కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 10/1 పేజీలు 22-25
  • యెహోవాకు తగినదాన్ని ఆయనకివ్వటం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాకు తగినదాన్ని ఆయనకివ్వటం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నేను నేర్చుకున్నదాని ప్రకారం నడుచుకోవటం
  • అవాంతరాలున్నా ప్రకటించటం
  • ఐధోనోహోరిలో మా పరిచర్య
  • ఘోరమైన హింస
  • వ్యతిరేకత ఉన్నప్పటికీ అభివృద్ధి
  • యెహోవా ప్రేమగల హస్తం క్రింద సేవచేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో యాభై సంవత్సరాలకుపైగా సేవ చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఆస్ట్రేలియాలో నేను నిజమైన సంపదను కనుగొన్నాను
    తేజరిల్లు!—1994
  • “నేను బంగారానికి బదులు వజ్రాలను కనుగొన్నాను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 10/1 పేజీలు 22-25

యెహోవాకు తగినదాన్ని ఆయనకివ్వటం

టీమోల్యన్‌ వేసీలీయూ చెప్పినది

నేను ఐధోనోహోరి గ్రామంలో బైబిలు గురించి బోధిస్తున్నందుకు నన్ను అరెస్ట్‌ చేశారు. పోలీసులు నా బూట్లు తీసేసి నా అరికాళ్ళ మీద కొట్టడం మొదలెట్టారు. వాళ్లలా కొడుతుండగా, నా పాదాలు మొద్దుబారిపోయి, నాకిక నొప్పి తెలియకుండాపోయింది. ఆ కాలంలో, గ్రీసులో అసాధారణమైనదేమీ కాని ఈ వేధింపుకు నడిపినదేమిటో వివరించే ముందు, నేను బైబిలు బోధకుడిగా ఎలా అయ్యానో చెప్తాను.

నేను 1921లో జన్మించిన కొంతకాలానికే, మా కుటుంబం ఉత్తర గ్రీసులోని రొడొలీవోస్‌ పట్టణానికి తరలి వెళ్లింది. నేను యౌవనంలో, క్రమశిక్షణలేని జీవితాన్ని గడిపాను. నాకు 11 ఏళ్లున్నప్పుడు నేను పొగత్రాగటం మొదలెట్టాను. తర్వాత, నేను విపరీతంగా త్రాగుతూ జూదమాడటం మొదలెట్టి, దాదాపు ప్రతి రాత్రీ విశృంఖలమైన పార్టీలకు వెళ్లేవాడిని. నాకు సంగీతంలో కొంత ప్రావీణ్యం ఉంది, దానితో నేను ఒక స్థానిక బ్యాండులో చేరాను. సంవత్సరం గడిచే సరికి, నేను దాదాపు బ్యాండులోని సంగీత వాయిద్యాలన్నీ వాయించగలిగాను. అయితే, అదే సమయంలో, నేను చదువుపట్ల ఎంతో శ్రద్ధకల్గివుండి, న్యాయాన్ని ప్రేమించేవాడిని.

1940 తొలికాలంలో, రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుండగా, ఒక చిన్న బాలిక అంత్యక్రియల సమయంలో బ్యాండు వాయించటానికి మా బ్యాండును పిలిపించారు. సమాధి స్థలంలో, బంధువులు స్నేహితులు పట్టలేనంత దుఃఖంతో ఏడుస్తున్నారు. వాళ్లనుభవిస్తున్న మనోవేదన నామీద ప్రగాఢమైన ముద్ర వేసింది. ‘మనమెందుకు మరణిస్తాము? కేవలం కొంతకాలం ఉనికిలో ఉండటం కంటే జీవితంలో ఇంకేమైనా ఉందా? వీటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి?’ అని ఆలోచించటం మొదలెట్టాను.

కొన్ని రోజుల తర్వాత, మా ఇంట్లోని ఒక గూటిలో నేను క్రొత్త నిబంధన ప్రతి నొకదాన్ని గమనించాను. నేను దాన్ని తీసుకుని చదవటం మొదలు పెట్టాను. యేసు ప్రత్యక్షత సూచనలో పెద్ద ఎత్తున యుద్ధాలు జరగటం ఒక భాగమని నేను మత్తయి 24:7లో యేసు మాటలను చదివినప్పుడు, ఆయన మాటలు మన కాలానికి వర్తించేవే అయివుంటాయని నేను గ్రహించాను. తర్వాతి వారాల్లో, ఈ క్రైస్తవ గ్రీకు లేఖనాల ప్రతిని నేను చాలాసార్లు చదివాను.

తర్వాత 1940 డిసెంబరులో, నేను దగ్గరలో ఉన్న ఒక కుటుంబాన్ని దర్శించాను, ఆ కుటుంబంలో ఒక విధవరాలు ఆమె ఐదుగురు పిల్లలూ ఉన్నారు. వాళ్ల అటక మీద, కొన్ని చిన్న పుస్తకాల దొంతరలో, వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన ఎ డిసైరబుల్‌ గవర్నమెంట్‌ అనే పేరుగల చిన్న పుస్తకం నాకు కనిపించింది. నేను అటక మీదే ఉండిపోయి, ఆ చిన్న పుస్తకం మొత్తం చదివేశాను. నేను చదివినదాన్ని బట్టి, నిజానికి మనం “అంత్యదినముల”ని బైబిలు పిలుస్తున్న కాలాల్లోనే జీవిస్తున్నామనీ, యెహోవా దేవుడు ఈ విధానానికి త్వరలోనే ముగింపు తెచ్చి దాని స్థానంలో నీతియుక్తమైన నూతన లోకాన్ని ప్రవేశపెడతాడనీ నేను పూర్తిగా ఒప్పించబడ్డాను.—2 తిమోతి 3:1-5; 2 పేతురు 3:13.

విశ్వసనీయంగా నిలిచివున్నవారు పరదైసు భూమి మీద నిరంతరం జీవిస్తారనీ, దేవుని రాజ్య పరిపాలన క్రింద ఆ నూతన లోకంలో బాధ మరణం ఇక ఉండవనీ చూపిస్తున్న లేఖనాధార సాక్ష్యం ప్రాముఖ్యంగా నన్ను ఎంతో ప్రభావితం చేసింది. (కీర్తన 37:9-11, 29; ప్రకటన 21:3, 4) నేను వాటిని చదువుతూ, వాటిని బట్టి ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాను, ఆయన మన నుండి కోరేవేమిటో తెలియజేయమని నేను ఆయన్ని వేడుకున్నాను. యెహోవా దేవుడు పూర్ణాత్మతో కూడిన నా భక్తిని పొందటానికి అర్హుడని నేను తెలుసుకున్నాను.—మత్తయి 22:37.

నేను నేర్చుకున్నదాని ప్రకారం నడుచుకోవటం

అప్పటి నుండి నేను పొగత్రాగటం మానేశాను, త్రాగుడు మానేశాను, జూదమాడటం మానేశాను. నేను ఆ విధవరాలి ఐదుగురు పిల్లలనూ, నా చెల్లెళ్లిద్దరినీ తమ్ముడ్ని కూర్చోబెట్టుకుని, ఆ చిన్న పుస్తకం నుండి నేర్చుకున్నవాటిని వారికి వివరించాను. మాకు తెలిసిన ఆ కొంతనే మేము త్వరలోనే వ్యాప్తి చేయటం మొదలుపెట్టాము. మేము సాక్షులనెవ్వరినీ కలవకపోయినప్పటికీ, ఆ ప్రాంతంలో మేము యెహోవాసాక్షులుగా పేరుపొందాము. మొట్టమొదటి నుండే, నేను నేర్చుకుంటున్న అద్భుతమైన విషయాల గురించి ఇతరులకు చెప్పటంలో ప్రతి నెలా వంద కంటే ఎక్కువ గంటలు గడిపేవాడిని.

స్థానిక గ్రీక్‌ ఆర్థడాక్స్‌ ప్రీస్టుల్లో ఒకాయన, మాపైన ఫిర్యాదు చేయటానికి మేయర్‌ దగ్గరికి వెళ్లాడు. కాని కొంతకాలం క్రితం, యౌవనస్థుడైన ఒక సాక్షి తప్పిపోయిన గుఱ్ఱాన్ని కనుగొని దాని యజమానులకు తిరిగి అప్పగించాడు, ఈ విషయం మాకు తెలియదు. అలాంటి యథార్థత మూలంగా, మేయర్‌ సాక్షులను గౌరవించేవాడు, ప్రీస్టు చెప్పేది వినటానికి ఆయన నిరాకరించాడు.

1941 అక్టోబరులో ఒకరోజు, నేను మార్కెట్‌లో సాక్ష్యమిస్తుండగా, దగ్గరలోని పట్టణంలో నివసిస్తున్న ఒక యెహోవాసాక్షి గురించి ఎవరో మాట్లాడారు. ఆ సాక్షి ఒక మాజీ పోలీసు, ఆయన పేరు క్రిస్టోస్‌ ట్రీయాన్టాఫీలూ. నేను ఆయన్ని కలవటానికి వెళ్లి, ఆయన 1932 నుండి సాక్షిగా ఉన్నాడని తెలుసుకున్నాను. ఆయన వాచ్‌ టవర్‌ ప్రచురించిన అనేక పాత ప్రచురణలను ఇచ్చినప్పుడు నేనెంతో సంతోషపడిపోయాను! నేను ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించటానికి అవి నిజంగా సహాయం చేశాయి.

1943లో నేను దేవునికి చేసుకున్న సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించాను. అప్పటికల్లా నేను చుట్టుప్రక్కల ఉన్న ద్రావిస్కోస్‌, పాల్యోకోమీ, మావ్రోలోఫోస్‌ అనే మూడు గ్రామాల్లో బైబిలు పఠనాలు నిర్వహిస్తున్నాను. నేను ద హార్ప్‌ ఆఫ్‌ గాడ్‌ అనే పుస్తకాన్ని బైబిలు పఠన సహాయకంగా ఉపయోగించేవాడిని. చివరికి, ఈ ప్రాంతంలో యెహోవాసాక్షుల నాలుగు సంఘాలు ఏర్పడడాన్ని చూసే ఆధిక్యత నాకు లభించింది.

అవాంతరాలున్నా ప్రకటించటం

1944లో గ్రీసు జర్మన్ల ఆధీనం నుండి స్వేచ్ఛను పొందింది, కొంతకాలం తర్వాత, ఏథెన్సులోని వాచ్‌ టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయంతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. మునుపు రాజ్య సందేశాన్ని ఎవ్వరూ ఎంతమాత్రం వినివుండని ప్రాంతంలో, ప్రకటనాపనిలో భాగంవహించటానికి రమ్మని బ్రాంచి కార్యాలయం నన్ను ఆహ్వానించింది. అక్కడికెళ్లాక, నేను మూడు నెలలపాటు ఒక పొలంలో పనిచేసి, సంవత్సరంలోని మిగిలిన సమయమంతా పరిచర్యలో గడిపాను.

ఆ సంవత్సరం మా అమ్మా, అలాగే ఆ విధవరాలూ, ఆమె పిల్లలూ బాప్తిస్మం తీసుకోవటాన్ని చూసే ఆశీర్వాదం నాకు లభించింది. ఆ విధవరాలి చిన్న కుమార్తె, మార్యాంథీ మాత్రం 1943లో బాప్తిస్మం తీసుకుని అదే సంవత్సరం నవంబరు నెలలో నా భార్య అయ్యింది. ముప్పై ఏళ్ల తర్వాత, 1974లో మా నాన్న కూడా బాప్తిస్మం తీసుకుని సాక్షి అయ్యారు.

1945 తొలికాలంలో, మిమియోగ్రాఫ్‌ యంత్రంతో తయారుచేసిన, కావలికోట మొట్టమొదటి ప్రతిని మేము బ్రాంచి కార్యాలయం నుండి అందుకున్నాము. దానిలోని శీర్షిక పేరు ఇలా ఉంది, “వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.” (మత్తయి 28:19) నేను మార్యాంథీ వెంటనే, స్ట్రైమోన్‌ నదికి తూర్పునున్న సుదూర ప్రాంతాల్లో పనిచేయటానికి ఇల్లు వదిలి వెళ్లాము. తర్వాత ఇతర సాక్షులు వచ్చి మమ్మల్ని కలిశారు.

మేము తరచూ ఒక గ్రామాన్ని చేరటానికి కొండ సందుల్లోనుండి, పర్వతాల మీదుగా చాలా కిలోమీటర్లు ఉట్టికాళ్లతో నడిచేవాళ్లం. మా జోళ్లను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మేమలా చేసేవాళ్లం, ఎందుకంటే అవి అరిగిపోతే మాదగ్గర ఇక వేరేవి లేవు. 1946 నుండి 1949 మధ్య కాలంలో, గ్రీసులో అంతర్యుద్ధం తీవ్రతరమౌతోంది, ప్రయాణం చేయటం చాలా ప్రమాదకరంగా ఉండేది. అప్పట్లో, దారి వెంబడి శవాలు పడి ఉండటం అసాధారణ దృశ్యమేమీ కాదు.

కష్టాలను బట్టి నిరుత్సాహపడే బదులు, మేము ఆసక్తితో ప్రకటించటంలో కొనసాగాము. చాలాసార్లు నేను, “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును” అని వ్రాసిన కీర్తనల గ్రంథకర్తలా భావించాను. (కీర్తన 23:4) ఆ కాలంలో, మేము కొన్ని వారాల పాటు ఇంటినుండి దూరంగా ఉండిపోయేవాళ్లం, నేను కొన్నిసార్లు పరిచర్యలో నెలకు 250 గంటలు గడిపాను.

ఐధోనోహోరిలో మా పరిచర్య

మేము 1946లో దర్శించిన గ్రామాల్లో ఐధోనోహోరి ఒకటి, అది ఒక పర్వతం మీద ఉంది. బైబిలు సందేశం వినాలని ఇష్టపడుతున్న ఇద్దరు వ్యక్తులు గ్రామంలో ఉన్నారని మమ్మల్ని కలిసిన ఒక వ్యక్తి చెప్పాడు. అయితే, తన పొరుగువారి భయం మూలంగా అతడు మమ్మల్ని వాళ్ల దగ్గరికి తీసుకువెళ్లటానికి ఇష్టపడటం లేదు. మేము వాళ్ల ఇళ్లను ఎలాగోలా గుర్తించి అక్కడికి వెళ్లడంతో వాళ్లు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. వాస్తవానికి, కొన్ని నిముషాల తర్వాత, ఆ గది అంతా మనుష్యులతో నిండిపోయింది. వాళ్లంతా బంధువులు లేదా సన్నిహిత మిత్రులు. వాళ్లు అంత శ్రద్ధగా కూర్చుని మేము చెప్పేది వినటం చూసి నేను ఎంత ఆశ్చర్యపోయానో. వాళ్లు యెహోవా సాక్షులను కలవాలని ఆతురతతో ఎదురుచూస్తున్నారు కాని జర్మను ఆక్రమణ సమయంలో ఆ ప్రాంతంలో సాక్షులెవరూ లేరని మేము అప్పుడే తెలుసుకున్నాము. వాళ్ల ఆసక్తిని రేకెత్తించినది ఏమిటి?

ఆ రెండు కుటుంబాల పెద్దలు స్థానిక కమ్యూనిస్ట్‌ పార్టీలో ప్రముఖులు, వాళ్లు ప్రజలకు కమ్యూనిస్ట్‌ తలంపులను పరిచయం చేశారు. కాని తర్వాత వాళ్లు వాచ్‌ టవర్‌ సొసైటీ ప్రచురించిన గవర్నమెంట్‌ అనే పుస్తకాన్ని ప్రతిని చూశారు. దాన్ని చదవటం మూలంగా, ఒక పరిపూర్ణమైన, నీతియుక్తమైన ప్రభుత్వం వస్తుందని నిరీక్షించటానికి ఆధారం దేవుని రాజ్యమేనని వాళ్లు ఒప్పించబడ్డారు.

మేము ఈ మనుష్యులతోనూ వాళ్ల స్నేహితులతోనూ మాట్లాడుతూ మధ్యరాత్రి వరకు ఉండిపోయాము. వాళ్లు తమ ప్రశ్నలకు లభించిన బైబిలు ఆధారిత సమాధానాలను బట్టి పూర్తిగా సంతృప్తి చెందారు. అయితే తర్వాత త్వరలోనే, గ్రామంలోని కమ్యూనిస్టులు నన్ను చంపాలని నిర్ణయించుకున్నారు, ఎందుకంటే వాళ్ల మాజీ నాయకులను మార్చింది నేనే అని వాళ్ల ఉద్దేశం. అనుకోనిరీతిగా, ఆ మొదటి రాత్రి వచ్చిన వారిలో, గ్రామంలోవున్న ఆసక్తిగల వారి గురించి నాకు చెప్పిన వ్యక్తి కూడా ఉన్నాడు. చివరికి, అతడు బైబిలు జ్ఞానంలో అభివృద్ధి సాధించి, బాప్తిస్మం పొంది, తర్వాత క్రైస్తవ పెద్ద అయ్యాడు.

ఘోరమైన హింస

ఈ మాజీ కమ్యూనిస్టులను కలిసిన తర్వాత వెంటనే ఇద్దరు పోలీసులు మేము కూటాలు జరుపుకుంటున్న ఇంట్లోకి దూసుకువచ్చారు. వాళ్లు తుపాకీని గురిపెట్టి మా నలుగురిని అరెస్టు చేసి, పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ, గ్రీకు ఆర్థడాక్స్‌ మతనాయకులతో సన్నిహిత సంబంధాలున్న ఒక పోలీసు లెఫ్టినెంట్‌ మమ్మల్ని దూషించాడు. చివరికి ఆయనిలా ప్రశ్నించాడు, “మిమ్మల్ని నేనేం చెయ్యను?”

“వాళ్లను బాగా కొడదాము!” అని మా వెనుక నిలబడివున్న ఇతర పోలీసులందరూ ముక్త కంఠంతో అరిచారు.

కాని అప్పటికి చాలా రాత్రి అయ్యింది. పోలీసులు మమ్మల్ని నేలమాళిగలో వేసి తాళం పెట్టి, ప్రక్కనున్న హోటల్‌కు వెళ్లారు. వాళ్లు బాగా త్రాగిన తర్వాత తిరిగి వచ్చి, నన్ను పైకి తీసుకు వెళ్లారు.

వాళ్లున్న పరిస్థితిని బట్టి వాళ్లు నన్ను ఏ క్షణానైనా చంపేస్తారని నేను గ్రహించాను. కాబట్టి నేను ఏమి ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ సహించటానికి తగిన శక్తినివ్వమని నేను దేవుడ్ని ప్రార్థించాను. వాళ్లు కొన్ని కర్రలను తీసుకుని, శీర్షికారంభంలో చెప్పినట్లుగా, నా అరికాళ్ళ మీద కొట్టటం మొదలు పెట్టారు. ఆ తర్వాత వాళ్లు నా శరీరమంతటి మీద కొట్టి, నన్ను మళ్లీ నేలమాళిగలో పడేశారు. తర్వాత వాళ్లు మరో వ్యక్తిని తీసుకెళ్లి, అతడ్ని కొట్టటం మొదలు పెట్టారు.

ఈలోపు, రానైయున్న పరీక్షను ఎదుర్కోవటానికి మిగతా ఇద్దరు యౌవన సాక్షులను సిద్ధం చేయటానికి నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. కానీ పోలీసులు నన్ను మళ్లీ పైకి తీసుకువెళ్లటానికి నిర్ణయించుకున్నారు. వాళ్లు నా వస్త్రాలు తీసేసి, ఐదుగురు కలిసి నన్ను దాదాపు ఒక గంటపాటు కొట్టి, వాళ్ల సైనిక బూట్లతో నాతలపై తొక్కారు. తర్వాత వాళ్లు మళ్లీ నన్ను మెట్ల మీది నుండి క్రిందికి పడేశారు, అక్కడే నేను 12 గంటలపాటు స్పృహలేని స్థితిలో పడివున్నాను.

చివరికి మేము విడుదల చేయబడినప్పుడు, గ్రామంలోని ఒక కుటుంబం ఆ రాత్రికి మమ్మల్ని తమ ఇంట్లో ఉంచుకుని మా గురించి శ్రద్ధ తీసుకున్నారు. మరునాడు మేము ఇంటికి వెళ్లటానికి బయలుదేరాము. మేము ఎంతగా అలిసిపోయి శక్తిహీనులమైపోయామంటే, సాధారణంగా రెండు గంటలు పట్టే ప్రయాణానికి అప్పుడు ఎనిమిది గంటలు పట్టింది. దెబ్బల వల్ల నేను ఎంతగా వాచిపోయానంటే, మార్యాంథీ నన్ను అసలు గుర్తుపట్టలేకపోయింది.

వ్యతిరేకత ఉన్నప్పటికీ అభివృద్ధి

1949లో, అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతుండగా, మేము థెస్సలొనీకకు వెళ్లాము. ఆ నగరంలోని నాలుగు సంఘాల్లో ఒకదానిలో సహాయక సంఘ సేవకునిగా సేవ చేసేందుకు నియమించబడ్డాను. ఒక సంవత్సరం తర్వాత మేము మరో సంఘాన్ని ఏర్పాటు చేసేంతగా ఆ సంఘం అభివృద్ధి సాధించింది, నేను సంఘ సేవకునిగా లేక ప్రిసైడింగ్‌ పైవిచారణకర్తగా నియమించబడ్డాను. ఒక సంవత్సరం తర్వాత ఆ క్రొత్త సంఘం దాదాపు రెండింతలయ్యింది, దానితో ఇంకా మరో సంఘం ఏర్పడింది.

థెస్సలొనీకలో యెహోవాసాక్షుల అభివృద్ధిని బట్టి వ్యతిరేకులు ఉగ్రులైపోయారు. 1952లో ఒక రోజున, నేను పని నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి, మా ఇల్లు అగ్నికి ఆహుతైపోయింది. మార్యాంథీ ఎలాగో ప్రాణాలతో తప్పించుకుని బయటపడింది. ఆ రాత్రి కూటమి సమయంలో, మేము మురికి బట్టలతో ఎందుకు వచ్చామో వివరించాల్సి వచ్చింది, మేము అంతా పోగొట్టుకున్నాము. మా క్రైస్తవ సహోదరులు ఎంతో దయ చూపించారు, మద్దతునిచ్చారు.

1961లో, సహోదరులను ఆధ్యాత్మికంగా బలపర్చేందుకు ప్రతి వారం ఒక్కో సంఘాన్ని సందర్శించే ప్రయాణ పనికి నేను నియమించబడ్డాను. తర్వాతి 27 సంవత్సరాల పాటు, మార్యాంథీ నేను మాసిడోనియా, థ్రేస్‌, థెస్సలీ సర్క్యూట్‌లను, జిల్లాలను దర్శించాము. 1948 నుండి నా ప్రియమైన మార్యాంథీ దాదాపు అంధురాలిగా ఉన్నప్పటికీ, ఆమె నాతోపాటు ఎంతో ధైర్యంగా సేవచేసింది, ఎన్నో విశ్వాస పరీక్షలను ఎదుర్కుంది. ఆమె కూడా ఎన్నోసార్లు అరెస్టు చేయబడి, విచారణ చేయబడి, చెరసాలలో వేయబడింది. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించిపోయి, క్యాన్సరుతో చాలా కాలంపాటు పోరాడిన తర్వాత 1988లో ఆమె మరణించింది.

అదే సంవత్సరం, నేను థెస్సలొనీకలో ప్రత్యేక పయినీరుగా సేవచేసేందుకు నియమించబడ్డాను. ఇప్పుడు, యెహోవా సేవలో 56 కంటే ఎక్కువ సంవత్సరాలు గడిపిన తర్వాత, నేను ఇప్పటికీ కష్టపడి పనిచేయగలను, పరిచర్యలోని అన్ని అంశాల్లో పాల్గొనగలను. కొన్నిసార్లు, ప్రతి వారం నేను ఆసక్తిగల వారితో దాదాపు 20 బైబిలు పఠనాలు నిర్వహించాను.

నిజానికి యెహోవా నూతన లోకంలోకి కొనసాగి, ఆ తర్వాత వెయ్యేళ్లపాటు కొనసాగే గొప్ప బోధనా కార్యక్రమ ప్రారంభంలో మనం ఉన్నామని నేను గ్రహించగలిగాను. అయినప్పటికీ, మందగించటానికీ, విషయాలను వాయిదా వేయటానికీ, లేక మన సమయాన్ని మన శారీరక కోరికలను తీర్చుకోవటంలో గడపటానికీ ఇది సమయం కాదని నేను భావిస్తున్నాను. యెహోవా మన పూర్ణాత్మతో కూడిన భక్తిని, సేవను పొందటానికి అర్హుడు గనుక ఆరంభంలో నేను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి నాకు సహాయం చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

[24వ పేజీలోని చిత్రం]

ప్రకటనా పని నిషేధించబడినప్పుడు ప్రసంగం ఇవ్వటం

[25వ పేజీలోని చిత్రం]

నా భార్య మార్యాంథీతో

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి