్థితులనుబట్టి అవసరమైతే తమ తోటి విశ్వాసుల పక్షంగా మరణించడానికి కూడా ఇష్టపడాలనా యేసు చెబుతున్నది? ఈ సందర్భంలో ప్రత్యక్షసాక్షిగా ఉన్న యోహాను అర్థం చేసుకున్నది అదే, ఎందుకంటే ఆయన తర్వాత ఇలా వ్రాశాడు: “ఆయన [యేసుక్రీస్తు] మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.”—1 యోహాను 3:16.

11. (ఎ) మనం క్రీస్తు నియమమును ఎలా నెరవేరుస్తాము? (బి) యేసు ఎటువంటి మాదిరిని ఉంచాడు?

11 కాబట్టి, మనం ఇతరులకు ఆయన గురించి కేవలం బోధించడం ద్వారా మాత్రమే క్రీస్తు నియమమును నెరవేర్చము. మనం యేసులా ప్రవర్తించాలి, జీవించాలి కూడాను. నిజమే, యేసు తన ప్రసంగాల్లో మనోజ్ఞమైన మాటల్ని, చెక్కిన వజ్రాల్లాంటి మాటల్ని ఉపయోగించాడు. అయితే, ఆయన తన మాదిరి ద్వారా కూడా బోధించాడు. యేసు పరలోకంలో మహాశక్తిగల ఆత్మ ప్రాణిగా ఉన్నప్పటికీ ఆయన భూమిపై తన తండ్రి ఆసక్తులను నెరవేర్చడానికీ, మనం ఎలా జీవించాలో చూపించటానికీ వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోలేదు. ఆయన నమ్రతగలవాడు, దయాపూర్ణుడు, ఇతరుల కష్టసుఖాలు ఆలోచించేవాడు, ఆయన భారంతో క్రుంగిపోయిన వారికి, అణగద్రొక్కబడిన వారికి సహాయం చేశాడు. (మత్తయి 11:28-30; 20:28; ఫిలిప్పీయులు 2:5-8; 1 యోహాను 3:8) తాను వారిని ప్రేమించినట్లుగానే తన అనుచరులు ఒకరినొకరు ప్రేమించాలని వారికి ఉద్బోధించాడు.

12. క్రీస్తు నియమము యెహోవాపట్ల ప్రేమను కలిగివుండటాన్ని తక్కువ చేయడంలేదని మనం ఎలా చెప్పగలము?

12 ధర్మశాస్త్రంలోని అత్యంత గొప్ప ఆజ్ఞ అయిన యెహోవాపట్ల ప్రేమకు క్రీస్తు నియమములో ఎటువంటి స్థానం ఉంది? (మత్తయి 22:37, 38; గలతీయులు 6:2) రెండవ స్థానమా? ఎంతమాత్రం కాదు! యెహోవాపట్ల ప్రేమ, మన తోటి క్రైస్తవులపట్ల ప్రేమ ఈ రెండూ విడదీయరాని విధంగా ముడిపడివున్నాయి. ఒకరు యెహోవాతోపాటు తన సహోదరుణ్ని కూడా ప్రేమించకుండా తాను యెహోవాను ప్రేమిస్తున్నానని నిజంగా చెప్పలేడు, ఎందుకంటే అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పాడు: “ఎవడైనను—నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.”—1 యోహాను 4:20; పోల్చండి 1 యోహాను 3:17, 18.

13. యేసు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞకు శిష్యులు విధేయత చూపించటం ఎటువంటి ప్రభావాన్ని చూపించింది?

13 యేసు తాను వారిని ప్రేమించినట్లే వారు కూడా ఒకరినొకరు అలానే ప్రేమించాలని తన శిష్యులకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన అది చూపగల ప్రభావాన్ని గురించి వర్ణించాడు. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు[రు].” (యోహాను 13:35) యేసు మరణానికి దాదాపు వంద సంవత్సరాల తర్వాత జీవించిన టెర్టూలియన్‌ ప్రకారం, తొలి క్రైస్తవుల సహోదర ప్రేమ సరిగ్గా అటువంటి ప్రభావాన్నే చూపించింది. క్రైస్తవులు కానివారు క్రైస్తవులను గురించి ఈ వ్యాఖ్యానాలు చేసినట్లు టెర్టూలియన్‌ అంటున్నాడు: ‘వారు ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి, వారు ఒకరి కోసం మరొకరు మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.’ మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను యేసు శిష్యుణ్ని అని నిరూపించే అటువంటి ప్రేమను తోటి క్రైస్తవులపట్ల చూపిస్తున్నానా?’

మనం మన ప్రేమను ఎలా నిరూపించుకుంటాము

14, 15. క్రీస్తు నియమానికి విధేయత చూపించడం కష్టతరమయ్యేలా ఏది చేయవచ్చు, కానీ మనం విధేయత చూపడానికి ఏమి సహాయం చేయగలదు?

14 యెహోవా సేవకులు క్రీస్తువంటి ప్రేమను ప్రదర్శించడం ఆవశ్యకం. కానీ స్వార్థపరమైన వైఖరులను ప్రదర్శించే తోటి క్రైస్తవులను ప్రేమించడం కష్టంగా ఉన్నట్లు మీకన్పిస్తుందా? మనం ఇప్పటికే గమనించినట్లుగా, అపొస్తలులు కూడా తమలోతాము వాదించుకున్నారు, తమ స్వంత ప్రయోజనాల్ని నెరవేర్చుకోవాలనుకున్నారు. (మత్తయి 20:20-24) గలతీయులు కూడా తమలోతాము జగడమాడారు. పొరుగువారిపట్ల ఉండే ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిందని చెప్పిన తర్వాత, పౌలు వారినిలా హెచ్చరించాడు: “అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి.” శరీరకార్యాలకూ దేవుని ఆత్మ ఫలాలకూ మధ్య ఉన్న భిన్నత్వాన్ని చూపించిన తర్వాత, పౌలు ఈ విధంగా మందలించాడు: “ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.” తర్వాత అపొస్తలుడు ఇలా ఉద్బోధ చేశాడు: “ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.”—గలతీయులు 5:14–6:2.

15 క్రీస్తు నియమానికి విధేయతను కోరడం ద్వారా యెహోవా మననుండి మరీ ఎక్కువగా అడుగుతున్నాడా? మనల్ని ఎత్తిపొడుపుగా మాట్లాడినవారిపట్ల, భావోద్రేకపరంగా మనల్ని గాయపర్చిన వారిపట్ల దయగా ప్రవర్తించడం కష్టమే అయినప్పటికీ మనం ‘ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకుంటూ, ప్రేమగలిగి నడుచుకోవాలి.’ (ఎఫెసీయులు 5:1, 2) మనం దేవుని మాదిరివైపు ఎప్పుడూ చూస్తూ కొనసాగాల్సిన అవసరం ఉంది, ఆయన “మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” (రోమీయులు 5:8) మనపట్ల అనుచితంగా ప్రవర్తించిన వారితో సహా, మనం ఇతరులకు సహాయపడటానికి చొరవ తీసుకోవడం ద్వారా దేవుణ్ని పోలి నడుచుకుంటున్నామన్న సంతృప్తి, క్రీస్తు నియమానికి విధేయత చూపిస్తున్నామన్న సంతృప్తి మనకు ఉంటుంది.

16. దేవునిపట్ల క్రీస్తుపట్ల మన ప్రేమను ఎలా రుజువు చేసుకుంటాము?

16 మనం మన ప్రేమను కేవలం మనం చెప్పేదాన్ని బట్టి మాత్రం గాక మనం చేసేదాన్ని బట్టి రుజువుచేసుకుంటామని గుర్తుంచుకోవాలి. చివరికి యేసు కూడా దేవుని చిత్తాన్ని గూర్చిన ఒక అంశాన్ని, అందులో ఇమిడివున్నదాని మూలంగా, దాన్ని స్వీకరించడం కష్టంగా ఉన్నట్లు ఒకసారి భావించాడు. “తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము” అని యేసు ప్రార్థించాడు. కానీ ఆయన వెంటనే ఇలా జతచేశాడు: “అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.” (లూకా 22:42) యేసు ఎంతో శ్రమను అనుభవించినప్పటికీ ఆయన దేవుని చిత్తాన్ని చేశాడు. (హెబ్రీయులు 5:7, 8) విధేయత మన ప్రేమకు ఒక రుజువు, దేవుని మార్గమే అత్యంత శ్రేష్ఠమైన మార్గమని మనం గుర్తిస్తున్నామని అది చూపిస్తుంది. “దేవుని ప్రేమించుట” ఏమిటంటే, “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే” అంటుంది బైబిలు. (1 యోహాను 5:3) యేసు తన అపొస్తలులతో ఇలా అన్నాడు: “మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు.”—యోహాను 14:15.

17. యేసు తన అనుచరులకు ఏ ప్రత్యేకమైన ఆజ్ఞను ఇచ్చాడు, అది నేడు మనకు కూడా వర్తిస్తుందని మనకు ఎలా తెలుసు?

17 ఒకరినొకరు ప్రేమించమని తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత క్రీస్తు వారికి ఏ ప్రత్యేకమైన ఆజ్ఞను ఇచ్చాడు? తాను వారికి దేనికోసమైతే శిక్షణనిచ్చాడో ఆ ప్రకటనా పనిని చేయమని ఆయన ఆజ్ఞాపించాడు. పేతురు ఇలా అన్నాడు: “ఈయనే . . . ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.” (అపొస్తలుల కార్యములు 10:42) యేసు నిర్దిష్టంగా ఇలా ఆజ్ఞాపించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 1:8) అటువంటి నిర్దేశాలు, “అంత్యకాలము”లో ఉన్న నేటి ఆయన అనుచరులకు కూడా వర్తిస్తాయని యేసు వెల్లడిచేశాడు, ఎందుకంటే ఆయనిలా అన్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (దానియేలు 12:4; మత్తయి 24:14) మనం ప్రకటించాలన్నది దేవుని చిత్తము. అయినా, మనం ఈ పనిచేయాలని దేవుడు కోరడం, ఆయన మననుండి మరీ ఎక్కువగా అడుగుతున్నట్లే అని కొందరు అనుకోవచ్చు. కానీ అది వాస్తవమా?

అది ఎందుకు కష్టంగా అన్పిస్తుండవచ్చు

18. మనం యెహోవా అడిగే దాన్ని చేస్తున్నప్పుడు బాధల్ని అనుభవిస్తే ఏమి గుర్తుంచుకోవాలి?

18 మనం ఇంతకు క్రితమే చూసినట్లు, యెహోవా చరిత్రంతటిలో వివిధ రకాలుగా విధేయత చూపమని ప్రజలను అడిగాడు. విధేయత చూపడానికి చేయాల్సిన పనులు వేర్వేరుగా ఉన్నట్లుగానే వారనుభవించిన శ్రమలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. దేవుని ప్రియమైన కుమారుడు అత్యంత కష్టతరమైన శ్రమలను ఎదుర్కొన్నాడు, చివరికి దేవుడు అడిగినది చేసినందుకు క్రూరంగా చంపబడ్డాడు. కానీ మనం యెహోవా అడిగినదాన్ని చేస్తున్నందుకు బాధల్ని అనుభవిస్తున్నప్పుడు, మన శ్రమలకు ఆయన బాధ్యుడు కాదని మనం గుర్తుంచుకోవాలి. (యోహాను 15:18-20; యాకోబు 1:13-15) సాతాను చేసిన తిరుగుబాటు పాపాన్ని, బాధల్ని, మరణాన్ని తెచ్చింది, అంతేగాక యెహోవా తన సేవకులను అడిగేవాటిని వారు చేయడాన్ని కష్టతరం చేసే పరిస్థితులను సృష్టిస్తున్నది కూడా సాతానే.—యోబు 1:6-19; 2:1-8.

19. దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని అడిగినది చేయడం ఎందుకు ఒక ఆధిక్యత?

19 ఈ చివరి కాలాల్లో, మానవ బాధలకు ఏకైక పరిష్కారం రాజ్య పరిపాలన అని తన సేవకులు భూవ్యాప్తంగా ప్రకటించేలా తన కుమారుని ద్వారా యెహోవా వారిని నిర్దేశించాడు. ఈ దేవుని ప్రభుత్వం భూమ్మీద నుండి యుద్ధాలు, నేరము, బీదరికము, వృద్ధాప్యము, వ్యాధులు, మరణము వంటి సమస్యలన్నింటినీ నిర్మూలిస్తుంది. ఆ రాజ్యము మహిమాన్వితమైన భూవ్యాప్త పరదైసును కూడా తీసుకొస్తుంది, చివరికి మృతులు కూడా ఆ పరదైసులోనికి పునరుత్థానం చేయబడతారు. (మత్తయి 6:9, 10; లూకా 23:43; అపొస్తలుల కార్యములు 24:14, 15; ప్రకటన 21:3, 4) అటువంటి విషయాలను గూర్చిన సువార్తను ప్రకటించడం ఎంతటి గొప్ప ఆధిక్యత ! అందుకని స్పష్టంగా యెహోవా మనల్ని చేయమని అడిగేదాన్లో ఎటువంటి తప్పూ లేదు. మనం వ్యతిరేకతనైతే ఎదుర్కొంటాము, ఇందుకు అపవాదియైన సాతాను వాని లోకమే కారణం.

20. సాతాను మన ముందుంచే ఏ సవాలునైనా మనం ఎలా విజయవంతంగా ఎదుర్కోగలము?

20 సాతాను మన ముందుంచే ఏ సవాలునైనా మనం ఎలా విజయవంతంగా ఎదుర్కోగలము? ఈ మాటల్ని మనసులో ఉంచుకోవడం ద్వారా: “నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” (సామెతలు 27:11) భూమ్మీద తన తండ్రి చిత్తాన్ని చేయడానికి, పరలోకంలోని భద్రతను విడిచిపెట్టుకోవడం ద్వారా యేసు, సాతాను నిందలకు కావాల్సిన జవాబును యెహోవాకు అందించాడు. (యెషయా 53:12; హెబ్రీయులు 10:7) మానవునిగా యేసు తన మీదికి వచ్చిన ప్రతి శ్రమను సహించాడు, చివరికి హింసా మ్రానుపై మరణాన్ని కూడా అనుభవించాడు. మన మాదిరికర్తగా ఆయన్ను మనం అనుసరించినట్లైతే మనం కూడా బాధల్ని సహించగలం, యెహోవా మనల్ని అడిగేది చేయగలం.—హెబ్రీయులు 12:1-3.

21. యెహోవా, ఆయన కుమారుడూ చూపించిన ప్రేమను గురించి మీరెలా భావిస్తారు?

21 దేవుడూ, ఆయన కుమారుడూ మనపట్ల ఎంత ప్రేమను చూపించారో కదా! యేసు బలి మూలంగా, విధేయులైన మానవజాతికి పరదైసులో నిత్యము జీవించే ఉత్తరాపేక్ష ఉంది. అందుకని ఆ నిరీక్షణ మసకబారేలా చేయడానికి మనం దేన్నీ అనుమతించకుందాము. దానికి బదులుగా, మనం యేసు సాధ్యం చేసినదాన్ని పౌలువలే గంభీరంగా తీసుకుందాము, యేసును గురించి ఆయనిలా అన్నాడు: ‘దేవుని కుమారుడు నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనెను.’ (ఇటాలిక్కులు మావి.) (గలతీయులు 2:20) అంతేగాక మన నుండి ఎన్నడూ మరీ ఎక్కువగా అడగని ప్రేమగల మన దేవుడైన యెహోవాపట్ల హృదయపూర్వకమైన కృతజ్ఞతా భావాన్ని చూపుదాము.

మీరెలా జవాబిస్తారు?

◻ యెహోవా నేడు మన నుండి ఏమి అడుగుతున్నాడు?

◻ తన అపొస్తలులతో గడిపిన చివరి రాత్రి, ప్రేమ యొక్క ప్రాముఖ్యతను క్రీస్తు ఎలా నొక్కిచెప్పాడు?

◻ మనం దేవుణ్ని ప్రేమిస్తున్నామని ఎలా రుజువుచేసుకుంటాము?

◻ యెహోవా మనల్ని అడిగేది చేయడం ఎందుకు ఒక ఆధిక్యత?

[23వ పేజీలోని చిత్రం]

యేసు తన అపొస్తలుల పాదములు కడగడం ద్వారా ఏ పాఠాన్ని బోధించాడు?

[25వ పేజీలోని చిత్రం]

వ్యతిరేకత ఉన్నప్పటికీ, సువార్తను పంచుకోవడం అనేది ఆహ్లాదాన్నిచ్చే ఆధిక్యత

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి