అధ్యయన ఆర్టికల్ 19
చెడుతనం మధ్య ప్రేమ, న్యాయం
“నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీయొద్ద చోటులేదు.” —కీర్త. 5:4.
పాట 142 మన నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం
ఈ ఆర్టికల్‌లో . . .a
1-3. (ఎ) కీర్తన 5:4-6 ప్రకారం చెడుతనం గురించి యెహోవా ఎలా భావిస్తాడు? (బి) పిల్లలపై లైంగిక దాడి ‘క్రీస్తు శాసనానికి’ పూర్తి విరుద్ధమైనదని ఎందుకు చెప్పవచ్చు?
యెహోవా దేవుడు అన్నిరకాల చెడుతనాన్ని అసహ్యించుకుంటున్నాడు. (కీర్తన 5:4-6 చదవండి.) పిల్లలపై జరిగే లైంగిక దాడుల్ని ఆయన ఖచ్చితంగా అసహ్యించుకుంటాడు. ఎందుకంటే అది చాలా ఘోరమైన, అసహ్యమైన పాపం! యెహోవాసాక్షులముగా, మనం యెహోవాను అనుకరిస్తూ పిల్లలపై జరిగే లైంగిక దాడుల్ని అసహ్యించుకుంటాం. క్రైస్తవ సంఘంలో అలాంటి పనుల్ని మనం సహించం.—రోమా. 12:9; హెబ్రీ. 12:15, 16.
2 పిల్లలపై లైంగిక దాడి ‘క్రీస్తు శాసనానికి’ పూర్తి విరుద్ధమైనది! (గల. 6:2) అలాగని ఎందుకు చెప్పవచ్చు? ముందటి ఆర్టికల్‌లో మనం నేర్చుకున్నట్లు, యేసు తన మాటల ద్వారా, ఆదర్శం ద్వారా బోధించినవన్నీ ఉన్న క్రీస్తు శాసనం ప్రేమ మీద ఆధారపడింది, అది న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. నిజక్రైస్తవులు ఈ శాసనానికి లోబడతారు కాబట్టి, తమను కాపాడేవాళ్లు, ప్రేమించేవాళ్లు ఉన్నారని పిల్లలు భావించేలా ప్రవర్తిస్తారు. అయితే లైంగిక దాడి స్వార్థపూరితమైనది, అన్యాయమైనది. ఆ దాడికి గురైన పిల్లలు తమను కాపాడేవాళ్లు, ప్రేమించేవాళ్లు ఎవరూ లేరన్నట్లు భావిస్తారు.
3 విచారకరమైన విషయమేమిటంటే, పిల్లలపై జరిగే లైంగిక దాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక మహమ్మారి. నిజక్రైస్తవులు కూడా దానికి గురయ్యారు. ఎందుకు? “దుష్టులు, మోసగాళ్లు” ఎక్కువైపోయారు, అలాంటివాళ్లలో కొంతమంది సంఘంలోకి చొరబడాలని కూడా ప్రయత్నించవచ్చు. (2 తిమో. 3:13) దానికితోడు, సంఘంలో భాగమని చెప్పుకునే కొంతమంది తప్పుడు కోరికలకు లొంగిపోయి, పిల్లలపై లైంగిక దాడి చేశారు. అయితే, అది ఎందుకు ఘోరమైన పాపమో ఇప్పుడు చర్చిద్దాం. ఆ తర్వాత, సంఘంలో ఎవరైనా లైంగిక దాడి చేయడం లేదా ఇంకేదైనా గంభీరమైన పాపం చేస్తే పెద్దలు ఏం చేస్తారో పరిశీలిద్దాం. అంతేకాదు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవచ్చో కూడా పరిశీలిద్దాం.b
ఘోరమైన పాపం
4-5. లైంగిక దాడి అనేది బాధితులకు వ్యతిరేకంగా చేసే పాపమని ఎందుకు చెప్పవచ్చు?
4 లైంగిక దాడి వల్ల కలిగే పర్యవసానాలు చాలాకాలంపాటు ఉంటాయి. అది దాడికి గురైన పిల్లల మీదే కాదు, వాళ్లను ప్రేమించే కుటుంబ సభ్యుల మీద, సహోదరసహోదరీల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే పిల్లలపై లైంగిక దాడి ఘోరమైన పాపం.
5 అది బాధితులకు వ్యతిరేకంగా చేసే పాపం.c ఇతరుల్ని అన్యాయంగా గాయపర్చడం, బాధపెట్టడం పాపం. మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబోతున్నట్లు, పిల్లలపై లైంగిక దాడి చేసే వ్యక్తి సరిగ్గా అదే చేస్తాడు. అతను చాలా ఘోరమైన విధాలుగా పిల్లల్ని గాయపరుస్తాడు. పిల్లలకు భద్రత లేకుండా చేసి వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేస్తాడు. అలాంటి తప్పుడు పనుల నుండి మనం పిల్లల్ని కాపాడాలి. పిల్లలు ఒకవేళ లైంగిక దాడికి గురైతే వాళ్లకు ఓదార్పు, సహాయం అవసరం.—1 థెస్స. 5:14.
6-7. పిల్లలపై లైంగిక దాడి సంఘానికి అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పాపమని ఎందుకు చెప్పవచ్చు?
6 అది సంఘానికి వ్యతిరేకంగా చేసే పాపం. సంఘంలో ఒకవ్యక్తి పిల్లలపై లైంగిక దాడిచేస్తే, అతను లేదా ఆమె సంఘానికి చెడ్డపేరు తీసుకొస్తారు. (మత్త. 5:16; 1 పేతు. 2:12) అలా “విశ్వాసం కోసం గట్టిగా” పోరాడుతూ ఉన్న లక్షలమంది నమ్మకమైన క్రైస్తవులకు ద్రోహం చేస్తారు! (యూదా 3) అందుకే, పశ్చాత్తాపం చూపించకుండా చెడ్డపనులు చేసేవాళ్లను, సంఘం పేరును పాడు చేసేవాళ్లను సంఘంలో కొనసాగడానికి మనం అనుమతించం.
7 అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పాపం. క్రైస్తవులు “పై అధికారాలకు లోబడి ఉండాలి.” (రోమా. 13:1) మన దేశ చట్టాల్ని గౌరవించి, వాటిని పాటించడం ద్వారా మనం అలా లోబడతాం. ఒకవేళ సంఘంలో ఎవరైనా పిల్లలపై లైంగిక దాడి లాంటి చట్టవిరుద్ధమైన పని చేస్తే, అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాపం చేసినట్టే. (అపొస్తలుల కార్యాలు 25:8 పోల్చండి.) చట్టాన్ని మీరే అలాంటివాళ్లను శిక్షించే అధికారం సంఘపెద్దలకు లేదు, అలాగని లైంగిక దాడి చేసిన వ్యక్తికి చట్టప్రకారం శిక్ష పడకుండా వాళ్లు కాపాడరు. (రోమా. 13:4) పాపం చేసిన వ్యక్తి తాను విత్తిన పంటనే కోస్తాడు.—గల. 6:7.
8. సాటిమనిషికి వ్యతిరేకంగా చేసే పాపాల్ని యెహోవా ఎలా చూస్తాడు?
8 అన్నిటికన్నా ముఖ్యంగా, అది దేవునికి వ్యతిరేకంగా చేసే పాపం. (ఆది. 39:9) ఒకవ్యక్తి సాటిమనిషికి వ్యతిరేకంగా పాపం చేస్తే, అతను యెహోవాకు వ్యతిరేకంగా కూడా పాపం చేసినట్లే. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఉదాహరణ పరిశీలించండి. ఒకవ్యక్తి తన పొరుగువాణ్ణి దోచుకుంటే లేదా మోసం చేస్తే అతను “యెహోవాకు విరోధముగా ద్రోహం” చేసినట్లే. (లేవీ. 6:2-4) అదేవిధంగా, సంఘంలో ఒకవ్యక్తి పిల్లలపై లైంగిక దాడి చేసినప్పుడు, వాళ్ల భద్రతను దోచుకుంటాడు కాబట్టి అతను దేవునికి నమ్మకద్రోహం చేసినట్లే. అలాంటివ్యక్తి యెహోవాకు చాలా చెడ్డపేరు తీసుకొస్తాడు. అందుకే, పిల్లలపై లైంగిక దాడి అనేది దేవునికి వ్యతిరేకంగా చేసే అసహ్యకరమైన పాపమని గుర్తించాలి, దాన్ని ఖండించాలి.
9. ఎన్నో సంవత్సరాలుగా యెహోవా సంస్థ ఏ లేఖనాధారిత సమాచారాన్ని ఇస్తూ ఉంది? ఎందుకు?
9 పిల్లలపై జరిగే లైంగిక దాడులకు సంబంధించి యెహోవా సంస్థ చాలా సంవత్సరాలుగా ఎంతో లేఖనాధారిత సమాచారాన్ని ప్రచురిస్తూ ఉంది. ఉదాహరణకు, లైంగిక దాడికి గురైనవాళ్లు మానసిక క్షోభను ఎలా తట్టుకోవచ్చో, అలాంటివాళ్లకు ఇతరులు ఎలా సహాయాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వవచ్చో, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా కాపాడవచ్చో కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని ఆర్టికల్స్ చర్చించాయి. సంఘంలో ఎవరైనా లైంగిక దాడికి పాల్పడితే ఏం చేయాలో సంస్థ సంఘపెద్దలకు చక్కని లేఖనాధారిత శిక్షణ ఇచ్చింది. అంతేకాదు, అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో పెద్దలకు ఇచ్చే నిర్దేశాల్ని సంస్థ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది, కొన్నిసార్లు ఆ నిర్దేశాల్లో మార్పులు కూడా చేస్తుంది. ఎందుకంటే, పిల్లలపై లైంగిక దాడి జరిగినప్పుడు, పెద్దలు క్రీస్తు శాసనానికి అనుగుణంగా ప్రవర్తించేలా, ప్రేమగా, న్యాయంగా వ్యవహరించేలా చేయడానికే సంస్థ అలా చేస్తుంది.
ఎవరైనా గంభీరమైన పాపం చేసినప్పుడు సంఘపెద్దలు ఏం చేస్తారు?
10-12. (ఎ) ఏదైనా గంభీరమైన పాపం జరిగితే పెద్దలు దేన్ని మనసులో పెట్టుకుంటారు? వాళ్లు వేటిగురించి ఆలోచిస్తారు? (బి) యాకోబు 5:14, 15 ప్రకారం పెద్దలు ఏం చేయడానికి కృషి చేస్తారు?
10 ఏదైనా గంభీరమైన పాపం జరిగితే పెద్దలు క్రీస్తు శాసనాన్ని మనసులో పెట్టుకొని, సంఘంలోని వాళ్లతో ప్రేమగా వ్యవహరిస్తారు, దేవుని దృష్టిలో సరైనది, న్యాయమైనది చేస్తారు. కాబట్టి, ఎవరైనా గంభీరమైన పాపం చేశారని తెలిసినప్పుడు పెద్దలు చాలా విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తారు. వాళ్లు ముఖ్యంగా యెహోవా పేరుకున్న పవిత్రతను కాపాడడం గురించి ఆలోచిస్తారు. (లేవీ. 22:31, 32; మత్త. 6:9) అంతేకాదు, వాళ్లు సంఘంలోని సహోదరసహోదరీల ఆధ్యాత్మిక సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తారు. గంభీరమైన పాపం వల్ల నష్టపోయిన సహోదరసహోదరీలకు ఓదార్పును, మద్దతును ఇస్తారు.
11 వీటితోపాటు, పాపం చేసిన వ్యక్తి సంఘంలో ఒకరైతే, అతను ఒకవేళ నిజంగా పశ్చాత్తాపపడితే అతను మళ్లీ యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేయడానికి పెద్దలు ప్రయత్నిస్తారు. (యాకోబు 5:14, 15 చదవండి.) తప్పుడు కోరికలకు లొంగిపోయి, గంభీరమైన పాపం చేసిన క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా రోగితో సమానం. అంటే యెహోవాతో అతనికి ఇక ఏమాత్రం ఆరోగ్యకరమైన సంబంధం లేదని అర్థం.d పెద్దలు ఒకవిధంగా ఆధ్యాత్మిక డాక్టర్లని చెప్పవచ్చు. వాళ్లు ‘రోగిని [ఈ సందర్భంలో, పాపం చేసిన వ్యక్తిని] బాగుచేయడానికి’ కృషిచేస్తారు. వాళ్లు ఇచ్చే బైబిలు ఆధారిత సలహా, తప్పుచేసిన వ్యక్తి దేవునితో తన సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకునేలా సహాయం చేస్తుంది. అయితే పాపం చేసిన వ్యక్తి నిజమైన పశ్చాత్తాపం చూపిస్తేనే ఇది సాధ్యమౌతుంది.—అపొ. 3:19; 2 కొరిం. 2:5-10.
12 కాబట్టి సంఘపెద్దలకు ప్రాముఖ్యమైన బాధ్యత ఉందని స్పష్టంగా అర్థమౌతుంది. వాళ్లు దేవుడు తమకు అప్పగించిన మందను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. (1 పేతు. 5:1-3) సహోదరసహోదరీలు సంఘంలో సురక్షితంగా ఉన్నట్లు భావించాలని వాళ్లు కోరుకుంటారు. అందుకే పిల్లలపై లైంగిక దాడి వంటి ఏదైనా గంభీరమైన పాపం జరిగిందని తెలిస్తే పెద్దలు వెంటనే చర్య తీసుకుంటారు. వాళ్లు ఏం చేస్తారో తెలుసుకోవడానికి 13, 15, 17 పేరాల ప్రారంభంలో ఉన్న ప్రశ్నల్ని పరిశీలించండి.
13-14. పిల్లలపై లైంగిక దాడి జరిగితే, దాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలనే చట్టానికి పెద్దలు లోబడతారా? వివరించండి.
13 పిల్లలపై లైంగిక దాడి జరిగితే, దాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలనే చట్టానికి పెద్దలు లోబడతారా? తప్పకుండా. ఏయే దేశాల్లో అలాంటి చట్టం ఉందో, ఆ దేశాల్లో లైంగిక దాడి జరిగినప్పుడు, దాన్ని అధికారులకు తెలియజేయాలనే ప్రభుత్వ చట్టాలకు లోబడడానికి పెద్దలు కృషిచేస్తారు. (రోమా. 13:1) అలాంటి చట్టాలు దేవుని నియమానికి విరుద్ధమైనవి కావు. (అపొ. 5:28, 29) కాబట్టి, పిల్లలపై లైంగిక దాడి జరిగిందని తెలిస్తే, ఆ దాడి గురించి అధికారులకు తెలియజేయాలనే చట్టాలకు ఎలా లోబడాలో తెలుసుకోవడానికి పెద్దలు వెంటనే బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదిస్తారు.
14 జరిగిన దాడి గురించి అధికారులకు చెప్పే హక్కు బాధితులకు, వాళ్ల తల్లిదండ్రులకు, ఆ విషయం తెలిసిన మిగతావాళ్లకు ఉంటుందని సంఘపెద్దలు అభయమిస్తారు. ఒకవేళ అలా అధికారులకు చెప్పాల్సింది సంఘంలోని వ్యక్తి గురించే అయితే? దానిగురించి చుట్టుపక్కల వాళ్లందరికీ తెలిస్తే, అప్పుడేంటి? అలా చెప్పడం వల్ల యెహోవా పేరుకు మచ్చ తీసుకొచ్చానని ఒక క్రైస్తవుడు అనుకోవాలా? లేదు. నిజానికి లైంగిక దాడి చేసిన వ్యక్తే యెహోవా పేరుకు మచ్చ తీసుకొస్తాడు.
15-16. (ఎ) 1 తిమోతి 5:19 ప్రకారం, పెద్దలు న్యాయపరమైన చర్య తీసుకోవడానికి కనీసం ఇద్దరు సాక్షులు ఎందుకు ఉండాలి? (బి) సంఘంలో ఎవరైనా పిల్లలపై లైంగిక దాడి చేశారని తెలిస్తే, పెద్దలు ఏం చేస్తారు?
15 సంఘంలో, పెద్దలు న్యాయపరమైన చర్యలు తీసుకునే ముందు ఎందుకు ఇద్దరు సాక్షులు అవసరం? ఎందుకంటే, అదే న్యాయమని బైబిలు చెప్తుంది. ఒకవ్యక్తి తప్పు చేశానని ఒప్పుకోకపోతే, అతను తప్పు చేశాడని నిర్ధారించడానికి, పెద్దలు న్యాయపరమైన చర్య తీసుకోవడానికి కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి. (ద్వితీ. 19:15; మత్త. 18:16; 1 తిమోతి 5:19 చదవండి.) మరి, లైంగిక దాడి జరిగిందని ప్రభుత్వ అధికారులకు చెప్పాలన్నా ఇద్దరు సాక్షులు ఉండాలా? లేదు. పెద్దలు గానీ మరితరులు గానీ జరిగిన నేరం గురించి అధికారులకు చెప్పడానికి ఇద్దరు సాక్షులు ఉండాల్సిన అవసరంలేదు.
16 సంఘంలో ఎవరైనా పిల్లలపై లైంగిక దాడి చేశారని తెలిస్తే, ఆ విషయాన్ని అధికారులకు తెలియజేయాలనే చట్టాలకు పెద్దలు లోబడడానికి కృషిచేస్తారు. ఆ తర్వాత, జరిగిన దానిగురించి విచారణ చేస్తారు. ఒకవేళ నిందితుడు తప్పును ఒప్పుకోకపోతే, పెద్దలు సాక్షులు చెప్పే సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు. తప్పు జరిగిందని ఆరోపించే వ్యక్తి అలాగే కనీసం ఇంకొక్క వ్యక్తి, నిందితుడు ఆ లైంగిక దాడి చేశాడని గానీ గతంలో వేరే పిల్లల్ని లైంగికంగా వేధించాడని గానీ చెప్తే పెద్దలు న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేస్తారు.e అయితే, జరిగిన దానికి రెండో సాక్షి లేనంత మాత్రాన ఆరోపణ చేసిన వ్యక్తి అబద్ధం చెప్తున్నట్లు కాదు. తప్పు జరిగిందని నిర్ధారించడానికి ఒకవేళ ఇద్దరు సాక్షులు లేకపోయినా, నిందితుడు ఇతరుల్ని బాగా గాయపర్చే ఏదో గంభీరమైన పాపం చేసివుంటాడని పెద్దలు గుర్తిస్తారు. గాయపడిన వ్యక్తికి పెద్దలు కావాల్సిన మద్దతును ఇస్తూనే ఉంటారు. అంతేకాదు, ముందుముందు సంఘంలో అలాంటి సంఘటనలు జరగకుండా కాపాడడానికి పెద్దలు ఆ నిందితుణ్ణి ఓ కంట కనిపెడుతూ ఉంటారు.—అపొ. 20:28.
17-18. న్యాయనిర్ణయ కమిటీ పాత్ర ఏంటో వివరించండి.
17 న్యాయనిర్ణయ కమిటీ పాత్ర ఏంటి? “న్యాయనిర్ణయ” అనే పదం, చట్టాన్ని మీరినందుకు నిందితుడికి చట్టరీత్యా శిక్ష పడాలా వద్దా అని పెద్దలు తీర్పుతీరుస్తారని గానీ నిర్ణయిస్తారని గానీ సూచించట్లేదు. చట్టాన్ని అమలు చేయడంలో పెద్దలు జోక్యం చేసుకోరు; వాళ్లు అలాంటి నేరాల్ని ప్రభుత్వ అధికారులకే వదిలేస్తారు. (రోమా. 13:2-4; తీతు 3:1) బదులుగా, ఒకవ్యక్తి సంఘంలో ఉండాలా వద్దా అనేదే సంఘపెద్దలు తీర్పుతీరుస్తారు లేదా నిర్ణయిస్తారు.
18 న్యాయనిర్ణయ కమిటీలో పనిచేసే పెద్దలు, మతపరమైన విషయాల్లో మాత్రమే తీర్పుతీరుస్తారు. వాళ్లు బైబిలు సహాయంతో, నిందితుడు పశ్చాత్తాపపడ్డాడో లేదో నిర్ణయిస్తారు. ఒకవేళ పశ్చాత్తాపపడకపోతే, అతన్ని సంఘం నుండి బహిష్కరిస్తారు, దానిగురించి సంఘంలో ప్రకటన కూడా చేస్తారు. (1 కొరిం. 5:11-13) ఒకవేళ అతను పశ్చాత్తాపపడితే సంఘంలో కొనసాగవచ్చు. కానీ, అతను సంఘంలో బాధ్యతలు పొందడానికి లేదా నియమిత స్థానంలో సేవచేయడానికి ఎన్నడూ అర్హుడు కాకపోవచ్చని పెద్దలు అతనికి చెప్తారు. పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, చిన్నపిల్లలు ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్నప్పుడు వాళ్లను జాగ్రత్తగా గమనిస్తూ ఉండమని పెద్దలు తల్లిదండ్రుల్ని హెచ్చరించవచ్చు. పెద్దలు అలాంటి జాగ్రత్తలు చెప్పేటప్పుడు, ఎవరెవరు లైంగిక దాడికి గురయ్యారో బయటకు చెప్పరు.
మీ పిల్లల్ని ఎలా కాపాడుకోవచ్చు?
తల్లిదండ్రులు పిల్లల వయసుకు తగ్గట్టుగా వాళ్లకు సెక్స్ గురించిన విషయాలు చెప్పడం ద్వారా వాళ్లను లైంగిక దాడుల నుండి కాపాడతారు. అందుకోసం, దేవుని సంస్థ అందించిన సమాచారాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకుంటారు. (19-22 పేరాలు చూడండి)
19-22. పిల్లల్ని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయవచ్చు? (ముఖచిత్రం చూడండి.)
19 పిల్లలకు ఏ హానీ జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది.f మీ పిల్లలు యెహోవా మీకిచ్చిన బహుమతులు, ఆయనిచ్చిన “స్వాస్థ్యము.” (కీర్త. 127:3) వాళ్లను కాపాడాల్సిన బాధ్యత మీదే. మరి లైంగిక దాడుల నుండి మీ పిల్లల్ని కాపాడుకోవడానికి మీరేం చేయవచ్చు?
20 మొదటిగా, లైంగిక దాడుల గురించి మీరు తెలుసుకోండి. ఎలాంటివాళ్లు పిల్లలపై లైంగిక దాడులు చేస్తారో, వాళ్లు పిల్లల్ని మోసం చేయడానికి ఎలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఎలాంటి పరిస్థితుల వల్ల లేదా ఎలాంటి వ్యక్తుల వల్ల ప్రమాదాలు జరగవచ్చో ముందే పసిగట్టండి. (సామె. 22:3; 24:3) చాలా సందర్భాల్లో పిల్లలకు బాగా తెలిసినవాళ్లు, పిల్లలు నమ్మినవాళ్లే వాళ్లపై లైంగిక దాడి చేస్తారని గుర్తుపెట్టుకోండి.
21 రెండోదిగా, మీ పిల్లలతో చక్కగా సంభాషించండి, వాళ్లను మనసువిప్పి మాట్లాడమని ప్రోత్సహించండి. (ద్వితీ. 6:6, 7) అంటే, మీ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. (యాకో. 1:19) తమకు జరిగిన లైంగిక దాడి గురించి చెప్పడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరని గుర్తుంచుకోండి. తాము చెప్పేది ఇతరులు నమ్మరని వాళ్లు భయపడవచ్చు, లేదా దానిగురించి ఎవరికీ చెప్పొద్దని లైంగిక దాడి చేసిన వ్యక్తి బెదిరించి ఉండవచ్చు. ఒకవేళ మీ పిల్లల్లో ఏమైనా తేడా గమనిస్తే, వాళ్లను దయగా ప్రశ్నలు అడిగి, వాళ్లు చెప్పేది ఓపిగ్గా వినండి.
22 మూడోదిగా, మీ పిల్లలకు నేర్పించండి. మీ పిల్లల వయసుకు, అవగాహనకు తగ్గట్టు సెక్స్ గురించి చెప్పండి. ఎవరైనా వాళ్లను ముట్టుకోకూడని చోట ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఏం అనాలో, ఏం చేయాలో పిల్లలకు నేర్పించండి. మీ పిల్లల్ని కాపాడుకునే విషయంలో దేవుని సంస్థ ఇచ్చిన సమాచారాన్ని చక్కగా ఉపయోగించండి.—“మీరు తెలుసుకోండి, మీ పిల్లలకు నేర్పించండి” అనే బాక్సు చూడండి.
23. పిల్లలపై జరిగే లైంగిక దాడుల్ని మనమెలా పరిగణిస్తాం? తర్వాతి ఆర్టికల్‌లో ఏ ప్రశ్న గురించి పరిశీలిస్తాం?
23 మనం యెహోవాసాక్షులముగా, పిల్లలపై జరిగే లైంగిక దాడిని ఒక గంభీరమైన పాపంగా, అసహ్యకరమైన నేరంగా పరిగణిస్తాం. మన సంఘాలు క్రీస్తు శాసనానికి లోబడతాయి కాబట్టి, పిల్లలపై లైంగిక దాడి చేసిన వ్యక్తి దానికి తగిన పర్యవసానాల్ని అనుభవించకుండా అతన్ని కాపాడవు. అయితే, అలాంటి దాడికి గురైనవాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు? ఈ ప్రశ్న గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
పాట 103 కాపరులు మనుషుల్లో వరాలు
a లైంగిక దాడుల నుండి పిల్లల్ని ఎలా కాపాడవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాదు పెద్దలు సంఘాన్ని ఎలా కాపాడతారో, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా కాపాడవచ్చో కూడా చూస్తాం.
b పదాల వివరణ: పెద్దవాళ్లు తమ లైంగిక కోరికల్ని తీర్చుకోవడానికి పిల్లలతో చేసే ఏ పనైనా లైంగిక దాడే అవుతుంది. పిల్లలతో సెక్స్ చేయడం, ఓరల్ సెక్స్, ఆనల్ సెక్స్, మర్మాంగాలను, రొమ్ముల్ని, లేదా పిరుదుల్ని నిమరడం, లేదా అలాంటి ఇతర దిగజారుడు పనులు లైంగిక దాడిలో భాగమే. లైంగిక దాడికి గురైనవాళ్లలో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నప్పటికీ, చాలామంది అబ్బాయిలు కూడా లైంగిక దాడికి గురౌతుంటారు. లైంగిక దాడి చేసేవాళ్లు ఎక్కువగా పురుషులే అయినప్పటికీ, కొంతమంది స్త్రీలు కూడా అలాంటి పనులు చేస్తారు.
c పదాల వివరణ: ఈ ఆర్టికల్‌లో అలాగే తర్వాతి ఆర్టికల్‌లో ఉపయోగించబడిన “బాధితులు” అనే పదం, చిన్నప్పుడే లైంగిక దాడికి గురైనవాళ్లను సూచిస్తుంది. ఆ దాడికి గురైన అబ్బాయికి లేదా అమ్మాయికి హాని జరిగిందని, వాళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నారని, జరిగిన దాంట్లో పిల్లల తప్పు ఏమీ లేదని స్పష్టం చేయడానికి ఆ పదం ఉపయోగించబడింది.
d ఘోరమైన పాపం చేయడానికి ఆధ్యాత్మిక అనారోగ్యం సాకు కాదు. పాపం చేసిన వ్యక్తి తన తప్పుడు నిర్ణయాలకు, పనులకు పూర్తిగా బాధ్యత వహించాలి, అంతేకాదు యెహోవాకు లెక్క అప్పజెప్పాలి.—రోమా. 14:12.
e లైంగిక దాడి చేశాడని ఆరోపించబడిన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, సంఘపెద్దలు లైంగిక దాడికి గురైన పాపను లేదా బాబును అక్కడ ఉండమని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. జరిగిన దాడి గురించిన వివరాల్ని తల్లిదండ్రులు లేదా నమ్మకస్థుడైన వేరే వ్యక్తి సంఘపెద్దలకు చెప్పవచ్చు. ఆ విధంగా, పిల్లలకు మరింత మానసిక క్షోభ కలగకుండా కాపాడవచ్చు.
f ఈ సమాచారం తల్లిదండ్రులకే కాదు, పిల్లల్ని పెంచే బాధ్యత తీసుకున్నవాళ్లకు కూడా వర్తిస్తుంది.