కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 డిసెంబరు పేజీలు 13-17
  • ‘ఆత్మానుసారమైన మనస్సు జీవం, సమాధానం’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘ఆత్మానుసారమైన మనస్సు జీవం, సమాధానం’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘శరీర విషయాల మీద మనసుపెట్టడం’
  • ‘ఆత్మ విషయాల మీద మనసుపెట్టడం’
  • ఆత్మానుసారంగా నడుచుకుంటూ జీవాన్ని, సమాధానాన్ని పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • రోమీయులు బహుశ్రేష్టమైన వార్తను పొందుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఆత్మను అనుసరించి జీవించండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • అందరికీ అవసరమైన సువార్త!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 డిసెంబరు పేజీలు 13-17
పరిచర్య మీద, ఇతరులకు సహాయం చేయడం మీద, తన కుటుంబం మీద మనసుపెడుతోన్న ఓ యౌవన సహోదరి

‘ఆత్మానుసారమైన మనస్సు జీవం, సమాధానం’

‘ఆత్మానుసారులు [పవిత్రశక్తి అనుగుణంగా నడుచుకునేవాళ్లు, NW] ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచుతారు.’—రోమా. 8:5.

పాటలు: 45, 36

మీరెలా జవాబిస్తారు?

  • రోమీయులు 8వ అధ్యాయం పరిశీలించడం ద్వారా మనందరం ఎందుకు ప్రయోజనం పొందవచ్చు?

  • ఓ క్రైస్తవుడు, ‘శరీర విషయాల మీద మనస్సు ఉంచడం’ ఎలా మొదలుపెట్టవచ్చు?

  • ‘ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచడం’ అంటే ఏమిటి?

1, 2. (ఎ) రోమీయులు 8వ అధ్యాయం ముఖ్యంగా అభిషిక్త క్రైస్తవులను ఉద్దేశించే రాయబడిందని ఎందుకు చెప్పవచ్చు?

యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో మీరు రోమీయులు 8:15-17 వచనాల్ని చదివేవుంటారు. తమకు పరలోకంలో నిరంతరం జీవించే నిరీక్షణ ఉందని అభిషిక్త క్రైస్తవులకు ఎలా తెలుస్తుందో ఆ వచనాలు వివరిస్తున్నాయి. అభిషిక్త క్రైస్తవులు క్రీస్తుయేసునందు ఐక్యంగా ఉన్నారని రోమీయులు 8:1వ వచనం వివరిస్తోంది. అయితే రోమీయులు 8వ అధ్యాయంలోని మాటలు కేవలం అభిషిక్త క్రైస్తవులకే వర్తిస్తాయా? లేదా భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణ ఉన్నవాళ్లకు కూడా అవి ఉపయోగపడతాయా?

2 రోమీయులు 8వ అధ్యాయంలోని మాటలు ముఖ్యంగా అభిషిక్త క్రైస్తవులను ఉద్దేశించే రాయబడ్డాయి. వాళ్లు ‘పవిత్రశక్తిని పొంది, తమ శరీరాల నుండి విడుదల పొంది దేవుని పిల్లలుగా దత్తత తీసుకోబడడం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.’ (రోమా. 8:23, NW) భవిష్యత్తులో వాళ్లు పరలోకంలో దేవుని కుమారులుగా ఉంటారు. విమోచన క్రయధనం ఆధారంగా యెహోవా వాళ్ల పాపాల్ని క్షమించాడు. అంతేకాదు తన కుమారులుగా ఉండేందుకు ఆయన వాళ్లను నీతిమంతులుగా తీర్పుతీర్చాడు.—రోమా. 3:23-26; 4:25; 8:30.

3. భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణ ఉన్నవాళ్లు కూడా రోమీయులు 8వ అధ్యాయాన్ని ఎందుకు పరిశీలించాలి?

3 అయితే అభిషిక్త క్రైస్తవుడు కాకపోయినా యెహోవా నీతిమంతుడిగా ఎంచిన ఓ వ్యక్తి గురించి పౌలు రోమీయుల పుస్తకం ప్రారంభంలో ప్రస్తావించాడు. అతనే అబ్రాహాము. ఆ నమ్మకస్థుడైన వ్యక్తి, యేసు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇవ్వడానికి ఎన్నో సంవత్సరాల ముందు జీవించాడు. (రోమీయులు 4:20-22 చదవండి.) నేడు, భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణ ఉన్న నమ్మకమైన క్రైస్తవులను కూడా యెహోవా నీతిమంతులుగా ఎంచగలడు. కాబట్టి రోమీయులు 8వ అధ్యాయంలోని ఉపదేశం నుండి వాళ్లు కూడా ప్రయోజనం పొందవచ్చు.

4. రోమీయులు 8:20, 21 వచనాలు చదువుతున్నప్పుడు మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

4 కొత్తలోకం వస్తుందనీ, మనుషులందరూ పాపమరణాల నుండి విడుదల పొందుతారనీ యెహోవా ఇస్తున్న అభయాన్ని రోమీయులు 8:20, 21 వచనాల్లో మనం చూడవచ్చు. మనుషులందరూ “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” పొందుతారని ఆ వచనాలు చెప్తున్నాయి. అయితే ప్రశ్నేమిటంటే ఆ కొత్తలోకంలో మనం ఉంటామా? ఆ బహుమానాన్ని పొందుతామా? మరి కొత్తలోకంలో మీరు ఉంటారనే నమ్మకం మీకుందా? దేవుడు తీసుకురాబోయే ఆ కొత్తలోకంలో ఉండాలంటే మనమేమి చేయాలో ఇప్పుడు పరిశీలిద్దాం.

‘శరీర విషయాల మీద మనసుపెట్టడం’

5. రోమీయులు 8:3-13 వచనాల్లో పౌలు ఎలాంటి వాళ్ల గురించి ప్రస్తావించాడు?

5 రోమీయులు 8:3-13 చదవండి. రోమీయులు 8వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు రెండు రకాల ప్రజల గురించి అంటే, ‘శరీరానుసారంగా’ జీవించే వాళ్ల గురించి, ‘ఆత్మానుసారంగా’ జీవించే వాళ్ల గురించి చెప్పాడు. అయితే పౌలు ఆ వచనాల్లో క్రైస్తవులు కానివాళ్లకు, క్రైస్తవులకు మధ్య ఉన్న తేడా గురించి మాట్లాడుతున్నాడని కొంతమంది అనుకుంటారు. కానీ పౌలు ఈ పత్రికను, “పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన” క్రైస్తవులకు రాస్తున్నాడు. (రోమా. 1:1-7) కాబట్టి ఆ లేఖనంలో పౌలు ప్రస్తావించిన, ‘శరీరానుసారంగా’ జీవించేవాళ్లు, ‘ఆత్మానుసారంగా’ జీవించేవాళ్లు క్రైస్తవులే. మరి వాళ్ల మధ్య ఉన్న తేడా ఏంటి?

6, 7. (ఎ) బైబిల్లో ‘శరీరం’ అనే పదానికి ఉన్న కొన్ని అర్థాలేమిటి? (బి) రోమీయులు 8:3-13 వచనాల్లో ‘శరీరం’ అనే పదాన్ని ఏ అర్థంలో ఉపయోగించారు?

6 బైబిల్లో ‘శరీరం’ అనే పదం చాలా రకాలుగా ఉపయోగించబడింది. కొన్నిసార్లు అది మనుషుల శరీరాన్ని సూచిస్తుంది. (రోమా. 2:28; 1 కొరిం. 15:39, 50) ఆ పదం కుటుంబ బంధాలను కూడా సూచించవచ్చు. ఉదాహరణకు, “యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానము” అని బైబిలు చెప్తోంది. అంతేకాదు పౌలు యూదులను, “దేహసంబంధులైన నా సహోదరులు” అని పిలిచాడు.—రోమా. 1:1-3; 9:3.

7 అయితే పౌలు ప్రస్తావించిన ‘శరీరానుసారంగా’ జీవించేవాళ్లు ఎవరో అర్థంచేసుకునేందుకు మనం రోమీయులు 7:5వ వచనాన్ని చూడవచ్చు. పౌలు ఇలా రాశాడు, “మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను.” కాబట్టి పాపపు కోరికల గురించే ఆలోచిస్తూ, వాటి ప్రకారమే జీవిస్తూ, తమకు ఇష్టమొచ్చిన వాటిని చేసేవాళ్లే ‘శరీరానుసారంగా’ జీవించేవాళ్లని పౌలు వివరించాడు.

8. ‘శరీరానుసారంగా’ జీవించడం గురించి పౌలు అభిషిక్త క్రైస్తవులను ఎందుకు హెచ్చరించాడు?

8 ‘శరీరానుసారంగా’ జీవించవద్దని పౌలు అభిషిక్త క్రైస్తవులను ఎందుకు హెచ్చరించాడు? ఈ హెచ్చరిక నేడు క్రైస్తవులందరికీ ఎందుకు అవసరం? ఎందుకంటే, దేవునికి నమ్మకంగా సేవచేసే ఎవరైనా తమ సొంత కోరికలకే జీవితంలో ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు, రోమాలోని కొంతమంది సహోదరులు ‘కడుపునే వాళ్ల దేవునిగా’ చేసుకున్నారని పౌలు రాశాడు. అంటే సెక్స్‌, ఆహారం లేదా ఇతర సుఖాలే వాళ్ల జీవితాల్లో అన్నింటికన్నా ప్రాముఖ్యంగా ఉన్నాయని పౌలు చెప్తున్నాడు. (రోమా. 16:17, 18; ఫిలి. 3:18, 19; యూదా 4, 8, 12) ఒకానొక సమయంలో కొరింథు సంఘంలోని ఓ సహోదరుడు ‘తన తండ్రి భార్యతో’ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. (1 కొరిం. 5:1) కాబట్టి ఆ తొలి క్రైస్తవులకు ‘శరీరానుసారంగా’ జీవించడం గురించి పౌలు ఇచ్చిన హెచ్చరిక అవసరమని ఖచ్చితంగా చెప్పవచ్చు.—రోమా. 8:5, 6.

9. రోమీయులు 8:5-6 వచనాలు దేని గురించి చెప్పట్లేదు?

9 ఆ హెచ్చరిక నేడు కూడా ఉపయోగపడుతుంది. యెహోవాను ఎంతోకాలంగా సేవిస్తున్న వ్యక్తి కూడా ‘శరీరానుసారంగా’ జీవించడం మొదలుపెట్టే అవకాశం ఉంది. అంటే మనం ఆహారం, ఉద్యోగం, సరదాగా సమయం గడపడం లేదా రొమాన్స్‌ వంటివాటి గురించి అస్సలు ఆలోచించకూడదని పౌలు చెప్తున్నాడా? ఎంతమాత్రం కాదు. ఇవన్నీ జీవితంలోని సాధారణమైన విషయాలు. ఉదాహరణకు యేసు భోజనాన్ని ఆస్వాదించాడు, దాన్ని ఇతరులకు కూడా పెట్టాడు. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలు ప్రాముఖ్యమని పౌలు రాశాడు.

సరదాగా వేరే ప్రాంతం వెళ్లడం గురించి ఇంట్లో, పని స్థలంలో, రాజ్యమందిరంలో మాట్లాడుతున్న ఓ సహోదరుడు

మన మాటలు ఏమి చూపిస్తున్నాయి? (10, 11 పేరాలు చూడండి)

10. ‘మనసుపెట్టడం’ అనే మాటకు అర్థమేంటి?

10 ‘మనసుపెట్టడం’ అనే మాటను పౌలు ఏ అర్థంలో ఉపయోగించాడు? అతను ఉపయోగించిన గ్రీకు పదం ఓ వ్యక్తి తన ఆలోచనలన్నింటిని, ప్రణాళికలన్నింటిని ఏదైనా ఒకదాని మీద ఉంచడాన్ని సూచిస్తుంది. ‘తమ సొంత పాపపు కోరికలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తూ, వాటిగురించే మాట్లాడుతూ,’ వాటిమీదే మనసుపెట్టేవాళ్లను ఇది సూచిస్తుందని ఓ విద్వాంసుడు చెప్తున్నాడు. వాళ్ల జీవితం ఆ కోరికల చుట్టే తిరుగుతుంది.

11. మన జీవితంలో ఏ విషయాలు అత్యంత ప్రాముఖ్యమైనవిగా మారవచ్చు?

11 రోములోని క్రైస్తవులు ఒకవేళ “శరీరవిషయముల” మీద మనసు పెడుతున్నారేమో అని పరిశీలించుకోవాల్సి వచ్చింది. నేడు, మనం కూడా మన జీవితంలో వేటిని ప్రాముఖ్యంగా ఎంచుతున్నామో ఆలోచించుకోవాలి. మనం వేటిగురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం? ఎలాంటి పనులు చేయడానికి ఇష్టపడుతున్నాం? ఉదాహరణకు కొంతమంది, తాము రకరకాల వైన్‌ త్రాగడం గురించి, ఇంటిని అందంగా అలంకరించుకోవడం గురించి, కొత్త బట్టలు కొనుక్కోవడం గురించి, డబ్బు పెట్టుబడిగా పెట్టడం గురించి లేదా సరదాగా వేరే ప్రాంతాలకు వెళ్లడం వంటివాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామని గుర్తించవచ్చు. వాళ్లు ఆలోచిస్తున్నది చేయకూడని పనుల గురించేమీ కాదు. అవి మన జీవితంలోని సాధారణమైన విషయాలు కావచ్చు. యేసు కూడా ఒక పెళ్లి విందులో ద్రాక్షారసాన్ని ఇచ్చాడు, పౌలు తిమోతిని ఆరోగ్యం కోసం “కొంచెము” ద్రాక్షారసాన్ని తీసుకోమని సలహా ఇచ్చాడు. (1 తిమో. 5:23; యోహా. 2:3-11) కానీ ద్రాక్షారసమే వాళ్ల జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం కాలేదు. మరి మన విషయమేమిటి? మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి?

12, 13. మన మనసును వేటి మీద ఉంచుతున్నామో ఎందుకు పరిశీలించుకోవాలి?

12 “శరీరానుసారమైన మనస్సు మరణము” అని పౌలు హెచ్చరించాడు. (రోమా. 8:5) ఆ మాటలకు అర్థమేంటి? మనం ‘శరీరానుసారంగా’ జీవిస్తే, యెహోవాతో ఇప్పుడు మనకున్న సంబంధాన్ని కోల్పోతాం, భవిష్యత్తులో జీవాన్ని కూడా కోల్పోతాం. అయితే మనం అది జరగకుండా ఆపవచ్చు. ఎందుకంటే ఓ వ్యక్తి మారే అవకాశం ఉంది. ఉదాహరణకు అనైతిక జీవితాన్ని గడుపుతున్న కొరింథులోని వ్యక్తిని గుర్తుచేసుకోండి. అతన్ని సరిదిద్దిన తర్వాత మారాడు. తన అనైతిక జీవితాన్ని వదిలేసి, తిరిగి యెహోవా సేవచేస్తూ సరైన మార్గంలోకి వచ్చాడు.—2 కొరిం. 2:6-8.

13 పూర్తిగా ‘శరీరానుసారంగా’ జీవించే విషయంలో కొరింథులోని వ్యక్తి సరైన ఉదాహరణ, అయినప్పటికీ అతను మారగలిగాడు. కాబట్టి నేడు ఓ క్రైస్తవుడు యెహోవా ప్రమాణాల ప్రకారం కాకుండా తన పాపపు కోరికల ప్రకారం జీవించడం మొదలుపెట్టినప్పటికీ అతను కూడా మారగలడు. పౌలు ఇచ్చిన హెచ్చరికను గుర్తుంచుకుంటే, మన జీవితంలో అవసరమైన ఎలాంటి మార్పులనైనా చేసుకోవాలనే ప్రోత్సాహం పొందుతాం.

‘ఆత్మ విషయాల మీద మనసుపెట్టడం’

14, 15. (ఎ) వేటి మీద మనసుపెట్టమని పౌలు మనకు సలహా ఇస్తున్నాడు? (బి) ‘ఆత్మ విషయాల మీద మనసుపెట్టడం’ అంటే ఏమిటి?

14 ‘శరీర విషయాల మీద మనసుపెట్టడం’ వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పిన తర్వాత పౌలు ఇలా వివరించాడు, “ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.” మనకు ఎంత అద్భుతమైన బహుమానం వేచివుందో కదా!

15 అయితే ‘ఆత్మ విషయాల మీద మనసుపెట్టడం’ అంటే వాస్తవానికి దూరంగా బ్రతకడమని కాదు. కేవలం యెహోవా గురించి లేదా బైబిలు గురించి మాత్రమే ఆలోచించాలని, మాట్లాడాలని కాదు. క్రైస్తవులు అందరిలాగే జీవిస్తారు. ఉదాహరణకు తొలి క్రైస్తవులనే తీసుకోండి. వాళ్లు ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఆస్వాదించారు, పెళ్లిళ్లు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు.—మార్కు 6:3; 1 థెస్స. 2:9.

16. పౌలు తన జీవితంలో దేనికి అత్యంత ప్రాముఖ్యమైన స్థానాన్నిచ్చాడు?

16 అయితే పౌలు, ఇతర తొలి క్రైస్తవులు ఈ సాధారణ విషయాలే తమ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాలుగా మారకుండా జాగ్రత్తపడ్డారు. ఉదాహరణకు, పౌలు డేరాలు కుట్టి బ్రతికేవాడని మనకు తెలుసు. కానీ అతను ఉద్యోగానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వలేదు. బదులుగా దేవుని సేవచేయడమే తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమని పౌలు భావించాడు. అతను ప్రకటించడం, బోధించడం మీదే మనసుపెట్టాడు. (అపొస్తలుల కార్యములు 18:2-4; 20:20, 21, 34, 35 చదవండి.) రోములోని సహోదరసహోదరీల్లాగే మనం కూడా పౌలును అనుకరించాల్సిన అవసరం ఉంది. —రోమా. 15:15, 16.

17. ‘ఆత్మ విషయాల మీద మనసుపెట్టడం’ వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

17 యెహోవా సేవచేయడం మీదే మనసుపెడితే మన జీవితం ఎలా ఉంటుంది? రోమీయులు 8:6 ఇలా చెప్తోంది, “ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.” అంటే, యెహోవా పవిత్రశక్తికి మన మనస్సును నిర్దేశించే అవకాశాన్ని ఇస్తూ, ఆయనలా ఆలోచించడం నేర్చుకోవాలి. అలాచేస్తే ఇప్పుడు సంతోషంగా, సంతృప్తిగా ఉండే జీవితాన్ని, భవిష్యత్తులో నిరంతర జీవితాన్ని ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు.

18. ‘ఆత్మ విషయాల మీద మనసుపెట్టడం’ వల్ల మనకు సమాధానం ఎలా కలుగుతుంది?

18 ‘ఆత్మ విషయాల మీద మనసుపెట్టడం’ వల్ల సమాధానం పొందుతామని పౌలు అన్న మాటలకు అర్థమేమిటి? ప్రతీఒక్కరం సమాధానాన్ని, ముఖ్యంగా మనశ్శాంతిని కోరుకుంటాం. కానీ చాలా కొద్దిమందే దాన్ని పొందుతారు. మనం నిజమైన మనశ్శాంతిని పొందుతున్నందుకు యెహోవాకు ఎంత కృతజ్ఞులమో కదా! మనం మన కుటుంబంలో అలాగే సంఘంలో కూడా సమాధానాన్ని కలిగివుండవచ్చు. మనం అపరిపూర్ణులం కాబట్టి మన తోటి సహోదరసహోదరీలతో అప్పుడప్పుడు సమస్యలు వస్తాయి. అలా జరిగినప్పుడు, “నీ సహోదరునితో సమాధానపడుము” అని యేసు ఇచ్చిన సలహాను పాటిస్తాం. (మత్త. 5:24) మీ సహోదరుడు లేదా సహోదరి కూడా ‘సమాధానకర్తయగు దేవుడైన’ యెహోవాను సేవిస్తున్నారని గుర్తుంచుకోండి.—రోమా. 15:33; 16:20.

19. మనం ఏ ప్రత్యేకమైన సమాధానాన్ని పొందగలం?

19 ‘ఆత్మ విషయాల మీద మనసుపెట్టడం’ వల్ల దేవునితో కూడా సమాధానాన్ని కలిగివుంటాం. యెషయా ప్రవక్త ఇలా వివరించాడు, “ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు [యెహోవా] పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.”—యెష. 26:3; రోమీయులు 5:1 చదవండి.

20. రోమీయులు 8వ అధ్యాయంలో ఉన్న సలహాలకు మీరెందుకు కృతజ్ఞత కలిగివున్నారు?

20 మనకు పరలోకంలో నిరంతరం జీవించే నిరీక్షణ ఉన్నా, భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణ ఉన్నా రోమీయులు 8 వ అధ్యాయంలోని మంచి సలహాల నుండి మనందరం ప్రయోజనం పొందవచ్చు. మన సొంత కోరికల మీద కాకుండా యెహోవా సేవచేయడం మీదే మనసుపెట్టమని బైబిలు ప్రోత్సహిస్తున్నందుకు మనమెంతో కృతజ్ఞులం. ‘ఆత్మ విషయాల మీద మనసుపెట్టడం’ వల్ల అద్భుతమైన బహుమానం పొందవచ్చని మనకు తెలుసు. ఆ అద్భుతమైన బహుమానమే, “దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.”—రోమా. 6:23.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి