దయ మాటల్లో, చేతల్లో చూపించాల్సిన లక్షణం
దయతో చేసే పని ఎంత ప్రోత్సాహాన్ని, ఊరటను ఇస్తుందో కదా! ఎవరైనా మనపై శ్రద్ధ చూపిస్తే వాళ్లపట్ల కృతజ్ఞత కలిగివుంటాం. ఇతరులు మనతో దయగా వ్యవహరించాలని అందరం కోరుకుంటాం కాబట్టి ఆ లక్షణాన్ని మనమెలా అలవర్చుకోవచ్చు?
దయ అంటే మన మాటల్లో, చేతల్లో ఇతరులపట్ల నిజమైన శ్రద్ధ చూపించడం. కాబట్టి మనం పైకి గౌరవంగా, మర్యాదగా ఉంటే సరిపోదుగానీ దయను చేతల్లో చూపించాలి. ప్రగాఢమైన ప్రేమ, సహానుభూతి నుండి నిజమైన దయ పుడుతుంది. అంతేకాదు, క్రైస్తవులు వృద్ధి చేసుకోవాల్సిన పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో దయ కూడా ఒకటి. (గల. 5:22, 23) కాబట్టి మనందరం ఆ లక్షణాన్ని అలవర్చుకోవాలి. అయితే యెహోవా, యేసు దాన్నెలా చూపించారో పరిశీలించి, వాళ్లను మనమెలా ఆదర్శంగా తీసుకోవచ్చో ఆలోచిద్దాం.
యెహోవా అందరి పట్ల దయ చూపిస్తున్నాడు
యెహోవా అందరి పట్ల దయ, శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆఖరికి “కృతజ్ఞతలేని చెడ్డవాళ్ల మీద” కూడా ఆయన దయ చూపిస్తున్నాడు. (లూకా 6:35) ఉదాహరణకు, “ఆయన అందరి మీద అంటే దుష్టుల మీద, మంచివాళ్ల మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు; నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు.” (మత్త. 5:45) కాబట్టి, యెహోవా తమ సృష్టికర్త అని గుర్తించనివాళ్లు కూడా ఆయన దయ నుండి ప్రయోజనం పొందుతున్నారు, కొంతమేరకు సంతోషాన్ని అనుభవిస్తున్నారు.
యెహోవా ఆదాముహవ్వల కోసం చేసిన ఒక పనిలో ఆయన గొప్ప దయ కనిపిస్తుంది. వాళ్లు పాపం చేసిన కొద్దిసేపటికే, “అంజూరపు ఆకులు కుట్టి” తమ నడుముకు చుట్టుకున్నారు. కానీ ఏదెను తోట బయట ఉండడానికి అవి వాళ్లకు సరిపోవని యెహోవాకు తెలుసు. ఎందుకంటే, నేల శపించబడి ‘ముండ్ల తుప్పలతో, గచ్చపొదలతో’ నిండివుంది. అందుకే యెహోవా దయతో వాళ్ల అవసరాన్ని గుర్తించి, ‘జంతు చర్మాలతో పొడవాటి వస్త్రాలు’ చేయించి ఇచ్చాడు.—ఆది. 3:7, 17-18, 21, NW.
యెహోవా “దుష్టుల మీద, మంచివాళ్ల మీద” దయ చూపిస్తున్నప్పటికీ, ముఖ్యంగా తన నమ్మకమైన సేవకుల మీద దయ చూపించడానికి ఆయన ఇష్టపడతాడు. ఉదాహరణకు జెకర్యా ప్రవక్త కాలంలో, యెరూషలేము ఆలయాన్ని తిరిగి కట్టే పని పూర్తిగా ఆగిపోవడం చూసి ఒక దేవదూత బాధపడ్డాడు. దూత ఆ బాధను యెహోవాతో పంచుకున్నప్పుడు ఆయన విని, ‘దయగల, ఊరటనిచ్చే మాటలతో జవాబిచ్చాడు.’ (జెక. 1:12-13, NW) ఏలీయా ప్రవక్త విషయంలో కూడా యెహోవా అలాగే వ్యవహరించాడు. ఒకానొక సమయంలో ఏలీయా ఎంత కృంగిపోయాడంటే, తనను చంపమని యెహోవాను అడిగాడు. కానీ అతని భావాల్ని యెహోవా అర్థంచేసుకుని, అతన్ని బలపర్చడానికి దేవదూతను పంపించాడు. అంతేకాదు, అతను ఒంటరివాడు కాదనే అభయాన్నిచ్చాడు. ఏలీయా విన్న దయగల మాటలు, పొందిన సహాయం బట్టి తన నియామకాన్ని కొనసాగించగలిగాడు. (1 రాజు. 19:1-18) అయితే దేవుని సేవకులందరిలో, యెహోవాకున్న గొప్ప లక్షణమైన దయను పరిపూర్ణంగా అనుకరించిన వ్యక్తి ఎవరు?
యేసు ఎంతో దయ చూపించాడు
యేసు భూమ్మీద పరిచర్య చేస్తున్నప్పుడు ప్రజల మీద దయ, శ్రద్ధ చూపించాడు. ఆయన ఎప్పుడూ దురుసుగా మాట్లాడలేదు లేదా పెత్తనం చెలాయించలేదు. ఆయన సహానుభూతితో ఇలా అన్నాడు, “భారం మోస్తూ అలసిపోయిన మీరందరూ నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను. . . . నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది.” (మత్త. 11:28-30) ఆయన దయగలవాడు కాబట్టి, ప్రజలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లేవాళ్లు. ఆయన “జాలిపడి” వాళ్లకు ఆహారం పెట్టాడు, రోగుల్ని, అంగవైకల్యంతో బాధపడేవాళ్లను బాగుచేశాడు, తన తండ్రి గురించి “చాలా విషయాలు” బోధించాడు.—మార్కు 6:34; మత్త. 14:14; 15:32-38.
యేసు ఇతరుల్ని అర్థంచేసుకుని వ్యవహరించడం ఆయన గొప్ప దయను రుజువు చేస్తుంది. నిజానికి, ఆయన ఎలాంటి సందర్భంలోనైనా తన దగ్గరకు వచ్చినవాళ్లను “ప్రేమతో” లేదా దయతో చేర్చుకున్నాడు. (లూకా 9:10, 11) ఉదాహరణకు, ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రురాలైన ఒక స్త్రీ తన జబ్బు నయమౌతుందనే నమ్మకంతో యేసు పైవస్త్రాన్ని ముట్టుకుంది. ఆ తర్వాత భయంతో వణికిపోయిన ఆమెను యేసు కోప్పడలేదు. (లేవీ. 15:25-28) 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెపట్ల యేసు కనికరం చూపిస్తూ ఇలా అన్నాడు, “అమ్మా, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది. మనశ్శాంతితో వెళ్లు, ఏ నొప్పీ లేకుండా ఆరోగ్యంగా ఉండు.” (మార్కు 5:25-34) యేసు చూపించిన దయకు అదెంత అద్భుతమైన ఉదాహరణో కదా!
దయ చూపించాలంటే మంచిపనులు చేయాలి
పైన చూసిన ఉదాహరణల్ని బట్టి నిజమైన దయ చేతల్లో కనిపిస్తుందని అర్థమౌతుంది. మంచి సమరయుని కథ చెప్పినప్పుడు యేసు ఆ విషయాన్నే నొక్కిచెప్పాడు. ఆ కథలో ఒకవ్యక్తిని దొంగలు దోచుకొని, కొట్టి, కొన ఊపిరితో వదిలేసి వెళ్లిపోయారు. యూదులకు, సమరయులకు శత్రుత్వం ఉన్నప్పటికీ, ఒక సమరయుడు అతన్ని చూసి జాలిపడ్డాడు. ఆ సమరయుడు దయగా అతని దగ్గరకు వెళ్లి, గాయాలకు కట్టుకట్టి, సత్రానికి తీసుకెళ్లాడు. అంతేకాదు, అతని బాగోగులు చూసుకోమని ఆ సత్రం యజమానికి డబ్బులు ఇచ్చి, ఇంకా ఎక్కువ ఖర్చయినా ఇస్తానని చెప్పాడు.—లూకా 10:29-37.
దయను తరచూ చేతల్లో చూపించినప్పటికీ, ఆ లక్షణాన్ని సానుకూలమైన, ప్రోత్సాహకరమైన మాటల్లో కూడా చూపించవచ్చు. ఎందుకంటే, “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును” అని బైబిలు చెప్తుంది. (సామె. 12:25) మనం దయ, మంచితనం చూపిస్తూ ప్రోత్సాహకరంగా మాట్లాడితే, అవి ఎదుటివ్యక్తికి ఎక్కువ సంతోషాన్నిస్తాయి.a దయగా మాట్లాడితే, ఎదుటివ్యక్తి పట్ల మనకు శ్రద్ధ ఉందని చూపిస్తాం. దానివల్ల అతను కష్టాల్ని విజయవంతంగా ఎదుర్కోగలుగుతాడు.—సామె. 16:24.
దయను ఎలా అలవర్చుకోవచ్చు?
మనుషులు దేవుని ‘స్వరూపంలో’ సృష్టించబడ్డారు కాబట్టి, దయ అనే లక్షణాన్ని అలవర్చుకోగలరు. (ఆది. 1:27) ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు, యూలి అనే రోమా సైనికాధికారి నిర్బంధంలో రోముకు ప్రయాణించాడు. సీదోను చేరుకున్నాక ఆ సైనికాధికారి పౌలు “మీద దయ చూపించి అతన్ని తన స్నేహితుల దగ్గరికి వెళ్లనిచ్చాడు. దానివల్ల వాళ్లు పౌలుకు సహాయం చేయగలిగారు.” (అపొ. 27:3) కొంతకాలానికి, పౌలు ప్రయాణిస్తున్న ఓడ బద్దలైనప్పుడు మెలితే ద్వీపవాసులు ఆయన మీద, ఆయనతోపాటు ఉన్నవాళ్ల మీద “ఎంతో దయ చూపించారు.” అంతేకాదు వాళ్లందరూ చలి కాచుకోవడానికి ఆ ద్వీపవాసులు ‘మంట వెలిగించారు.’ (అపొ. 28:1, 2) వాళ్లు చేసిన పని చాలా మెచ్చుకోదగినది. అయితే, నిజమైన దయను కేవలం కొన్ని సందర్భాల్లోనే కాదు ఎల్లప్పుడూ చూపించాలి.
దేవున్ని సంతోషపెట్టాలంటే, దయ ఎల్లప్పుడూ మన వ్యక్తిత్వంలో భాగమై ఉండాలి. అందుకే, దయను “బట్టల్లా వేసుకోండి” అని యెహోవా చెప్తున్నాడు. (కొలొ. 3:12, అధస్సూచి) పవిత్రశక్తి పుట్టించే ఈ లక్షణాన్ని చూపించడం అన్ని సందర్భాల్లో తేలిక కాదని ఒప్పుకోవాల్సిందే. ఎందుకు? బహుశా సిగ్గు, భయం, వ్యతిరేకత, స్వార్థం వల్ల మనం దయ చూపించలేకపోవచ్చు. కానీ పవిత్రశక్తి మీద ఆధారపడి, యెహోవా ఆదర్శాన్ని పాటిస్తే వాటిని అధిగమించి, దయ చూపించగలుగుతాం.—1 కొరిం. 2:12.
మనం దయ చూపించే విషయంలో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘ఎదుటివ్యక్తి చెప్పేది నేను సహానుభూతితో వింటానా? ఇతరుల అవసరాల్ని పట్టించుకుంటానా? నా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కాకుండా వేరేవాళ్లతో దయగా వ్యవహరించి ఎంతకాలం అయ్యింది?’ ఆ ప్రశ్నలు వేసుకున్నాక మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు, మన చుట్టూ ఉన్నవాళ్ల గురించి, ముఖ్యంగా క్రైస్తవ సంఘంలో ఉన్నవాళ్ల గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే లక్ష్యం పెట్టుకోవచ్చు. అప్పుడు వాళ్ల పరిస్థితుల్ని, అవసరాల్ని గుర్తించగలుగుతాం. ఆ తర్వాత, వాళ్లు మనపట్ల ఏయే విధాలుగా దయ చూపించాలని ఆశిస్తామో మనం కూడా వాళ్లపట్ల ఆయా విధాలుగా దయ చూపించాలి. (మత్త. 7:12) చివరిగా, సహాయం కోసం యెహోవాను అడిగితే, దయను అలవర్చుకోవడానికి మనం చేసే కృషిని దీవిస్తాడు.—లూకా 11:13.
దయ ఇతరుల్ని ఆకర్షిస్తుంది
తాను మంచి పరిచారకునిగా తయారవ్వడానికి సహాయం చేసిన లక్షణాల గురించి చెప్తూ అపొస్తలుడైన పౌలు దయ గురించి కూడా ప్రస్తావించాడు. (2 కొరిం. 6:3-6) పౌలు దయగల మాటల ద్వారా, చేతల ద్వారా ఇతరులపట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించాడు కాబట్టి ప్రజలు ఆయనకు ఆకర్షితులు అయ్యారు. (అపొ. 28:30, 31) మనం కూడా దయగా ఉంటే ప్రజల్ని సత్యంవైపు ఆకర్షించవచ్చు. కాబట్టి అందరిమీద, ఆఖరికి మనల్ని వ్యతిరేకించే వాళ్లమీద కూడా మనం దయ చూపిస్తే, వాళ్ల మనసులు మెత్తబడి, కోపం కరిగే అవకాశం ఉంది. (రోమా. 12:20) కొంతకాలానికి, వాళ్లు కూడా బైబిలు సందేశానికి ఆకర్షితులు కావచ్చు.
రాబోయే భూపరదైసులో, ప్రతీఒక్కరు ఇతరులపట్ల నిజమైన దయ చూపిస్తారు. పునరుత్థానం అయ్యేవాళ్లు కూడా ఆ దయను రుచిచూస్తారు. వాళ్లలో కొంతమందికి బహుశా అదే మొదటిసారి కావచ్చు. అప్పుడు వాళ్లు కృతజ్ఞతతో ఇతరులపట్ల దయ చూపిస్తారు. అయితే దయ చూపించడానికి, ఇతరులకు సహాయం చేయడానికి నిరాకరించేవాళ్లు దేవుని రాజ్యంలో ఎక్కువకాలం ఉండరు. బదులుగా ప్రేమ, దయ చూపించేవాళ్లు మాత్రమే పరదైసులో శాశ్వతకాలం ఉంటారు. (కీర్త. 37:9-11) అప్పుడు లోకం ఎంత సురక్షితంగా, ప్రశాంతంగా ఉంటుందో కదా! అయితే అలాంటి లోకం రావడానికి ముందే, దయ చూపించడం వల్ల మనమెలాంటి ప్రయోజనం పొందవచ్చు?
దయ చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాలు
“దయగలవాడు తనకే మేలు చేసికొనును” అని బైబిలు చెప్తుంది. (సామె. 11:17) సాధారణంగా ప్రజలు దయగల వ్యక్తికి ఆకర్షితులౌతారు, అతనితో దయగా ఉంటారు. యేసు ఇలా చెప్పాడు, “మీరు ఏ కొలతతో కొలుస్తారో, వాళ్లూ మీకు అదే కొలతతో కొలుస్తారు.” (లూకా 6:38) కాబట్టి, దయగల వ్యక్తికి మంచి స్నేహితులు తేలిగ్గా దొరుకుతారు, ఆ స్నేహితులు చిరకాలం ఉంటారు.
అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘాన్ని ఇలా ప్రోత్సహించాడు, “ఒకరితో ఒకరు దయగా మెలగండి, కనికరం చూపించండి, . . . ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి.” (ఎఫె. 4:32) సహానుభూతి, దయ చూపిస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకునే క్రైస్తవుల వల్ల సంఘం ఎంతో బలంగా, ఐక్యంగా తయారౌతుంది. అలాంటి క్రైస్తవులు ఎన్నడూ దురుసుగా మాట్లాడరు, ఇతరుల్ని కించపర్చరు, లేదా సరదాకి కూడా బాధపెట్టే మాటలు అనరు. వాళ్లు హానికరమైన పుకార్లు వ్యాప్తిచేసే బదులు తమ నాలుకను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తారు. (సామె. 12:18) ఫలితంగా, సంఘమంతా యెహోవాను సంతోషంగా సేవిస్తుంది.
అవును! దయ మాటల్లో, చేతల్లో చూపించాల్సిన లక్షణం. మనం దయ చూపిస్తే యెహోవాలా ఆప్యాయంగా, ఉదారంగా ఉంటాం. (ఎఫె. 5:1) దానివల్ల సంఘాలు బలపడతాయి, ఇతరులు సత్యారాధనకు ఆకర్షితులౌతారు. కాబట్టి మనం ఎప్పుడూ దయగా ఉంటామనే పేరు తెచ్చుకుందాం!
a పవిత్రశక్తి పుట్టించే లక్షణాల గురించి చర్చించే తొమ్మిది ఆర్టికల్స్‌లో త్వరలో మంచితనం గురించి చూస్తాం.