మంత్రవిద్య గురించి మీకేమి తెలుసు?
మంత్రవిద్య! ఈ మాట విన్నప్పుడు మీ మనస్సులో ఏ తలంపు వస్తుంది?
అది అంధవిశ్వాసానికి సంబంధించినది, కల్పితమైనది, అంత గంభీరంగా తీసుకోవలసిన విషయం కాదు అన్నదే అనేకుల అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయంలో, మంత్రవిద్య అనేది, కల్పిత ప్రపంచానికి మాత్రమే చెందినది. కొందరి దృష్టిలో, మాంత్రికులు తలనుండి క్రింది వరకూ ఉండే పెద్ద అంగీలను వేసుకుంటారు. పెద్ద కాగులో మరుగుతున్న నీటిలో గబ్బిలాల రెక్కలను వేస్తుంటారు. మనుష్యులను కప్పలుగా మార్చుతారు. రాత్రి పూట చీపురుకట్టమీద ఆకాశంలో ఎగురుతూ దుష్ట తలంపులతో పకాపకా నవ్వుతుంటారు.
మరి కొందరి అభిప్రాయంలో మంత్రవిద్య అంటే తమాషా కాదు. నిజంగానే మాంత్రికులు ఉన్నారనీ వారు ఇతరుల జీవితాలపై ప్రభావం చూపగలరనీ ప్రపంచ జనాభాలోని సగం కన్నా ఎక్కువ మంది నమ్ముతున్నట్లు కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. మంత్రవిద్య చెడ్డదనీ ప్రమాదకరమైనదనీ చాలా భయపడవలసిన విషయమనీ కోట్లాదిమంది నమ్ముతారు. ఉదాహరణకు, “కనికట్టు, పిశాచములతో మాట్లాడడం, మంత్రవిద్య మొదలైనవి పని చేస్తాయి, వాటి వల్ల అపాయాలు కలుగుతాయి అన్న నమ్మకం ఆఫ్రికా ప్రజల మనస్సులో బాగా నాటుకుపోయింది. . . . మాంత్రికులనూ, పిశాచములతో మాట్లాడేవారినీ సమాజం చాలా ద్వేషిస్తుంది. నేటికీ, కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వారిని కొట్టి చంపిన దాఖలాలు ఉన్నాయి” అని ఆఫ్రికా దేశంలోని ఒక మతాన్ని గురించిన ఒక పుస్తకం చెబుతుంది.
అయితే, నేడు పాశ్చాత్య దేశాల్లో మంత్రవిద్య, మాన్యత అనే క్రొత్త ముసుగు వేసుకుని ఉంది. పుస్తకాలూ, టెలివిజనూ, సినిమాలూ మంత్రవిద్యను గురించిన భయాన్ని తగ్గించేందుకు చాలా కృషి చేశాయి. “అకస్మాత్తుగా, మాంత్రికులు మరింత యౌవనులుగా, ఆకర్షణీయంగా, నిజంగానే చాలా ఆకర్షణీయంగా కనిపించనారంభించారు. క్రొత్త ధోరణులను అనుకరించడంలో హాలీవుడ్ చాలా చురుకైనది. . . . మాంత్రికులను మరింత ఆకర్షణీయమైనవారిగాను, ప్రేమించదగ్గవారిగాను చూపించడం ద్వారా, స్త్రీలూ, పిల్లలతో సహా చాలా మంది ప్రేక్షకులను ఆకర్షించగలదు” అని వినోద విశ్లేషణకర్తయైన డేవిడ్ డేవిస్ అంటున్నాడు. ఏ ధోరణినైనా సొమ్ముచేసుకోవడం ఎలాగో హాలీవుడ్‌కు తెలుసు.
అమెరికాలో, అత్యంత వేగంగా పెరుగుతున్న ఆధ్యాత్మిక ఉద్యమాల్లో మంత్రవిద్య ఒకటయ్యిందని కొందరు అంటున్నారు. మహిళా ఉద్యమాల చేత ప్రేరేపించబడి, మతాల మీద ఆసక్తిని కోల్పోయి, వివిధ రూపాల్లోని మంత్రవిద్యల్లో ఆధ్యాత్మిక తృప్తిని పొందడానికి వర్థమాన దేశాల్లోని చాలా మంది ప్రజలు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి, మంత్రవిద్య అనేకానేక రూపాల్లో ఉంది కనుక, “మాంత్రికులు” అనే మాట యొక్క అర్థం విషయానికి వస్తే, అందరిదీ ఒకటే అభిప్రాయం కాదు. మాంత్రికులమని చెప్పుకునే అనేకులు తాము వికా గుంపుకు చెందినవారమని చెప్పుకుంటారు. వికా మతం, “ప్రకృతినీ అనేక దేవుళ్ళనూ ఆరాధించే మతం. క్రైస్తవత్వం వ్యాపించక ముందు, పశ్చిమ యూరప్‌లో బాగా ప్రాబల్యంలో ఉండింది. నేడు పునరుజ్జీవింపచేయబడుతోంది” అని ఒక నిఘంటువు నిర్వచిస్తోంది.a అలా ఇప్పుడు అనేకులు ప్రకృతి ఆరాధకులమని, వివిధ దేవుళ్ళను ఆరాధించేవాళ్ళమని చెప్పుకుంటున్నారు.
చరిత్రంతటిలోను, మాంత్రికులను ద్వేషించడమూ వేధించడమూ పీడించడమూ చంపడమూ కూడా జరిగింది. కనుక, ఆధునిక మాంత్రికులు తమ గురించి ప్రజలకున్న అభిప్రాయం మారాలని తాపత్రయపడడంలో ఆశ్చర్యపడనక్కర్లేదు. ప్రజలకు ఎక్కువగా ఏ సందేశాన్ని తెలియజేయాలని మీరనుకుంటున్నారు అని ఒక సర్వేలో అనేక మాంత్రికులను అడిగారు. వాళ్ళ జవాబును, పరిశోధకుడైన మార్గో ఆడ్లర్ ఈ విధంగా సంగ్రహ రూపంలో చెప్పారు: “మేము కీడు చేసేవాళ్ళం కాదు. మేము అపవాదిని ఆరాధించం. మేము ప్రజలకు హాని చేయం, మోసం చేయం. మేము అపాయకారులం కాము. మేము మీలాగే సాధారణ ప్రజలం. మాకూ సొంత కుటుంబాలూ ఉద్యోగాలూ ఆశలూ కలలూ ఉన్నాయి. మేము ఒక తెగ కాదు. మేము వింత ప్రజలం కాదు. . . . మీరు మా గురించి భయపడనవసరం లేదు. . . . మేము కూడా మీలాంటివారమే, బహుశా మీరనుకోనంత ఎక్కువగా మీకు సాదృశ్యమైనవాళ్ళం.”
ఈ సందేశం అంతకంతకూ అంగీకరించబడుతోంది. అంటే మనం మంత్రవిద్య గురించి చింతించవలసిన పనే లేదని భావమా? ఈ ప్రశ్నకు జవాబును తర్వాతి శీర్షికలో పరిశీలిద్దాం.
[అధస్సూచీలు]
a మంత్రవిద్యకు ఇంగ్లీష్‌లో ఉన్న “విచ్‌క్రాఫ్ట్” అనే పదం, మంత్రగత్తెలను సూచించే “విసీ,” మంత్రగాళ్ళను సూచించే “వికా” అనే పాత ఇంగ్లీష్ పదాల నుండి వచ్చింది.