వాళ్లలా విశ్వాసం చూపించండి
ఆమె “తన చేతల వల్ల నీతిమంతురాలని తీర్పు పొందింది”
యెరికో చుట్టూ ఉన్న మైదానం మీద అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు పడుతున్నాయి. రాహాబు తన కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తుంది. దండయాత్ర చేయడానికి వచ్చిన ఇశ్రాయేలు సైన్యం ఆమెకు కనిపించింది. వాళ్లు మళ్లీ నగరం చుట్టూ తిరుగుతూ, బూరలు ఊదడం మొదలుపెట్టారు. సైన్యం ముందుకు కదులుతుంటే, దుమ్ము మొత్తం పైకి రేగుతుంది.
రాహాబు యెరికోలోనే ఉండేది కాబట్టి ఆమెకు అక్కడి వీధులు, ఇళ్లు, మార్కెట్లు, షాపులు అన్నీ తెలుసు. అక్కడ ఉంటున్న ప్రజల గురించి ఆమెకు ఇంకా బాగా తెలుసు. ఇశ్రాయేలీయులు రోజూ వాళ్ల నగరం చుట్టూ తిరగడం వల్ల ప్రజలకు భయం పట్టుకుందని ఆమెకు అర్థమైంది. ఇశ్రాయేలీయుల బూరల శబ్దం యెరికో వీధుల్లో మారుమోగుతున్నా రాహాబు మాత్రం అస్సలు భయపడలేదు.
ఏడో రోజు ఉదయాన్నే, ఆ సైన్యం నగరం చుట్టూ తిరగడాన్ని రాహాబు కిటికీ నుండి చూస్తుంది. ఇశ్రాయేలు సైనికుల మధ్య యాజకులు బూరలు ఊదడం, వాళ్ల దేవుడైన యెహోవా ప్రత్యక్షతకు గుర్తుగా ఉన్న మందసాన్ని మోయడం ఆమెకు కనిపించింది. రాహాబు పరిస్థితి ఒకసారి ఊహించుకోండి! బహుశా ఆమె తన కిటికీ నుండి వేలాడుతున్న ఎర్ర తాడును చేతితో పట్టుకుని ఉంటుంది. తను, తన కుటుంబం యెరికో నగర నాశనాన్ని తప్పించుకుంటారని ఆ తాడు గుర్తుచేసింది. అయితే, రాహాబు ఒక దేశ ద్రోహా? యెహోవా దృష్టిలో అయితే కాదు. ఆయన ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని చూశాడు. అసలు రాహాబు కథేంటో, ఏం జరిగిందో, మనం ఆమె నుండి ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం.
రాహాబు—ఒక వేశ్య
రాహాబు ఒక వేశ్య. ఆ వాస్తవాన్ని గతంలో కొంతమంది బైబిలు వ్యాఖ్యాతలు ఒప్పుకోకుండా, ఆమె ఒక సత్రం నడిపేదని అనేవాళ్లు. కానీ బైబిలు మాత్రం, ఆమె ఎవరు-ఏంటి అనే నిజాన్ని కప్పిపుచ్చకుండా చాలా స్పష్టంగా చెప్తుంది. (యెహోషువ 2:1; హెబ్రీయులు 11:31; యాకోబు 2:25) కనానీయుల సమాజం, రాహాబు వృత్తిని గౌరవంగానే చూసి ఉండవచ్చు. అయితే, సంస్కృతి ఎలా ఉన్నా తప్పొప్పులను గుర్తించేలా దేవుడు అందరికీ మనస్సాక్షి ఇచ్చాడు. (రోమీయులు 2:14, 15) బహుశా దానివల్లే, రాహాబు తన జీవితం నీచంగా ఉందని అర్థం చేసుకుని ఉంటుంది. తన కుటుంబాన్ని పోషించడానికి వేరేదారి లేక, ఈ ఊబిలో చిక్కుకుపోయానని అనుకుని ఉంటుంది. రాహాబుకే కాదు, నేడు తనలాగే జీవిస్తున్న చాలామందికి అలాగే అనిపిస్తుంది.
రాహాబు ఖచ్చితంగా మంచి జీవితాన్నే కోరుకొని ఉంటుంది. కానీ ఆమె దేశం హింసతో, దౌర్జన్యంతో, వావివరుసలు లేకుండా లైంగిక సంబంధాలు పెట్టుకునే వాళ్లతో, జంతువులతో సెక్స్ చేసేవాళ్లతో నిండిపోయింది. (లేవీయకాండము 18:3, 6, 21-24) అక్కడ అలాంటి పనులు జరగడానికి వాళ్ల మతమే ముఖ్యమైన కారణం. ఆలయాల్లో ఆచారబద్ధంగా వ్యభిచారం జరిగేది. వాళ్లు బయలు, మోలెకు లాంటి రాక్షస దేవుళ్లను ఆరాధించేవాళ్లు. అక్కడి ప్రజలు తమ పిల్లల్ని బ్రతికుండగానే మంటల్లో వేసి, ఆ దేవుళ్లకు బలిచ్చేవాళ్లు.
కనానులో జరుగుతున్నదంతా యెహోవాకు తెలుసు. చాలామంది కనానీయులు చేస్తున్న నీచమైన ఆచారాలు చూసి యెహోవా ఇలా అన్నాడు: “ఆ దేశం అపవిత్రమైపోయింది, ఆ దేశ ప్రజలు చేసిన తప్పుకు నేను వాళ్లను శిక్షిస్తాను, ఆ దేశం దాని నివాసుల్ని బయటికి కక్కేస్తుంది.” (లేవీయకాండం 18:25) ‘ఆ దేశ ప్రజలు చేసిన తప్పుకు వాళ్లను శిక్షిస్తాను’ అంటే, ఏం చేస్తానని దేవుడు చెప్తున్నాడు? దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ వాగ్దానం చేశాడు: “నీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా ఈ జనాల్ని మెల్లమెల్లగా నీ ముందు నుండి వెళ్లగొడతాడు.” (ద్వితీయోపదేశకాండం 7:22) అలాగే, ఆ దేశాన్ని అబ్రాహాము కుటుంబానికి ఇస్తానని ‘అబద్ధమాడలేని దేవుడైన’ యెహోవా కొన్ని వందల సంవత్సరాల క్రితమే మాటిచ్చాడు.—తీతు 1:2; ఆదికాండం 12:7.
అయితే, ఆ ప్రాంతంలో ఉంటున్న కొన్ని జనాంగాల్ని తుడిచిపెట్టాలని యెహోవా ఆజ్ఞాపించాడు. (ద్వితీయోపదేశకాండం 7:1, 2) వాళ్ల హృదయాలు ఎంతగా చెడుతనంతో నిండిపోయాయో, వాళ్ల ఆలోచనలు ఎంత నీచాతినీచంగా ఉన్నాయో “భూమంతటికీ న్యాయం తీర్చే” దేవునికి బాగా తెలుసు. (ఆదికాండం 18:25; 1 దినవృత్తాంతాలు 28:9) అలాంటి ఘోరమైన నగరంలో జీవించడం రాహాబుకు ఎలా అనిపించి ఉంటుంది? ఇశ్రాయేలీయుల గురించి విన్నప్పుడు ఆమె ఏం అనుకుని ఉంటుంది? ఇశ్రాయేలు దేవుడు, దాసత్వంలో మగ్గుతున్న తన ప్రజల్ని విడిపించి, ఆ కాలంలో ఉన్న శక్తివంతమైన ఈజిప్టు సైన్యం మీద వాళ్లకు ఘనవిజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడేమో ఇశ్రాయేలీయులు యెరికో నగరం మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు! అయినాసరే, ఆ నగర ప్రజలు చెడ్డ పనులు చేయడం మానట్లేదు. అందుకే, రాహాబుతో జీవించిన కనానీయుల్ని బైబిలు “అవిధేయులు” అని పిలిచింది.—హెబ్రీయులు 11:31.
రాహాబు వాళ్లలా కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇశ్రాయేలీయుల గురించి, వాళ్ల దేవుడైన యెహోవా గురించి ఆమె విన్న విషయాల్ని ధ్యానించి ఉంటుంది. ఆయన తన ప్రజల్ని బాధించలేదు, బదులుగా వాళ్లను విడిపించడం కోసం పోరాడాడు. దిగజారిపోయిన విలువలతో కాదుగానీ, మంచి విలువల్ని ఇచ్చి వాళ్లను గొప్ప చేశాడు. అలాగే, స్త్రీలను అమూల్యంగా చూశాడు. అంతేగానీ, కేవలం లైంగిక సుఖం కోసం కొనుక్కోడానికో, అమ్మడానికో పనికొచ్చే ఒక వస్తువులా చూడలేదు; ఆరాధన పేరుతో నీచమైన పనులు చేయించలేదు. ఇశ్రాయేలు దేవునికి, కనాను దేవుళ్లకు ఎంత తేడా ఉందో కదా! ఇశ్రాయేలు సైన్యం యొర్దాను నది దగ్గర డేరాలు వేసుకున్నారని, యెరికో నగరం మీద దాడి చేయడానికి వస్తున్నారని తెలిసినప్పుడు, రాహాబు తన ప్రజలకు ఏమౌతుందోనని ఆందోళనపడి ఉండొచ్చు. మరి యెహోవా రాహాబులోని మంచిని చూసి ఆమెకు ప్రతిఫలం ఇచ్చాడా?
ఇప్పుడు కూడా రాహాబులా చాలామంది ఉన్నారు. తమ గౌరవాన్ని-సంతోషాన్ని సమాధి చేసే జీవితాన్ని గడుపుతున్నట్టు, అందులో చిక్కుకుపోయినట్టు వాళ్లకు అనిపిస్తుంది. సమాజంలో తలెత్తుకొని తిరిగే అవకాశం గానీ, తమకంటూ ఒక విలువ గానీ లేవని వాళ్లకు అనిపిస్తుంది. కానీ, యెహోవాకు మనలో ప్రతీ ఒక్కరి మనసు తెలుసని రాహాబు ఉదాహరణ గుర్తుచేస్తుంది. మనం ఎంత నిరుత్సాహంలో ఉన్నాసరే, “ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు.” (అపొస్తలుల కార్యాలు 17:27) ఆయన అందరికీ దగ్గరగా ఉంటూ, తన మీద విశ్వాసం ఉంచే వాళ్లందరి జీవితాల్లో ఆశను నింపాలని ఎదురుచూస్తున్నాడు. ఇంతకీ రాహాబు విశ్వాసం ఉంచిందా?
ఆమె గూఢచారుల్ని తన ఇంట్లోకి ఆహ్వానించింది
ఇశ్రాయేలీయులు యెరికో చుట్టూ తిరగడానికి కొన్ని రోజుల ముందు, రాహాబు గుమ్మం దగ్గరికి ఇద్దరు అపరిచితులు వచ్చారు. అసలైతే ఆ ఇద్దరు మనుషులు వాళ్లను ఎవ్వరూ గుర్తుపట్టకముందే ఆ నగరం నుండి వెళ్లిపోవాలని అనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఎందుకంటే భయం గుప్పిట్లో ఉన్న ఆ నగర ప్రజలు ఇశ్రాయేలు నుండి గూఢచారులు ఎవరైనా వస్తే కనిపెడదామని కాచుకొని కూర్చున్నారు. తన ఇంటికి వచ్చినవాళ్లు ఎవరో రాహాబు వెంటనే పసిగట్టి ఉంటుంది. ఆమె ఇంటికి మగవాళ్లు రావడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి వచ్చిన ఇద్దరు మాత్రం ఆమె దగ్గర లైంగిక సుఖం కోసం కాదుగానీ, కేవలం తలదాచుకోవడం కోసమే వచ్చారు.
నిజానికి, ఆ ఇద్దరు మనుషులు ఇశ్రాయేలుకు చెందిన గూఢచారులు. యెరికో బలాలు-బలహీనతలు ఏంటో తెలుసుకుని రమ్మని వాళ్ల సేనాధిపతైన యెహోషువ వాళ్లను అక్కడికి పంపించాడు. ఇశ్రాయేలీయులు ఆక్రమించుకోవాల్సిన కనాను నగరాల్లో ఇదే మొదటిది. బహుశా మిగతా నగరాలతో పోలిస్తే యెరికో నగరమే బలమైనది. ఒకవేళ దాడికి దిగితే తనకు, తన మనుషులకు ఏం జరుగుతుందో యెహోషువ తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన పంపించిన గూఢచారులు, ఆ నగరంలో చాలా ఇళ్లు ఉన్నా, కావాలనే రాహాబు ఇంటిని ఎంచుకున్నారు. ఎందుకంటే, ఒక వేశ్య ఇంటికి వెళ్తే ఎవ్వరికీ అనుమానం రాదు. అంతేకాదు, బహుశా అక్కడ పిచ్చాపాటిగా మాట్లాడే మాటల నుండి ఏదైనా పనికొచ్చే సమాచారం దొరకవచ్చేమో అని వాళ్లు అనుకొని ఉంటారు.
రాహాబు ‘గూఢచారులకు ఆతిథ్యం ఇచ్చిందని’ బైబిలు చెప్తుంది. (యాకోబు 2:25, ఈజీ టు రీడ్ వర్షన్) వాళ్లెవరో, ఎందుకు వచ్చారో అనే అనుమానం వచ్చినా వాళ్లను తన ఇంట్లోకి ఆహ్వానించి, అక్కడ ఉండనిచ్చింది. బహుశా, వాళ్ల దేవుడైన యెహోవా గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఆమె అనుకొని ఉంటుంది.
ఇశ్రాయేలు గూఢచారులు రాహాబు ఇంటికి వచ్చారనే వార్త బయటికి పొక్కింది. వాళ్లను పట్టుకోవడానికి యెరికో రాజు పంపించిన మనుషులు రాహాబు తలుపు తట్టారు. ఇప్పుడు రాహాబు ఏం చేస్తుంది? ఒకవేళ ఆమె ఆ ఇద్దరు అపరిచితుల్ని దాచిపెడితే తనను, తన కుటుంబాన్ని ప్రమాదంలో పడేసినట్టు అవ్వదా? శత్రువులకు ఆశ్రయం ఇచ్చిందని తెలిస్తే, యెరికో ప్రజలు ఊరికే ఉంటారా? మరోవైపు, వచ్చిన ఆ ఇద్దరు అపరిచితులు ఇశ్రాయేలీయులే అని రాహాబుకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. తన దేవుళ్ల కన్నా, యెహోవాయే గొప్ప దేవుడని ఒకవేళ నమ్మకం కలిగి ఉంటే, యెహోవావైపు ఉండడానికి ఆమెకు ఇదే మంచి అవకాశం!
రాహాబుకు ఆలోచించుకోవడానికి ఎక్కువ సమయం లేదు. అయినా ఆమె వెంటనే తెలివిగా ఒక పని చేసింది. మిద్దె మీద ఆరబెట్టిన జనుప కట్టెల మధ్య ఆ గూఢచారుల్ని దాచిపెట్టి, రాజు పంపించిన మనుషులతో ఇలా అంది: “వాళ్లు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే. కానీ వాళ్లు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలీదు. చీకటి పడినప్పుడు, నగర ద్వారం మూసేసే సమయానికి ఆ మనుషులు వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు, అయితే మీరు త్వరగా వాళ్ల వెనకాలే వెళ్తే వాళ్లను పట్టుకోగలుగుతారు.” (యెహోషువ 2:4, 5) రాజు పంపిన మనుషుల ముఖాల్ని చూస్తూ, రాహాబు మాట్లాడడాన్ని ఊహించుకోండి! తన మనసులో ఉన్న భయం ఎక్కడ వాళ్లకు తెలిసిపోతుందో అని అనుకుని ఉంటుందా?
రాహాబు తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఇద్దరు యెహోవా సేవకుల్ని జనుప కట్టెల మధ్య దాచిపెట్టింది
ఆమె వేసిన ఎత్తు బాగా పనిచేసింది! వెంటనే, రాజు పంపిన మనుషులు వాళ్లను వెతుక్కుంటూ యొర్దాను రేవుల దారిలో వెళ్లారు. (యెహోషువ 2:7) దాంతో రాహాబు ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుని ఉంటుంది. నిజం తెలుసుకునే అర్హతలేని ఆ హంతకుల్ని, ఒక చిన్న ఎత్తు వేసి తప్పుదారి పట్టించింది; నిర్దోషులైన యెహోవా సేవకుల్ని కాపాడింది.
రాహాబు మిద్దె మీదికి గబగబా వెళ్లి, తను చేసిన పని గురించి ఆ ఇద్దరు గూఢచారులకు చెప్పింది. అంతేకాదు, ఆక్రమించుకోవడానికి వస్తున్నవాళ్ల గురించి విని యెరికో ప్రజలకు భయంతో గుండెలు జారిపోతున్నాయి అనే నిజాన్ని కూడా ఆమె వాళ్లకు చెప్పింది. ఆమె మాటలు, ఆ గూఢచారుల్లో కొత్త బలాన్ని నింపి ఉంటాయి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా శక్తిని బట్టి ఆ చెడ్డ కనానీయులు భయంతో వణికిపోతున్నారు! ఆ తర్వాత, ఆమె విశ్వాసంతో ఇంకో మాట అంది: “మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలో, కింద భూమ్మీద దేవుడు.” (యెహోషువ 2:11) ఆమెకున్న లాంటి విశ్వాసమే మనకు కూడా ఉండాలి. యెహోవా గురించి విన్న విషయాల్ని బట్టి, ఆయన మీద పూర్తి నమ్మకం పెట్టుకోవచ్చని రాహాబుకు అర్థమైంది.
యెహోవా ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇస్తాడనే విషయంలో రాహాబుకు ఎలాంటి అనుమానం లేదు. అందుకే ఆమె తన మీద, తన ఇంటివాళ్ల మీద దయ చూపించమని, తమ ప్రాణాల్ని కాపాడమని వేడుకుంది. దానికి ఆ గూఢచారులు ఒప్పుకొని, వాళ్లు వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచాలని చెప్పారు; ఆమెను, ఆమె కుటుంబాన్ని కాపాడేలా కిటికీ నుంచి ఎర్ర తాడు వేలాడదీయాలని కూడా చెప్పారు.—యెహోషువ 2:12-14, 18.
రాహాబు చూపించిన విశ్వాసం నుండి ఒక ముఖ్యమైన సత్యం నేర్చుకోవచ్చు. అదేంటో బైబిలు చెప్తుంది: “దేని గురించైనా విన్నప్పుడే విశ్వాసం కలుగుతుంది.” (రోమీయులు 10:17) యెహోవా శక్తి, న్యాయం గురించి నమ్మదగిన వార్తల్ని రాహాబు వినింది; అందుకే ఆయన మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మనకు యెహోవా గురించి తెలుసుకోడానికి చాలా సమాచారం ఉంది. మరి, ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామా? బైబిలు నుండి నేర్చుకున్న వాటిని బట్టి విశ్వాసం ఉంచుతామా?
ఒక బలమైన కోట కూలిపోయింది
రాహాబు సలహా విని, ఆ ఇద్దరు గూఢచారులు కిటికీకి వేలాడదీసిన తాడు సహాయంతో కిందికి దిగి, గుట్టుచప్పుడు కాకుండా కొండల వైపు పారిపోయారు. యెరికోకు ఉత్తరం వైపు ఉన్న లోయల్లో చాలా గుహలు ఉన్నాయి. బహుశా, ఆ గూఢచారులు అక్కడే దాక్కొని, ప్రమాదం లేదని అనుకున్న తర్వాత రాహాబు నుండి విన్న మంచివార్తను మోసుకుంటూ ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వెళ్లిపోయారు.
రాహాబు ఇశ్రాయేలు దేవుని మీద విశ్వాసం ఉంచింది
ఆ తర్వాత, యెహోవా అద్భుతరీతిలో యొర్దాను నది ప్రవాహాన్ని ఆపేశాడు. ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచి, ఆ నదిని దాటారు. ఆ వార్త విని, యెరికో ప్రజలు ఖచ్చితంగా భయంతో గజగజ వణికిపోయి ఉంటారు. (యెహోషువ 3:14-17) కానీ, రాహాబు మాత్రం భయపడి ఉండదు; యెహోవా మీద విశ్వాసం ఉంచడం సరైనదేనని ఆమెకు ఇంకా బలంగా అనిపించి ఉంటుంది.
ఇశ్రాయేలీయులు యెరికో చుట్టూ తిరగాల్సిన రోజులు వచ్చాయి. రోజుకు ఒక్కసారి చొప్పున వాళ్లు ఆరు రోజులు తిరిగారు. ఏడో రోజు రానే వచ్చింది, కానీ ఈరోజు మాత్రం కాస్త వేరు! ఈ ఆర్టికల్ మొదట్లో చూసినట్లు, తెల్లవారగానే వాళ్లు తిరగడం మొదలుపెట్టారు. వాళ్లు ఆ నగరాన్ని ఒకసారి చుట్టేశారు, అయినా మళ్లీ మళ్లీ తిరుగుతూనే ఉన్నారు. (యెహోషువ 6:15) అసలు ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు?
చివరికి, ఏడో రోజున ఏడుసార్లు తిరిగాక సైన్యం ఆగింది. బూరల మోత కూడా ఆగిపోయింది. ఆ నగరమంతా నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పుడు ఏమౌతుందోనని యెరికో ప్రజలకు చెమటలు పడుతున్నాయి. ఆ తర్వాత, యెహోషువ చెప్పినట్టు, ఇశ్రాయేలు సైన్యం మొదటిసారి తమ గొంతు చించుకొని అరుస్తూ పెద్ద యుద్ధకేక వేశారు. యెరికో గోడల మీదున్న సైనికులు ఈ యుద్ధకేక విని, ఇదేం వింత దాడి అనుకున్నారా? అలా ఆలోచించేంత సమయం కూడా వాళ్ల దగ్గర లేదు. ఒక్కసారిగా ఆ పెద్ద ప్రాకారం అదిరి, బీటలువారి, నేలమట్టం అయ్యింది. అంతా రెప్పపాటులో జరిగిపోయింది! పైకి లేచిన దుమ్ము కాస్త సద్దుమణిగాక, ఒక దగ్గర గోడ మాత్రం ఏమీ అవ్వకుండా అలాగే ఉంది. అదే రాహాబు ఇల్లు ఉన్న గోడ. ఆమె చూపించిన విశ్వాసానికి, అది ఒక గుర్తుగా నిలిచింది. యెహోవా తనను కాపాడిన విధానం చూసినప్పుడు ఆమెకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి!a తనేకాదు, తన కుటుంబం కూడా క్షేమంగా ఉంది.—యెహోషువ 6:10, 16, 20, 21.
యెహోవా ప్రజలు కూడా రాహాబు విశ్వాసాన్ని బట్టి ఆమెను గౌరవించారు. కూలిపోయిన గోడల మధ్య మిగిలిపోయిన ఆమె ఇంటిని చూసినప్పుడు యెహోవా ఆమెకు తోడుగా ఉన్నాడని వాళ్లు అర్థం చేసుకున్నారు. ఆ చెడ్డ నగరాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. యుద్ధం అయిపోయాక, రాహాబును ఇశ్రాయేలు పాలెం దగ్గర్లో ఉండనిచ్చారు. కొంతకాలం తర్వాత, రాహాబు యూదుల్లో ఒకరిగా కలిసిపోయింది. ఆమె శల్మాను అనే ఇశ్రాయేలీయున్ని పెళ్లి చేసుకుంది. వాళ్లకు బోయజు అనే ఒక కొడుకు పుట్టాడు. అతను పెరిగి పెద్దయ్యాక గొప్ప విశ్వాసం చూపించాడు. అతను మోయాబీయురాలైన రూతును పెళ్లి చేసుకున్నాడు.b (రూతు 4:13, 22) విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన ఈ కుటుంబం నుండే రాజైన దావీదు, ఆ తర్వాత మెస్సీయ (అంటే యేసుక్రీస్తు) వచ్చారు.—యెహోషువ 6:22-25; మత్తయి 1:5, 6, 16.
యెహోవా మనలో ఎవరినీ తక్కువ చేసి చూడడని రాహాబు జీవితం మనకు నేర్పిస్తుంది. ఆయన మనందరినీ గమనిస్తాడు, మన హృదయాల్ని చదువుతాడు. రాహాబులో ఉన్న విశ్వాసాన్ని చూసి యెహోవా సంతోషించాడు; మనలో కూడా అలాంటి విశ్వాసాన్ని గమనించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. రాహాబు తన విశ్వాసాన్ని పనుల్లో చూపించింది. బైబిలు చెప్తున్నట్టు, ఆమె “తన చేతల వల్ల నీతిమంతురాలని తీర్పు పొందింది.” (యాకోబు 2:25) ఆమె విశ్వాసాన్ని అనుకరించడం ఎంత తెలివైన పనో కదా!
a ఆసక్తికరంగా, ఆ ఇద్దరు గూఢచారులు రాహాబుతో చేసిన ఒప్పందాన్ని యెహోవా గౌరవించాడు.
b రూతు, బోయజు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “వాళ్లలా విశ్వాసం చూపించండి“ పుస్తకంలో 4, 5 అధ్యాయాలు చూడండి.