‘బాధ కలుగునప్పుడు యెహోవాయే మన ఆశ్రయదుర్గము’
“యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము; బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము.”—కీర్తన 37:39.
1, 2. (ఎ) యేసు తన శిష్యుల పక్షాన ఏమని ప్రార్థించాడు? (బి) తన ప్రజల విషయంలో దేవుని చిత్తమేమిటి?
యెహోవా సర్వశక్తిమంతుడు. తన నమ్మకమైన ఆరాధకులను తనకిష్టమైన రీతిలో రక్షించగల శక్తి ఆయనకుంది. అవసరమైతే ఆయన తన ప్రజలను భౌతికంగా ఈ లోకం నుండి వేరుచేసి ఒక సురక్షితమైన, ప్రశాంతమైన ప్రదేశంలో వారిని ఉంచగలడు. అయితే యేసు తన శిష్యుల గురించి తన పరలోకపు తండ్రినిలా ప్రార్థించాడు: “నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను.”—యోహాను 17:15.
2 యెహోవా మనలను ఈ “లోకం నుండి” తీసికొని పోవడానికి తీర్మానించలేదు. బదులుగా, తన నిరీక్షణా ఓదార్పుల సందేశాన్ని ప్రకటించడానికి ఈ లోకపు ప్రజలమధ్య మనం జీవించాలనేదే ఆయన చిత్తం. (రోమీయులు 10:13-15) అయితే యేసు తన ప్రార్థనలో మనమీ లోకంలో జీవిస్తున్నప్పుడు “దుష్టుని” దాడికి గురవుతామని సూచించాడు. అవిధేయులైన మానవులు, దుష్టాత్మలు తీవ్రమైన బాధను, వేదనను కలుగజేస్తారు కాబట్టి క్రైస్తవులు కష్టాలకు అతీతులు కారు.—1 పేతురు 5:9.
3. యెహోవా నమ్మకమైన ఆరాధకులు సహితం ఏ వాస్తవిక పరిస్థితిని ఎదుర్కోవాలి, అయితే దేవుని వాక్యంలో మనకు ఎలాంటి ఓదార్పు ఉంది?
3 అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు తాత్కాలికంగా నిరుత్సాహపడడం సహజమే. (సామెతలు 24:10) దుర్దశ అనుభవించిన నమ్మకస్థుల ఉదాహరణలు బైబిల్లో అనేకం ఉన్నాయి. “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును” అని కీర్తనకర్త చెబుతున్నాడు. (కీర్తన 34:19) అవును, ‘నీతిమంతులకు’ సహితం కష్టాలు తప్పవు. కీర్తనకర్త దావీదులాగే కొన్నిసార్లు మనం ‘సొమ్మసిల్లి బహుగా నలిగిపోవచ్చు’ కూడా. (కీర్తన 38:8) అయినప్పటికీ “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” అని తెలుసుకోవడం ఓదార్పునిస్తుంది.—కీర్తన 34:18; 94:19.
4, 5. (ఎ) సామెతలు 18:10కి అనుగుణంగా, దేవుని రక్షణను చవిచూడాలంటే మనమేమి చేయాలి? (బి) దేవుని సహాయం పొందడానికి మనం తీసుకోగల కొన్ని ప్రాముఖ్యమైన చర్యలేవి?
4 యేసు ప్రార్థనకు అనుగుణంగా, యెహోవా నిజంగా మనల్ని కాపాడతాడు. మనకు “బాధ కలుగునప్పుడు” ఆయనే మనకు “ఆశ్రయ దుర్గము.” (కీర్తన 37:39) “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును” అని చెబుతున్నప్పుడు సామెతల గ్రంథం కూడా అలాంటి భావాన్నే వ్యక్తం చేస్తోంది. (సామెతలు 18:10) తన సృష్టి ప్రాణులపట్ల యెహోవాకున్న వాత్సల్యపూరిత సత్యాన్ని గురించి ఈ లేఖనం ఒక ప్రాథమిక సత్యాన్ని వెల్లడి చేస్తోంది. ఆశ్రయం కోసం మనమొక బలమైన దుర్గములోకి పరుగెత్తుతున్నట్లుగా, యెహోవాను క్రియాశీలంగా వెదికే నీతిమంతులను ఆయన కాపాడతాడు.
5 కృంగదీసే సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, మనం రక్షణకై యెహోవా దగ్గరకు ఎలా పరుగెత్తగలము? యెహోవా సహాయం పొందడానికి మనం తీసుకోగల ప్రాముఖ్యమైన మూడు చర్యల్ని పరిశీలిద్దాం. మొదటిది, మనం మన పరలోకపు తండ్రికి ప్రార్థించాలి. రెండవది, మనం ఆయన పరిశుద్ధాత్మకు అనుగుణంగా పనిచేయాలి. మూడవది, మన బాధను తక్కువచేయగల మన తోటి క్రైస్తవులతో సహవసించడం ద్వారా యెహోవా ఏర్పాటుకు లోబడాలి.
ప్రార్థనా శక్తి
6. నిజ క్రైస్తవులు ప్రార్థనను ఎలా దృష్టిస్తారు?
6 కొంతమంది ఆరోగ్య నిపుణులు ప్రార్థనను కృంగుదలకు, ఒత్తిడికి చికిత్సగా సిఫారసు చేస్తారు. ప్రార్థనలాంటి ప్రశాంతమైన ధ్యానం ఒత్తిడిని తక్కువ చేయడం సత్యమైనప్పటికీ, ప్రకృతిలోని కొన్నిరకాల శబ్దాలు వినడం లేదా వీపు మర్దన చేయించుకోవడం ద్వారా కూడా అలాగే ఉపశమనాన్ని పొందవచ్చని చెప్పవచ్చు. అయితే నిజ క్రైస్తవులు ప్రార్థనను ఉల్లాసం కలిగించే చికిత్సా విధానంగా దృష్టిస్తూ దానిని చులకన చేయరు. మనం ప్రార్థనను సృష్టికర్తతో చేసే పూజ్యభావంతో కూడిన సంభాషణగా దృష్టిస్తాం. ప్రార్థనలో మన భక్తి, దేవునిపై మన దృఢనమ్మకం ఇమిడివున్నాయి. అవును, ప్రార్థన మన ఆరాధనలో ఒక భాగం.
7. దృఢనమ్మకంతో ప్రార్థించడమంటే అర్థమేమిటి, అలాంటి ప్రార్థనలు కృంగుదలను తట్టుకోవడానికి మనకెలా సహాయం చేస్తాయి?
7 మన ప్రార్థనలు యెహోవాపై దృఢనమ్మకంతో లేదా ప్రగాఢ విశ్వాసంతో చేసేవిగా ఉండాలి. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.” (1 యోహాను 5:14) అద్వితీయుడూ, సర్వశక్తిగల దేవుడూ అయిన సర్వోన్నత ప్రభువగు యెహోవా తన ఆరాధకుల మనఃపూర్వక ప్రార్థనలకు నిజంగా ప్రత్యేక శ్రద్ధనిస్తాడు. మనం మన చింతల్ని, సమస్యల్ని విన్నవించుకున్నప్పుడు మన ప్రేమగల దేవుడు మన ప్రార్థనలు వింటాడని తెలుసుకోవడమే ఓదార్పుకరం.—ఫిలిప్పీయులు 4:6.
8. యెహోవాకు ప్రార్థించేటప్పుడు నమ్మకమైన క్రైస్తవులు ఎందుకు ఎన్నడూ భయపడకూడదు లేదా అనర్హులమని భావించకూడదు?
8 నమ్మకమైన క్రైస్తవులు యెహోవాకు ప్రార్థించేటప్పుడు ఎన్నడూ భయపడకూడదు, తాము అనర్హులమని భావించకూడదు లేదా వారిలో నమ్మకం లోపించకూడదు. నిజమే, మనం నిరుత్సాహపడినప్పుడు లేదా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు, ప్రార్థనలో యెహోవాను సమీపించేందుకు మనం అన్ని సందర్భాల్లో మొగ్గుచూపకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో యెహోవా ‘శ్రమనొందిన తన జనులయందు జాలిపడతాడనీ’ ‘దీనులను ఆదరిస్తాడనీ’ మనం గుర్తుంచుకోవడం మంచిది. (యెషయా 49:13; 2 కొరింథీయులు 7:6) ప్రత్యేకంగా మనం వేదనభరితమైన, కృంగిపోయిన సమయాల్లోనే మన ఆశ్రయ దుర్గమైన మన పరలోకపు తండ్రికి నమ్మకంగా ప్రార్థించాలి.
9. యెహోవాను ప్రార్థనాపూర్వకంగా సమీపించడంలో విశ్వాసం ఎలాంటి పాత్ర పోషిస్తుంది?
9 ప్రార్థనాధిక్యత నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే మనకు నిజమైన విశ్వాసం ఉండాలి. “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 11:6) విశ్వసించడమంటే కేవలం దేవుడు ఉనికిలో ‘ఉన్నాడని’ నమ్మడం కాదు. నిజమైన విశ్వాసంలో, దేవునికి విధేయత చూపిస్తూ, మనం సాగించే జీవన విధానానికి తగిన ప్రతిఫలమివ్వడానికి ఆయనకున్న సామర్థ్యంపై, అలా చేయాలన్న ఆయన అభీష్టంపై బలమైన నమ్మకం ఇమిడివుంది. “ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి.” (1 పేతురు 3:12) మనపట్ల యెహోవాకు ప్రేమపూర్వక శ్రద్ధవుందనే విషయం మన ప్రార్థనలకు ప్రత్యేక అర్థాన్నిస్తుంది.
10. మనం యెహోవా నుండి ఆధ్యాత్మిక ఆదరణ పొందాలంటే మన ప్రార్థనల విషయంలో ఏది నిజమై ఉండాలి?
10 మనం పూర్ణ హృదయంతో చేసినప్పుడు యెహోవా మన ప్రార్థనలు వింటాడు. కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను . . . నాకు ఉత్తరమిమ్ము.” (కీర్తన 119:145) అనేక మతాల్లోచేసే ఆచారబద్ధమైన ప్రార్థనల్లాగా మన ప్రార్థనలు కేవలం వాడుకగా లేదా అర్ధహృదయంతో చేసేవిగా ఉండవు. మనం “హృదయపూర్వకముగా” యెహోవాకు ప్రార్థించినప్పుడు మన మాటలకు అర్థం మరియు సంకల్పం చేకూరుతుంది. అలాంటి మనఃపూర్వక ప్రార్థనల తర్వాత, ‘యెహోవా మీద మన భారం’ మోపినందువల్ల కలిగే ఉపశమనాన్ని మనం అనుభవిస్తాము. బైబిలు వాగ్దానం చేస్తున్నట్లుగా ‘ఆయనే మనలను ఆదుకొనును.’—కీర్తన 55:22; 1 పేతురు 5:6, 7.
దేవుని ఆత్మ మన ఆదరణకర్త
11. సహాయం కోసం మనం యెహోవాను ‘అడిగినప్పుడు’ ఆయన మనకు సహాయం చేసే ఒక మార్గమేమిటి?
11 యెహోవా, ప్రార్థనలు వినడమే కాక జవాబు కూడా ఇస్తాడు. (కీర్తన 65:2) దావీదు ఇలా వ్రాశాడు: “నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱ పెట్టెదను.” (కీర్తన 86:7) దానికి అనుగుణంగానే యెహోవా సహాయం కోసం “అడుగుడి” అని యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు, ఎందుకంటే “పరలోకమందున్న . . . తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.” (లూకా 11:9-13) అవును, దేవుని చురుకైన శక్తి ఆయన ప్రజలకు ఒక సహాయకునిగా లేదా ఆదరణకర్తగా పనిచేస్తుంది.—యోహాను 14:16.
12. సమస్యలు మనల్ని ముంచెత్తుతున్నట్లు అనిపించినప్పుడు దేవుని ఆత్మ మనకెలా సహాయం చేయగలదు?
12 మనం పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు సహితం దేవుని ఆత్మ మనలో “బలాధిక్యము” నింపుతుంది. (2 కొరింథీయులు 4:7) ఒత్తిడిగల పరిస్థితులను సహించిన అపొస్తలుడైన పౌలు నమ్మకంగా ఇలా చెప్పగలిగాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీయులు 4:13) అదే విధంగా, నేడు చాలామంది క్రైస్తవులు తమ విజ్ఞాపనలకు జవాబుగా ఆధ్యాత్మికంగా, భావోద్రేకంగా బలం పుంజుకున్నట్లు భావించారు. దేవుని ఆత్మ సహాయం పొందిన తర్వాత, కృంగదీసే సమస్యలు ముంచెత్తుతున్నట్లుగా అనిపించవు. దేవుడిచ్చే ఈ బలాన్నిబట్టి మనం కూడా అపొస్తలునిలాగే ఇలా చెప్పగలం: “ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.”—2 కొరింథీయులు 4:8, 9.
13, 14. (ఎ) యెహోవా తన వాక్యం ద్వారా మన ఆశ్రయ దుర్గముగా ఎలా నిరూపించుకున్నాడు? (బి) బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం మీకు వ్యక్తిగతంగా ఎలా సహాయం చేసింది?
13 పరిశుద్ధాత్మ మన ప్రయోజనార్థమై దేవుని వాక్యాన్ని ప్రేరేపించింది, భద్రపరచింది. యెహోవా తన వాక్యం ద్వారా ఆపత్కాలాల్లో మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నట్లు ఎలా నిరూపించుకున్నాడు? ఒక మార్గమేమిటంటే ఆయన మనకు ఆచరణాత్మక లేదా లెస్సయైన జ్ఞానాన్ని, వివేచనా సామర్థ్యాన్ని అనుగ్రహించడం ద్వారానే. (సామెతలు 3:21-24) బైబిలు మన మానసిక సామర్థ్యానికి శిక్షణనిచ్చి, మనలో తార్కిక శక్తి వృద్ధిచేస్తుంది. (రోమీయులు 12:1) దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడం, అధ్యయనం చేయడం, దాన్ని అన్వయించుకోవడం ద్వారా మనం “మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను” కలిగి ఉండగలము. (హెబ్రీయులు 5:14) మీరు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేశాయో మీరు వ్యక్తిగతంగా చవిచూసి ఉండవచ్చు. వేదనభరితమైన సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు కనుగొనడానికి మనకు సహాయపడగల బుద్ధిని బైబిలు మనకు ఇస్తుంది.—సామెతలు 1:4.
14 దేవుని వాక్యం మనకు బలాన్నిచ్చే మరో మూలాధారాన్నిస్తోంది, అదే రక్షణయనే నిరీక్షణ. (రోమీయులు 15:4) చెడ్డ పరిస్థితులు ఎల్లకాలం కొనసాగవని బైబిలు మనకు చెబుతోంది. మనమెలాంటి శ్రమలు అనుభవించినా అవి తాత్కాలికమైనవే. (2 కొరింథీయులు 4:16-18) ‘అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసిన నిత్యజీవపు’ నిరీక్షణ మనకుంది. (తీతు 1:1-2) యెహోవా వాగ్దానం చేస్తున్న ఆ తేజోవంతమైన భవిష్యత్తును ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకొని, మనమా నిరీక్షణనుబట్టి ఆనందిస్తుంటే మనం శ్రమలను ఓర్చుకోగలం.—రోమీయులు 12:12; 1 థెస్సలొనీకయులు 1:2-3.
సంఘం—దేవుని ప్రేమకు ఒక చిహ్నం
15. క్రైస్తవులు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవచ్చు?
15 కష్టాల్లో మనకు సహాయం చేయడానికి యెహోవా దయచేసిన మరో ఏర్పాటు క్రైస్తవ సంఘంలో మనమాస్వాదించే సహవాసం. బైబిలు ఇలా చెబుతోంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.” (సామెతలు 17:17) సంఘంలో ఉన్నవారందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలనీ, ప్రేమించుకోవాలనీ దేవుని వాక్యం ప్రోత్సహిస్తోంది. (రోమీయులు 12:10) “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 10:24) మనకు అలాంటి మానసిక వైఖరి ఉండడం మన సొంత పరీక్షలపైనే కాక ఇతరుల అవసరాలపై దృష్టి నిలిపేందుకు కూడా మనకు సహాయం చేస్తుంది. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం వారికి తోడ్పడడమే కాక మనకున్న భారాన్ని మరింతగా సహించేలా చేసే సంతోషాన్నీ సంతృప్తినీ అనుభవిస్తాం.—అపొస్తలుల కార్యములు 20:35.
16. ప్రతీ క్రైస్తవుడు ఎలా ప్రోత్సాహకరంగా ఉండవచ్చు?
16 ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన స్త్రీపురుషులు ఇతరులను బలపరిచే విషయంలో ప్రముఖ పాత్ర వహించవచ్చు. అలా బలపరిచేందుకు వారు సమీపించదగినవారిగా ఉంటారు, అందుబాటులో ఉంటారు. (2 కొరింథీయులు 6:11-13) సంఘంలోని వారందరూ యౌవనులను మెచ్చుకోవడానికి, కొత్త విశ్వాసులను బలపరచడానికి, కృంగినవారిని ప్రోత్సహించడానికి సమయం తీసుకున్నప్పుడు ఆ సంఘం నిజంగా ఆశీర్వదించబడుతుంది. (రోమీయులు 15:7) సహోదర ప్రేమ పరస్పరం అనుమానించుకునే స్వభావాన్ని విసర్జించడానికి కూడా మనకు సహాయం చేస్తుంది. వ్యక్తిగత కష్టాలు ఆధ్యాత్మిక బలహీనతకు సూచన అని మనం త్వరపడి ఒక ముగింపుకు రాకూడదు. పౌలు సముచితంగానే “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి” అని క్రైస్తవులకు ఉద్భోదించాడు. (1 థెస్సలొనీకయులు 5:14) నమ్మకమైన క్రైస్తవులు సహితం కృంగుదలను అనుభవిస్తారని బైబిలు వివరిస్తోంది.—అపొస్తలుల కార్యములు 14:15.
17. క్రైస్తవ సహోదరత్వపు బంధాన్ని బలపరచుకోవడానికి మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?
17 మనం పరస్పరం ఓదార్చుకోవడానికీ, ప్రోత్సహించుకోవడానికీ క్రైస్తవ కూటాలు చక్కని అవకాశాన్నిస్తాయి. (హెబ్రీయులు 10:24, 25) ఈ పరస్పర ప్రేమ సంఘకూటాలకే పరిమితం కాదు. బదులుగా, దేవుని ప్రజలు మామూలు సమయాల్లో కూడా ఆరోగ్యదాయకమైన సహవాసం చేయడానికి అవకాశాల కోసం చూస్తారు. బలమైన స్నేహబంధాలు అప్పటికే స్థిరపడ్డాయి, కాబట్టి కష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు మనం పరస్పరం సహాయం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉంటాం. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించు[కొనవలెను]. ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును.”—1 కొరింథీయులు 12:24-26.
18. మనలో నిరుత్సాహ భావాలు కలిగినప్పుడు మనమెలాంటి స్వభావాన్ని విసర్జించాలి?
18 కొన్నిసార్లు తోటి క్రైస్తవులతో సహవాసాన్ని ఆస్వాదించలేనంతగా నిరుత్సాహపడినట్లు మనం భావించవచ్చు. అలాంటప్పుడు తోటి విశ్వాసులు అందించగల ఓదార్పు, సహాయం మనకు అందేలా మనం అటువంటి భావాలను నిరోధించాలి. బైబిలు మనల్నిలా హెచ్చరిస్తోంది: “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.” (సామెతలు 18:1) మన సహోదర సహోదరీలు మనపట్ల దేవుని శ్రద్ధకు చిహ్నంగా ఉన్నారు. ఆ ప్రేమగల ఏర్పాటును మనం గుర్తిస్తే కష్టకాలాల్లో మనకు సహాయం లభిస్తుంది.
ఆశావహ దృక్పథాన్ని కాపాడుకోండి
19, 20. ప్రతికూల తలంపులను తృణీకరించడానికి లేఖనాలు మనకెలా సహాయం చేస్తాయి?
19 మనకు నిరుత్సాహం, విచారం కలిగినప్పుడు, ప్రతికూల తలంపులు సులభంగా ఏర్పడతాయి. ఉదాహరణకు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, కొంతమంది దేవుని తిరస్కారం మూలంగానే తమకు ఈ కష్టమొచ్చిందని తలస్తూ తమ సొంత ఆధ్యాత్మికతనే శంకించడం ఆరంభించవచ్చు. అయితే యెహోవా “కీడువిషయమై” ఎవరినీ శోధించడని గుర్తుంచుకోండి. (యాకోబు 1:13) “హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు” అని బైబిలు చెబుతోంది. (విలాపవాక్యములు 3:33) దానికి భిన్నంగా, యెహోవా తన సేవకులు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు చాలా బాధపడతాడు.—యెషయా 63:8, 9; జెకర్యా 2:8.
20 యెహోవా “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు.” (2 కొరింథీయులు 1:3) ఆయనకు మనపట్ల శ్రద్ధవుంది, ఆయన తగినకాలంలో మనలను హెచ్చిస్తాడు. (1 పేతురు 5:6, 7) మనపట్ల దేవునికున్న అనురాగాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం మనం ఆశావహ దృక్పథాన్ని కాపాడుకోవడానికీ, చివరకు ఆనందించడానికీ మనకు సహాయం చేస్తుంది. యాకోబు ఇలా వ్రాశాడు: “నా సహోదరులారా . . . మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.” (యాకోబు 1:2) ఎందుకు? దానికి ఆయనిలా సమాధానమిస్తున్నాడు: “అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.”—యాకోబు 1:12.
21. మనకెన్ని కష్టాలొచ్చినప్పటికీ, తన పట్ల నమ్మకంగా ఉన్నవారికి దేవుడెలాంటి హామీ ఇస్తున్నాడు?
21 యేసు మనలను హెచ్చరించినట్లుగా ఈ లోకంలో మనకు శ్రమలు తప్పవు. (యోహాను 16:33) అయితే ఎలాంటి “శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను” యెహోవా ప్రేమనుండి, ఆయన కుమారుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని బైబిలు మనకు వాగ్దానం చేస్తోంది. (రోమీయులు 8:35, 38-39) మనమెదుర్కొనే ఎలాంటి కష్టమైనా కేవలం తాత్కాలికమే అని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో కదా! మానవుల కష్టాలు తీరే సమయం కోసం మనం ఎదురుచూస్తున్న ఈ సమయంలో మన ప్రేమగల తండ్రియైన యెహోవా మనలను కాపాడతాడు. మనం రక్షణకై ఆయన దగ్గరకు పరుగెత్తినప్పుడు ఆయన “నలిగినవారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును” అని నిరూపించుకుంటాడు.—కీర్తన 9:9.
మనమేమి నేర్చుకున్నాము?
• ఈ దుష్టలోకంలో జీవిస్తుండగా క్రైస్తవులు దేనిని ఎదురుచూడవచ్చు?
• మనం పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు మన మనఃపూర్వక ప్రార్థనలు బలాన్నిచ్చేవిగా ఎలా నిరూపించబడతాయి?
• దేవుని ఆత్మ ఎలా ఆదరణకర్తగా ఉంటుంది?
• పరస్పరం సహాయం చేసుకోవడానికి మనమేమి చేయవచ్చు?
[18వ పేజీలోని చిత్రం]
మనమొక బలమైన దుర్గములోకి పరుగెత్తుతున్నట్లుగా యెహోవాను వెదకాలి
[20వ పేజీలోని చిత్రాలు]
ఆధ్యాత్మికంగా పరిణతి చెందినవారు ఇతరులను మెచ్చుకోవడానికి, ప్రోత్సహించడానికి ప్రతీ అవకాశం ఉపయోగించుకుంటారు