అధ్యయన ఆర్టికల్ 26
ఒత్తిడిని తట్టుకునేలా ఇతరులకు సహాయం చేయండి
“మీరందరూ ఏకమనస్సు కలిగివుండండి; సహానుభూతిని, సోదర ప్రేమను, వాత్సల్యాన్ని, వినయాన్ని చూపించండి.”—1 పేతు. 3:8.
పాట 107 దేవునిలా ప్రేమ చూపిద్దాం
ఈ ఆర్టికల్‌లో . . .a
1. ప్రేమగల తండ్రి అయిన యెహోవాను మనమెలా అనుకరించవచ్చు?
యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. (యోహా. 3:16) మనం మన ప్రేమగల తండ్రిని అనుకరించాలనుకుంటాం. కాబట్టి అందరిపట్ల, ముఖ్యంగా “తోటి విశ్వాసుల” పట్ల “సహానుభూతిని, సోదర ప్రేమను, వాత్సల్యాన్ని” చూపిస్తాం. (1 పేతు. 3:8; గల. 6:10) ఒత్తిళ్లు అనుభవిస్తున్న సహోదరసహోదరీలకు సహాయం చేస్తాం.
2. ఈ ఆర్టికల్‌లో మనం ఏం పరిశీలిస్తాం?
2 యెహోవా కుటుంబంలో ఉండాలనుకునే వాళ్లందరూ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. (మార్కు 10:29, 30) ఈ వ్యవస్థ అంతమయ్యే సమయం దగ్గర పడుతుండగా మనం ఇంకా ఎన్నో కష్టాల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. మరి మనం ఒకరికొకరం ఎలా సహాయం చేసుకోవచ్చు? లోతు, యోబు, నయోమి గురించిన బైబిలు వృత్తాంతాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం. అంతేకాదు, నేడు మన సహోదరసహోదరీలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు ఏంటో, వాటిని తట్టుకోవడానికి వాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చో చర్చిద్దాం.
ఓర్పు చూపించండి
3. రెండో పేతురు 2:7, 8 చెప్తున్నట్లు లోతు తీసుకున్న చెడ్డ నిర్ణయం ఏంటి? దానికి ఎలాంటి ఫలితం వచ్చింది?
3 లోతు, విపరీతమైన అనైతికత ఉండే సొదొమలో నివసించాలనే చెడ్డ నిర్ణయం తీసుకున్నాడు. (2 పేతురు 2:7, 8 చదవండి.) అది ఫలవంతమైన ప్రాంతమే అయినప్పటికీ అక్కడ నివసించడం వల్ల ఆయన కష్టాలపాలయ్యాడు. (ఆది. 13:8-13; 14:12) లోతు భార్య ఆ నగరాన్ని లేదా అక్కడున్న వాళ్లను బాగా ఇష్టపడివుంటుంది, అందుకే యెహోవాకు అవిధేయత చూపించింది. దేవుడు ఆ నగరాన్ని అగ్నిగంధకాలతో నాశనం చేసినప్పుడు ఆమె కూడా చనిపోయింది. లోతు ఇద్దరు కూతుళ్లకు కాబోయే భర్తలు కూడా సొదొమతోపాటు నాశనమయ్యారు. లోతు తన ఇంటిని, ఆస్తుల్ని, ఆఖరికి భార్యను కూడా పోగొట్టుకున్నాడు. (ఆది. 19:12-14, 17, 26) మరి లోతు విషయంలో యెహోవాకు ఓర్పు నశించిందా? లేదు.
యెహోవా కనికరంతో లోతును, ఆయన కుటుంబాన్ని కాపాడడానికి దేవదూతల్ని పంపించాడు (4వ పేరా చూడండి)
4. లోతు విషయంలో యెహోవా ఎలా ఓర్పు చూపించాడు? (ముఖచిత్రం చూడండి.)
4 సొదొమలో నివసించాలని నిర్ణయించుకున్న లోతు మీద యెహోవా కనికరం చూపించాడు. అందుకే ఆయన్ని, ఆయన కుటుంబాన్ని కాపాడడానికి దేవదూతల్ని పంపించాడు. వాళ్లు లోతును సొదొమ విడిచి వెంటనే వెళ్లిపోమని చెప్పినా ఆయన ‘తడవు చేశాడు.’ దాంతో వాళ్లే ఆయన చెయ్యి పట్టుకొని ఆయన్ని, ఆయన కుటుంబాన్ని ఆ నగరం నుండి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. (ఆది. 19:15, 16) తర్వాత ఆయన్ని కొండ ప్రాంతానికి పారిపొమ్మని చెప్పారు. కానీ లోతు ఆ దగ్గర్లో ఉన్న మరో పట్టణానికి పారిపోతానని యెహోవాను అడిగాడు. (ఆది. 19:17-20) యెహోవా లోతు చెప్పేది ఓపిగ్గా విన్నాడు, ఆ ప్రాంతానికి పారిపోయేలా అనుమతించాడు. కానీ తర్వాత లోతు ఆ పట్టణంలో ఉండడానికి భయపడి, అంతకుముందు యెహోవా చూపించిన కొండ ప్రాంతానికే వెళ్లిపోయాడు. (ఆది. 19:30) యెహోవా ఎంత ఓర్పు చూపించాడో కదా! మరి యెహోవాను మనమెలా అనుకరించవచ్చు?
5-6. మనం యెహోవాను అనుకరించడానికి 1 థెస్సలొనీకయులు 5:14 ఎలా సహాయం చేస్తుంది?
5 లోతులాగే మన తోటి సహోదరసహోదరీలు ఎవరైనా చెడ్డ నిర్ణయాలు తీసుకొని, తీవ్రమైన సమస్యలు కొనితెచ్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే, తీసుకున్న నిర్ణయాలకు తగిన పర్యవసానాలనే ఎదుర్కొంటున్నారని వాళ్లతో చెప్పాలనిపించవచ్చు. నిజమే, వాళ్లు ఏం విత్తారో అదే కోస్తున్నారు. (గల. 6:7) కానీ అలా మాట్లాడడం కన్నా, యెహోవా లోతుకు సహాయం చేసినట్టే మనం వాళ్లకు సహాయం చేస్తే బాగుంటుంది. ఏవిధంగా?
6 యెహోవా లోతు దగ్గరకు దేవదూతల్ని పంపించి సొదొమ నాశనమౌతుందని కేవలం హెచ్చరించడమే కాదు, ఆ నాశనాన్ని తప్పించుకోవడానికి సహాయం కూడా చేశాడు. అదేవిధంగా, మన సహోదరుడు సమస్యలు కొనితెచ్చుకునేలా ఉంటే అతన్ని హెచ్చరించవచ్చు, సహాయం కూడా చేయవచ్చు. ఒకవేళ అతనికి ఇవ్వబడిన బైబిలు సలహాను వెంటనే పాటించకపోయినా ఆ దేవదూతల్లాగే మనం కూడా ఓర్పు చూపించాలి. అంతేకాదు మన మాటల ద్వారా, పనుల ద్వారా అతనికి సహాయం చేస్తూనే ఉండాలి. (1 యోహా. 3:18) ఒకవిధంగా చెప్పాలంటే, అతనికి ఇవ్వబడిన జ్ఞానయుక్తమైన సలహాను పాటించేలా అతన్ని చెయ్యి పట్టి నడిపించాల్సి రావచ్చు.—1 థెస్సలొనీకయులు 5:14 చదవండి.
7. యెహోవా లోతును చూసినట్లు, మనం ఇతరుల్ని చూడాలంటే ఏం చేయాలి?
7 యెహోవాకు లోతు అపరిపూర్ణతల మీద మనసు పెట్టే అవకాశం ఉన్నా, అలా చేయలేదు. బదులుగా లోతు “నీతిమంతుడు” అని రాసేలా అపొస్తలుడైన పేతురును ప్రేరేపించాడు. యెహోవా మన తప్పుల్ని క్షమిస్తున్నాడని తెలుసుకోవడం ఎంత సంతోషాన్నిస్తుందో కదా! (కీర్త. 130:3) యెహోవా లోతును చూసినట్లు, మనం ఇతరులను చూడగలమా? మనం తోటి సహోదరసహోదరీల్లోని మంచి లక్షణాల్ని చూడగలిగితే, వాళ్లతో మరింత ఓపిగ్గా వ్యవహరిస్తాం. అప్పుడు, మనం చేసే సహాయాన్ని స్వీకరించడం వాళ్లకు తేలికౌతుంది.
కనికరం చూపించండి
8. కనికరం ఉంటే ఏం చేస్తాం?
8 లోతు తీసుకున్నట్లు యోబు చెడ్డ నిర్ణయం తీసుకోలేదు, అయినప్పటికీ చాలా కష్టాలుపడ్డాడు. ఆయన వస్తుసంపదల్ని, హోదాను, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఆఖరికి ఆయన పిల్లలందరూ కూడా చనిపోయారు. యోబుకున్న ముగ్గురు కపట స్నేహితులు ఆయన్ని నిందించారు. వాళ్లు ఆయనపట్ల ఎందుకు కనికరం చూపించలేదు? ఒక కారణం ఏంటంటే, వాళ్లు ఆయన పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. అందుకే, వాళ్లు వెంటనే ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చి, యోబును దారుణంగా నిందించారు. మనం అలాంటి పొరపాటు చేయకుండా ఎలా ఉండవచ్చు? ఒక వ్యక్తి పరిస్థితి గురించిన పూర్తి వాస్తవాలు కేవలం యెహోవాకు మాత్రమే తెలుసని గుర్తించండి. బాధలో ఉన్న వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా వినండి. కేవలం వినడమే కాదు, వాళ్ల బాధను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ సహోదరుడి పట్ల లేదా సహోదరి పట్ల నిజమైన సహానుభూతి చూపించగలుగుతారు.
9. కనికరం ఉంటే ఏం చేయం? ఎందుకు?
9 మనకు కనికరం ఉంటే, ఇతరుల సమస్యల గురించి హానికరమైన పుకార్లు వ్యాప్తి చేయం. పుకార్లు వ్యాప్తిచేసే వ్యక్తి సంఘాన్ని బలపర్చడు గానీ విభజనలు సృష్టిస్తాడు. (సామె. 20:19; రోమా. 14:19) అతని అనాలోచితమైన మాటలు బాధపడుతున్న వ్యక్తిని మరింత గాయపర్చే అవకాశం ఉంది. (సామె. 12:18; ఎఫె. 4:31, 32) దానికి భిన్నంగా, మనం ఇతరుల్లోని మంచి లక్షణాల మీద దృష్టిపెడుతూ, కష్టాల్ని తట్టుకునేలా వాళ్లకెలా సహాయం చేయవచ్చో ఆలోచిస్తే ఎంత బాగుంటుందో కదా!
తోటి సహోదరుడు దురుసుగా, అనాలోచితంగా మాట్లాడుతుంటే ఓపిగ్గా వినండి; తర్వాత సరైన సమయం చూసి వాళ్లకు ఊరటనిచ్చేలా మాట్లాడండి (10-11 పేరాలు చూడండి)c
10. యోబు 6:2, 3లో ఉన్న మాటలు మనకు ఏ విషయాన్ని బోధిస్తున్నాయి?
10 యోబు 6:2, 3 చదవండి. యోబు కొన్నిసార్లు దురుసుగా, అనాలోచితంగా మాట్లాడాడు. కానీ తాను మాట్లాడిన కొన్ని మాటలు తప్పని తర్వాత ఒప్పుకున్నాడు. (యోబు 42:6) నేడు, యోబులాగే ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వ్యక్తి అనాలోచితంగా మాట్లాడి తర్వాత బాధపడవచ్చు. అలాంటప్పుడు మనం ఎలా స్పందించాలి? మనం అతన్ని విమర్శించే బదులు కనికరం చూపించాలి. నిజానికి, యెహోవా మనల్ని ఇలాంటి సమస్యలు, ఒత్తిళ్లు ఎదుర్కోవాలనే ఉద్దేశంతో సృష్టించలేదని గుర్తుంచుకోండి. కాబట్టి సహోదరసహోదరీలు ఎవరైనా బాగా ఒత్తిడికి గురైనప్పుడు అనాలోచితంగా మాట్లాడడం సహజమే. ఒకవేళ వాళ్లు యెహోవా గురించో, మన గురించో తప్పుగా మాట్లాడినా వాళ్లను కోప్పడకూడదు, వాళ్ల గురించి తప్పుడు అభిప్రాయానికి రాకూడదు.—సామె. 19:11.
11. సంఘపెద్దలు ఎలీహును ఎలా అనుకరించవచ్చు?
11 ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వాళ్లను కూడా కొన్నిసార్లు సరిదిద్దాల్సి ఉంటుంది లేదా వాళ్లకు అవసరమైన క్రమశిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. (గల. 6:1) మరి సంఘపెద్దలు దాన్ని ఎలా చేయవచ్చు? వాళ్లు ఎలీహును అనుకరించాలి. ఎలీహు యోబు మాట్లాడుతున్నప్పుడు ఎంతో సహానుభూతితో విన్నాడు. (యోబు 33:6, 7) అంతేకాదు యోబు ఆలోచనల్ని అర్థంచేసుకున్న తర్వాతే ఆయన్ని సరిదిద్దాడు. ఎలీహును అనుకరించే పెద్దలు కూడా ఇతరులు చెప్పేది జాగ్రత్తగా వింటారు, వాళ్ల పరిస్థితిని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే వాళ్లు ఇచ్చే సలహా ఎదుటివ్యక్తి హృదయాన్ని చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఊరటనిచ్చేలా మాట్లాడండి
12. భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయినప్పుడు నయోమికి ఎలా అనిపించింది?
12 నయోమి యెహోవాకు నమ్మకంగా ఉంది, ఆయన్ని ప్రేమించింది. కానీ భర్త, అలాగే ఇద్దరు కొడుకుల మరణం ఆమెను ఎంత బాధపెట్టిందంటే తన పేరును “మారా” అని మార్చుకోవాలనుకుంది. ఎందుకంటే ఆ పేరుకు “చేదు” అని అర్థం. (రూతు 1:3, 5, 20, అధస్సూచి, 21) కష్టాల్లో ఉన్న నయోమికి ఆమె కోడలు రూతు తోడుగా నిలిచింది. రూతు నయోమి అవసరాల్ని తీర్చడమే కాదు, ఆమెకు ఊరటనిచ్చేలా మాట్లాడింది. రూతు సరళమైన, హృదయపూర్వకమైన మాటల ద్వారా నయోమికి తన ప్రేమను, మద్దతును తెలియజేసింది.—రూతు 1:16, 17.
13. వివాహజతను కోల్పోయినవాళ్లకు మన మద్దతు ఎందుకు అవసరం?
13 మన సహోదరసహోదరీల్లో ఎవరైనా వివాహజతను కోల్పోతే వాళ్లకు మన మద్దతు అవసరం. భార్యాభర్తల్ని పక్కపక్కనే పెరిగిన రెండు చెట్లతో పోల్చవచ్చు. సంవత్సరాలు గడుస్తుండగా వాటి వేర్లు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోతాయి. వాటిలో ఒక చెట్టు చచ్చిపోతే, దాని ప్రభావం పక్కనున్న చెట్టు మీద కూడా పడుతుంది. అదేవిధంగా, మరణం అనే శత్రువు వివాహజతను బలితీసుకుంటే, తీవ్రమైన మానసిక వేదన చాలాకాలంపాటు ఉండవచ్చు. పౌలb అనే సహోదరి భర్త హఠాత్తుగా చనిపోయినప్పుడు ఆమెకు ఎలా అనిపించిందో చెప్తూ ఇలా అంది, “నా జీవితం తలకిందులైపోయింది, నాకు ఏ దిక్కూ లేనట్టు అనిపించింది. నా బెస్ట్ ఫ్రెండ్‌ని కోల్పోయాను. నేను నా భర్తతో అన్నీ చెప్పుకునేదాన్ని. ఆయన నా సంతోషాల్ని పంచుకునేవాడు, కష్టాల్లో అండగా నిలిచేవాడు, నా బాధల్ని చెప్పుకుంటే వినేవాడు. ఆయన చనిపోయినప్పుడు నాలో సగభాగాన్ని కోల్పోయినట్టు అనిపించింది.”
వివాహజతను కోల్పోయినవాళ్లకు మనం ఎలా మద్దతివ్వవచ్చు? (14-15 పేరాలు చూడండి)d
14-15. వివాహజతను కోల్పోయినవాళ్లకు మనం ఎలా ఊరటనివ్వవచ్చు?
14 వివాహజతను కోల్పోయినవాళ్లకు మనం ఎలా ఊరటనివ్వవచ్చు? మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే వాళ్లతో మాట్లాడడం. ఒకవేళ ఏం మాట్లాడాలో అర్థంకాకపోయినా, ఇబ్బందిగా అనిపించినా వాళ్లతో మాట్లాడడం అవసరం. పౌల ఇలా చెప్తుంది, “మరణం గురించి మాట్లాడడం ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుసు. పొరపాటున వాళ్ల మాటలు ఎదుటివ్యక్తిని బాధపెడతాయేమో అని వాళ్లు ఆందోళనపడతారు. కానీ వాళ్లు పొరపాటుగా మాట్లాడినా ఫర్వాలేదుగానీ అసలు ఏమీ మాట్లాడకపోతేనే ఎక్కువ బాధ కలుగుతుంది.” నిజమే, బాధలో ఉన్న వ్యక్తి మనం జ్ఞానయుక్తంగా మాట్లాడాలని ఆశించడు. పౌల ఏమంటుందంటే: “నా స్నేహితులు వచ్చి, ‘నీకు ఇలా జరిగినందుకు బాధగా ఉంది’ అని చెప్పిన చిన్నమాట నాకెంతో సంతోషాన్ని, ఊరటను ఇచ్చింది.”
15 విలియమ్ అనే సహోదరుని భార్య కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆయన ఇలా అంటున్నాడు, “నా భార్యలో ఉన్న మంచి లక్షణాల్ని ఇతరులు గుర్తుచేసుకున్నప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది; వాళ్లకు ఆమె మీద ఎంత ప్రేమ, గౌరవం ఉండేవో వాళ్ల మాటల్నిబట్టి తెలిసేది. అలాంటి మద్దతు నాకు చాలా సహాయం చేసింది. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, ఆమె నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి వాళ్ల మాటలు నాకు ఎంతో ఊరటగా అనిపిస్తాయి.” భర్తను కోల్పోయిన బీయాంక అనే సహోదరి ఇలా వివరిస్తుంది, “ఇతరులు నాతో కలిసి ప్రార్థించినప్పుడు, ఒకట్రెండు లేఖనాలు చదివినప్పుడు నాకు ఊరటగా ఉంటుంది. వాళ్లు నా భర్త గురించి మాట్లాడినప్పుడు, నేను ఆయన గురించి చెప్పేది వాళ్లు విన్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది.”
16. (ఎ) ప్రియమైనవాళ్లను కోల్పోయినవాళ్లకు మనం ఎందుకు మద్దతిస్తూనే ఉండాలి? (బి) యాకోబు 1:27 ప్రకారం మనకు ఏ బాధ్యత ఉంది?
16 విధవరాలైన నయోమిని రూతు అంటిపెట్టుకొని ఉన్నట్టే, ప్రియమైనవాళ్లను కోల్పోయినవాళ్లకు మనం మద్దతు ఇస్తూనే ఉండాలి. పైన ప్రస్తావించబడిన పౌల ఇలా అంటోంది, “నా భర్త చనిపోయిన వెంటనే చాలామంది వచ్చి నన్ను ఓదార్చారు, నాకు సహాయంగా ఉన్నారు. కానీ కొన్నిరోజుల తర్వాత వాళ్లు రోజువారీ పనుల్లో బిజీ అయిపోయారు. నా జీవితం మాత్రం పూర్తిగా మారిపోయింది. బాధపడుతున్న వ్యక్తికి కొన్ని నెలలపాటు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల పాటు మద్దతు అవసరమని ఇతరులు గుర్తిస్తే చాలా బాగుంటుంది.” నిజమే, కొంతమంది మారిన పరిస్థితులకు త్వరగా అలవాటుపడతారు; ఇంకొంతమందేమో ఒకప్పుడు వాళ్ల వివాహజతతో కలిసి చేసిన పనుల్ని గుర్తుచేసుకొని బాధపడుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా దుఃఖిస్తారు. ఏదేమైనా, వివాహజతను కోల్పోయినవాళ్ల పట్ల శ్రద్ధ చూపించే అవకాశం, బాధ్యత యెహోవా మనకు ఇచ్చాడని గుర్తుంచుకుందాం.—యాకోబు 1:27 చదవండి.
17. వివాహజత వదిలేసిన వాళ్లకు మన మద్దతు ఎందుకు అవసరం?
17 ఇంకొంతమంది, వివాహజత వదిలేయడం వల్ల కలిగే తీవ్రమైన ఆవేదనను, ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. జాయిస్ భర్త, వేరే స్త్రీని పెళ్లి చేసుకోవడం కోసం ఈమెకు విడాకులు ఇచ్చాడు. జాయిస్ ఇలా చెప్తుంది, “నా భర్త చనిపోయినా ఇంత బాధపడేదాన్ని కాదేమో. ఒకవేళ ఆయన యాక్సిడెంట్ వల్లో, జబ్బు చేసో చనిపోతే అది ఆయన ప్రమేయం లేకుండా జరిగిందని అనుకునేదాణ్ణి. కానీ ఆయన నన్ను కావాలనే వదిలేసినందుకు చాలా అవమానంగా అనిపించింది.”
18. వివాహజత లేనివాళ్లకు మనం ఏవిధంగా సహాయం చేయవచ్చు?
18 వివాహజత లేనివాళ్ల కోసం మనం దయతో చేసే పని చిన్నదైనా, అది మనం వాళ్లను ప్రేమిస్తున్నామని చూపిస్తుంది. వాళ్లు ఒంటరిగా ఉంటారు కాబట్టి, వాళ్లకు మంచి స్నేహితులు అవసరం. (సామె. 17:17) మీరు వాళ్లకు స్నేహితులుగా ఉన్నారని ఎలా చూపించవచ్చు? వాళ్లను భోజనానికి పిలవవచ్చు. వాళ్లతో కలిసి సరదాగా సమయం గడపవచ్చు లేదా పరిచర్య చేయవచ్చు. అప్పుడప్పుడు వాళ్లను మీ కుటుంబ ఆరాధనకు పిలవవచ్చు. మీరు ఇవన్నీ చేసినప్పుడు యెహోవాను సంతోషపెడతారు. ఎందుకంటే, ఆయన “విరిగిన హృదయముగలవారికి” దగ్గరగా ఉంటాడు, విధవరాళ్లకు రక్షకునిగా ఉంటాడు.—కీర్త. 34:18; 68:5.
19. మొదటి పేతురు 3:8 బట్టి మీరేమి చేయాలని నిర్ణయించుకున్నారు?
19 త్వరలో దేవుని రాజ్యం భూమిని పరిపాలించినప్పుడు, ‘బాధలన్నీ మరవబడతాయి.’ ‘మునుపటివి మరువబడి, జ్ఞాపకమునకు రాని’ ఆ సమయం కోసం మనం ఎంతగా ఎదురుచూస్తున్నామో కదా! (యెష. 65:16, 17) అప్పటివరకు ఒకరికొకరం మద్దతిచ్చుకుంటూ, తోటి సహోదరసహోదరీల పట్ల మనకున్న ప్రేమను మాటల ద్వారా, పనుల ద్వారా చూపిస్తూ ఉందాం.—1 పేతురు 3:8 చదవండి.
పాట 111 మన సంతోషానికి కారణాలు
a యెహోవాను నమ్మకంగా ఆరాధించిన లోతు, యోబు, నయోమి కూడా ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. ఈ ఆర్టికల్‌లో, వాళ్ల అనుభవాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో పరిశీలిస్తాం. అంతేకాదు, సమస్యల్లో ఉన్న మన సహోదరసహోదరీల పట్ల ఓర్పు, కనికరం చూపిస్తూ ఊరటనిచ్చేలా మాట్లాడడం ఎందుకు ప్రాముఖ్యమో కూడా చర్చిస్తాం.
b అసలు పేర్లు కావు.
c చిత్రాల వివరణ: ఒత్తిడిలో ఉన్న ఒక సహోదరుడు దురుసుగా, అనాలోచితంగా మాట్లాడుతుంటే ఒక సంఘపెద్ద ఓపిగ్గా వింటున్నాడు. ఆ సహోదరుని కోపం చల్లారాక, సంఘపెద్ద ఆయన్ని దయగా సరిదిద్దుతున్నాడు.
d చిత్రాల వివరణ: కొంతకాలం క్రితం భార్యను కోల్పోయిన సహోదరునితో ఒక యౌవన జంట సమయం గడుపుతున్నారు. వాళ్లకు ఆయన భార్యతో ఉన్న కొన్ని తీపి జ్ఞాపకాల్ని పంచుకుంటున్నారు.