“మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను”
“యుద్ధము యెహోవాదే”
రెండు శత్రుసైన్యాలు లోయకు ఇరుపక్కలా ఎదురెదురుగా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు 40 రోజులుగా ఫిలిష్తీయుల యోధుడైన గొల్యాతు చేస్తున్న అవమానాలను భరిస్తూ భయంతో వణికిపోతున్నారు.—1 సమూయేలు 17:1-4, 16.
గొల్యాతు బిగ్గరగా ఇలా అంటూ ఇశ్రాయేలీయులను సవాలు చేస్తున్నాడు: “మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నాయొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసులమగుదుము. నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుము.”—1 సమూయేలు 17:8-10.
ప్రాచీన కాలాల్లో, యోధులు తమ సైన్యాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఒకరితో ఒకరు పోరాడడం సాధారణ విషయమే. పోరాటంలో గెలిచే యోధుడి పక్షానికి విజయం లభిస్తుంది. కానీ ఇశ్రాయేలీయులను సవాలు చేస్తున్న ఈ యోధుడు సామాన్య సైనికుడు కాడు. అతడు ఎంతో ఎత్తున్న శూరుడు, భీతిగొలిపే క్రూరమైన శత్రువు. అయితే గొల్యాతు యెహోవా ప్రజల సైన్యాన్ని అపహాస్యం చేస్తూ తనకుతాను నాశనాన్ని కొనితెచ్చుకున్నాడు.
అది కేవలం సైనిక పోరాటం కాదు. అసలు యుద్ధం యెహోవాకు, ఫిలిష్తీయుల దేవుళ్ళకు మధ్య జరుగుతోంది. ఇశ్రాయేలీయుల రాజైన సౌలు, దేవుని శత్రువులకు వ్యతిరేకంగా తన సైన్యాన్ని ధైర్యంగా ముందుకు నడిపించే బదులు భయంతో బిగుసుకుపోతున్నాడు.—1 సమూయేలు 17:11.
ఒక యువకుడు యెహోవాపై నమ్మకముంచడం
పరిస్థితి ఇలా స్థంభించి ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయుల రాజయ్యేందుకు అప్పటికే అభిషేకించబడిన ఒక యువకుడు సౌలు సైన్యంలోవున్న తన అన్నలను చూడ్డానికి వచ్చాడు. ఆయన పేరు దావీదు. గొల్యాతు మాటలు విన్న తర్వాత ఆయనిలా అడిగాడు: “జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు?” (1 సమూయేలు 17:26) దావీదు దృష్టిలో, గొల్యాతు ఫిలిష్తీయులకు, వారి దేవుళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నీతియుక్తమైన ఆగ్రహంతో దావీదు తాను యెహోవాపక్షాన, ఇశ్రాయేలీయులపక్షాన నిలబడి అన్యుడైన శూరునితో పోరాడాలనుకున్నాడు. కానీ సౌలు రాజు ఇలా అన్నాడు: “ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు.”—1 సమూయేలు 17:33.
సౌలు దృక్కోణానికీ దావీదు దృక్కోణానికీ ఎంత తేడావుందో కదా! ఒక క్రూరమైన శూరునితో పోరాడాలనుకుంటున్న గొఱ్ఱెలుకాసే బాలుడు మాత్రమే సౌలుకు కనిపిస్తున్నాడు. అయితే దావీదు, గొల్యాతులో కేవలం సర్వాధిపతియైన యెహోవాను సవాలుచేస్తున్న అల్పమానవుణ్ణే చూస్తున్నాడు. దేవుడు తన నామాన్ని, తన ప్రజలను అపహసించేవారిని శిక్షించకుండా వదలడనే నమ్మకమే దావీదు ధైర్యానికి ఆధారం. గొల్యాతు తన బలం గురించి ప్రగల్భాలు పలుకుతుంటే, దావీదు దేవుని దృక్కోణం నుండి పరిస్థితిని విశ్లేషిస్తూ యెహోవాపై నమ్మకముంచాడు.
“యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను”
దావీదు విశ్వాసానికి స్థిరమైన ఆధారముంది. తన గొఱ్ఱెలను ఒక ఎలుగుబంటి నుండి, ఒక సింహం నుండి కాపాడడానికి దేవుడు తనకు సహాయం చేశాడని ఆయనకు గుర్తుంది. ఇప్పుడు భయంకరుడైన ఈ ఫిలిష్తీయ శత్రువుతో పోరాడడానికి యెహోవా తనకు తప్పక సహాయం చేస్తాడనే నమ్మకం ఈ యువ గొఱ్ఱెలకాపరికి ఉంది. (1 సమూయేలు 17:34-37) ఒక వడిసెల, అయిదు నున్నని రాళ్లు తీసుకుని దావీదు గొల్యాతును ఎదుర్కొనేందుకు వెళ్ళాడు.
యువకుడైన దావీదు, అసాధ్యంగా కనిపిస్తున్న ఈ సవాలును యెహోవా అనుగ్రహించే బలంతో చేపట్టాడు. ఆయన ధైర్యంగా ఫిలిష్తీయునితో ఇలా అన్నాడు: “నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును . . . ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసి[కొందురు] . . . అప్పుడు యెహోవా కత్తిచేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే.”—1 సమూయేలు 17:45-47.
దాని ఫలితం? ప్రేరేపిత వృత్తాంతం ఇలా చెబుతోంది: “దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను.” (1 సమూయేలు 17:50) ఆయన చేతిలో ఖడ్గం లేకపోయినా, యెహోవా దేవుని శక్తిమంతమైన మద్దతు ఆయనకుంది.a
ఆ పోరాటంలో యెహోవాపై దావీదుకున్న విశ్వాసం ఎంత సరైనదిగా నిరూపించబడిందో కదా! మానవులకు భయపడడం, యెహోవా రక్షణశక్తిపై నమ్మకం ఉంచడం అనే రెండు విషయాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వస్తే, మనం ఏది ఎంపిక చేసుకోవాలనేది స్పష్టం: “మనుష్యులకు కాదు దేవునికే [మనము] లోబడవలెను.” (అపొస్తలుల కార్యములు 5:29) అంతేకాదు, క్లిష్ట పరిస్థితులను మనం యెహోవా దేవుని దృక్కోణం నుండి చూసినప్పుడు, మనం అతిపెద్ద సమస్యలను కూడా సమతుల్య భావంతో దృష్టించగలుగుతాం.
[అధస్సూచి]
a యెహోవాసాక్షుల క్యాలెండర్ 2006 (ఆంగ్లం), మే/జూన్ చూడండి.
[9వ పేజీలోని బాక్సు/చిత్రం]
గొల్యాతు ఎంత పొడుగు ఉండేవాడు?
గొల్యాతు ఆరు మూరలకంటే ఎక్కువ అంటే దాదాపు మూడు మీటర్ల ఎత్తు ఉండేవాడని 1 సమూయేలు 17:4-7 లోని వృత్తాంతం తెలియజేస్తోంది. ఆ ఫిలిష్తీయుడు ఎంత భారీకాయుడో, ఎంత బలవంతుడో అతడు ధరించే రాగి కవచము సూచిస్తుంది. అది 57 కిలోల బరువుండేది! అతని ఈటె కొయ్యదూలంలా ఉండేది, ఇనుముతో చేయబడిన అతని ఈటెకొన ఏడు కిలోల బరువుండేది. అంతెందుకు, గొల్యాతు కవచం బరువు, బహుశా దావీదు బరువుకన్నా ఎక్కువనేది స్పష్టం!