‘యెహోవా ఎక్కడ ఉన్నాడు’ అని మీరు అడుగుతారా?
‘జనులు నాయొద్దనుండి దూరముగా తొలగిపోయిరి, యెహోవా ఎక్కడ ఉన్నాడని వారు అడుగుట లేదు.’—యిర్మీయా 2:5, 6.
1. “దేవుడు ఎక్కడున్నాడు?” అని ప్రజలు అడిగినప్పుడు, వారి మనస్సులో ఏమి ఉండవచ్చు?
“దేవుడు ఎక్కడున్నాడు?” అని చాలామంది అడుగుతారు. కొంతమంది సృష్టికర్త ఎక్కడ ఉంటాడనే ప్రాథమిక వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి అలా అడుగుతారు. మరికొందరు ఏదైనా పెద్ద విపత్తు సంభవించినప్పుడు లేదా తమకు ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదో అర్థం చేసుకోలేక అలా అడుగుతుంటారు. ఇంకొందరైతే, అసలు దేవుడు ఉనికిలో ఉన్నాడన్న తలంపునే నిరాకరిస్తారు కాబట్టి వాళ్ళేమీ అడగరు.—కీర్తన 10:4.
2. దేవుని కోసం చేసే అన్వేషణలో ఎవరు సఫలులవుతారు?
2 అయితే దేవుడు ఉన్నాడనడానికి పుష్కలమైన సాక్ష్యాధారాలున్నాయని గుర్తించేవారు అనేకులున్నారు. (కీర్తన 19:1; 104:24) వీరిలో కొందరు తాము ఏదో ఒక మతంలో ఉంటే చాలని సంతృప్తిపడతారు. కానీ అన్ని దేశాల్లోనూ జీవిస్తున్న లక్షలాదిమందికి సత్యం పట్లవున్న ప్రగాఢమైన ప్రేమ సత్య దేవుని కోసం అన్వేషించేలా వారిని పురికొల్పింది. వారి కృషి వ్యర్థం కాలేదు, ఎందుకంటే ఆయన “మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.”—అపొస్తలుల కార్యములు 17:26-28.
3. (ఎ) దేవుని నివాసస్థలం ఎక్కడుంది? (బి) ‘యెహోవా ఎక్కడ ఉన్నాడు’ అనే లేఖనాధారిత ప్రశ్న ఏమి సూచిస్తోంది?
3 ఒక వ్యక్తి నిజంగా యెహోవాను కనుగొన్నప్పుడు, “దేవుడు ఆత్మ” అనీ ఆయన మానవ నేత్రాలకు కనిపించడనీ గ్రహిస్తాడు. (యోహాను 4:24) యేసు సత్య దేవుణ్ణి “పరలోకమందున్న నా తండ్రి” అని ప్రస్తావించాడు. దాని భావమేమిటి? ఆకాశం భూమికి ఎంతో ఎత్తున ఉన్నట్లుగానే మన పరలోకపు తండ్రి నివాసస్థలం ఆధ్యాత్మిక భావంలో ఎంతో ఉన్నతమైనది. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 12:49; యెషయా 63:15) అయితే మనం మన భౌతిక నేత్రాలతో దేవుణ్ణి చూడలేకపోయినప్పటికీ మనం ఆయన గురించి, ఆయన సంకల్పాల గురించి తెలుసుకోవడాన్ని ఆయన సాధ్యం చేస్తాడు. (నిర్గమకాండము 33:20; 34:6, 7) జీవితార్థాన్ని తెలుసుకోవాలనుకునే నిష్కపటులైన ప్రజలు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తాడు. మన జీవితాలను ప్రభావితం చేసే విషయాలను ఆయన ఎలా దృష్టిస్తాడు, మన కోరికలు ఆయన సంకల్పాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే వాటిపై ఆయన ఉద్దేశమేమిటో నిర్ధారించుకోవడానికి ఆయన మనకు విశ్వసనీయమైన ఆధారాన్ని అందజేస్తాడు. అలాంటి విషయాల గురించి మనం విచారణ చేయాలని, సమాధానాలు కనుగొనడానికి తీవ్రమైన కృషి చేయాలని ఆయన అభిలషిస్తున్నాడు. ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలు అలా చేయనందుకు యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా వారిని గద్దించాడు. వారికి దేవుని పేరు తెలుసు, కానీ వారు ‘యెహోవా ఎక్కడ ఉన్నాడు’ అని అడగలేదు. (యిర్మీయా 2:6) యెహోవా సంకల్పం వారికి ముఖ్యమైనది కాదు. వారు ఆయన మార్గనిర్దేశం కోసం చూడలేదు. మరి మీరు పెద్దవేగానీ చిన్నవేగానీ నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ‘యెహోవా ఎక్కడ ఉన్నాడు’ అని అడుగుతారా?
దేవుని వద్ద విచారణ చేసినవారు
4. యెహోవా వద్ద విచారణ చేసే విషయంలో దావీదు మాదిరి నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
4 యెష్షయి కుమారుడైన దావీదు యౌవనుడిగా ఉన్నప్పుడే యెహోవాపై బలమైన విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నాడు. యెహోవా “జీవముగల దేవు[డు]” అని ఆయనకు తెలుసు. దావీదు స్వయంగా యెహోవా సంరక్షణను అనుభవించాడు. ‘యెహోవా పేరు’ పట్ల విశ్వాస ప్రేమలతో పురికొల్పబడిన దావీదు ఎన్నో ఆయుధాలు ధరించి వచ్చిన ఫిలిష్తీయుడు, భారీకాయుడు అయిన గొల్యాతును చంపేశాడు. (1 సమూయేలు 17:26, 34-51) అయితే దావీదుకు లభించిన విజయం ఆయనను తన స్వశక్తిపై ఆధారపడే వ్యక్తిగా చేయలేదు. ఇప్పుడు తాను ఏమి చేసినా యెహోవా తనను ఆశీర్వదిస్తాడులే అని ఆయన తర్కించుకోలేదు. ఆ తర్వాతి సంవత్సరాల్లో దావీదు ఎన్నోసార్లు నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు యెహోవా వద్ద విచారణ చేశాడు. (1 సమూయేలు 23:2; 30:8; 2 సమూయేలు 2:1; 5:19) ఆయన ఎల్లప్పుడూ ఇలా ప్రార్థించాడు: “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.” (కీర్తన 25:4, 5) మనం అనుసరించడానికి ఎంత చక్కని మాదిరో కదా!
5, 6. యెహోషాపాతు తన జీవితంలోని వివిధ సమయాల్లో యెహోవా వద్ద ఎలా విచారణ చేశాడు?
5 దావీదు రాజవంశంలో ఐదవ రాజైన యెహోషాపాతు కాలంలో, మూడు సంకీర్ణ రాజ్యాల సైన్యాలు యూదాతో యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చాయి. జాతిసంబంధమైన ఈ అత్యవసర పరిస్థితుల్లో యెహోషాపాతు “యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొ[న్నాడు].” (2 దినవృత్తాంతములు 20:1-3) యెహోషాపాతు యెహోవా వద్ద విచారణ చేయడం ఇది మొదటిసారి కాదు. మతభ్రష్ట ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు పూర్తిగా మునిగిపోయివున్న బయలు ఆరాధనను విసర్జించి, యెహోవా మార్గాల్లో నడవడానికి రాజు ఎంపిక చేసుకున్నాడు. (2 దినవృత్తాంతములు 17:3, 4) కాబట్టి సంక్షోభ పరిస్థితి తలెత్తినప్పుడు యెహోషాపాతు ఎలా “యెహోవాయొద్ద విచారిం[చాడు]”?
6 ఆ క్లిష్ట సమయంలో యెరూషలేములో యెహోషాపాతు బహిరంగంగా చేసిన ప్రార్థనలో తాను యెహోవా సర్వోన్నత శక్తిని గుర్తుంచుకున్నానని సూచించాడు. వేరే జాతులవారిని వెళ్ళగొట్టి ఇశ్రాయేలుకు నిర్దిష్ట స్థలాన్ని స్వాస్థ్యంగా ఇవ్వడం ద్వారా వెల్లడయిన యెహోవా సంకల్పం గురించి ఆయన లోతుగా ఆలోచించాడు. తనకు యెహోవా సహాయం అవసరముందన్న విషయాన్ని రాజు అంగీకరించాడు. (2 దినవృత్తాంతములు 20:6-12) ఆ సందర్భంలో రాజు తనను కనుగొనేందుకు యెహోవా అనుమతించాడా? అనుమతించాడు. లేవీయుడైన యహజీయేలు ద్వారా యెహోవా నిర్దిష్టమైన నిర్దేశాన్నిచ్చాడు, తర్వాతి రోజున ఆయన తన ప్రజలకు విజయాన్ని అనుగ్రహించాడు. (2 దినవృత్తాంతములు 20:14-28) మీరు మార్గనిర్దేశం కోసం యెహోవా వైపు తిరిగితే, ఆయన తనను తాను కనబరచుకుంటాడని మీరెలా నిశ్చయతతో ఉండవచ్చు?
7. దేవుడు ఎవరి ప్రార్థనలను ఆలకిస్తాడు?
7 యెహోవా పక్షపాతికాడు. ఆయన తనకు ప్రార్థించమని జనులందరినీ ఆహ్వానిస్తున్నాడు. (కీర్తన 65:2; అపొస్తలుల కార్యములు 10:34, 35) తనను వేడుకునే ప్రజల హృదయాల్లో ఉన్నదాన్ని ఆయన గమనిస్తాడు. నీతిమంతుల ప్రార్థనను తాను ఆలకిస్తానని ఆయన మనకు హామీ ఇస్తున్నాడు. (సామెతలు 15:29) మునుపు ఆయన పట్ల ఆసక్తి చూపించకపోయినా ఇప్పుడు వినయంగా ఆయన మార్గనిర్దేశాన్ని కోరుకునేవారికి తనను తాను కనబరచుకుంటాడు. (యెషయా 65:1) తన ధర్మశాస్త్రమును అనుసరించడంలో తప్పిపోయి ఇప్పుడు వినయంగా పశ్చాత్తాపపడుతున్న వారి ప్రార్థనలను కూడా ఆయన వింటాడు. (కీర్తన 32:5, 6; అపొస్తలుల కార్యములు 3:19) అయితే ఒక వ్యక్తి హృదయం దేవునికి విధేయంగా లేనట్లయితే ఆ వ్యక్తి చేసే ప్రార్థనలు వ్యర్థమే. (మార్కు 7:6, 7) కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.
వారు ప్రార్థించారు గానీ జవాబు పొందలేదు
8. సౌలు రాజు ప్రార్థనలు యెహోవాకు అనంగీకారం కావడానికి కారణమేమిటి?
8 సౌలు రాజు అవిధేయత కారణంగా దేవుడు ఆయనను నిరాకరించాడని సమూయేలు ప్రవక్త ఆయనకు చెప్పిన తర్వాత, సౌలు యెహోవాకు మ్రొక్కాడు. (1 సమూయేలు 15:30, 31) అయితే అది కేవలం పైపై నటనే. దేవునికి విధేయత చూపించాలన్నది కాదు గానీ ప్రజలు తనను ఘనపరచాలన్నదే సౌలు కోరిక. ఆ తర్వాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తున్నప్పుడు సౌలు నామమాత్రంగా యెహోవా వద్ద విచారణ చేశాడు. అయితే ఆయనకు సమాధానం లభించనప్పుడు, ఆయన కర్ణపిశాచముగల స్త్రీని సంప్రదించాడు, దాన్ని యెహోవా ఖండించాడని తెలిసినప్పటికీ ఆయన అలా చేశాడు. (ద్వితీయోపదేశకాండము 18:10-12; 1 సమూయేలు 28:6, 7) విషయాన్ని సమీక్షిస్తూ, సౌలు “యెహోవాయొద్ద విచారణ చేయ”లేదు అని 1 దినవృత్తాంతములు 10:14 చెబుతోంది. ఎందుకలా చెబుతోంది? ఎందుకంటే సౌలు ప్రార్థనలు విశ్వాసంతో చేసినవి కావు. కాబట్టి, ఆయన అసలు ప్రార్థించనట్లే లెక్క.
9. యెహోవా మార్గనిర్దేశం కోసం సిద్కియా చేసిన విన్నపంలోని లోపమేమిటి?
9 అదేవిధంగా, యూదా రాజ్య అంతం సమీపించినప్పుడు యెహోవాకు మరెక్కువగా ప్రార్థనలు చేయడం, ఆయన ప్రవక్తలను సంప్రదించడం జరిగింది. అయితే ప్రజలు యెహోవాపట్ల భక్తి ఉందంటూనే మరోప్రక్కన విగ్రహారాధన చేస్తున్నారు. (జెఫన్యా 1:4-6) వారు యాంత్రికంగా దేవుని వద్ద విచారణ చేసినప్పటికీ, ఆయన చిత్తానికి విధేయులయ్యేందుకు తమ హృదయాలను మాత్రం సిద్ధం చేసుకోలేదు. సిద్కియా రాజు తన కోసం యెహోవా వద్ద విచారణ చేయమని యిర్మీయాను వేడుకున్నాడు. ఆ రాజు ఏమి చేయాలో యెహోవా అప్పటికే ఆయనకు చెప్పాడు. కానీ విశ్వాసలేమితోనూ మనుష్య భయంతోనూ ఆ రాజు యెహోవా చెప్పింది వినలేదు, అయితే ఆ రాజు తాను వినాలని కోరుకుంటున్న సమాధానాన్ని యెహోవా ఆయనకు ఇవ్వలేదు.—యిర్మీయా 21:1-12; 38:14-19.
10. యోహానాను యెహోవా మార్గనిర్దేశం కోసం అర్థించిన విధానంలో ఉన్న తప్పేమిటి, ఆయన పొరపాటు నుండి మనమేమి నేర్చుకుంటాము?
10 యెరూషలేమును నాశనం చేసి, యూదులను చెరబట్టి బబులోను సైన్యం వెళ్ళిపోయిన తర్వాత, యూదాలో మిగిలిపోయిన చిన్న గుంపు యూదులను ఐగుప్తుకు తీసుకువెళ్ళడానికి యోహానాను సిద్ధమయ్యాడు. పథకాలన్నీ సిద్ధమయ్యాయి, కానీ బయలుదేరడానికి ముందు వారు తమ తరఫున ప్రార్థించి యెహోవా మార్గనిర్దేశం కోసం అర్థించమని యిర్మీయాను అడిగారు. అయితే తమకు కావలసిన సమాధానం వారికి లభించనప్పుడు వాళ్ళు అలాగే ముందుకు కొనసాగి తాము వేసుకున్న పథకం ప్రకారమే చేశారు. (యిర్మీయా 41:16-43:7) మీరు యెహోవా కోసం వెదకినప్పుడు ఆయనను మీరు కనుగొనగలిగేలా మీకు ప్రయోజనం చేకూర్చగల పాఠాలను మీరు పైన ప్రస్తావించబడిన సంఘటనల్లో చూడగలుగుతున్నారా?
‘పరీక్షిస్తూ’ ఉండండి
11. మనం ఎఫెసీయులు 5:10ని ఎందుకు అన్వయించుకోవాలి?
11 సత్యారాధన అంటే నీటి బాప్తిస్మం ద్వారా మన సమర్పణను సూచించడం, సంఘ కూటాలకు హాజరవడం, బహిరంగ పరిచర్యలో భాగం వహించడం మాత్రమే కాదు. మన యావత్ జీవనశైలి దానిలో నిమగ్నమై ఉంది. దైవభక్తికి అనుగుణమైన మార్గం నుండి మనల్ని ప్రక్కకు మళ్ళించగల ఒత్తిడులకు మనం ప్రతిరోజు గురవుతుంటాము, వాటిలో కొన్ని పైకి కనిపించనివి, కొన్ని స్పష్టంగా కనిపించేవి. వాటికి మనమెలా ప్రతిస్పందిస్తాము? అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని నమ్మకమైన క్రైస్తవులకు వ్రాసేటప్పుడు వారిని ఇలా పురికొల్పాడు: “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షి[స్తూ]” ఉండండి. (ఎఫెసీయులు 5:10) అలా చేయడంలోని విజ్ఞత, లేఖనాల్లో నివేదించబడిన అనేక పరిస్థితుల ద్వారా సోదాహరణంగా తెలియజేయబడింది.
12. దావీదు నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకువెళ్తున్నప్పుడు యెహోవా ఎందుకు సంతోషించలేదు?
12 నిబంధన మందసం ఇశ్రాయేలుకు తిరిగి తీసుకురాబడి కిర్యత్యారీములో అనేక సంవత్సరాలు ఉంచబడిన తర్వాత దావీదు రాజు దాన్ని యెరూషలేముకు తీసుకువెళ్ళాలని కోరుకున్నాడు. ఆయన ప్రజల అధిపతులతో ఆలోచన చేసి ‘ఈ యోచన వారి దృష్టికి అనుకూలమైనదై, యెహోవా వలన కలిగినదైతే’ మందసాన్ని అక్కడి నుండి కదిలిద్దామని అన్నాడు. అయితే ఆ విషయం గురించి యెహోవా చిత్తమేమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి తగినంతగా విచారణ చేయడాన్ని ఆయన అశ్రద్ధ చేశాడు. ఆయనలా విచారణ చేసి ఉంటే, మందసం బండి మీదికి ఎక్కించబడేదే కాదు. దేవుడు స్పష్టంగా ఉపదేశించినట్లుగా కహాతీయులైన లేవీయులు దాన్ని తమ భుజాలపై మోసుకువెళ్ళేవారు. దావీదు తరచూ యెహోవా వద్ద విచారణ చేసినప్పటికీ ఈ సందర్భంలో ఆయన సరైన విధంగా విచారణ చేయడంలో తప్పిపోయాడు. నాశనకరమైన ఫలితం వచ్చింది. ఆ తర్వాత దావీదు, ‘మనము మన దేవుడైన యెహోవా వద్ద విధినిబట్టి విచారణచేయకుండుటచేత ఆయన మనలో నాశనము కలుగజేసెను’ అని అంగీకరించాడు.—1 దినవృత్తాంతములు 13:1-3; 15:11-13; సంఖ్యాకాండము 4:4-6, 15; 7:1-9.
13. మందసము విజయవంతంగా తీసుకువెళ్ళబడినప్పుడు పాడిన పాటలో ఏ పురికొల్పు ఉంది?
13 చివరికి మందసము లేవీయుల ద్వారా ఓబేదెదోము ఇంటి నుండి యెరూషలేముకు రవాణా చేయబడినప్పుడు, వారు దావీదు కూర్చిన గీతాన్ని పాడారు. దానిలో ఈ హృదయపూర్వకమైన పురికొల్పు ఉంది: “యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము నాశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసికొనుడి, ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకముచేసికొనుడి.”—1 దినవృత్తాంతములు 16:11, 13.
14. సొలొమోను మంచి మాదిరి నుండి, ఆయన తన తర్వాతి జీవితంలో చేసిన పొరపాట్ల నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
14 దావీదు తన మరణానికి ముందు తన కుమారుడైన సొలొమోనుకు ఇలా ఉపదేశించాడు: “[యెహోవాను] వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును.” (1 దినవృత్తాంతములు 28:9) సొలొమోను సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత బలిపీఠము ఉన్న గిబియోనుకు వెళ్ళి యెహోవాకు బలి అర్పించాడు. అక్కడ యెహోవా, “నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని” సొలొమోనును ఆహ్వానించాడు. సొలొమోను విన్నపానికి ప్రతిస్పందనగా, ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చడానికి కావలసిన బుద్ధి జ్ఞానములను ధారాళంగా ఇవ్వడమే గాక యెహోవా ఆయనకు సంపదలను, ఘనతను కూడా ఇచ్చాడు. (2 దినవృత్తాంతములు 1:3-12) యెహోవా దావీదుకు ఇచ్చిన నిర్మాణ నమూనాను ఉపయోగిస్తూ సొలొమోను అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. కానీ తన వైవాహిక విషయాలకు వచ్చే సరికి సొలొమోను యెహోవా వద్ద విచారణ చేయడంలో విఫలుడయ్యాడు. సొలొమోను యెహోవా ఆరాధకులు కాని స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆయన వృద్ధాప్యంలో వారాయన హృదయాన్ని యెహోవా నుండి దూరంగా త్రిప్పివేశారు. (1 రాజులు 11:1-10) మనం ఎంత ప్రముఖులుగా, జ్ఞానవంతులుగా లేదా వివేకవంతులుగా అనిపించినా, మనం “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షి[స్తూ]” ఉండడం ప్రాముఖ్యం!
15. ఐతియొపీయుడైన జెరహు యూదాపైకి వచ్చినప్పుడు, యెహోవా యూదాను తప్పించాలని ఆసా ఎందుకు నమ్మకంతో ప్రార్థించగలిగాడు?
15 దీని ప్రాముఖ్యత, సొలొమోను ముని మనుమడైన ఆసా రాజ్యపాలన గురించిన వృత్తాంతంలో మరింత నొక్కి చెప్పబడింది. ఆసా రాజైన పదకొండు సంవత్సరాల తర్వాత, ఐతియొపీయుడైన జెరహు పదిలక్షల సైన్యాన్ని తీసుకుని యూదా మీదకు దండెత్తి వచ్చాడు. యెహోవా యూదాను విడిపిస్తాడా? తన ప్రజలు తాను చెప్పింది విని తన కట్టడలను పాటిస్తే ఏమి జరుగుతుందో, పాటించకపోతే ఏమి జరుగుతుందో యెహోవా ఐదు వందల సంవత్సరాలకంటే ఎక్కువకాలం క్రితమే స్పష్టంగా తెలియజేశాడు. (ద్వితీయోపదేశకాండము 28:1, 7, 15, 25) ఆసా తన పరిపాలన ప్రారంభంలో తన సామ్రాజ్యంలో నుండి అబద్ధ ఆరాధనలో ఉపయోగించే బలిపీఠములను, స్తంభములను తొలగించాడు. “యెహోవాను ఆశ్రయించు”మని తన ప్రజలను పురికొల్పాడు. ఆసా వాటిని చేయడానికి, విపత్తు సంభవించేంత వరకు ఆగలేదు. కాబట్టి యెహోవాపై విశ్వాసంతో, తమ పక్షాన చర్య తీసుకోమని ఆసా ప్రార్థించగలిగాడు. దాని ఫలితం? యూదాకు విశేషమైన విజయం అనుగ్రహించబడింది.—2 దినవృత్తాంతములు 14:2-12.
16, 17. (ఎ) ఆసా విజయం సాధించినప్పటికీ యెహోవా ఆయనకు ఏ విషయాన్ని జ్ఞాపకం చేశాడు? (బి) ఆసా మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు, ఆయనకు ఎలాంటి సహాయం ఇవ్వబడింది, కానీ ఆయన ఎలా ప్రతిస్పందించాడు? (సి) ఆసా ప్రవర్తనను పరిశీలించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
16 ఏదేమైనప్పటికీ ఆసా విజయం సాధించి తిరిగి వచ్చినప్పుడు, ఆ రాజును కలుసుకొని ఇలా చెప్పమని యెహోవా అజర్యాను పంపించాడు: “ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును.” (2 దినవృత్తాంతములు 15:2) పునరుద్ధరించబడిన ఆసక్తితో ఆసా సత్యారాధనను పెంపొందింపజేశాడు. కానీ 24 సంవత్సరాల తర్వాత, మళ్ళీ యుద్ధం ఎదురైనప్పుడు, ఆసా యెహోవా వద్ద విచారణ చేయడంలో విఫలమయ్యాడు. ఆయన దేవుని వాక్యాన్ని సంప్రదించలేదు, ఐతియొపీయుని సైన్యం యూదాపై దాడి చేసినప్పుడు యెహోవా చేసినదాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మూర్ఖంగా సిరియాతో మైత్రి ఏర్పరచుకున్నాడు.—2 దినవృత్తాంతములు 16:1-6.
17 దీని మూలంగా యెహోవా, దీర్ఘదర్శియైన హనానీ ఆసాను మందలించేలా చేశాడు. ఆ సందర్భంలో కూడా అంటే ఆ విషయంపై యెహోవా దృక్కోణాన్ని వివరించినప్పుడు ఆసా ప్రయోజనం పొందగలిగేవాడే. కానీ ఆయన కోపగించుకొని హనానీని బందీగృహములో వేయించాడు. (2 దినవృత్తాంతములు 16:7-10) ఎంతటి విచారకరమైన విషయం! మన విషయమేమిటి? మనం దేవుని కోసం వెదకి, ఉపదేశాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తామా? మనం లోకంతో మిళితమవుతున్నందుకు మనకు ఉపదేశమివ్వడానికి శ్రద్ధ, పట్టింపు గల ఒక పెద్ద, బైబిలును ఉపయోగించినప్పుడు “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని” తెలుసుకోవడానికి ప్రేమపూర్వక సహాయం ఇచ్చినందుకు మనం కృతజ్ఞులమై ఉంటామా?
అడగడం మరచిపోకండి
18. ఎలీహు యోబుకు చెప్పిన మాటల నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
18 యెహోవా సేవలో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి కూడా ఒత్తిడి సమయంలో యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయే అవకాశం ఉంది. యోబుకు అసహ్యమైన వ్యాధి వచ్చి, తన పిల్లలను సంపదలను కోల్పోయి, తన సహచరులచే నిందించబడినప్పుడు ఆయన తలంపులన్నీ తనపైనే కేంద్రీకృతమయ్యాయి. ఎలీహు ఆయనకిలా గుర్తు చేశాడు: “నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అనుకొనువారెవరును లేరు.” (యోబు 35:11) యోబు తాను తన అవధానాన్ని యెహోవాపై కేంద్రీకరించి, పరిస్థితిని యెహోవా ఎలా దృష్టిస్తున్నాడో పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది. యోబు తనకు జ్ఞాపకం చేయబడిన విషయాన్ని వినయంగా అంగీకరించాడు, అలాగే చేయడానికి ఆయన మాదిరి మనకు సహాయం చేయగలదు.
19. ఇశ్రాయేలు ప్రజలు తరచూ ఏమి చేయడంలో తప్పిపోయారు?
19 ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తమ జనాంగముతో వ్యవహరించిన విధానం గురించిన వృత్తాంతం తెలుసు. కానీ చాలాసార్లు, తమ జీవితాల్లోని నిర్దిష్టమైన పరిస్థితులతో వ్యవహరించేటప్పుడు వారు దాన్ని గుర్తుంచుకోలేదు. (యిర్మీయా 2:5, 6, 8) జీవితంలో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు, వారు ‘యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అని అడిగే బదులు తమ సొంత ఆనందాల కోసం వెంపర్లాడారు.—యెషయా 5:11, 12.
‘యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అని అడుగుతూనే ఉండండి
20, 21. (ఎ) యెహోవా మార్గనిర్దేశం కోసం వెదకడంలో నేడు ఎలీషా వంటి స్ఫూర్తిని ఎవరు చూపించారు? (బి) విశ్వాసం విషయంలో వారి మాదిరిని మనం ఎలా అనుకరించవచ్చు, దాని నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?
20 ఏలీయా బహిరంగ పరిచర్య ముగిసినప్పుడు, ఆయన ఒంటిమీదినుండి క్రిందపడిన పైవస్త్రాన్ని ఆయన సేవకుడైన ఎలీషా తీసుకొని యొర్దానుకు వెళ్ళి నీటిని కొట్టి, ‘ఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు’ అని అడిగాడు. (2 రాజులు 2:14) అప్పుడు తన ఆత్మ ఎలీషాపై ఉందని చూపించడం ద్వారా యెహోవా సమాధానమిచ్చాడు. దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
21 ఆధునిక కాలాల్లో అటువంటిదే ఒకటి జరిగింది. ప్రకటనా పనిలో నాయకత్వం వహించిన కొంతమంది అభిషిక్త క్రైస్తవులు భూమిమీది నుండి నిష్క్రమించారు. ఆ సమయంలో తమకు పర్యవేక్షణా బాధ్యత ఇవ్వబడినవారు లేఖనాలను పరీక్షించి, మార్గనిర్దేశం కోసం యెహోవాకు ప్రార్థించారు. ‘యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అని అడగడంలో వారు తప్పిపోలేదు. తత్ఫలితంగా, యెహోవా తన ప్రజలకు ముందుండి దారిచూపుతూ వారి కార్యకలాపాలు వృద్ధి చెందేలా చేశాడు. మనం వారి విశ్వాసాన్ని అనుకరిస్తామా? (హెబ్రీయులు 13:7) అలాగైతే మనం యెహోవా సంస్థకు సన్నిహితంగా ఉండి, అది ఇచ్చే నిర్దేశానికి ప్రతిస్పందిస్తూ యేసుక్రీస్తు మార్గనిర్దేశం క్రింద అది కొనసాగిస్తున్న పనిలో పూర్తిగా భాగం వహిస్తాము.—జెకర్యా 8:23.
మీరెలా సమాధానమిస్తారు?
• ‘యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అని మనం ఏ ఉద్దేశంతో అడగాలి?
• ‘యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అనే ప్రశ్నకు మనం నేడు సమాధానాన్ని ఎలా కనుగొనవచ్చు?
• దైవిక మార్గనిర్దేశం కోసం చేసే కొన్ని ప్రార్థనలకు సమాధానం ఎందుకు ఇవ్వబడదు?
• “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షి[స్తూ]” ఉండడంలోని అవసరాన్ని బైబిలులో ఏ ఉదాహరణలు తెలియజేస్తున్నాయి?
[9వ పేజీలోని చిత్రం]
యిహోషాపాతు రాజు యెహోవా కోసం ఎలా వెదికాడు?
[10వ పేజీలోని చిత్రం]
సౌలు కర్ణపిశాచముగల స్త్రీని ఎందుకు సంప్రదించాడు?
[12వ పేజీలోని చిత్రం]
‘యెహోవా ఎక్కడ ఉన్నాడు’ అనేది తెలుసుకోవడానికి ప్రార్థించండి, అధ్యయనం చేయండి, ధ్యానించండి