జీవిత కథ
‘ఇప్పటి జీవితాన్ని’ పూర్తిగా అనుభవిస్తున్నాను!
టెడ్ బకింగ్‌హామ్ చెప్పినది
నేను అప్పటికి ఆరు సంవత్సరాలుగా పూర్తికాల సేవలో ఉన్నాను, నాకు పెళ్లై ఆరు నెలలే అయింది, ఆ సమయంలో నాకు ఉన్నట్టుండి పోలియో సోకింది. అది 1950వ సంవత్సరం, నా వయస్సు అప్పుడు 24 సంవత్సరాలే. నేను ఆస్పత్రిలో ఉన్న 9 నెలలు నా జీవితం గురించి లోతుగా ఆలోచించడానికి ఎంతో సమయాన్ని నాకిచ్చాయి. నాకు కొత్తగా కలిగిన ఈ వైకల్యం కారణంగా నాకు, నా భార్య జోయిస్‌కు ఎలాంటి భవిష్యత్తు ఉంది?
మతంపట్ల అంతగా ఆసక్తిలేని మా నాన్నకు 1938లో ప్రభుత్వం (ఆంగ్లం)a అనే పుస్తకం లభించింది. రాజకీయ అలజడి, యుద్ధం జరుగుతుందని అనుకోవడం బహుశా ఆయన ఆ పుస్తకాన్ని తీసుకొనేలా పురికొల్పి ఉండవచ్చు. నాకు తెలిసినంత వరకు ఆయన దాన్ని చదవలేదు గానీ, దైవభక్తిగల మా అమ్మ మాత్రం చదివింది. దానిలోని సందేశానికి ఆమె వెంటనే స్పందించింది. ఆమె చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను విడిచిపెట్టి, మా నాన్న వ్యతిరేకించినప్పటికీ యెహోవాసాక్షిగా మారి, 1990లో చనిపోయేంత వరకు నమ్మకంగా ఉంది.
అమ్మ నన్ను దక్షిణ లండన్‌లోని ఎప్సెమ్లో ఉన్న రాజ్యమందిరానికి తీసుకెళ్లింది, అది నేను హాజరైన మొట్టమొదటి క్రైస్తవ కూటం. అక్కడి సంఘం అంతకుముందు ఒక దుకాణం ఉన్న స్థలంలో కలుసుకునేది, అక్కడ మేము రికార్డు చేయబడిన జె. ఎఫ్. రూథర్‌ఫర్డ్ గారి ప్రసంగం విన్నాం, ఆయన ఆ సమయంలో యెహోవాసాక్షుల పనిని పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రసంగం నా మీద ప్రగాఢమైన ముద్రవేసింది.
లండన్ మీద బాంబుల దాడులు జరగడంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. దాంతో మా నాన్న కుటుంబాన్ని సురక్షితంగా ఉంచేందుకు లండన్‌కు పశ్చిమంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిడెన్హెడ్ అనే చిన్న పట్టణానికి మార్చారు. అలా మారడం మాకు ప్రయోజనాన్నిచ్చింది, ఎందుకంటే అక్కడున్న 30 మంది సభ్యుల సంఘం మాకు చక్కని ప్రోత్సాహానికి మూలమైంది. 1917లో బాప్తిస్మం తీసుకున్న మంచి ఆధ్యాత్మిక బలంగల ఫ్రెడ్ స్మిత్ నాపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని, నేను ఫలవంతమైన ప్రచారకుడినయ్యేలా నాకు శిక్షణ ఇచ్చాడు. ఆయన ఆదర్శానికి, ప్రేమపూర్వక శ్రద్ధకు నేను ఆయనకు రుణపడి ఉన్నాను.
పూర్తికాల సేవలో ప్రవేశించడం
నా 15వ ఏట అంటే 1941 శీతాకాలపు మార్చి నెలలో ఒకరోజు థేమ్స్ నదిలో బాప్తిస్మం తీసుకున్నాను. అప్పటికే మా అన్నయ్య జిమ్ పూర్తికాల సువార్తికునిగా సేవ చేస్తున్నాడు. ఆయనా, ఆయన భార్య మాజ్, బ్రిటన్ అంతటా ప్రాంతీయ, జిల్లా నియామకాల్లో జీవితమంతా యెహోవా సేవచేసి ఇప్పుడు బర్మింగ్‌హామ్‌లో నివసిస్తున్నారు. మా చెల్లి రోబీన, ఆమె భర్త ఫ్రాంక్ కూడా యెహోవాకు నమ్మకమైన సేవకులుగా ఉన్నారు.
నేను ఒక బట్టల వ్యాపారి దగ్గర అక్కౌంటెంట్‌గా పని చేసేవాడిని. ఒకరోజు నన్ను మా మేనేజింగ్ డైరెక్టర్ తన ఆఫీసుకు పిలిచి, ఆ వ్యాపార సంస్థలో కోసం కొనుగోలుచేసే వ్యక్తిగా పనిచేసే ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే నేను మా అన్నయ్య ఆదర్శాన్నే అనుసరించాలని కొంతకాలం నుండి ఆలోచిస్తున్న కారణంగా, దాన్ని మా యజమానికి వివరిస్తూ ఆయన ఇచ్చిన ఆ అవకాశాన్ని గౌరవపూర్వకంగానే నిరాకరించాను. అప్పుడు ఎంతో విలువైన క్రైస్తవ సేవను చేపట్టాలనే నా అభిలాషను ఆయన మెచ్చుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. దానితో నేను కూడా 1944లో నార్త్హామ్ప్టన్లో జరిగిన జిల్లా సమావేశం తర్వాత, నేను పూర్తికాల సువార్తికుడిని అయ్యాను.
నా మొదటి నియామకం డేవన్ కౌంటీలోని ఎక్సిటర్ నగరం. ఆ నగరం యుద్ధతాకిడి నుండి అప్పుడప్పుడే కోలుకుంటోంది. అప్పటికే ఫ్రాంక్ మరియు రూత్ మిడిల్టన్ అనే ఇద్దరు పయినీర్లు ఉంటున్న అపార్ట్మెంట్లో వారితో కలిసి ఉండడం ఆరంభించాను, వారు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. నాకు అప్పుడు 18 సంవత్సరాలే, నాకు బట్టలు ఉతకడంలో, వంట చేయడంలో అంత అనుభవం లేదు, అయితే నా నైపుణ్యం అభివృద్ధి అయ్యేకొద్దీ పరిస్థితులు మెరుగుపడ్డాయి.
ప్రకటనా పనిలో నాకు 50 ఏళ్ల విక్టర్ గార్డ్ అనే ఐర్లండ్ దేశస్థుడు సహవాసిగా ఉన్నాడు, ఆయన 1920 నుండి సాక్ష్యమిస్తున్నాడు. ఆయన నాకు సమయాన్ని ప్రయోజనాత్మకంగా పట్టిక వేసుకోవడం, బైబిలు చదవడంలో ఆసక్తిని పెంపొందించుకోవడం, వివిధ బైబిలు అనువాదాల విలువను గుర్తించడం వంటివి నేర్పించాడు. ఆ కీలక సంవత్సరాల్లో విక్టర్ స్థిరమైన ఆదర్శం సరిగ్గా నాకు కావలసిన సహాయాన్ని అందించింది.
తటస్థతకు సంబంధించిన సవాలు
యుద్ధం ముగింపుకొచ్చింది, అయినప్పటికీ అధికారులు యువతను సైన్యంలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు. నేను 1943లో మెయిడెన్హెడ్లోని ధర్మాసనం ఎదుటకు వెళ్లి, సువార్త పరిచారకునిగా మినహాయింపు కోసం నా విషయాన్ని స్పష్టంగా వివరించాను. వారు నా విన్నపాన్ని తిరస్కరించినప్పటికీ, నేను నా నియామకాన్ని చేపట్టడానికి ఎక్సిటర్ నగరానికి వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. అయితే అక్కడే ఎక్సిటర్లోని స్థానిక కోర్టులో హాజరవ్వాలని నాకు ఆజ్ఞాపించబడింది. నాకు 6 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తూ, నిజానికి అది చాలా తక్కువని న్యాయమూర్తి అన్నారు. ఆ 6 నెలల శిక్ష తర్వాత, ఇంకో నాలుగు నెలల శిక్ష అనుభవించడం కోసం నేను మళ్లీ చెరసాలకు వెళ్లాల్సి వచ్చింది.
ఆ చెరసాలలో నేను ఒక్కడినే సాక్షినవడం మూలంగా, వార్డర్లు నన్ను యెహోవా అని పిలిచేవారు. హాజరు వేసుకోవడం కోసం నన్ను అలా పిలిచినప్పుడు పలకడం ఇబ్బందిగానే అనిపించినప్పటికీ, ప్రతీరోజు దేవుని పేరుతో అలా బిగ్గరగా పిలవడాన్ని వినడం ఎంత గొప్ప ఆధిక్యతో! అది నేను ఒక యెహోవాసాక్షిగా నా మనస్సాక్షినిబట్టి వారిమధ్య ఉండాల్సి వచ్చిందని ఇతర ఖైదీలకు తెలిసేందుకు తోడ్పడింది. ఆ తర్వాత కొంతకాలానికి నార్మన్ క్యాస్ట్రో కూడా అదే చెరసాలకు పంపించబడ్డాడు, దానితో మా పేర్లు మోషే, అహరోనులుగా మారాయి.
నన్ను ఎక్స్టర్ నుండి బ్రిస్టల్‌కు మార్చి, అక్కడినుండి చివరకు విన్ఛెస్టర్ చెరసాలకు పంపించారు. అయితే పరిస్థితులు ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా లేవు, అయినా నేను ఉల్లాసంగా ఉండడానికి అది దోహదపడింది. విన్ఛెస్టర్లో మేము ఉన్నప్పుడు నేనూ, నార్మన్ కలిసి జ్ఞాపకార్థ దినాన్ని సంతోషంగా ఆచరించాం. చెరసాలలో మమ్మల్ని సందర్శించడానికి వచ్చిన ఫ్రాన్సిస్ కుక్ మా కోసం చక్కని ప్రసంగం ఇచ్చారు.
యుద్ధానంతర సంవత్సరాల్లోని మార్పులు
బ్రిస్టల్‌లో 1946లో జరిగిన సమావేశంలో నేను జోయిస్ మూరే అనే ఒక అందమైన యువతిని కలిశాను, ఆమె కూడా డివన్లో పయినీరు సేవ చేస్తోంది. ఆ సమావేశంలోనే “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” (ఆంగ్లం) అనే బైబిలు అధ్యయన ఉపకరణం విడుదలైంది. మా స్నేహం వికసించి, నాలుగు సంవత్సరాల తర్వాత, 1947 నుండి నేను ఉంటున్న టైవర్టన్ పట్టణంలో మేము వివాహం చేసుకున్నాం. వారానికి 15 షిల్లింగుల (దాదాపు 60 రూపాయల) అద్దెకు తీసుకున్న గదిని మా ఇల్లుగా చేసుకున్నాం. మా జీవితం సంతోషంగా సాగింది.
మా వివాహపు తొలి సంవత్సరంలో మేము దక్షిణంగా బ్రిక్స్హామ్కు వెళ్లాము, అది ఓడరేవు పట్టణం, అక్కడే నీటిలో వలను ఈడ్చుకువెళ్తూ చేపలుపట్టే వల మొదటిసారిగా అభివృద్ధి చేయబడింది. అయితే మేము అక్కడ ఎక్కువకాలం ఉండలేదు, ఎందుకంటే మేము లండన్‌లో జరుగుతున్న ఒక సమావేశానికి వెళ్తున్నప్పుడు నాకు పోలియో సోకింది. నేను కోమాలోకి వెళ్లిపోయాను. ఆరంభంలో పేర్కొన్నట్లుగా, తొమ్మిది నెలల తర్వాత నేను ఆసుపత్రి నుండి డిస్చార్జి అయ్యాను. నా కుడి చెయ్యి, రెండు కాళ్లు బాగా బలహీనపడ్డాయి, అవి అలాగే ఉన్నాయి. నడవడానికి అప్పట్లో నాకు కర్ర సహాయం అవసరమైంది. నా ప్రియమైన భార్య సంతోషంగా నిరంతరం నాకు తోడుగా ఉంటూ, ముఖ్యంగా తను పూర్తికాల పరిచర్యలో కొనసాగడానికి ప్రయత్నిస్తూనే నన్నూ ప్రోత్సహిస్తూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మేము ఏమి చేయాలి? యెహోవా హస్తం ఎన్నడూ కురచకాదనే విషయాన్ని నేను అనతికాలంలోనే తెలుసుకున్నాను.
ఆ మరుసటి సంవత్సరం మేము లండన్‌లోని వింబుల్డన్‌లో ఒక సమావేశానికి హాజరయ్యాం. అప్పటికి నేను కర్ర సహాయం లేకుండా నడవగలుగుతున్నాను. అక్కడ నేను ప్రైస్ హ్యూజ్‌ను కలిశాను, ఆయన బ్రిటన్‌లో జరుగుతున్న సేవను పర్యవేక్షిస్తున్నాడు. ఆయన నన్ను చూసిన వెంటనే పలకరిస్తూ, “ప్రాంతీయ సేవ చేయడానికి మాకు మీ అవసరం ఉంది” అన్నాడు. ఆ మాటలు నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. నేను అందుకు పనికొస్తానా? జోయిస్ నేను ఆలోచనలో పడ్డాం, అయితే యెహోవాపై పూర్తి నమ్మకంతో, ఒక వారం శిక్షణతో సిద్ధపడి, ప్రాంతీయ పైవిచారణకర్తగా సేవచేయడానికి నేను నియమించబడిన ఇంగ్లాండ్ నైరృతి ప్రాంతానికి ప్రయాణమయ్యాం. అప్పటికి నా వయస్సు 25 ఏళ్లు, అయితే నాకు సహాయం చేసిన ఆ సాక్షుల ప్రేమను, ఓపికను నేను ఇప్పటికీ కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నాను.
మేము పాల్గొన్న వివిధ దైవపరిపాలనా కార్యక్రమాల్లోకెల్లా సంఘాలను సందర్శించడం ద్వారానే మేము మన క్రైస్తవ సహోదర సహోదరీలకు అత్యంత సన్నిహితం అయినట్లు నేను, జోయిస్ గమనించాం. మాకు కారు లేనందువల్ల మేము రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించేవాళ్ళం. నా వ్యాధి కారణంగా నాకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, 1957 వరకు మేము ఆ ఆధిక్యతను ఆస్వాదించాం. జీవితం సంతృప్తికరంగా సాగింది, అయితే అదే సంవత్సరం మాకు మరో సవాలు ఎదురైంది.
మిషనరీ సేవకు వెళ్లడం
గిలియడ్ 30వ తరగతికి హాజరవమనే ఆహ్వానం అందుకున్న మేము పులకరించిపోయాం. శారీరక పరిమితులతో నేను మంచిగా తాళుకోగలుగుతున్న కారణంగా జోయిస్, నేను ఆ ఆహ్వానాన్ని ఆనందంగా స్వీకరించాం. యెహోవా చిత్తం చేయడానికి ప్రయత్నిస్తే, ఆయన ఎల్లప్పుడూ మనకు బలాన్ని అనుగ్రహిస్తాడని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అమెరికాలోని, న్యూయార్క్‌లో సౌత్ లాన్సింగ్లో చూడముచ్చటైన ప్రదేశంలో ఉన్న వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌లో 5 నెలల తీవ్రమైన శిక్షణ త్వరలోనే ముగిసిపోయింది. విద్యార్థులు ముఖ్యంగా ప్రయాణ సేవలో ఉన్న వివాహిత దంపతులే. మీలో ఎవరైనా విదేశీ మిషనరీ క్షేత్రంలో సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారా అని విద్యార్థులను అడిగినప్పుడు, దానికి వెంటనే అంగీకరించిన వారిలో మేమూ ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్లాం? తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాకు!
ఆ సమయంలో ఉగాండాలో యెహోవాసాక్షుల సేవ నిషేధంలో ఉన్న కారణంగా, నేను ఆ దేశంలో స్థిరపడి, ఉద్యోగం సంపాదించుకోవాలని మాకు సలహా ఇచ్చారు. రైల్లో, పడవలో సుదీర్ఘ ప్రయాణం తర్వాత మేము ఉగాండాలోని కంపాలాకు చేరుకున్నాం. వలస విభాగ అధికారులు మేము అక్కడ నివసించడానికి ఇష్టపడలేదు, అందుకే వాళ్లు కొన్ని నెలలు మాత్రమే అక్కడ ఉండడానికి మాకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మేము ప్రధాన కార్యాలయం సూచనల మేరకు ఉత్తర రోడేషియాకు (ప్రస్తుత జాంబియాకు) వెళ్లాం. అక్కడ మేము మా గిలియడ్ తోటి విద్యార్థులు నలుగురిని అంటే ఫ్రాంక్ మరియు క్యారీ లూయిస్‌లను, హాజ్ మరియు హ్యారియెట్ హాస్కెన్జ్లనూ కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. మేము ఆ తర్వాత కొద్దికాలానికే అక్కడినుండి దక్షిణ రోడేషియాకు (ప్రస్తుత జింబాబ్వేకు) తిరిగి నియమించబడ్డాం.
మేము రైల్లో ప్రయాణిస్తూ బులవాయో నగరానికి చేరుకోవడానికి ముందు అద్భుతమైన విక్టోరియా జలపాతాన్ని చూశాం. మేము కొంతకాలంపాటు, అక్కడే స్థిరపడిన తొలిసాక్షుల్లోని మెక్లికీ కుటుంబంతో గడిపాం. ఆ తర్వాతి 16 సంవత్సరాల కాలంలో వారిని చక్కగా తెలుసుకోవడం మాకు లభించిన ఒక అధిక్యత అనే చెబుతాం.
మార్పులకు తగ్గట్టు సర్దుకుపోవడం
ఆఫ్రికా క్షేత్రాన్ని తెలుసుకోవడానికి రెండు వారాల శిక్షణ తర్వాత, జిల్లా పైవిచారణకర్తగా సేవ చేయడానికి నేను నియమించబడ్డాను. ఆఫ్రికా అడవి ప్రదేశాల్లో సాక్ష్యం ఇవ్వాలంటే, మనతోపాటు ఆహారపానీయాలు, పడక సామగ్రి, బట్టలు, ఫిల్మ్ ప్రొజెక్టర్, విద్యుత్ జనరేటర్, ఒక పెద్ద తెర వంటి వాటితోపాటు అవసరమైన ఇతర సామగ్రి కూడా తీసుకెళ్లాలి. వీటన్నింటినీ సర్దుకొని ఎగుడుదిగుడుగా ఉండే రహదారుల మీద భద్రంగా తీసుకెళ్లగల దృఢమైన ట్రక్కులో ప్రయాణించాలి.
నేను ఆఫ్రికా ప్రాంతీయ పైవిచారణకర్తలతో సేవ చేస్తుంటే, మాతోపాటు వచ్చిన వారి భార్యలకు, పిల్లలకు జోయిస్ సంతోషంగా సహాయం చేసింది. ఆఫ్రికాలోని సాగుచేయని మైదాన ప్రాంతాల్లో నడవడం చాలా కష్టం, ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉండే పగటిపూట మరీ కష్టం, అయితే అలాంటి వాతావరణ పరిస్థితుల్లో నా శారీరక పరిమితులతో వ్యవహరించడం తేలికగా ఉండేది, దానికి నేను కృతజ్ఞుడను.
ప్రజల్లో ఎక్కువమంది బీదవారు. వారు ఆచారాల్లో, మూఢనమ్మకాల్లో మునిగి బహుభార్యత్వాన్ని ఆచరిస్తున్నప్పటికీ, బైబిలుపట్ల వారు ప్రగాఢ గౌరవం చూపించేవారు. కొన్ని ప్రాంతాల్లో సంఘ కూటాలు పెద్దపెద్ద చెట్ల నీడలో నిర్వహించబడేవి, సాయంత్రాల్లో వ్రేలాడదీసిన దీపాల వెలుగు ఉండేది. దేవుని అద్భుత సృష్టిలో భాగమైన నక్షత్రాలతో నిండుగా కనిపించే ఆకాశం క్రింద ఆయన వాక్యం నుండి నేరుగా చదివిన ప్రతీసారి మాలో భక్తిపూర్వక భయం నిండుకునేది.
ఆఫ్రికా రక్షిత ప్రాంతాల్లో వాచ్‌టవర్ సొసైటీ చలన చిత్రాలను చూపించడం మరో మరపురాని అనుభవం. ఒక సంఘంలో సాక్షులు 30 మందే ఉన్నా చలన చిత్ర ప్రదర్శనా సమయాల్లో 1,000 లేదా అంతకన్నా ఎక్కువమంది హాజరైన సందర్భాలూ ఉన్నాయి.
నిజమే, ఉష్ణమండల ప్రాంతాల్లో అస్వస్థతకు గురికావడం ఒక సమస్యే, అయితే ఎల్లప్పుడూ అనుకూల దృక్కోణంతో ఉండడం ఆవశ్యకం. జోయిస్ నేను సర్దుకుపోవడం నేర్చుకున్నాం. నేను అప్పుడప్పుడు మలేరియాతో, జోయిస్ విరోచనాలు తదితర వ్యాధులతో బాధపడేవాళ్లం.
ఆ తర్వాత మేము సాలిస్బ్యూరీ (ప్రస్తుతం హరారే) బ్రాంచి కార్యాలయానికి నియమించబడ్డాం, అక్కడ యెహోవా నమ్మకమైన సేవకులతో కలిసి పనిచేయడం నిజంగా ఒక ఆధిక్యతే. అలాంటి నమ్మకమైన సేవకుల్లో లెస్టెర్ డేవీ, జార్జ్ మరియు రూబీ బ్రాడ్లీలు ఉన్నారు. ప్రభుత్వం నన్ను వివాహ అధికారిగా నియమించింది, దానితో ఆఫ్రికా సహోదరుల వివాహాలు జరిపిస్తూ, సంఘాల్లో క్రైస్తవ వివాహబంధాన్ని బలపరిచే అవకాశం నాకు లభించింది. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు మరో ఆధిక్యత లభించింది. బంటూ భాషలు కాక ఇతర భాషలు ఉపయోగించే సంఘాలన్నిటినీ నేను సందర్శించాలి. ఒక దశాబ్దానికి పైగా జోయిస్ నేనూ సహోదరులను ఈ విధంగా తెలుసుకొనే ఆనందాన్ని ఆస్వాదించడమే కాక, వారి ఆధ్యాత్మిక పురోగతిని చూసే సంతోషమూ మాకు దక్కింది. ఆ సమయంలోనే మేము బోట్సువాన, మొజాంబిక్ల్లోని సహోదరులను కూడా సందర్శించాం.
మళ్లీ వెళ్లడం
మేము దక్షిణాఫ్రికాలో సంతోషంగా అనేక సంవత్సరాలు గడిపిన తర్వాత, 1975లో పశ్చిమ ఆఫ్రికాలోని సియర్రాలియోన్‌లో సేవ చేసేందుకు తిరిగి నియమించబడ్డాం. ఆ తర్వాత కొద్దికాలంలోనే మేము మా క్రొత్త సేవాక్షేత్రపు పనికోసం బ్రాంచి కార్యాలయంలో స్థిరపడ్డాం, అయితే మేము అక్కడ కూడా ఎక్కువకాలం ఉండలేకపోయాం. నాకు తీవ్రంగా మలేరియా సోకడంతో, చికిత్స కోసం నేను చివరకు లండన్ రావలసివచ్చింది, అక్కడ మళ్లీ ఆఫ్రికాకు వెళ్లవద్దని నాకు సలహా ఇచ్చారు. ఇది మాకు చాలా విచారాన్ని కలిగించింది, అయితే లండన్ బెతెల్ కుటుంబం జోయిస్నూ నన్నూ సాదరంగా ఆహ్వానించింది. లండన్‌లోని అనేక సంఘాల్లోని చాలామంది ఆఫ్రికన్ సహోదరులు మేము తిరిగి మా ఇంట్లో ఉన్నామనే భావం మాకు కలిగించారు. నా ఆరోగ్యం కుదుటపడేకొద్దీ మరో విధమైన దైనందిన కార్యక్రమానికి అలవాటుపడ్డాం, కొనుగోలు చేసే విభాగాన్ని చూసుకునే పని నాకు అప్పగించబడింది. గడచిన సంవత్సరాల్లో జరిగిన విస్తీర్ణత చూసిన మాకు ఇది ఆసక్తికరమైన పనిగా ఉంది.
1990 తొలి భాగంలో ప్రియమైన నా భార్య జోయిస్ నాడీకణాల వ్యాధికి గురై 1994లో మరణించింది. ఆమె ప్రేమగల, యథార్థవంతమైన, నమ్మకమైన భార్యగా ఉండడమే కాక, మేము కలిసి ఎదుర్కొన్న విభిన్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడానికి ఎల్లప్పుడూ ఇష్టపడింది. అలాంటి లోటు ఏర్పడినప్పుడు మన ఆధ్యాత్మిక దృక్కోణాన్ని స్పష్టంగా మదిలో కాపాడుకుంటూ ముందుకు చూడవలసిన ప్రాముఖ్యతను నేను గ్రహించాను. ప్రకటనా పనితోపాటు ప్రార్థనాపూర్వకంగా చక్కని దైవపరిపాలనా పట్టికకు హత్తుకొని ఉండడం మనస్సును పనిమీద కేంద్రీకరించడానికి నాకు సహాయం చేస్తోంది.—సామెతలు 3:5, 6.
బెతెల్‌లో సేవ చేయడం ఒక ఆధిక్యతే కాదు చక్కని జీవన విధానం కూడా. అక్కడ, కలిసి పనిచేయడానికి చాలామంది యౌవనులతోపాటు పంచుకునే ఆనందాలూ అనేకం ఉంటాయి. ఒక ఆశీర్వాదం ఏమిటంటే, ఇక్కడ లండన్ బెతెల్‌కు చాలామంది సందర్శకులు వస్తుంటారు. కొన్నిసార్లు ఆఫ్రికా దేశాల్లో నేను సేవ చేసిన ప్రాంతాల నుండి ప్రియ స్నేహితులు కూడా వస్తారు, అలనాటి మధుర స్మృతులన్నీ తిరిగి జ్ఞాపకం వస్తాయి. ఇదంతా నేను ‘ఇప్పటి జీవితాన్ని’ పూర్తిగా ఆనందించడంలో కొనసాగడానికే కాక, “రాబోవు జీవము విషయములోను” సంపూర్ణ నమ్మకంతో, నిరీక్షణతో ఎదురుచూడడానికి సహాయం చేస్తోంది.—1 తిమోతి 4:8.
[అధస్సూచి]
a దీనిని యెహోవాసాక్షులు 1928లో ప్రచురించారు, అది ప్రస్తుతం ముద్రించబడడంలేదు.
[25వ పేజీలోని చిత్రం]
1946లో మా అమ్మతో
[26వ పేజీలోని చిత్రం]
1950లో మా పెళ్లిరోజున జోయిస్‌తో
[26వ పేజీలోని చిత్రం]
1953లో బ్రిస్టల్ సమావేశంలో
[27వ పేజీలోని చిత్రాలు]
దక్షిణ రోడేషియాలో అంటే, ప్రస్తుత జింబాబ్వేలో ఒక ఐసొలేటెడ్ గ్రూపుతో (పైన), ఒక సంఘంతో (క్రింద) కలిసి సేవ చేయడం