మీరు “యాజక రూపమైన రాజ్యముగా” ఉంటారు
“మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు.”—నిర్గ. 19:6.
1, 2. స్త్రీ సంతానానికి ఎలాంటి కాపుదల అవసరమైంది? ఎందుకు?
యెహోవా సంకల్ప నెరవేర్పులో బైబిల్లోని మొట్టమొదటి ప్రవచనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏదెనులో వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, “నీకును [సాతానుకు] స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను.” ఆ వైరం ఎంత తీవ్రంగా ఉంటుంది? “అది [స్త్రీ సంతానం] నిన్ను [సాతానును] తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు” అని యెహోవా చెప్పాడు. (ఆది. 3:15) సర్పానికి స్త్రీకి మధ్య శత్రుత్వం ఎంత భయంకరంగా ఉంటుందంటే, స్త్రీ సంతానాన్ని తుడిచిపెట్టడానికి సాతాను ఎంతకైనా తెగిస్తాడు.
2 అందుకే దేవుని ప్రజల గురించి కీర్తనకర్త దేవునికి ఇలా మొరపెట్టాడు, “నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు. నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు. నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచన చేయుచున్నారు. . . . జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు.” (కీర్త. 83:2-4) స్త్రీ సంతానం వచ్చే వంశావళి నాశనం కాకుండా, కలుషితం అవ్వకుండా కాపాడాలి. అందుకే తన సంకల్పాన్ని తప్పకుండా నెరవేర్చే మరికొన్ని చట్టబద్ధమైన ఏర్పాట్లు యెహోవా చేశాడు.
సంతానాన్ని కాపాడే నిబంధన
3, 4. (ఎ) ధర్మశాస్త్ర నిబంధన ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఇశ్రాయేలీయులు ఏమి చేస్తామని చెప్పారు? (బి) ధర్మశాస్త్ర నిబంధన ఉద్దేశం ఏమిటి?
3 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి లక్షల్లో వృద్ధిచెందిన తర్వాత, యెహోవా వాళ్లను ఒక జనాంగంగా చేశాడు, అదే ప్రాచీన ఇశ్రాయేలు జనాంగం. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి యెహోవా ఆ జనాంగంతో ఓ ప్రత్యేక నిబంధన చేశాడు. ఇశ్రాయేలీయులు కూడా ఆ నిబంధనలోని షరతులకు ఒప్పుకున్నారు. బైబిలు ఇలా చెబుతుంది, “[మోషే] నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు—యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే [బలి అర్పించిన ఎద్దుల] రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి—ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.”—నిర్గ. 24:3-8.
4 ధర్మశాస్త్ర నిబంధన సీనాయి పర్వతం వద్ద సా.శ.పూ. 1513లో అమలులోకి వచ్చింది. ఆ నిబంధన ద్వారా దేవుడు ప్రాచీన ఇశ్రాయేలీయుల్ని తాను ఎంపిక చేసుకున్న జనాంగంగా ప్రత్యేకపర్చాడు. యెహోవా అప్పుడు వాళ్లకు ‘న్యాయాధిపతి, శాసనకర్త, రాజు’ అయ్యాడు. (యెష. 33:22) దేవుని నీతి ప్రమాణాలను పాటిస్తే ఏం జరుగుతుందో, నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో ఇశ్రాయేలీయుల చరిత్ర చూస్తే అర్థమౌతుంది. అన్యుల్ని పెళ్లిచేసుకోవడాన్ని, వాళ్ల దేవుళ్లను ఆరాధించడాన్ని ధర్మశాస్త్రం నిషేధించింది; అలా అబ్రాహాము వంశావళి కలుషితం కాకుండా కాపాడడమే ధర్మశాస్త్ర ఉద్దేశం.—నిర్గ. 20:4-6; 34:12-16.
5. (ఎ) ధర్మశాస్త్ర నిబంధన ఇశ్రాయేలీయులకు ఏ అవకాశాన్ని ఇచ్చింది? (బి) దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకు తిరస్కరించాడు?
5 ధర్మశాస్త్ర నిబంధన, యాజకత్వ ఏర్పాట్లు కూడా చేసింది. ఆ యాజకత్వం ముందుముందు రాబోయే గొప్ప ఏర్పాటును సూచించింది. (హెబ్రీ. 7:11; 10:1) నిజానికి ఆ నిబంధన ద్వారా, “యాజక రూపమైన రాజ్యముగా” ఉండే అరుదైన అవకాశాన్ని, భాగ్యాన్ని యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. అయితే దాన్ని పొందాలంటే వాళ్లు యెహోవా ఆజ్ఞలకు తప్పకుండా లోబడాలి. (నిర్గమకాండము 19:5, 6 చదవండి.) కానీ ఇశ్రాయేలీయులు లోబడలేదు. అబ్రాహాము సంతానంలో ప్రాథమిక భాగమైన మెస్సీయను సంతోషంగా అంగీకరించే బదులు వాళ్లు తిరస్కరించారు. చివరికి దేవుడు ఆ జనాంగాన్ని తిరస్కరించాడు.
ఇశ్రాయేలీయులు అవిధేయత చూపించినంత మాత్రాన, ధర్మశాస్త్ర నిబంధన విఫలమైపోయిందని కాదు (3-6 పేరాలు చూడండి)
6. ధర్మశాస్త్ర లక్ష్యం ఏమిటి?
6 ఇశ్రాయేలు జనాంగం యెహోవాకు నమ్మకంగా ఉండలేదు కాబట్టి యాజకరూపమైన రాజ్యంగా తయారవ్వలేదు. అంతమాత్రాన ధర్మశాస్త్రం విఫలం అయిపోయిందని కాదు. స్త్రీ సంతానాన్ని కాపాడి, ప్రజలను మెస్సీయ వద్దకు నడిపించడమే ధర్మశాస్త్ర లక్ష్యం. క్రీస్తు వచ్చాక, ప్రజలు ఆయన్ను గుర్తించాక దాని లక్ష్యం నెరవేరింది. “క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు” అని బైబిలు చెబుతుంది. (రోమా. 10:4) మరి ఎవరు యాజకరూపమైన రాజ్యంగా తయారవుతారు? ఓ కొత్త జనాంగం తయారయ్యేలా యెహోవా మరో చట్టబద్ధమైన ఒప్పందం చేశాడు.
ఓ కొత్త జనాంగం ఉనికిలోకి వచ్చింది
7. కొత్త నిబంధన గురించి యెహోవా యిర్మీయా ద్వారా ఏమి తెలియజేశాడు?
7 ధర్మశాస్త్ర నిబంధనను రద్దు చేయడానికి చాలాకాలం ముందే, తాను ఇశ్రాయేలు జనాంగంతో ఒక “క్రొత్త నిబంధన” చేయబోతున్నానని యెహోవా యిర్మీయా ద్వారా తెలియజేశాడు. (యిర్మీయా 31:31-33 చదవండి.) అది ధర్మశాస్త్ర నిబంధన లాంటిది కాదు, ఎందుకంటే కొత్త నిబంధన జంతుబలుల అవసరం లేకుండానే పాప క్షమాపణను సాధ్యం చేస్తుంది. ఏవిధంగా?
8, 9. (ఎ) యేసు రక్తం చిందించడం వల్ల ఏమి సాధ్యమైంది? (బి) కొత్త నిబంధనలోని వాళ్లకు ఏ అవకాశం దక్కింది? (ప్రారంభ చిత్రం చూడండి.)
8 శతాబ్దాల తర్వాత, యేసు సా.శ. 33 నీసాను 14న ప్రభువు రాత్రి భోజనాన్ని ప్రారంభించాడు. ఆ సందర్భంలో, ద్రాక్షారసం ఉన్న గిన్నె గురించి ఆయన తన 11 మంది నమ్మకస్థులైన అపొస్తలులకు ఇలా చెప్పాడు, “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన.” (లూకా 22:20) యేసు ద్రాక్షారసం గురించి, “ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము” అని చెప్పాడని మత్తయి రాశాడు.—మత్త. 26:27, 28.
9 యేసు చిందించిన రక్తం కొత్త నిబంధన అమలయ్యేలా చేస్తుంది. అలాగే పాపాల్ని శాశ్వతంగా క్షమించేందుకు కూడా వీలు కల్పించింది. యేసు కొత్త నిబంధనలో సభ్యుడు కాడు. ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయనకు పాపక్షమాపణ అవసరం లేదు. అయితే యేసు బలి విలువను ఉపయోగించి, యెహోవా ఆదాము సంతతికి ప్రయోజనం చేకూర్చగలడు. అంతేకాదు, కొంతమంది నమ్మకమైన మనుషులను పరిశుద్ధాత్మతో అభిషేకించి, ‘తన పిల్లలుగా’ దత్తత తీసుకోగలడు. (రోమీయులు 8:14-17 చదవండి.) యెహోవా దృష్టిలో వాళ్లు కూడా ఏ పాపంలేని యేసులా ఉన్నారు. ఈ అభిషిక్తులు ‘క్రీస్తు తోటి వారసులుగా’ తయారై, ‘యాజకరూపమైన రాజ్యంగా’ తయారయ్యే గొప్ప అవకాశాన్ని పొందుతారు. ఆ భాగ్యాన్ని ప్రాచీన ఇశ్రాయేలు జనాంగం పోగొట్టుకుంది. ‘క్రీస్తు తోటి వారసుల’ గురించి అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు, “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.” (1 పేతు. 2:9) కొత్త నిబంధన ఎంత ప్రాముఖ్యమైనదో కదా! దానివల్ల యేసు శిష్యులు అబ్రాహాము సంతానంలోని రెండవ భాగంగా తయారవుతారు.
కొత్త నిబంధన అమలులోకి రావడం
10. కొత్త నిబంధన ఎప్పుడు అమలులోకి వచ్చింది? అది అప్పటిదాకా ఎందుకు అమల్లోకి రాలేదు?
10 కొత్త నిబంధన ఎప్పుడు అమలులోకి వచ్చింది? యేసు తన చివరిరాత్రి దానిగురించి మాట్లాడినప్పుడు మాత్రం కాదు. అది అమలవ్వాలంటే యేసు తన రక్తాన్ని చిందించాలి, దాని విలువను పరలోకంలో ఉన్న తండ్రికి ఇవ్వాలి. అంతేకాదు, ‘క్రీస్తు తోటి వారసులపై’ యెహోవా తన పరిశుద్ధాత్మను కూడా కుమ్మరించాలి. కాబట్టి, సా.శ. 33 పెంతెకొస్తు రోజున, యేసు నమ్మకమైన శిష్యులు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు కొత్త నిబంధన అమలులోకి వచ్చింది.
11. కొత్త నిబంధన వల్ల యూదులు, అన్యులు ఎలా ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో సభ్యులవ్వగలిగారు? అందులో ఎంతమంది ఉంటారు?
11 ఇశ్రాయేలీయులతో కొత్త నిబంధన చేయబోతున్నానని యిర్మీయా ద్వారా యెహోవా ప్రకటించినప్పుడే, ఓ విధంగా ధర్మశాస్త్ర నిబంధన ‘పాతదై’ పోయింది. అయినా, కొత్త నిబంధన అమలులోకి వచ్చేదాకా నిజానికి అది రద్దు కాలేదు. (హెబ్రీ. 8:13) అప్పటినుండి యెహోవా యూదుల్నీ సున్నతి పొందని అన్యుల్నీ ఒకేలా చూస్తున్నాడు, ఎందుకంటే “సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు.” (రోమా. 2:29) కొత్త నిబంధన చేయడం ద్వారా దేవుడు ‘వాళ్ల మనసులో తన ధర్మవిధులను ఉంచాడు, వాళ్ల హృదయాలమీద వాటిని రాశాడు.’ (హెబ్రీ. 8:10) కొత్త నిబంధనలో ఉండేవాళ్ల సంఖ్య 1,44,000. వాళ్లు “దేవుని ఇశ్రాయేలు” లేదా ఆధ్యాత్మిక ఇశ్రాయేలు అనే ఒక కొత్త జనాంగంగా తయారయ్యారు.—గల. 6:16; ప్రక. 14:1, 4.
12. ధర్మశాస్త్ర నిబంధనకు, కొత్త నిబంధనకు మధ్య ఎలాంటి తేడాలు ఉన్నాయి?
12 ధర్మశాస్త్ర నిబంధనకు, కొత్త నిబంధనకు మధ్య ఎలాంటి తేడాలు ఉన్నాయి? ధర్మశాస్త్ర నిబంధన యెహోవాకు, సహజ ఇశ్రాయేలీయులకు మధ్య జరిగితే; కొత్త నిబంధన యెహోవాకు, ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులకు మధ్య జరిగింది. మొదటి నిబంధనకు మోషే మధ్యవర్తిగా ఉంటే, కొత్త నిబంధనకు యేసు మధ్యవర్తిగా ఉన్నాడు. ధర్మశాస్త్ర నిబంధన జంతువుల రక్తం ద్వారా అమలులోకి వచ్చింది, కొత్త నిబంధన యేసు చిందించిన రక్తం ద్వారా అమలులోకి వచ్చింది. ధర్మశాస్త్ర నిబంధన ద్వారా మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగం సంస్థీకరించబడింది, అయితే కొత్త నిబంధనలోని వాళ్లు సంఘ శిరస్సైన యేసు నాయకత్వంలో సంస్థీకరించబడ్డారు.—ఎఫె. 1:22.
13, 14. (ఎ) కొత్త నిబంధనకు రాజ్యంతో ఎలాంటి సంబంధం ఉంది? (బి) ఆధ్యాత్మిక ఇశ్రాయేలు క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించాలంటే ఏది అవసరం?
13 కొత్త నిబంధనకు రాజ్యంతో సంబంధం ఉంది, ఎందుకంటే అది పరలోక రాజ్యంలో రాజులుగా, యాజకులుగా సేవచేసే ఒక పరిశుద్ధ జనాంగాన్ని తయారుచేస్తుంది. ఆ జనాంగం అబ్రాహాము సంతానంలో రెండవ భాగంగా ఉంటుంది. (గల. 3:29) అలా కొత్త నిబంధన, యెహోవా అబ్రాహాముతో చేసిన నిబంధన నెరవేరుతుందనే హామీ ఇస్తుంది.
14 అయితే రాజ్యానికి సంబంధించిన మరో అంశానికి కూడా చట్టబద్ధమైన హామీ కావాలి. కొత్త నిబంధన ఆధ్యాత్మిక ఇశ్రాయేలును తయారుచేసి, దాని సభ్యులు ‘క్రీస్తు తోటి వారసులు’ అవడానికి ఆధారాన్ని ఇచ్చింది. అయితే వాళ్లు పరలోకంలో యేసుక్రీస్తుతో పాటు రాజులుగా, యాజకులుగా సేవ చేయాలంటే ఓ చట్టబద్ధమైన ఒప్పందం అవసరం.
ఇతరులు క్రీస్తుతోపాటు పరిపాలించడానికి వీలు కల్పించే నిబంధన
15. యేసు తన నమ్మకమైన అపొస్తలులతో స్వయంగా ఏ నిబంధన చేశాడు?
15 ప్రభువురాత్రి భోజనాన్ని ప్రారంభించిన తర్వాత యేసు తన నమ్మకమైన శిష్యులతో ఒక నిబంధన చేశాడు, అదే రాజ్య నిబంధన. (లూకా 22:28-30 చదవండి.) ఇతర నిబంధనలన్నీ యెహోవా చేస్తే, ఈ నిబంధనను మాత్రం యేసు తన అభిషిక్త అనుచరులతో స్వయంగా చేశాడు. “నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా [‘నా తండ్రి నాతో నిబంధన చేసినట్లుగా,’ NW]” అని అన్నప్పుడు యేసు బహుశా, “మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై” ఉండమని యెహోవా తనతో చేసిన నిబంధన గురించి మాట్లాడివుండవచ్చు.—హెబ్రీ. 5:5, 6.
16. రాజ్య నిబంధన అభిషిక్త క్రైస్తవులకు ఏ అవకాశాన్ని ఇచ్చింది?
16 యేసు 11 మంది నమ్మకమైన అపొస్తలులు ‘శోధనలలో ఆయనతో కూడా ఉన్నారు.’ వాళ్లు ఆయనతోపాటు పరలోకంలో సింహాసనాల మీద కూర్చుని, రాజులుగా పరిపాలిస్తారనీ యాజకులుగా సేవచేస్తారనీ రాజ్య నిబంధన హామీ ఇచ్చింది. అయితే ఆ గొప్ప అవకాశాన్ని పొందేది ఆ 11 మంది మాత్రమే కాదు. మహిమాన్వితుడైన యేసు అపొస్తలుడైన యోహానుకు ఓ దర్శనంలో ఇలా చెప్పాడు, “నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.” (ప్రక. 3:21) అలా యేసు రాజ్య నిబంధనను 1,44,000 మంది అభిషిక్త క్రైస్తవులతో చేశాడు. (ప్రక. 5:9, 10; 7:4) వాళ్లు యేసుతోపాటు పరలోకంలో పరిపాలించే చట్టబద్ధమైన హక్కును ఆ నిబంధన ఇచ్చింది. ఉన్నత కుటుంబానికి చెందిన పెళ్లికూతురు, ఒక రాజును పెళ్లి చేసుకుని ఆయనతోపాటు పరిపాలనలో భాగం వహించే హక్కును పొందడంతో దాన్ని పోల్చవచ్చు. నిజానికి లేఖనాలు అభిషిక్త క్రైస్తవులను క్రీస్తు ‘పెళ్లికుమార్తెగా,’ క్రీస్తును పెళ్లి చేసుకునే ‘పవిత్రురాలైన కన్యకగా’ వర్ణిస్తున్నాయి.—ప్రక. 19:6-8; 21:9; 2 కొరిం. 11:2.
దేవుని రాజ్యంపై అచంచల విశ్వాసం ఉంచండి
17, 18. (ఎ) రాజ్యానికి సంబంధించి మనం ఇప్పటివరకు పరిశీలించిన ఆరు నిబంధనల గురించి చెప్పండి. (బి) రాజ్యంపై మనం ఎందుకు అచంచల విశ్వాసం ఉంచవచ్చు?
17 ఈ రెండు ఆర్టికల్స్‌లో మనం పరిశీలించిన నిబంధనలన్నిటికీ రాజ్యానికి సంబంధించిన ఒకటి లేదా మరిన్ని ముఖ్యమైన అంశాలతో సంబంధం ఉంది. (“దేవుడు తన సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తాడు?” చార్టు చూడండి.) దీన్నిబట్టి దేవునిరాజ్యం చట్టబద్ధమైన ఒప్పందాలపై స్థిరంగా ఆధారపడివుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. భూమి విషయంలో, మనుషుల విషయంలో దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు మెస్సీయ రాజ్యాన్ని ఉపయోగించుకుంటున్నాడని పూర్తిగా నమ్మడానికి మనకు నిజంగా బలమైన కారణం ఉంది.—ప్రక. 11:15.
మెస్సీయ రాజ్యం ద్వారా, భూమి విషయంలో తన సంకల్పాన్ని యెహోవా నిజం చేస్తాడు (15-18 పేరాలు చూడండి)
18 దేవుని రాజ్యం మాత్రమే మానవజాతి కష్టాలన్నిటినీ పూర్తిగా తీసేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ రాజ్యం మనుష్యులందరికీ శాశ్వత ఆశీర్వాదాలు తీసుకొస్తుందని మనం పూర్తిగా నమ్ముతున్నాం. కాబట్టి ఆ సత్యాన్ని ఉత్సాహంగా ఇతరులకు చెబుదాం!—మత్త. 24:14.