విశ్వాసం—మనల్ని బలపర్చే లక్షణం
విశ్వాసం ఎంతో బలాన్నిస్తుంది. ఉదాహరణకు, మనకు యెహోవాతో ఉన్న సంబంధాన్ని పాడుచేయాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆ దుష్టుడి ‘అగ్ని బాణాలన్నీ ఆర్పివేయడానికి’ విశ్వాసం సహాయం చేస్తుంది. (ఎఫె. 6:16) కొండంత సమస్యల్ని ఎదుర్కోవడానికి కూడా ఈ లక్షణం ఉపయోగపడుతుంది. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి, ఈ కొండతో, ‘ఇక్కడి నుండి అక్కడికి వెళ్లు’ అని చెప్తే, అది వెళ్తుంది.” (మత్త. 17:20) మనకు యెహోవాతో ఉన్న సంబంధాన్ని బలపర్చుకునేందుకు విశ్వాసం సహాయం చేస్తుంది కాబట్టి, మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు: విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం పెంపొందించుకోవడానికి సరైన హృదయస్థితి ఎందుకు అవసరం? విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు? మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలి?—రోమా. 4:3.
విశ్వాసం అంటే ఏంటి?
విశ్వాసం అంటే బైబిలు చెప్తున్న వాటిని కేవలం నమ్మడం కాదు. ఎందుకంటే, ‘దేవుడు ఉన్నాడని చెడ్డదూతలు కూడా నమ్ముతున్నారు, భయంతో వణుకుతున్నారు.’ (యాకో. 2:19) అలాగైతే విశ్వాసం అంటే ఏంటి?
పగలు-రాత్రి ఎప్పుడూ ఏర్పడతాయని నమ్మినట్లే, దేవుని మాట కూడా ఎప్పుడూ నెరవేరుతుందని నమ్ముతాం
విశ్వాసం అనే లక్షణంలో రెండు అంశాలు ఉన్నాయని బైబిలు చెప్తోంది. మొదటిది, “మనం ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మడం.” (హెబ్రీ. 11:1ఎ) మీకు విశ్వాసం ఉంటే యెహోవా చెప్పేవన్నీ నిజమని, అవి ఖచ్చితంగా జరుగుతాయని బలంగా నమ్ముతారు. ఉదాహరణకు యెహోవా ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాడు, ‘పగలు, రాత్రి వాటివాటి సమయాల్లో రాకుండా నువ్వు పగటి గురించిన నా ఒప్పందాన్ని, రాత్రి గురించిన నా ఒప్పందాన్ని భంగం చేయగలిగితే, అప్పుడు మాత్రమే నా సేవకుడైన దావీదుతో నేను చేసిన ఒప్పందం భంగమౌతుంది.’ (యిర్మీ. 33:20, 21, NW) మీరెప్పుడైనా సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఆపేస్తాడేమో, పగలు-రాత్రి ఏర్పడవేమోనని భయపడ్డారా? లేదు కదా. అలాంటప్పుడు వాటిని సృష్టించిన సృష్టికర్త మాత్రం తన వాగ్దానాల్ని నెరవేర్చడేమో అని సందేహించడం సరైనదేనా? కాదు!—యెష. 55:10, 11; మత్త. 5:18.
రెండోది, “మనం నమ్మేవి కంటికి కనిపించకపోయినా అవి నిజంగా ఉన్నాయనడానికి రుజువు.” మన కంటికి కనిపించనివి నిజంగా ఉన్నాయని నమ్మడానికి సహాయం చేసే “రుజువు” లేదా “బలమైన ఆధారమే” విశ్వాసం. (హెబ్రీ. 11:1బి; అధస్సూచి) ఉదాహరణకు, గాలి కంటికి కనిపించకపోయినా అది ఉందని నమ్ముతాం. ఒక పిల్లవాడు మిమ్మల్ని, ‘గాలి ఉందని నీకెలా తెలుసు?’ అని అడిగితే ఏం చెప్తారు? మీరెప్పుడూ చూడకపోయినా గాలి ఉందని నిరూపించే రుజువుల గురించి, అంటే గాలి వీచే శబ్దం, గాలికి ఆకులు కదలడం వంటివాటి గురించి చెప్తారు. పిల్లవాడు ఆ రుజువుల్ని నమ్మితే, తనకు కనిపించనివి నిజంగా ఉన్నాయని నమ్ముతాడు. అదేవిధంగా, విశ్వాసం కూడా స్పష్టమైన రుజువుల మీద ఆధారపడి ఉంటుంది.—రోమా. 1:20.
సరైన హృదయస్థితి అవసరం
విశ్వాసం రుజువుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని వృద్ధి చేసుకోవాలంటే “సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని” సంపాదించుకోవాలి. (1 తిమో. 2:4) కానీ అది మాత్రమే సరిపోదు. “హృదయంలో విశ్వసించాలి” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమా. 10:10) అంటే, మనం బైబిలు సత్యాన్ని నమ్మితే సరిపోదు గానీ దాన్ని విలువైనదిగా చూడాలి. అప్పుడే విశ్వాసాన్ని చేతల్లో చూపించడం, దేవుడు ఇష్టపడేలా జీవించడం వీలౌతుంది. (యాకో. 2:20) సత్యం పట్ల నిజమైన కృతజ్ఞత లేనివాళ్లు తమ నమ్మకాల్ని మార్చుకోవడానికి లేదా దేవుడు కోరినట్లు జీవించడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్లు స్పష్టమైన రుజువుల్ని సైతం నమ్మడానికి నిరాకరించవచ్చు. (2 పేతు. 3:3, 4; యూదా 18) అందుకే, బైబిలు కాలాల్లో చాలామంది అద్భుతాల్ని కళ్లారా చూసినా కేవలం కొందరే విశ్వాసం చూపించారు. (సంఖ్యా. 14:11; యోహా. 12:37) అవును, సత్యాన్ని నిజంగా ప్రేమించేవాళ్లు మాత్రమే పవిత్రశక్తి సహాయంతో విశ్వాసమనే లక్షణాన్ని వృద్ధి చేసుకోగలరు.—గల. 5:22; 2 థెస్స. 2:10, 11.
దావీదు ఎలా బలమైన విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నాడు?
బలమైన విశ్వాసం ఉన్నవాళ్లలో దావీదు రాజు ఒకడు. (హెబ్రీ. 11:32, 33) కానీ ఆయన కుటుంబ సభ్యులందరికీ అలాంటి విశ్వాసం లేదు. ఉదాహరణకు దావీదు పెద్దన్నయ్య ఏలీయాబునే తీసుకోండి. ఇశ్రాయేలు ప్రజల్ని గొల్యాతు సవాలు చేసినప్పుడు దావీదు బాధపడ్డాడు, దానికి ఏలీయాబు దావీదును తిట్టాడు. అలా ఏలీయాబు యెహోవా మీద తనకు విశ్వాసం లేదని చూపించాడు. (1 సమూ. 17:26-28) విశ్వాసం ఎవ్వరికీ పుట్టుకతో లేదా వారసత్వంగా రాదు. కాబట్టి దావీదు దేవునితో తనకున్న సంబంధం వల్లే విశ్వాసాన్ని వృద్ధి చేసుకోగలిగాడని చెప్పవచ్చు.
దావీదు అలాంటి బలమైన విశ్వాసం ఎలా వృద్ధి చేసుకున్నాడో 27వ కీర్తన తెలియజేస్తుంది. (1వ వచనం) దావీదు తన గత అనుభవాల గురించి, తన శత్రువులతో యెహోవా వ్యవహరించిన విధానం గురించి లోతుగా ఆలోచించాడు. (2, 3 వచనాలు) ఆయన యెహోవా గుడారాన్ని ఎంతో విలువైనదిగా చూశాడు. (4వ వచనం) గుడారంలో తోటి ఆరాధకులతో కలిసి దేవున్ని ఆరాధించాడు. (6వ వచనం) యెహోవాను వెతుకుతూ హృదయపూర్వకంగా ప్రార్థించాడు. (7, 8 వచనాలు) ‘నీ మార్గమును నాకు బోధింపుము’ అని కూడా దేవున్ని కోరుకున్నాడు. (11వ వచనం) విశ్వాసం కలిగివుండడం ఎంత ప్రాముఖ్యమో దావీదుకు తెలుసు కాబట్టి, “నమ్మకము [లేదా, విశ్వాసం] నాకు లేనియెడల నేనేమవుదును?” అని అన్నాడు.—13వ వచనం.
విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?
27వ కీర్తనలో వర్ణించబడిన దావీదు మనస్తత్వాన్ని, ఆయన అలవాట్లను అనుకరించడం ద్వారా మనం కూడా బలమైన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవచ్చు. విశ్వాసం సరైన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బైబిల్ని, బైబిలు ఆధారిత ప్రచురణల్ని ఎక్కువగా అధ్యయనం చేయాలి. అప్పుడు పవిత్రశక్తి పుట్టించే విశ్వాసమనే లక్షణాన్ని తేలిగ్గా వృద్ధి చేసుకోగలుగుతాం. (కీర్త. 1:2, 3) కాబట్టి అధ్యయనం చేస్తున్నప్పుడు లోతుగా ఆలోచించడానికి సమయం తీసుకోండి. అలా చేస్తే, యెహోవా పట్ల మన కృతజ్ఞత పెరుగుతుంది. దాంతో మీటింగ్స్‌లో యెహోవాను ఆరాధించడం ద్వారా, ఇతరులకు మన నిరీక్షణ గురించి చెప్పడం ద్వారా విశ్వాసం చూపించాలనే కోరిక మనలో మరింత బలపడుతుంది. (హెబ్రీ. 10:23-25) “ఎప్పుడూ ప్రార్థించడం, పట్టువిడవకుండా ఉండడం” ద్వారా కూడా మనం విశ్వాసం చూపిస్తాం. (లూకా 18:1-8) కాబట్టి, యెహోవాకు ‘మనమంటే పట్టింపు ఉంది’ అనే నమ్మకంతో ఆయనకు ‘ఎప్పుడూ ప్రార్థించాలి.’ (1 పేతు. 5:7; 1 థెస్స. 5:17) విశ్వాసం మనల్ని సరైనది చేసేలా ప్రోత్సహిస్తుంది. అలా సరైనది చేసినప్పుడు మన విశ్వాసం ఇంకా బలపడుతుంది.—యాకో. 2:22.
యేసు మీద విశ్వాసం చూపించండి
యేసు తాను చనిపోవడానికి ముందు రాత్రి తన శిష్యులతో, “దేవుని మీద విశ్వాసం చూపించండి; నా మీద కూడా విశ్వాసం చూపించండి” అని చెప్పాడు. (యోహా. 14:1) కాబట్టి మనం యెహోవా మీదే కాదు, యేసు మీద కూడా విశ్వాసం చూపించాలి. యేసు మీద విశ్వాసం చూపించగల మూడు విధానాల్ని పరిశీలిద్దాం.
యేసు మీద విశ్వాసం చూపించడం అంటే ఏంటి?
మొదటిది, విమోచన క్రయధనాన్ని దేవుడు మీకు ఇచ్చిన బహుమానంగా చూడాలి. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, “నన్ను ప్రేమించి నాకోసం తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసంతోనే నేనిప్పుడు జీవిస్తున్నాను.” (గల. 2:20) విమోచన క్రయధనం వల్ల మీరు ప్రయోజనం పొందుతారని, మీ పాపాలు క్షమించబతాయని, మీరు శాశ్వతకాలం జీవించే నిరీక్షణ పొందుతారని, అలాగే ఆ బలి మీపట్ల దేవునికున్న గొప్ప ప్రేమకు రుజువని బలంగా నమ్మినప్పుడు యేసు మీద విశ్వాసం ఉందని చూపిస్తారు. (రోమా. 8:32, 38, 39; ఎఫె. 1:7) విమోచన క్రయధనం వల్ల మీరు ప్రయోజనం పొందుతారని నమ్మినప్పుడు మీలో అపరాధభావాలు, పనికిరానివాళ్లమనే భావాలు కలగవు.—2 థెస్స. 2:16, 17.
రెండోది, యేసు బలి ఆధారంగా చేసే ప్రార్థన ద్వారా యెహోవాకు దగ్గరవ్వాలి. విమోచన క్రయధనం వల్ల మనం, ‘సహాయం అవసరమైనప్పుడు కరుణను, అపారదయను ప్రసాదించే దేవునికి’ ధైర్యంగా ప్రార్థించగలుగుతున్నాం. (హెబ్రీ. 4:15, 16; 10:19-22) పాపం చేయకూడదనే మన నిశ్చయతను బలంగా ఉంచుకోవడానికి ప్రార్థన సహాయం చేస్తుంది.—లూకా 22:40.
మూడోది, యేసుకు విధేయత చూపించాలి. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు, “కుమారుడి మీద విశ్వాసం చూపించే వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు. కుమారుడికి విధేయత చూపించని వ్యక్తి శాశ్వత జీవితం పొందడు; కానీ దేవుని ఆగ్రహం అతని మీదికి వస్తుంది.” (యోహా. 3:36) విశ్వాసం చూపించకపోవడం అవిధేయతతో సమానమని యోహాను చెప్పాడు. మనకు యేసు మీద విశ్వాసం ఉంటే ఆయనకు విధేయత చూపిస్తాం. అలా విధేయత చూపించాలంటే, “క్రీస్తు శాసనాన్ని” అంటే ఆయన బోధించిన, ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించాలి. (గల. 6:2) అంతేకాదు “నమ్మకమైన, బుద్ధిగల దాసుడి” ద్వారా ఆయన ఇస్తున్న నిర్దేశాన్ని పాటించాలి. (మత్త. 24:45) అలా పాటిస్తే సమస్యలు వరదలా వచ్చినా వాటిని తట్టుకోగలుగుతాం.—లూకా 6:47, 48.
“అత్యంత పవిత్రమైన మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి”
ఒక సందర్భంలో ఒకతను, “నాకు విశ్వాసం ఉంది! ఒకవేళ విశ్వాసం తక్కువగా ఉంటే సహాయం చెయ్యి” అని యేసుతో బిగ్గరగా అన్నాడు. (మార్కు 9:24) అతనికి కొంత విశ్వాసం ఉంది, కానీ ఇంకా విశ్వాసం అవసరమని అణకువతో గుర్తించాడు. మనందరికీ ఏదోక సమయంలో మరింత విశ్వాసం అవసరమౌతుంది. కాబట్టి మన విశ్వాసాన్ని ఇప్పుడే బలపర్చుకోవచ్చు. పై పేరాల్లో చూసినట్టు బైబిల్ని చదివి, చదివిన వాటిని లోతుగా ఆలోచించినప్పుడు యెహోవా పట్ల మన కృతజ్ఞత పెరుగుతుంది, మన విశ్వాసం బలపడుతుంది. తోటి సహోదరసహోదరీలతో కలిసి యెహోవాను ఆరాధించినప్పుడు, ఇతరులకు మన నిరీక్షణ గురించి చెప్పినప్పుడు, పట్టుదలగా ప్రార్థన చేసినప్పుడు కూడా మన విశ్వాసం బలపడుతుంది. ఇవన్నీ చేస్తూ దేవుని మీదున్న విశ్వాసాన్ని బలపర్చుకున్నప్పుడు, అన్నిటికన్నా గొప్ప ప్రతిఫలం పొందుతాం. అంటే, “ఎప్పుడూ దేవుడు ప్రేమించే ప్రజలుగా” ఉంటాం.—యూదా 20, 21.