కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 10/15 పేజీలు 23-27
  • మీరు విదేశీక్షేత్రంలో సేవ చేయగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు విదేశీక్షేత్రంలో సేవ చేయగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సరైన ప్రేరణలు అవసరం
  • లెక్క చూసుకోండి
  • అతి పెద్ద సవాలు
  • ఇంటి బెంగ విషయమేమిటి?
  • పిల్లల సంగతేమిటి?
  • తరలివెళ్ళడం వల్ల కలిగే ఆశీర్వాదాలు
  • మీ విషయమేమిటి?
  • మీరు “మాసిదోనియకు” వెళ్లగలరా?
    మన రాజ్య పరిచర్య—2011
  • తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు ఈక్వెడార్‌లో
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మాసిదోనియకు వచ్చి సహాయం చేస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 10/15 పేజీలు 23-27

మీరు విదేశీక్షేత్రంలో సేవ చేయగలరా?

“మిషనరీ పనికి వెళ్లాలని నేను ఎప్పుడూ కలలు కనేవాడ్ని. నేను అవివాహితునిగా, ప్రచారకుల అవసరం అధికంగా ఉన్న ప్రాంతంలో, అంటే, అమెరికాలోని టెక్సాస్‌లో సేవ చేశాను. మా వివాహం అయిన తర్వాత నా భార్య నాతో చేరింది. మా కుమార్తె పుట్టినప్పుడు, ‘ఇంతటితో అంతా అయిపోయింది అనుకున్నాను.’ కానీ యెహోవా కలలను నిజం చేస్తాడు, ముఖ్యంగా అవి తన చిత్తానికి సంబంధించినవైతే, వాటిని నిజం చేస్తాడు.”—జెసీ, ప్రస్తుతం ఈక్వెడార్‌లో తన భార్యతో, తన ముగ్గురు పిల్లలతో సేవచేస్తున్నారు.

“గిలియడ్‌ మిషనరీ స్కూల్‌ ట్రెయినింగ్‌ తీసుకోకుండా ఈ పని చేయగలనని నేనెన్నడూ ఊహించలేదు. నా బైబిలు విద్యార్థుల్లో ఒకరు ప్రసంగం ఇవ్వడమూ, ప్రకటించడమూ నేను చూసినప్పుడు పులకరించిపోయాను, యెహోవా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను.”—కరన్‌, దక్షిణ అమెరికాలో ఎనిమిది సంవత్సరాలు పయినీరింగ్‌ చేసిన ఒక అవివాహిత.

“అమెరికాలో 13 సంవత్సరాలు పూర్తికాలం ప్రకటించిన తర్వాత, మాకు ఒక క్రొత్త సవాలు చేపట్టాలని నాకూ నా భార్యకూ అనిపించింది. మేము మునుపెన్నటికన్నా ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నాం; ఇది నిజంగా జీవానికి నడిపే అద్భుతమైన మార్గం.”—టామ్‌, అమెజాన్‌ మండలంలో, తన భార్య లిండాతో పయినీరింగ్‌ చేస్తున్నారు.

ఈ ప్రశంసా వ్యక్తీకరణలు వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌లో మిషనరీ ట్రెయినింగ్‌ పొందేందుకు పరిస్థితులు అనుకూలించనివారి నుండి వచ్చాయి. అయినప్పటికీ, వాళ్ళు విదేశీ సేవలోని ఆనందాలను, సవాళ్ళను చవిచూశారు. అలా ఎలా జరుగుతుంది? మీరు కూడా అలాంటి సేవ చేయవచ్చా?

సరైన ప్రేరణలు అవసరం

విదేశీ క్షేత్రంలో సఫలీకృతులయ్యేందుకు సాహసం కన్నా మరింత ఎక్కువే అవసరం. ఎవరైతే సరైన లక్ష్యాలతో పట్టుదలగా ప్రయత్నించారో వారు సఫలీకృతులయ్యారు. వారు అపొస్తలుడైన పౌలులా, తాము దేవునికే కాక మనుష్యులకు కూడా ఋణస్థులమని తలస్తారు. (రోమీయులు 1:14) తమ సొంత టెరిటరీలో ప్రకటించడం ద్వారా పరిచర్యలో పాల్గొనాలనే దేవుని ఆజ్ఞను వాళ్లు నెరవేర్చి ఉండగలిగేవారే. (మత్తయి 24:14) అయితే, వాళ్ళు, సువార్తను వినే అవకాశం ఎక్కువగా లభించనివాళ్ళకు తాము ఋణస్థులమని భావించి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సహాయపడాలన్న ప్రేరణను పొందారు.

మరొక ప్రేరణ, మరింత ఫలితం ఉండే టెరిటరీలో సేవ చేయాలన్న కోరిక. అలా చేయడం మంచిది. మరో జాలరి ఎక్కువ చేపలు పడుతుండడాన్ని చూసిన మనలో ఎవరం మాత్రం, ఆ జాలరి చేపలు పడుతున్న చెరువులోని ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్లం? అలాగే, ఇతర దేశాల్లోని, అసాధారణ పెరుగుదలలను గురించిన ప్రోత్సాహకరమైన నివేదికలు, “విస్తారమైన చేపలు” ఉన్న చోటికి వెళ్ళేందుకు అనేకులను ప్రోత్సహించాయి.—లూకా 5:4-10.

లెక్క చూసుకోండి

విదేశం నుండి వచ్చిన మత సంబంధ స్వచ్ఛంద సేవకులను లౌకిక పని చేసేందుకు చాలా దేశాలు అనుమతించవు. కాబట్టి ఎవరైతే విదేశీ క్షేత్రంలో సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆర్థికంగా స్వతంత్రులై ఉండాలి. వాళ్ళు ఈ ఆర్థిక సవాలును ఎలా అధిగమించారు? చాలామంది తమ ఇళ్ళు అమ్మి లేక అద్దెకు ఇచ్చి అవసరమైన డబ్బును సంపాదించారు. ఇతరులు తమ వ్యాపారాలను అమ్ముకున్నారు. కొంత మంది తమ లక్ష్య సాధన కోసం డబ్బు కూడబెట్టుకున్నారు. ఇంకా ఇతరులు ఒకటి రెండు సంవత్సరాలు విదేశంలో సేవచేసి, తమ స్వదేశానికి తిరిగి వచ్చి పని చేసి కొంత డబ్బు కూడబెట్టుకుని తిరిగి వెళ్ళి సేవ చేస్తారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో కన్నా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీవన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది కనుక, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివసించడం లాభదాయకమనడంలో సందేహం లేదు. ఇది, కొంతమంది తక్కువ పెన్షన్‌తో కూడా సంతృప్తికరంగా జీవించడాన్ని సాధ్యం చేసింది. నిజమే, ఖర్చులు అనేవి ముఖ్యంగా ఒకరు ఎంచుకునే జీవన ప్రమాణాన్ని బట్టి ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా చాలా సౌకర్యప్రదమైన వసతులు లభిస్తాయి, కాకపోతే ఖర్చు ఎక్కువవుతుంది.

స్పష్టంగా, మరొక చోటికి తరలి వెళ్ళేముందు, ఎంత ఖర్చువుతుందన్నది లెక్కచూసుకోవాలి. అయితే డబ్బు ఎంత ఖర్చవుతుందనేది లెక్క చూసుకోవడం కన్నా ఎక్కువే చూడవలసిన అవసరం ఉంది. దక్షిణ అమెరికాలో సేవ చేసిన కొందరి వ్యాఖ్యలు బహుశా మరింత అవగాహనను కలిగించవచ్చు.

అతి పెద్ద సవాలు

“స్పానిష్‌ భాష నేర్చుకోవడానికి నేను చాలా పోరాడవలసి వచ్చింది. నాకు భాష రాదు కనుక, నేను పరిచర్య సేవకుడుగా సేవ చేసేందుకు కొంత కాలం పడుతుంది అనుకున్నాను. నేను వెళ్ళి కేవలం రెండు నెలలు గడిచిన తర్వాత, పుస్తక పఠనం నిర్వహించమని నన్ను అడిగినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానో! నేను కంగారు పడిన అనేక సందర్భాలున్నాయి. ముఖ్యంగా పేర్లు గుర్తుంచుకోవడం కష్టంగా ఉండేది. ఒకరోజు నేను సహోదరుడు సాన్‌చోని ‘బ్రదర్‌ చాన్‌చో (పంది)’ అని పిలిచాను. సహోదరి సాలామేయను ‘మాలాసేయ (దుష్టురాలు)’ అని పిలిచిన విషయం ఎన్నడూ మరవలేను. సంతోషకరమైన విషయమేమిటంటే, ఆ సహోదర సహోదరీలు నా గురించి చాలా సహనం చూపించేవాళ్ళు” అని ఫిన్‌ల్యాండ్‌ నుండి మార్కూ చెబుతున్నారు. చివరికి, మార్కూ, ఆ దేశంలో తన భార్య సెలీన్‌తో ప్రాంతీయ పైవిచారణకర్తగా ఎనిమిది సంవత్సరాలు సేవ చేశారు.

ముందు పేర్కొన్న జెసీ భార్య క్రిస్‌ ఈ విధంగా చెబుతుంది: “మేము ఇక్కడికి వచ్చి కేవలం మూడు నెలలైన తర్వాత జరిగిన మా మొదటి ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం నాకు బాగా గుర్తుంది. ఆ సహోదరుడు దృష్టాంతాలను ఉపయోగిస్తూ, మా హృదయాలను తాకేందుకు ఏదో చక్కని విషయాన్ని చెబుతున్నాడని నేను గ్రహించాను, కానీ, ఆయన ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కావడంలేదు. అక్కడే, ఆ హాల్లోనే నేను భోరున ఏడ్చాను. కన్నీళ్ళు జలజలా కారడమే కాదు, వెక్కివెక్కి ఏడ్చాను. కూటం అయిపోయిన తర్వాత, నేను మా ప్రాంతీయ పైవిచారణకర్తకు నేనలా ఏడ్వడానికి గల కారణాన్ని వివరించడానికి ప్రయత్నించాను. ఆయన నాపై చాలా దయచూపించాడు, మిగతా అందరూ నాతో చెబుతూ వస్తున్నట్లే, ఆయన కూడా, ‘టెన్‌ పాస్యెన్స్‌యా ఎర్మానా’ (‘కొంచెం ఓపిక పట్టండి సిస్టర్‌’) అని అన్నారు. రెండు మూడు సంవత్సరాల తర్వాత, మేము మళ్ళీ కలిసినప్పుడు, 45 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మేము మనస్సులోని భావాలను పంచుకోగల్గినందుకు సంతోషించాం.”

“అధ్యయనం అత్యవసరం. భాషను అధ్యయనం చేయడానికి మనమెంత ప్రయత్నం చేస్తే, మన మనస్సులోని భావాలను ఆ భాషలో ఇతరులతో పంచుకునే సామర్థ్యాన్ని అంతగా మెరుగుపరచుకోగలం” అని మరో సహోదరుడు పేర్కొంటున్నాడు.

అలాంటి ప్రయత్నాల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి అని అందరూ ఒప్పుకుంటారు. ఎవరైనా క్రొత్త భాషను నేర్చుకోవడానికి శ్రమిస్తున్నప్పుడు అణకువ, సహనం, పట్టుదలా అలవడుతాయి. ఇతరులకు సువార్తను ప్రకటించే పెద్ద అవకాశమనే ద్వారం తెరువబడుతుంది. ఉదాహరణకు, స్పానిష్‌ భాషను నేర్చుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల కన్నా ఎక్కువ మంది మాట్లాడే ఆ భాషలో మాట్లాడడం సాధ్యం అవుతుంది. తమ సొంత దేశానికి తిరిగి వెళ్లవలసి వచ్చిన అనేకులు, స్పానిష్‌ మాతృభాష అయిన వారికి సహాయం చేసేందుకు తమ భాషా నైపుణ్యాన్ని ఉపయోగించగల్గుతున్నారు.

ఇంటి బెంగ విషయమేమిటి?

“మేము 1989లో ఈక్వెడార్‌కి మొదటిసారిగా వచ్చినప్పుడు, నాకు ఇంటిబెంగ బాగా కలుగుతుండేది. నేను మా సంఘంలోని సహోదర సహోదరీలపై ఎక్కువగా ఆధారపడడం నేర్చుకున్నాను. వాళ్ళు నా కుటుంబంగా మారారు” అని తన భర్తయైన గారీతో అమెజాన్‌ ప్రాంతంలో సేవ చేసిన దెబ్ర గుర్తుచేసుకుంటోంది.

“నేను ప్రతిరోజు పరిచర్యలో పాల్గొనడం ద్వారా ఇంటిబెంగతో పోరాడగల్గాను. అలా నేను ఇంటి గురించి పగటి కలలు కనకుండా ఉండేదాన్ని. నేను విదేశీ క్షేత్రంలో చేస్తున్న పనిని గురించి మా ఇంట్లో మా తల్లిదండ్రులు గర్విస్తున్నారన్న విషయాన్ని నేను మనస్సులో ఉంచుకున్నాను. ‘నా కన్నా బాగా యెహోవాయే నిన్ను చూసుకోగలడు’ అని వ్రాస్తూ అమ్మ నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించేది” అని ప్రారంభంలో పేర్కొనబడిన కరన్‌ అంటోంది.

జపాన్‌ నుండి మాకీకో, ఛలోక్తిగా, “రోజంతా క్షేత్రసేవలో పాల్గొన్న తర్వాత, నేను బాగా అలిసిపోతాను. నేను గదికి చేరుకుని ఇంటిబెంగ వచ్చే సరికి నాకు నిద్రపట్టేస్తుంది. దాని మూలంగా, అది ఎక్కువ సేపు ఉండదు” అని అంటుంది.

పిల్లల సంగతేమిటి?

పిల్లలు ఉంటే, పిల్లల విద్య గురించి, వాళ్ళ ఇతర అవసరాల గురించి తప్పనిసరిగా జాగ్రత్తగా ఆలోచించాలి. తమ పిల్లలు ఇంట్లోనే ఉండి చదువుకోవాలని కొందరు తల్లిదండ్రులు ఎంపిక చేశారు. మరి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానిక పాఠశాలల్లో చేర్పించారు.

ఆల్‌, తన భార్యా పిల్లలు తల్లితో పాటు దక్షిణ అమెరికాకు తరలి వెళ్ళాడు. “పిల్లలను స్కూల్లో చేర్పించితే, వాళ్ళు భాషను త్వరగా నేర్చుకోగలరని మేము కనుగొన్నాం. మూడు నెలల్లో వాళ్లు అనర్గళంగా మాట్లాడగలిగారు” అని ఆయన అన్నాడు. మరొకవైపు, మైక్‌, కారీల టీనేజ్‌లోని ఇద్దరు అబ్బాయిలు ప్రభుత్వ అంగీకారం గల కరస్పాండెన్స్‌ స్కూల్‌ ద్వారా చదువుకుంటున్నారు. “అలాంటి చదువులైతే, పిల్లలను వాళ్ళ మానాన వదిలేయలేం. మనం కూడా ఆ కోర్సులో వాళ్ళతోపాటు కలిసి, వచ్చిన అసైన్‌మెంట్లను వాళ్ళు ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉంది” అని ఆ తల్లిదండ్రులు అంటున్నారు.

ఆస్ట్రేలియా నుండి, డేవడ్‌, జనీటలు తమ ఇద్దరు కుమారులను గురించిన తమ అనుభూతులను వ్యక్తం చేస్తున్నారు. “ఇతరులు ఎలా జీవిస్తున్నారు అన్నదాన్ని మా పిల్లలు ప్రత్యక్షంగా చూడాలని మేము కోరుకున్నాం. మేము పెరిగిన జీవన శైలే సరైనదని అనుకోవడం చాలా సులభం. నిజానికి మా జీవన శైలి, చాలా తక్కువమంది అనుసరిస్తున్న జీవన శైలి. ఏ దేశమైనా, ఏ సంస్కృతియైనా సరే, ప్రపంచవ్యాప్తంగా దైవపరిపాలనా సూత్రాలు ఎలా పనిచేస్తాయన్నది కూడా వాళ్ళు చూశారు” అని వాళ్ళు అన్నారు.

“1969లో మా కుటుంబం ఇంగ్లండ్‌ నుండి తరలి వచ్చినప్పుడు, నాకు కేవలం నాలుగేండ్లే. నేను ఊహించుకున్నట్లుగా, రెల్లుగడ్డితో తయారు చేసిన పైకప్పు మట్టి గోడలూ గల పూరి గుడిసెలో మేము ఉండలేకపోయామే అన్న నిరాశ కల్గినప్పటికీ, ఏ పిల్లలకూ దొరకనటువంటి పులకరింపజేసే పెంపకం నాకు దొరికింది అని నాకు అనిపించింది. ఇటువంటి అవకాశం దొరకని అనేకమంది పిల్లల గురించి నేను ఎల్లప్పుడూ విచారిస్తుంటాను! మిషనరీల, ప్రత్యేక పయినీర్ల మంచి సహవాసం వల్ల నేను తొమ్మిదేళ్ళ వయస్సులో సహాయ పయినీరింగ్‌ ప్రారంభించాను” అని కెన్‌ గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఇప్పుడు ఒక ప్రయాణ పైవిచారణకర్త.

జెసీ కూతురైన, గబ్రీయేలా, “ఇప్పుడు నిజంగా ఈక్వెడారే మా ఇల్లు. మేము ఇక్కడికి రావాలని మా తల్లిదండ్రులు నిర్ణయించుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను” అని ఒప్పుకుంటోంది.

మరొకవైపు, అనేక కారణాల వల్ల సర్దుకోలేకపోయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అందుకే, విదేశానికి తరలి వెళ్ళే ముందు, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడడం మంచిది. ఆ విధంగా ప్రత్యక్షంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా నిర్ణయాలను తీసుకోవచ్చు.

తరలివెళ్ళడం వల్ల కలిగే ఆశీర్వాదాలు

వాస్తవానికి, విదేశీ క్షేత్రానికి తరలి వెళ్ళేటప్పుడు అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది, అనేక త్యాగాలను చేయవలసి వస్తుంది. తరలివెళ్ళడం తగినదేనని ఎవరి విషయంలోనైనా నిరూపితమయ్యిందా? వాళ్ళనే చెప్పనిద్దాం.

జెసీ: “మేము అంబాటో నగరంలో ఉన్న పది సంవత్సరాల్లో, అక్కడున్న సంఘాల సంఖ్య 2 నుండి 11కు పెరగడాన్ని చూశాం. వాటిలోని ఐదు సంఘాలను ప్రారంభించడానికి సహాయపడే ఆధిక్యత మాకు లభించింది. రెండు రాజ్య మందిరాల నిర్మాణ ప్రాజెక్ట్‌లో పనిచేశాం. ప్రతి సంవత్సరం సరాసరి ఇద్దరు బైబిలు విద్యార్థులు బాప్తిస్మానికి యోగ్యులయ్యేందుకు సహాయపడే ఆనందం కూడా మాకు లభించింది. నాకున్న దుఃఖమొక్కటే—ఇక్కడికి పది సంవత్సరాల క్రితమే రాలేకపోయామే అన్నదే.”

లిండా: “సువార్త ఎడలా, మా ప్రయత్నాల ఎడలా ప్రజలకున్న మెప్పుదల మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరచింది. ఉదాహరణకు, అడవిలో ఉండే ఒక చిన్న పట్టణంలో, ఆల్‌ఫాన్సో అనే బైబిలు విద్యార్థి, తన ప్రాంతంలో బహిరంగ ప్రసంగాలు ఇస్తే ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో గ్రహించాడు. ఆయన, క్రొత్తగా నిర్మించుకున్న కలప ఇంట్లోకి ఈ మధ్యే మారాడు. ఆ గ్రామంలో కలప ఇండ్లు కేవలం కొన్నే ఉన్నాయి, వాటిలో అది ఒకటి. పట్టణంలో ఉన్న ఇండ్లలో తన ఇల్లు మాత్రమే యెహోవాకు తగినది అని నిర్ణయించుకుని, ఆయన తన రెల్లు గుడిసెలోకి మారిపోయి, ఆ కలప ఇంటిని రాజ్య మందిరంగా వాడమని సహోదరులకు అప్పగించాడు.”

జిమ్‌: “మేము ప్రజలతో మాట్లాడడానికి ఉపయోగించే సమయం అమెరికాలో కన్నా ఇక్కడ పది రెట్లు ఎక్కువ. అంతేకాక, ఇక్కడి జీవనగతి మందకొడిగా సాగుతుంది. ఇక్కడ పఠనానికీ, క్షేత్ర సేవకూ ఎక్కువ సమయముందనడానికి సందేహమే లేదు.”

సాన్‌డ్రా: “బైబిలు సత్యం ప్రజల్లో మంచి మార్పు తేవడాన్ని చూడడం, నాకు గొప్ప సంతృప్తినిస్తుంది. నేను ఒకసారి ఆమాడాతో బైబిలు పఠించాను. ఆమాడా చిన్న కిరాణా దుకాణపు యజమానురాలు. ఆమెకు 69 ఏండ్లు. ఆమె అమ్మే పాలలో ఎప్పుడూ, ప్రతి పది పాళ్ళకు రెండు పాళ్ళ నీళ్ళు కలిపేది. అంతేకాక, ఆమె ఆ పలచని పాలను తక్కువ కొలతలో పోస్తూ ప్రజలను మోసం చేసేది. నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలో, 13వ అధ్యాయంలో, ‘నిజాయితీ సంతోషాన్ని తెస్తుంది’ అనే సబ్‌హెడ్డింగ్‌ క్రింద ఉన్న సమాచారాన్ని పఠించిన తర్వాత, ఆమాడా ఈ తప్పుడు పనులను మానేసింది. ఆ తర్వాత కొంత కాలానికి ఆమె బాప్తిస్మం పొందడాన్ని చూడడం ఎంత ఆనందాన్ని కలిగించిందో!”

కరన్‌: “నేను యెహోవా మీద ఇక్కడ ఆధారపడినంతగా మునుపెన్నడూ ఆధారపడలేదు. ఆయన నన్ను ఇక్కడ ఉపయోగించుకున్నంతగా మునుపెన్నడూ ఉపయోగించుకోలేదు. యెహోవాతో నా స్నేహం మరింత ప్రగాఢమైంది, మరింత బలపడింది.”

మీ విషయమేమిటి?

సంవత్సరాలుగా వేలాది మంది సాక్షులు విదేశాల్లో సేవ చేసేందుకు తరలి వెళ్ళారు. కొందరు అక్కడ ఒకటో రెండో సంవత్సరాలు ఉంటారు. మరి కొందరు అక్కడే ఉండిపోతారు. విదేశీ క్షేత్రంలో రాజ్యాసక్తులను విస్తృతం చేయాలన్న లక్ష్యంతో వాళ్ళు తమతో పాటు తమ అనుభవాన్నీ, ఆధ్యాత్మిక పరిణతినీ, ఆర్థిక వనరులనూ తీసుకువెళ్తారు. సరిగ్గా పని దొరకదు గనుక స్థానిక రాజ్య ప్రచారకులు వెళ్ళి సేవచేయలేని ప్రాంతాల్లో వాళ్ళు సేవ చేయగల్గుతున్నారు. వాహనాల్లేకుండా చేరుకోలేని ప్రాంతాల్లోకి వెళ్ళేందుకు గాను, వాళ్ళు నాలుగు చక్రాల వాహనాలను కొనుక్కున్నారు. నగర జీవితాన్ని కోరుకునే ఇతరులు, నగరాల్లో ఉన్న, సంఘపెద్దలు కొద్దిమందే ఉన్న పెద్ద సంఘాలకు తరలి వెళ్ళి, సంఘ సభ్యులను స్థిరపరిచే కారకాలుగా మారారు. అయినప్పటికీ, తాము ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పొందామని వాళ్ళలో ప్రతి ఒక్కరూ నొక్కి చెబుతారు.

విదేశీ క్షేత్రంలో సేవ చేసే ఆధిక్యతలో మీరు పాల్గొనగలరా? మీ పరిస్థితులు అనుమతిస్తున్నట్లయితే, అలా తరలివెళ్ళే సాధ్యతను గురించి ఎందుకు పరిశీలించకూడదు? మీరు ఏ దేశంలో సేవ చేయాలనుకుంటున్నారో ఆ దేశంలోని సొసైటీకి చెందిన బ్రాంచి కార్యాలయానికి వ్రాయడమే ప్రాథమికమైన, ముఖ్యమైన చర్య. ఆ దేశాన్ని గురించి, మీకు సొసైటీ నుండి అందే నిర్దిష్ట సమాచారం ఆధారంగా, మీరు అలా తరలివెళ్తే సఫలులవ్వగలరా అన్నది మీరు నిర్ణయించుకోవచ్చు. అంతేకాక, కావలికోట ఆగస్టు 15, 1988 ఆంగ్ల సంచికలో “మీ దేశం నుండి, మీ బంధువుల నుండి బయలు దేరండి” అనే శీర్షికలో అనేక ఆచరణాత్మక సూచనలను చూడవచ్చు. సరిగ్గా పథకం వేసుకోవడం ద్వారా, యెహోవా ఆశీర్వాదం ద్వారా బహుశా మీరు కూడా విదేశీ క్షేత్రంలో సేవ చేసే ఆనందాన్ని అనుభవించగలరు.

[24వ పేజీలోని చిత్రం]

ష్వార్‌ ఇండియన్‌లు నివసిస్తున్న ప్రాంతం వైపుగా కాలిబాటపై నడిచి వెళ్తున్న టామ్‌, లిండాలు

[25వ పేజీలోని చిత్రం]

ఈక్వెడార్‌ రాజధాని నగరమైన క్విటోలో అనేకులు సేవ చేస్తున్నారు

[25వ పేజీలోని చిత్రం]

ఆండీస్‌ పర్వతాల్లో ప్రకటిస్తున్న మాకీకో

[26వ పేజీలోని చిత్రం]

గత ఐదు సంవత్సరాలుగా ఈక్వెడార్‌లో సేవ చేస్తున్న హిల్‌బిగ్‌ కుటుంబం

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి