జాగ్రత్తగా ఉండండి సాతాను మిమ్మల్ని మింగేయాలని చూస్తున్నాడు!
“మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.”—1 పేతు. 5:8.
1. ఒక దేవదూత సాతానుగా ఎలా మారాడో వివరించండి.
ఒకప్పుడు ఆ దేవదూతకు యెహోవాతో మంచి సంబంధం ఉండేది. కానీ ఆ తర్వాత, మనుషులు తనను ఆరాధించాలని అతను కోరుకున్నాడు. ఆ చెడు కోరికను మొదట్లోనే తుంచేసుకునే బదులు, దాన్ని మరింతగా పెంచుకుని చివరికి పాపం చేశాడు. (యాకో. 1:14, 15) ఆ దేవదూత లేక ఆత్మప్రాణి మరెవరో కాదు సాతానే. అతను ‘సత్యమందు నిలిచినవాడు కాడు’ అని బైబిలు చెప్తుంది. అతను యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, “అబద్ధానికి తండ్రి” అయ్యాడు.—యోహా. 8:44, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
2, 3. “సాతాను,” “అపవాది,” “సర్పము,” “ఘటసర్పము” అనే పదాలు, దేవుని బద్ధశత్రువు గురించి ఏమి తెలియజేస్తున్నాయి?
2 తిరుగుబాటు చేసిన తర్వాత సాతాను యెహోవాకు, మానవజాతికి బద్ధశత్రువుగా మారాడు. బైబిలు సాతానును ఎలా వర్ణిస్తుందో పరిశీలిస్తే, అతను నిజంగా ఎంత చెడ్డవాడో మనకు అర్థమవుతుంది. సాతాను అంటే “ఎదిరించేవాడు” అని అర్థం. ఈ చెడ్డ దూత దేవుని పరిపాలనను ద్వేషిస్తూ, దాన్ని ఎదిరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవా పరిపాలన అంతమవ్వాలని అతను కోరుకుంటున్నాడు.
3 ప్రకటన 12:9 పరిశీలిస్తే, సాతానుకు అపవాది అనే పేరు కూడా ఉందని తెలుస్తుంది. అపవాది అంటే “నిందలు వేసేవాడు” అని అర్థం. ఉదాహరణకు, దేవుడు అబద్ధాలు చెప్తున్నాడని సాతాను ఆయనమీద నిందవేశాడు. “ఆది సర్పము” అనే మాట విన్నప్పుడు, సాతాను పామును ఉపయోగించి హవ్వను ఎలా మోసంచేశాడో మనకు గుర్తొస్తుంది. “మహాఘటసర్పము” అనే మాట సాతాను భయంకరమైన, క్రూరమైన, హానికరమైనవాడని సరిగ్గా వర్ణిస్తుంది. యెహోవా సంకల్పాన్ని అడ్డుకోవాలని, దేవుని ప్రజల్ని నాశనం చేయాలని సాతాను కంకణం కట్టుకున్నాడు.
4. ఈ ఆర్టికల్లో ఏమి పరిశీలిస్తాం?
4 అవును, సాతాను మన యథార్థతను పాడుచేయడమే పనిగా పెట్టుకున్నాడు. అందుకే బైబిలు మనల్ని ఇలా హెచ్చరిస్తోంది, “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతు. 5:8) సాతానుకున్న మూడు లక్షణాల గురించి ఈ ఆర్టికల్లో పరిశీలిద్దాం. వాటిని తెలుసుకుంటే యెహోవాకు, ఆయన ప్రజలకు శత్రువైన ఈ దుష్టుని నుండి మనల్ని మనం ఎందుకు కాపాడుకోవాలో అర్థమౌతుంది.
సాతాను శక్తిమంతుడు
5, 6. (ఎ) దేవదూతలు “బలశూరులు” అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్పండి. (బి) సాతానుకు “మరణముయొక్క బలము” ఉందని బైబిలు చెప్తున్నప్పుడు దానర్థమేమిటి?
5 దేవదూతలు “బలశూరులు” అని బైబిలు చెప్తుంది. (కీర్త. 103:20) వాళ్లకు మనుషులకన్నా చాలా ఎక్కువ తెలివితేటలు, శక్తి ఉన్నాయి. నమ్మకమైన దేవదూతలు, తమకున్న శక్తిని మంచి కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఓ సందర్భంలో ఒక దేవదూత 1,85,000 మంది అష్షూరు సైనికుల్ని చంపేశాడు. ఏ ఒక్క మనిషికీ అది సాధ్యం కాదు, చివరికి ఓ సైన్యం మొత్తానికి కూడా కష్టమే. (2 రాజు. 19:35) మరో సందర్భంలో ఓ దేవదూత తన తెలివితేటల్ని, శక్తిని ఉపయోగించి యేసు శిష్యుల్ని జైలు నుండి విడిపించాడు. కాపలాదారులు పక్కనేవున్నా, ఆ దూత అద్భుతరీతిలో చెరసాల తలుపులు తీసి, వాళ్లను బయటికి తెచ్చి, తలుపులు మూసేశాడు.—అపొ. 5:18-23.
6 నమ్మకమైన దేవదూతలు మంచి చేయడానికి తమ శక్తిని ఉపయోగిస్తే, సాతాను మాత్రం ఇతరులకు హాని చేయడానికి తన శక్తిని ఉపయోగిస్తాడు. అతనికి ఎంతో శక్తి, అధికారం ఉన్నాయి. అతను “ఈ లోకాధికారి” అని, “ఈ యుగ సంబంధమైన దేవత” అని బైబిలు చెప్తుంది. (యోహా. 12:31; 2 కొరిం. 4:4) అంతేకాదు, అతనికి “మరణముయొక్క బలము” ఉందని కూడా బైబిలు చెప్తుంది. (హెబ్రీ. 2:14) అంటే, సాతాను ప్రతీ ఒక్కర్ని నేరుగా చంపుతాడని కాదుగానీ, సాతానుకు ఉన్నటువంటి వైఖరితో అంటే ప్రజలు ఒకర్నొకరు ద్వేషించుకొని, చంపుకునే వైఖరితో ఈ లోకం నిండిపోయింది. పైగా, హవ్వ సాతాను చెప్పిన అబద్ధాన్ని నమ్మడం వల్ల, ఆదాము దేవుని మాట వినకపోవడం వల్ల మనుషులందరికీ పాపం, మరణం వచ్చాయి. (రోమా. 5:12) అవును, యేసు చెప్పినట్లు సాతాను నిజంగానే “నరహంతకుడు.” (యోహా. 8:44) మన శత్రువైన సాతాను శక్తిమంతుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
7. తమకు చాలా శక్తి ఉందని దయ్యాలు ఎలా చూపించుకున్నాయి?
7 మనం సాతానును ఎదిరించినప్పుడు, అతని మద్దతుదారుల్ని, దేవుని పరిపాలనను వ్యతిరేకించేవాళ్లను కూడా ఎదిరిస్తాం. వాళ్లలో, దేవుని మీద తిరుగుబాటు చేసిన చాలామంది దూతలు ఉన్నారు. బైబిలు వాళ్లను దయ్యాలు అని పిలుస్తుంది. (ప్రక. 12:3, 4) ఆ దయ్యాలు మనుషుల్ని ఎన్నో బాధలు పెడుతూ, వాళ్లకన్నా తమకు ఎక్కువ శక్తి ఉందని చాలా సందర్భాల్లో చూపించుకున్నాయి. (మత్త. 8:28-32; మార్కు 5:1-5) దయ్యాలకు, వాటి ‘అధిపతికి’ ఉన్న శక్తిని ఎన్నడూ తక్కువ అంచనా వేయకండి. (మత్త. 9:34) యెహోవా సహాయం లేకుండా మనం సాతానుతో పోరాడి గెలవలేము.
సాతాను క్రూరుడు
8. (ఎ) సాతాను లక్ష్యం ఏమిటి? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) ఈ లోకం సాతానులా క్రూరంగా ఉందని మీరు గమనించిన దాన్నిబట్టి ఎలా చెప్తారు?
8 పేతురు సాతానును ‘గర్జించు సింహంతో’ పోల్చాడు. “గర్జించడం” అని అనువదించబడిన గ్రీకు పదానికి “ఓ మృగం విపరీతమైన ఆకలితో పెద్దగా అరవడం” అనే అర్థముందని ఓ రెఫరెన్స్ పుస్తకం చెప్తుంది. సాతానుకున్న క్రూర, దుష్ట స్వభావాన్ని అది ఎంత సరిగ్గా వర్ణిస్తుందో! సాతాను ఈ లోకాన్నంతా తన గుప్పిట్లో పెట్టుకున్నా, ఇంకా ఆకలి తీరని సింహంలా ఎవర్ని మింగాలా అని గర్జిస్తూ తిరుగుతున్నాడు. (1 యోహా. 5:19) సాతాను దృష్టంతా ముఖ్యంగా భూమ్మీద మిగిలివున్న అభిషిక్తుల మీద, వాళ్లకు మద్దతిస్తున్న ‘వేరేగొర్రెల’ మీదే ఉంది. (యోహా. 10:16; ప్రక. 12:17) యెహోవా ప్రజల్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్నదే అతని లక్ష్యం. మొదటి శతాబ్దం నుండి ఇప్పటివరకూ నిజక్రైస్తవులు ఎన్నో హింసలు అనుభవించడాన్ని బట్టి సాతాను ఎంత క్రూరుడో అర్థమౌతుంది.
9, 10. (ఎ) సాతాను ఇశ్రాయేలు జనాంగం మీద ఎలా దాడిచేశాడు? (ఉదాహరణలు చెప్పండి.) (బి) ప్రాచీన ఇశ్రాయేలీయుల్ని గురిగా చేసుకోవడానికి సాతానుకు ఏ ప్రత్యేక కారణం ఉంది? (సి) నేడు, యెహోవా సేవకులెవరైనా గంభీరమైన పాపం చేస్తే సాతాను ఎలా భావిస్తాడని మీరనుకుంటున్నారు?
9 సాతాను క్రూరుడని మరో విధంగా కూడా చూపించుకున్నాడు. ఆకలితో ఉన్న సింహం, తినబోయే జంతువు మీద దయాదాక్షిణ్యాలు చూపించదు. జంతువును చంపేముందు ఏమాత్రం జాలిపడదు, చంపిన తర్వాత కూడా అస్సలు బాధపడదు. అదేవిధంగా, సాతాను కూడా తాను దాడిచేయబోయేవాళ్ల మీద ఏమాత్రం జాలిపడడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు లైంగిక అనైతికత, దురాశ వంటి పాపాలకు లొంగిపోయిన ప్రతీసారి సాతాను ఎంత సంతోషించివుంటాడో ఆలోచించండి. వ్యభిచారం చేసిన జిమ్రీ, దురాశాపరుడైన గేహజీ ఎదుర్కొన్న విషాదకరమైన పర్యవసానాలు చూసి, విజయగర్వంతో నవ్వుకున్న సాతానును మీరు చూడగలుగుతున్నారా?—సంఖ్యా. 25:6-8, 14, 15; 2 రాజు. 5:20-27.
దేవుని సేవకులెవరైనా పాపం చేస్తే సాతాను ఎంతో సంతోషిస్తాడు (10వ పేరా చూడండి)
10 ప్రాచీన ఇశ్రాయేలీయుల్ని గురిగా చేసుకోవడానికి సాతానుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. సాతానును నాశనం చేసి, యెహోవాకు మాత్రమే పరిపాలించే హక్కు ఉందని నిరూపించే మెస్సీయ ఆ జనాంగం నుండే రావాలి. (ఆది. 3:15) ఇశ్రాయేలీయులకు దేవుని అనుగ్రహం ఉండడం సాతానుకు ఇష్టంలేదు. అందుకే వాళ్లతో పాపం చేయించడానికి సాతాను శతవిధాలా ప్రయత్నించాడు. వ్యభిచారం చేసిన దావీదును చూసి సాతాను బాధపడివుంటాడని, వాగ్దానదేశంలోకి వెళ్లే అవకాశాన్ని చేజార్చుకున్న మోషేను చూసి జాలిపడివుంటాడని అనుకోకండి. అలా బాధపడడు సరికదా, దేవుని సేవకులెవరైనా గంభీరమైన తప్పు చేస్తే సాతాను ఆనందంతో ఎగిరిగంతేస్తాడు. నిజానికి, సాతాను అలాంటి సందర్భాల్ని యెహోవాను నిందించడానికి ఉపయోగించుకుంటాడు.—సామె. 27:11.
11. సాతాను శారాను ఎందుకు గురిగా చేసుకున్నాడు?
11 సాతాను ముఖ్యంగా మెస్సీయ వచ్చే వంశావళిని ద్వేషించాడు. ఉదాహరణకు, అబ్రాహామును “గొప్ప జనముగా” చేస్తానని యెహోవా చెప్పిన కొంతకాలానికే ఏమి జరిగిందో గుర్తుతెచ్చుకోండి. (ఆది. 12:1-3) అబ్రాహాము, శారా ఐగుప్తులో ఉన్నప్పుడు, ఫరో ఆమెను తన భార్యగా చేసుకోవాలని ఆమెను తన ఇంటికి రప్పించుకున్నాడు. కానీ యెహోవా జోక్యం చేసుకుని శారాను ఆ ప్రమాదం నుండి కాపాడాడు. (ఆదికాండము 12:14-20 చదవండి.) ఇస్సాకు పుట్టకముందు, వాళ్లు గెరారు అనే పట్టణంలో ఉన్నప్పుడు కూడా అలాంటి ఆపదే ఎదురైంది. (ఆది. 20:1-7) వాటికి సాతానే కారణమైవుంటాడా? శారా, సిరిసంపదలతో ఉన్న ఊరు పట్టణాన్ని విడిచిపెట్టి గుడారాల్లో నివసిస్తుంది. కాబట్టి ఫరోకు, అబీమెలెకుకు ఉన్న విలాసవంతమైన రాజభవనాలను చూపించి, సాతాను ఆమెను బుట్టలో వేసుకోవాలనుకున్నాడా? ఆమె ఫరోనుగానీ అబీమెలెకునుగానీ పెళ్లి చేసుకుని తన భర్తకు, యెహోవాకు నమ్మకద్రోహం చేస్తుందని సాతాను ఎదురుచూశాడా? దాని గురించి బైబిలు ఏమీ చెప్పట్లేదు. కానీ ఆమె ఒకవేళ మెస్సీయకు పూర్వీకురాలయ్యే అవకాశాన్ని చేజార్చుకుని ఉంటే, సాతాను ఎంతో సంతోషించేవాడు. శారాకున్న మంచి పేరు, ఆమెకు తన భర్తతో, యెహోవాతో ఉన్న సంబంధం పాడైవుంటే సాతాను ఏమాత్రం బాధపడేవాడుకాదు. సాతాను ఎంత క్రూరుడూ చెడ్డవాడో కదా!
12, 13. (ఎ) యేసు పుట్టిన తర్వాత సాతాను క్రూరత్వం ఎలా బయటపడింది? (బి) యెహోవాను ప్రేమించి ఆయన్ను సేవిస్తున్న నేటి యౌవనుల గురించి సాతాను ఏమనుకుంటాడని మీకనిపిస్తుంది?
12 అబ్రాహాము జీవించిన వందల సంవత్సరాల తర్వాత యేసు పుట్టాడు. పసివాడైన యేసును చూసి చాలా ముద్దుగా, అందంగా ఉన్నాడని సాతాను అనుకున్నాడా? లేదు. ఎందుకంటే, ఆ పసివాడు పెరిగి పెద్దవాడై వాగ్దానం చేయబడిన మెస్సీయ అవుతాడని అతనికి తెలుసు. యేసు, అబ్రాహాము సంతానంలో ముఖ్యమైన భాగమని, ఆయన భవిష్యత్తులో తన ‘క్రియలను లయపరుస్తాడని’ కూడా సాతానుకు తెలుసు. (1 యోహా. 3:8) ఆ పసికందుని చంపడం దారుణమని సాతాను అనుకున్నాడా? లేదు. తప్పొప్పులతో అతనికి పనిలేదు. అందుకే, ఏమాత్రం వెనకాడకుండా పసివాడైన యేసును చంపడానికి ప్రయత్నించాడు. ఏవిధంగా?
13 “యూదుల రాజు” పుట్టాడని జ్యోతిష్కులు చెప్పినప్పుడు రాజైన హేరోదు చాలా కోపంతో ఆ పసివాణ్ణి చంపాలనుకున్నాడు. (మత్త. 2:1-3, 13) అందుకే, బేత్లెహేము దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండేళ్లు, అంతకన్నా తక్కువ వయసున్న మగ పిల్లలందర్నీ చంపమని హేరోదు ఆజ్ఞాపించాడు. (మత్తయి 2:13-18 చదవండి.) అయితే యెహోవా ఆ ఘోరమైన మారణకాండ నుండి యేసును రక్షించాడు. ఈ వృత్తాంతం మన శత్రువైన సాతాను గురించి ఏమి చెప్తుంది? సాతానుకు మనుషుల ప్రాణమంటే ఏమాత్రం లెక్కలేదు. ఆఖరికి పిల్లల మీద కూడా జాలి చూపించడు. సాతాను నిజంగానే “గర్జించు సింహము.” అతను ఎంత క్రూరుడో అస్సలు మర్చిపోకండి.
సాతాను మోసగాడు
14, 15. సాతాను ఎలా “అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము” కలుగజేస్తున్నాడు?
14 ప్రజల్ని ప్రేమగల దేవుడైన యెహోవానుండి దూరం చేయడానికి సాతాను ఉపయోగించే ఏకైక మార్గం, వాళ్లను మోసగించడమే. (1 యోహా. 4:8) వాళ్లు తమ ఆధ్యాత్మిక అవసరాన్ని, అంటే దేవునితో స్నేహం చేయాల్సిన అవసరాన్ని గుర్తించకుండా సాతాను మోసం చేస్తున్నాడు. (మత్త. 5:3) సాతాను “అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము” కలుగజేయడం వల్ల వాళ్లు యెహోవా గురించిన సత్యం తెలుసుకోలేకపోతున్నారు.—2 కొరిం. 4:4.
15 సాతాను ఎక్కువ మందిని మోసంచేసే ఓ మార్గం, అబద్ధ మతం. యెహోవాను తప్ప ఎవర్నీ ఆరాధించకూడదని అతనికి తెలుసు. (నిర్గ. 20:5) అందుకే, ప్రజలు తమ పూర్వీకుల్ని, ప్రకృతిని, జంతువుల్ని అంటే యెహోవాను కాకుండా ఎవర్నైనా లేక దేన్నైనా ఆరాధిస్తే సాతాను ఎంతో సంతోషిస్తాడు. తమ ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడని చాలామంది అనుకుంటున్నారు, కానీ నిజానికి వాళ్లు తప్పుడు నమ్మకాల్లో, పనికిరాని ఆచారాల్లో కూరుకుపోయారు. వాళ్ల పరిస్థితి యెషయా కాలంలోని ఇశ్రాయేలీయుల పరిస్థితిలానే ఉంది. వాళ్లను యెహోవా ఇలా బతిమాలాడు, “ఆహారము కానిదానికొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి.”—యెష. 55:2.
16, 17. (ఎ) యేసు పేతురుతో “సాతానా, నా వెనుకకు పొమ్ము” అని ఎందుకు అన్నాడు? (బి) మనం అజాగ్రత్తగా ఉండేలా సాతాను ఎలా మోసగించవచ్చు?
16 యెహోవాను ఉత్సాహంగా సేవించేవాళ్లను కూడా సాతాను మోసం చేయగలడు. ఉదాహరణకు, తాను త్వరలోనే చంపబడతానని యేసు తన శిష్యులతో అన్నప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. యేసును ఎంతో ప్రేమించే అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు, “ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదు.” అప్పుడు యేసు ఇలా అన్నాడు, “సాతానా, నా వెనుకకు పొమ్ము.” (మత్త. 16:22, 23) యేసు పేతురును “సాతానా” అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే, మరికొన్ని రోజుల్లో ఏమి జరగబోతోందో యేసుకు తెలుసు. యేసు తన ప్రాణాన్ని బలిగా అర్పించబోతున్నాడు, సాతాను అబద్ధికుడని నిరూపించబోతున్నాడు. కాబట్టి, అది మానవ చరిత్రలోనే చాలా ప్రాముఖ్యమైన సమయం, అంతేకానీ యేసు తన ప్రాణం గురించి ఆలోచించుకునే సమయం కాదు. అలాంటి సమయంలో, యేసు అప్రమత్తంగా లేకపోతే సాతానుకన్నా ఎక్కువగా సంతోషించేవాళ్లు ఎవరూ ఉండరు.
17 మనం కూడా చాలా ప్రాముఖ్యమైన కాలంలో, అంటే అంతం దగ్గరపడుతున్న కాలంలో జీవిస్తున్నాం. మనం లోకంలో పేరుప్రఖ్యాతల కోసం ఆరాటపడుతూ, మన గురించి మాత్రమే ఆలోచించుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు. మనం చివరిరోజుల్లో జీవిస్తున్నామనే సంగతి మర్చిపోయి, అజాగ్రత్తగా ఉండాలని అతను కోరుకుంటున్నాడు. కానీ మీరు మాత్రం ఎల్లప్పుడూ ‘మెలకువగా ఉండండి.’ (మత్త. 24:42) అంతం ఇప్పట్లో రాదని లేదా అసలు ఎప్పటికీ రాదని సాతాను చెప్పే మాయమాటల్ని నమ్మకండి.
18, 19. (ఎ) యెహోవా ప్రేమను పొందడానికి అర్హులం కాదని మనం భావించేలా సాతాను ఎలా మోసం చేయవచ్చు? (బి) మనం అప్రమత్తంగా ఉండడానికి యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడు?
18 సాతాను మరో విధంగా కూడా మనల్ని మోసం చేస్తాడు. మనం యెహోవా ప్రేమను పొందడానికి అర్హులం కాదని, దేవుడు మన పాపాల్ని ఎప్పటికీ క్షమించడని మనం నమ్మాలన్నది అతని కోరిక. కానీ ఇవి పచ్చి అబద్ధాలు. ఈ విషయాల గురించి ఆలోచించండి, నిజానికి యెహోవా ప్రేమను పొందే అర్హత లేనిది ఎవరికి? సాతానుకు. దేవుడు ఎవర్ని ఎప్పటికీ క్షమించడు? సాతానును. మనకు బైబిలు ఇలా హామీ ఇస్తుంది, “మీరు చేసిన కార్యమును . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీ. 6:10) యెహోవాను సంతోషపెట్టడానికి మనం చేసే ప్రతీదాన్ని ఆయన విలువైనదిగా చూస్తాడు, ఆయనకు మనం చేసే సేవ ఎప్పటికీ వ్యర్థం కాదు. (1 కొరింథీయులు 15:58 చదవండి.) కాబట్టి సాతాను చెప్పే ఆ అబద్ధాన్ని నమ్మి మోసపోకండి.
19 మనం ఇప్పటిదాకా పరిశీలించినట్లు సాతాను శక్తిమంతుడు, క్రూరుడు, మోసగాడు. అయితే, ఇలాంటి శత్రువుతో మనం పోరాడి గెలవగలమా? యెహోవా సహాయంతో తప్పకుండా గెలవగలం. సాతాను పన్నాగాల గురించి బైబిలు వివరంగా చెప్తుంది కాబట్టి అతని ‘కుట్రలు మనకు తెలియనివి కావు.’ (2 కొరిం. 2:11, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) సాతాను మనమీద ఏయే విధాలుగా దాడిచేస్తాడో తెలుసుకుంటే, మనం మరింత అప్రమత్తంగా ఉంటాం. కానీ సాతాను కుట్రలను తెలుసుకోవడం మాత్రమే సరిపోదుగానీ, మనం మరో పని కూడా చేయాలి. దాని గురించి బైబిలు ఇలా చెప్తుంది, “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.” (యాకో. 4:7) మనం ఏ మూడు విషయాల్లో సాతానుతో పోరాడి గెలవగలమో తర్వాతి ఆర్టికల్లో చర్చిస్తాం.