కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 ఆగస్టు పేజీలు 25-29
  • ఇతరులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇతరులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిల్ని ఎలా అధ్యయనం చేయాలో కొత్తవాళ్లకు నేర్పించండి
  • ప్రకటించడానికి, బోధించడానికి కొత్తవాళ్లకు శిక్షణనివ్వండి
  • తోటి సహోదరులకు సహాయం చేసేలా కొత్తవాళ్లకు శిక్షణనివ్వండి
  • శిక్షణనివ్వడం ప్రాముఖ్యం
  • యెహోవా తన మంద కాపరులకు శిక్షణనిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • మీ బోధను గూర్చి ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగివుండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పెద్దలారా భారాన్ని మోసేందుకు ఇతరులకు శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • బాధ్యతలు చేపట్టేందుకు సహోదరులకు శిక్షణ ఇవ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 ఆగస్టు పేజీలు 25-29
పరిచర్యకు సిద్ధపడేందుకు ఓ కొత్త ప్రచారకునికి సహాయం చేస్తున్న ఓ సహోదరుడు

ఇతరులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారా?

“నేను మీకు సదుపదేశము చేసెదను.”—సామె. 4:2.

పాటలు: 45, 44

మీరేమంటారు?

  • లేఖనాల్ని సొంతగా అధ్యయనం చేయాలనే కోరికను బైబిలు విద్యార్థుల్లో ఎందుకు నాటాలి?

  • కొత్తవాళ్లు పరిచర్యలో ధైర్యంగా మాట్లాడేలా మనమెలా శిక్షణనివ్వవచ్చు?

  • కాపరులయ్యే సామర్థ్యం ఉన్నవాళ్లకు శిక్షణ ఇవ్వడం ఎందుకు ప్రాముఖ్యం?

1, 2. సంఘంలో బాధ్యతలు చేపట్టేలా ఇతరులకు ఎందుకు శిక్షణనివ్వాలి?

యేసుక్రీస్తు దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి చాలా కృషిచేశాడు. అంతేకాదు ఎంతో సమయం వెచ్చించి తన శిష్యులకు శిక్షణ ఇచ్చాడు. ఇతరులకు ఎలా బోధించాలో, దేవుని ప్రజల మీద ఎలా శ్రద్ధ చూపించాలో వాళ్లకు నేర్పించాడు. దానివల్ల, గొర్రెల్ని శ్రద్ధగా చూసుకునే కాపరులుగా ఉండడం ఎలాగో శిష్యులు నేర్చుకున్నారు. (మత్త. 10:5-7) మొదటి శతాబ్దంలోని ఫిలిప్పు పరిచర్యలో చాలా బిజీగా ఉండేవాడు, అయినాసరే తన కూతుళ్లు కూడా ప్రకటనాపని చేసేలా శిక్షణనిచ్చాడు. (అపొ. 21:8, 9) నేడు మనం కూడా ఇతరులకు శిక్షణ ఇవ్వాలి. ఎందుకు?

2 ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల్లో బాప్తిస్మం తీసుకోవాల్సిన కొత్తవాళ్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరికీ శిక్షణ అవసరం. బైబిల్ని సొంతగా చదివి, అధ్యయనం చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అర్థంచేసుకునేందుకు వాళ్లకు మనం సహాయం చేయాలి. అంతేకాదు ఇతరులకు సువార్త ప్రకటించి, బోధించగలిగేలా వాళ్లకు శిక్షణనివ్వాలి. కొత్తగా బాప్తిస్మం తీసుకున్న సహోదరులు భవిష్యత్తులో సంఘ పరిచారకులుగా, సంఘ పెద్దలుగా సేవచేయాలంటే వాళ్లకు శిక్షణ అవసరం. కొత్తవాళ్లు ప్రగతి సాధించేందుకు సంఘంలోని వాళ్లందరూ ఎంతో సహాయం చేయవచ్చు.—సామె. 4:2.

బైబిల్ని ఎలా అధ్యయనం చేయాలో కొత్తవాళ్లకు నేర్పించండి

3, 4. (ఎ) అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు బైబిల్ని అధ్యయనం చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? (బి) బైబిల్ని అధ్యయనం చేయమని ఇతరులను ప్రోత్సహించే ముందు మనమేమి చేయాలి?

3 యెహోవా చిత్తమేమిటో తెలుసుకోవడానికి ఆయన సేవకులందరూ బైబిల్ని చదివి, అధ్యయనం చేయాలి. ఈ విషయాన్నే అపొస్తలుడైన పౌలు కొలొస్సయిలోని సహోదరసహోదరీలకు చెప్తూ ఇలా అన్నాడు, “మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణజ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని . . . దేవుని బతిమాలుచున్నాము.” (కొలొ. 1:9-12) కొలొస్సయిలోని క్రైస్తవులు దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకుంటే, ‘యెహోవాను సంతోషపెడతారు, ఆయనకు తగినట్లుగా నడుచుకోగలుగుతారు.’ దానివల్ల వాళ్లు ‘ప్రతి సత్కార్యములో’ ముఖ్యంగా ప్రకటనాపనిలో ‘సఫలులౌతారు.’ దేవుని సేవకులకు బైబిల్ని అధ్యయనం చేసే అలవాటు ఉంటేనే యెహోవా సేవను చక్కగా చేయగలుగుతారు. ఈ వాస్తవాన్ని గ్రహించేందుకు బైబిలు విద్యార్థులకు మనం సహాయం చేస్తాం.

4 బైబిల్ని అధ్యయనం చేయడం నుండి ప్రయోజనం పొందేలా ఇతరులకు సహాయం చేయాలంటే ముందు మనకు బైబిల్ని అధ్యయనం చేసే అలవాటు ఉండాలి. నిజానికి మనం రోజూ బైబిలు చదివి, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచిస్తే మన జీవితంలో, పరిచర్యలో అవి చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకు, ప్రీచింగ్‌లో ఎవరైనా మనల్ని ఓ కష్టమైన ప్రశ్న అడిగినప్పుడు, బైబిలు వచనాలు చూపించి జవాబు చెప్పగలుగుతాం. లేదా యేసు, పౌలు మరితరులు తమ పరిచర్యను ఎలా పట్టుదలగా చేశారో బైబిల్లో చదివినప్పుడు మనం ఎంతో ప్రోత్సాహం పొందుతాం. ప్రీచింగ్‌ చేయడం కష్టంగా ఉన్నప్పుడు కూడా ఆ పనిని చేయగలుగుతాం. అంతేకాదు బైబిల్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఏ విషయాలు నేర్చుకున్నామో, అవి మనకెలా ఉపయోగపడ్డాయో ఇతరులకు చెప్పినప్పుడు, వాళ్లు కూడా బైబిల్ని లోతుగా అధ్యయనం చేసి ప్రయోజనం పొందాలనే ప్రోత్సాహం పొందుతారు.

5. క్రమంగా బైబిల్ని అధ్యయనం చేసేలా బైబిలు విద్యార్థులకు ఎలా శిక్షణనివ్వవచ్చు?

5 ఇంతకీ, ‘క్రమంగా బైబిల్ని అధ్యయనం చేసేలా నేను నా బైబిలు విద్యార్థికి ఎలా శిక్షణనివ్వవచ్చు?’ అని మీరు ఆలోచిస్తుండవచ్చు. బహుశా మీరు అతనితో స్టడీ చేస్తున్న పుస్తకంలోని సమాచారాన్ని ఎలా సిద్ధపడవచ్చో చూపించవచ్చు. మీరు చర్చిస్తున్న అంశానికి సంబంధించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని అనుబంధంలో ఉన్న సమాచారాన్ని, లేఖనాల్ని చదవమని ప్రోత్సహించండి. ఆ తర్వాత, మీటింగ్స్‌లో కామెంట్‌ చెప్పేలా ఎలా సిద్ధపడవచ్చో మీరు నేర్పించవచ్చు. ప్రతీ కావలికోట, తేజరిల్లు! పత్రికను చదవమని ప్రోత్సహించండి. అంతేకాదు, బైబిలుకు సంబంధించి తనకు వచ్చే ప్రశ్నలకు జవాబుల్ని తెలుసుకోవడానికి వాచ్‌టవర్‌ లైబ్రరీని లేదా వాచ్‌టవర్‌ ఆన్‌లైన్‌ లైబ్రరీని ఎలా ఉపయోగించాలో చూపించండి. ఇలా వేర్వేరు పద్ధతుల్లో బైబిల్ని అధ్యయనం చేసినప్పుడు అతను దాన్ని ఆనందిస్తాడు, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని కోరుకుంటాడు.

6. (ఎ) బైబిలు విలువను గుర్తించడానికి బైబిలు విద్యార్థులకు మనమెలా సహాయం చేయవచ్చు? (బి) బైబిల్లో ఉన్న విషయాల్ని ఎక్కువ నేర్చుకునే కొద్దీ బైబిలు విద్యార్థి ఎలా భావించవచ్చు?

6 బైబిలు ద్వారా యెహోవా గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు కాబట్టి అది విలువైనదని మన బైబిలు విద్యార్థులు గుర్తించాలని కోరుకుంటాం. అయితే అధ్యయనం చేయమని మనం వాళ్లను బలవంతం చేసే బదులు దాన్నెలా ఆనందించవచ్చో సంస్థ ఇచ్చిన ఉపకరణాల్ని ఉపయోగించి చూపిద్దాం. మన విద్యార్థులు బైబిల్లోని విషయాలు నేర్చుకునే కొద్దీ కీర్తనకర్తలా భావిస్తారు. ఆయనిలా అన్నాడు, “నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.” (కీర్త. 73:28) యెహోవాకు దగ్గరవ్వాలని కోరుకునే వాళ్లకు ఆయన పవిత్రశక్తి తప్పకుండా సహాయం చేస్తుంది.

ప్రకటించడానికి, బోధించడానికి కొత్తవాళ్లకు శిక్షణనివ్వండి

7. యేసు తన అపొస్తలులకు ఎలా శిక్షణనిచ్చాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

7 యేసు తన అపొస్తలులకు శిక్షణ ఇచ్చిన విధానం నుండి మనమెంతో నేర్చుకోవచ్చు. ఆయన వాళ్లను తనతోపాటు పరిచర్యకు తీసుకెళ్లాడు, అప్పుడు ఆయనెలా బోధిస్తున్నాడో వాళ్లు గమనించారు. అంతేకాదు ఎలా ప్రకటించాలో చెప్తూ అపొస్తలులకు నిర్దేశాలను కూడా ఇచ్చాడు.[1] (మత్తయి 10) దాంతో తక్కువ సమయంలోనే, ప్రజలకు సత్యాన్ని ఎలా బోధించాలో వాళ్లు యేసును చూసి నేర్చుకున్నారు. (మత్త. 11:1) అయితే పరిచర్యకు సంబంధించిన రెండు విషయాల్లో కొత్తవాళ్లకు ఎలా శిక్షణనివ్వవచ్చో ఇప్పుడు చూద్దాం.

8, 9. (ఎ) యేసు పరిచర్యలో ఎలా మాట్లాడాడు? (బి) కొత్తవాళ్లు పరిచర్యలో యేసు మాట్లాడినట్లే మాట్లాడడానికి మనమెలా సహాయం చేయవచ్చు?

8 ప్రజలతో సంభాషించడం. యేసు ప్రతీసారి గుంపుగా ఉన్న ప్రజలతోనే కాదు ఒక్కొక్కరితో కూడా స్నేహపూర్వకంగా మాట్లాడాడు. ఉదాహరణకు, సుఖారు అనే పట్టణంలోని బావి దగ్గరకు నీళ్ల కోసం వచ్చిన స్త్రీతో ఆసక్తికరమైన సంభాషణను మొదలుపెట్టాడు. (యోహా. 4:5-30) అంతేకాదు మత్తయి అనే సుంకరితో మాట్లాడి, తన శిష్యుడు అవ్వమని ఆహ్వానించాడు. మత్తయి దానికి అంగీకరించాడు. అతను శిష్యుడైన తర్వాత ఓ సందర్భంలో యేసును, ఇతరుల్ని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. అక్కడ యేసు చాలామందితో మాట్లాడాడు.—మత్త. 9:9; లూకా 5:27-39.

9 నజరేతులోని ప్రజల గురించి నతనయేలు తప్పుగా మాట్లాడినప్పటికీ యేసు అతనితో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. అలా మాట్లాడడంవల్ల నజరేతు నుండి వచ్చిన యేసు విషయంలో నతనయేలు తన అభిప్రాయాన్ని మార్చుకోగలిగాడు. అంతేకాదు అతను యేసు నుండి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని కోరుకున్నాడు. (యోహా. 1:46-51) కాబట్టి ప్రజలతో స్నేహపూర్వకంగా, దయగా మాట్లాడితే మనం చెప్పే విషయాల్ని వినడానికి వాళ్లు ఇష్టపడే అవకాశం ఉందని యేసు ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు.[2] మనం కొత్తవాళ్లకు అలా మాట్లాడడం నేర్పిస్తే వాళ్లు పరిచర్యను ఇంకా ఎక్కువ ఆనందించగలుగుతారు.

10-12. (ఎ) ఇతరులు సువార్తపట్ల ఆసక్తి చూపించినప్పుడు యేసు ఏమి చేశాడు? (బి) కొత్తవాళ్లు బోధకులుగా తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి మనమెలా సహాయం చేయవచ్చు?

10 వినడానికి ఇష్టపడే వాళ్లకు బోధించడం. యేసు చాలా బిజీగా ఉన్నప్పటికీ ప్రజలు ఆయన చెప్పేది వినడానికి ఇష్టపడినప్పుడు వాళ్ల కోసం సమయం వెచ్చించి, ఎన్నో విషయాలు బోధించాడు. ఉదాహరణకు, ఓ రోజు యేసు చెప్పేవి వినడానికి చాలామంది ప్రజలు సముద్రం ఒడ్డున సమకూడారు. అప్పుడు యేసు పేతురుతోపాటు పడవ ఎక్కి కొంచెం దూరం వెళ్లి అక్కడినుండి వాళ్లకు బోధించాడు. ఆ తర్వాత ఆయన పేతురుకు కూడా ఓ పాఠం నేర్పించాలనుకున్నాడు. అందుకే యేసు అద్భుతరీతిలో ఎన్నో చేపలు పేతురు వలలో చిక్కేలా చేశాడు. ఆ తర్వాత ఆయన పేతురుతో, “ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువు” అని అన్నాడు. వెంటనే పేతురు, అతనితో ఉన్నవాళ్లు “దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను [యేసును] వెంబడించిరి.”—లూకా 5:1-11.

11 నీకొదేము యేసు దగ్గర ఎక్కువ విషయాలు నేర్చుకోవాలని కోరుకున్నాడు. కానీ అతను యూదుల మహాసభకు చెందిన అధికారి కాబట్టి యేసుతో మాట్లాడడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనని భయపడ్డాడు. అందుకే అతను యేసు దగ్గరకు రాత్రిపూట వచ్చేవాడు. అయినప్పటికీ యేసు అతన్ని వెనక్కి పంపించలేదుగానీ సమయం వెచ్చించి, అతనికి ముఖ్యమైన సత్యాల్ని వివరించాడు. (యోహా. 3:1, 2) యేసు తన సమయాన్ని ఇతరులకు సత్యాన్ని బోధించడానికి, వాళ్ల విశ్వాసాన్ని బలపర్చడానికి ఉపయోగించాలని ఎల్లప్పుడూ కోరుకున్నాడు. అదే విధంగా మనం కూడా ప్రజలు ఏ సమయంలో వినడానికి ఇష్టపడతారో అప్పుడే వాళ్లను కలిసి, బైబిల్ని అర్థంచేసుకోవడానికి సహాయం చేయాలి.

12 మనం కొత్తవాళ్లతో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు, ఆసక్తి చూపించినవాళ్లను మళ్లీ కలవమని వాళ్లకు నేర్పించవచ్చు. వాళ్లను మనతోపాటు పునర్దర్శనాలకు, బైబిలు అధ్యయనాలకు కూడా తీసుకెళ్లవచ్చు. అలా చేస్తే ఇతరులకు ఎలా బోధించాలో నేర్చుకుంటారు, ఆసక్తి ఉన్నవాళ్లకు యెహోవా గురించిన సత్యాలు నేర్పిస్తున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో తెలుసుకుంటారు. అప్పుడు ఆసక్తి చూపించినవాళ్లను మళ్లీ కలిసి, బైబిలు అధ్యయనాలు చేయాలనే ఉత్సాహం వాళ్లలో కూడా కలుగుతుంది. అంతేకాదు ఆసక్తి ఉన్నవాళ్ల దగ్గరకు మళ్లీ వెళ్లినప్పుడు వాళ్లు ఇంట్లో లేకపోతే నిరుత్సాహపడకుండా ఓపిగ్గా ఉండడం నేర్చుకుంటారు.—గల. 5:22; “అతను పట్టుదలగా ప్రయత్నించాడు” అనే బాక్సు చూడండి.

తోటి సహోదరులకు సహాయం చేసేలా కొత్తవాళ్లకు శిక్షణనివ్వండి

13, 14. (ఎ) ఇతరుల కోసం గొప్ప త్యాగాలు చేసిన వ్యక్తుల గురించి బైబిల్లో చదివినప్పుడు మీకేమనిపిస్తుంది? (బి) తోటి సహోదరసహోదరీల పట్ల ప్రేమ చూపించే విషయంలో కొత్తవాళ్లకు, యౌవనులకు ఎలా శిక్షణనివ్వవచ్చు?

13 తన ప్రజలు ఒకరినొకరు సహోదరసహోదరీల్లా ప్రేమించుకోవాలని, చేదోడువాదోడుగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 పేతురు 1:22-23; లూకా 22:24-27 చదవండి.) యేసు ఇతరులకు సహాయం చేయడానికి సర్వస్వం ఇచ్చేశాడు, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడని బైబిలు చెప్తుంది. (మత్త. 20:28) అంతేకాదు దొర్కా, “సత్క్రియలను ధర్మకార్యములను బహుగా” చేసింది. (అపొ. 9:36, 39) మరియ, రోములో ఉన్న సహోదరసహోదరీల కోసం ‘కష్టపడి పనిచేసింది.’ (రోమా. 16:6, NW) తమ తోటి సహోదరసహోదరీలకు సహాయం చేయడం చాలా ప్రాముఖ్యమని కొత్తవాళ్లకు మనమెలా నేర్పించవచ్చు?

ఓ వృద్ధ సహోదరికి భోజనం తీసుకొచ్చిన తల్లీకూతుళ్లు

తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించేలా, వాళ్లకు సహాయం చేసేలా కొత్తవాళ్లకు శిక్షణనివ్వండి (13, 14 పేరాలు చూడండి)

14 వృద్ధుల్ని లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను కలవడానికి వెళ్తున్నప్పుడు మనతోపాటు రమ్మని కొత్తవాళ్లను ఆహ్వానించవచ్చు. తల్లిదండ్రులు అలాంటివాళ్లను కలవడానికి వెళ్తున్నప్పుడు, సరైనదని అనిపిస్తే పిల్లల్ని కూడా తమతోపాటు తీసుకెళ్లవచ్చు. అంతేకాదు సంఘపెద్దలు, వృద్ధులకు ఆహారం ఇవ్వడానికి లేదా వాళ్ల ఇంటి మరమ్మతు పనుల్లో సహాయం చేయడానికి వెళ్తున్నప్పుడు తమతోపాటు యౌవనుల్ని లేదా కొత్తవాళ్లను రమ్మని ఆహ్వానించవచ్చు. సహోదరసహోదరీలు ఒకరిపట్ల ఒకరు చూపించుకుంటున్న ప్రేమను చూసి యౌవనులు, కొత్తవాళ్లు నేర్చుకుంటారు. ఉదాహరణకు, ఓ సంఘపెద్ద ఒక పల్లెటూరులో ప్రీచింగ్‌కు వెళ్లిన ప్రతీసారి అక్కడ ఉంటున్న సహోదరులను కలిసి వాళ్ల బాగోగులు తెలుసుకునేవాడు. అతనితోపాటు వెళ్లే ఓ యువ సహోదరుడు ఆ సంఘపెద్ద ఉంచిన మంచి ఆదర్శాన్ని చూసి తాను కూడా తోటి సహోదరసహోదరీలకు ఎలా సహాయపడగలడో ఆలోచించడం నేర్చుకున్నాడు.—రోమా. 12:10.

15. సంఘంలో పురుషులు అభివృద్ధి సాధించేందుకు సంఘపెద్దలు సహాయం చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

15 సంఘంలోని వాళ్లకు దేవుని వాక్యాన్ని బోధించే బాధ్యతను యెహోవా పురుషులకు అప్పగించాడు. కాబట్టి సహోదరులు ప్రసంగాల్ని చక్కగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఒకవేళ మీరు సంఘపెద్దగా సేవచేస్తుంటే, ఓ సంఘ పరిచారకుడు తన ప్రసంగాన్ని ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు మీరు విని, ఇంకా బాగా ప్రసంగించడానికి అతనికి సహాయం చేయవచ్చు.—నెహె. 8:8.[3]

16, 17. (ఎ) తిమోతికి శిక్షణనిచ్చే విషయంలో పౌలు ఎలాంటి శ్రద్ధ చూపించాడు? (బి) సంఘపెద్దలు సంఘ పరిచారకులకు ఎలా శిక్షణనివ్వవచ్చు?

16 సంఘంలో కాపరులుగా సేవచేసేందుకు ఎక్కువమంది సహోదరులకు శిక్షణనివ్వాల్సిన అవసరం ఉంది. పౌలు తిమోతికి శిక్షణనిచ్చి, తిమోతిని కూడా ఇతరులకు శిక్షణనివ్వమని ప్రోత్సహించాడు. పౌలు ఇలా అన్నాడు, ‘క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము.’ (2 తిమో. 2:1, 2, NW) సంఘపెద్దగా సేవచేసిన అపొస్తలుడైన పౌలు నుండి తిమోతి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా పరిచర్యను ఎలా నైపుణ్యవంతంగా చేయాలో, సంఘంలో ఇతరులకు ఎలా సహాయం చేయాలో అతను నేర్చుకున్నాడు.—2 తిమో. 3:10-12.

17 పౌలు తిమోతికి బాగా శిక్షణనివ్వాలనే ఉద్దేశంతో అతనితో చాలా సమయాన్ని గడిపాడు. (అపొ. 16:1-5) సంఘపెద్దలు పౌలును ఆదర్శంగా తీసుకుని, అర్హులైన సంఘ పరిచారకుల్ని తమతోపాటు కొన్ని కాపరి సందర్శనాలకు తీసుకెళ్లవచ్చు. అలా చేయడంవల్ల ఇతరులకు ఎలా బోధించాలో, ఓపిగ్గా, ప్రేమగా ఎలా ఉండాలో, మందను చూసుకునే విషయంలో యెహోవా మీద ఎలా ఆధారపడాలో సంఘ పరిచారకులు పెద్దల్ని చూసి నేర్చుకుంటారు.—1 పేతు. 5:2.

శిక్షణనివ్వడం ప్రాముఖ్యం

18. యెహోవా సేవలో ఇతరులకు శిక్షణనివ్వడాన్ని మనం ఎందుకు ప్రాముఖ్యంగా ఎంచాలి?

18 ఈ చివరిరోజుల్లో, పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి చాలామంది కొత్తవాళ్లకు శిక్షణ అవసరం. అంతేకాదు సంఘంలో బాధ్యతలు చేపట్టగలిగే సహోదరుల అవసరం కూడా ఉంది. తన సేవకులందరూ చక్కగా శిక్షణ పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు. కొత్తవాళ్లకు శిక్షణనిచ్చే గొప్ప అవకాశాన్ని ఆయన మనకిచ్చాడు. కాబట్టి యేసూ, పౌలూ చేసినట్లే మనం కూడా ఇతరులకు శిక్షణనివ్వడానికి కృషిచేయడం చాలా ప్రాముఖ్యం. అంతం రాకముందే ప్రకటనాపనిలో చేయడానికి ఎంతో పని ఉంది కాబట్టి వీలైనంత ఎక్కువమందికి మనం శిక్షణనివ్వాలి.

19. ఇతరులకు మీరిచ్చే శిక్షణ చక్కని ఫలితాల్ని తీసుకొస్తుందనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు?

19 కొత్తవాళ్లకు శిక్షణనివ్వాలంటే సమయం, కృషి అవసరం. అయితే వీలైనంత చక్కగా ఇతరులకు ఎలా శిక్షణనివ్వాలో తెలుసుకోవడానికి యెహోవా, యేసు మనకు సహాయం చేస్తారనే నమ్మకంతో ఉండవచ్చు. మనం శిక్షణ ఇచ్చినవాళ్లు సంఘంలో లేదా పరిచర్యలో ‘కష్టపడి పనిచేయడం’ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. (1 తిమో. 4:10, NW) అయితే మనం కూడా ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి, క్రైస్తవ లక్షణాల్ని మెరుగుపర్చుకోవడానికి, యెహోవాకు మరింత దగ్గరవ్వడానికి చేయగలిగినదంతా చేస్తూ ఉందాం.

^ [1] (7వ పేరా) ఉదాహరణకు, (1) రాజ్యం గురించి ప్రకటించమని; (2) ఆహారం, బట్టల కోసం దేవుని మీద ఆధారపడమని; (3) ప్రజలతో వాదించవద్దని; (4) హింసలు ఎదురైనప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచమని; (5) ప్రజలు తమను ఏమి చేస్తారోనని భయపడవద్దని యేసు తన శిష్యులకు చెప్పాడు.

^ [2] (9వ పేరా) పరిచర్యలో ప్రజలతో ఎలా మాట్లాడాలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకంలోని 62-64 పేజీల్లో చక్కని సలహాలు ఉన్నాయి.

^ [3] (15వ పేరా) సహోదరులు సంఘంలో ఇచ్చే ప్రసంగాల్ని మెరుగుపర్చుకోవడానికి, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకంలోని 52-61 పేజీల్లో చక్కని సలహాలు ఉన్నాయి.

అతను పట్టుదలగా ప్రయత్నించాడు

ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు కొత్తవాళ్లు ఓపిక చూపించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఘానాలో ఉంటున్న ఓ సహోదరుని అనుభవాన్ని చూడండి. ఆ సహోదరుడు ఒక యువకునికి మన ప్రచురణలలో కొన్నింటిని ఇచ్చాడు. అతన్ని మళ్లీ కలవడానికి మన సహోదరుడు ఎన్నోసార్లు ప్రయత్నించినా, ఆ యువకుడు ఇంట్లో దాక్కునేవాడు. చాలా వారాల తర్వాత మన సహోదరుడు ఆ యువకుణ్ణి కలిశాడు. అయితే అతను సహోదరునితో మాట్లాడడానికి ఇష్టపడలేదు, అయినప్పటికీ మన సహోదరుడు పట్టువిడవకుండా ప్రయత్నించాడు. బైబిలు స్టడీ ఎలా చేస్తారో చూపించినప్పుడు ఆ యువకుడు స్టడీకి ఒప్పుకున్నాడు, ఆ తర్వాత కొన్ని నెలలకు ఓ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి