పాఠకుల ప్రశ్నలు
“స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను” అని పౌలు చెప్పినప్పుడు, ఆయన భావమేమిటి?
కొరింథులోని క్రైస్తవ సంఘానికి పౌలు ఇలా వ్రాశాడు: ‘పరిశుద్ధుల సంఘములన్నిటిలోలాగే స్త్రీలు మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు.’ (1 కొరింథీయులు 14:33, 34) మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకునేందుకు, పౌలు ఉపదేశమిచ్చిన సందర్భాన్ని పరిశీలించడం సహాయం చేస్తుంది.
1 కొరింథీయులు 14వ అధ్యాయంలో పౌలు, క్రైస్తవ సంఘంలో జరిగే కూటాలకు సంబంధించిన విషయాల గురించి చర్చించాడు. అటువంటి కూటాల్లో ఏమి చర్చించబడాలో వివరించి, అవి ఎలా నిర్వహించబడాలో ఉపదేశించాడు. (1 కొరింథీయులు 14:1-6, 26-34) అంతేకాక, ‘సంఘము క్షేమాభివృద్ధి పొందడమే’ క్రైస్తవ కూటాల ముఖ్యోద్దేశమని నొక్కిచెప్పాడు.—1 కొరింథీయులు 14:4, 5, 12, 26.
“మౌనముగా ఉండవలెను” అని పౌలు ఇచ్చిన ఆదేశం 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో మూడుసార్లు కనిపిస్తుంది. ప్రతీసారి అది సంఘంలోని వేర్వేరు గుంపులను ఉద్దేశించి చెప్పబడినప్పటికీ, అన్ని సందర్భాల్లోనూ ‘సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగవలెను’ అనే కారణంతోనే ఇవ్వబడింది.—1 కొరింథీయులు 14:39.
మొదటి సందర్భంలో పౌలు ఇలా అన్నాడు: “భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.” (1 కొరింథీయులు 14:27, 28) అటువంటి వ్యక్తి ఇక ఎన్నటికీ కూటాల్లో మాట్లాడకూడదు అని కాదుగానీ, అతను కొన్ని సందర్భాల్లో మాత్రమే మౌనంగా ఉండాలి అని దానర్థం. సంఘకూటాలు పరస్పర క్షేమాభివృద్ధి కోసమే నిర్వహించబడతాయి కాబట్టి, ఆయన ఎవరికీ అర్థంకాని భాషలో మాట్లాడితే ఆ ఉద్దేశం నెరవేరదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
రెండవ సందర్భంలో పౌలు ఇలా చెప్పాడు: “ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలుపరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.” దీనర్థం మొదటి ప్రవక్త కొన్ని సందర్భాల్లో మాత్రమే మౌనంగా ఉండాలనితప్ప కూటాల్లో మాట్లాడడమే ఆపేయాలని కాదు. అప్పుడే, తనకు అద్భుతంగా విషయాలు వెల్లడిచేయబడిన వ్యక్తి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడగలడు, “అందరూ హెచ్చరిక పొందా[లనే]” లేదా ప్రోత్సాహం పొందాలనే కూటాల ఉద్దేశం నెరవేరుతుంది.—1 కొరింథీయులు 14:26, 29-31.
మూడవసారి, క్రైస్తవ స్త్రీలను మాత్రమే ఉద్దేశించి మాట్లాడుతూ పౌలు ఇలా అన్నాడు: “స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు.” (1 కొరింథీయులు 14:34) పౌలు, సహోదరీలకు ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు? ఎందుకంటే, సంఘంలోని సమాధానాన్ని లేక క్రమాన్ని కాపాడడానికే. ఆయన ఇలా అంటున్నాడు: “వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.”—1 కొరింథీయులు 14:35.
బహుశా కొంతమంది సహోదరీలు సంఘంలో చెప్పబడినదానిని సవాలు చేసివుండవచ్చు. పౌలు ఇచ్చిన ఉపదేశం సహోదరీలకు అటువంటి క్రమశిక్షణలేని స్వభావాన్ని విడిచిపెట్టి, దేవుని శిరసత్వ ఏర్పాటులో, ప్రత్యేకంగా తమ భర్తలకు సంబంధించిన తమ స్థానాన్ని వినయంగా అంగీకరించేందుకు సహాయం చేసింది. (1 కొరింథీయులు 11:3) అంతేకాక, మౌనంగా ఉండడం ద్వారా సహోదరీలు, తాము సంఘంలో బోధించేవారిగా ఉండాలని కోరుకోవడం లేదని చూపిస్తారు. పౌలు తిమోతికి వ్రాసినప్పుడు, ఒక స్త్రీ బోధకుని పాత్ర పోషించడం అనుచితమని చూపించాడు: “స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.”—1 తిమోతి 2:12.
అంటే క్రైస్తవ స్త్రీ కూటాలలో అసలు మాట్లాడకూడదని దాని భావమా? కాదు. పౌలు కాలంలో కూడా క్రైస్తవ స్త్రీలు బహుశా పరిశుద్ధాత్మచేత ప్రేరేపింపబడినవారై, సంఘంలో ప్రార్థన చేసిన లేక ప్రవచించిన సందర్భాలున్నాయి. అటువంటి సమయాల్లో, వారు తలపై ముసుగు వేసుకోవడం ద్వారా తమ స్థానాన్ని గుర్తించారు.a (1 కొరింథీయులు 11:5) అంతేకాక, పౌలు కాలంలోనేకాక, నేడు కూడా సహోదరీలు సహోదరులతో కలిసి తమ నిరీక్షణను బహిరంగంగా ఒప్పుకోవాలని లేదా ప్రకటించాలని ఉద్బోధించబడుతున్నారు. (హెబ్రీయులు 10:23-25) క్షేత్రసేవలోనేకాక, కూటాల్లో ప్రశ్న అడగబడినప్పుడు చక్కగా సిద్ధపడిన వాఖ్యానాలను ఇవ్వడం, ప్రదర్శనల్లో, విద్యార్థి ప్రసంగాల్లో భాగంవహించే నియామకాలను అంగీకరించడం ద్వారా సహోదరీలు తమ నిరీక్షణను ప్రకటిస్తూ ఇతరులను ప్రోత్సహిస్తారు.
కాబట్టి క్రైస్తవ స్త్రీలు, సంఘానికి బోధించడంలో పురుషుల పాత్రను పోషించడానికి ప్రయత్నించకుండా ఉండడం ద్వారా ‘మౌనముగా ఉండగలరు.’ సంఘంలో బోధించేవారి అధికారాన్ని సవాలు చేసే వివాదాస్పదమైన ప్రశ్నలు వారు అడగరు. సంఘంలో వారికివ్వబడిన ఖచ్చితమైన పాత్రను నిర్వర్తించడం ద్వారా క్రైస్తవ సహోదరీలు, ‘సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరిగే (సంఘ కూటాల్లో)’ శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ఎంతగానో తోడ్పడతారు.—1 కొరింథీయులు 14:26, 33.
[అధస్సూచి]
a ఆధునిక కాలాల్లో, పరిణతి చెందిన సహోదరీలు సంఘ ఏర్పాటులో బాప్తిస్మం తీసుకున్న పురుషునికి ప్రత్యామ్నాయంగా పనిచేయాల్సి వచ్చినప్పుడు వారు ఆ మాదిరినే అనుసరిస్తారు.—కావలికోట, జూలై 15, 2002, 26వ పేజీ చూడండి.