కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 11/1 పేజీలు 28-29
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • జెండా వందనం, ఓటు వేయడం, పౌర సేవ
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • యెహోవాసాక్షులు రాజకీయాల్లో ఎందుకు తలదూర్చరు?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • ‘వారు లోకసంబంధులు కారు’
    అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
  • ‘వారు లోకసంబంధులు కారు’
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 11/1 పేజీలు 28-29

పాఠకుల ప్రశ్నలు

యెహోవాసాక్షులు ఓటువేయడాన్ని ఎలా దృష్టిస్తారు?

ఈ విషయాన్ని గురించి సరైన దృక్పథం కల్గివుండటానికి దేవుని సేవకులకు సహాయం చేసే స్పష్టమైన సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. అయితే, ఓటు వేయడాన్ని వ్యతిరేకించే సూత్రాలేవీ ఉన్నట్లు లేవు. ఉదాహరణకు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు తమ కార్పొరేషన్‌కు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడంలో ఓటు పద్ధతిని పాటించకూడదనడానికి కారణమేమీ లేదు. యెహోవాసాక్షుల సంఘాలు తమ కూటాల సమయాలకు సంబంధించి, సంఘ నిధులను ఉపయోగించడానికి సంబంధించి చేతులెత్తి ఓటు వేయడం ద్వారా తరచూ నిర్ణయాలు తీసుకుంటారు.

అయితే రాజకీయ ఎన్నికల్లో ఓటు వేయడం మాటేమిటి? కొన్ని ప్రజాస్వామ్య దేశాల్లో, జనాభాలోని దాదాపు 50 శాతం మంది ఎన్నికల రోజున ఓటు వేయడానికి రారు. యెహోవా సాక్షులైతే, ఓటు వేసేందుకు ఇతరులకున్న హక్కు విషయంలో జోక్యం చేసుకోరు; అంతేగాక వాళ్లు రాజకీయ ఎన్నికలకు వ్యతిరేకంగా ఏ విధంగానూ ప్రచారం చేయరు. అలాంటి ఎన్నికల్లో ఎన్నుకోబడిన అధికారులను వారు గౌరవిస్తారు, వారితో సహకరిస్తారు. (రోమీయులు 13:1-7) అయితే వారు ఎన్నికల్లో నిలబడుతున్న వారికి వ్యక్తిగతంగా ఓటు వేస్తారా లేదా అన్నది ప్రతి యెహోవాసాక్షి బైబిలు తర్ఫీదు పొందిన తన మనస్సాక్షి ఆధారంగానూ, దేవునిపట్ల, దేశంపట్ల తనకున్న బాధ్యతను అర్థం చేసుకున్నదాని ఆధారంగానూ నిర్ణయం తీసుకుంటారు. (మత్తయి 22:21; 1 పేతురు 3:15) ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకోవడంలో, సాక్షులు అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటారు.

మొదటిగా, యేసుక్రీస్తు తన అనుచరుల గురించి ఇలా చెప్పాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:14) యెహోవాసాక్షులు ఈ సూత్రాన్ని గంభీరంగా తీసుకుంటారు. “లోకసంబంధులు కారు” గనుక, వాళ్లు ప్రపంచ రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉంటారు.—యోహాను 18:36.

రెండవదిగా, అపొస్తలుడైన పౌలు, తన కాలంనాటి ప్రజలకు తనను తాను క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తున్న “రాయబారి”గా సూచించుకున్నాడు. (ఎఫెసీయులు 6:19; 2 కొరింథీయులు 5:20) క్రీస్తు యేసు ఇప్పుడు దేవుని పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడైయున్న రాజు అని యెహోవాసాక్షులు విశ్వసిస్తారు, వాళ్లు రాయబారులుగా దీన్ని జనాంగాలకు ప్రకటించాలి. (మత్తయి 24:14; ప్రకటన 11:15) రాయబారులు తాము పంపబడుతున్న దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా తటస్థంగా ఉండాలని నిరీక్షించబడుతుంది. దేవుని పరలోక రాజ్యానికి ప్రతినిధులుగా, తాము నివసిస్తున్న దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండవలసిన బాధ్యత తమకుందని యెహోవాసాక్షులు భావిస్తారు.

పరిశీలించవలసిన మూడవ కారణం ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చేలా ఓటు వేసినప్పుడు, అలా ఓటు వేసినవారు, అధికారంలోకి వచ్చిన ఆ వ్యక్తి చేసేవాటన్నిటికి బాధ్యులౌతారు. (పోల్చండి 1 తిమోతి 5:22.) ఆ బాధ్యతను తాము చేపట్టాలా వద్దా అన్నది క్రైస్తవులు జాగ్రత్తగా పరిశీలించాలి.

నాలుగవదిగా, యెహోవాసాక్షులు తమ క్రైస్తవ ఐక్యతను విలువైనదిగా ఎంచుతారు. (కొలొస్సయులు 3:14) మతాలు రాజకీయాల్లో భాగం వహించినప్పుడు, సాధారణంగా వాటి సభ్యుల మధ్యన విభజన ఏర్పడుతుంది. యేసుక్రీస్తును అనుకరిస్తూ, యెహోవాసాక్షులు రాజకీయాల్లో నిమగ్నమవ్వడాన్ని నివారించి, తద్వారా తమ క్రైస్తవ ఐక్యతను కాపాడుకుంటారు.—మత్తయి 12:25; యోహాను 6:15; 18:36, 37.

ఐదవదీ చివరిదీ, యెహోవాసాక్షులు రాజకీయాల్లో నిమగ్నమవ్వకపోవడమన్నది, ప్రాముఖ్యమైన రాజ్య సందేశంతో అన్ని రాజకీయ వర్గాలకు చెందిన వారినీ సమీపించడానికి వారికి వాక్‌స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది.—హెబ్రీయులు 10:35, NW.

పైన పేర్కొనబడిన లేఖనాధార సూత్రాల దృష్ట్యా, అనేక దేశాల్లో యెహోవాసాక్షులు రాజకీయ ఎన్నికల్లో ఓటు వేయకూడదని వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటారు, అలా నిర్ణయం తీసుకునేందుకు వారికున్న స్వేచ్ఛను ఆ దేశంలోని చట్టం సమర్థిస్తుంది. కాని పౌరులు ఓటు వేయాలని చట్టం కోరితే అప్పుడేమిటి? అలాంటి సందర్భాల్లో, ఆ పరిస్థితితో ఎలా వ్యవహరించాలనే దాని గురించి మనస్సాక్షిపూర్వకమైన, బైబిలు-ఆధారిత నిర్ణయం తీసుకోవడం ప్రతి సాక్షి బాధ్యత. ఎవరైనా పోలింగ్‌ బూత్‌కు వెళ్లాలనుకుంటే అది వారి నిర్ణయం. ఆయన పోలింగ్‌ బూత్‌లో ఏమి చేస్తాడనేది ఆయనకూ, ఆయన సృష్టికర్తకూ మధ్యనున్న విషయం.

1950 నవంబరు 15 కావలికోట (ఆంగ్లం) సంచిక, 445, 446 పేజీల్లో ఇలా తెలియజేసింది: “పౌరులు ఓటు వేయడాన్ని కైసరు తప్పనిసరి అయ్యేలా చేసే దేశాల్లో, . . . [సాక్షులు] పోలింగ్‌ బూత్‌లలోకి వెళ్లవచ్చు. వాళ్లు బాలెట్‌ మీద మార్కు చేయడమో లేక తమ స్థానాన్ని తెలుపుతూ వ్రాయడమో చేయవలసింది అక్కడే. ఓటు వేసేవారు బాలెట్‌లతో తమకు ఇష్టమైనది చేస్తారు. కాబట్టి సాక్షులు ఆయన ఆజ్ఞలకు అనుగుణంగానూ, తమ విశ్వాసానికి అనుగుణంగానూ ప్రవర్తించవలసింది దేవుని సమక్షంలో అక్కడే. బాలెట్‌తో ఏమి చేయాలనేది వారికి బోధించవలసిన బాధ్యత మాదికాదు.”

అవిశ్వాసి అయిన భర్త, క్రైస్తవురాలైన తన భార్య ఓటు వేయడానికి రావాలని పట్టుబట్టితే అప్పుడేమిటి? క్రైస్తవులు పై అధికారులకు లోబడి ఉండవలసినట్లుగానే, ఆమె తన భర్తకు లోబడి ఉండాలి. (ఎఫెసీయులు 5:22; 1 పేతురు 2:13-17) ఆమె తన భర్తకు విధేయురాలై పోలింగ్‌ బూత్‌కు వెళ్తే, అది ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఆమెను ఎవరూ విమర్శించకూడదు.—పోల్చండి రోమీయులు 14:4.

ఓటు వేయాలని చట్టం ఆదేశించకపోయినప్పటికీ, ఓటింగ్‌ బూత్‌కు వెళ్లకపోతే వైరానికి లేదా శారీరక దౌర్జన్యానికి గురి కావలసి వచ్చే పరిస్థితివున్న దేశం మాటేమిటి? లేదా చట్టబద్ధంగా ఓటు వేయవలసిన బాధ్యత లేకపోయినప్పటికీ, పోలింగ్‌ బూత్‌కు వెళ్లకపోతే తీవ్రంగా నష్టపరిహారం చెల్లించవలసి వచ్చే పరిస్థితుల మాటేమిటి? ఈ పరిస్థితుల్లోనూ, ఇదేలాంటి పరిస్థితుల్లోనూ, ఒక క్రైస్తవుడు తన స్వంత నిర్ణయాన్ని తీసుకోవాలి. “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను.”—గలతీయులు 6:5.

తమ దేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు, కొంతమంది యెహోవాసాక్షులు పోలింగ్‌ బూత్‌లకు వెళ్లడమూ కొందరు వెళ్లకపోవడమూ చూసి అభ్యంతరపడే ప్రజలు ఉండవచ్చు. ‘యెహోవాసాక్షులు సంగతంగా లేరని’ వాళ్లనవచ్చు. అయితే, మనస్సాక్షికి సంబంధించిన ఇటువంటి విషయాల్లో ప్రతి క్రైస్తవుడు యెహోవా దేవుని ఎదుట తన స్వంత నిర్ణయాన్ని తీసుకోవలసి ఉందని ప్రజలు గుర్తించాలి.—రోమీయులు 14:11.

వివిధ పరిస్థితుల్లో యెహోవాసాక్షులు ఏ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాళ్లు తమ క్రైస్తవ తటస్థతనూ, స్వేచ్ఛగా మాట్లాడే స్వాతంత్ర్యాన్నీ కాపాడుకోవడానికి జాగ్రత్త వహిస్తారు. అన్ని విషయాల్లోనూ, తమను బలపర్చమనీ, జ్ఞానాన్నివ్వమనీ, ఏ విధంగానూ తమ విశ్వాసం విషయంలో రాజీపడకుండా ఉండేందుకు సహాయం చేయమనీ వాళ్లు యెహోవా దేవునిపై ఆధారపడతారు. అలా వాళ్లు కీర్తన గ్రంథకర్త చెప్పిన ఈ మాటలపై నమ్మకముందని చూపిస్తారు: “నా కొండ నా కోట నీవే; నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము.”—కీర్తన 31:3.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి