నిత్యజీవాన్ని వాగ్దానం చేసిన యెహోవాను అనుకరించండి
‘ప్రియులైన పిల్లల్లా దేవునిపోలి నడుచుకోండి.’—ఎఫె. 5:1.
1. యెహోవాను అనుకరించడానికి మనకు ఏ సామర్థ్యం సహాయం చేస్తుంది?
ఇతరులు అనుభవిస్తున్న పరిస్థితి మనకెప్పుడూ ఎదురవ్వకపోయినా, వాళ్ల బాధను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని యెహోవా మనకిచ్చాడు. (ఎఫెసీయులు 5:1, 2 చదవండి.) యెహోవాను అనుకరించడానికి ఆ సామర్థ్యం మనకెలా సహాయం చేస్తుంది? ఆ సామర్థ్యాన్ని ఉపయోగించే విషయంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
2. మనం బాధపడుతున్నప్పుడు యెహోవా ఎలా భావిస్తాడు?
2 ఎలాంటి బాధలూ ఉండని అద్భుతమైన జీవితాన్ని ఇస్తానని యెహోవా మనకు వాగ్దానం చేశాడు. అభిషిక్తులు పరలోకంలో, ‘వేరే గొర్రెలు’ భూమ్మీద నిత్యజీవం కోసం ఎదురుచూడవచ్చు. (యోహా. 10:16; 17:3; 1 కొరిం. 15:53) అయితే ఇప్పుడు మనం అనుభవిస్తున్న బాధను యెహోవా అర్థం చేసుకుంటాడు. గతంలో, తన ప్రజలు ఐగుప్తులో అనుభవించిన కష్టాల్ని చూసి యెహోవా ఎంతో బాధపడ్డాడు. నిజానికి “వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు.” (యెష. 63:9, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) కొన్ని శతాబ్దాల తర్వాత, ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్న సమయంలో యూదులు శత్రువుల్ని చూసి భయపడ్డారు. యెహోవా వాళ్ల భయాల్ని అర్థం చేసుకుని వాళ్లతో ఇలా అన్నాడు, ‘మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు.’ (జెక. 2:8) ఓ తల్లి చంటిబిడ్డను ప్రేమించినట్టే యెహోవా కూడా తన సేవకుల్ని ప్రేమిస్తాడు, వాళ్లకు సహాయం చేయాలని కోరుకుంటాడు. (యెష. 49:15) ఇతరులు కష్టాలు పడుతున్నప్పుడు వాళ్ల పరిస్థితిలో మనం ఉన్నట్లుగా ఊహించుకుని, వాళ్ల బాధను అర్థం చేసుకోవడం ద్వారా మనం యెహోవాను అనుకరిస్తాం.—కీర్త. 103:13, 14.
యేసు యెహోవాలా ప్రేమ చూపించాడు
3. యేసుకు ప్రజలమీద కనికరం ఉందని ఎలా చెప్పవచ్చు?
3 ప్రజలు ఎదుర్కొంటున్న బాధల్ని యేసు ఎప్పుడూ అనుభవించకపోయినా, వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఉదాహరణకు, తనకాలంలోని సామాన్య ప్రజల జీవితం ఎంత కష్టంగా ఉండేదో యేసుకు తెలుసు. ఎందుకంటే, మత నాయకులు అబద్ధాలు బోధిస్తూ, లెక్కలేనన్ని సొంత నియమాలను ప్రజల మీద మోపేవాళ్లు. ప్రజలు వాళ్లకు ఎంతో భయపడేవాళ్లు. (మత్త. 23:4; మార్కు 7:1-5; యోహా. 7:13) అయితే యేసు ఎన్నడూ ఆ మత నాయకులకు భయపడకపోయినా, వాళ్ల అబద్ధాలను నమ్మకపోయినా, ప్రజల భయాల్ని అర్థం చేసుకోగలిగాడు. అందుకే ‘ఆయన సమూహాలను చూసి, వారు కాపరిలేని గొర్రెల్లా విసికి చెదరివున్నారని వాళ్లమీద కనికరపడ్డాడు.’ (మత్త. 9:36) యెహోవాలాగే యేసు కూడా ప్రజల్ని ప్రేమించి, వాళ్లపట్ల జాలి, దయ చూపించాడు.—కీర్త. 103:8.
4. ప్రజల బాధను చూసి యేసు ఏమి చేశాడు?
4 యేసుకు ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి, వాళ్లు బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేశాడు. అలా ఆయన అచ్చం తన తండ్రిలాగే ప్రేమ చూపించాడు. ఉదాహరణకు ఓ సందర్భంలో యేసు, శిష్యులు పరిచర్య కోసం చాలా దూరం ప్రయాణించి అలసిపోయి, విశ్రాంతి తీసుకోవడానికి ఏకాంత ప్రదేశానికి వెళ్లారు. కానీ అప్పటికే చాలామంది ప్రజలు యేసు కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో, వాళ్లకు సహాయం అవసరమని యేసు అర్థం చేసుకుని, బాగా అలసిపోయినప్పటికీ ‘వాళ్లకు ఎన్నో విషయాలు బోధించడం మొదలుపెట్టాడు.’—మార్కు 6:30, 31, 34, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
యెహోవాలా ప్రేమ చూపించండి
5, 6. ప్రేమ చూపించే విషయంలో మనం యెహోవాను ఎలా అనుకరించవచ్చు? ఓ ఉదాహరణ చెప్పండి. (ప్రారంభ చిత్రం చూడండి.)
5 మనం యెహోవాలా ప్రేమ చూపించాలంటే ఏమి చేయాలి? ఈ పరిస్థితి గురించి ఆలోచించండి. అలెన్ అనే ఓ యువ సహోదరుడు సంఘంలోని ఓ వృద్ధ సహోదరుని గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన సరిగ్గా నడవలేడు, కంటి చూపు కూడా సరిగ్గా లేదు. అప్పుడు అలెన్, ‘ఇతరులు మీపట్ల ఏవిధంగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో, అదేవిధంగా మీరు ఇతరులపట్ల ప్రవర్తించండి’ అనే మాటల్ని గుర్తుతెచ్చుకున్నాడు. (లూకా 6:31, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) దాంతో, ‘ఇతరులు నాపట్ల ఎలా ప్రవర్తించాలని నేను కోరుకుంటాను?’ అని అలెన్ తనను తాను ప్రశ్నించుకున్నాడు. ‘వాళ్లు నాతో కలిసి ఆటలాడాలని కోరుకుంటాను’ అని అనుకున్నాడు. కానీ వయసుమళ్లిన ఆ సహోదరుడు పరిగెత్తలేడు, అలెన్‌తో కలిసి ఆటలాడలేడు. కాబట్టి అలెన్ నిజంగా ఆలోచించాల్సింది ఈ ప్రశ్న గురించి, ‘ఒకవేళ నేను ఆ సహోదరుని స్థానంలో ఉంటే ఇతరులు నాకు ఏమి చేయాలని కోరుకుంటాను?’
6 అలెన్ యౌవనుడే అయినా, వయసు పైబడినప్పుడు తన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకున్నాడు. అతను ఆ వృద్ధ సహోదరునితో సమయం గడుపుతూ, ఆయన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినడం మొదలుపెట్టాడు. దాంతో, ఆ వృద్ధ సహోదరునికి బైబిలు చదవడం, ఇంటింటి పరిచర్యకు వెళ్లడం కష్టంగా ఉన్నాయని అతనికి అర్థమైంది. కాబట్టి అలెన్ ఆ సహోదరునికి ఏవిధంగా సహాయపడవచ్చో ఆలోచించి, తాను చేయగలిగినదంతా చేయాలని కోరుకున్నాడు. అదేవిధంగా, మనం ఇతరుల బాధను అర్థం చేసుకుని వాళ్లపట్ల ప్రేమ చూపిస్తే మనం యెహోవాను అనుకరించినవాళ్లం అవుతాం.—1 కొరిం. 12:26.
ప్రేమ చూపిస్తూ యెహోవాను అనుకరించండి (7వ పేరా చూడండి)
7. మన సహోదరులు పడుతున్న బాధను అర్థం చేసుకోవాలంటే ఏమి చేయాలి?
7 ఇతరుల బాధను అర్థం చేసుకోవడం అన్నిసార్లూ అంత తేలిక కాదు. ముఖ్యంగా అలాంటి పరిస్థితి మనకెప్పుడూ రాకపోయుంటే, దాన్ని అర్థం చేసుకోవడం మరింత కష్టం. ఉదాహరణకు మన సహోదరులు చాలామంది అనారోగ్యం, గాయపడడం లేదా ముసలితనం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది కృంగుదల, తీవ్రమైన ఆందోళన లేదా గతంలో తమమీద దౌర్జన్యం జరగడం వల్ల బాధపడుతున్నారు. ఇంకొంతమంది ఒంటరిగా పిల్లల బాధ్యతను చూసుకుంటున్నారు లేదా యెహోవాను ఆరాధించని కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇలా అందరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు, వాటిలో చాలావాటిని మనం వ్యక్తిగతంగా ఎదుర్కోకపోయుండొచ్చు. అయినప్పటికీ, మనం వాళ్లకు ప్రేమతో సహాయం చేయాలనుకుంటాం. దానికోసం మనమేమి చేయవచ్చు? ఒక్కొక్కరికి ఒక్కో విధమైన సహాయం అవసరం. కాబట్టి ఇతరులు చెప్పేది శ్రద్ధగా వింటూ, వాళ్ల బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్లకు ఎలాంటి సహాయం అవసరమో తెలుస్తుంది. వాళ్లు పడుతున్న బాధ గురించి యెహోవా ఎలా భావిస్తున్నాడో మనం వాళ్లకు గుర్తుచేయవచ్చు లేదా వాళ్లకు మరే ఇతర విధంగానైనా సహాయం అందించవచ్చు. అలా చేసినప్పుడు మనం యెహోవాను అనుకరిస్తాం.—రోమీయులు 12:15, 16; 1 పేతురు 3:8 చదవండి.
యెహోవాలా దయ చూపించండి
8. ఇతరులమీద దయ చూపించడానికి యేసుకు ఏది సహాయం చేసింది?
8 యెహోవా ప్రజలందరి మీద దయ చూపిస్తాడు. (లూకా 6:35) ఈ విషయంలో యేసు తన తండ్రిని అనుకరించాడు. ఇతరులమీద దయ చూపించడానికి యేసుకు ఏది సహాయం చేసింది? తన మాటలు, చేతలు ఇతరులమీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆయన ఆలోచించాడు. ఉదాహరణకు, చెడు జీవితం గడిపిన ఓ స్త్రీ యేసు దగ్గరికి వచ్చి తన కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. ఆమె చేసిన తప్పుల విషయంలో చాలా బాధపడుతుందనీ, పశ్చాత్తాపపడుతుందనీ ఆయన గమనించాడు. తాను దయ చూపించకపోతే ఆమె ఇంకా కృంగిపోతుందని ఆయనకు తెలుసు. అందుకే యేసు ఆమెను మెచ్చుకున్నాడు, క్షమించాడు. తాను చేసిన ఆ పనిని తప్పుబట్టిన పరిసయ్యునితో కూడా ఆయన దయగా మాట్లాడాడు.—లూకా 7:36-48.
9. యెహోవాలా దయ చూపించడానికి మనకేది సహాయం చేస్తుంది? ఓ ఉదాహరణ చెప్పండి.
9 యెహోవాలా మనం ఎలా దయ చూపించవచ్చు? మనమేదైనా మాట్లాడేముందు లేదా ఏదైనా చేసేముందు ఆలోచించాలి. అప్పుడే మనం ఇతరుల మనసును గాయపర్చకుండా వాళ్లతో దయగా ప్రవర్తించగలుగుతాం. క్రైస్తవులు ‘పోట్లాడకూడదు, అందరిపట్ల దయ చూపాలి’ అని పౌలు రాశాడు. (2 తిమో. 2:24, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) ఉదాహరణకు, కింద ఇచ్చిన సందర్భాల్లో మీరెలా దయ చూపించవచ్చో ఆలోచించండి. ఉద్యోగ స్థలంలో మీ మేనేజర్ తన పనిని సరిగ్గా చేయడం లేదు; చాలా నెలల తర్వాత ఓ సహోదరుడు కూటాలకు వచ్చాడు; మీరు పరిచర్య చేస్తున్నప్పుడు, తాను బిజీగా ఉన్నానని ఓ గృహస్థుడు అన్నాడు; మీరు చేయాలనుకుంటున్న ఫలానా పనుల గురించి ఎందుకు చెప్పలేదని మీ భార్య అడిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇతరుల్ని అర్థం చేసుకుంటారా? వాళ్లతో దయగా మాట్లాడతారా? మనం ఇతరుల స్థానంలో ఉన్నట్లు ఊహించుకుని, మన మాటలు వాళ్లమీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చో ఆలోచించాలి. అప్పుడు, యెహోవాలా దయ చూపిస్తూ వాళ్లతో ఏమి మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో మనకు తెలుస్తుంది.—సామెతలు 15:28 చదవండి.
యెహోవాలా జ్ఞానం చూపించండి
10, 11. యెహోవాలా జ్ఞానంతో నడుచుకోవాలంటే మనమేమి చేయాలి? ఓ ఉదాహరణ చెప్పండి.
10 యెహోవాకు అంతులేని జ్ఞానం ఉంది. ఆయన కావాలనుకుంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా చూడగలడు. కానీ మనం భవిష్యత్తును చూడలేకపోయినా, జ్ఞానంతో నడుచుకోవచ్చు. ఏవిధంగా? ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అది మనమీద, ఇతరులమీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించాలి. మనం ఇశ్రాయేలీయుల్లా ప్రవర్తించకూడదు. యెహోవా మాట వినకపోతే తమకు ఏమి జరుగుతుందో వాళ్లు ఆలోచించలేదు. ఆయనతో తమకున్న సంబంధాన్నిగానీ, ఆయన తమకోసం చేసినవాటినిగానీ వాళ్లు పట్టించుకోలేదు. మోషే ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు ఇష్టంలేని వాటిని చేస్తారని ఆయనకు తెలుసు. అందుకే ఆయనిలా చెప్పాడు, ‘ఈ ప్రజలకు ఆలోచన బొత్తిగా లేదు. వారిలో తెలివి ఏమీ లేదు. వారు జ్ఞానం తెచ్చుకొని, ఈ మాటలు గ్రహిస్తే, వారి చివరిస్థితిని తలపోస్తే ఎంత బాగుంటుంది!’—ద్వితీ. 31:29, 30; 32:28, 29, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
11 ఉదాహరణకు, మీరు ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నట్లయితే మీ భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచుకోవడం కష్టమని గుర్తుంచుకోండి. యెహోవాతో మీకున్న విలువైన స్నేహాన్ని పాడుచేసే దేన్నీ చేయకండి. బదులుగా, జ్ఞానంతో నడుచుకుంటూ ప్రమాదాలను తప్పించుకోండి. యెహోవా ఇచ్చే ఈ జ్ఞానయుక్తమైన సలహాను పాటించండి, “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.”—సామె. 22:3.
మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోండి
12. మన ఆలోచనలు మనకెలా హాని చేయవచ్చు?
12 జ్ఞానంగల వ్యక్తి తన ఆలోచనలను అదుపులో ఉంచుకుంటాడు. నిప్పును సరిగ్గా వాడితే అది మనకు ఎన్నోవిధాలుగా ఉపయోగపడుతుంది. కానీ, మనం జాగ్రత్తగా లేకపోతే అదే నిప్పు మన ఇంటిని తగలబెట్టి చివరికి మన ప్రాణాల్ని కూడా తీయగలదు. అదేవిధంగా, మన ఆలోచనలు మనకు మేలు చేయవచ్చు లేదా హాని చేయవచ్చు. మనం యెహోవా చెప్పే విషయాలను ఆలోచిస్తూ ఉంటే మనకు మంచి జరుగుతుంది. అలాకాకుండా అనైతిక విషయాల గురించే ఆలోచిస్తూ, చెడు పనులు చేస్తున్నట్లు ఊహించుకుంటూ ఉంటే, మనసులో వాటిమీద ఇష్టం పెరిగి మనం వాటిని చేసే ప్రమాదం ఉంది. దానివల్ల యెహోవాతో మన స్నేహం తెగిపోతుంది.—యాకోబు 1:14, 15 చదవండి.
13. తన జీవితం ఎలా ఉంటుందని హవ్వ ఊహించుకుంది?
13 మొదటి స్త్రీ అయిన హవ్వ విషయమే తీసుకోండి. ‘మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని’ తినొద్దని యెహోవా ఆదాముహవ్వలకు ఆజ్ఞాపించాడు. (ఆది. 2:16, 17) కానీ సాతాను హవ్వతో, ‘మీరు చావనే చావరు; ఎందుకంటే మీరు వాటిని తిను దినమున మీ కళ్లు తెరవబడతాయని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉంటారని దేవునికి తెలుసు’ అని చెప్పాడు. మంచేదో చెడేదో నిర్ణయించుకునే హక్కు తన చేతుల్లోనే ఉంటే జీవితం ఎంతో బాగుంటుందని హవ్వ అనుకుంది. హవ్వ ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉండడం వల్ల, ‘ఆ వృక్షం ఆహారానికి మంచిదిగా, కన్నులకు అందమైనదిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా’ ఆమెకు కనబడింది. ఫలితం? ‘ఆమె దాని ఫలాలలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకు ఇచ్చింది, అతను కూడా తిన్నాడు.’ (ఆది. 3:1-6) దానివల్ల, ‘పాపం, పాపం ద్వారా మరణం లోకంలో ప్రవేశించాయి.’ (రోమా. 5:12) యెహోవా చేయవద్దని చెప్పిన దానిగురించి హవ్వ ఆలోచించకుండా ఉండాల్సింది!
14. లైంగిక అనైతికత గురించి బైబిలు ఏమని హెచ్చరిస్తుంది?
14 నిజమే, హవ్వ చేసిన పాపం లైంగిక అనైతికతకు సంబంధించింది కాదు. అయితే మన విషయానికొస్తే, అనైతిక పనులను చేస్తున్నట్లు ఊహించుకోవద్దని బైబిలు మనల్ని హెచ్చరిస్తుంది. యేసు ఇలా చెప్పాడు, “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్త. 5:28) పౌలు కూడా ఇలా హెచ్చరించాడు, “శారీరక వాంఛల్ని ఏ విధంగా తృప్తి పరుచుకోవాలా అని ఆలోచించటం మానుకోండి.”—రోమా. 13:14, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
15. మనం ఏ ధనం సంపాదించాలి? ఎందుకు?
15 అలాగే, డబ్బు సంపాదన గురించి కాకుండా యెహోవాను సంతోషపెట్టడం గురించి ఆలోచించమని బైబిలు చెప్తుంది. మనకెంత ఆస్తి ఉన్నా అది మనల్ని కాపాడలేదు. (సామె. 18:11) ఓ వ్యక్తి ఎంత ఆస్తిని కూడగట్టుకున్నా, అతను యెహోవాకు మొదటి స్థానమివ్వకపోతే అదంతా వ్యర్థమని యేసు చెప్పాడు. ఎందుకంటే అతను ‘దేవునియెడల ధనవంతుడు కాదు.’ (లూకా 12:16-21) మనం ‘పరలోకంలో ధనం’ సంపాదించుకుంటూ, యెహోవాకు ఇష్టమైన పనులు చేస్తే ఆయనను సంతోషపెడతాం. మనం కూడా సంతోషంగా ఉంటాం. (మత్త. 6:20; సామె. 27:11) యెహోవాతో మన స్నేహంకన్నా విలువైనది మరేదీ లేదు.
చింతించకండి
16. చింతించడం నుండి ఎలా బయటపడవచ్చు?
16 మనం ఈ లోకంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆరాటపడితే, ఎన్నో చిక్కుల్లో పడతాం. (మత్త. 6:19) ఎప్పుడూ డబ్బు సంపాదించడం గురించే ఆలోచించేవాళ్లు దేవుని రాజ్యానికి తమ జీవితాల్లో మొదటి స్థానం ఇవ్వలేరని యేసు చెప్పాడు. (మత్త. 13:18, 19, 22) ఇంకొంతమంది, తమకు చెడు జరుగుతుందేమోనని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ చింతిస్తూ ఉంటే మన ఆరోగ్యం పాడవ్వవచ్చు, ఆఖరికి యెహోవా మీద విశ్వాసం కూడా మెల్లగా సన్నగిల్లవచ్చు. బదులుగా, యెహోవా సహాయం చేస్తాడని మనం నమ్మాలి. “చింతించటం ఒక మనిషి సంతోషాన్ని తీసివేయగలదు. కానీ దయగల ఒక మాట ఒక మనిషిని సంతోషపెట్టగలదు” అని బైబిలు చెప్తుంది. (సామె. 12:25, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) మీరు దేని గురించైనా చింతిస్తుంటే, మీ గురించి బాగా తెలిసిన తోటి యెహోవాసాక్షితో మాట్లాడండి. యెహోవాను సేవించే మీ తల్లిదండ్రులు, మీ భర్త/భార్య, మీ స్నేహితులు మీరు యెహోవాపై నమ్మకముంచేలా మిమ్మల్ని ప్రోత్సహించగలరు. దానివల్ల మీరు మనశ్శాంతిగా ఉంటారు.
17. మనం ఆందోళన పడుతున్నప్పుడు యెహోవా ఎలా సహాయం చేస్తాడు?
17 మన ఆందోళనల్ని వేరే ఎవ్వరికన్నా యెహోవాయే బాగా అర్థం చేసుకుంటాడు. అందుకే పౌలు ఇలా రాశాడు, ‘దేని గురించీ చింతపడకండి గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది.’ (ఫిలి. 4:6, 7) కాబట్టి మీరు చింతిస్తున్నప్పుడు, తనతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవడానికి యెహోవా మీకెలా సహాయం చేస్తున్నాడో ఆలోచించండి. అందుకోసం ఆయన తోటి సహోదరసహోదరీల్ని, సంఘ పెద్దల్ని, నమ్మకమైన దాసుణ్ణి, దేవదూతల్ని, యేసును ఉపయోగించుకుంటాడు.
18. ఊహించుకునే సామర్థ్యం మనకెలా సహాయం చేస్తుంది?
18 ఇప్పటివరకు మనం చూసినట్లు, ఇతరుల బాధను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఉపయోగించినప్పుడు మనం యెహోవాను అనుకరిస్తాం. (1 తిమో. 1:8-11; 1 యోహా. 4:8) ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపిస్తే, మన పనులు ఇతరులమీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచిస్తే, చింతించడం మానేస్తే మనం సంతోషంగా ఉంటాం. కాబట్టి, దేవుని రాజ్యంలో మన జీవితం ఎలా ఉంటుందో ఊహించుకుంటూ, యెహోవాను అనుకరించడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం.—రోమా. 12:12.