కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w04 6/1 పేజీలు 14-19
  • దేవుణ్ణి మహిమపరిచేవారు ధన్యులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుణ్ణి మహిమపరిచేవారు ధన్యులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక ప్రాచీన సవాలు
  • నేడు మన ఆరాధనకు ఎదురయ్యే సవాళ్లు
  • లొంగిపోవడమా లేక ఎదురుదాడి చేయడమా?
  • రాజ్య ప్రచారకులుగా దేవుణ్ణి మహిమపరచడం
  • “కార్యానుకూలమైన మంచి సమయము”
  • మీరు దేవుని మహిమను ప్రతిఫలింపజేస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు?
    యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు?
  • పయినీర్లు అర్పించి, ఆశీర్వాదాలను పొందుతారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • పయినీరు సేవ—మీరు చేయగలరా?
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
w04 6/1 పేజీలు 14-19

దేవుణ్ణి మహిమపరిచేవారు ధన్యులు

“అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. నీ నామమును ఘనపరచుదురు.”—కీర్తన 86:10.

1. నిర్జీవ సృష్టికంటే మిన్నయైన రీతుల్లో మనమెందుకు దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం?

యెహోవా తాను సృష్టించిన యావత్‌ సృష్టిచే స్తుతింపబడదగినవాడు. నిర్జీవ సృష్టి మౌనంగా ఆయనను మహిమపరుస్తుండగా, మానవులమైన మనకు తర్కించే, గ్రహించే, కృతజ్ఞత చూపించే, ఆరాధించే సామర్థ్యముంది. కాబట్టి “సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి” అని కీర్తనకర్త చెబుతున్నది మనకే.—కీర్తన 66:1, 2.

2. దేవుని నామాన్ని ఘనపరచమని ఇవ్వబడిన ఆజ్ఞకు ఎవరు ప్రతిస్పందించారు, ఎందుకు?

2 మానవుల్లో అత్యధికులు దేవుణ్ణి గుర్తించేందుకు లేదా ఆయనను మహిమపరచేందుకు నిరాకరిస్తున్నారు. అయితే 235 దేశాల్లో 60 లక్షలకుపైగా ఉన్న యెహోవాసాక్షులు తాము దేవుడు చేసిన వాటి ద్వారా ఆయన ‘అదృశ్య లక్షణాలు’ చూస్తున్నామని, సృష్టి ఇస్తున్న మౌన సాక్ష్యాన్ని తాము ‘వింటున్నామని’ చూపిస్తున్నారు. (రోమీయులు 1:20; కీర్తన 19:2, 3) బైబిలు అధ్యయనం ద్వారా వారు యెహోవాను తెలుసుకొని ఆయనను ప్రేమించడం కూడా నేర్చుకున్నారు. కీర్తన 86:9, 10 ముందుగానే ఇలా చెప్పింది: “ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు. నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. నీ నామమును ఘనపరచుదురు.”

3. ‘గొప్పసమూహం’ ఎలా ‘రాత్రింబగళ్లు సేవచేస్తోంది’?

3 అదే విధంగా, ఆరాధకుల ‘గొప్పసమూహం రాత్రింబగళ్లు దేవుని ఆలయంలో సేవచేస్తున్నట్లు’ ప్రకటన 7:9, 15 వర్ణిస్తోంది. అంటే దేవుడు అక్షరార్థంగా తన సేవకుల నుండి నిర్విరామ స్తుతిని కోరుతున్నాడని కాదుగానీ ఆయన ఆరాధకులు ఒక భూవ్యాప్త సంస్థగా ఉంటారని దానర్థం. కాబట్టి కొన్ని దేశాల్లో రాత్రిసమయమైనప్పుడు, భూగోళానికి అవతలివైపునవున్న దేవుని సేవకులు సాక్ష్యపుపనిలో మునిగి ఉంటారు. అందువల్ల యెహోవాను మహిమపరిచేవారిపై సూర్యుడస్తమించడని చెప్పవచ్చు. త్వరలోనే “సకలప్రాణులు” తమ గళమెత్తి యెహోవాను స్తుతిస్తారు. (కీర్తన 150:6) అయితే ఈలోగా యెహోవాను మహిమపరచడంలో వ్యక్తిగతంగా మనమేమి చేయవచ్చు? మనకెలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు? దేవుణ్ణి మహిమపరచేవారి కోసం ఎలాంటి ఆశీర్వాదాలు వేచివున్నాయి? వీటికి జవాబుగా ఇశ్రాయేలీయుల్లో గాదు గోత్రానికి సంబంధించిన బైబిలు వృత్తాంతాన్ని మనం పరిశీలిద్దాం.

ఒక ప్రాచీన సవాలు

4. గాదు గోత్రానికి ఎలాంటి సవాలు ఎదురైంది?

4 వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి ముందు, ఇశ్రాయేలీయుల గాదు గోత్రపు సభ్యులు యొర్దానుకు తూర్పున మందలకు తగిన ప్రదేశంలో స్థిరపడడానికి తమను అనుమతించాలని కోరారు. (సంఖ్యాకాండము 32:1-5) అక్కడ నివసించడమంటే తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడమని అర్థం. పశ్చిమాన స్థిరపడే గోత్రాలకు యొర్దాను లోయ సైనిక దాడులకు సహజ అడ్డంకుగా ఉండి వారిని రక్షిస్తుంది. (యెహోషువ 3:13-17) అయితే యొర్దానుకు తూర్పున ఉన్న ప్రదేశాల గురించి జార్జ్‌ ఆడమ్‌ స్మిత్‌ వ్రాసిన ద హిస్టారికల్‌ జియోగ్రఫీ ఆఫ్‌ ద హోలీ ల్యాండ్‌ ఇలా చెబుతోంది: “[ఆ ప్రాంతాలన్నీ] గొప్ప అరేబియా పీఠభూమిపై ఎలాంటి అవాంతరాల్లేని చదునైన సువిశాల ప్రాంతాలుగా ఉన్నాయి. అందువల్ల అన్ని కాలాల్లో అవి ఆశబోతులైన సంచారజాతుల దురాక్రమణకు గురవుతూ ఉండేవి. పచ్చిక కోసం ఆ సంచార జాతులు కొన్ని మూకుమ్మడిగా ప్రతీ సంవత్సరం ఆ ప్రాంతాలపై విరుచుకుపడేవి.”

5. ముట్టడి వేయబడినప్పుడు ఎలా ప్రతిస్పందించాలని గాదు సంతతివారిని యాకోబు ప్రోత్సహించాడు?

5 అలాంటి ఎడతెగని ఒత్తిడిని గాదు గోత్రం ఎలా ఎదుర్కొంటుంది? శతాబ్దాల పూర్వం, వారి పితరుడైన యాకోబు తన మరణశయ్యపై ఇలా ప్రవచించాడు: “బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును.” (ఆదికాండము 49:19) పైకి ఆ మాటలు కృంగదీసేవిగా అనిపించవచ్చు. కానీ ఆ మాటలు వాస్తవానికి గాదీయులు ఎదురుదాడికి దిగాలని ఆజ్ఞాపించాయి. వారలా చేస్తే, ముట్టడిదారులు పారిపోతారని అప్పుడు గాదీయులు వారిని తరిమికొట్టవచ్చని యాకోబు వారికి హామీ ఇచ్చాడు.

నేడు మన ఆరాధనకు ఎదురయ్యే సవాళ్లు

6, 7. నేటి క్రైస్తవుల పరిస్థితి కూడా ఏ విధంగా గాదు గోత్రపు పరిస్థితిలానే ఉంది?

6 గాదు గోత్రంవలె నేడు క్రైస్తవులు సాతాను విధానపు ఒత్తిళ్లకు, చిక్కులకు గురవుతున్నారు; వాటినుండి మనల్ని కాపాడే అద్భుత అభయమేదీ లేదు. (యోబు 1:10-12) మనలో చాలామందిమి పాఠశాలకు హాజరవడం, జీవనోపాధి సంపాదించుకోవడం, పిల్లల్ని పెంచడం వంటి వాటివల్ల తలెత్తే ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నాము. వాటికితోడు మనకు వ్యక్తిగత లేదా అంతరంగ సంబంధమైన ఒత్తిళ్లు ఉండనే ఉన్నాయి. తీవ్ర అంగవైకల్యం లేదా రుగ్మత రూపంలో కొందరు ‘శరీరములో ఒక ముల్లును’ భరించక తప్పడం లేదు. (2 కొరింథీయులు 12:7-10) మరికొందరు తమకెలాంటి విలువా లేదనే భావాలతో నలుగుతున్నారు. ఒకప్పటిలా బలంకలిగి యెహోవాను సేవించకుండా వృద్ధాప్యపు “దుర్దినములు” వృద్ధ క్రైస్తవులను అడ్డుకోవచ్చు.—ప్రసంగి 12:1.

7 మనం “ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో . . . పోరాడుచున్నాము” అని కూడా అపొస్తలుడైన పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. (ఎఫెసీయులు 6:12) మనం తదేకంగా “లౌకికాత్మను” అంటే సాతాను అతని దయ్యాలు పురికొల్పుతున్న తిరుగుబాటు స్వభావాన్ని, నైతిక భ్రష్టతను ఎదుర్కొంటున్నాము. (1 కొరింథీయులు 2:12; ఎఫెసీయులు 2:2, 3) దైవభక్తిగల లోతువలె మన చుట్టూవున్న ప్రజలు మాట్లాడే, చేసే అనైతిక క్రియలనుబట్టి మనం నేడు బాధపడుతుండవచ్చు. (2 పేతురు 2:7) అలాగే మనం సాతాను నేరుగా చేసే దాడికి గురవుతాము. “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన” అభిషిక్త శేషంతో సాతాను యుద్ధం చేస్తున్నాడు. (ప్రకటన 12:17) నిషేధాలు, హింసల రూపంలో యేసు “వేరే గొఱ్ఱెలు” కూడా సాతాను దాడికి గురవుతున్నారు.—యోహాను 10:16.

లొంగిపోవడమా లేక ఎదురుదాడి చేయడమా?

8. సాతాను దాడులకు మనమెలా ప్రతిస్పందించాలి, ఎందుకు?

8 సాతాను దాడులకు మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? ప్రాచీన గాదు గోత్రంవలె మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండి దేవుని నిర్దేశాలకు అనుగుణంగా ఎదురుదాడి చేయాలి. కొందరు తమ ఆధ్యాత్మిక బాధ్యతలను నిర్లక్ష్యంచేస్తూ జీవన ఒత్తిళ్లకు తలవంచడం శోచనీయం. (మత్తయి 13:20-22) సంఘంలో కూటాల హాజరు తగ్గిపోవడానికి కారణమేమిటో ఒక సాక్షి ఇలా చెప్పాడు: “సహోదరులు అలసిపోతున్నారు. వారంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.” నిజమే, నేడు ప్రజలు అలసిపోవడానికి చాలా కారణాలున్నాయి. అందువల్ల, దేవుని ఆరాధనను మరో ఒత్తిడిగా, భారమైన బాధ్యతగా దృష్టించడం సులభమే. అయితే అది సముచితమైన లేదా సరైన దృక్పథమేనా?

9. క్రీస్తు కాడిని ఎత్తుకోవడం విశ్రాంతికి ఎలా నడిపిస్తుంది?

9 అలాంటి జీవన ఒత్తిళ్లవల్ల అలసిపోయిన తన కాలంలోని జనసమూహాలకు యేసు ఏమి చెప్పాడో పరిశీలించండి: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” ఒక వ్యక్తి తాను దేవునికి చేసే సేవను తగ్గించడం ద్వారా ఆ విశ్రాంతి కలుగుతుందని యేసు సూచించాడా? దానికి భిన్నంగా యేసు ఇలా చెప్పాడు: “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.” ఆ కాడి మనిషి లేదా పశువు ఎక్కువ బరువు మోయడానికి వీలుగా చేయబడిన చెక్క లేదా లోహపు చట్రమై ఉంటుంది. మరి, అలాంటి కాడిని మోయాలని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? మనమిప్పటికే ‘భారం మోయడం’ లేదా? అది నిజమే, అయితే ఆ వచనాన్ని గ్రీకులో ఇలా కూడా చదవవచ్చు: “నాతోపాటు నా కాడి క్రిందికి రండి.” కొంచెం ఆలోచించండి: మన భారం మోయడంలో మనకు సహాయం చేస్తానని యేసు చెబుతున్నాడు! మన సొంత బలంతో మనమా పని చేయనవసరం లేదు.—మత్తయి 9:36; 11:28, 29; 2 కొరింథీయులు 4:7.

10. దేవుణ్ణి మహిమపరిచే మన ప్రయత్నాలకు ఎలాంటి ఫలితాలు వస్తాయి?

10 శిష్యులుగా ఉండడమనే ఆ కాడిని మనం ఎత్తుకున్నప్పుడే, మనం సాతానుకు విరుద్ధంగా పోరాడుతున్నట్లవుతుంది. “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును” అని యాకోబు 4:7 వాగ్దానం చేస్తోంది. అలా ఎదిరించడం సులభమని దానర్థం కాదు. దేవుణ్ణి సేవించడానికి తగిన కృషి అవసరం. (లూకా 13:24) అయితే కీర్తన 126:5లో బైబిలు ఈ వాగ్దానం చేస్తోంది: “కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.” అవును, మనం కృతజ్ఞతలేని దేవుణ్ణి ఆరాధించడం లేదు. ఆయన ‘తనను వెదకేవారికి ఫలం దయచేయువాడును,’ తనను మహిమపరచేవారిని ఆశీర్వదించేవాడునై ఉన్నాడు.—హెబ్రీయులు 11:6.

రాజ్య ప్రచారకులుగా దేవుణ్ణి మహిమపరచడం

11. క్షేత్ర పరిచర్య సాతాను దాడులను తిప్పికొట్టడానికి ఎలా సహాయం చేస్తుంది?

11 “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు ఆజ్ఞాపించాడు. ప్రకటనా పని దేవునికి “స్తుతియాగము” అర్పించే ఒక ప్రాథమిక మార్గం. (మత్తయి 28:19; హెబ్రీయులు 13:15) మన ‘పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొనడం’ మన ‘సర్వాంగకవచంలో’ అంటే సాతాను దాడులను తిప్పికొట్టడంలో ఒక ఆవశ్యక భాగమైయుంది. (ఎఫెసీయులు 6:11-15) క్షేత్ర పరిచర్యలో దేవుణ్ణి స్తుతించడం మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఒక చక్కని విధానం. (2 కొరింథీయులు 4:13) అది మన మనస్సులను ప్రతికూల తలంపులకు దూరంగా ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది. (ఫిలిప్పీయులు 4:8) క్షేత్ర పరిచర్యలో భాగం వహించడం తోటి ఆరాధకులతో మనం క్షేమాభివృద్ధికరమైన సహవాసం అనుభవించేలా చేస్తుంది.

12, 13. క్రమంగా క్షేత్ర పరిచర్యలో భాగం వహించడం కుటుంబాలకు ఎలా ప్రయోజనకరం కాగలదు? ఉదహరించండి.

12 ప్రకటనా పని ఆరోగ్యకరమైన కుటుంబ కార్యక్రమంగా కూడా ఉండవచ్చు. నిజానికి, యౌవనులకు సమతుల్యమైన వినోదం కూడా అవసరం. అందుకని, కుటుంబంగా క్షేత్ర పరిచర్యలో పాల్గోవడమనేది ఒక బలవంతపు పనిగా ఉండకూడదు. పరిచర్యలో ఫలవంతంగా ఉండడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ పరిచర్యను మరింత ఆనందదాయకమైనదిగా చేయవచ్చు. యౌవనులు తాము చక్కగా చేసే పనులనుబట్టి సంతోషపడరా? యౌవనుల శక్తికి మించినది వారినుండి ఆశించకుండా, తల్లిదండ్రులు సమతుల్యం చూపిస్తూ పరిచర్యలో ఆనందించడానికి వారికి సహాయం చేయవచ్చు.—ఆదికాండము 33:13, 14.

13 అంతేకాకుండా, కలిసి దేవుణ్ణి స్తుతించే కుటుంబం సన్నిహిత బంధాల్ని వృద్ధిచేస్తుంది. ఒక సహోదరి ఉదాహరణను పరిశీలించండి, అవిశ్వాసియైన ఆమె భర్త, ఆమెనూ ఆమె ఐదుగురు పిల్లలనూ వదిలి వెళ్లిపోయాడు. అందువల్ల, ఆమెకు ఉద్యోగంలో చేరి పిల్లలను పోషించుకోవడమనే సవాలు ఎదురయ్యింది. అంతమాత్రాన తన పిల్లల ఆధ్యాత్మిక విషయాలను నిర్లక్ష్యం చేసేంతగా ఆమె అలసిపోయిందా? ఆమె ఇలా గుర్తుచేసుకుంటోంది: “నేను బైబిలును, బైబిలు సాహిత్యాలను శ్రద్ధగా అధ్యయనంచేసి నేను చదివింది అన్వయించుకోవడానికి ప్రయత్నించాను. క్రమంగా నేను పిల్లలను కూటాలకు, ఇంటింటి పరిచర్యకు తీసుకెళ్లాను. నా ప్రయత్నాల ఫలితాలు ఎలావున్నాయి? నా ఐదుగురు పిల్లలు బాప్తిస్మం తీసుకున్నారు.” అదేవిధంగా పరిచర్యలో పూర్తిగా పాల్గొనడం మీ పిల్లలను యెహోవా “శిక్షలోను బోధలోను” పెంచడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మీకు సహాయం చేయగలదు.—ఎఫెసీయులు 6:4.

14. (ఎ) యౌవనులు పాఠశాలలో దేవుణ్ణి ఎలా మహిమపరచవచ్చు? (బి) ‘సువార్త గురించి సిగ్గుపడకుండా’ ఉండడానికి యౌవనులకు ఏది సహాయం చేయగలదు?

14 యౌవనులారా, మతం గురించి చర్చించడాన్ని చట్టం అనుమతిస్తున్న దేశాల్లో మీరు ఒకవేళ నివసిస్తుంటే, పాఠశాలలో సాక్ష్యమిస్తూ మీరు దేవుణ్ణి మహిమపరుస్తున్నారా లేక మనుష్య భయంతో వెనుకంజ వేస్తున్నారా? (సామెతలు 29:25) ప్యూర్టోరికోలోని 13 సంవత్సరాల ఒక సాక్షి ఇలా వ్రాస్తోంది: “పాఠశాలలో ప్రకటించడానికి నేనెన్నడూ కలత చెందలేదు ఎందుకంటే నా దగ్గర సత్యముందని నాకు తెలుసు. తరగతిలో నేను అన్ని సందర్భాల్లో చెయ్యెత్తి బైబిలు నుండి నేను నేర్చుకున్నది చెబుతాను. నాకు ఖాళీ దొరికినప్పుడు, యువత అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) పుస్తకం తీసుకువెళ్లి గ్రంథాలయంలో చదువుకుంటాను.”a మరి యెహోవా ఆమె ప్రయత్నాలను ఆశీర్వదించాడా? ఆమె ఇలా చెబుతోంది: “కొన్నిసార్లు తోటి విద్యార్థులు ప్రశ్నలు వేయడమే కాకుండా ఆ పుస్తకపు ప్రతి కావాలని కూడా అడుగుతారు.” ఈ విషయంలో మీరొకవేళ వెనుకంజ వేస్తున్నట్లయితే, శ్రద్ధగా వ్యక్తిగత అధ్యయనం చేస్తూ, “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో” మీకై మీరు పరీక్షించి తెలుసుకోవాలి. (రోమీయులు 12:2) మీరు నేర్చుకున్నది సత్యమని ఒప్పించబడినప్పుడు, మీరెన్నటికీ ‘సువార్త గురించి సిగ్గుపడరు.’—రోమీయులు 1:16.

“కార్యానుకూలమైన మంచి సమయము”

15, 16. కొందరు క్రైస్తవులు ‘కార్యానుకూలమైన మంచి సమయాన్ని’ ఎలా సద్వినియోగం చేసుకున్నారు, దానివల్ల ఎలాంటి ఆశీర్వాదాలు లభించాయి?

15 “కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 16:9) అదనపు సేవ చేపట్టడానికి మీ పరిస్థితులు అనుమతిస్తున్నాయా? ఉదాహరణకు, క్రమ లేదా సహాయ పయినీరు సేవచేయడానికి ప్రతీ నెల ప్రకటనా పనికి 70 లేదా 50 గంటలు వెచ్చించాల్సి ఉంటుంది. అందువల్ల తోటి క్రైస్తవులు నమ్మకంగా సేవచేస్తున్న పయినీర్లను సహజంగానే అమూల్యమైన వారిగా పరిగణిస్తారు. అయితే పరిచర్యలో ఎక్కువ సమయం గడపడం వారిని తోటి సహోదర సహోదరీలకంటే ఉన్నతులని భావించేలా చేయదు. బదులుగా, వారు “మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని” చెప్పేలా, యేసు ప్రోత్సహించిన దృక్పథాన్నే అలవరచుకుంటారు.—లూకా 17:10.

16 పయినీరు సేవకు స్వీయ క్రమశిక్షణ, వ్యక్తిగత వ్యవస్థీకరణ, త్యాగాలు చేసే అభీష్టత ఉండాలి. అయితే లభించే ఆశీర్వాదాల దృష్ట్యా అవి చేయదగ్గవే. “సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించగలగడం నిజంగా ఆశీర్వాదకరం. పయినీరు సేవచేస్తున్నప్పుడు మనం బైబిలును విరివిగా ఉపయోగిస్తాం. ఇప్పుడు నేను ఇంటింటి సేవకు వెళ్లేటప్పుడు ప్రతీ ఇంటివారి కోసం సముచితమైన లేఖనాల గురించి ఆలోచించగలను” అని టామికా అనే యువ పయినీరు చెబుతోంది. (2 తిమోతి 2:15) మైకే అనే పయినీరు ఇలా చెబుతోంది: “ప్రజల జీవితాలను సత్యమెలా ప్రభావితం చేస్తుందో చూడడం మరో అద్భుతమైన ఆశీర్వాదం.” అదే విధంగా, “ఒక వ్యక్తి సత్యంలోకి రావడాన్ని చూడడం” వల్ల కలిగే ఆనందం గురించి మాట్లాడుతూ మాథ్యూ అనే యువకుడు, “అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు” అని చెబుతున్నాడు.

17. పయినీరు సేవ గురించిన ప్రతికూల భావాలను ఒక సహోదరి ఎలా అధిగమించింది?

17 పయినీరు సేవ చేపట్టే విషయం మీరు ఆలోచించగలరా? అలా చేయాలని మీరు అభిలషిస్తుండవచ్చు, అయితే నేను అందుకు తగినవాడిని కానేమోనని బహుశా భావిస్తుండవచ్చు. “పయినీరు సేవ విషయంలో నాకు ప్రతికూల భావాలుండేవి. ఆ సేవకు తగిన సామర్థ్యం నాకుందని నేననుకోలేదు. ఉపోద్ఘాతాలు ఎలా సిద్ధపడాలో లేఖనాల నుండి ఎలా తర్కించాలో నాకు తెలియదు” అని కెన్‌యెట్టీ అనే యువ సహోదరి ఒప్పుకుంటోంది. అయితే ఆమెతో కలిసి పనిచేయడానికి పరిణతి చెందిన ఒక పయినీరు సహోదరిని పెద్దలు నియమించారు. “ఆమెతో కలిసి పనిచేయడం సరదాగా ఉండేది. అదే నేనూ పయినీరు సేవచేయాలని కోరుకొనేలా చేసింది” అని కెన్‌యెట్టీ గుర్తుచేసుకుంటోంది. కొంత ప్రోత్సాహం, శిక్షణతో బహుశా మీరు కూడా పయినీరు సేవచేయాలని కోరుకోవచ్చు.

18. మిషనరీ సేవలో ప్రవేశించే వారికి ఎలాంటి ఆశీర్వాదాలు లభించవచ్చు?

18 పయినీరు సేవ ఇతర సేవాధిక్యతలు చేపట్టడానికి మీకు సహాయం చేయవచ్చు. ఉదాహరణకు, కొంతమంది దంపతులు విదేశాల్లో ప్రకటించడానికి పంపబడేలా మిషనరీ శిక్షణ పొందడానికి అర్హులు కావచ్చు. మిషనరీలు కొత్త దేశపు పరిస్థితులకు, బహుశా కొత్త భాషకు, సంస్కృతికి, కొత్తరకపు ఆహారాలకు అలవాటు పడాలి. అయితే తత్ఫలితంగా లభించే ఆశీర్వాదాలు అలాంటి అననుకూలతల్ని మటుమాయం చేస్తాయి. మెక్సికోకు చెందిన, మిల్‌డ్రెడ్‌ అనే అనుభవజ్ఞురాలైన మిషనరీ ఇలా చెబుతోంది: “మిషనరీనవ్వాలనే నా నిర్ణయం విషయంలో నేనెన్నడూ చింతించలేదు. చిన్నప్పటి నుండే నాకు ఆ కోరిక ఉంది.” ఆమె ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవించింది? “నా స్వదేశంలో ఒక బైబిలు అధ్యయనం దొరకడమే కష్టంగా ఉండేది. ఇక్కడ ఒకేసారి నలుగురు బైబిలు విద్యార్థులు కొత్తగా క్షేత్రసేవను ఆరంభించేలా సహాయంచేసిన అనుభవం నాకు లభించింది!”

19, 20. బెతెల్‌ సేవ, అంతర్జాతీయ సేవ, పరిచర్యా శిక్షణ పాఠశాల అనేకులకు ఎలాంటి ఆశీర్వాదాలు తెచ్చాయి?

19 యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లో బెతెల్‌ సేవచేసే వారికి కూడా ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. జర్మనీలో సేవచేస్తున్న యువ సహోదరుడైన స్వెన్‌ బెతెల్‌లో తన పని గురించి ఇలా చెబుతున్నాడు: “నేను శాశ్వత విలువగల పని చేస్తున్నానని భావిస్తున్నాను. నా నైపుణ్యాలను నేను లోకంలో ఉపయోగించగలిగే వాణ్ణే. అయితే అది దివాలా తీయబోయే బ్యాంక్‌లో డబ్బు దాచుకున్నట్టుగా ఉంటుంది.” అవును, జీతంలేని స్వచ్ఛంద సేవకునిగా పనిచేయడంలో త్యాగం ఇమిడివుంది. కానీ స్వెన్‌ ఇలా అంటున్నాడు: “మీరు ఇంటికి వెళ్లినప్పుడు ఆ రోజు మీరు చేసిందంతా యెహోవా కోసమే చేశారని మీకు తెలుసు. అది మీలో ‘అద్భుతమైన’ భావం కలుగజేస్తుంది.”

20 కొంతమంది సహోదరులు విదేశాల్లో బ్రాంచి నిర్మాణ పనికి సంబంధించి అంతర్జాతీయ సేవచేసే ఆశీర్వాదం అనుభవించారు. ఎనిమిది అంతర్జాతీయ నియామకాల్లో సేవచేసిన ఒక వివాహిత జంట ఇలా వ్రాశారు: “ఇక్కడి సహోదరులు అద్భుతమైనవారు. వీరిని విడిచివెళ్లడానికి మా గుండెలు తరుక్కుపోతున్నాయి—ఇలా మా గుండెలు ‘తరుక్కుపోవడం’ ఇది ఎనిమిదవసారి. మాకు కలిగిన అనుభవం నిజంగా అత్యద్భుతం!” ఇకపోతే పరిచర్యా శిక్షణ పాఠశాల. ఇది అర్హులైన అవివాహిత సహోదరులకు ఆధ్యాత్మిక శిక్షణ అందిస్తుంది. ఒక పట్టభద్రుడు ఇలా వ్రాశాడు: “ఇంత అద్భుతమైన పాఠశాల విషయంలో మీకు కృతజ్ఞతలు చెప్పడానికి నాకు మాటలు చాలడం లేదు. శిక్షణ ఇవ్వడానికి ఏ ఇతర సంస్థ ఇంత ప్రయాసపడుతుంది?”

21. క్రైస్తవులందరూ దేవునికి తాముచేసే సేవలో ఎలాంటి సవాలును ఎదుర్కొంటారు?

21 అవును, కార్యానుకూల ద్వారాలు ఎన్నో తెరిచివున్నాయి. మనలో చాలామందికి బెతెల్‌లో లేదా విదేశాల్లో సేవచేయడం కుదరకపోవచ్చనే విషయాన్ని ఒప్పుకోవల్సిందే. విభిన్న పరిస్థితులనుబట్టి క్రైస్తవులు విభిన్న మొత్తాల్లో ‘ఫలిస్తారని’ స్వయంగా యేసే అంగీకరించాడు. (మత్తయి 13:23) కాబట్టి క్రైస్తవులుగా మనకున్న సవాలేమంటే మన పరిస్థితిని చక్కగా సద్వినియోగం చేసుకోవడమే అంటే మన పరిస్థితులు అనుమతించిన మేరకు యెహోవా సేవలో పూర్తిగా భాగం వహించడమే. మనమలా చేసినప్పుడు, మనం యెహోవాను మహిమపరుస్తున్న వారిగా ఉంటాం, అందుకు ఆయన సంతోషిస్తున్నాడనే నమ్మకంతో మనముండవచ్చు. ఒక నర్సింగ్‌ హోమ్‌లో ఉన్న ఎథెల్‌ అనే వృద్ధ సహోదరి విషయమే పరిశీలించండి. ఆమె నర్సింగ్‌ హోమ్‌లో తనతోపాటు ఉన్నవారికి క్రమం తప్పకుండా సాక్ష్యమివ్వడమే కాక టెలిఫోన్‌ సాక్ష్యపు పనిలో కూడా భాగం వహిస్తుంది. ఆమెకు పరిమితులున్నా పూర్ణాత్మతో సేవ చేస్తోంది.—మత్తయి 22:37.

22. (ఎ) మనమింకా ఎలాంటి అదనపు విధానాల్లో దేవునికి మహిమ తీసుకురాగలం? (బి) మన కోసం ఎలాంటి అద్భుతమైన కాలం వేచివుంది?

22 అయితే యెహోవాకు మహిమను తీసుకురావడంలో ప్రకటించడమనేది కేవలం ఒక విధానమేనని గుర్తుంచుకోండి. ఉద్యోగ స్థలంలో, పాఠశాలలో, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన ప్రవర్తనలో, కనబడే తీరులో ఆదర్శప్రాయంగా ఉండడం ద్వారా మనం యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తాం. (సామెతలు 27:11) సామెతలు 28:20 ఇలా వాగ్దానం చేస్తోంది: “నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును.” కాబట్టి ఆశీర్వాదాలు సమృద్ధిగా లభిస్తాయని తెలుసుకొని మనం దేవునికి చేసే సేవలో ‘సమృద్ధిగా విత్తాలి.’ (2 కొరింథీయులు 9:6) మనమలా చేస్తుండగా, “సకలప్రాణులు” యెహోవాను మహిమపరిచే ఆ అద్భుతకాలంలో సజీవంగా ఉండే ఆధిక్యత మనకు లభిస్తుంది, అలా మహిమపరచబడడానికి ఆయన సంపూర్ణంగా అర్హుడు!—కీర్తన 150:6.

[అధస్సూచి]

a యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకం యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరు జ్ఞాపకం తెచ్చుకుంటారా?

• దేవుని ప్రజలు యెహోవాను “రాత్రింబగళ్లు” ఎలా సేవిస్తున్నారు?

• గాదు గోత్రానికి ఎలాంటి సవాలు ఎదురైంది, అది నేడు క్రైస్తవులకు ఏమి బోధిస్తోంది?

• సాతాను దాడులకు వ్యతిరేకంగా క్షేత్ర పరిచర్య ఎలా ఒక రక్షణగా పనిచేస్తుంది?

• కొందరు ఎలాంటి సేవాధిక్యతలు చేపట్టారు, వారు ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవించారు?

[15వ పేజీలోని చిత్రం]

గాదీయులు బంటుల గుంపుకు వ్యతిరేకంగా పోరాడినట్లే, క్రైస్తవులు సాతాను దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి

[17వ పేజీలోని చిత్రం]

క్షేత్ర పరిచర్యలో మనం క్షేమాభివృద్ధికరమైన సహవాసం ఆస్వాదిస్తాం

[18వ పేజీలోని చిత్రాలు]

పయినీరు సేవ ఇతర సేవాధిక్యతలకు అవకాశమిస్తుంది, వాటిలో ఈ క్రిందివి ఉన్నాయి:

1. అంతర్జాతీయ సేవ

2. బెతెల్‌ సేవ

3. మిషనరీ సేవ

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి