కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 1/15 పేజీలు 27-31
  • క్రైస్తవ పెద్దలు ‘మన ఆనందానికి సహకారులు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ పెద్దలు ‘మన ఆనందానికి సహకారులు’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన విశ్వాసం, ఆనందం
  • ‘ప్రియమైన పెర్సిసుకు వందనాలు’
  • “ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను”
  • దేవుని మందను కాయండి
  • ‘అబీషై ఆదుకున్నాడు’
  • ‘మీ యెడల నాకు ఉన్న అత్యధికమైన ప్రేమను తెలుసుకోండి’
  • పెద్దలారా—అపొస్తలుడైన పౌలును అనుకరిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ‘మనుష్యులలో ఈవులను’ మెప్పుదలతో చూడటం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ‘మీ మధ్య ప్రయాసపడుతున్నవారిని’ గౌరవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • పెద్దలారా మీ బాధ్యతను కాపాడుకొనుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 1/15 పేజీలు 27-31

క్రైస్తవ పెద్దలు ‘మన ఆనందానికి సహకారులు’

‘మేము మీ ఆనందానికి సహకారులమై ఉన్నాం.’—2 కొరిం. 1:24.

వీటి జవాబులు కనుక్కోండి:

  • సహోదరుల ‘విశ్వాసము మీద తాను ప్రభువును కాదు కానీ వాళ్ల ఆనందానికి సహకారినని’ పౌలు ఎలా చూపించాడు?

  • క్రైస్తవ పెద్దలు తోటి విశ్వాసుల ఆనందాన్ని ఏయే విధాలుగా రెట్టింపు చేస్తారు?

  • సంఘంలో సంతోషకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి మనమందరం ఎలా కృషి చేయవచ్చు?

1. కొరింథులోని క్రైస్తవుల విషయంలో పౌలు ఎందుకు సంతోషించాడు?

అది సా.శ. 55వ సంవత్సరం. అపొస్తలుడైన పౌలు రేవు పట్టణమైన త్రోయలో ఉన్నాడు. పేరుకు అక్కడున్నా ఆయన ఆలోచనంతా కొరింథు సంఘం గురించే. అప్పటికి కొన్ని నెలల క్రితం, కొరింథు సంఘంలోని సహోదరుల మధ్య గొడవలు ఉన్నాయని విని పౌలు బాధపడ్డాడు. కాబట్టి, తండ్రిలా శ్రద్ధ చూపిస్తూ వాళ్లను సరిదిద్దడానికి ఆయన వాళ్లకు ఓ పత్రిక రాశాడు. (1 కొరిం. 1:11; 4:15) అంతేకాక, తన సహచరుడైన తీతును కూడా వాళ్ల దగ్గరికి పంపించి, వాళ్ల పరిస్థితి ఎలా ఉందో త్రోయలో ఉన్న తన దగ్గరికి వచ్చి చెప్పమన్నాడు. ఇప్పుడు కొరింథీయుల పరిస్థితి గురించి తీతు తెచ్చే సమాచారం కోసం పౌలు ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ, తీతు రాకపోవడంతో పౌలు చాలా నిరాశపడ్డాడు. అప్పుడు పౌలు ఏమి చేశాడు? ఆయన మాసిదోనియాకు వెళ్లాడు. అక్కడ ఆయన తీతును కలుసుకున్నాడు. కొరింథులోని సహోదరులు పౌలు రాసిన పత్రికకు సానుకూలంగా స్పందించారని, ఆయనను చూడాలని కోరుకుంటున్నారని తీతు పౌలుకు వివరించాడు. పౌలు ఆ శుభవార్త విని ‘మరి ఎక్కువగా సంతోషించాడు.’—2 కొరిం. 2:12, 13; 7:5-9.

2. (ఎ) విశ్వాసం, ఆనందం గురించి పౌలు కొరింథీయులకు ఏమి రాశాడు? (బి) మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

2 ఆ తర్వాత కొంతకాలానికే పౌలు కొరింథీయులకు రెండవ పత్రిక రాశాడు. ఆయన వాళ్లకిలా చెప్పాడు: “మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు.” (2 కొరిం. 1:24) పౌలు ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నాడు? ఆ మాటల నుండి నేటి క్రైస్తవ పెద్దలు ఏమి నేర్చుకోవచ్చు?

మన విశ్వాసం, ఆనందం

3. (ఎ) “విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు” అని పౌలు ఏ ఉద్దేశంతో అన్నాడు? (బి) నేటి పెద్దలు పౌలు మాదిరిని ఎలా అనుకరిస్తారు?

3 మన ఆరాధనలోని రెండు ప్రాముఖ్యమైన విషయాల గురించి అంటే విశ్వాసం, ఆనందం గురించి పౌలు ప్రస్తావించాడు. విశ్వాసం గురించి ఆయన ఇలా రాశాడని గుర్తుచేసుకోండి: “మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని ... విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు.” కొరింథు సంఘంలోని సహోదరులు తన వల్లో, ఇతరుల వల్లో కాదుగానీ దేవునిపై తమకున్న విశ్వాసం వల్లే సత్యంలో స్థిరంగా నిలబడగలిగారని పౌలు ఆ మాటల్లో సూచించాడు. అందుకే ఆయన తన సహోదరుల విశ్వాసం మీద పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించలేదు లేదా అలా చేయాలని కోరుకోలేదు. వాళ్లందరూ సరైనది చేయాలనే కోరిక ఉన్న నమ్మకమైన క్రైస్తవులే అని ఆయన బలంగా నమ్మాడు. (2 కొరిం. 2:3) పౌలులాగే నేటి పెద్దలు కూడా సహోదరులకు విశ్వాసం ఉందని, వాళ్లు సరైన ఉద్దేశాలతోనే దేవుని సేవ చేస్తున్నారని నమ్ముతారు. (2 థెస్స. 3:4) పెద్దలు సంఘంలో కఠినమైన నియమాల్ని విధించరు, బదులుగా వాళ్లు లేఖన సూత్రాలపై, యెహోవా సంస్థ ఇచ్చే నిర్దేశాలపై ఆధారపడతారు. పైగా నేటి పెద్దలు సహోదరుల విశ్వాసం మీద ప్రభువులు కాదు.—1 పేతు. 5:2, 3.

4. (ఎ) “మీ ఆనందమునకు సహకారులమై యున్నాము” అని పౌలు ఏ ఉద్దేశంతో అన్నాడు? (బి) నేటి పెద్దలు పౌలు వైఖరిని ఎలా అనుకరిస్తారు?

4 “మీ ఆనందమునకు సహకారులమై యున్నాము” అని కూడా పౌలు అన్నాడు. తనను, తన సహచరుల్ని మనసులో ఉంచుకొని పౌలు ‘సహకారులము’ అనే మాటను ఉపయోగించాడు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, కొరింథీయులకు రాసిన అదే పత్రికలో ఆయన తన సహచరుల్లో ఇద్దరి పేర్లను ప్రస్తావిస్తూ ‘మాచేత, అనగా నాచేతను సిల్వానుచేతను తిమోతిచేతను, మీలో యేసుక్రీస్తు ప్రకటించబడ్డాడు’ అని రాశాడు. (2 కొరిం. 1:19) అంతేకాక, ‘సహకారులు’ అనే మాటను ప్రతీసారి ఆయన అపొల్లో, అకుల, ప్రిస్కిల్ల, తిమోతి, తీతు వంటి సన్నిహిత సహచరుల్ని ఉద్దేశించే ఉపయోగించాడు. (రోమా. 16:3, 21; 1 కొరిం. 3:6-9; 2 కొరిం. 8:23) కాబట్టి, “మీ ఆనందమునకు సహకారులమై యున్నాము” అని చెప్పడం ద్వారా, సంఘ సభ్యులందరి సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు శాయశక్తులా కృషి చేయాలనే కోరిక తనకు, తన సహచరులకు ఉందని పౌలు కొరింథీయులకు అభయమిచ్చాడు. నేటి క్రైస్తవ పెద్దలకు కూడా ఆ కోరికే ఉంది. సంఘంలోని సహోదరులు ‘సంతోషంతో యెహోవాను సేవించేందుకు’ తాము చేయగలిగినదంతా చేయాలని పెద్దలు కోరుకుంటారు.—కీర్త. 100:2; ఫిలి. 1:25.

5. ప్రపంచంలోని నలుమూలలా ఉన్న కొంతమంది సహోదరసహోదరీలను ఏ ప్రశ్న అడిగారు? మనం దేని గురించి ఆలోచించాలి?

5 ‘సంఘ పెద్దలు చెప్పిన ఏ మాటలు, వాళ్లు చేసిన ఏ పనులు మీ ఆనందాన్ని అధికం చేశాయి?’ అనే ప్రశ్నను ఇటీవలే, ప్రపంచంలోని నలుమూలలా ఉన్న కొంతమంది ఉత్సాహవంతులైన సహోదరసహోదరీలను అడిగారు. వాళ్లు ఇచ్చిన జవాబులు పరిశీలిస్తుండగా, మీరైతే ఆ ప్రశ్నకు ఏమని జవాబిస్తారో ఆలోచించండి. అంతేకాక, స్థానిక సంఘంలో సంతోషాన్ని రెట్టింపు చేయడానికి మనలో ప్రతీ ఒక్కరం ఎలా దోహదపడవచ్చో కూడా ఆలోచిద్దాం.a

‘ప్రియమైన పెర్సిసుకు వందనాలు’

6, 7. (ఎ) యేసును, పౌలును, మరితర దేవుని సేవకుల్ని పెద్దలు ఎలా అనుకరించవచ్చు? (బి) సహోదరసహోదరీల పేర్లను గుర్తుపెట్టుకోవడం ద్వారా వాళ్ల ఆనందాన్ని ఎలా అధికం చేయవచ్చు?

6 సంఘ పెద్దలు తమ మీద వ్యక్తిగత శ్రద్ధ చూపించినప్పుడు తమ ఆనందం రెట్టింపు అవుతుందని చాలామంది సహోదర సహోదరీలు చెప్పారు. దావీదు, ఎలీహు, యేసు ఉంచిన మాదిరిని అనుకరించడం ద్వారా సంఘ పెద్దలు అలాంటి శ్రద్ధ చూపించగలుగుతారు. (2 సమూయేలు 9:6; యోబు 33:1; లూకా 19:5 చదవండి.) ఈ నమ్మకమైన సేవకులు ఇతరుల్ని పేరు పెట్టి పిలవడం ద్వారా వాళ్లమీద తమకున్న నిజమైన శ్రద్ధను ప్రదర్శించారు. తోటి విశ్వాసుల పేర్లను గుర్తుపెట్టుకొని, వాళ్లను పేరు పెట్టి పిలవడం ఎంత ప్రాముఖ్యమో పౌలు కూడా అర్థం చేసుకున్నాడు. ఆయన రాసిన ఒకానొక పత్రిక ముగింపులో మొత్తం 25 మంది సహోదరసహోదరీల పేర్లను ప్రస్తావించాడు. వాళ్లలో ఒకరైన పెర్సిసు అనే సహోదరి పేరును ప్రస్తావిస్తూ, ‘ప్రియమైన పెర్సిసుకు వందనాలు’ అని ఆయన అన్నాడు.—రోమా. 16:3-15.

7 పేర్లను గుర్తుపెట్టుకోవడం కొంతమంది సంఘ పెద్దలకు కష్టమౌతుంది. అయినా, తోటి విశ్వాసుల పేర్లను గుర్తుపెట్టుకోవడానికి పెద్దలు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే, ‘మీరు నాకెంతో ముఖ్యమైన వ్యక్తులు’ అని వాళ్లతో చెప్పకనే చెబుతారు. (నిర్గ. 33:17) కావలికోట అధ్యయనమప్పుడు, మరితర భాగాలు నిర్వహించేటప్పుడు పెద్దలు సహోదరసహోదరీలను పేర్లతో పిలిస్తే వాళ్ల ఆనందం అధికమౌతుంది.—యోహాను 10:3 పోల్చండి.

“ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను”

8. యెహోవా, యేసు ఉంచిన మాదిరిని పౌలు ఏ ప్రాముఖ్యమైన విధానంలో అనుకరించాడు?

8 పౌలు తోటి విశ్వాసుల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం ద్వారా వాళ్లమీద తనకున్న శ్రద్ధను చూపించాడు. అలా చేయడం వల్ల కూడా సహోదర సహోదరీల ఆనందం రెట్టింపు అవుతుంది. సహోదరుల ఆనందం కోసం పాటుపడాలనే కోరిక తనకుందని చెప్పిన ఆ పత్రికలోనే “మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు” అని పౌలు రాశాడు. (2 కొరిం. 7:4) ఆ మాటలు విన్న కొరింథులోని సహోదరసహోదరీల హృదయం తెప్పరిల్లి ఉంటుంది. పౌలు ఇతర సంఘాలకు రాసేటప్పుడు కూడా అక్కడి సహోదరుల్ని మెచ్చుకునేవాడు. (రోమా. 1:8; ఫిలి. 1:3-5; 1 థెస్స. 1:8) నిజానికి, రోమీయులకు రాసిన పత్రికలో పెర్సిసు గురించి ప్రస్తావించిన తర్వాత పౌలు ఇలా అన్నాడు: “ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను.” (రోమా. 16:12) నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తున్న ఆ సహోదరి ఆ మాటలకు ఎంత సంతోషించి ఉంటుందో కదా! ఇతరుల్ని మెచ్చుకునే విషయంలో యెహోవా, యేసు ఉంచిన మాదిరిని పౌలు అనుకరించాడు.—మార్కు 1:9-11; యోహాను 1:47 చదవండి; ప్రక. 2:2, 13, 19.

9. మెచ్చుకోవడం వల్ల సహోదరసహోదరీల ఆనందం పెరుగుతుందని ఎందుకు చెప్పవచ్చు?

9 సహోదర సహోదరీలపై తమకున్న ప్రశంసను మాటల్లో వ్యక్తం చేయడం చాలా ప్రాముఖ్యమని నేటి పెద్దలు కూడా అర్థంచేసుకుంటారు. (సామె. 3:27; 15:23) ఒక పెద్ద అలా ప్రశంసను వ్యక్తం చేసిన ప్రతీసారి తోటి విశ్వాసుల మీద తనకు శ్రద్ధ ఉందని, వాళ్లు చేస్తున్న పనుల్ని తాను గమనిస్తున్నానని చూపిస్తాడు. పెద్దలు భరోసా ఇస్తూ మాట్లాడే మాటలు సంఘంలోని వాళ్లకు అవసరం. సుమారు 55 ఏళ్లున్న ఓ సహోదరి ఇలా అంది: “ఉద్యోగస్థలంలో నన్ను ఎప్పుడోగానీ మెచ్చుకోరు. అక్కడ పోటీతత్వం తప్ప మనుష్యుల మీద పట్టింపు ఉండదు. కాబట్టి, సంఘంలో నేను ఏదైనా పని చేసినప్పుడు ఒక పెద్ద మెచ్చుకుంటే నాకు ఎంతో సేదదీర్పుగా ఉంటుంది, అది నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. నా పరలోక తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడని అది నాకు గుర్తుచేస్తుంది.” ఇద్దరు పిల్లలున్న ఓ ఒంటరి తండ్రికి కూడా అలాంటి భావాలే ఉన్నాయి. ఇటీవల ఓ పెద్ద తనను మెచ్చుకున్నప్పుడు ఎలా అనిపించిందో చెబుతూ ఆయన ఇలా అన్నాడు: “ఆ సహోదరుడు అన్న మాటలు నాకు కొండంత బలాన్నిచ్చాయి!” నిజంగా, సంఘ పెద్దలు తోటి విశ్వాసుల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం ద్వారా వాళ్లలో ఉత్సాహాన్ని నింపుతారు, వాళ్ల సంతోషాన్ని అధికం చేస్తారు. అలా సంఘ సభ్యులు నిత్యజీవానికి నడిపించే మార్గంలో ‘సొమ్మసిల్లకుండా’ ముందుకు సాగిపోవడానికి మరింత బలాన్ని పొందుతారు.—యెష. 40:31.

దేవుని మందను కాయండి

10, 11. (ఎ) పెద్దలు నెహెమ్యా మాదిరిని ఎలా అనుకరించవచ్చు? (బి) కాపరి సందర్శనాలు చేస్తున్నప్పుడు ‘ఆత్మ సంబంధమైన కృపావరాన్ని’ ఇవ్వాలంటే పెద్దలు ఏమి చేయాలి?

10 సంఘ పెద్దలు మరో ప్రాముఖ్యమైన విధానంలో కూడా సహోదర సహోదరీల మీద వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ సంఘ సంతోషాన్ని అధికం చేస్తారు. అదేమిటంటే, ప్రోత్సాహం అవసరమైన వాళ్లకు సహాయం చేయడానికి చొరవ తీసుకోవడం ద్వారానే. (అపొస్తలుల కార్యములు 20:28 చదవండి.) సంఘ పెద్దలు అలా చేసినప్పుడు ప్రాచీన కాలంలోని ఆధ్యాత్మిక కాపరుల్ని అనుకరిస్తారు. ఉదాహరణకు, సహోదరులైన తోటి యూదులు ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నారని గ్రహించినప్పుడు కాపరియైన నెహెమ్యా ఏమి చేశాడో గమనించండి. ఆయన వాళ్లను ప్రోత్సహించేందుకు వెంటనే ‘లేచాడని’ అంటే చొరవ తీసుకున్నాడని బైబిలు చెబుతోంది. (నెహె. 4:14) నేటి పెద్దలు కూడా అలాగే చేయాలనుకుంటారు. వాళ్లు చొరవ తీసుకొని తోటి క్రైస్తవులు విశ్వాసంలో స్థిరంగా ఉండేందుకు సహాయం చేస్తారు. అలా వ్యక్తిగతంగా ప్రోత్సహించడానికి వీలైతే వాళ్లు సహోదరసహోదరీల ఇళ్లకు వెళ్తారు. అలాంటి కాపరి సందర్శనాల్లో పెద్దలు సహోదరసహోదరీలకు ‘ఆత్మ సంబంధమైన కృపావరాన్ని’ ఇస్తారు. (రోమా. 1:11, 12) దానికోసం పెద్దలు ఏమి చేయాలి?

11 కాపరి సందర్శనానికి వెళ్లే ముందు ఓ పెద్ద తాను వెళ్లి కలవాలనుకుంటున్న వ్యక్తి గురించి కాస్త సమయం తీసుకొని ఆలోచించాలి. ఆ వ్యక్తి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నాడు? ఏమి మాట్లాడితే ఆయన ప్రోత్సాహం పొందుతాడు? ఆ వ్యక్తి పరిస్థితుల్ని బట్టి ఏ లేఖనం గురించి లేదా బైబిల్లోని ఎవరి అనుభవం గురించి మాట్లాడితే బాగుంటుంది? అలాంటి విషయాల గురించి ముందుగా ఆలోచిస్తే ఓ పెద్ద చేసే కాపరి సందర్శనం ఇతరులకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. అలాంటి సందర్శనాల్లో సహోదరసహోదరీలు తమ మనసులోని విషయాల్ని వ్యక్తం చేస్తున్నప్పుడు పెద్దలు శ్రద్ధగా వింటారు. (యాకో. 1:19) ఒక సహోదరి ఇలా అంది: “మన మాటల్ని ఓ పెద్ద మనస్ఫూర్తిగా విన్నప్పుడు ఎంతో ఓదార్పుకరంగా ఉంటుంది.”—లూకా 8:18.

ముందుగా సిద్ధపడే పెద్దలు కాపరి సందర్శనాల్లో సహోదరులకు ‘ఆత్మసంబంధమైన కృపావరాన్ని’ ఇవ్వగలుగుతారు

12. సంఘంలో ఎవరెవరికి ప్రోత్సాహం అవసరం? ఎందుకు?

12 సంఘంలో ఎవరెవరికి ప్రోత్సాహం అవసరం? ‘యావత్తు మందను గూర్చి జాగ్రత్తగా ఉండండి’ అని పౌలు తన తోటి పెద్దలకు ఉపదేశించాడు. నిజానికి, ఏళ్ల తరబడి నమ్మకంగా పరిచర్య చేస్తున్న ప్రచారకులు, పయినీర్లతో సహా సంఘ సభ్యులందరికీ ప్రోత్సాహం అవసరం. కాపరులు ఇచ్చే ప్రోత్సాహం వాళ్లకు ఎందుకు అవసరం? ఎందుకంటే ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నవాళ్లు కూడా ఈ దుష్టవిధానపు ఒత్తిళ్లవల్ల నీరసించిపోవచ్చు. ఆధ్యాత్మికంగా ఎంతో బలంగా ఉన్న వ్యక్తులకు కూడా కొన్నిసార్లు ఎందుకు సహాయం అవసరమౌతుందో అర్థంచేసుకోవడానికి మనం ఇప్పుడు దావీదు జీవితంలో జరిగిన ఓ సంఘటనను పరిశీలిద్దాం.

‘అబీషై ఆదుకున్నాడు’

13. (ఎ) దావీదు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఇష్బిబేనోబ ఆయనను చంపేద్దామనుకున్నాడు? (బి) అబీషై దావీదును ఎలా కాపాడగలిగాడు?

13 రాజుగా అభిషేకించబడిన కొంతకాలానికే దావీదు రెఫాయీయుల సంతతి వాడైన గొల్యాతు అనే శూరునితో తలపడ్డాడు. ఆ సమరంలో దావీదు ధైర్యంగా గొల్యాతును చంపేశాడు. (1 సమూ. 17:4, 48-51; 1 దిన. 20:5, 8) చాలా సంవత్సరాల తర్వాత ఫిలిష్తీయులతో చేసిన యుద్ధంలో దావీదు మళ్లీ మరో భారీకాయునితో తలపడ్డాడు. అతని పేరు “ఇష్బిబేనోబ.” అతను కూడా రెఫాయీయుడే. (2 సమూ. 21:16) కానీ ఈసారి ఆ శూరుని చేతిలో దావీదు ప్రాణాలు పోయేంత పనైంది. ఎందుకు? దావీదు ధైర్యం కోల్పోయినందువల్ల కాదుగానీ ఆయన శక్తి తగ్గినందువల్లే ఆ పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో దావీదు ‘సొమ్మసిల్లాడు’ లేదా విపరీతంగా అలసిపోయాడు అని బైబిలు చెబుతోంది. దావీదు నీరసంగా ఉండడం చూసి ఇష్బిబేనోబ దావీదును చంపాలనుకున్నాడు. కానీ, దావీదు మీదికి ఆ శూరుడు ఖడ్గం దూసేలోపే “సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను.” (2 సమూ. 21:15-17) త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది! అబీషై తనను కనిపెట్టుకొని ఉండి వెంటనే వచ్చి తన ప్రాణాల్ని కాపాడినందుకు దావీదు ఆయనకు ఎంత కృతజ్ఞత చూపించి ఉంటాడో కదా! ఈ వృత్తాంతం నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

14. (ఎ) గొల్యాతులా కనిపించే సవాళ్లను మనం ఎలా అధిగమించగలుగుతున్నాం? (బి) మనం మన బలాన్ని, ఆనందాన్ని తిరిగి పొందేందుకు పెద్దలు ఏ విధంగా సహాయపడతారు? ఓ అనుభవం చెప్పండి.

14 ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజలమైన మనం సాతాను, అతని ప్రతినిధులు తెచ్చే అడ్డంకుల్ని దాటుకుంటూ మన పరిచర్యను కొనసాగిస్తున్నాం. మనలో కొంతమందికి గొల్యాతులా కనిపించే పెద్దపెద్ద సవాళ్లు ఎదురయ్యాయి కానీ యెహోవా మీద పూర్తి నమ్మకంతో మనం వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగాం. అయితే, ఈ లోకం నుండి వచ్చే ఒత్తిళ్లతో పోరాడీపోరాడీ కొన్నిసార్లు మనం అలసిపోతాం, నిరుత్సాహపడతాం. అలాంటి బలహీనమైన సందర్భాల్లోనే మనం ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఓ సంఘ పెద్ద ఇచ్చే సమయానుకూలమైన మద్దతు వల్ల మనం సంతోషాన్ని, బలాన్ని తిరిగి పొందగలుగుతాం. అలాంటి అనుభూతిని మనలో చాలామందిమి ఇప్పటికే రుచి చూశాం. సుమారు 65 ఏళ్లున్న ఓ పయినీరు సహోదరి ఇలా అంది: “కొంతకాలం క్రితం నా ఆరోగ్యం బాగా లేనందువల్ల పరిచర్యలో ఎంతో అలసిపోయేదాన్ని. నీరసంగా ఉంటున్న నన్ను గమనించిన ఓ పెద్ద నా దగ్గరికి వచ్చి ఒక బైబిలు వృత్తాంతాన్ని నాతో చర్చించి ఎంతగానో ప్రోత్సహించాడు. ఆయనిచ్చిన సలహాల్ని ఆచరణలో పెట్టాను, అవి నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. బలహీనంగా ఉన్న నన్ను ఆ పెద్ద గమనించి, ప్రేమతో కావాల్సిన సహాయాన్ని అందించాడు.” అవును, అబీషైలా మనల్ని ‘ఆదుకునేందుకు’ ప్రేమతో మనల్ని కనిపెట్టుకొని ఉండే పెద్దలు మనకు ఉన్నారని తెలుసుకోవడం ఎంతో ఊరటనిస్తుంది.

‘మీ యెడల నాకు ఉన్న అత్యధికమైన ప్రేమను తెలుసుకోండి’

15, 16. (ఎ) తోటి విశ్వాసులు పౌలును ఎందుకు ప్రాణంగా ప్రేమించారు? (బి) మనల్ని శ్రద్ధగా చూసుకునే సంఘ పెద్దల్ని మనం ఎందుకు ప్రేమిస్తాం?

15 కాపరిగా ఉండడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. కొన్ని సందర్భాల్లో పెద్దలు దేవుని మంద గురించి ఆలోచించేందుకు లేదా తోటి విశ్వాసులకు కావాల్సిన ఆధ్యాత్మిక సహాయాన్ని అందించేందుకు తమ నిద్రను కూడా త్యాగం చేస్తారు. (2 కొరిం. 11:27, 28) అయినా, వాళ్లు పౌలులాగే తమ బాధ్యతల్ని సంపూర్తిగా, సంతోషంగా నిర్వహిస్తారు. పౌలు కొరింథీయులకు ఇలా రాశాడు: “నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును.” (2 కొరిం. 12:15) నిజంగా, సహోదరుల మీద ప్రేమతో వాళ్లను బలపర్చడానికి పౌలు తనను తాను పూర్తిగా వ్యయపర్చుకున్నాడు. (2 కొరింథీయులు 2:4 చదవండి; ఫిలి. 2:17; 1 థెస్స. 2:8) అందుకే సహోదరులు పౌలును ప్రాణంగా ప్రేమించారు.—అపొ. 20:31-38.

16 దేవుని సేవకులమైన మనం కూడా మనల్ని శ్రద్ధగా చూసుకుంటున్న క్రైస్తవ పెద్దలను ప్రేమిస్తాం. అంతేకాక వాళ్లను మనకు అనుగ్రహించినందుకు మన వ్యక్తిగత ప్రార్థనలో యెహోవాకు కృతజ్ఞతలు తెలుపుతాం. మనపై వ్యక్తిగత శ్రద్ధ చూపించడం ద్వారా వాళ్లు మన ఆనందాన్ని అధికం చేస్తారు. వాళ్లు చేసే కాపరి సందర్శనాల వల్ల మనం ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతాం. అంతేకాక, ఈ లోకంలోని ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి అయ్యే సందర్భాల్లో మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉండే పెద్దలకు మనం కృతజ్ఞత చూపిస్తాం. అవును, మన మీద అమితమైన శ్రద్ధ చూపించే ఆ పెద్దలు నిజంగా ‘మన ఆనందానికి సహకారులు.’

a “ఒక పెద్దలో ఉన్న ఏ లక్షణాన్ని మీరు ఎక్కువగా ఇష్టపడతారు?” అనే ప్రశ్నను కూడా వాళ్లను అడిగారు. వాళ్లలో ఎక్కువశాతం మంది, “స్నేహశీలతే” అని జవాబిచ్చారు. ప్రాముఖ్యమైన ఆ లక్షణం గురించి మనం రాబోయే ఒక సంచికలో సవివరంగా చూస్తాం.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి