“గడియ వచ్చియున్నది!”
“తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చె[ను].”—యోహాను 13:1.
1. సా.శ. 33 పస్కా పండుగ సమీపిస్తుండగా, యెరూషలేములో ఏ ఊహాగానాలు జరుగుతున్నాయి, ఎందుకు?
యేసు సా.శ. 29 లో బాప్తిస్మం తీసుకున్నప్పుడు తన మరణానికి, పునరుత్థానానికి, మహిమపొందటానికి కారణమయ్యే “గడియ”కు నడిపించే మార్గంపై ఆయన తన పయనం ప్రారంభించాడు. ఇప్పుడు మనం సా.శ. 33 లోకి ప్రవేశించాము, అది వసంతకాలం. యూదుల అత్యున్నత న్యాయసభ అయిన సన్హెడ్రిన్ యేసును చంపాలని ఆలోచన చేసి కేవలం కొన్ని వారాలే గడిచాయి. తనతో స్నేహంగా ఉండిన, సన్హెడ్రిన్ సభ్యుడైన నికోదేము నుండి బహుశ వాళ్ల పథకాల గురించి తెలుసుకుని, యేసు యెరూషలేమును వదిలి యోర్దాను నది వెంబడి గ్రామీణ ప్రాంతానికి వెళ్తాడు. పస్కా పండుగ సమీపిస్తుండగా, చాలామంది ప్రజలు గ్రామప్రాంతాల నుండి యెరూషలేముకు వస్తారు, ఆ నగరమంతా యేసు గురించిన ఊహాగానాలతో కూడిన చర్చలతో నిండిపోతుంది. “మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి?” అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. యేసును చూసినవారెవరైనా ఆయనను గురించిన వివరాలు తమకు తెలియజేయాలని ఆజ్ఞలు జారీచేయడం ద్వారా ప్రధాన యాజకులు, పరిసయ్యులు అప్పటికే ఉద్రిక్తంగావున్న పరిస్థితిని మరింత తీవ్రతరం చేశారు.—యోహాను 11:47-57.
2. మరియ చేసిన ఏ పని వివాదాన్ని లేవదీస్తుంది, ఆమెను సమర్థిస్తూ యేసు ఇచ్చిన సమాధానం, తన “గడియ” గురించి ఆయనకున్న అవగాహనకు సంబంధించి ఏమి సూచిస్తుంది?
2 పస్కా పండుగకు ఆరు రోజుల ముందు అంటే నీసాను 8న, యేసు మళ్లీ యెరూషలేము పరిసర ప్రాంతంలో ఉన్నాడు. ఆయన యెరూషలేముకు వెలుపల దాదాపు రెండు మైళ్ల దూరంలో ఉన్న, తన ప్రియ స్నేహితులైన మార్త, మరియ, లాజరుల స్వంత పట్టణమైన బేతనియకు చేరుకుంటాడు. శుక్రవారం సూర్యాస్తమయం అయింది, యేసు విశ్రాంతి దినాన్ని అక్కడే గడుపుతాడు. శనివారం సాయంకాలం మరియ విలువైన సుగంధ తైలాన్ని ఉపయోగించి ఆయనకు పరిచర్య చేసినప్పుడు, ఆయన శిష్యులు అభ్యంతరం తెలుపుతారు. యేసు, “నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి; బీదలు ఎల్లప్పుడును మీతో కూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని” సమాధానమిస్తాడు. (యోహాను 12:1-8; మత్తయి 26:6-13) “తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ” వచ్చిందని యేసుకు తెలుసు. (యోహాను 13:1) మరి ఐదు రోజులు గడిచిన తర్వాత, ఆయన “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము”నిస్తాడు. (మార్కు 10:45) ఇకమీదటి నుండి, యేసు ఏమి చేసినా, ఏమి బోధించినా అన్నీ అత్యవసర భావంతో చేస్తాడు. మనమీ విధానాంతం కోసం ఆతురతతో ఎదురుచూస్తుండగా ఇది మనకెంతటి అద్భుతమైన మాదిరిని అందజేస్తుందో కదా! మరునాడే యేసు విషయంలో ఏమి జరుగుతుందో చూడండి.
యేసు విజయోత్సాహంతో ప్రవేశించే దినం
3. (ఎ) యేసు నీసాను 9, ఆదివారం నాడు యెరూషలేములోకి ఎలా ప్రవేశిస్తాడు, ఆయన చుట్టూ ఉన్న ప్రజల్లో అనేకులు ఎలా ప్రతిస్పందిస్తారు? (బి) జనసమూహం గురించి ఫిర్యాదు చేసిన పరిసయ్యులకు యేసు ఏమని సమాధానమిస్తాడు?
3 నీసాను 9, ఆదివారం నాడు యేసు విజయోత్సాహంతో యెరూషలేముకు వస్తాడు. ఆయన జెకర్యా 9:9 నెరవేర్పుగా గాడిదపై ఎక్కి, నగరాన్ని సమీపిస్తుండగా ఆయన చుట్టూ చేరిన వారిలో చాలామంది తమ పైవస్త్రాలను దారి పొడుగున పరుస్తారు, మరితరులు చెట్ల కొమ్మలు నరికి దారిపొడుగున పరుస్తారు. “ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక!” అని కేకలు వేస్తారు. జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు యేసు తన శిష్యులను గద్దించాలని అంటారు. అయితే, “వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని” యేసు సమాధానమిస్తాడు.—లూకా 19:38-40; మత్తయి 21:6-9.
4. యేసు నగరంలోకి ప్రవేశించే సరికి యెరూషలేము ఎందుకు కొలాహలంతో నిండిపోయి ఉంది?
4 కేవలం కొన్ని వారాల క్రితం, జనసమూహంలోని చాలామంది యేసు లాజరును పునరుత్థానం చేయటాన్ని చూశారు. వీళ్లిప్పుడు ఆ అద్భుతం గురించి సమూహంలోని ఇతరులకు చెప్తూ ఉంటారు. కాబట్టి యేసు యెరూషలేములోకి ప్రవేశించేసరికి, మొత్తం నగరమంతా కోలాహలంతో నిండివుంది. “ఈయన ఎవరో” అని ప్రజలు అడుగుతుంటారు. “ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు!” అని జనసమూహాలు చెప్తుంటారు. పరిసయ్యులు జరుగుతున్నది చూసి, “లోకము ఆయన వెంట పోయినదని” విలపిస్తారు.—మత్తయి 21:10, 11; యోహాను 12:17-19.
5. యేసు ఆలయానికి వెళ్లినప్పుడు ఏమి జరుగుతుంది?
5 మహా బోధకుడైన యేసు తన అలవాటు చొప్పున యెరూషలేములోకి ప్రవేశించిన వెంటనే బోధించటానికి ఆలయంలోకి వెళ్తాడు. అక్కడ గ్రుడ్డివాళ్లు, కుంటివాళ్లు ఆయన దగ్గరికి వస్తారు, ఆయన వాళ్లను స్వస్థపరుస్తాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు దీన్ని చూసినప్పుడూ, “దావీదు కుమారునికి జయము అని” ఆలయంలోని చిన్నపిల్లలు కేకలు వేయడం విన్నప్పుడూ ఆగ్రహోదగ్రులౌతారు. “వీరు చెప్పుచున్నది వినుచున్నావా?” అని వాళ్లు నిరసనగా ప్రశ్నిస్తారు. “వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా?” అని యేసు సమాధానమిస్తాడు. యేసు ఇంకా బోధిస్తుండగా, ఆలయంలో జరుగుతున్నదాన్ని ఆయన బాగా పరిశీలిస్తాడు.—మత్తయి 21:15, 16; మార్కు 11:11.
6. యేసు మునుపటి ప్రవర్తనకూ ఇప్పటి ప్రవర్తనకూ ఉన్న తేడా ఏమిటి, అది ఎందుకు?
6 యేసు ఆరునెలల క్రితం ప్రవర్తించినదానికీ, ఇప్పటి ప్రవర్తనకూ ఎంత తేడానో కదా! అప్పట్లోనైతే ఆయన పర్ణశాలల పండుగ కోసం యెరూషలేముకు, “బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.” (యోహాను 7:10) తన ప్రాణం ప్రమాదంలో పడితే క్షేమంగా తప్పించుకోవడానికి గాను అప్పట్లో ఆయన తగిన చర్యలు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయనను పట్టుకోవడానికి ఆజ్ఞలు జారీచేయబడిన ఈ సమయంలో నగరంలోకి బహిరంగంగా ప్రవేశిస్తాడు! తనను తాను మెస్సీయగా అందరికీ ప్రచారం చేసుకోవడం కూడా యేసు వాడుకకు విరుద్ధం. (యెషయా 42:2; మార్కు 1:40-44) తన గురించి కోలాహలంతో ప్రచారం జరగడం గానీ, తన గురించిన నివేదికలు ఒకరి నుండి మరొకరికి ప్రాకడం గానీ ఆయనకు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు జనసమూహాలు ఆయనను రాజుగా, రక్షకునిగా, మెస్సీయాగా బహిరంగంగా ప్రకటిస్తున్నారు, వాళ్ల నోరు మూయించమని మతనాయకులు చేసిన విజ్ఞప్తిని కూడా ఆయన త్రోసిపుచ్చుతాడు! ఎందుకీ మార్పు? ఎందుకంటే, యేసు మరునాడే ప్రకటించబోతున్నట్లుగా, “మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది.”—యోహాను 12:23.
ధైర్యవంతమైన చర్య —జీవాన్ని రక్షించే బోధలు
7, 8. సా.శ. 33, నీసాను 10 నాటి యేసు చర్యలు, సా.శ. 30 పస్కా పండుగ నాడు ఆలయంలో ఆయన చేపట్టిన చర్యలను ఎలా ప్రతిబింబిస్తున్నాయి?
7 నీసాను 10, సోమవారం నాడు ఆలయానికి చేరుకున్న తర్వాత, యేసు తాను ముందు రోజు మధ్యాహ్నం పరిశీలించిన దాని విషయంలో చర్య తీసుకుంటాడు. ఆయన ‘దేవాలయములో క్రయవిక్రయములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండ ఏ పాత్రయైనను ఎవనిని తేనియ్యక అడ్డుకుంటాడు.’ తప్పిదస్థులను ఖండిస్తూ ఆయన, “నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితి[రి]” అంటాడు.—మార్కు 11:15-17.
8 యేసు చర్యలు, ఆయన మూడేళ్ల క్రితం సా.శ. 30 పస్కా పండుగ సమయంలో ఆలయాన్ని సందర్శించినప్పుడు చేసిన దానిని ప్రతిబింబిస్తాయి. అయితే, ఈసారి అధిక్షేపణ మరింత తీవ్రంగా ఉంది. ఆలయంలోని వ్యాపారులు ఇప్పుడు “దొంగల”ని పిలువబడుతున్నారు. (లూకా 19:45, 46; యోహాను 2:13-16) దానికి కారణం ఏమిటంటే, బలి అర్పించటానికి జంతువులను కొనవలసిన వారి నుండి వాళ్లు మరీ ఎక్కువ ఖరీదు వసూలు చేయడమే. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజలలోని ప్రముఖులు యేసు చేస్తున్నదాని గురించి విని, మళ్లీ ఆయనను చంపటానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే, యేసును ఎలా చంపాలో వాళ్లకు అర్థం కాదు, ఎందుకంటే ప్రజలందరూ ఆయన బోధకు ఆబ్బురపడుతూ, ఆయన చెప్పేది వినటానికి ఆయన చుట్టూ గుమిగూడుతున్నారు.—మార్కు 11:18; లూకా 19:47, 48.
9. యేసు ఏ పాఠం బోధించాడు, ఆలయంలో ఆయన తన శ్రోతలకు ఏ ఆహ్వానాన్ని ఇచ్చాడు?
9 యేసు ఆలయంలో బోధించటాన్ని కొనసాగిస్తూ, “మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది” అంటాడు. అవును, తన మానవ జీవితంలో తనకు ఇంకా కేవలం కొన్ని రోజులే మిగిలివున్నాయని ఆయనకు తెలుసు. ఫలించటానికి గాను గోధుమ గింజ ఎలా చావాల్సివుంటుందో వివరించిన తర్వాత, ఆయన తాను మరణించి ఇతరులకు నిత్యజీవాన్ని ఇవ్వటానికి మార్గం తెరవడం గురించి మాట్లాడుతూ దాన్ని తనకు అన్వయించుకుంటాడు. ఆ తర్వాత యేసు తన అనుచరులకు ఈ అహ్వానాన్ని అందజేస్తాడు: “ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.”—యోహాను 12:23-26.
10. తనకు సంభవించనైయున్న వేదనభరితమైన మరణం గురించి యేసు ఎలా భావిస్తాడు?
10 ఇంక నాలుగు రోజుల్లో సంభవించనైయున్న వేదనభరితమైన తన మరణం గురించి ఆలోచిస్తూ, యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును? తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము.” కానీ యేసు కోసం వేచివున్నదాన్ని నివారించడం అసంభవం. అందుకే, “అయినను ఇందు కోసరమే నేను ఈ గడియకు వచ్చితిని” అంటాడు. నిజంగానే, దేవుడు చేసిన ఏర్పాటంతటితోనూ యేసు ఏకీభవిస్తున్నాడు. తన బలి మరణం వరకూ దైవిక చిత్తమే తన చర్యలను నిర్దేశించాలని ఆయన దృఢనిశ్చయం చేసుకున్నాడు. (యోహాను 12:27) దైవిక చిత్తానికి పూర్తి విధేయతను చూపించే విషయంలో ఆయన మనకు ఎంత చక్కని మాదిరిని ఉంచాడో కదా!
11. అప్పుడే పరలోకం నుండి ఒక స్వరాన్ని విన్న జనసమూహాలకు యేసు ఏమి బోధిస్తాడు?
11 తన మరణం మూలంగా తన తండ్రి పేరుప్రతిష్ఠలు ఎలా ప్రభావితమౌతాయనే దాని గురించి ఎంతో వ్యాకులపడుతూ, “తండ్రీ, నీ నామము మహిమపరచుమని” యేసు ప్రార్థిస్తాడు. ఆలయం వద్ద సమకూడివున్న జనసమూహాలకు అమితాశ్చర్యం కల్గిస్తూ పరలోకం నుండి ఒక స్వరం, “నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును” అని ప్రకటిస్తుంది. ఆ స్వరం ఎందుకు వినిపించిందో, తన మరణ పర్యవసానాలు ఏమై ఉంటాయో, వాళ్లు ఎందుకు విశ్వాసం కల్గివుండాలో జనసమూహానికి చెప్పటానికి గొప్ప బోధకుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. (యోహాను 12:28-36) గత రెండు రోజుల్లో యేసు తనను తాను కార్యశూరునిగా నిరూపించుకున్నాడు. అయితే మరింత నిర్ణాయకమైన దినం ముందుంది.
అధిక్షేపణల దినం
12. నీసాను 11, మంగళవారం నాడు మతనాయకులు యేసును పట్టుకోవటానికి ఎలా ప్రయత్నిస్తారు, దాని ఫలితమేమిటి?
12 నీసాను 11, మంగళవారం నాడు యేసు బోధించటానికి మళ్లీ ఒకసారి ఆలయంలోకి వెళ్తాడు. వైరీభావంగల ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ముందుటి రోజు యేసు తీసుకున్న చర్యల గురించి మాట్లాడుతూ ప్రధాన యాజకులూ పెద్దలూ “ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని” ఆయనను అడుగుతారు. మహా బోధకుడు తన సమాధానంతో వాళ్లను తికమకపెట్టి, మూడు వివరణాత్మకమైన ఉపమానాలను చెప్తాడు. వాటిలో రెండు ద్రాక్షాతోటను గురించినవి, ఒకటి వివాహ విందును గురించినది. ఆ ఉపమానాలు ఆయన వ్యతిరేకులు ఎంత దుష్టులో బహిర్గతం చేస్తాయి. మతనాయకులు తాము విన్నదాన్ని బట్టి ఉగ్రులైపోయి ఆయనను పట్టుకోవాలనుకుంటారు. కానీ యేసు ప్రవక్త అని నమ్ముతున్న జనసమూహానికి వాళ్లు భయపడతారు. కాబట్టి తాము ఆయనను నిర్బంధించగలిగేలా ఆయన నోటి నుండి ఏదైనా రప్పించాలని వాళ్లు ప్రయత్నిస్తుంటారు. యేసు ఇస్తున్న సమాధానాలతో వాళ్ల నోటికి తాళం పడుతుంది.—మత్తయి 21:23-22:46.
13. శాస్త్రులు పరిసయ్యులకు సంబంధించి యేసు తన శ్రోతలకు ఏ ఉపదేశం ఇస్తాడు?
13 శాస్త్రులు పరిసయ్యులు తాము దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నామని చెప్పుకుంటారు గనుక, యేసు ఇప్పుడు తన శ్రోతలను ఇలా ఉద్బోధిస్తాడు: “వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పన చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.” (మత్తయి 23:1-3) ఎంత శక్తివంతమైన బహిరంగ అధిక్షేపణ! అయితే యేసు చెప్పేది ఇంకా పూర్తికాలేదు. ఇది ఆయన ఆలయంలో గడిపే చివరి దినం, అందుకని ఆయన ధైర్యంగా ఎన్నో విషయాలు బహిర్గతం చేస్తాడు, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పిడుగుల్లా వచ్చి పడతాయి.
14, 15. శాస్త్రులకు పరిసయ్యులకు వ్యతిరేకంగా యేసు ఏ తీవ్రమైన అధిక్షేపణలు చేస్తాడు?
14 “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా!” అని యేసు ఆరుసార్లు అంటాడు. వాళ్లు వేషధారులే, ఎందుకంటే వాళ్లు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూసేసి, దానిలోకి ప్రవేశించబోతున్నవారిని కూడా ప్రవేశించకుండా చేస్తారు. ఒకరిని తమ మతంలో కలుపుకోవటానికి ఈ వేషధారులు సముద్రాన్ని, భూమిని చుట్టి వస్తారు, అదంతా అతడిని నిత్యనాశనానికి గురిచేయటానికే. “ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును” నిర్లక్ష్యం చేస్తూ, వాళ్లు పదియవవంతు చెల్లించటానికే అధిక ప్రాధాన్యతనిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్లు ‘గిన్నెను పళ్లెమును వెలుపట శుద్ధిచేస్తారు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండివుంటాయి’ అంటే, బయటికి వాళ్లు ఎంత దైవభక్తిని ప్రదర్శించినా లోపల మాత్రం వాళ్లు కుళ్లుకంపు కొడుతూ కల్మషంతో నిండివుంటారు. అంతేగాక, వాళ్లు “ప్రవక్తలను చంపినవారి కుమారులై” ఉన్నప్పటికీ, ప్రవక్తల కోసం గోరీలు కట్టి వాటిని అలంకరించటం ద్వారా ప్రజల అవధానాన్ని తమ నీతి కార్యాలవైపుకు మళ్లించాలని చూస్తారు.—మత్తయి 23:13-15, 23-31.
15 యేసు తన వ్యతిరేకులకు ఆధ్యాత్మిక విలువలు లేకపోవటాన్ని ఖండిస్తూ “అయ్యో, అంధులైన మార్గదర్శకులారా” అంటాడు. వాళ్లు నైతికంగా అంధులు, ఎందుకంటే వాళ్లు ఆరాధనా స్థలానికుండాల్సిన ఆధ్యాత్మిక విలువలకంటే ఆలయంలోని బంగారానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. యేసు ఇంకా కొనసాగిస్తూ అత్యంత శక్తివంతమైన అధిక్షేపణలు చేస్తాడు. “సర్పములారా, సర్పసంతానమా, నరక [“గెహెన్నా,” NW] శిక్షను మీరేలాగు తప్పించుకొందురు?” అంటాడాయన. అవును, వాళ్లు తాము అవలంబించిన దుష్టమార్గం మూలంగా నిత్య నాశనానికి గురౌతారని యేసు వారితో చెప్తున్నాడు. (మత్తయి 23:16-22, 33) అబద్ధ మతాన్ని బహిర్గతం చేయవలసి వచ్చినప్పుడు సహితం, రాజ్య సందేశాన్ని ప్రకటించడంలో మనం కూడా ధైర్యాన్ని కనపర్చుదాము.
16. ఒలీవల కొండపై కూర్చుని ఉన్నప్పుడు, యేసు తన శిష్యులకు ఏ ప్రాముఖ్యమైన ప్రవచనాన్నిస్తాడు?
16 యేసు ఇప్పుడు ఆలయం వదిలి వెళ్తాడు. సూర్యుడు పడమటికి క్రుంగుతుండగా ఆయనా ఆయన అపొస్తలులూ ఓలీవల కొండ ఎక్కుతారు. అక్కడ కూర్చుని ఉన్నప్పుడు, ఆయన ఆలయ నాశనాన్ని గురించిన ప్రవచనాన్నీ, తన ప్రత్యక్షతకు ఈ విధానాంతానికి గల సూచననూ ఇస్తాడు. ఈ ప్రవచనార్థక మాటల ప్రాముఖ్యం మన కాలానికి కూడా వర్తిస్తుంది. “రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని” కూడా యేసు ఆ సాయంత్రం తన శిష్యులతో చెప్తాడు.—మత్తయి 24:1-14; 26:1, 2.
యేసు ‘తనవారిని అంతమువరకు ప్రేమిస్తాడు’
17. (ఎ) నీసాను 14, పస్కా పండుగనాడు యేసు పన్నెండుమందికి ఏ పాఠం బోధిస్తాడు? (బి) యూదా ఇస్కరియోతును పంపించివేసిన తర్వాత యేసు ఏ ఆచరణను పరిచయం చేస్తాడు?
17 తర్వాతి రెండు రోజులు అంటే, నీసాను 12, 13 తేదీల్లో యేసు బహిరంగంగా ఆలయానికి రాడు. మతనాయకులు ఆయనను చంపటానికి ప్రయత్నిస్తున్నారు, తాను తన అపొస్తలులతో పస్కా పండుగను జరుపుకోకుండా ఏ ఆటంకాలూ ఏర్పడడం ఆయనకిష్టం లేదు. గురువారం నాడు సూర్యుడు అస్తమించడంతో నీసాను 14 ప్రారంభమౌతుంది, ఇదే యేసు ఈ భూమిపై మానవునిగా జీవించే చివరి రోజు. సూర్యాస్తమయం తర్వాత పస్కా పండుగను ఆచరించటానికి వారికోసం యెరూషలేములోని ఒక ఇంట్లో ఏర్పాట్లు చేయబడతాయి. యేసు ఆయన అపొస్తలులు ఆ సాయంకాలం అక్కడ సమకూడి ఉంటారు. వాళ్లంతా కలిసి పస్కాను ఆచరిస్తుండగా, వాళ్ల కాళ్లు కడగటం ద్వారా ఆయన ఆ పన్నెండు మందికి నమ్రత విషయంలో ఒక అద్భుతమైన పాఠాన్ని బోధిస్తాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక దాసుని విలువ అయిన 30 వెండి నాణాల కోసం తన యజమానిని అప్పగించటానికి అంగీకరించిన ఇస్కరియోతు యూదాను పంపించివేసిన తర్వాత, యేసు తన మరణ జ్ఞాపకార్థదిన ఆచరణను పరిచయం చేస్తాడు.—నిర్గమకాండము 21:32; మత్తయి 26:14, 15, 26-29; యోహాను 13:2-30.
18. యేసు తన పదకొండుమంది నమ్మకమైన అపొస్తలులకు ఏ బోధలను ప్రేమపూర్వకంగా బోధిస్తాడు, త్వరలో సంభవించనైయున్న తన నిర్గమనం కోసం ఆయన వారిని ఎలా సిద్ధం చేస్తాడు?
18 జ్ఞాపకార్థదిన ఆచరణను పరిచయం చేసిన తర్వాత, తమలో ఎవరు గొప్ప అనే విషయానికి సంబంధించి అపొస్తలులు తీవ్రమైన వాగ్వివాదంలో పడిపోతారు. వాళ్లపై కోపగించుకునే బదులు, ఇతరులకు పరిచర్య చేయడంలోని విలువ గురించి ఆయన సహనంతో వాళ్లకు బోధిస్తాడు. వాళ్లు తన శ్రమల్లో తనతోనే ఉన్నందుకు వాళ్లను మెచ్చుకుంటూ రాజ్యానికి సంబంధించి ఆయన వారితో స్వయంగా ఒక నిబంధన చేస్తాడు. (లూకా 22:24-30) తాను వాళ్లను ప్రేమించిన విధంగా వాళ్ళూ ఒకరినొకరు ప్రేమించుకోవాలని కూడా యేసు ఆజ్ఞాపిస్తాడు. (యోహాను 13:34) యేసు ఆ గదిలో ఇంకా ఉండగానే, త్వరలో సంభవించనైయున్న తన నిర్గమనానికి ఆయన వారిని ప్రేమపూర్వకంగా సిద్ధం చేస్తాడు. ఆయన వారికి తన స్నేహం గురించి హామీ ఇచ్చి, విశ్వాసం కల్గివుండమని ప్రోత్సహించి, పరిశుద్ధాత్మ సహాయాన్ని అందజేస్తానని వాగ్దానం చేస్తాడు. (యోహాను 14:1-17; 15:15) ఆ ఇంట్లోంచి వెళ్లిపోయే ముందు యేసు తన తండ్రికి ఇలా విజ్ఞప్తి చేస్తాడు: “నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము.” వాస్తవానికి, యేసు తన అపొస్తలులను తన నిర్గమనం కోసం సిద్ధం చేశాడు, నిజంగా ఆయన ‘తన వారిని అంతము వరకు ప్రేమిస్తాడు.’—యోహాను 13:1-2; 17:1-2.
19. గెత్సేమనే తోటలో యేసు ఎందుకు వేదనను అనుభవిస్తాడు?
19 యేసు, ఆయన పదకొండుమంది నమ్మకమైన అపొస్తలులు గెత్సేమనే తోటను చేరుకునే సరికి బహుశా మధ్యరాత్రి దాటి ఉండవచ్చు. ఆయన అక్కడికి తరచూ తన అపొస్తలులతో వెళుతుండేవాడు. (యోహాను 18:1, 2) కొన్ని గంటల్లో యేసు నీచమైన నేరస్థుడిలా మరణించబోతున్నాడు. జరుగనున్న ఈ సంఘటనకు సంబంధించిన వేదన, అది తన తండ్రికి ఎలాంటి నిందను తెస్తుందోనన్న వేదన, యేసును ఎంతగా కలవరపరుస్తాయంటే, ఆయన ప్రార్థిస్తుండగా ఆయన చెమట రక్తపు బిందువుల్లా నేలకు రాలుతుంది. (లూకా 22:41-44) “గడియ వచ్చినది! . . . ఇదిగో! నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని” యేసు తన అపొస్తలులకు చెప్తాడు. ఆయన ఇంకా మాట్లాడుతుండగానే ఇస్కరియోతు యూదా దివిటీలు, దీపాలు, ఆయుధాలు పట్టుకునివున్న పెద్ద గుంపుతో పాటు ఆయన దగ్గరికి వస్తాడు. వాళ్లు యేసును నిర్బంధించటానికి వచ్చారు. ఆయన ఏమాత్రం ప్రతిఘటించడు. ప్రతిఘటించినట్లైతే, “ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని” ఆయన అంటాడు.—మార్కు 14:41-43; మత్తయి 26:48-54.
మనుష్యకుమారుడు మహిమపర్చబడ్డాడు!
20. (ఎ) యేసు నిర్బంధించబడిన తర్వాత ఆయన ఎటువంటి అకృత్యాలకు గురౌతాడు? (బి) చనిపోవటానికి కొన్ని క్షణాల ముందు యేసు, “సమాప్తమైనదని” బిగ్గరగా ఎందుకు చెప్తాడు?
20 నిర్బంధించబడిన తర్వాత యేసు అబద్ధ సాక్షులచే నిందించబడి, తీర్పుకు ముందే తీర్మానించేసుకున్న న్యాయాధికారులచే దోషిగా నిర్ణయించబడి, పొంతిపిలాతు ద్వారా శిక్ష విధించబడి, యాజకులచే జనసమూహాలచే పరిహసించబడి, సైనికులచే ఎగతాళి చేయబడి హింసించబడ్డాడు. (మార్కు 14:53-65; 15:1, 15; యోహాను 19:1-3) శుక్రవారం మధ్యాహ్నానికల్లా, యేసు హింసా కొయ్యకు మేకులతో కొట్టబడ్డాడు, తన శరీర బరువు మూలంగా, చేతులు పాదాల దగ్గర దిగగొట్టిన మేకుల వల్లైన గాయాలు మరింత తీవ్రమౌతుండడం మూలంగా ఆయన విపరీతమైన బాధననుభవిస్తాడు. (యోహాను 19:17, 18) మధ్యాహ్నం దాదాపు మూడు గంటల సమయంలో, “సమాప్తమైనదని” యేసు బిగ్గరగా అంటాడు. అవును, తాను ఏమి చేయటానికి ఈ భూమి మీదికి వచ్చాడో అదంతా ఆయన ముగించాడు. దేవునికి తన ఆత్మను అప్పగిస్తూ ఆయన తన తల వాల్చి మరణిస్తాడు. (యోహాను 19:28, 30; మత్తయి 27:45, 46; లూకా 23:46) ఆ తర్వాత మూడవ దినమున, యెహోవా తన కుమారుడ్ని పునరుత్థానం చేస్తాడు. (మార్కు 16:1-6) యేసు తాను పునరుత్థానం చేయబడి 40 రోజులు గడిచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై మహిమపర్చబడతాడు.—యోహాను 17:5; అపొస్తలుల కార్యములు 1:3, 9-12; ఫిలిప్పీయులు 2:8-11.
21. మనం యేసును ఎలా అనుకరించగలము?
21 మనం యేసు అడుగు జాడల్లో సన్నిహితంగా ఎలా ‘నడుచుకోగలం’? (1 పేతురు 2:21) ఆయనలాగే మనం రాజ్య ప్రకటన పనిలోనూ శిష్యులను చేసే పనిలోనూ తీవ్రంగా కృషి చేస్తూ ధైర్యంగా, నిర్భయంగా దేవుని వాక్యాన్ని గూర్చి మాట్లాడుదాము. (మత్తయి 24:14; 28:19, 20; అపొస్తలుల కార్యములు 4:29-31; ఫిలిప్పీయులు 1:14) కాలప్రవాహంలో మనం ఎక్కడ ఉన్నామనేదాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు లేదా ఒకరినొకరు ప్రేమించుకోవడానికీ సత్కార్యాలు చేయడానికీ పురికొల్పుకోవడంలో విఫలం కావద్దు. (మార్కు 13:28-33; హెబ్రీయులు 10:24, 25) మన పూర్తి జీవన గమనమంతటినీ, యెహోవా దేవుని చిత్తంచేతనూ, మనం “అంత్యకాలములో” జీవిస్తున్నామన్న అవగాహన చేతనూ నిర్దేశించబడటానికి అనుమతిద్దాము.—దానియేలు 12:4.
మీరెలా సమాధానమిస్తారు?
• తన మరణం సమీపించిందని యేసుకున్న అవగాహన, యెరూషలేములోని ఆలయం వద్ద ఆయన చేసిన చివరి పరిచర్యపై ఏ ప్రభావాన్ని చూపింది?
• యేసు ‘తన వారిని అంతము వరకు ప్రేమించాడని’ ఏది చూపిస్తుంది?
• యేసు జీవితంలోని చివరి కొన్ని గంటల్లో జరిగిన సంఘటనలు ఆయన గురించి ఏమి సూచిస్తున్నాయి?
• మనం క్రీస్తు యేసును మన పరిచర్యలో ఎలా అనుకరించగలము?
[18వ పేజీలోని చిత్రం]
యేసు ‘వారిని అంతము వరకు ప్రేమించాడు’