జీవిత కథ
యెహోవా నాకు ఊహకందని దీవెనలు ఇచ్చాడు
‘నేను పయినీరు అవ్వాలనుకున్నాను. కానీ ఆ పని ఆసక్తికరంగా ఉంటుందా?’ అనే సందేహం ఉండేది. జర్మనీలో నేను చేసే ఉద్యోగం చాలా బాగుండేది. నేను ఆఫ్రికాలోని డార్ ఎస్ సలామ్, ఇలిసబెత్‌విల్, అస్మారా వంటి ఎన్నో ప్రాంతాలకు ఆహారాన్ని ఎగుమతి చేసే విభాగంలో మేనేజర్‌గా పని చేసేవాణ్ణి. కానీ ఏదోకరోజు ఆ ప్రాంతాలతోపాటు, ఆఫ్రికాలోని మరెన్నో ప్రాంతాల్లో పూర్తికాల సేవ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు!
నా సందేహాల్ని అధిగమించి చివరికి పయినీరు సేవ మొదలుపెట్టాను. ఆ సేవ నాకు ఊహకందని దీవెనల్ని తెచ్చిపెట్టింది. (ఎఫె. 3:20) ఎలా అని ఆలోచిస్తున్నారా? అసలేమి జరిగిందో మొదటి నుండి చెప్తాను.
నేను జర్మనీలోని బెర్లిన్‌లో 1939, డిసెంబరు 12న పుట్టాను. అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం మొదలై కొన్ని నెలలే అయింది. 1945లో ఆ యుద్ధం ముగుస్తుందనగా వైమానిక దళాలు బెర్లిన్ మీద బాంబుల వర్షం కురిపించాయి. కొన్ని బాంబులు మా వీధిలో పడడంతో నేనూ, మా కుటుంబం సురక్షితమైన చోటుకు పరుగులు తీశాం. తర్వాత మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఎర్ఫర్ట్ ప్రాంతానికి వెళ్లిపోయాం, అది మా అమ్మవాళ్ల సొంతూరు.
సుమారు 1950లో అమ్మా, నాన్న, చెల్లితో జర్మనీలో
సత్యం తెలుసుకోవాలని అమ్మ చాలా ఆత్రంగా వెదికింది. తత్వవేత్తల పుస్తకాల్ని చదివింది, వేర్వేరు మతాల్ని పరిశీలించింది కానీ ఆమెకు సంతృప్తిగా అనిపించలేదు. సుమారు 1948లో, ఇద్దరు యెహోవాసాక్షులు మా ఇంటికి వచ్చారు. అమ్మ వాళ్లను లోపలికి పిలిచి, ప్రశ్నలు మీద ప్రశ్నలు వేసింది. వాళ్లొచ్చి గంట కూడా అవ్వకముందే “నాకు సత్యం దొరికింది” అని అమ్మ నాతో, చెల్లితో చెప్పింది. ఆ తర్వాత నుండి అమ్మ, చెల్లి, నేను ఎర్ఫర్ట్‌లో జరిగే మీటింగ్స్‌కు వెళ్లడం మొదలుపెట్టాం.
మేము 1950లో తిరిగి బెర్లిన్‌కు వచ్చేశాం, అక్కడ బెర్లిన్-క్రోయిట్స్‌బార్క్ సంఘానికి వెళ్లేవాళ్లం. కొంతకాలానికి బెర్లిన్‌లోనే మరో చోటుకు మారాక బెర్లిన్-టెంపల్‌హోఫ్ సంఘంతో సహవసించాం. కొన్నిరోజులకు అమ్మ బాప్తిస్మం తీసుకుంది, నేను మాత్రం కాస్త వెనకాడాను. ఎందుకో తెలుసా?
బిడియాన్ని అధిగమించాను
నేను బిడియస్థుణ్ణి కావడంతో పెద్దగా ప్రగతి సాధించలేదు. పరిచర్యకు వెళ్లిన రెండేళ్లలో ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. కానీ యెహోవాకు నమ్మకంగా ఉన్న, ధైర్యాన్ని చూపించిన కొంతమంది సహోదరసహోదరీలతో స్నేహం చేయడం వల్ల నాలో మార్పు వచ్చింది. వాళ్లలో కొంతమంది నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో అలాగే తూర్పు జర్మనీ జైళ్లలో ఉండి వచ్చారు. ఇంకొంతమంది, పోలీసులు పట్టుకుని జైల్లో వేస్తారనే భయాన్ని అధిగమించి ప్రచురణల్ని తూర్పు జర్మనీకి రహస్యంగా చేరవేసే పని చేశారు. వాళ్ల జీవితం నన్ను చాలా మార్చింది. వాళ్లు యెహోవా కోసం అలాగే సహోదరుల కోసం తమ ప్రాణాలను, స్వేచ్ఛను పణంగా పెట్టారు. అలాంటిది నేను కనీసం బిడియాన్ని వదిలి పెట్టలేనా అనిపించింది.
1955లో జరిగిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాటినుండి నాలో ఉన్న బిడియం తగ్గడం మొదలైంది. ఆ ప్రచార కార్యక్రమం, సంస్థ ఏర్పాటు చేసినవాటిలో అత్యంత పెద్దదని సహోదరుడు నేథన్ నార్ ఇన్‌ఫార్మెంట్‌లోa ప్రచురించిన ఒక ఉత్తరం ద్వారా ప్రకటించాడు. అందులో ప్రచారకులందరూ భాగం వహిస్తే, “అది అత్యంత అద్భుతమైన ప్రకటనా పని జరిగిన నెలగా నిలిచిపోతుంది” అని ఆయన అన్నాడు. ఆయన అన్నదే జరిగింది! తర్వాత ఎంతోకాలం గడవకముందే నేను యెహోవాకు సమర్పించుకుని 1956లో నాన్న, చెల్లితోపాటు బాప్తిస్మం తీసుకున్నాను. కొంతకాలానికే మరో ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
పయినీరు సేవ చేయడమే సరైన పనని ఎన్నో ఏళ్ల ముందే నాకు తెలుసు, కానీ దాన్ని వాయిదా వేస్తూ వచ్చాను. ముందు బెర్లిన్‌లోని హోల్‌సేల్ అలాగే దిగుమతి-ఎగుమతి రంగంలో శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను. తర్వాత కొంతకాలం ఉద్యోగం చేసి అనుభవాన్ని, నైపుణ్యాన్ని సంపాదించాలని అనుకున్నాను. అందుకే 1961లో, జర్మనీలోని అత్యంత పెద్ద ఓడరేవు ఉన్న హామ్‌బర్గ్ నగరంలో ఉద్యోగం చూసుకున్నాను. ఆ పని అలవాటయ్యే కొద్దీ పయినీరు సేవను ఇంకొన్నాళ్లు వాయిదా వేశాను. తర్వాత ఏం జరిగింది అనుకుంటున్నారా?
తన సేవకు మొదటిస్థానం ఇవ్వాలనే విషయం నేను అర్థంచేసుకోవడానికి యెహోవా కొంతమంది ప్రేమగల సహోదరుల్ని ఉపయోగించుకున్నాడు. పయినీరు సేవ మొదలుపెట్టిన నా స్నేహితులు కూడా నాకు ఆదర్శంగా నిలిచారు. దానికితోడు కాన్సంట్రేషన్ క్యాంపులో ఉండి వచ్చిన ఎరిక్ ముండ్ అనే సహోదరుడు, నన్ను యెహోవా మీద నమ్మకం ఉంచమని ప్రోత్సహించాడు. కాన్సంట్రేషన్ క్యాంపులో ఉన్నప్పుడు సొంత శక్తి మీద ఆధారపడిన సహోదరులు విశ్వాసం కోల్పోయారనీ, పూర్తిగా యెహోవా మీద ఆధారపడిన వాళ్లు చివరిదాకా నమ్మకంగా ఉండి సంఘానికి స్తంభాలుగా నిలిచారనీ ఆయన వివరించాడు.
1963లో పయినీరు సేవ మొదలుపెట్టినప్పుడు
సహోదరుడు మార్టిన్ పోయెట్‌జింగర్ కూడా సహోదరుల్ని ప్రోత్సహిస్తూ, ‘ధైర్యమే మీ అత్యంత విలువైన ఆస్తి’ అని చెప్పేవాడు. తర్వాత ఆయన పరిపాలక సభ సభ్యునిగా సేవచేశాడు. అయితే ఆ మాటల గురించి లోతుగా ఆలోచించాక ఉద్యోగం వదిలేసి 1963 జూన్‌లో పయినీరు సేవ మొదలుపెట్టాను. నేను తీసుకున్న అత్యంత శ్రేష్ఠమైన నిర్ణయం అదే! రెండు నెలలు గడిచాయి, నేను మరో ఉద్యోగం వెతుక్కునేలోపే ప్రత్యేక పయినీరుగా సేవ చేసే నియామకం పొందాను. కొన్నేళ్లు గడిచాక, యెహోవా నుండి ఒక ఊహించని దీవెన పొందాను. 44వ గిలియడ్ తరగతికి ఆహ్వానం అందుకున్నాను!
గిలియడ్‌లో నేర్చుకున్న ఒక విలువైన పాఠం
“మీ నియామకాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదు” అనేది సహోదరులైన నేథన్ నార్, లైమన్ స్వింగిల్ నుండి నేను నేర్చుకున్న అత్యంత ప్రాముఖ్యమైన పాఠం. ఎంత కష్టమైనా నియామకాన్ని కొనసాగించమని వాళ్లు మమ్మల్ని ప్రోత్సహించారు. సహోదరుడు నార్ ఇలా చెప్పాడు, “మీరు దేన్ని చూస్తారు? మట్టిని, పురుగుల్ని, పేదరికాన్నా? లేక చెట్లను, పువ్వుల్ని, చిరునవ్వు చిందించే ముఖాలనా? ప్రజలపై ప్రేమ పెంచుకోండి!” కొంతమంది సహోదరులు తమ నియామకాన్ని ఎందుకు తేలిగ్గా విడిచిపెట్టారో వివరిస్తూ ఒకరోజు సహోదరుడు స్వింగిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన ఎంత భావోద్వేగానికి లోనయ్యాడంటే దుఃఖాన్ని ఆపుకోలేక ప్రసంగాన్ని మధ్యలో ఆపి, కాస్త కుదుటపడ్డాక మళ్లీ మాట్లాడాడు. ఆయన మాటలు నా మనసును హత్తుకున్నాయి. అందుకే క్రీస్తుకు, ఆయన నమ్మకమైన సహోదరులకు నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని నిర్ణయించుకున్నాను.—మత్త. 25:40.
1967లో కాంగోలోని లూబూమ్‌బాషీలో నేనూ, క్లోడ్, హైన్‌రిక్ మిషనరీలుగా సేవ చేస్తున్నప్పుడు
పాఠశాలకు హాజరైన వాళ్లందరికీ నియామకాలు ఇచ్చారు. అప్పుడు కొంతమంది బెతెల్ కుటుంబసభ్యులు, ఏ ప్రాంతానికి నియమించబడ్డారని మాలో కొంతమందిని అడిగారు. ఒక్కొక్కరు తమ నియామకాన్ని చెప్తున్నప్పుడు వాళ్లు ఆ ప్రాంతాల గురించి మంచిగా మాట్లాడారు. నా వంతు వచ్చినప్పుడు, “కాంగో (కిన్‌షాసా)” అని చెప్పాను. వాళ్లు కాసేపు మౌనంగా ఉండి, “అమ్మో కాంగోనా! యెహోవా నీకు తోడుగా ఉండాలి” అన్నారు. ఆ రోజుల్లో గొడవలతో, హత్యలతో కాంగో (కిన్‌షాసా) ఎప్పుడూ వార్తల్లో ఉండేది. కానీ నేర్చుకున్న పాఠాల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. 1967 సెప్టెంబరు నెలలో గిలియడ్ పట్టాలు పొందిన కొన్నిరోజులకు నేనూ, హైన్‌రిక్ డేన్‌బొజ్‌టాల్, క్లోడ్ లిన్‌జీ కాంగో రాజధాని అయిన కిన్‌షాసాకు బయల్దేరాం.
మిషనరీలకు దొరికిన చక్కని శిక్షణ
కిన్‌షాసాకు వెళ్లాక మూడు నెలలపాటు ఫ్రెంచ్ భాష నేర్చుకున్నాం. అక్కడి నుండి విమానంలో ఇలిసబెత్‌విల్‌కు వెళ్లాం, అది కాంగోకు దక్షిణాన జాంబియా సరిహద్దుల్లో ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని లూబూమ్‌బాషీ అని పిలుస్తున్నారు. మేము ఆ నగర నడిబొడ్డులో ఉన్న మిషనరీ హోమ్‌లో ఉండేవాళ్లం.
అప్పటిదాకా లూబూమ్‌బాషీలో చాలా చోట్ల మంచివార్త ప్రకటించబడలేదు. అక్కడి ప్రజలకు సత్యాన్ని పరిచయం చేసే అవకాశం మాకు దొరికినందుకు చాలా సంతోషంగా అనిపించింది. కొన్నిరోజులకే మాకు చాలా స్టడీలు దొరికాయి, అన్నిటినీ చేయడానికి సమయం సరిపోయేది కాదు. అక్కడి పోలీసు అధికారులకు కూడా మేము మంచివార్త ప్రకటించాం. చాలామంది దేవుని వాక్యాన్ని, మేము చేస్తున్న ప్రకటనా పనిని గౌరవించారు. అక్కడివాళ్లు ఎక్కువగా స్వాహిలీ భాష మాట్లాడతారు కాబట్టి నేనూ, క్లోడ్ లిన్‌జీ ఆ భాష కూడా నేర్చుకున్నాం. కొంతకాలానికి మా ఇద్దరినీ స్వాహిలీ భాషా సంఘానికి నియమించారు.
అక్కడ మాకు ఎన్నో అద్భుతమైన అనుభవాలతోపాటు, సవాళ్లు కూడా ఎదురయ్యాయి. తాగేసి తుపాకీలు పట్టుకొని ఉన్న సైనికులు గానీ, కోపిష్ఠులైన పోలీసులు గానీ తరచూ మాపై అబద్ధ ఆరోపణలు చేసేవాళ్లు. ఒకసారైతే, మిషనరీ హోమ్‌లో మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది పోలీసులు తుపాకీలతో లోపలికి దూసుకొచ్చారు. సహోదరుల్ని సెంట్రల్ పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లి రాత్రి సుమారు పది గంటల వరకు నేల మీద కూర్చోబెట్టి వదిలిపెట్టారు.
1969లో నన్ను ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించారు. కొన్నిసార్లు మట్టి రోడ్లమీద, ఏపుగా పెరిగిన గడ్డి గుండా చాలాదూరం నడుస్తూ వెళ్లేవాణ్ణి; సాధారణంగా ఆఫ్రికాలో అలాంటి ప్రదేశాలే కనిపిస్తాయి. ఒక పల్లెటూరిలో ఉన్నప్పుడైతే, కోడి తన పిల్లలతోపాటు నా మంచం కిందే పడుకునేది. అది తెల్లవారకముందే చెవులు చిల్లులుపడేలా కూసి నన్ను నిద్రలేపడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా, సాయంత్రాలు చలిమంట చుట్టూ కూర్చొని సహోదరులందరం బైబిలు సత్యాల గురించి మాట్లాడుకోవడం ఒక మరువలేని అనుభూతి!
మాకు ఎదురైన అన్నిటికన్నా పెద్ద సవాలు, కీటావాలా ఉద్యమంలోb భాగం వహిస్తూ యెహోవాసాక్షుల్లా నటిస్తున్న కొంతమందిని గుర్తించడం. వాళ్లలో కొంతమంది బాప్తిస్మం తీసుకున్నారు, సంఘపెద్దలు కూడా అయ్యారు. అయితే ‘పైకి కనిపించకుండా నీటిలో ఉండే రాళ్ల’ లాంటి వీళ్లను గుర్తించడానికి నమ్మకమైన సహోదరసహోదరీలు సహాయం చేశారు. (యూదా 12) చివరికి యెహోవా సంఘాన్ని శుభ్రం చేసిన తర్వాత ప్రచారకుల సంఖ్య విపరీతంగా పెరిగింది.
1971లో నన్ను కిన్‌షాసాలోని బ్రాంచి కార్యాలయంలో పనిచేయడానికి రమ్మని పిలిచారు. అక్కడ కరెస్పాండెన్స్ చేయడం, ప్రచురణల రిక్వెస్టుల్ని చూసుకోవడం, సేవా విభాగానికి సంబంధించిన పనుల్ని చూసుకోవడం వంటివి చేశాను. బెతెల్‌లో పనిచేయడం వల్ల, సరైన సౌకర్యాలు లేని పెద్ద దేశంలో పనిని క్రమపద్ధతిలో ఎలా నడిపించవచ్చో నేర్చుకోగలిగాను. కొన్నిసార్లు మేము పంపిన ఉత్తరాలు సంఘాలకు అందడానికి చాలా నెలలు పట్టేది. ఎందుకంటే అలా పంపిన ఉత్తరాలన్నిటినీ విమానం నుండి పడవలోకి ఎక్కించేవాళ్లు, అయితే నీటి కలువలు విపరీతంగా పెరగడం వల్ల పడవలు వాటిమధ్య ఇరుక్కొని కొన్ని వారాలపాటు అక్కడే ఉండిపోయేవి. వీటితోపాటు, ఎన్నో ఇతర సవాళ్లు ఎదురైనప్పటికీ ఆ పని ముందుకు సాగింది.
ఎక్కువ డబ్బు లేకపోయినా, సహోదరులు పెద్దపెద్ద సమావేశాల్ని చక్కగా ఏర్పాటు చేయడం చూసి ఆశ్చర్యపోయాను. వాళ్లు చీమల పుట్టల్ని చదును చేసి ప్లాట్‌ఫామ్‌లు తయారు చేశారు; ఏపుగా పెరిగిన గడ్డిని గోడల్లా కట్టారు. దాన్నే చుట్టలా కట్టి కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు. వెదురు కర్రలతో ఒక నిర్మాణం చేసి, రెల్లు గడ్డితో చేసిన చాపలను పైకప్పులుగా అమర్చారు; ఆ రెల్లు చాపలనే టేబుళ్లుగా కూడా మలిచారు. చెట్టు బెరడును ముక్కలుగా చేసి వాటిని మేకుల్లా ఉపయోగించారు. ఆ సహోదరసహోదరీల కష్టాన్ని, తెలివిని చూశాక వాళ్లను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. వాళ్ల మీద నాకున్న ప్రేమ ఇంకా పెరిగింది. కానీ నా నియామకం మారడం వల్ల వాళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది.
కెన్యాలో సేవచేయడం
1974లో నన్ను కెన్యాలోని నైరోబీ బ్రాంచి కార్యాలయంలో సేవచేయడానికి నియమించారు. అక్కడ చాలా పని ఉండేది, ఎందుకంటే చుట్టుపక్కలున్న పది దేశాల్లో జరిగే ప్రకటనా పనిని కెన్యా బ్రాంచే పర్యవేక్షించేది, వాటిలోని కొన్ని దేశాల్లో మన పనిపై నిషేధం ఉండేది. ఆ దేశాల్ని సందర్శించడానికి, ముఖ్యంగా ఇతియోపియా దేశానికి నన్ను చాలాసార్లు పంపించేవాళ్లు. ఆ దేశాల్లోని మన సహోదరులు తీవ్రమైన హింసల్ని, సమస్యల్ని సహించారు. వాళ్లలో చాలామందిని క్రూరంగా హింసించారు, జైళ్లలో వేశారు; కొంతమందిని చంపేశారు కూడా. కానీ వాళ్లకు యెహోవాతో అలాగే తోటి సహోదరులతో మంచి సంబంధం ఉండడం వల్ల వాటన్నిటినీ సహించి నమ్మకంగా ఉండగలిగారు.
నేను 1980లో గేల్ మాత్‌సన్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు నా జీవితం మరింత అందంగా మారింది. ఆమె కెనడాలో పుట్టింది, నేను హాజరైన గిలియడ్ తరగతికే ఆమె కూడా హాజరైంది. తను బొలీవియా దేశంలో మిషనరీగా సేవ చేస్తున్నప్పుడు, ఇద్దరం ఉత్తరాల ద్వారా మాట్లాడుకునేవాళ్లం. మేము మళ్లీ 12 ఏళ్ల తర్వాత న్యూయార్క్‌లో కలుసుకున్నాం. కొంతకాలానికి కెన్యాలో పెళ్లి చేసుకున్నాం. యెహోవాలా ఆలోచించే, ఉన్నదాంతో సంతృప్తిగా జీవించే భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ ఆమె నాకు తోడుగా ఉంటూ, తన విలువైన మద్దతును ఇస్తోంది.
1986లో మేమిద్దరం ప్రయాణ సేవ చేస్తుండేవాళ్లం; అదే సమయంలో నేను బ్రాంచి కమిటీ సభ్యునిగా కూడా సేవ చేస్తుండేవాణ్ణి. అయితే ప్రయాణ సేవలో భాగంగా కెన్యా బ్రాంచి పర్యవేక్షించే ఎన్నో దేశాలను సందర్శించాను.
1992లో అస్మారాలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు
1992లో అస్మారా (ఎరిట్రియ) దేశంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం గుర్తు చేసుకున్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. అప్పటికింకా అక్కడ మన పనిపై నిషేధం విధించలేదు. అయితే సమావేశం కోసం ఒక గోడౌన్ తప్ప వేరే చోటు మాకు దొరకలేదు. బయటి నుండి చూడడానికి అది చాలా ఘోరంగా కనిపించింది, లోపల ఇంకా ఘోరంగా ఉంది. కానీ సమావేశం రోజుకల్లా మన సహోదరులు దాన్ని అందంగా తీర్చిదిద్ది యెహోవా ఆరాధనకు తగిన స్థలంగా మార్చేశారు. నేనైతే నా కళ్లను నమ్మలేకపోయాను. చాలా కుటుంబాలు ఆకర్షణీయమైన గుడ్డల్ని తీసుకొచ్చి, బాగోలేని చోట్లను వాటితో కప్పేశారు. 1,279 మంది హాజరైన ఆ సమావేశం చాలా సంతోషంగా, ఆసక్తికరంగా జరిగింది.
ప్రయాణ సేవ చేస్తున్నప్పుడు ప్రతీవారం ఒక్కో రకమైన చోట ఉండాల్సి రావడం వల్ల ఆ పని కొత్తగా అనిపించింది. ఒకసారి సముద్రం పక్కనే ఉన్న సౌకర్యవంతమైన పెద్ద భవనంలో ఉన్నాం. మరోసారి సాదాసీదాగా ఉన్న రేకుల ఇంట్లో ఉన్నాం, బాత్‌రూమ్‌లు ఆ ఇంటి నుండి 300 అడుగుల దూరంలో ఉండేవి. మేము ఏ ప్రాంతంలో సేవ చేసినప్పటికీ, అక్కడి ఉత్సాహవంతమైన పయినీర్లతో, ప్రచారకులతో కలిసి ప్రకటనా పని చేస్తూ బిజీగా గడిపిన రోజులు మాకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అయితే మా నియామకం మళ్లీ మారినప్పుడు, మా స్నేహితులందర్నీ విడిచి బరువెక్కిన హృదయాలతో అక్కడి నుండి బయల్దేరాం.
ఇతియోపియాలో పొందిన దీవెనలు
1987 నుండి 1992 మధ్యకాలంలో, కెన్యా బ్రాంచి కిందున్న కొన్ని దేశాల్లో మన పనికి చట్టపరమైన గుర్తింపు వచ్చింది. దాంతో వేర్వేరు బ్రాంచి కార్యాలయాలను, కంట్రీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 1993లో మమ్మల్ని ఇతియోపియాలోని ఆడిస్ అబాబా కార్యాలయంలో సేవచేయడానికి నియమించారు. అక్కడ చాలా సంవత్సరాలపాటు మన పనిని రహస్యంగా చేశాం, ఇప్పుడైతే మన కార్యకలాపాలకు అక్కడ చట్టపరమైన గుర్తింపు ఉంది.
1996లో, ప్రయాణ సేవలో భాగంగా ఇతియోపియాలో ఒక పల్లెటూరికి వెళ్లినప్పుడు
ఇతియోపియాలో జరిగిన పనిని యెహోవా దీవించాడు. చాలామంది సహోదరసహోదరీలు పయినీరు సేవ చేయడం మొదలుపెట్టారు. 2012 మొదలుకొని ప్రతీ సంవత్సరం 20 శాతం కన్నా ఎక్కువమంది ప్రచారకులు పయినీరు సేవ చేస్తున్నారు. అంతేకాదు ప్రచారకులకు దైవపరిపాలనా పాఠశాలల ద్వారా అవసరమైన శిక్షణ దొరికింది, 120 కన్నా ఎక్కువ రాజ్యమందిరాలు నిర్మించబడ్డాయి. 2004లో బెతెల్ కుటుంబం కొత్త భవనంలోకి మారింది, ఆ ప్రాంగణంలోనే ఒక సమావేశ హాలు కూడా నిర్మించబడింది.
ఇతియోపియాలో సేవచేసిన ఇన్ని సంవత్సరాల్లో నాకూ, గేల్‌కు చాలామంది సహోదరసహోదరీలు మంచి స్నేహితులయ్యారు. మాపై దయ, ప్రేమ చూపించే ఆ స్నేహితులంటే మాకు చాలా ఇష్టం. అయితే ఈమధ్య మా ఇద్దరి ఆరోగ్యం పాడవ్వడం వల్ల తిరిగి సెంట్రల్ యూరప్ బ్రాంచికి పిలిచారు. ఇక్కడ మమ్మల్ని చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఇతియోపియాలోని స్నేహితులు అప్పుడప్పుడు బాగా గుర్తొస్తుంటారు.
యెహోవా మంచి ఫలితాలు ఇచ్చాడు
ప్రకటనా పనికి యెహోవా మంచి ఫలితాలు వచ్చేలా చేయడాన్ని మా కళ్లారా చూశాం. (1 కొరిం. 3:6, 9) ఉదాహరణకు, కాంగోలోని రాగి గనుల్లో పనిచేయడానికి రువాండా దేశస్థులు వచ్చేవాళ్లు. మొదటిసారిగా వాళ్లకు నేను మంచివార్త ప్రకటించే నాటికి వాళ్ల దేశంలో ఒక్క యెహోవాసాక్షి కూడా లేరు. ఇప్పుడు రువాండాలో 30,000 కన్నా ఎక్కువమంది సహోదరసహోదరీలు ఉన్నారు. 1967 నాటికి కాంగోలో (కిన్‌షాసా) సుమారు 6,000 మంది ప్రచారకులు ఉండేవాళ్లు; ఇప్పుడు దాదాపు 2,30,000 మంది ప్రచారకులు ఉన్నారు. అంతేకాదు, 2018 జ్ఞాపకార్థ ఆచరణకు 10 లక్షల కన్నా ఎక్కువమంది హాజరయ్యారు. ఒకప్పుడు కెన్యా బ్రాంచి కిందున్న అన్నీ దేశాల్లో ఇప్పుడు లక్ష కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు.
50 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం, యెహోవా వేర్వేరు సహోదరుల్ని ఉపయోగించి నేను పూర్తికాల సేవ మొదలుపెట్టేలా సహాయం చేశాడు. ఇప్పటికీ నేను కాస్త బిడియస్థుణ్ణే, కానీ యెహోవాపై పూర్తిగా నమ్మకం ఉంచడం నేర్చుకున్నాను. ఆఫ్రికాలో సేవచేసిన అనుభవం ఓర్పు చూపించడాన్ని, ఉన్నవాటితో సంతృప్తి చెందడాన్ని నాకు నేర్పించింది. అద్భుతమైన ఆతిథ్య స్ఫూర్తి, పెద్దపెద్ద సమస్యల్ని తట్టుకునే గుణం, యెహోవాపై నమ్మకం ఉన్న సహోదరసహోదరీలంటే నాకూ, గేల్‌కూ చాలా ఇష్టం. యెహోవా చూపించే అపారదయకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. నిజంగా, యెహోవా నాకు ఊహకందని దీవెనలు ఇచ్చాడు.—కీర్త.37:4.
a తర్వాత దాన్ని మన రాజ్య పరిచర్య అని పిలిచారు, ఇప్పుడు దాని స్థానంలో మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్ వర్క్‌బుక్ ఉపయోగిస్తున్నాం.
b స్వాహిలీ భాష నుండి తీసుకున్న “కీటావాలా” అనే పదానికి “ఆధిపత్యం, నడిపించడం, పాలించడం” అనే అర్థాలున్నాయి. బెల్జియం నుండి స్వాతంత్ర్యం పొందాలనే ఉద్దేశంతో ఈ రాజకీయ ఉద్యమాన్ని చేపట్టారు. కీటావాలా మద్దతుదారులు యెహోవాసాక్షుల ప్రచురణల్ని సంపాదించి, వాటిని అధ్యయనం చేసి, ప్రజలకు పంచిపెట్టారు. బైబిలు బోధల్ని తమ రాజకీయ అభిప్రాయాలకు, మూఢాచారాలకు, అనైతిక జీవనశైలికి అనుగుణంగా వక్రీకరించి ప్రచారం చేశారు.