ప్రకటన గ్రంథపు ధన్యులైన పాఠకులై ఉండండి
“ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.”—ప్రకటన 1:3.
1. అపొస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాసినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఈ దర్శనాలు ఏ ఉద్దేశంతో వ్రాయబడ్డాయి?
‘యోహాను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసిగా ఉన్నాడు.’ (ప్రకటన 1:9) అపొస్తలుడైన యోహాను అపోకలిప్స్ లేదా ప్రకటన అనే గ్రంథాన్ని రచించినప్పుడు ఉన్న పరిస్థితులవి. చక్రవర్తి ఆరాధనను అమలుచేస్తూ, క్రైస్తవుల హింసకునిగా తయారైన రోమా చక్రవర్తి డొమిషియన్ (సా.శ. 81-96) పరిపాలనా కాలంలో యోహాను పత్మాసు ద్వీపానికి బహిష్కరించబడి ఉంటాడని ఒక ఉవాచ. పత్మాసు ద్వీపంలో ఉండగా యోహాను దర్శనాల పరంపరను పొందాడు, ఆయన వాటిని వ్రాసి పెట్టాడు. వాటిని ఆయన చెప్పింది తొలిక్రైస్తవులను భయపెట్టడానికి కాదు గానీ వారనుభవిస్తున్న, అనుభవించనైయున్న శ్రమలలో వారిని బలపరచడానికి, ఓదార్చడానికి, ప్రోత్సహించడానికే.—అపొస్తలుల కార్యములు 28:22; ప్రకటన 1:4; 2:3, 9, 10, 13.
2. యోహాను, ఆయన తోటి క్రైస్తవులు ఉన్న పరిస్థితి, నేడు జీవిస్తున్న క్రైస్తవులకు ఎందుకు ఆసక్తికరమైనది?
2 ఈ బైబిలు పుస్తకం వ్రాయబడిన కాలంనాటి పరిస్థితులు నేడు జీవిస్తున్న క్రైస్తవులకు ఎంతో విశేషమైనవి. యోహాను యెహోవాకు ఆయన కుమారుడైన క్రీస్తు యేసుకు సాక్షియైనందువల్ల శ్రమ అనుభవిస్తున్నాడు. మంచి పౌరులుగా ఉండటానికి కృషిచేస్తూవున్నా, చక్రవర్తి ఆరాధనలో భాగం వహించలేరు గనుక ఆయనా ఆయన తోటి క్రైస్తవులూ ప్రతికూలతలున్న పరిస్థితుల్లో జీవిస్తున్నారు. (లూకా 4:8) నేడు కొన్ని దేశాల్లో, ఏది “మతసంబంధంగా సరైనది” అనేదాన్ని నిర్వచించే హక్కు ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రాంతాల్లో, నిజ క్రైస్తవులు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే ఉన్నారు. కాబట్టి, ప్రకటన గ్రంథంలోని పరిచయ వాక్యాల్లో ఉన్న ఈ మాటలు ఎంతో ఓదార్పునిస్తాయి: “సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.” (ప్రకటన 1:3) అవును, ప్రకటన గ్రంథాన్ని శ్రద్ధగా, విధేయంగా చదివేవారు నిజమైన ఆనందాన్ని, ఎన్నో ఆశీర్వాదాలను పొందవచ్చు.
3. యోహానుకు ఇవ్వబడిన ప్రకటనకు మూలకర్త ఎవరు?
3 ప్రకటన గ్రంథానికి అసలు మూలకర్త ఎవరు, దాన్ని అందజేయడానికి ఏ మాధ్యమాన్ని ఉపయోగించడం జరిగింది? ప్రారంభ వచనం మనకిలా చెప్తుంది: “యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.” (ప్రకటన 1:1) సరళంగా చెప్పాలంటే, ప్రకటన గ్రంథానికి మూలకర్త యెహోవా దేవుడు, దాన్ని ఆయన యేసుకిచ్చాడు, యేసు ఒక దూత ద్వారా దాన్ని యోహానుకిచ్చాడు. సంఘాలకు సందేశాలను అందజేయడానికీ, యోహానుకు దర్శనాలను ఇవ్వడానికీ యేసు పరిశుద్ధాత్మను కూడా ఉపయోగించాడని మరికొంత అదనపు పరిశీలన తెలియజేస్తుంది.—ప్రకటన 2:7, 11, 17, 29; 3:6, 13, 22; 4:2; 17:3; 21:10; పోల్చండి అపొస్తలుల కార్యములు 2:33.
4. భూమిపైనున్న తన ప్రజలను నడిపించడానికి యెహోవా నేడు కూడా ఏ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాడు?
4 యెహోవా ఇప్పటికీ, “సంఘమునకు శిరస్సైయున్న” తన కుమారుడ్ని, భూమిపైనున్న తన సేవకులకు బోధించడానికి ఉపయోగించుకుంటున్నాడు. (ఎఫెసీయులు 5:23; యెషయా 54:13; యోహాను 6:45) యెహోవా తన ప్రజలకు ఉపదేశించడానికి తన ఆత్మను కూడా ఉపయోగిస్తున్నాడు. (యోహాను 15:26; 1 కొరింథీయులు 2:10) యేసు మొదటి శతాబ్దపు సంఘాలకు ఆధ్యాత్మిక పౌష్టికాహారాన్ని ఇవ్వడానికి “తన దాసుడైన యోహాను”ను ఉపయోగించుకున్నట్లుగానే, నేడు తన ఇంటివారికీ వారి సహచరులకూ “తగినవేళ అన్నము” పెట్టడానికి, భూమిపైనున్న తన అభిషిక్త ‘సహోదరులతో’ రూపొందిన ‘నమ్మకమైనవాడు బుద్ధిమంతుడునైన దాసుడ్ని’ ఉపయోగించుకుంటున్నాడు. (మత్తయి 24:45-47; 25:40) ఆధ్యాత్మిక ఆహారం రూపంలోనూ, ఆయన ఉపయోగించుకుంటున్న మాధ్యమం రూపంలోనూ మనం అందుకుంటున్న ‘శ్రేష్ఠమైన ఈవులకు’ మూలమేమిటో గుర్తించేవారు ధన్యులు.—యాకోబు 1:17.
క్రీస్తు-నిర్దేశిత సంఘాలు
5. (ఎ) క్రైస్తవ సంఘాలను, వాటి పైవిచారణకర్తలను దేనితో పోల్చడమైంది? (బి) మానవ అపరిపూర్ణత ఉన్నప్పటికీ, మన ఆనందానికి ఏది దోహదపడుతుంది?
5 ప్రకటన గ్రంథంలోని తొలి అధ్యాయాల్లో, క్రైస్తవ సంఘాలు దీపస్తంభాలతో పోల్చబడ్డాయి. దాని పైవిచారణకర్తలు దూతలతో (సందేశకులతో), నక్షత్రాలతో పోల్చబడ్డారు. (ప్రకటన 1:19, 20)a క్రీస్తు తన గురించి తానిలా చెప్పుకుంటూ, వ్రాయమని యోహానుకు చెప్పాడు: “ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతు[లు].” (ప్రకటన 2:1) ఏడు ఆసియా సంఘాలకు పంపబడిన యేడు సందేశాలు సా. శ. మొదటి శతాబ్దంలో, సంఘాలకూ వాటి పెద్దలకూ తమ తమ సొంత ప్రత్యేకతలూ అలాగే తమవైన బలహీనతలూ ఉండేవని చూపిస్తున్నాయి. నేడు కూడా అది వాస్తవం. కాబట్టి, మన శిరస్సైన క్రీస్తు సంఘాల మధ్య ఉన్నాడన్న విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకుంటే ఎంతో సంతోషంగా ఉంటాము. కచ్చితంగా ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు. పైవిచారణకర్తలు సూచనార్థకంగా “ఆయన కుడిచేతిలో” ఉన్నారు, అంటే, ఆయన అదుపాజ్ఞల్లో ఉన్నారు, వాళ్లు తాము సంఘాలను కాచే విషయానికి సంబంధించి ఆయనకు జవాబుదారులై ఉన్నారు.—అపొస్తలుల కార్యములు 20:28; హెబ్రీయులు 13:17.
6. క్రీస్తుకు జవాబుదారులు కేవలం పైవిచారణకర్తలు మాత్రమే కాదని ఏది చూపిస్తుంది?
6 అయితే, కేవలం పైవిచారణకర్తలు మాత్రమే తమ చర్యల విషయమై క్రీస్తుకు జవాబుదారులని మనం అనుకుంటే, మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. తన సందేశాల్లో ఒకదానిలో క్రీస్తు ఇలా అన్నాడు: “అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.” (ప్రకటన 2:23) ఇది ఒకే సమయంలో అటు హెచ్చరికా ఇటు ప్రోత్సాహము అయ్యుంది, మన అంతరంగంలోనున్న ఆలోచనలు క్రీస్తుకు తెలుసన్నది హెచ్చరికైతే, క్రీస్తుకు మన ప్రయత్నాల గురించి తెలుసనీ, మనం చేయగలిగింది మనం చేస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడనీ అది మనకు హామీ ఇస్తుంది గనుక అది ఒక ప్రోత్సాహం.—మార్కు 14:6-9; లూకా 21:3, 4.
7. ఫిలదెల్ఫియాలోని క్రైస్తవులు ‘ఓర్పు విషయంలో యేసు మాటను ఎలా గైకొన్నారు’?
7 లూదియ నగరమైన ఫిలదెల్ఫియలోవున్న సంఘానికి క్రీస్తు ఇచ్చిన సందేశంలో గద్దింపు ఏమి లేదు గానీ, మనకు ఎంతో ఆసక్తికరమైనదై ఉండవలసిన వాగ్దానాన్ని అది మనకిస్తుంది. “నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధనకాలములో నేనును నిన్ను కాపాడెదను.” (ప్రకటన 3:10) “నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి” అన్న పదబంధం కొరకైన గ్రీకు పదబంధానికి, “ఓర్పు గురించి నేనేమి చెప్పానో అది నీవు గైకొంటివి” అన్న భావం కూడా ఉంది. ఫిలదెల్ఫియలోని క్రైస్తవులు క్రీస్తు ఆజ్ఞకు విధేయులవ్వడమే గాక నమ్మకంగా సహించమని ఆయనిచ్చిన ఉపదేశాన్ని అనుసరించారని 8వ వచనం సూచిస్తుంది.—మత్తయి 10:22; లూకా 21:19.
8. (ఎ) ఫిలదెల్ఫియాలోని క్రైస్తవులకు యేసు ఏ వాగ్దానం చేశాడు? (బి) “శోధనకాలము”ను బట్టి నేడు ఎవరు ప్రభావితమౌతారు?
8 వాళ్లను “శోధనకాలములో” కాపాడతానని కూడా యేసు చెప్పాడు. అప్పట్లో ఆ క్రైస్తవులకు దాని భావమేమై ఉందో మనకు తెలియదు. సా.శ. 96లో డొమిషియన్ మరణించిన తర్వాత హింస కొంత తగ్గినప్పటికీ, ట్రాజాన్ (సా.శ. 98-117) ఆధ్వర్యంలో క్రొత్త హింసా వెల్లువ ప్రారంభమై, అదనపు శ్రమలను తెచ్చిందనడంలో సందేహం లేదు. కానీ ప్రముఖమైన “శోధనకాలము” మనమిప్పుడు జీవిస్తున్న “అంత్యకాలము”లో అంటే “ప్రభువు దినమందు” వస్తుంది. (ప్రకటన 1:10; దానియేలు 12:4) మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనూ, అది ముగిసిన వెంటనే కూడా ఆత్మాభిషిక్త క్రైస్తవులు శోధనకాలాన్ని అనుభవించారు. అయినప్పటికీ “శోధనకాలము” ఇంకా కొనసాగుతూనే ఉంది. అది, మహా శ్రమను తప్పించుకుని జీవించాలని నిరీక్షించే గొప్ప సమూహంగా రూపొందే లక్షలాదిమందితో సహా “లోకమంతటి”నీ ప్రభావితం చేస్తుంది. (ప్రకటన 3:10; 7:9, 14) ‘ఓర్పు గురించి యేసు చెప్పినదాన్ని మనం గైకొంటే’ మనం ధన్యులమౌతాము, ఆయనిలా చెప్పాడు: “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.”—మత్తయి 24:13.
యెహోవా సర్వోన్నతాధిపత్యానికి సంతోషకరమైన విధేయత
9, 10. (ఎ) యెహోవా సింహాసనాన్ని గురించిన దర్శనం మనల్ని ఏ యే విధాలుగా ప్రభావితం చేయాలి? (బి) మనం ప్రకటన గ్రంథాన్ని చదవడం మన ఆనందానికి ఎలా దోహదపడుతుంది?
9 ప్రకటన గ్రంథంలోని 4, 5 అధ్యాయాలలో ఇవ్వబడిన యెహోవా సింహాసనాన్ని గురించిన, ఆయన పరలోక దర్బారును గురించిన దర్శనం మనల్ని ఆశ్చర్యంతో నింపేయాలి. శక్తివంతమైన పరలోక ప్రాణులు యెహోవా నీతియుక్తమైన సర్వోన్నతాధిపత్యానికి సంతోషంగా విధేయులై హృదయపూర్వకంగా ఉచ్చరిస్తున్న స్తుతులను బట్టి మనం ప్రభావితమవ్వాలి. (ప్రకటన 4:8-11) “సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని” చెప్తున్న వారి స్వరంలో మన స్వరాలు కూడా వినిపించాలి.—ప్రకటన 5:13.
10 ఆచరణాత్మకమైన విధంగా, అన్ని విషయాల్లోనూ యెహోవా చిత్తానికి ఆనందభరితంగా విధేయులమై ఉండటమని దీని భావం. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.” (కొలొస్సయులు 3:17) మన మనస్సు లోతుల్లోనూ, హృదయాంతరాళాల్లోనూ మనం యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని గుర్తించి, మన జీవితాల్లోని అంశాలన్నిటిలో ఆయన చిత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మనం ప్రకటన గ్రంథాన్ని చదవడం మనల్ని నిజంగా ధన్యులను చేస్తుంది.
11, 12. (ఎ) సాతాను భూ విధానం ఎలా కంపింపజేయబడి, నాశనం చేయబడుతుంది? (బి) ప్రకటన 7వ అధ్యాయం ప్రకారం, ఆ సమయంలో ఎవరు ‘నిలబడగల్గుతారు’?
11 యెహోవా సర్వోన్నతాధిపత్యానికి సంతోషంగా విధేయత చూపించడమన్నది వ్యక్తిగత స్థాయిలోనూ, విశ్వవ్యాప్త స్థాయిలోనూ ఆనందానికి మూలం. త్వరలోనే ఒక గొప్ప సూచనార్థక భూకంపం సాతాను లోక విధానాన్ని పునాదులతో సహా పెకిలించి వేసి, దాన్ని సర్వనాశనం చేసేస్తుంది. దేవుని న్యాయబద్ధమైన సర్వోన్నతాధిపత్యానికి ప్రాతినిధ్యం వహించే క్రీస్తు పరలోక రాజ్య ప్రభుత్వానికి విధేయులవ్వడానికి నిరాకరించే మానవులకు ఆశ్రయస్థానమంటూ ఏదీ ఉండదు. ప్రవచనం ఇలా పేర్కొంటుంది: “భూరాజులును, ఘనులును, సహస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని—సింహాసనాసీనుడైయున్నవానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు.”—ప్రకటన 6:12, 15-17.
12 ఆ పై ప్రశ్నకు సంబంధించి, తర్వాతి అధ్యాయంలో, మహా శ్రమను తప్పించుకుని జీవించే గొప్ప సమూహముగా రూపొందేవారు, “సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి” ఉన్నట్లు అపొస్తలుడైన యోహాను వర్ణిస్తున్నాడు. (ప్రకటన 7:9, 14, 15) వారు దేవుని సింహాసనం ఎదుట నిలువబడి ఉండటం, వాళ్లు ఆ సింహాసనాన్ని గుర్తిస్తున్నారనీ యెహోవా సర్వోన్నతాధిపత్యానికి పూర్తిగా విధేయులై ఉన్నారనీ చూపిస్తుంది. కాబట్టి వాళ్లు ఆమోదింపబడినవారిగా ఉంటారు.
13. (ఎ) భూ నివాసుల్లో అధికశాతం మంది దేన్ని ఆరాధిస్తారు, వారి నొసటిపైగానీ వారి చేతిమీదగానీ ఉన్న ముద్ర దేన్ని సూచిస్తుంది? (బి) కాబట్టి సహనం ఎందుకు అవసరం?
13 మరో వైపున, మిగతా భూనివాసులు క్రూరమృగంచే సూచించబడే సాతాను యొక్క రాజకీయ విధానాన్ని ఆరాధిస్తున్నట్లు 13వ అధ్యాయం చూపిస్తుంది. వాళ్లు ఆ విధానానికి తమ మానసిక, భౌతిక మద్దతును చూపిస్తూ, తమ “నొసటి”పై లేదా తమ “చేతి”పై ముద్ర వేయించుకుంటారు. (ప్రకటన 13:1-8, 16, 17) తర్వాత, 14వ అధ్యాయం ఇలా జతచేస్తుంది: “ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతిమీదనేమి ఆ ముద్ర వేయంచుకొనినయెడల ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. . . . దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.” (ప్రకటన 14:9, 10, 12) సమయం గడుస్తుండగా, పెనురూపం దాల్చే ప్రశ్నేమిటంటే: మీరు ఎవరికి మద్దతునిస్తారు? యెహోవాకూ ఆయన సర్వోన్నతాధిపత్యానికీనా లేక క్రూరమృగంచే సూచించబడే దైవ వ్యతిరేకమైన రాజకీయ విధానానికా? క్రూరమృగం ముద్రను వేయించుకోవడానికి నిరాకరించి, యెహోవా సర్వోన్నతాధిపత్యానికి విధేయులై నమ్మకంగా సహించేవారు ధన్యులు.
14, 15. అర్మగిద్దోనును గురించిన ప్రకటనకు ఏ సందేశం అంతరాయం కలుగజేస్తుంది, మనకు దాని భావమేమై ఉంది?
14 “లోకమంతట” ఉన్న రాజులు సర్వోన్నతాధిపత్యానికి సంబంధించిన అంశంపై యెహోవాను ఎదుర్కునేందుకు ఢీకొనే దిశగా పయనిస్తున్నారు. తుది పరీక్ష, “దేవుని మహాదినమున జరుగు యుద్ధము” అయిన అర్మగిద్దోను. (ప్రకటన 16:14, 15) యెహోవాతో యుద్ధం చేసేందుకు భూ పాలకులు సమకూడటాన్ని గురించిన వర్ణన మధ్యన ఆసక్తికరమైన అంతరాయం కనిపిస్తుంది. “ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు” అని చెప్పడానికి యేసు తానే దర్శనానికి అంతరాయం కల్గిస్తాడు. (ప్రకటన 16:15) లేవీ ఆలయ రక్షకభటులు తాము విధి నిర్వహణలో ఉన్నప్పుడు నిద్రపోతున్నట్లు కనుగొనబడితే వారిని వివస్త్రులను చేసి, వారిని బహిరంగంగా అవమానపర్చటాన్ని ఇది పరోక్షంగా సూచిస్తుండవచ్చు.
15 సందేశం స్పష్టంగా ఉంది: మనం అర్మగిద్దోనును తప్పించుకుని జీవించాలంటే, మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండి మనల్ని యెహోవా దేవుని నమ్మకమైన సాక్షులుగా గుర్తించే సూచనార్థకమైన వస్త్రాలను కాపాడుకోవాలి. మనం ఆధ్యాత్మిక జడత్వాన్ని వదిలించుకుని, దేవుని స్థాపిత రాజ్యాన్ని గురించిన “నిత్యసువార్త”ను వ్యాప్తి చేయడంలో ఆసక్తితో భాగం వహిస్తూ, నిరంతరాయంగా కొనసాగితే మనం ధన్యులమౌతాము.—ప్రకటన 14:6.
‘ఈ వాక్యములను గైకొనువాడు ధన్యుడు’
16. ప్రకటన చివరి అధ్యాయాలు ప్రత్యేకంగా ఆనందానికి ఎందుకు మూలమై ఉన్నాయి?
16 ప్రకటన గ్రంథాన్ని చదివే ధన్యులైన పాఠకులు, మన మహిమాన్విత నిరీక్షణను వర్ణించే తుది అధ్యాయాలను చదువుతుండగా ఆనందంతో పులకరించిపోతారు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గురించిన, అంటే శుభ్రపర్చబడిన మానవ సమాజాన్ని పరిపాలించే నీతియుక్తమైన పరలోక రాజ్య ప్రభుత్వమే ఆ మహిమాన్విత నిరీక్షణ. ఇదంతా కూడా “సర్వాధికారియైన దేవుడగు ప్రభువు [“యెహోవా,” NW]”కు స్తుతిని తెస్తుంది. (ప్రకటన 21:22) ఈ అద్భుతమైన దర్శనాల పరంపర ముగింపుకు రాగా, దూత యోహానుకిలా చెప్పాడు: “ఈ మాటలు నమ్మకమును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింపవలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.”—ప్రకటన 22:6, 7.
17. (ఎ) ప్రకటన 22:6లో ఏ హామీ ఇవ్వబడింది? (బి) మనం దేన్ని నివారించడానికి అప్రమత్తంగా ఉండాలి?
17 ప్రకటన గ్రంథాన్ని చదివే ధన్యులైన పాఠకులు, ఇటువంటి మాటలే “గ్రంథ” ఆరంభంలో కనిపిస్తాయని గుర్తు తెచ్చుకుంటారు. (ప్రకటన 1:1, 3) బైబిలులోని ఈ చివరి పుస్తకంలో ప్రవచించబడిన ‘సంగతులన్నీ,’ ‘త్వరలో సంభవిస్తాయని’ ఈ మాటలు మనకు హామీ ఇస్తున్నాయి. మనం అంత్యకాలములోని ఎంత చివరి భాగంలో జీవిస్తున్నామంటే, ప్రకటనలో ప్రవచించబడిన సంబంధిత సంఘటనలన్నీ త్వరత్వరగా త్వరలోనే తప్పక సంభవిస్తాయి. కాబట్టి సాతాను విధానంలో సుస్థిరంగా కనిపిస్తున్నదేదైనా మనల్ని మగతలో పడవేయకూడదు. అప్రమత్తుడైన పాఠకుడు, ఆసియాలోని ఏడు సంఘాలకు పంపబడిన సందేశాల్లో ఇవ్వబడిన హెచ్చరికలను జ్ఞాపకం ఉంచుకుని, వస్తుదాయకత్వం, విగ్రహారాధన, అనైతికత, నులివెచ్చనితనం, మతభ్రష్ట తెగవాదం వంటి ఉరులను తప్పించుకుంటాడు.
18, 19. (ఎ) యేసు ఇంకా ఎందుకు రావలసి ఉంది, యోహాను వ్యక్తపర్చిన ఏ నిరీక్షణను మనం పంచుకుంటాము? (బి) యెహోవా ఇంకా ఏ సంకల్పం నిమిత్తం ‘రావలసి’ ఉన్నాడు?
18 ప్రకటన గ్రంథంలో, యేసు పలుమార్లు ఇలా ప్రకటిస్తున్నాడు: “నేను త్వరగా వచ్చుచున్నాను.” (ప్రకటన 2:16; 3:11; 22:7, 20) మహా బబులోనుపై, సాతాను రాజకీయ విధానంపై, ఇప్పుడు మెస్సీయ రాజ్యంచే సూచించబడుతున్న యెహోవా సర్వోన్నతాధిపత్యానికి విధేయత చూపడానికి నిరాకరించే మానవులందరిపై తీర్పు తీర్చడానికి ఆయన ఇంకా రావలసి ఉంది. మనం ఇప్పుడు అపొస్తలుడైన యోహానుతో మన స్వరాలను కలుపుదాము, ఆయనిలా అన్నాడు: “ఆమేన్; ప్రభువైన యేసూ, రమ్ము.”—ప్రకటన 22:20బి.
19 యెహోవా తానే ఇలా చెప్తున్నాడు: “ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.” (ప్రకటన 22:12) వాగ్దానం చేయబడిన “క్రొత్త ఆకాశము”లో భాగంగా గానీ లేక “క్రొత్త భూమి”పై భాగంగా గానీ అంతంలేని జీవితమనే మహిమాన్వితమైన ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ, “దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయంచువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” అనే ఈ ఆహ్వానాన్ని మనం యథార్థ హృదయులందరికీ అందజేయడంలో ఆసక్తితో భాగం వహిద్దాము. (ప్రకటన 22:17) వాళ్లు కూడా ప్రేరేపిత, ప్రేరణాత్మకమైన ప్రకటన గ్రంథపు ధన్యులైన పాఠకులు అగుగాక!
[అధస్సూచీలు]
a ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది!, పేజీలు 28-9, 136 (అధఃసూచి) చూడండి.
పునఃసమీక్షాంశాలు
◻ ప్రకటనను అందజేయడానికి యెహోవా ఏ మాధ్యమాన్ని ఉపయోగించాడు, దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
◻ ఆసియాలోని ఏడు సంఘాలకు పంపబడిన సందేశాలను చదవడానికి మనం ఎందుకు ఆనందించాలి?
◻ “శోధనకాలములో” మనం ఎలా సురక్షితంగా ఉండగలం?
◻ ప్రకటన గ్రంథపు మాటలను అనుసరిస్తే మనకు ఏ ఆనందం దక్కుతుంది?
[15వ పేజీలోని చిత్రం]
ఆనందభరిత వార్తలకు మూలకర్తను గుర్తించే వారు ధన్యులు
[18వ పేజీలోని చిత్రం]
మేలుకుని ఉండేవారు ధన్యులు