కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 1/15 పేజీలు 22-27
  • “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” సంతోషంగా సమకూడారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” సంతోషంగా సమకూడారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మొదటి రోజు, యేసు కనబరచిన ఆసక్తిని నొక్కిచెప్పింది
  • రెండవ రోజు, మంచిపట్ల ఆసక్తిని ఉన్నతపర్చింది
  • మూడవ రోజు, సత్‌క్రియలయందు ఆసక్తిపై అవధానముంచింది
  • “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందడం
    మన రాజ్య పరిచర్య—2003
  • ఉత్సాహపూరిత సమావేశాలు దైవిక బోధను అందించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దేవుని వాక్యాన్ని బోధించేవారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • మనిషిని కాదు దేవుణ్ణి మహిమపరచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 1/15 పేజీలు 22-27

“ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” సంతోషంగా సమకూడారు

నైతిక, ఆర్థిక, రాజకీయ క్లిష్టపరిస్థితులు లోకాన్ని కలతపెడుతున్నాయి. అయితే ఈ సంక్షోభమంతటిలో యెహోవాసాక్షులు, “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” అనే మూడు రోజుల జిల్లా సమావేశాల కోసం శాంతియుతంగా సమకూడారు. మే 2002 మొదలుకొని ఈ సమావేశాలు భూవ్యాప్తంగా నిర్వహించబడ్డాయి.

ఈ సమావేశాలు నిజంగానే సంతోషభరితమైన సందర్భాలు. నిర్మాణాత్మకమైన బైబిలు ఆధారిత కార్యక్రమాన్ని మనం క్లుప్తంగా పునఃసమీక్షిద్దాం.

మొదటి రోజు, యేసు కనబరచిన ఆసక్తిని నొక్కిచెప్పింది

“మన ప్రభువైన యేసు చూపించిన ఆసక్తిని అనుకరించండి” అన్నది సమావేశపు మొదటి రోజు చర్చాంశం. (యోహాను 2:17) “రాజ్య ప్రచారకులుగా సమావేశమవ్వడంలో ఆనందించండి” అనే ప్రసంగం, దేవుని ప్రజల సమావేశాలలో ఎల్లప్పుడూ ఉండే ఆనందంలో పాలుపంచుకొమ్మని హాజరైనవారందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించింది. (ద్వితీయోపదేశకాండము 16:15) ఆ ప్రసంగం తర్వాత, ఆసక్తిగల సువార్త ప్రచారకులు ఇంటర్వ్యూ చేయబడ్డారు.

“యెహోవాను బట్టి మనోల్లాసకరమైన ఆనందాన్ని పొందండి” అనే ప్రసంగంలో కీర్తన 37:1-11 వచనాలలోని ప్రతీ వచనం పరిశీలించబడింది. చెడ్డవారు విజయం సాధిస్తున్నారు అనిపించినప్పుడు మనం “వ్యసనపడ”కూడదని ప్రోత్సహించబడ్డాము. దుష్కార్యములు చేసేవారు మన గురించి అబద్ధాలు చెప్పినప్పటికీ వాస్తవానికి తన నమ్మకమైన సేవకులు ఎవరనేది యెహోవా తగిన సమయంలో స్పష్టం చేస్తాడు. “కృతజ్ఞులై ఉన్నారని చూపించండి” అనే ప్రసంగంలో, దేవునిపట్ల కృతజ్ఞతను ఎలా చూపించవచ్చో చర్చించబడింది. క్రైస్తవులందరూ యెహోవాకు “స్తుతియాగము” చెల్లించాలి. (హెబ్రీయులు 13:15) అయితే మనం యెహోవా సేవ కోసం వెచ్చించే సమయం మన కృతజ్ఞతను బట్టి మన పరిస్థితులను బట్టి ఉంటుంది.

“ఆసక్తితో ప్రజ్వలిస్తున్న రాజ్య ప్రచారకులు” అనేది ముఖ్యాంశ ప్రసంగ శీర్షిక. ఆసక్తి కనబర్చే విషయంలో యేసుక్రీస్తు మన అత్యుత్తమమైన మాదిరి అని అది సూచించింది. 1914వ సంవత్సరంలో పరలోక రాజ్యం స్థాపించబడిన తర్వాత, ఆ సువార్తను ప్రకటించడానికి నిజ క్రైస్తవులకు ఆసక్తి అవసరమయ్యింది. అమెరికాలోని ఒహాయోలో సీడార్‌ పాయింట్‌ వద్ద 1922వ సంవత్సరంలో జరిగిన సమావేశం గురించి ప్రస్తావిస్తూ “రాజును, ఆయన రాజ్యాన్ని ప్రకటించండి” అనే చారిత్రాత్మకమైన పిలుపును ప్రసంగీకుడు మనకు గుర్తుచేశాడు! కాలం గడుస్తున్న కొద్దీ, అద్భుతమైన రాజ్య సత్యాలను ప్రజలందరికీ ప్రకటించడానికి దేవుని నమ్మకమైన సేవకులకున్న ఆసక్తి వారిని కదిలించింది.

మొదటి రోజు మధ్యాహ్నం ఇవ్వబడిన “యెహోవా మనతో ఉన్నాడని తెలుసుకొని నిర్భయంగా ఉండండి” అనే ప్రసంగం, సాతాను ప్రత్యేకంగా దేవుని ప్రజలపై దాడి చేస్తాడని చూపించింది. మనం వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, విశ్వాసం గురించిన బైబిలు ఉదాహరణలను, ఆధునిక ఉదాహరణలను పరిశీలించడం ద్వారా మనం పరీక్షలను శోధనలను నిర్భయంగా ఎదుర్కోవడానికి ధైర్యాన్ని పొందుతాము.—యెషయా 41:9, 10.

కార్యక్రమంలో తర్వాత, “యెహోవా నామమును స్మరించుకుంటూ నడవడానికి మీకా ప్రవచనం మనల్ని బలపరుస్తుంది” అనే చర్చాంశంపై మూడు భాగాల గోష్ఠి నిర్వహించబడింది. మొదటి ప్రసంగీకుడు, మీకా కాలంలో ఉన్న నైతిక పతనాన్ని, మతభ్రష్టత్వాన్ని, వస్తుసంపదల దాహాన్ని మన కాలంలో ఉన్నవాటితో పోల్చాడు. ఆయన ఇలా అన్నాడు: “మనం విధేయతా హృదయాన్ని అలవర్చుకొని, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండేలా మన జీవితం దైవభక్తి గల క్రియలతో నిండివుండేలా నిశ్చయపర్చుకొని యెహోవా దినం వస్తుందని ఎన్నడూ మరచిపోకుండా ఉంటే భవిష్యత్తు గురించిన మన నిరీక్షణ ఖచ్చితమైనదిగా ఉంటుంది.”—2 పేతురు 3:11, 12.

గోష్ఠిలోని రెండవ ప్రసంగీకుడు, యూదా నాయకులను మీకా ఖండించిన విషయాన్ని పేర్కొన్నాడు. వారు నిస్సహాయులైన పేద ప్రజలను మోసగించేవారు. అయితే సత్యారాధన విజయం సాధిస్తుందని కూడా మీకా ప్రవచించాడు. (మీకా 4:1-5) యెహోవా పరిశుద్ధాత్మ చేత బలపర్చబడి, నూతనోత్తేజాన్ని ఇచ్చే ఈ నిరీక్షణా సందేశాన్ని ప్రకటించాలని మనం తీర్మానించుకున్నాం. అయితే అశక్తతవల్ల లేదా మరితర కారణంవల్ల మనం పరిమితం చేయబడినట్లు భావిస్తే మన మనోవైఖరి ఎలా ఉండాలి? “యెహోవా కోరేవి సహేతుకమైనవనీ వాటిని పాటించడం సులభమేననీ” మూడవ ప్రసంగీకుడు అన్నాడు. “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు” అని వ్రాయబడివున్న మీకా 6:8వ వచనానికి సంబంధించిన వివిధ విషయాలను ఆయన చర్చించాడు.

లోకంలోని నైతిక పతనం క్రైస్తవులను ప్రభావితం చేయగలదు కాబట్టి, “మీ హృదయాన్ని కాపాడుకోవడం ద్వారా స్వచ్ఛతను కాపాడుకోండి” అనే అంశంగల ప్రసంగం నుండి మనమందరం ప్రయోజనం పొందాము. ఉదాహరణకు మనం స్వచ్ఛంగా ఉంటే, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి అది సహాయపడుతుంది. క్రైస్తవులుగా మనం లైంగిక దుర్నీతిలో పాల్గొనడం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు.—1 కొరింథీయులు 6:18.

మతభ్రష్టుల ద్వారా వ్యాపింపజేయబడిన వక్రీకరణలను, పాక్షిక సత్యాలను, పచ్చి అబద్ధాలను మనం విషంవలే దృష్టించడం జ్ఞానయుక్తమని “మోసపోకుండా జాగ్రత్త పడండి” అనే ప్రసంగం చూపించింది. (కొలొస్సయులు 2:8) అదేవిధంగా హానికరమైన పర్యవసానాలు కలుగకుండా మనం మన పాపభరితమైన కోరికలను తృప్తిపర్చుకోవచ్చు అని ఆలోచించి మనల్ని మనం మోసం చేసుకోకూడదు.

“ఏకైక సత్య దేవుణ్ణి ఆరాధించండి” అనేది మొదటి రోజు ముగింపు ప్రసంగాంశం. లోకంలోని పరిస్థితులు అంతకంతకూ మరింత అపాయకరంగా తయారవుతున్న సమయంలో, యెహోవా త్వరలోనే తన నీతియుక్తమైన నూతన లోకాన్ని తీసుకువస్తాడని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరం! ఆ లోకంలో ఎవరు జీవిస్తారు? యెహోవాను ఆరాధించేవారు మాత్రమే. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు, మన పిల్లలకు, మన బైబిలు విద్యార్థులకు సహాయం చేయడానికి, ఏకైక సత్య దేవుణ్ణి ఆరాధించండి (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ప్రసంగీకుడు విడుదల చేశాడు. దాన్ని పొందినందుకు మనం ఎంత సంతోషించామో కదా!

రెండవ రోజు, మంచిపట్ల ఆసక్తిని ఉన్నతపర్చింది

“మంచి విషయములో ఆసక్తిగలవారై ఉండండి” అన్నది సమావేశపు రెండవ రోజు చర్చాంశం. (1 పేతురు 3:13) మొదటి ప్రసంగీకుడు బైబిలు దినవచనాన్ని చర్చించాడు. దినవచనాన్ని క్రమంగా, అర్థవంతంగా పరిశీలించడం మన ఆసక్తిని అధికం చేస్తుందని ఆయన నొక్కి చెప్పాడు.

ఆ తర్వాత “తమ పరిచర్యను మహిమపరిచే రాజ్య ప్రచారకులు” అనే గోష్ఠి నిర్వహించబడింది. మొదటి భాగం, దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. (2 తిమోతి 2:15) మనం బైబిలును సమర్థవంతంగా ఉపయోగిస్తే, అది ప్రజల జీవితాలపై “శక్తి చూపడానికి” మార్గాన్ని తెరుస్తుంది. (హెబ్రీయులు 4:12, NW) మనం బైబిలు వైపు అవధానాన్ని మళ్ళించి, బైబిలునుండి ఒప్పింపజేసేలా తర్కించాలి. గోష్ఠిలోని రెండవ భాగం, ఆసక్తి చూపిన ప్రజలను మళ్ళీ మళ్ళీ సందర్శించమని మనల్ని ప్రోత్సహించింది. (1 కొరింథీయులు 3:6) ఆసక్తి చూపినవారిని వెంటనే తిరిగి సందర్శించడానికి సిద్ధపాటు, ధైర్యము అవసరం. మూడవ భాగం, మనం కలిసే ప్రతి వ్యక్తిని కాబోయే శిష్యుడిగా/శిష్యురాలిగా దృష్టించమని సలహా ఇచ్చి, మొదటి సందర్శనంలోనే బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదిస్తే, ప్రజలు శిష్యులుగా మారడానికి సహాయం చేసిన సంతోషం మనం పొందేలా అది నడిపించగలదని చూపించింది.

“ఎందుకు ‘ఎడతెగక ప్రార్థించాలి’?” అన్నది తర్వాతి ప్రసంగాంశం. తమ జీవితంలోని అన్ని విషయాలలో నడిపింపు కోసం దేవుని వైపు చూడమని బైబిలు క్రైస్తవులకు ఉద్బోధిస్తోంది. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి సమయం తీసుకోవాలి. అంతేకాకుండా, మనం ప్రార్థన చేయడంలో కొనసాగాలి, మన ప్రార్థనలకు ఆయన ఇచ్చిన సమాధానం స్పష్టమయ్యేవరకూ మనం ప్రార్థిస్తూనే ఉండేలా యెహోవా అనుమతించవచ్చు.—యాకోబు 4:8.

“ఆధ్యాత్మిక సంభాషణ బలపరుస్తుంది” అనే ప్రసంగం, మాట్లాడగలిగే మన సామర్థ్యాన్ని మన ప్రయోజనార్థం ఇతరుల ప్రయోజనార్థం ఉపయోగించాలని మనల్ని ప్రోత్సహించింది. (ఫిలిప్పీయులు 4:8) వివాహ భాగస్వాములకు, పిల్లలకు రోజూ కొంత ఆధ్యాత్మిక సంభాషణ అవసరం. దాన్ని సాధించడానికి, ప్రోత్సాహకరమైన విధంగా సంభాషించడం సాధ్యమయ్యేలా ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా అందరూ కలిసి భోజనం చేయడానికి కుటుంబాలు ప్రయత్నించాలి.

“సమర్పణ, బాప్తిస్మం ఎలా రక్షణకు నడిపిస్తాయి” అనే ప్రోత్సాహకరమైన ప్రసంగంతో ఉదయపు కార్యక్రమం ముగిసింది. బాప్తిస్మం తీసుకోవాలనుకున్న వారు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, విశ్వాసాన్ని కనబర్చారు, పశ్చాత్తాపపడ్డారు, చెడుతనం నుండి పక్కకు తప్పుకున్నారు, దేవునికి తమను తాము సమర్పించుకున్నారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వారు ఆధ్యాత్మికంగా ఎదగడంలో కొనసాగి, తమ ఆసక్తిని మంచి ప్రవర్తనను కొనసాగించాలని ప్రసంగీకుడు వ్యాఖ్యానించాడు.—ఫిలిప్పీయులు 2:14-16.

ఆ మధ్యాహ్నం, “అణకువతో ఉండి మీ కంటిని తేటగా ఉంచుకోండి” అనే ప్రసంగంలో రెండు ముఖ్యాంశాలు నొక్కి చెప్పబడ్డాయి. అణకువతో ఉండడం అంటే మన పరిమితుల గురించి, దేవుని ఎదుట మన స్థానం గురించి వాస్తవికమైన దృష్టి కలిగివుండడం అని అర్థం. మన కంటిని “తేటగా” ఉంచుకోవడానికి—వస్తుసంపదల మీద కాదుకానీ దేవుని రాజ్యంపై దాన్ని నిలిపివుంచడానికి—అణకువ మనకు సహాయం చేస్తుంది. మనం అలా చేస్తే, చింతించవలసిన అవసరం ఉండదు ఎందుకంటే యెహోవా మన అవసరాలను తీరుస్తాడు.—మత్తయి 6:22-24, 33, 34.

తర్వాతి ప్రసంగాంశం “కష్టకాలాల్లో యెహోవాపై సంపూర్ణ నమ్మకంతో ఉండండి.” మనం కష్టకాలాల్లో యెహోవాపై సంపూర్ణ నమ్మకంతో ఎందుకు ఉండాలో ప్రసంగీకుడు చూపించాడు. వ్యక్తిగత బలహీనతలు, ఆర్థిక లేక ఆరోగ్య సమస్యలు వంటివాటితో మనం విజయవంతంగా ఎలా వ్యవహరించవచ్చు? మనం ఆచరణాత్మకమైన వివేచన కోసం యెహోవాను అడిగి, ఇతరులనుండి సహాయం కోరదాం. భయానికి, నిరాశకు లొంగిపోయే బదులు మనం దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దేవునిపై మనకున్న నమ్మకాన్ని బలపర్చుకోవాలి.—రోమీయులు 8:35-39.

సమావేశంలోని ఆఖరి గోష్ఠి చర్చాంశం “వివిధ కష్టాలవల్ల మన విశ్వాసం ఎంత దృఢంగా ఉందన్నది పరీక్షించబడుతుంది.” నిజ క్రైస్తవులందరూ హింసను ఎదుర్కొంటారని మొదటి భాగం మనకు గుర్తుచేసింది. అది ఇతరులకు సాక్ష్యాన్నిస్తుంది, మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, దేవునిపట్ల మనకున్న విశ్వసనీయతను ప్రదర్శించడానికి మనకు అవకాశాన్నిస్తుంది. మనం మన జీవితాలను అనవసరంగా ప్రమాదంలో పడవేసుకోకపోయినప్పటికీ, హింసను తప్పించుకోవడానికి మనం ఎన్నడూ లేఖన విరుద్ధమైన విధానాలను ఉపయోగించము.—1 పేతురు 3:15, 16.

గోష్ఠిలోని రెండవ ప్రసంగీకుడు, తటస్థతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రసంగించాడు. తొలి క్రైస్తవులు యుద్ధవ్యతిరేకులు కాదు, అయితే వారు ప్రథమంగా విశ్వసనీయత చూపించాల్సింది దేవునికి అని గుర్తించారు. అదేవిధంగా నేడు, “మీరు లోకసంబంధులు కారు” అనే సూత్రానికి యెహోవాసాక్షులు స్థిరంగా హత్తుకొని ఉంటారు. (యోహాను 15:19) తటస్థతకు సంబంధించిన పరీక్షలు అకస్మాత్తుగా రావచ్చు కాబట్టి ఆ విషయంలో బైబిలు మార్గనిర్దేశకాలను సమీక్షించుకోవడానికి కుటుంబాలు సమయం కేటాయించాలి. గోష్ఠిలోని మూడవ ప్రసంగం సూచించినట్లు, సాతాను లక్ష్యం మనల్ని చంపాలన్నది కాదుకానీ మనం నమ్మకద్రోహులుగా మారడానికి ఒత్తిడి చేయాలన్నదే. ఎగతాళి, అనైతిక ఒత్తిళ్ళు, భావోద్వేగపరమైన బాధ, అశక్తతలు వంటివాటిని నమ్మకంగా సహించడం ద్వారా మనం యెహోవాకు ఘనతను తెస్తాము.

“యెహోవాకు సన్నిహితమవ్వండి” అనే హృదయపూర్వకమైన ఆహ్వానం ఆ రోజు చివరి ప్రసంగాంశం. మనం యెహోవా ప్రధానమైన లక్షణాలను అర్థం చేసుకున్నప్పుడు మనం ఆయనవైపు ఆకర్షితులమౌతాము. ఆయన తన ప్రజలను కాపాడడానికి ప్రత్యేకించి ఆధ్యాత్మికంగా కాపాడడానికి తన అపరిమితమైన శక్తిని ఉపయోగిస్తాడు. ఆయన న్యాయం కఠినమైనది కాదుకానీ నీతియుక్తంగా జీవించే ప్రతీ ఒక్కరికి నిరంతర జీవితాన్నివ్వడానికి అది ఆయనను కదిలిస్తుంది. బైబిలును వ్రాయడానికి దేవుడు అపరిపూర్ణ మానవులను ఉపయోగించుకున్న విధానంలో ఆయన జ్ఞానం స్పష్టమౌతోంది. అత్యంత ప్రియమైనది ఆయన ప్రేమ, యేసుక్రీస్తు ద్వారా మానవజాతి రక్షణ కోసం ఏర్పాటు చేయడానికి అది ఆయనను కదిలించింది. (యోహాను 3:16) యెహోవాకు సన్నిహితమవ్వండి (ఆంగ్లం) అనే హృదయాన్ని ఆనందింపజేసే క్రొత్త పుస్తకాన్ని విడుదల చేసి ప్రసంగీకుడు తన ప్రసంగాన్ని ముగించాడు.

మూడవ రోజు, సత్‌క్రియలయందు ఆసక్తిపై అవధానముంచింది

సమావేశపు మూడవ రోజు చర్చాంశం “సత్‌క్రియలపై ఆసక్తిగల ప్రజలు.” (తీతు 2:14) ఒక కుటుంబం దినవచనాన్ని చర్చించడంతో ఉదయకాల కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఆ తర్వాత “మీ దృఢనమ్మకం యెహోవాపైనే ఉందా?” అనే ప్రసంగం ఇవ్వబడింది. దేశాలు తమ సొంత జ్ఞానంపై తమ బలంపై ఆధారపడడం ద్వారా తమ దృఢనమ్మకాన్ని తప్పుడు మాధ్యమాలలో పెట్టారు. అయితే దానికి భిన్నంగా, విపత్తులు వచ్చినప్పటికీ యెహోవా సేవకులు ధైర్యంగా సంతోషంగా ఆయనపై ఆధారపడతారు.—కీర్తన 46:1-3, 7-11.

“యౌవనస్థులారా—యెహోవా సంస్థతో మీ భవిష్యత్తును నిర్మించుకోండి” అనే అంశంగల భాగం ఈ ప్రశ్ననుద్దేశించి మాట్లాడింది: ఒక యువకుడు/యువతి జీవితంలో శ్రేష్ఠమైనదాన్ని నిజంగా ఎలా పొందవచ్చు? ధనాన్ని, ఆస్తిని, ప్రతిష్ఠను సంపాదించుకోవడానికి ప్రయాసపడడం ద్వారా అది సాధ్యం కాదు. యువతీ యువకులు ఇంకా యౌవనంలో ఉన్నప్పుడే తనను గుర్తుచేసుకొమ్మని మన సృష్టికర్త వారిని ప్రేమపూర్వకంగా ప్రోత్సహిస్తున్నాడు. తమ యౌవనంలో క్రైస్తవ సేవ చేయడానికి కృషి చేసిన కొంతమందిని ప్రసంగీకుడు ఇంటర్వ్యూ చేశాడు, మనం ఆ యౌవనుల ఆనందాన్ని గ్రహించాము. యెహోవా సంస్థతో నిరంతర భవిష్యత్తు కోసం పునాది వేసుకోవడానికి యౌవనులైన సాక్షులకు సహాయం చేసేందుకు రూపొందించబడిన యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు? అనే క్రొత్త కరపత్రాన్ని పొందడం ఎంత ప్రయోజనకరం!

తర్వాత, “కష్ట సమయాల్లో స్థిరంగా ఉండండి” అనే ఆకర్షణీయమైన బైబిలు నాటకం ప్రదర్శించబడింది. తన యౌవనం నుండి తాను అత్యంతాసక్తితో ప్రవచించిన యెరూషలేము నాశనం వరకూ యిర్మీయా సుదీర్ఘ జీవితగమనం గురించి క్లుప్తమైన వివరణను అదిచ్చింది. తనకివ్వబడిన నియామకానికి తాను అర్హుడ్ని కాదని యిర్మీయాకు అనిపించింది, అయితే వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన తన నియామకాన్ని పూర్తిచేశాడు, యెహోవా ఆయనను విడిపించాడు.—యిర్మీయా 1:8, 18, 19.

నాటకం తర్వాత “యిర్మీయావలే ఉండండి—దేవుని వాక్యాన్ని నిర్భయంగా ప్రకటించండి” అనే ప్రసంగం ఇవ్వబడింది. ప్రస్తుత కాలంలో జీవిస్తున్న రాజ్య ప్రచారకులు తరచూ అబద్ధాలకు, ద్వేషపూరితమైన ప్రచారాలకు గురవుతారు. (కీర్తన 109:1-3) అయితే, యిర్మీయావలే యెహోవా వాక్యమందు సంతోషించడం ద్వారా మనం నిరుత్సాహాన్ని అధిగమించవచ్చు. మనకు వ్యతిరేకంగా పోరాడేవారు విజయం సాధించరని మనకు దృఢనమ్మకం ఉంది.

“లోకపు నటన గతించుచున్నది” అనే బహిరంగ ప్రసంగం నిజంగా సమయోచితమైనది. మన కాలంలో ఎన్నో ఆకస్మిక మార్పులు జరిగాయి. “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులే[దు]” అని చెప్పుకోవడంతో పాటు ఇలాంటి పరిస్థితులు, భయంగొలిపే దేవుని తీర్పు దినానికి నడిపిస్తాయని బైబిలు ప్రవచించింది. (1 థెస్సలొనీకయులు 5:3) అది అద్భుతమైన మార్పులను తెస్తుంది—యుద్ధాలు, నేరం, దౌర్జన్యం, వ్యాధులు వంటివాటన్నింటికి కూడా అంతాన్ని తీసుకువస్తుంది. ఈ విధానంలోని విషయాలలో నమ్మకాన్నుంచే బదులు, ఇది దైవభక్తితో పరిశుద్ధమైన ప్రవర్తనను కొనసాగించవలసిన సమయం.

ఆ వారపు కావలికోట పాఠ్య సారాంశం తర్వాత “ఆసక్తిగల రాజ్య ప్రచారకులుగా సత్‌క్రియలను ఎక్కువగా చేయండి” అనే అంశంగల సమావేశపు ఆఖరి ప్రసంగం ఇవ్వబడింది. సమావేశ కార్యక్రమం మనల్ని ఆధ్యాత్మికంగా ఎలా ప్రేరేపించిందో, యెహోవాపై ఆధారపడమని ఎలా ప్రోత్సహించిందో ప్రసంగీకుడు చెప్పాడు. మనం పరిశుద్ధమైన, ప్రేమపూర్వకమైన, ఆసక్తిగల దేవుని రాజ్య ప్రచారకులుగా ఉండాలని ముగింపులో ప్రోత్సహించబడ్డాము.—1 పేతురు 2:12.

నెహెమ్యా కాలంలోని యెహోవా సేవకుల వంటి స్పూర్తితో, “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశాల వద్ద మనం పొందిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాల విషయమై సంతోషిస్తూ మనం ఇండ్లకు తిరిగివెళ్ళాము. (నెహెమ్యా 8:12) ఈ ఉత్సాహభరితమైన సమావేశం మీరు ఆసక్తిగల రాజ్య ప్రచారకులుగా ముందుకు సాగడానికి మిమ్మల్ని ఆనందంతో, పట్టుదలతో నింపలేదా?

[23వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఒక కొత్త అధ్యయన సహాయకం!

సమావేశపు మొదటి రోజు ముగింపులో, ఏకైక సత్య దేవుణ్ణి ఆరాధించండి (ఆంగ్లం) అనే కొత్త పుస్తకం విడుదలను బట్టి హాజరైనవారందరూ సంతోషించారు. నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తక అధ్యయనం పూర్తిచేసిన వారితో అధ్యయనం చేయడానికి అది రూపొందించబడింది. “నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరి గలవారి” విశ్వాసాన్ని అది నిస్సందేహంగా బలపరుస్తుంది.—అపొస్తలుల కార్యములు 13:48, NW.

[చిత్రసౌజన్యం]

పుస్తక ముఖచిత్రం: U.S. Navy photo

[24వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

దేవునికి సన్నిహితమవ్వడానికి సహాయం

సమావేశపు రెండవ రోజున ఆఖరి ప్రసంగీకుడు యెహోవాకు సన్నిహితమవ్వండి (ఆంగ్లం) అనే కొత్త పుస్తకం విడుదలను ప్రకటించాడు. దానిలో నాలుగు ముఖ్య భాగాలు ఉన్నాయి, శక్తి, న్యాయం, జ్ఞానం, ప్రేమ అనే యెహోవా ప్రధాన లక్షణాలలోని ప్రతిదానికి ఒక భాగం కేటాయించబడింది. పుస్తకంలోని ప్రతి భాగంలో, దేవుని లక్షణాలను యేసుక్రీస్తు ఎంత చక్కగా ప్రదర్శించాడో ఉదాహరణలను ఇస్తూ ఒక అధ్యాయం ఉంది. యెహోవా దేవునితో మరింత సన్నిహితమైన, మరింత బలమైన సంబంధాన్ని నిర్మించుకోవడానికి మనకు, మన బైబిలు విద్యార్థులకు సహాయం చేయడమే ఈ కొత్త పుస్తకం యొక్క ముఖ్యోద్దేశం.

[26వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

యౌవనస్థులకు ఆధ్యాత్మిక నడిపింపు

సమావేశపు మూడవ రోజు, యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు? అనే ప్రత్యేకమైన కరపత్రం విడుదల చేయబడింది. తమ భవిష్యత్తు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి యౌవనస్థులైన సాక్షులకు సహాయం చేసేందుకు రూపొందించబడిన ఈ కొత్త కరపత్రం యెహోవా సేవలో నిరంతర కెరియర్‌ను నిర్మించుకోవడానికి ఆధ్యాత్మిక సలహా ఇస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి