కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w06 1/15 పేజీలు 26-30
  • సాతానును ఎదిరించండి, వాడు పారిపోతాడు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సాతానును ఎదిరించండి, వాడు పారిపోతాడు!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అపవాదికి మనం భయపడాలా?
  • సాతాను మనల్ని ఎందుకు హింసిస్తాడు?
  • “దుష్టునినుండి మమ్మును తప్పించుము”
  • సాతానుచేత మోసగించబడకండి
  • దేవుడిచ్చే కవచముచేత కాపాడబడుట
  • అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడు
  • యేసులా ‘అపవాదిని ఎదిరించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • సాతాను ఉనికి కేవలం మూఢనమ్మకం మాత్రమే కాదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మన పాపాలకు సాతానును నిందించాలా?
    తేజరిల్లు!—1998
  • అపవాది ఉన్నాడని మీరు నిజంగా నమ్ముతున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
w06 1/15 పేజీలు 26-30

సాతానును ఎదిరించండి, వాడు పారిపోతాడు!

“దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.”​—యాకోబు 4:7.

1, 2. (ఎ) యెషయా 14వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకటనలో అపవాదికున్న ఏ లక్షణం ప్రతిబింబించింది? (బి) మనమే ప్రశ్నలు చర్చిస్తాం?

అపవాది అహంకారానికి మారుపేరు. అతడి అహంకారం, దేవుని ప్రవక్తయైన యెషయా వ్రాసిన మాటల్లో ప్రతిబింబిస్తుంది. బబులోను ప్రపంచాధిపత్యంగా అవతరించడానికి ఒక శతాబ్దంకంటే ఎక్కువకాలం ముందు యెహోవా ప్రజలు “బబులోను రాజు”కు వ్యతిరేకంగా ఈ ప్రకటన చేస్తున్నట్లు సూచించబడింది: “నేను ఆకాశమున కెక్కిపోయెదను. దేవుని నక్షత్రములకు [దావీదు రాజవంశపు రాజులకు] పైగా నా సింహాసనమును హెచ్చింతును . . . మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి.” (యెషయా 14:3, 4, 12-15; సంఖ్యాకాండము 24:17) “బబులోను రాజు”కు ఉన్నటువంటి అహంకారమే ఈ “యుగ సంబంధమైన దేవత” అయిన సాతానుకుంది. (2 కొరింథీయులు 4:4) అయితే, బబులోను రాజ్యాధికారం అవమానకరమైన రీతిలో ముగిసినట్లే, సాతాను అహంకారం వినాశకరమైన రీతిలో ముగుస్తుంది.

2 అయితే అపవాది ఉనికిలో ఉన్నంతవరకు, మనం ఇలాంటి ప్రశ్నల గురించి చింతిస్తూనే ఉంటాం: మనం సాతానుకు భయపడాలా? అతడు క్రైస్తవులను హింసించేందుకు ప్రజలను ఎందుకు ఉసిగొల్పుతున్నాడు? అపవాది మనల్ని మోసగించకుండా మనమెలా తప్పించుకోవచ్చు?

అపవాదికి మనం భయపడాలా?

3, 4. అభిషిక్త క్రైస్తవులు, వారి సహవాసులు అపవాదికి ఎందుకు భయపడరు?

3 యేసుక్రీస్తు పలికిన ఈ మాటలు అభిషిక్త క్రైస్తవులకెంతో బలాన్ని చేకూరుస్తాయి: “నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.” (ప్రకటన 2:9, 10) అభిషిక్త క్రైస్తవులు, భూనిరీక్షణగల వారి సహవాసులు అపవాదికి భయపడరు. ఈ నిర్భీతి వారికి జన్మతః ఉన్న ధైర్యం మూలంగా వచ్చింది కాదు. వారికి దేవునిపట్ల భక్తిపూర్వక భయం ఉండడమే కాక, ‘ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన’ కారణాన్నిబట్టే అది వారిలో ఉంది.​—కీర్తన 34:9; 36:7.

4 ధైర్యవంతులైన యేసుక్రీస్తు తొలి శిష్యులు హింసలు అనుభవించినా మరణం వరకు తమనుతాము నమ్మకస్థులుగా నిరూపించుకున్నారు. యెహోవా తనపట్ల విశ్వసనీయంగా ఉండేవారిని ఎన్నటికీ విడిచిపెట్టడని వారికి తెలుసు కాబట్టి, అపవాదియైన సాతాను తమకేదో చేస్తాడనే ఎలాంటి భయానికీ వారు లొంగిపోలేదు. అదేవిధంగా, నేడు హింస ఎంత తీవ్రంగావున్నా, అభిషిక్త క్రైస్తవులు, వారి సమర్పిత సహవాసులు దేవునిపట్ల తమ యథార్థతను స్థిరంగా ఉంచుకోవడానికే నిర్ణయించుకున్నారు. అయితే, అపవాది మరణం కలిగించగలడని అపొస్తలుడైన పౌలు సూచించాడు. అది మనం భయపడేలా చేయవద్దా?

5. హెబ్రీయులు 2:14, 15 నుండి మనమేమి నేర్చుకుంటాం?

5 “మరణముయొక్క బలముగలవానిని, [‘మరణం కలుగజేసే మార్గంగలవానిని,’ NW] అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును” ‘యేసు రక్తమాంసములుగల’ మనుష్యుడయ్యాడని పౌలు చెప్పాడు. (హెబ్రీయులు 2:14, 15) ‘మరణం కలుగజేసే మార్గంగల’ సాతాను, యూదా ఇస్కరియోతును తన అధీనంలోకి తీసుకొని, ఆ తర్వాత యేసును హతమార్చేందుకు యూదా నాయకులను, రోమన్లను ఉపయోగించాడు. (లూకా 22:3; యోహాను 13:26, 27) అయితే యేసు తన బలిపూర్వక మరణం ద్వారా పాపభరిత మానవాళిని సాతాను పట్టు నుండి విడిపించి మనకు నిత్యజీవాన్ని సాధ్యం చేశాడు.​—యోహాను 3:16.

6, 7. సాతానుకు మరణం కలిగించే శక్తి ఎంతమేరకు ఉంది?

6 సాతానుకు మరణం కలిగించే శక్తి ఎంతమేరకు ఉంది? సాతాను దుష్ట క్రియల ఆరంభం నుండి అతని అబద్ధాలు, నడిపింపు మానవుల మరణానికి కారణమయ్యాయి. ఎందుకంటే, ఆదాము పాపంచేసి పాపమరణాలను మానవ కుటుంబానికి సంక్రమింపజేశాడు. (రోమీయులు 5:12) దానికితోడు, సాతాను భూసంబంధ సేవకులు యేసుక్రీస్తుకు జరిగించినట్లే, కొన్ని సందర్భాల్లో యెహోవా ఆరాధకులను కూడా మరణ పర్యంతం హింసించారు.

7 అయితే, సాతాను తాను చంపాలనుకున్న ఎవరికైనా మరణం కలిగించగలడని మనం తలంచకూడదు. దేవుడు తనవారిని కాపాడుతూ, భూమ్మీదనుండి సత్యారాధకులందరినీ పూర్తిగా తుడిచిపెట్టేందుకు సాతానును ఎన్నటికీ అనుమతించడు. (రోమీయులు 14:8) నిజమే, యెహోవా తన ప్రజలందరిపైకి హింస రావడానికి అనుమతిస్తూ, సాతాను దాడుల కారణంగా మనలో కొందరు చనిపోవడానికి అనుమతించవచ్చు. అయినప్పటికీ, లేఖనాలు దేవుని ‘జ్ఞాపకార్థ గ్రంథములో’ ఉన్నవారికి అద్భుతమైన పునరుత్థాన నిరీక్షణను అందజేస్తున్నాయి. అలాంటి జీవ పునరుద్ధరణను ఆపుజేయడం అపవాది తరంకాదు.​—మలాకీ 3:16; యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15.

సాతాను మనల్ని ఎందుకు హింసిస్తాడు?

8. సాతాను దేవుని సేవకులపై ఎందుకు హింస తీసుకొస్తాడు?

8 మనం దేవుని విశ్వసనీయ సేవకులుగా ఉన్నప్పుడు, అపవాది మనపైకి హింస తీసుకురావడానికి ఒక ప్రాథమిక కారణం ఉంది. అతని ఉద్దేశమేమిటంటే మన విశ్వాసం విషయంలో మనల్ని రాజీపడేలా చేయడమే. మన పరలోకపు తండ్రితో మనకు అమూల్యమైన సంబంధముంది, దానిని నాశనం చేయడానికి సాతాను ఇష్టపడుతున్నాడు. ఇది మనల్ని ఆశ్చర్యపరచకూడదు. తన సూచనార్థక “స్త్రీకి,” “సర్పము”నకు, వారి ‘సంతానాలకు’ మధ్య శత్రుత్వం ఉంటుందని యెహోవా ఏదెనులో ముందే చెప్పాడు. (ఆదికాండము 3:14, 15) లేఖనాలు అపవాదిని ‘ఆదిసర్పమని’ గుర్తిస్తూ, ఇప్పుడు అతనికి కొంచెమే సమయం ఉందనీ, అతడు బహు క్రోధముగా ఉన్నాడనీ వెల్లడి చేస్తున్నాయి. (ప్రకటన 12:9, 12) రెండు ‘సంతానముల’ మధ్య శత్రుత్వం కొనసాగుతుండగా, యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నవారు తాము హింసించబడతామని ఎదురుచూడవచ్చు. (2 తిమోతి 3:12) సాతాను తీసుకొచ్చే అలాంటి హింసకున్న మూల కారణమేమిటో మీకు తెలుసా?

9, 10. అపవాది ఏ వివాదాంశం లేవనెత్తాడు, మానవుల ప్రవర్తన ఆ వివాదాంశానికి ఎలా ముడిపడివుంది?

9 విశ్వ సర్వాధిపత్యపు వివాదాన్ని అపవాది లేవదీశాడు. ఆ వివాదానికి సంబంధించి, మానవులు తమ సృష్టికర్తపట్ల చూపించే యథార్థతను కూడా అతడు ప్రశ్నించాడు. సాతాను యథార్థపరుడైన యోబు మీదికి హింసను తీసుకొచ్చాడు. ఎందుకు? యెహోవాపట్ల యోబుకున్న యథార్థతను నాశనం చేయడానికే. ఆ సమయంలో యోబు భార్యతోపాటు ‘బాధకే కర్తలైన’ ఆయన ముగ్గురు స్నేహితులు అపవాది ఉద్దేశాన్నే నెరవేర్చారు. యోబు పుస్తకంలో చూపించబడినట్లుగా, ఒక వ్యక్తిని పరీక్షించేందుకు తనను అనుమతిస్తే ఏ మానవుడూ దేవునిపట్ల నమ్మకంగా ఉండలేడని వాదిస్తూ అపవాది ఆయనను సవాలుచేశాడు. అయితే యోబు తన యథార్థతను నిలుపుకొని, సాతాను అబద్ధికుడని నిరూపించాడు. (యోబు 1:8-2:9; 16:2; 27:5; 31:6) యెహోవాసాక్షుల యథార్థతను నాశనంచేసి తన సవాలు నిజమని నిరూపించుకోవాలనే ప్రయత్నంలో అపవాది నేడు వారిని హింసిస్తున్నాడు.

10 దేవునిపట్ల మన యథార్థతను నాశనంచేయాలని అపవాది తీవ్రంగా కోరుకుంటున్న కారణంగానే అతడు మన మీదికి హింస తీసుకొస్తున్నాడని తెలుసుకోవడం, నిజానికి మనం ధైర్యంగా, బలంగా ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది. (ద్వితీయోపదేశకాండము 31:6) మన దేవుడు విశ్వసర్వాధిపతి, యథార్థతను కాపాడుకునేందుకు ఆయన మనకు సహాయం చేస్తాడు. యథార్థవంతులుగా ఉండి ప్రధాన ఆరోపకుడైన అపవాదియగు సాతానుకు జవాబిచ్చేలా యెహోవా హృదయాన్ని సంతోషపరిచేందుకు మనమెల్లప్పుడూ ప్రయత్నిద్దాం.​—సామెతలు 27:11.

“దుష్టునినుండి మమ్మును తప్పించుము”

11. ‘మమ్మును శోధనలోకి తేవద్దు’ అనే విన్నపానికి ఎలాంటి అర్థముంది?

11 యథార్థవంతులుగా ఉండడం మామూలు విషయమేమీ కాదు; దానికి హృదయపూర్వక ప్రార్థన అవసరం. ప్రత్యేకంగా మాదిరి ప్రార్థనలోని మాటలు సహాయకరంగా ఉంటాయి. ఆ ప్రార్థనలో యేసు ఇలా అన్నాడు: “మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.” (మత్తయి 6:13) పాపం చేసేలా యెహోవా మనల్ని శోధించడు. (యాకోబు 1:13) అయితే లేఖనాలు కొన్ని సందర్భాల్లో ఆయన ఫలానావాటిని చేసినట్లుగా లేదా వాటికి కారకుడైనట్లుగా మాట్లాడతాయి, కానీ వాస్తవానికి ఆయన వాటిని కేవలం అనుమతిస్తాడంతే. (రూతు 1:20, 21) కాబట్టి యేసు సూచించినట్లుగా మనం ప్రార్థించడం ద్వారా, శోధనకు మనల్ని విడిచిపెట్టవద్దని మనం యెహోవాను వేడుకుంటాం. ఆయన మనల్ని అలా విడిచిపెట్టడు, ఎందుకంటే లేఖనాలు మనకు ఇలా అభయమిస్తున్నాయి: “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.”​—1 కొరింథీయులు 10:13.

12. ‘దుష్టునినుండి మమ్మును తప్పించుము’ అని మనమెందుకు ప్రార్థిస్తాం?

12 మాదిరి ప్రార్థనలో శోధన గురించి ప్రస్తావించిన తర్వాత, యేసు సముచితంగా ఇలా అన్నాడు: “దుష్టునినుండి మమ్మును తప్పించుము.” (మత్తయి 6:13) ఆ మాటల్ని కొన్ని బైబిలు అనువాదాల్లో ఇలా చదువుతాం: “దుర్మార్గతనుంచి మమ్ములను రక్షించు” (పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) లేదా “కీడునుండి మమ్మల్ని కాపాడు.” (కంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌) లేఖనాల్లో ‘తప్పించుము’ అనే మాట ముఖ్యంగా మనుష్యుల సంబంధంగానే ఉపయోగించబడింది. అయితే మత్తయి సువార్త అపవాది ‘శోధకుడని’ అంటే, ఒక వ్యక్తని సూచిస్తోంది. (మత్తయి 4:3, 11) కాబట్టి ‘దుష్టుడైన’ అపవాదియగు సాతాను నుండి తప్పించమని ప్రార్థించడం ప్రాముఖ్యం. మనం దేవునికి వ్యతిరేకంగా పాపానికి ఒడిగట్టేలా చేయడానికి అతడు ప్రయత్నిస్తాడు. (1 థెస్సలొనీకయులు 3:5) ‘దుష్టునినుండి మమ్మును తప్పించుము’ అని మనం వేడుకున్నప్పుడు, సాతానుచేత మోసగించబడకుండా ఉండేలా మనల్ని నడిపించమనీ, సహాయం చేయమనీ మన పరలోకపు తండ్రిని అడుగుతున్నవారిగా ఉంటాం.

సాతానుచేత మోసగించబడకండి

13, 14. ఒకప్పుడు దుర్నీతిపరునిగా ఉన్న సంఘస్థుని విషయంలో కొరింథీయుల వ్యవహార విధానం ఎందుకు మారాలి?

13 కొరింథులోని క్రైస్తవులు క్షమించేవారిగా ఉండాలని ఉద్బోధిస్తూ పౌలు వారికిలా వ్రాశాడు: “మీరు దేనిగూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారముకాము.” (2 కొరింథీయులు 2:10, 11) అపవాది మనల్ని వివిధరకాలుగా మోసగించవచ్చు, కానీ పౌలు పైన ఉదాహరించిన మాటలను ఎందుకు పలికాడు?

14 దుర్నీతిపరుడైన వ్యక్తి సంఘంలో కొనసాగేలా అనుమతించినందుకు పౌలు కొరింథీయులను గద్దించాడు. ‘అన్యజనులలోనైనను జరగని అట్టి జారత్వాన్ని’ సహిస్తున్న కారణంగా సంఘానికొస్తున్న నిందనుబట్టి సాతాను సంతోషించి ఉండవచ్చు. చివరకు ఆ తప్పిదస్థుడు బహిష్కరించబడ్డాడు. (1 కొరింథీయులు 5:1-5, 11-13) ఆ వ్యక్తి ఆ తర్వాత పశ్చాత్తాపపడ్డాడు. ఒకవేళ కొరింథీయులు క్షమించడానికి నిరాకరించి ఆ వ్యక్తిని తిరిగి చేర్చుకోకపోతే, అపవాది వారిని మరోవిధంగా మోసగిస్తాడు. ఏ విధంగా? వారు కూడా సాతానులాగే కఠినంగా, నిర్దయగా ఉంటారు. పశ్చాత్తాపపడిన ఆ వ్యక్తి ‘అత్యధికమైన దుఃఖములో మునిగిపోయి’ దేవుణ్ణి ఆరాధించడం మానుకుంటే, ప్రాముఖ్యంగా పెద్దలు దయగల దేవుడైన యెహోవా ఎదుట కొంతమేరకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. (2 కొరింథీయులు 2:7; యాకోబు 2:13; 3:1) అవును, క్రూరంగా, కఠినంగా, నిర్దయగా ఉంటూ సాతానును అనుకరించాలని ఏ నిజ క్రైస్తవుడూ కోరుకోడు.

దేవుడిచ్చే కవచముచేత కాపాడబడుట

15. మనమెలాంటి యుద్ధం చేస్తున్నాం, మన విజయం దేనిపై ఆధారపడివుంటుంది?

15 మనం అపవాది నుండి తప్పించబడాలంటే, దురాత్మల సమూహాలతో మనం ఆధ్యాత్మిక యుద్ధం జరిగించాలి. అలాంటి దురాత్మలపై విజయం, “దేవుడిచ్చు సర్వాంగకవచమును” మనం ధరించుకోవడం మీదే ఆధారపడి ఉంటుంది. (ఎఫెసీయులు 6:11-18) ఈ కవచములో “నీతియను మైమరువు” ఉంది. (ఎఫెసీయులు 6:14) ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సౌలు దేవునికి అవిధేయుడై పరిశుద్ధాత్మ సహాయాన్ని కోల్పోయాడు. (1 సమూయేలు 15:22, 23) కానీ మనం నీతిని అభ్యసిస్తూ, ఆధ్యాత్మిక సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే, మనం దేవుని పరిశుద్ధాత్మనూ, సాతానుకు అతని దుష్టదూతలైన దయ్యాలకు విరుద్ధంగా మనకవసరమైన కాపుదలనూ కలిగివుంటాం.​—సామెతలు 18:10.

16. దురాత్మల సమూహాలకు విరుద్ధంగా ఎడతెగని కాపుదలను మనమెలా కలిగివుండగలం?

16 దురాత్మల సమూహాలకు విరుద్ధంగా ఎడతెగని కాపుదల కోసం మనం, ఇతర విషయాలతోపాటు దేవుని వాక్యాన్ని క్రమంగా చదివి దానిని ధ్యానిస్తూ ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ అందిస్తున్న ప్రచురణలను సద్వినియోగం చేసుకోవాలి. (లూకా 12:42) ఆ విధంగా మనం పౌలు ఇచ్చిన ఈ ఉపదేశానికి అనుగుణంగా మన మనస్సులను ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక అంశాలతో నింపుకుంటాం: “మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచుకొనుడి.”—ఫిలిప్పీయులు 4:8.

17. సువార్తను సమర్థంగా ప్రకటించేవారిగా ఉండేందుకు మనకేది సహాయం చేస్తుంది?

17 “పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు” కలిగివుండే శక్తిని యెహోవా మనకిస్తాడు. (ఎఫెసీయులు 6:15) క్రైస్తవ కూటాల్లో క్రమంగా భాగం వహించడం దేవుని రాజ్యసువార్త ప్రకటించేందుకు మనల్ని సిద్ధం చేస్తుంది. దేవుని గూర్చిన సత్యం నేర్చుకొని, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అనుభవించేలా ఇతరులకు సహాయం చేయడం మనకెంత ఆనందాన్నిస్తుందో కదా! (యోహాను 8:32) “దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము” అబద్ధ బోధల నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు ఎంతో దోహదపడుతూ, “దుర్గములను పడద్రోయజాలినంత బలము”గలదై ఉంది. (ఎఫెసీయులు 6:17; 2 కొరింథీయులు 10:4, 5) దేవుని లిఖిత వాక్యమైన బైబిలును నైపుణ్యంగా ఉపయోగించడం సత్యాన్ని బోధించేందుకు మనకు సహాయం చేస్తూ, అపవాది తంత్రాలకు బలికాకుండా మనల్ని కాపాడుతుంది.

18. ‘అపవాది తంత్రములను ఎదిరించుటకు’ మనమెలా ‘స్థిరంగా నిలబడగలం’?

18 మన ఆధ్యాత్మిక కవచాన్ని గురించిన చర్చను ఆరంభిస్తూ పౌలు ఇలా అన్నాడు: “ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు [‘స్థిరంగా నిలబడునట్లు,’ NW] దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.” (ఎఫెసీయులు 6:10, 11) ‘స్థిరంగా నిలబడు’ అని అనువదించబడిన గ్రీకు పదం, సైనికుడు తన స్థానంలో తీరి నిలబడడానికి సంబంధించినది. మన ఐక్యతను భంగపరచి, మన బోధలను భ్రష్టుపట్టించే లేదా దేవునిపట్ల మన యథార్థతను భంగపరిచే తన ప్రయత్నాల్లో సాతాను వివిధ తంత్రాలను ఉపయోగించినా, మన ఆధ్యాత్మిక యుద్ధంలో మనం స్థిరంగా నిలబడతాం. ఇప్పటివరకు అపవాది దాడులు విజయవంతం కాలేదు, ఇక ఎన్నటికీ కావు!a

అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడు

19. అపవాదిని వ్యతిరేకించే విషయంలో గట్టిచర్య తీసుకోగల ఒక మార్గమేమిటి?

19 అపవాదికీ, అతని నిర్దేశంలోని దురాత్మల సమూహాలకూ విరుద్ధంగా చేసే ఆధ్యాత్మిక యుద్ధంలో మనం విజయం సాధించవచ్చు. సాతానుకు భయపడాల్సిన పనేలేదు, ఎందుకంటే శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.” (యాకోబు 4:7) సాతానును, అతనికి సహకరించే దుష్టాత్మలను వ్యతిరేకించే విషయంలో గట్టిచర్య తీసుకోగల ఒక మార్గమేమిటంటే, మంత్రతంత్ర అభ్యాసాలతో, వాటిలో పాల్గొనేవారితో ఎలాంటి సంబంధం లేకుండా ఉండడమే. యెహోవా సేవకులు శకునం చూడడం లేదా జ్యోతిష్యం, సోదె, అభిచారం వంటివాటిలో పాల్గొనకూడదని లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. మనం ఆధ్యాత్మికంగా చురుకుగా, బలంగా ఉన్నప్పుడు, మనమీద ఎవరైనా మంత్ర ప్రయోగం చేస్తారని భయపడనక్కర్లేదు.​—సంఖ్యాకాండము 23:23; ద్వితీయోపదేశకాండము 18:10-12; యెషయా 47:12-15; అపొస్తలుల కార్యములు 19:18-20.

20. అపవాదిని మనమెలా ఎదిరించవచ్చు?

20 బైబిలు ప్రమాణాలకు, సత్యాలకు హత్తుకొని అపవాదికి విరుద్ధంగా స్థిరంగా నిలబడడం ద్వారా మనం ‘అపవాదిని ఎదిరిస్తాం.’ లోకం సాతానుకు తగ్గట్టుగా ఉంది, ఎందుకంటే అతనే దాని దేవుడు. (2 కొరింథీయులు 4:4) కాబట్టి మనం అహంకారం, స్వార్థం, లైంగిక దుర్నీతి, దౌర్జన్యం, ఐశ్వర్యాసక్తి వంటి లోకసంబంధమైన లక్షణాలను విసర్జిస్తాం. అరణ్యంలో శోధించబడిన సమయంలో లేఖనాలను ఉపయోగించడం ద్వారా యేసు అపవాది దాడిని నిరోధించినప్పుడు వాడు పారిపోయాడని మనకు తెలుసు. (మత్తయి 4:4, 7, 10, 11) అదేవిధంగా, మనం యెహోవాకు పూర్తిగా లోబడుతూ, ప్రార్థనాపూర్వకంగా ఆయనపై ఆధారపడినప్పుడు సాతాను ఓటమితో ‘మననుండి పారిపోతాడు.’ (ఎఫెసీయులు 6:18) యెహోవా దేవుని, ఆయన ప్రియకుమారుని మద్దతు ఉన్నప్పుడు ఎవరూ మనకు శాశ్వత హాని చేయలేరు, చివరకు అపవాది కూడా అలాంటి హాని చేయలేడు.​—కీర్తన 91:9-11.

[అధస్సూచి]

a దేవుడిచ్చిన ఆధ్యాత్మిక కవచమును గురించిన అదనపు సమాచారం కోసం కావలికోట (ఆంగ్లం) మే 15, 1992, 21-3 పేజీలు చూడండి.

మీ జవాబేమిటి?

• అపవాదియగు సాతానుకు మనం భయపడాలా?

• క్రైస్తవుల మీదికి సాతాను ఎందుకు హింసను తీసుకొస్తాడు?

• “దుష్టుని” నుండి తప్పించబడాలని మనమెందుకు ప్రార్థిస్తాం?

• ఆధ్యాత్మిక యుద్ధంలో మనమెలా విజయం సాధించవచ్చు?

[26వ పేజీలోని చిత్రం]

ధైర్యవంతులైన క్రీస్తు తొలి అనుచరులు మరణం వరకు నమ్మకస్థులుగా నిరూపించుకున్నారు

[27వ పేజీలోని చిత్రం]

యెహోవా జ్ఞాపకంలో ఉన్నవారి పునరుత్థానాన్ని అపవాది ఆపలేడు

[28వ పేజీలోని చిత్రం]

“దుష్టుని” నుండి తప్పించమని మీరు ప్రార్థిస్తారా?

[29వ పేజీలోని చిత్రం]

“దేవుడిచ్చు సర్వాంగకవచమును” మీరు ధరించుకుంటున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి