“ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను”
“మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.”—రోమీయులు 14:11-12.
1. ముగ్గురు హెబ్రీయులు ఏ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించారు?
బబులోనులో నివసిస్తున్న ముగ్గురు హెబ్రీ యువకులు జీవన్మరణానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. ఆ దేశపు నియమం కోరినట్లుగా వారు ఆ పెద్ద ప్రతిమకు వంగి నమస్కారం చేయాలా? లేక వారు దానిని ఆరాధించడానికి తిరస్కరించి మండుతున్న అగ్ని కొలిమిలో పడవేయబడేందుకు ఒప్పుకోవాలా? షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు ఇతరులను సంప్రదించేంత సమయం లేదు; లేక వారలా చేయాల్సిన అవసరమూ లేదు. ఎలాంటి జంకూలేకుండా వారిలా చెప్పారు: “రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.” (దానియేలు 3:1-18) ఆ ముగ్గురు హెబ్రీ యువకులు తమ నిర్ణయానికి తామే బాధ్యత వహించారు.
2. యేసుక్రీస్తు విషయంలో పిలాతు తీసుకున్న నిర్ణయానికి నిజానికి ఎవరు బాధ్యులు, అది ఆ రోమా అధిపతిని జవాబుదారుణ్ణి కాకుండా చేసిందా?
2 దాదాపు ఆరు శతాబ్దాల తర్వాత, ఒక వ్యక్తిపై వేయబడిన ఆరోపణలను ఒక అధిపతి విన్నాడు. ఆ వాదనలన్నీ పరిశీలించిన మీదట ఆ నిందితుడు నిరపరాధి అనే నమ్మకం ఆయనకు ఏర్పడింది. కానీ జనసమూహం ఆ నిందితుడికి మరణశిక్ష విధించాలని పట్టుబట్టింది. వారి పంతం నెగ్గకుండా చేసేందుకు కొంతసేపు ప్రయత్నించిన తర్వాత, ఆ అధిపతి తన బాధ్యతను నిర్వర్తించడానికి ఇష్టపడకుండా, ఆ ఒత్తిడికి లొంగిపోయాడు. ఆయన తన చేతులు కడుక్కుంటూ ఇలా అన్నాడు: “ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని.” ఆ తర్వాత ఆయన ఆ వ్యక్తిని కొరతవేసేందుకు అప్పగించాడు. అవును, పొంతి పిలాతు యేసుక్రీస్తుకు సంబంధించి నిర్ణయం తీసుకోవలసిన తన బాధ్యతను నిర్వర్తించే బదులు ఇతరులు తనకోసం నిర్ణయం తీసుకునేందుకు అనుమతించాడు. ఎన్ని నీళ్లతో తన చేతులు కడుక్కున్నా, యేసుపై అన్యాయంగా విధించిన శిక్షకు ఆయనే జవాబుదారుడు.—మత్తయి 27:11-26; లూకా 23:13-25.
3. మన కోసం ఇతరులు నిర్ణయాలు తీసుకోవడాన్ని మనమెందుకు అనుమతించకూడదు?
3 మీ విషయమేమిటి? సొంతగా నిర్ణయాలు తీసుకోవాల్సివస్తే, మీరు ఆ ముగ్గురు హెబ్రీయుల్లా ఉంటారా లేక ఇతరులు మీ కోసం నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతిస్తారా? నిర్ణయాలు తీసుకోవడం సులభమేమీ కాదు. సరైన ఎంపికలు చేసుకునేందుకు పరిణతి కావాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు తమ చిన్నపిల్లల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నిజమే, పరిస్థితి సంక్లిష్టంగా ఉండి, వివిధ విషయాలను జాగ్రత్తగా పరిశీలించవలసి ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. అయితే, నిర్ణయాలు తీసుకునే ఈ బాధ్యత, “ఆత్మసంబంధులైన” వారు మన విషయంలో మోసే భారములలో లేదా కష్టమైన వాటిలో చేర్చవలసినంత బరువైనదేమీ కాదు. (గలతీయులు 6:1, 2) బదులుగా, అది “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవ[లసిన]” భారమైయుంది. (రోమీయులు 14:11-12) “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను” అని బైబిలు చెబుతోంది. (గలతీయులు 6:5) కాబట్టి, జీవితంలో మనమెలా జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవచ్చు? మొదట, మనం మన మానవ పరిమితులను గుర్తించి, వాటిని పూరించేందుకు ఏమి అవసరమో తెలుసుకోవాలి.
కీలకమైన అవసరత
4. నిర్ణయాలు తీసుకునే విషయంలో, మొదటి మానవ దంపతుల అవిధేయత నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి?
4 మానవ చరిత్రారంభంలో, ఆది దంపతులు తీసుకున్న నిర్ణయం విపత్కర ఫలితాలను తెచ్చింది. వారు మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినాలని నిర్ణయించుకున్నారు. (ఆదికాండము 2:16, 17) వారి నిర్ణయానికి ఆధారమేమిటి? “స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 3:6) హవ్వ నిర్ణయం స్వార్థపూరిత కోరికపై ఆధారపడివుంది. ఆమె చేసినపని, ఆదాము కూడా ఆమెతో చేతులు కలిపేందుకు దారితీసింది. ఫలితంగా, పాపమరణాలు “అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) ఆదాముహవ్వల అవిధేయత మానవ పరిమితుల గురించిన ఈ ప్రాముఖ్యమైన పాఠాన్ని మనకు నేర్పించాలి: మానవుడు దైవిక మార్గనిర్దేశానికి హత్తుకోకపోతే, అతడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది.
5. యెహోవా మనకెలాంటి మార్గనిర్దేశాన్ని అనుగ్రహించాడు, దానినుండి ప్రయోజనం పొందేందుకు మనమేమి చేయాలి?
5 యెహోవా దేవుడు మార్గనిర్దేశం లేకుండా మనల్ని వదిలేయనందుకు మనమెంత సంతోషిస్తున్నామో కదా! లేఖనాలు మనకిలా చెబుతున్నాయి: “మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.” (యెషయా 30:21) యెహోవా మనతో తన ప్రేరిత వాక్యమైన బైబిలు ద్వారా మాట్లాడుతున్నాడు. మనం లేఖనాలను పఠించి వాటి ప్రామాణిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకునేందుకు మనం ‘వయస్సు వచ్చినవారికి తగిన బలమైన ఆహారం’ తీసుకోవాలి. “అభ్యాసముచేత” మనం “మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు” కూడా కలిగివుంటాం. (హెబ్రీయులు 5:14) దేవుని వాక్యం నుండి నేర్చుకునేవాటిని అన్వయించుకోవడం ద్వారా మనం మన జ్ఞానేంద్రియాలకు శిక్షణనివ్వవచ్చు.
6. మన మనస్సాక్షి సరిగా పనిచేయాలంటే ఏమి అవసరం?
6 నిర్ణయాలు తీసుకునే ప్రక్రియకు, మనకు వారసత్వంగా లభించిన మనస్సాక్షి అత్యంత ప్రాముఖ్యం. మన మనస్సాక్షికి విచక్షణా సామర్థ్యముంది, అది మనపై ‘తప్పు మోపవచ్చు లేక తప్పులేదని చెప్పవచ్చు.’ (రోమీయులు 2:14, 15) అయితే మన మనస్సాక్షి సరిగా పనిచేయాలంటే, దానికి దేవుని వాక్యంలోని ప్రామాణిక జ్ఞానంచేత శిక్షణ ఇవ్వబడాలి, ఆ వాక్య అన్వయింపుతో సున్నితం చేయబడాలి. అలా శిక్షణ ఇవ్వబడని మనస్సాక్షి స్థానిక ఆచారాలతో, అలవాట్లతో సులభంగా ప్రభావితం చేయబడుతుంది. మన పరిసరాలు, ఇతరుల అభిప్రాయాలు కూడా మనల్ని తప్పుదోవ పట్టించగలవు. అది చేసే హెచ్చరికలను పదేపదే పెడచెవినబెడుతూ, దైవిక ప్రమాణాలను ఉల్లంఘిస్తుంటే ఏమి జరుగుతుంది? చివరకది కాలిన శరీరంపై మచ్చ ఏర్పడినట్లుగా “వాతవేయబడి” మొద్దుబారిపోయి, స్పందనలేనిదిగా తయారవగలదు. (1 తిమోతి 4:3) దానికి భిన్నంగా, దేవుని వాక్యంచేత శిక్షణ ఇవ్వబడిన మనస్సాక్షి సురక్షితమైన మార్గదర్శినిగా ఉంటుంది.
7. జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైన అవసరత ఏమిటి?
7 కాబట్టి, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యతకు కీలకమైన అవసరత ఏమిటంటే, లేఖనాల ప్రామాణిక జ్ఞానం, దాన్ని అన్వయించుకునే సామర్థ్యం. అనాలోచితంగా, తొందరపడి నిర్ణయాలు తీసుకునే బదులు, దైవిక సూత్రాలను పరిశీలించేందుకు సమయం తీసుకొని, వాటిని అన్వయించుకోవడంలో మన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించాలి. మనకు దేవునివాక్య ప్రామాణిక జ్ఞానంతోపాటు, దానిచే శిక్షణ ఇవ్వబడిన మనస్సాక్షి కూడా ఉంటే, షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లా వెంటనే నిర్ణయాలు తీసుకోవలసివచ్చినా మనం చక్కగా సిద్ధపడివుంటాం. పరిణతిచెందడం, నిర్ణయాలు తీసుకునే మన సామర్థ్యాన్ని ఎలా పదునుపెట్టగలదో గ్రహించేందుకు మనం జీవితంలోని రెండు రంగాలను పరిశీలిద్దాం.
మన సహవాసులు ఎవరు?
8, 9. (ఎ) చెడు సహవాసాలకు దూరంగావుండవలసిన అవసరతను ఏ సూత్రాలు వివరిస్తున్నాయి? (బి) కేవలం నీతివిరుద్ధ ప్రజలతో సహవసించడమే దుష్టసాంగత్యం అవుతుందా? వివరించండి.
8 “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 15:33) యేసుక్రీస్తు తన శిష్యులకిలా చెప్పాడు: “మీరు లోకసంబంధులు కారు.” (యోహాను 15:19) ఆ సూత్రాలను మనం తెలుసుకున్నప్పుడు, జారులు, వ్యభిచారులు, దొంగలు, త్రాగుబోతులు వంటివారి సహవాసానికి దూరంగా ఉండాలని వెంటనే అర్థంచేసుకుంటాం. (1 కొరింథీయులు 6:9, 10) అయితే బైబిలు సత్యానికి సంబంధించిన మన జ్ఞానం పెరిగేకొద్దీ అలాంటివారిని సినిమాల్లో, టీవీలో లేదా కంప్యూటర్ స్క్రీన్‌పై చూడడం ద్వారా లేదా పుస్తకాల్లో వారి గురించి చదవడం ద్వారా వారితో సమయం గడపడం కూడా అంతే హానికరమని మనం గ్రహిస్తాం. ఇంటర్నెట్ ఛాట్‌రూమ్స్‌లో, తామెవరో వెల్లడిచేయని “వేషధారులతో” సహవాసం చేయడం కూడా అలాంటిదేనని చెప్పవచ్చు.—కీర్తన 26:4.
9 నైతిక శుభ్రతవున్నా, సత్యదేవునిపై విశ్వాసం లేనివారితో సన్నిహితంగా సహవసించే విషయమేమిటి? లేఖనాలు మనకిలా చెబుతున్నాయి: “లోకమంతయు దుష్టుని యందున్నది.” (1 యోహాను 5:19) విచ్చలవిడిగా జీవించే ప్రజలతో లేక నైతికంగా దిగజారిన ప్రజలతో సహవాసం చేయడం మాత్రమే దుష్టసాంగత్యం కాదని మనం గ్రహిస్తాం. కాబట్టి, యెహోవాను ప్రేమించేవారితో మాత్రమే సన్నిహిత స్నేహాలు పెంపొందించుకోవడం జ్ఞానయుక్తం.
10. లోకంతో సంబంధం కలిగివుండే విషయంలో పరిణతిగల నిర్ణయాలు తీసుకునేందుకు మనకేది సహాయం చేస్తుంది?
10 లోక ప్రజలతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండడం సాధ్యమూ కాదు, అది అవసరమూ లేదు. (యోహాను 17:15) క్రైస్తవ పరిచర్యలో పాల్గొనడం, పాఠశాలకు, ఉద్యోగానికి వెళ్ళడంలాంటి వాటన్నింటిలో లోకస్థులతో సంబంధం ఇమిడివుంది. అవిశ్వాసిని వివాహం చేసుకున్న క్రైస్తవ వ్యక్తి ఇతరులకన్నా ఎక్కువగా లోకంతో వ్యవహరించవలసి ఉంటుంది. అయితే జ్ఞానేంద్రియములు సాధకము చేయబడినవారంగా, లోకంతో పరిమిత సంబంధం కలిగివుండడం ఒక విషయమైతే, దానితో సన్నిహిత బాంధవ్యాలు పెంపొందించుకోవడం పూర్తిగా మరో విషయమని మనమర్థం చేసుకుంటాం. (యాకోబు 4:4) ఆ విధంగా మనం క్రీడలు, నాట్యాల వంటి పాఠశాలానంతర కార్యక్రమాల్లో పాల్గొనాలా వద్దా, తోటి ఉద్యోగస్థుల కోసం ఏర్పాటుచేయబడిన పార్టీలకు, ప్రత్యేక విందులకు హాజరవ్వాలా వద్దా అనేవాటిలో పరిణతిగల నిర్ణయాలు తీసుకోగలుగుతాం.
ఉద్యోగాన్ని ఎంచుకోవడం
11. ఉద్యోగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకొనేటప్పుడు మొదట ఏమి పరిశీలించుకోవాలి?
11 ‘ఇంటివారిని సంరక్షించవలసిన’ బాధ్యతను నిర్వర్తించేందుకు నిర్ణయాలు తీసుకోవడంలో పరిణతిగల రీతిలో బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం మనకు సహాయం చేస్తుంది. (1 తిమోతి 5:8) అది ఎలాంటి ఉద్యోగం, దానిలో మనమేమి చేయవలసి ఉంటుంది అనేది మనం మొదట పరిశీలించాలి. బైబిల్లో నేరుగా ఖండించబడిన పనిని చేసేందుకు పురికొల్పే ఉద్యోగాన్ని ఎంచుకోవడం ఖచ్చితంగా తప్పే. కాబట్టి నిజక్రైస్తవులు విగ్రహారాధన, దొంగతనం, రక్తాన్ని దుర్వినియోగం చేయడం లేదా ఇతరత్రా లేఖనరహిత అభ్యాసాలు ఇమిడివున్న ఉద్యోగాలను చేయరు. మనం అబద్ధమాడాలని, మోసం చేయాలని యజమాని బలవంతపెట్టినప్పుడు కూడా మనమా పనులు చేయము.—అపొస్తలుల కార్యములు 15:28; ప్రకటన 21:8.
12, 13. ఉద్యోగ సంబంధ నిర్ణయాలు తీసుకోవడంలో పరిగణలోకి తీసుకోవలసిన మరికొన్ని ప్రాముఖ్యమైన అంశాలేమిటి?
12 ఆ ఉద్యోగం ప్రత్యేకంగా ఏ దైవిక నియమాన్నీ ఉల్లంఘించనిదైతే అప్పుడేమిటి? సత్యాన్ని గురించిన జ్ఞానంలో ఎదుగుతూ, మన గ్రహణశక్తులు మెరుగవుతుండగా పరిశీలించవలసిన ఇతర విషయాలనూ మనం గ్రహిస్తాం. జూదానికి సంబంధించిన సంస్థలో ఫోన్ ద్వారా జవాబిచ్చేలాంటి లేఖనరహిత పని చేయవలసివచ్చే ఉద్యోగం విషయమేమిటి? జీతం ఎవరిస్తారు, ఉద్యోగస్థలమెక్కడ అనే విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, స్వయంగా కంట్రాక్టుకు పని తీసుకొనిచేసే క్రైస్తవుడు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల్లో ఒకదానికి రంగువేసే పనిని చేపట్టి, అబద్ధారాధనను పురికొల్పడంలో పాలుపంచుకుంటామా?—2 కొరింథీయులు 6:14-16.
13 మనకు ఉద్యోగమిచ్చిన యజమాని ఒక సందర్భంలో ఒక అబద్ధారాధనా స్థలాన్ని అందంగా తీర్చిదిద్దే పనిని కంట్రాక్టుకు తీసుకుంటే అప్పుడేమిటి? అలాంటి సందర్భాల్లో అక్కడ జరుగుతున్న పనిలో మనకు ఎంత అధికారముంది, మనమెంత మేరకు ఆ పనిలో ఇమిడివున్నామనే అంశాలను పరిశీలించాలి. చెడు అభ్యాసాలను పురికొల్పే స్థలాలతోపాటు సమాజంలోని ప్రాంతాలన్నింటికీ ఉత్తరాలు బట్వాడా చేసేలాంటి న్యాయసమ్మతమైన పనిచేసే విషయమేమిటి? మత్తయి 5:45లో చెప్పబడిన సూత్రం మన నిర్ణయాలపై ప్రభావం చూపించవద్దా? అనుదినం మనం చేసే పని మన మనస్సాక్షిపై ఎలా ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని అలక్ష్యం చేయకూడదు. (హెబ్రీయులు 13:18) అవును, ఉద్యోగానికి సంబంధించి పరిణతిగల నిర్ణయాలు తీసుకోవలసిన మన బాధ్యతను నిర్వర్తించడానికి, మన గ్రహణశక్తులకు పదునుపెట్టుకుంటూ దేవుడు దయచేసిన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వడం అవసరం.
“నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము”
14. నిర్ణయాలు తీసుకోవడంలో, మనం ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి?
14 ప్రాపంచిక విద్యనభ్యసించడం, ఫలానా వైద్య చికిత్సను అంగీకరించడం లేదా తిరస్కరించడం వంటి ఇతర విషయాల సంబంధంగా మనం తీసుకునే నిర్ణయాల విషయమేమిటి? మనమేదైనా నిర్ణయం తీసుకోవలసివచ్చినప్పుడు, సంబంధిత బైబిలు సూత్రాలను రూఢీపరచుకొని, వాటిని అన్వయించుకోవడంలో మన తార్కిక సామర్థ్యాన్ని ఉపయోగించాలి. “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని ప్రాచీన ఇశ్రాయేలు రాజైన జ్ఞానియగు సొలొమోను అన్నాడు.—సామెతలు 3:5, 6.
15. నిర్ణయాలు తీసుకునే విషయంలో తొలి క్రైస్తవుల నుండి మనమేమి నేర్చుకుంటాం?
15 తరచూ, మనం చేసుకునే ఎంపికలు ఇతరులపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి, మనమా విషయం గురించి ఆలోచించడం అవసరం. ఉదాహరణకు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఇక ఏ మాత్రం మోషే ధర్మశాస్త్ర సంబంధమైన అనేక ఆహార నియమాల క్రిందలేరు. ఇతరత్రా అభ్యంతరం లేకపోయినా ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమని పరిగణించబడిన కొన్నిరకాల ఆహారాలను భుజించాలనుకోవచ్చు. అయితే, విగ్రహమున్న ఆలయంలో ఏదో ఒకరీతిలో ముడిపడివున్న జంతు మాంసం గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.” (1 కొరింథీయులు 8:11-13) ఇతరులకు అభ్యంతరం కలిగించకుండా ఉండేందుకు ఇతరుల మనస్సాక్షిని పరిగణలోనికి తీసుకోవాలని తొలి క్రైస్తవులు ప్రోత్సహించబడ్డారు. మన నిర్ణయాలు ‘అభ్యంతరము కలుగజేయకుండా’ ఉండాలి.—1 కొరింథీయులు 10:29, 32.
దైవిక జ్ఞానాన్ని వెదకండి
16. నిర్ణయాలు తీసుకోవడంలో ప్రార్థన మనకెలా సహాయకరంగా ఉంటుంది?
16 నిర్ణయాలు తీసుకోవడంలో ప్రార్థన అమూల్యమైన సహాయకం. “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు” అని శిష్యుడైన యాకోబు చెబుతున్నాడు. (యాకోబు 1:5) మనం నమ్మకంగా యెహోవాకు ప్రార్థించి సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన జ్ఞానం కోసం అర్థించవచ్చు. సత్యదేవునికి మన సమస్యల్ని చెప్పుకుని ఆయన నిర్దేశాన్ని వెదకుతుండగా, మనం పరిశీలిస్తున్న లేఖనాలను మరింత మెరుగ్గా అర్థంచేసుకునేందుకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసి, మనం అలక్ష్యం చేసిన లేఖనాల్ని మనకు గుర్తుచేయవచ్చు.
17. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ఇతరులు మనకెలా సహాయం చేయవచ్చు?
17 నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరులు మనకు సహాయం చేయగలరా? అవును, సంఘంలో పరిణతిగల వ్యక్తులను యెహోవా అనుగ్రహించాడు. (ఎఫెసీయులు 4:11, 12) ప్రత్యేకంగా, మనమొక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారిని సంప్రదించవచ్చు. ప్రగాఢమైన ఆధ్యాత్మిక అంతర్దృష్టి, జీవితంలో అనుభవం ఉన్న వ్యక్తులు మన నిర్ణయంపై ప్రభావం చూపించగల అదనపు దైవిక సూత్రాలను మన దృష్టికి తీసుకొచ్చి మనం “మరి శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారమగుటకు” సహాయం చేయవచ్చు. (ఫిలిప్పీయులు 1:9, 10) అయితే ఇక్కడొక హెచ్చరిక: మన కోసం ఇతరులు నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతించకుండా మనం జాగ్రత్తపడాలి. మన బాధ్యతా భారాన్ని మనమే మోయాలి.
ఎల్లప్పుడూ మంచి ఫలితాలే వస్తాయా?
18. మంచి నిర్ణయాలను తీసుకుంటే వచ్చే ఫలితాల గురించి ఏమి చెప్పవచ్చు?
18 బైబిలు సూత్రాలపై స్థిరంగా ఆధారపడి, మనస్సాక్షిపూర్వకంగా తీసుకున్న నిర్ణయాలు ఎల్లప్పుడూ మంచి ఫలితానికే దారితీస్తాయా? అవును, అవి చివరకు మంచికే దారితీస్తాయి. అయితే కొన్నిసార్లు, కొద్దికాలంపాటు అవి కష్టపరిస్థితిని తీసుకురావచ్చు. ఆ పెద్ద ప్రతిమను ఆరాధించకూడదనే తమ నిర్ణయం ఫలితంగా తాము మరణించవచ్చని షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు తెలుసు. (దానియేలు 3:16-19) అదేవిధంగా, తాము మనుషులకు కాదు దేవునికే లోబడవలెనని అపొస్తలులు యూదా మహాసభకు చెప్పిన తర్వాత, విడిచిపెట్టబడడానికి ముందు వారు కొరడాలతో కొట్టబడ్డారు. (అపొస్తలుల కార్యములు 5:27-29, 40) అంతేకాక, ‘కాలవశముచేత అనూహ్యంగా’ జరిగేది నిర్ణయ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. (ప్రసంగి 9:11, NW) సరైన నిర్ణయం తీసుకున్నప్పటికీ మనమేదోక రీతిలో కష్టాన్ని ఎదుర్కొంటే, దానిని సహించేందుకు యెహోవా మనకు సహాయం చేసి, చివరకు మనల్ని ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—2 కొరింథీయులు 4:7.
19. నిర్ణయాలు తీసుకోవడంలో మన బాధ్యతను ధైర్యంగా ఎలా నిర్వర్తించవచ్చు?
19 కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మనం లేఖన సూత్రాలను వెదకడమే కాక, వాటిని అన్వయించుకునేందుకు మన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించాలి. యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా, సంఘంలోని పరిణతిచెందినవారి ద్వారా అనుగ్రహించిన సహాయానికి మనమెంత కృతజ్ఞులమై ఉండగలమో కదా! అలాంటి నిర్దేశం, ఏర్పాట్ల మూలంగా జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవలసిన మన బాధ్యతను ధైర్యంగా నిర్వర్తిద్దాం.
మీరేమి నేర్చుకున్నారు?
• మంచి నిర్ణయాలు తీసుకునేందుకు కీలకమేమిటి?
• పరిణతిగలవారిగా ఎదగడం మన సహవాసుల ఎంపికపై ఎలా ప్రభావం చూపిస్తుంది?
• ఉద్యోగ సంబంధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం పరిశీలించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలేమిటి?
• నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి సహాయం అందుబాటులో ఉంది?
[22వ పేజీలోని చిత్రం]
ఆదాముహవ్వల అవిధేయత మనకొక ప్రాముఖ్యమైన పాఠం బోధిస్తోంది
[24వ పేజీలోని చిత్రం]
ఓ ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునేముందు, దైవిక సూత్రాలను వెదకండి