స్వేచ్ఛాప్రవృత్తిగల లోకంలో పిల్లలను పెంచడం
ఒక పిల్లవాడు, తన తల్లిదండ్రులు కొనడానికి ఇష్టపడని ఏదైనా బొమ్మను కొనమని మారాం చేయడాన్ని మీరు చూశారా? “ఇటూ అటూ పరుగెత్తకు” అని తల్లిదండ్రులు చెప్పినాసరే పరుగెత్తి ఆడుకోవాలనుకునే పిల్లవాణ్ణి చూశారా? ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది మంచిదో అదే చేయాలనుకుంటున్నారని మీరు గమనించవచ్చు. అయినా చాలాసార్లు, తల్లిదండ్రులు తమ పిల్లలు అడిగింది ఇచ్చేస్తారు. పిల్లలు మొండిపట్టు పడితే తల్లిదండ్రులు ముందు కాదు అన్నదాన్ని తర్వాత ఒప్పేసుకుంటారు.
చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలు అడిగిందల్లా ఇవ్వడమే మంచి పెంపకమని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు, అమెరికాలో 12 నుండి 17 సంవత్సరాల వయసున్న 750 మంది పిల్లల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఏదైనా ఒక విషయంలో తమ తల్లిదండ్రులు వద్దు అంటే దానికి మీరెలా ప్రతిస్పందిస్తారో చెప్పమని అడిగినప్పుడు, తాము అడుగుతూనే ఉంటామని దాదాపు 60 శాతం మంది పిల్లలు చెప్పారు. సాధారణంగా ఈ కిటుకు బాగా పనిచేస్తుందని దాదాపు 55 శాతం మంది చెప్పారు. తమ పిల్లలు అడిగిందల్లా ఇవ్వడం తాము వారిని ప్రేమిస్తున్నట్లు చూపిస్తుందని తల్లిదండ్రులు అనుకోవచ్చు. అయితే అలా అడిగిందల్లా ఇవ్వడమే ప్రేమచూపించడమా?
బైబిల్లోని జ్ఞానయుక్తమైన ఈ సామెతను పరిశీలించండి: “ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. [‘కృతఘ్నునిగా తయారవుతాడు,’ NW]” (సామెతలు 29:21) నిజమే, పిల్లవాడు దాసుడేమీ కాదు. ఈ సూత్రం పిల్లల పెంపకానికి కూడా వర్తిస్తుందని మీరు అంగీకరించరా? పిల్లలకు అడిగిందల్లా ఇచ్చి, అతిగా గారాబం చేస్తే, పెద్దయ్యాక వారు ‘కృతఘ్నులుగా’ తయారవుతారు అంటే చెడిపోతారు, మొండిగా, కృతజ్ఞతలేనివారిగా తయారవుతారు.
దానికి భిన్నంగా, బైబిలు తల్లిదండ్రులకు ఇలా సలహా ఇస్తోంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము.” (సామెతలు 22:6) జ్ఞానంగల తల్లిదండ్రులు ఆ నిర్దేశాన్ని పాటిస్తూ స్పష్టమైన, స్థిరమైన, ఆచరణాత్మకమైన నియమాలను పెట్టి, వాటిని అమలు చేస్తారు. పిల్లలకు మరీ ఎక్కువ స్వేచ్ఛనివ్వడమే వారిపట్ల ప్రేమ చూపించడమని అనుకోరు, అంతేగాక పిల్లలు మొండిపట్టు పట్టి, చికాకు పెడుతూ, కోపంతో గట్టిగా ఏడుస్తూ అడిగినంతమాత్రాన వారి కోరికలన్నీ తీర్చరు. బదులుగా, వారు “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను” అని యేసు చెప్పిన జ్ఞానయుక్తమైన మాటలతో ఏకీభవిస్తారు. (మత్తయి 5:37) మరి పిల్లలకు ఎలా శిక్షణనివ్వవచ్చు? శక్తివంతమైన ఒక ఉపమానాన్ని పరిశీలించండి.
“చేతిలోని బాణములవంటివారు”
బైబిలు తల్లిదండ్రుల నిర్దేశం పిల్లలకు అవసరమన్న విషయాన్ని నొక్కిచెబుతూ, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే సంబంధాన్ని ఉపమానరీతిగా తెలియజేస్తోంది. కీర్తన 127:4, 5 ఇలా చెబుతోంది: “యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు. వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు.” పిల్లలు బాణములతో, తల్లిదండ్రులు బలవంతులైన యోధులతో పోల్చబడ్డారు. బాణాలు తన ప్రమేయం లేకుండా గురిని చేరుకోలేవని విలుకానికి తెలిసి ఉంటుంది, అలాగే పిల్లలను పెంచడానికి ముందాలోచన, కృషి అవసరమని ప్రేమగల తల్లిదండ్రులు గ్రహిస్తారు. తమ పిల్లలు “గురిని” చేరుకోవాలని అంటే వారి జీవితం సంతృప్తిదాయకంగా ఉండాలని, వారు సంతోషంగల, బాధ్యతనెరిగిన వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు, తమ పిల్లలు మంచి నిర్ణయాలను తీసుకోవాలని, జ్ఞానంగలిగి, అనవసరమైన సమస్యలను తప్పించుకుని, ప్రయోజనకరమైన లక్ష్యాలను సాధించాలని వారు కోరుకుంటారు. అలా కోరుకోవడం మాత్రమే సరిపోదు.
ఒక బాణం గురిని చేరాలంటే ఏమి అవసరం? ముందుగా బాణాన్ని సరైనవిధంగా తయారుచేసుకోవాలి, అది సరైన స్థితిలో ఉండేలా కాపాడుకోవాలి, ఆ తర్వాత గురిచూసి బలంగా వదలాలి. అలాగే, పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే వారికి మంచీ చెడూ తెలియజేసి, చెడు ప్రభావాలనుండి కాపాడి, అవసరమైన నిర్దేశాన్నివ్వాలి. పిల్లల పెంపకానికి సంబంధించి ఈ మూడు అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.
బాణాన్ని సరైనవిధంగా తయారుచేసుకోవడం
బైబిలు కాలాల్లో విలుకాళ్ళు ఉపయోగించే బాణాలు ఎంతో జాగ్రత్తగా తయారుచేయబడేవి. తేలికపాటి చెక్కను వీలైనంత తిన్నగా చెక్కి బాణాన్ని తయారుచేసేవారు. దాని మొన చాలా సూదిగా ఉండాలి. బాణం గమ్యానికి సూటిగా దూసుకువెళ్ళడానికి వీలుగా దానికి మరో చివర పక్షి ఈకలు కట్టేవారు.
తల్లిదండ్రులు, తమ పిల్లలు అలాంటి తిన్నని బాణాల్లా ఉండాలని కోరుకుంటారు. అంటే తమ పిల్లలు పక్కదారి పట్టకుండా మంచి వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటారు. కాబట్టి, తల్లిదండ్రులు జ్ఞానంగలవారైతే, తమ పిల్లలు చేసిన గంభీరమైన తప్పులను చూసీచూడనట్లు విడిచిపెట్టరుగానీ, మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రేమపూర్వకంగా వారికి సహాయం చేస్తారు. అలాంటి సహాయం ప్రతి పిల్లవాడికీ ఎంతో అవసరం, ఎందుకంటే “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును.” (సామెతలు 22:15) అందుకే తమ పిల్లలకు శిక్షణనివ్వమని బైబిలు తల్లిదండ్రులకు ఉపదేశిస్తోంది. (ఎఫెసీయులు 6:4) నిజానికి, పిల్లవాడి మనసును, స్వభావాన్ని చక్కగా మలచడంలో, వాటిని సరిదిద్దడంలో శిక్షణ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
కాబట్టి, “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును” అని సామెతలు 13:24 చెప్పడంలో ఆశ్చర్యంలేదు. ఈ సందర్భంలో బెత్తము, ఏ రకంగానైనా, సరిదిద్దడాన్ని సూచిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమపూర్వకంగా శిక్షణనిస్తూ వారి తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నించకపోతే చెడులక్షణాలు లోతుగా పాతుకుపోయి పిల్లలు ఎదిగిన తర్వాత వారికి సంతోషం లేకుండా చేస్తాయి. పిల్లలకు శిక్షణనివ్వడం ప్రేమపూర్వకమైన చర్య, అలా ఇవ్వకపోతే వారిని ద్వేషించినట్లే అవుతుంది.
ప్రేమగల తల్లిదండ్రులు, నియమాలు విధించడానికి గల కారణాలను అర్థం చేసుకోవడానికి కూడా పిల్లలకు సహాయం చేస్తారు. శిక్షణనివ్వడం అంటే ఆజ్ఞలు ఇచ్చి, వాటిని మీరితే శిక్షించడం మాత్రమే కాదు, అంతకంటే ప్రాముఖ్యంగా, ఆ ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయో అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేయాలి. బైబిలు ఇలా చెబుతోంది: ‘బుద్ధిగల [“అర్థం చేసుకునే,” NW] కుమారుడు ఉపదేశము నంగీకరించును.’—సామెతలు 28:7.
విలుకాడు తన బాణానికి కట్టే పక్షి ఈకలు, ఆ బాణం గమ్యానికి సూటిగా దూసుకువెళ్ళడానికి సహాయం చేస్తాయి. అలాగే కుటుంబ వ్యవస్థాపకుడు ఇచ్చిన బైబిలు బోధలు, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక కూడా వారి మనసుల్లో నిలిచిపోయి, జీవితాంతం వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. (ఎఫెసీయులు 3:14, 15) అయితే అలాంటి బోధలు తమ పిల్లల ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయని తల్లిదండ్రులు ఎలా రూఢిపర్చుకోవచ్చు?
మోషే కాలంలోని ఇశ్రాయేలీయులైన తల్లిదండ్రులకు దేవుడిచ్చిన సలహాను గమనించండి: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజే[యవలెను].” (ద్వితీయోపదేశకాండము 6:6, 7) కాబట్టి తల్లిదండ్రులు రెండు పనులు చేయాలి. మొదట, వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ, దానిలోని విషయాలను నేర్చుకుని, వాటిని అమలులో పెట్టాలి. (కీర్తన 119:97) వారలా చేస్తే లేఖనంలోని రెండవ భాగం చెబుతున్నట్లు తమ పిల్లలకు దేవుని నియమాలను ‘అభ్యసింపజేయగల’ స్థితిలో ఉంటారు. అంటే, సమర్థవంతంగా బోధించడం ద్వారా, పదేపదే చెప్పడం ద్వారా అలాంటి న్యాయవిధుల విలువను పిల్లల హృదయాలపై ముద్రించగలుగుతారు.
బైబిల్లోని సూత్రాలను బోధించడం, గంభీరమైన లోపాలను ప్రేమపూర్వకంగా సరిదిద్దడం ఈ ఆధునిక కాలంలో కూడా సహాయకరంగా ఉంటాయని స్పష్టమవుతోంది. పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి ఇవి ప్రాముఖ్యమైన మార్గాలు.
బాణాన్ని కాపాడుకోవడం
కీర్తన 127:4, 5 లోని ఉపమానాన్ని మరోసారి పరిశీలిద్దాం. విలుకాడు “తన అంబులపొదిని” బాణాలతో నింపుకోవడాన్ని గుర్తుచేసుకోండి. ఒక్కసారి బాణాలు తయారైన తర్వాత అవి సరైన స్థితిలో ఉండేలా కాపాడుకోవాలి. అందుకే విలుకాడు ఆ బాణాలను అంబులపొదిలో పెట్టుకునేవాడు. అక్కడ అవి సులభంగా విరిగిపోకుండా భద్రంగా ఉంటాయి. ఆసక్తికరంగా, బైబిలు మెస్సీయా గురించి ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఆయనను, తన తండ్రి ‘తన అంబులపొదిలో మూసిపెట్టుకున్న’ మెరుగుపెట్టిన బాణంగా వర్ణిస్తోంది. (యెషయా 49:2) సాటిలేని ప్రేమగల తండ్రియైన యెహోవా దేవుడు, ప్రవచించబడినట్లుగా మెస్సీయ చంపబడవలసిన సమయం వచ్చేంతవరకు తన ప్రియకుమారుడైన యేసుకు ఎలాంటి హానీ జరగకుండా నిజంగానే కాపాడాడు. కానీ ఆయన చనిపోయినప్పుడు మరణం వల్ల ఆయనకు శాశ్వత హాని జరగకుండా, నిరంతరం జీవించేందుకు ఆయన పరలోకానికి సురక్షితంగా తిరిగి వచ్చేలా చేయడం ద్వారా దేవుడాయనను కాపాడాడు.
అలాగే మంచి తల్లిదండ్రులు, నైతికంగా దిగజారిపోయిన ఈ లోకంలోని అపాయాలనుండి తమ పిల్లలను కాపాడాలని కోరుకుంటారు. అనవసరంగా తమ పిల్లలు అపాయకరమైన ప్రభావాలకు గురయ్యేలా చేయగల కొన్ని కార్యకలాపాలను తల్లిదండ్రులు వద్దనవచ్చు. ఉదాహరణకు, జ్ఞానంగల తల్లిదండ్రులు “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అనే సూత్రాన్ని గంభీరంగా తీసుకుంటారు. (1 కొరింథీయులు 15:33) బైబిల్లోవున్న నైతిక ప్రమాణాలను గౌరవించని సహవాసుల నుండి పిల్లలను దూరంగా ఉంచితే వారు, తమ జీవితాలను నాశనం చేసే లేదా తమ మరణానికి కారణమయ్యే అనేక తప్పులు చేయకుండా ఉంటారు.
పిల్లలు, తల్లిదండ్రుల సంరక్షణ యొక్క విలువను ఎల్లప్పుడూ గుర్తించకపోవచ్చు. నిజానికి, మీ పిల్లలు ఏదైనా అడిగినప్పుడు, వారిని కాపాడడానికి మీరు తరచూ ‘వద్దు’ అంటే కొన్నిసార్లు వారు చిరాకుపడుతుండవచ్చు. పిల్లల పెంపకంపై పుస్తకాలు వ్రాసిన గౌరవనీయురాలైన ఒక రచయిత్రి ఇలా వ్యాఖ్యానించారు: “పిల్లలు, ఆ వయసులో తమ తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపించకపోయినా తమ జీవితాలను సురక్షితంగా, సుస్థిరంగా ఉండేలా తమ తల్లిదండ్రులు తమను తీర్చిదిద్దాలని నిజంగా కోరుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం, మన అధికారాన్ని గంభీరంగా తీసుకొని పిల్లల ప్రవర్తనావిధానానికి హద్దులు పెట్టడం ద్వారా మనమలా చేయవచ్చు.”
అవును, పిల్లల శాంతిని, అమాయకత్వాన్ని, దేవుని ఎదుట వారికున్న పరిశుభ్రమైన స్థానాన్ని పోగొట్టగల దేనినుండైనా వారినికాపాడడం, మీరు వారిని ప్రేమిస్తున్నారని చూపించడానికి ఒక ప్రాముఖ్యమైన మార్గం. కొంతకాలానికి వారు ఆ నియమాలను మీరు ఎందుకు విధించారో అర్థంచేసుకోవచ్చు, మీరు ప్రేమపూర్వకంగా ఇచ్చిన సంరక్షణను వారు విలువైనదిగా ఎంచుతారు.
బాణాన్ని గురిచూసి వదలడం
కీర్తన 127:4, 5 వచనాలు తండ్రిని ‘బలవంతునితో’ పోల్చడాన్ని గమనించండి. తండ్రి మాత్రమే తన పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలని దీని భావమా? ఎంతమాత్రమూ కాదు! ఈ ఉపమానంలోని సూత్రం అందరికీ అంటే తండ్రులకు, తల్లులకు, ఒంటరి తల్లులకు, ఒంటరి తండ్రులకు వర్తిస్తుంది. (సామెతలు 1:8) ‘బలవంతుడు’ అనే పదం, విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని వదలడానికి ఎంతో బలం అవసరమని సూచిస్తోంది. బైబిలు కాలాల్లో బాణాలు కొన్నిసార్లు రాగితో తాపడం చేయబడేవి, సైనికుడు ‘విల్లు త్రొక్కడం’ గురించి చెప్పబడుతోంది అంటే బాణాన్ని వెనక్కిలాగి వదలడానికి వీలుగా విల్లును బహుశా తన కాలితో త్రొక్కిపట్టేవాడు. (యిర్మీయా 50:14, 29) బాణాలను వాటి గమ్యం వైపుకు వదలాలంటే విల్లుకు బిగుతుగా కట్టబడిన తీగను వెనక్కిలాగాలి, దానికి ఎంతో శక్తి, కృషి అవసరమని స్పష్టమవుతోంది.
అలాగే పిల్లలను పెంచడానికి ఎంతో కృషి అవసరం. ఎలాగైతే బాణం దానంతటదే గమ్యానికి చేరలేదో, అలాగే పిల్లలు తమంతట తామే ప్రయోజకులుగా ఎదగలేరు. విచారకరంగా, పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కృషి చేయడానికి, నేడు చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడడం లేదన్నట్లుగా కనిపిస్తోంది. వారు సులభమైన మార్గాన్ని ఎంచుకుంటారు. వారు తమ పిల్లలకు తప్పొప్పుల గురించి, నైతిక ప్రమాణాల గురించి, లైంగిక విషయాల గురించి టీవీ కార్యక్రమాలు, స్కూళ్ళు, తోటివారు బోధించేందుకు అనుమతిస్తారు. తమ పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. పిల్లలకు వద్దు అని చెప్పడం కష్టమనుకున్నప్పుడు సరే అని చెప్పి, పిల్లలను బాధపెట్టడం ఇష్టంలేకే అలా సరే అన్నామని తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు. వాస్తవానికి పిల్లలను అలా స్వేచ్ఛగా వదిలేయడం వల్లే పిల్లలకు అసలైన, శాశ్వతమైన హాని జరుగుతుంది.
పిల్లలను పెంచడం ఎంతో కష్టమైన పనే. ఆ పనిని హృదయపూర్వకంగా, దేవుని వాక్యంలో ఉన్న నిర్దేశానికి అనుగుణంగా చేయడానికి ఎంతో కృషి అవసరమౌతుంది, అయితే దానివల్ల వచ్చే ప్రతిఫలాలు వెలకట్టలేనివి. పేరెంట్స్ పత్రిక ఇలా చెబుతోంది: “ప్రేమగల, తమ అధికారాన్ని గంభీరంగా తీసుకునే తల్లిదండ్రుల, అంటే పిల్లలతో ప్రేమగా ఉంటూనే వారికి స్థిరమైన పరిమితులను పెట్టే తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగే పిల్లలు, అతిగారాబం చేసే లేదా విపరీతమైన ఆంక్షలు విధించే తల్లిదండ్రులు పెంచే పిల్లలకన్నా చదువుల్లో ముందుంటారు, ఇతరులతో మంచి సంబంధాలను పెంపొందించుకోగలుగుతారు, ఆత్మవిశ్వాసాన్ని కలిగివుంటారు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అని అధ్యయనాల్లో తేలింది.”
అంతకంటే శ్రేష్ఠమైన ప్రతిఫలం మరొకటి ఉంది. మనం సామెతలు 22:6లోని, “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము” అనే మొదటి భాగాన్ని ముందు పరిశీలించాం. ఆ వచనం ప్రోత్సాహకరమైన మాటలతో ఇంకా ఇలా కొనసాగుతోంది: “వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” ఈ ప్రేరేపిత సామెత తప్పక విజయం సాధించవచ్చనే హామీ ఇస్తోందా? అలా అనుకోవాలనేమీ లేదు. మీ పిల్లలు పెరిగిన తర్వాత వారికి తమ సొంత నిర్ణయాలు తీసుకొనే హక్కు ఉంటుంది. కానీ ఈ వచనం తల్లిదండ్రులకు ప్రేమపూర్వకంగా ఒక హామీ ఇస్తోంది. అదేమిటి?
బైబిలు ఇస్తున్న సలహాకు అనుగుణంగా మీ పిల్లలకు శిక్షణనివ్వడం ద్వారా, ఒక అద్భుతమైన ప్రతిఫలం పొందడానికి తగిన పరిస్థితులు కల్పిస్తారు అంటే మీ పిల్లల జీవితం సంతృప్తిదాయకంగా ఉండడానికి, వారు సంతోషంగల, బాధ్యతనెరిగిన వ్యక్తులుగా ఎదగడానికి వారికి తోడ్పడే ఎంతో అనుకూలమైన పరిస్థితులు మీరు కల్పిస్తారు. (సామెతలు 23:24) కాబట్టి, ఆ అమూల్యమైన “బాణములను” తయారుచేసుకొని, అవి సరైనస్థితిలో ఉండేలా చూసుకొని, వాటిని గురిచూసి వదలడానికి మీ శాయశక్తులా తప్పక కృషిచేయండి. అలా చేసినందుకు మీరెప్పటికీ విచారించరు. (w08 4/1)
[13వ పేజీలోని చిత్రం]
తల్లిదండ్రులు, పిల్లలు అడిగిందల్లా ఇచ్చేస్తే వారిపట్ల ప్రేమ చూపించినట్లవుతుందా?
[15వ పేజీలోని చిత్రం]
కుటుంబంలో విధించిన నియమాలకు గల కారణాలను ప్రేమగల తల్లిదండ్రులు వివరిస్తారు
[15వ పేజీలోని చిత్రం]
మంచి తల్లిదండ్రులు, నైతికంగా దిగజారిపోయిన ఈ లోకంలోని అపాయాలనుండి తమ పిల్లలను కాపాడతారు
[16వ పేజీలోని చిత్రం]
పిల్లలను పెంచడానికి ఎంతో కృషి అవసరం, అయితే దానివల్ల వచ్చే ప్రతిఫలాలు వెలకట్టలేనివి