కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 మే పేజీలు 18-22
  • బైబిలు సహాయంతో మార్పులు చేసుకుంటూ ఉన్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు సహాయంతో మార్పులు చేసుకుంటూ ఉన్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు యెహోవాను సంతోషపెట్టగలరు
  • అది ఎందుకు చాలా కష్టమైనది?
  • బైబిలు సహాయంతో మార్పులు చేసుకుంటూ ఉండండి
  • అద్భుతమైన భవిష్యత్తు గురించి ఆలోచించండి
  • ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • “దేవుని వాక్యము సజీవమును బలము గలదైయున్నది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న తర్కాల్ని తిప్పికొట్టండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • మీరు ‘పాత వ్యక్తిత్వాన్ని తీసి పారేయగలరు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 మే పేజీలు 18-22
జూదం ఆటలో గొడవ పడుతున్న ఒకాయన, బాప్తిస్మం తీసుకుంటున్నాడు, కానీ ఆ తర్వాత రాజ్యమందిరంలో ఓ సహోదరుని మీద అరుస్తున్నాడు

బైబిలు సహాయంతో మార్పులు చేసుకుంటూ ఉన్నారా?

“మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” —రోమా. 12:2.

పాటలు: 29, 52

మీరెలా జవాబిస్తారు?

  • బాప్తిస్మం తర్వాత కూడా మనమెందుకు మార్పులు చేసుకుంటూనే ఉండాలి?

  • బలహీనతల్ని అధిగమించడానికి మనం కృషిచేయాలని యెహోవా ఎందుకు ఆశిస్తున్నాడు?

  • బైబిలు సహాయంతో మార్పులు చేసుకుంటూనే ఉండాలంటే మనమేమి చేయవచ్చు?

1-3. (ఎ) ఎలాంటి మార్పులు చేసుకోవడం బాప్తిస్మం తర్వాత మనకు కష్టంగా ఉండవచ్చు? (బి) మార్పులు చేసుకోవడం అనుకున్న దానికన్నా కష్టంగా ఉన్నప్పుడు మనకెలాంటి ప్రశ్నలు రావచ్చు? (ప్రారంభ చిత్రాలు చూడండి.)

[1]కుమార్‌ ఎన్నో సంవత్సరాలపాటు జూదం ఆడడం, సిగరెట్‌ తాగడం, విపరీతంగా మందు తాగడం, డ్రగ్స్‌ తీసుకోవడం వంటి చెడు అలవాట్లకు బానిసగా ఉన్నాడు. కొంతకాలానికి అతను యెహోవా గురించి తెలుసుకున్నాడు, దాంతో దేవుని స్నేహితుడు అవ్వాలని కోరుకున్నాడు. అలా అవ్వాలంటే కుమార్‌ తన జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకోవాలి. అయితే యెహోవా సహాయంవల్ల, ఆయన వాక్యమైన బైబిలుకు ఉన్న శక్తివల్ల అతను ఆ మార్పులు చేసుకోగలిగాడు.—హెబ్రీ. 4:12.

2 కానీ అతను క్రైస్తవ లక్షణాల్ని మరింత మెరుగుపర్చుకోవాలంటే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. (ఎఫె. 4:31, 32) ఉదాహరణకు, అతను ప్రతీ చిన్న విషయానికి కోప్పడేవాడు. కోపాన్ని అదుపు చేసుకోవడం ఎంత కష్టమో తెలుసుకుని కుమార్‌ ఆశ్చర్యపోయాడు. నిజానికి, బాప్తిస్మానికి ముందు తనకున్న చెడు అలవాట్లను మానుకోవడం కన్నా కోపాన్ని అదుపు చేసుకోవడమే చాలా కష్టంగా అనిపించిందని అతను చెప్పాడు. కానీ సహాయం చేయమని యెహోవాకు తీవ్రంగా ప్రార్థిస్తూ, బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడం ద్వారా కుమార్‌ ఆ మార్పులను చేసుకోగలిగాడు.

3 మనలో చాలామందిమి, బైబిలు చెప్తున్నదాని ప్రకారం జీవించేలా బాప్తిస్మానికి ముందే పెద్దపెద్ద మార్పులు చేసుకున్నాం. అయితే యెహోవాను, యేసుక్రీస్తును మరింత దగ్గరగా అనుకరించాలంటే ఇంకొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరమని మనం గుర్తిస్తాం. (ఎఫె. 5:1, 2; 1 పేతు. 2:21) ఉదాహరణకు, ఇతరుల గురించి ఫిర్యాదు చేయడం, పుకార్లు పుట్టించడం, చెడుగా చెప్పడం వంటి అలవాట్లు మనకు ఉన్నాయని బహుశా మనం గుర్తించవచ్చు. లేదా మనం చేసే పని గురించి ఇతరులు ఏమనుకుంటారో అని అప్పుడప్పుడు భయపడుతుండవచ్చు. నిజానికి, మనం ఇలాంటివి మార్చుకోవాలని కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా మళ్లీమళ్లీ అవే పొరపాట్లు చేస్తుంటాం. అప్పుడు మీరిలా అనుకోవచ్చు, ‘ఇలాంటి చిన్న విషయాల్లో మార్పులు చేసుకోవడం నాకెందుకు అంత కష్టంగా ఉంది? బైబిలు చెప్పేది చేస్తూ నా వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకుంటూ ఉండేందుకు నేను ఏం చేయాలి?’

మీరు యెహోవాను సంతోషపెట్టగలరు

4. మనం అన్నిసందర్భాల్లో యెహోవాను ఎందుకు సంతోషపెట్టలేకపోతాం?

4 మనం యెహోవాను ప్రేమిస్తాం, ఆయన్ను సంతోషపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ మనం అపరిపూర్ణులం కాబట్టి అన్నిసందర్భాల్లో ఆయన్ని సంతోషపెట్టలేం. అందుకే అపొస్తలుడైన పౌలులాగే మనం కూడా ఇలా అనుకుంటాం, ‘మంచి చేయాలనే కోరిక నాకు ఉన్నా, దాన్ని చేసే సామర్థ్యం నాకు లేదు.’—రోమా. 7:18, NW; యాకో. 3:2.

5. బాప్తిస్మానికి ముందే ఎలాంటి మార్పులు చేసుకున్నాం? ఎలాంటి బలహీనతలతో మనం ఇంకా పోరాడాల్సిరావచ్చు?

5 మనం యెహోవాసాక్షుల్లో ఒకరిగా అవ్వడానికి ముందే యెహోవా అసహ్యించుకునే అలవాట్లను మానుకున్నాం. (1 కొరిం. 6:9, 10) అయితే మనం ఇంకా అపరిపూర్ణులమే. (కొలొ. 3:9, 10) కాబట్టి మనం బాప్తిస్మం తీసుకుని ఎన్ని సంవత్సరాలైనా పొరపాట్లు చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనలో తప్పుడు కోరికలు, ఆలోచనలు రావచ్చు లేదా మనకున్న ఒకానొక బలహీనతను అధిగమించడం కష్టంగా అనిపించవచ్చు. కొన్నిసార్లయితే ఒకే బలహీనతతో ఎన్నో సంవత్సరాలపాటు పోరాడాల్సిరావచ్చు.

6, 7. (ఎ) మనం అపరిపూర్ణులమైనా యెహోవా దేవునితో స్నేహాన్ని ఎలా కొనసాగించగలుగుతున్నాం? (బి) యెహోవాను క్షమాపణ అడగడానికి మనమెందుకు వెనకాడకూడదు?

6 మనం అపరిపూర్ణులమైనప్పటికీ యెహోవాతో స్నేహం చేస్తూ ఆయన్ను సేవించవచ్చు. యెహోవాతో మీ స్నేహం ఎలా మొదలైందో ఎప్పుడూ మర్చిపోకండి. మీలో ఉన్న మంచిని చూసి, మిమ్మల్ని తనవైపు యెహోవానే ఆకర్షించాడు. (యోహా. 6:44) మీలో లోపాలు, బలహీనతలు ఉన్నాయని, మీరు ముందుముందు పొరపాట్లు చేస్తారని కూడా ఆయనకు తెలుసు. అయినాసరే మీరు తనతో స్నేహం చేయాలని ఆయన కోరుకున్నాడు.

7 యెహోవా మనల్ని ఎంతో ప్రేమించి తన కుమారుడిని మనకోసం విమోచన క్రయధన బలిగా ఇచ్చాడు. అది ఎంతో అమూల్యమైన బహుమానం. (యోహా. 3:16) కాబట్టి మనం ఏదైనా పొరపాటు చేస్తే క్షమాపణ కోసం యెహోవాను అడగవచ్చు. అప్పుడు విమోచన క్రయధనం ఆధారంగా ఆయన మనల్ని తప్పకుండా క్షమించి, మనతో స్నేహాన్ని కొనసాగిస్తాడు. (రోమా. 7:24, 25; 1 యోహా. 2:1, 2) మనం పాపులం కాబట్టి దేవున్ని క్షమాపణ అడగడానికి అర్హులం కాదని అనుకోవాలా? లేదు. మనం దేవున్ని క్షమాపణ అడగకపోవడం అనేది మురికిగా ఉన్న చేతుల్ని కడుక్కోవడానికి ఇష్టపడకపోవడం లాంటిది. నిజానికి, యేసు చనిపోయింది పశ్చాత్తాపం చూపించే పాపుల కోసమేనని గుర్తుపెట్టుకోండి. మనం అపరిపూర్ణులమైనా తనతో స్నేహం చేయడానికి అవకాశం ఇచ్చిన యెహోవాకు ఎంత రుణపడివున్నామో కదా!—1 తిమోతి 1:15 చదవండి.

8. మన బలహీనతల్ని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు?

8 మన బలహీనతల్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు లేదా వాటి విషయంలో సాకులు చెప్పకూడదు. తాను ఎలాంటి ప్రజలతో స్నేహం చేయడానికి ఇష్టపడతాడో యెహోవా ముందుగానే చెప్పాడు. (కీర్త. 15:1-5) కాబట్టి యెహోవాకు మరింత దగ్గరవ్వాలంటే మనం ఆయన్ని, ఆయన కుమారుడైన యేసును అనుకరిస్తూనే ఉండాలి. అంతేకాదు, మనకున్న తప్పుడు కోరికల్ని అదుపులో ఉంచుకోవడానికి, సాధ్యమైతే వాటిని పూర్తిగా తీసేసుకోవడానికి కృషిచేయాలి. మనం బాప్తిస్మం తీసుకుని ఎన్ని సంవత్సరాలు గడిచినా మన వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకుంటూనే ఉండాలి.—2 కొరిం. 13:11.

9. ‘కొత్త వ్యక్తిత్వాన్ని’ అలవర్చుకుంటూనే ఉండవచ్చని మనకెలా తెలుసు?

9 క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, ‘మీ పాత వ్యక్తిత్వాన్ని వదిలేయాలని మీరు నేర్చుకున్నారు. ఆ వ్యక్తిత్వం మీ పాత ప్రవర్తనకు అనుగుణంగా ఉంది, అది మీ మోసపూరిత కోరికల వల్ల దిగజారుతోంది. మీరు కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటూ ఉండాలి. నిజమైన నీతికి, విశ్వసనీయతకు అనుగుణంగా దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని మీరు అలవర్చుకోవాలి.’ (ఎఫె. 4:22-24, NW) అంటే మనం పాత అలవాట్లు మార్చుకుంటూ, ‘కొత్త వ్యక్తిత్వాన్ని’ అలవర్చుకోవడానికి కృషిచేస్తూనే ఉండాలి. అంతేకాదు, యెహోవాను మనం ఎంతకాలంగా సేవిస్తున్నప్పటికీ ఆయన లక్షణాల గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ ఉండవచ్చు. మన వ్యక్తిత్వంలో మార్పులు చేసుకుంటూ, యెహోవాను మరింతగా అనుకరించడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది.

అది ఎందుకు చాలా కష్టమైనది?

10. బైబిలు సహాయంతో మార్పులు చేసుకుంటూనే ఉండాలంటే మనం ఏమి చేయాలి? ఈ విషయంలో ఏ ప్రశ్నలు తలెత్తవచ్చు?

10 మనందరం బైబిలు చెప్తున్నదాని ప్రకారం జీవించాలని కోరుకుంటాం. అయితే మార్పులు చేసుకుంటూ ఉండాలంటే మనం కష్టపడాలి. ఎందుకు కష్టపడాలి? సరైనదాన్ని సులభంగా చేసేందుకు అవసరమైన శక్తిని యెహోవా ఇవ్వలేడా?

11-13. బలహీనతల్ని అధిగమించడానికి మనం కృషిచేయాలని యెహోవా ఎందుకు ఆశిస్తున్నాడు?

11 ఈ విశ్వంలో ఉన్నవాటన్నిటి గురించి ఆలోచిస్తే, యెహోవాకు ఏదైనా చేయగల శక్తి ఉందని మనకు అర్థమౌతుంది. ఉదాహరణకు ఆయన అత్యంత శక్తివంతమైన సూర్యుణ్ణి చేశాడు. అది ప్రతీ సెకనుకు ఎంతో కాంతిని, వేడిని ఉత్పత్తి చేస్తుంది. కానీ అందులో కొంత మాత్రమే, అంటే భూమ్మీదున్న జీవులన్నీ బ్రతకడానికి కావాల్సిన శక్తి మాత్రమే భూమికి చేరుతుంది. (కీర్త. 74:16; యెష. 40:26) అదేవిధంగా యెహోవా కూడా అవసరమైనప్పుడు తన ప్రజలకు తగినంత శక్తిని ఇస్తాడు. (యెష. 40:29) అవును మనకున్న బలహీనతల్ని, తప్పుడు కోరికల్ని మనం సులువుగా అధిగమించేంత శక్తిని కూడా యెహోవా ఇవ్వగలడు. మరైతే ఆయన ఎందుకలా చేయట్లేదు?

12 మనకు నచ్చింది చేసే స్వేచ్ఛను యెహోవా ఇచ్చాడు. ఆయనకు విధేయత చూపించాలో వద్దో నిర్ణయించుకునే అవకాశాన్ని కూడా మనకిచ్చాడు. ఆయనకు లోబడాలని నిర్ణయించుకుని, తన చిత్తం చేయడానికి కృషిచేసినప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నామనీ, ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకుంటున్నామనీ చూపిస్తాం. కానీ యెహోవాకు పరిపాలన చేసే హక్కు లేదని సాతాను సవాలు చేశాడు. కాబట్టి మనం యెహోవాకు లోబడినప్పుడు ఆయనే మన పరిపాలకుడిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చూపిస్తాం. తనకు లోబడడానికి మనం చేసే ప్రతీ ప్రయత్నాన్ని మన ప్రియమైన తండ్రి యెహోవా విలువైనదిగా ఎంచుతాడు. (యోబు 2:3-5; సామె. 27:11) అయితే బలహీనతల్ని అదుపులో ఉంచుకోవడం మనకు అంత తేలికేమీ కాదు. అయినాసరే తీవ్రంగా కృషి చేస్తే యెహోవాకు నమ్మకంగా ఉంటాం, ఆయనే మన పరిపాలకునిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చూపిస్తాం.

13 తన లక్షణాల్ని అనుకరించడానికి మనం కృషిచేయాలని యెహోవా చెప్తున్నాడు. (2 పేతురు 1:5-7 చదవండి; కొలొ. 3:12) మన ఆలోచనల్ని, భావాల్ని అదుపులో పెట్టుకోవడానికి కూడా కృషిచేయాలని ఆయన ఆశిస్తున్నాడు. (రోమా. 8:5; 12:9) మనం ఏదైనా ఓ మార్పు చేసుకోవడానికి కృషి చేసి అందులో విజయం సాధించినప్పుడు చాలా సంతోషిస్తాం.

బైబిలు సహాయంతో మార్పులు చేసుకుంటూ ఉండండి

14, 15. యెహోవా ఇష్టపడే లక్షణాల్ని పెంపొందించుకోవాలంటే మనమేమి చేయాలి? (“బైబిలు, ప్రార్థన వాళ్ల జీవితాల్ని మార్చాయి” అనే బాక్సు చూడండి.)

14 యెహోవా ఇష్టపడే లక్షణాల్ని పెంపొందించుకోవాలంటే మనమేమి చేయాలి? మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలో సొంతగా నిర్ణయించుకునే బదులు దేవుని నిర్దేశాల్ని పాటించాలి. రోమీయులు 12:2 ఇలా చెప్తుంది, “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” కాబట్టి యెహోవా ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకోవాలంటే ఆయన అందించే సహాయాన్ని తీసుకోవాలి. అంటే మనం బైబిల్ని రోజూ చదవాలి, చదివినవాటి గురించి లోతుగా ఆలోచించాలి, పవిత్రశక్తిని ఇవ్వమని యెహోవాను అడగాలి. (లూకా 11:13; గల. 5:22-24) అలా చేసినప్పుడు, మనం ఎలా ఉంటే యెహోవా ఇష్టపడతాడో అర్థంచేసుకోగలుగుతాం. ఆయనలా ఆలోచించడం కూడా నేర్చుకోగలుగుతాం. అప్పుడు మన ఆలోచనలు, మాటలు, పనులు ద్వారా యెహోవాను మరింత సంతోషపెడతాం. దానితోపాటు, మన బలహీనతల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో కూడా నేర్చుకుంటాం. కానీ ఆ తర్వాత కూడా మనం మన బలహీనతలతో పోరాడుతూనే ఉండాలి.—సామె. 4:23.

తనకు సహాయపడే లేఖనాల్ని, ఆర్టికల్స్‌ని సేకరించి వాటిని మళ్లీ చదువుతున్న ఒక యెహోవాసాక్షి

మీ బలహీనతలతో పోరాడడానికి సహాయం చేసే కొన్ని ఆర్టికల్స్‌ని లేదా బైబిలు లేఖనాల్ని సేకరించి, వాటిని మళ్లీమళ్లీ చదువుతూ ఉండండి (15వ పేరా చూడండి)

15 కాబట్టి రోజూ బైబిల్ని చదవడం మాత్రమే కాదు, కావలికోట, తేజరిల్లు! వంటి మన ప్రచురణల సహాయంతో అధ్యయనం కూడా చేయాలి. వాటిలో వచ్చే చాలా ఆర్టికల్స్‌ యెహోవా లక్షణాల్ని ఎలా అనుకరించవచ్చో, మన బలహీనతలతో ఎలా పోరాడవచ్చో నేర్పిస్తాయి. కొన్ని ఆర్టికల్స్‌ లేదా లేఖనాలు ప్రత్యేకంగా మన అవసరాలకు సరిపోయేవిగా ఉండవచ్చు. అలాంటి వాటిని సేకరించి పెట్టుకుంటే మళ్లీమళ్లీ చదవడానికి వీలుగా ఉంటుంది.

16. మీరు అనుకున్నన్ని మార్పులు చేసుకోలేదని అనిపిస్తే ఎందుకు నిరుత్సాహపడకూడదు?

16 యెహోవా లక్షణాల్ని అనుకరించడానికి సమయం పడుతుంది. కాబట్టి, మీరు అనుకున్నన్ని మార్పులు చేసుకోలేదని అనిపిస్తే ఓపికపట్టండి. మొదట్లో, బైబిలు చెప్పేది చేయాలని అనిపించకపోయినా అలా చేయడానికి కృషి చేయాల్సిరావచ్చు. కానీ యెహోవా కోరుకుంటున్న విధంగా ఆలోచించి, ప్రవర్తించడానికి మీరు ఎంతెక్కువ ప్రయత్నిస్తే ఆయనలా ఆలోచించడం, సరైనది చేయడం అంత తేలికౌతుంది.—కీర్త. 37:31; సామె. 23:12; గల. 5:16, 17.

అద్భుతమైన భవిష్యత్తు గురించి ఆలోచించండి

17. మనం యెహోవాకు నమ్మకంగా ఉంటే, ఎలాంటి అద్భుతమైన భవిష్యత్తు పొందుతాం?

17 మనం పరిపూర్ణులుగా అయ్యి యెహోవాను నిరంతరం సేవిస్తూ ఉండే కాలం కోసం ఎదురుచూస్తున్నాం. అప్పుడు మనం ఏ బలహీనతతో పోరాడాల్సిన అవసరం ఉండదు, యెహోవాను అనుకరించడం కూడా మరింత తేలికౌతుంది. అయితే విమోచన క్రయధనం అనే బహుమానం వల్ల ఇప్పుడు కూడా యెహోవాను ఆరాధించగలుగుతున్నాం. మనం అపరిపూర్ణులమైనప్పటికీ మన జీవితంలో మార్పులు చేసుకోవడానికి, బైబిలు చెప్పే వాటిని పాటించడానికి కృషిచేస్తూ ఉంటే యెహోవాను సంతోషపెట్టవచ్చు.

18, 19. మన జీవితంలో మార్పులు చేసుకుంటూ ఉండడానికి బైబిలు సహాయం చేస్తుందని ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చు?

18 కుమార్‌ తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి చేయగలిగినదంతా చేశాడు. బైబిల్లో చదివిన విషయాల గురించి లోతుగా ఆలోచిస్తూ, తన జీవితంలో మార్పులు చేసుకోవడానికి కృషిచేశాడు. తోటి క్రైస్తవులు ఇచ్చిన సలహాల్ని కూడా పాటించాడు. అతని వ్యక్తిత్వం మెరుగవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా, కొంతకాలానికి అతను పరిచర్య సేవకునిగా సేవ చేయగలిగాడు. అంతేకాదు గత 20 సంవత్సరాలుగా సంఘపెద్దగా సేవచేస్తున్నాడు. అయినాసరే ఇప్పటికీ తన బలహీనతలతో పోరాడుతూ ఉండాలని కుమార్‌కు తెలుసు.

19 కుమార్‌లాగే మనం కూడా బైబిలు సహాయంతో మన వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకుంటూ ఉండవచ్చు. అలాచేస్తే యెహోవాకు మరింత దగ్గరౌతూ ఉంటాం. (యాకో. 4:8) అంతేకాదు యెహోవాను సంతోషపెట్టే మార్పులు చేసుకోవడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు, అందులో విజయం సాధించేందుకు ఆయనే సహాయం చేస్తాడు. అప్పుడు, బైబిలు సహాయంతో జీవితంలో మార్పులు చేసుకుంటూ ఉండడం సాధ్యమేనని మనకు స్పష్టంగా అర్థమౌతుంది.—కీర్త. 34:8.

^ [1] (1వ పేరా) అసలు పేరు కాదు.

“బైబిలు, ప్రార్థన వాళ్ల జీవితాల్ని మార్చాయి”

రస్సెల్‌ తోటి సహోదరసహోదరీల గురించి తరచూ ఫిర్యాదు చేస్తుండేవాడు, వాళ్లు ఎప్పుడూ తప్పులే చేస్తుంటారని అనుకునేవాడు. మారీయ విక్టోరియాకు ఇతరుల గురించి లేనిపోని విషయాలు మాట్లాడడమంటే ఇష్టం. లిండకు ప్రీచింగ్‌కి వెళ్లడమంటే భయం. ఇతరులు తన గురించి ఏమనుకుంటారోనని ఆమె ఆలోచించేది. ఈ ముగ్గురూ బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులే అయినప్పటికీ తమలో మార్పు రావడం అసాధ్యమని అనుకున్నారు. కానీ వాళ్లు ఆ బలహీనతల నుండి బయటపడగలిగారు. అందుకు వాళ్లకేమి సహాయం చేసింది?

రసెల్‌: “ప్రార్థనలో యెహోవాను సహాయం అడగడం, రోజూ బైబిలు చదవడం నాకు సహాయం చేశాయి. అంతేకాదు 2 పేతురు 2:11 వ వచనం గురించి, సంఘపెద్దలు ఇచ్చిన సలహా గురించి బాగా ఆలోచించడం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది.”

మారీయ విక్టోరియా: ‘నా నాలుకను అదుపులో ఉంచుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు పట్టుదలగా ప్రార్థించాను. అంతేకాదు, ఇతరుల గురించి లేనిపోని విషయాలు మాట్లాడేవాళ్లతో స్నేహం చేయడం మానేయాలని నేను గుర్తించాను. అయితే కీర్తన 64:1-4 చదివాక, ఇతరులు ఎలాంటివాళ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటారో అలాంటివాళ్లలా నేను ఉండకూడదని అనుకున్నాను. ఒకవేళ నేను ఇతరుల గురించి లేనిపోని విషయాలు మాట్లాడుతూ ఉంటే సంఘంలోని ఇతరులకు మంచి ఆదర్శంగా ఉండలేననీ, యెహోవా పేరుకు కూడా మచ్చ తెచ్చినట్లు అవుతుందనీ గుర్తించాను.’

లిండ: “మన కరపత్రాలను బాగా చదివి వాటిని ప్రీచింగ్‌లో ఎలా ఇవ్వాలో సిద్ధపడ్డాను. వివిధ పద్ధతుల్లో ప్రీచింగ్‌ చేసేవాళ్లతో సహవసించడం వల్ల చాలా ప్రయోజనం పొందాను. ప్రార్థన ద్వారా యెహోవా మీద ఎప్పటికీ ఆధారపడుతూనే ఉంటాను.”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి