ఆత్మీయముగా బలవంతులై, యెహోవా సేవకొరకు పరిశుభ్రముగా ఉండుడి
1 ప్రస్తుతం మన కండ్లముందు ప్రత్యక్షంగా నెరవేరుతున్న ఒక వాగ్దానాన్ని యెషయా 60:22లో యెహోవా చేశాడు. అది ఇలా ఉన్నది: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” ఒక జనమును గూర్చి మనము తలంచినప్పుడు, చట్టబద్ధంగా ఏర్పడిన ఒక ప్రభుత్వ అధికారము క్రింద, ఒకే ఆశాభావాలతో యేకమైన గొప్ప జనసమూపు గుంపు మన మదిలోకి వచ్చును.
2 ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రచారకుల క్రొత్త శిఖరాన్ని అనగా 42,78,820 మందిని 1991 ప్రాంతీయ సేవా నివేదిక చూపించినది. ఇది గత సంవత్సరము మీద 6.5 శాతము అభివృద్ధి. యెహోవా నిజంగా బాధాకరమైన ఈ విధానమునుండి వేరుపడి, తన కుమారుడైన యేసుక్రీస్తు మెస్సియా రాజ్యముక్రింద విశ్వాసపాత్రులైన నివాసులుగా ఉండగోరిన, యథార్థపరులగు గొప్ప జనసమూహమును సమకూర్చాడు. సంవత్సర సంవత్సరము సమకూర్చబడుతున్న వీరిసంఖ్య అభివృద్ధియగుచునే వున్నది. అక్షరార్థంగా ఒక క్రొత్తలోకపు సమాజము అని వర్ణించబడగల ఈ జనములో భాగమైయుండుటకు మనము ఆనందించెదము. 1991 జ్ఞాపకార్థదిన ఆచరణలో మొత్తము 1,06,50,158 మంది హాజరయ్యారు. ఇది 1990 సంవత్సరము కంటె 7-శాతము అభివృద్ధి. రాజ్యవాసులుగా మనతో అనేకమంది ఏకమగుటకు బహుగొప్ప అవకాశమును ఇది సూచించుచున్నది.
3 అయినను, పైన చూపబడిన జ్ఞాపకార్థపు హాజరులో ఉన్నవారంతా, యెహోవా ప్రజగా అంగీకరించ బడగల్గినంత యోగ్యంగా ఈ లోకంనుండి తమ్మును తాము వేరుపరచుకోలేదని మనకు తెలుసు. సమస్తజనముల నుండి ‘యెహోవా మందిరమునకు ప్రవాహమువలె వస్తున్నారు,’ కానీ ‘ఆయన త్రోవలో వారు నడచునట్లు’ ‘ఆయన మార్గములందు వారు బోధించబడవలెను.’ (యెష. 2:2-4) జ్ఞాపకార్థమునకు హాజరైనవారిలో నలభైలక్షలకంటె ఎక్కువమంది ఆత్మీయబలమును పొందుతున్నారు. ఈ ఆత్మీయ బలము వారిని పూర్తిగావించబడుతున్న రాజ్యప్రకటన పనిలో పాల్గొనుటకు అర్హులగునట్లు, పరిశుభ్రమైన ప్రవర్తనను కాపాడుకొనుటకు పురికొల్పినది. (మత్త. 24:14) అట్టివారు యెహోవా కన్నుల యెదుట మంచి స్థానమును కలిగియుండి ఆయన వారికందిస్తున్న అద్భుతకర ఏర్పాటులన్నిటినుండి కలుగు ప్రయోజనములను అనుభవిస్తున్నారు. అయితే మిగతా అరవై లక్షలమందికూడా వారివలె ఆత్మీయబలముపొంది, యెహోవా సేవకొరకు పరిశుభ్రంగా ఉండుటకు ఏమిచేయవలెను?
4 వారు “విశ్వాసము కొరకు మంచి పోరాటమును పోరాడవలెను.” (యూదా 3 ) ఒకసారి వారు యెహోవా మార్గంలో నడచుటకు ఎన్నుకొన్న తర్వాత, వారు అపవాదినుండి వచ్చేపరీక్షలు, శోధనలు, చెడు ప్రభావముల ద్వారా ఆ వత్తిడులకు గురియౌతారు. వారు పౌలువలె సహించుటకు కావలసిన బలముకొరకు యెహోవావైపు చూడవలెను. (ఫిలి. 4:13) అప్పటికే విశ్వాసమందు బలవంతులై యున్నవారి ద్వారా, అలాంటివారికి యెహోవా బలమును దయచేయును. పౌలు ఇలా హెచ్చరించెను, “బలవంతులమైన మనము . . . బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమైయున్నాము.” (రోమీ. 15:1, 2) బలవంతులు, బలహీనులు ఏకమైనప్పుడు స్థిరముగా నిలబడగల బలము కలుగును. “ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడియుండుట మేలు. . . . ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు.”—ప్రస. 4:9, 12.
5 అనగా క్రొత్తవారు యెహోవానుండి బలముపొందు నిమిత్తం వారు మనపై యుక్తంగా ఆధారపడెదరని దీని భావము. సమర్పించుకొన్న క్రైస్తవులైన మనము క్రొత్తవారికి సహాయము చేయాలంటే మనమట్టుకు మనం ఆత్మీయంగా బలంగా ఉండాలి. బలవంతులైయున్న క్రైస్తవులు ‘ఒకరిద్వారా మరొకరు ఆదరణపొందునట్లు’ ‘ఆత్మసంబంధమైన కృపావరముల’ నివ్వగల్లుదురు. (రోమీ. 1:11, 12) మనలను ఐక్యపరచి, మనందరిని ‘స్థిరపరచి బలపరచుటకు’ యెహోవా ఉపయోగించు ప్రధాన మార్గములలో ఇదొకటి.—1 పేతు. 5:9-11.
6 మన స్వంత ఆత్మీయ అవసరతల ఎడల శ్రద్ధవహిస్తూనే, ఈ క్రొత్తవారికి సహాయము చేయుట మనమొక గురిగా పెట్టుకొనవలెను. (మత్త. 5:3) ఆత్మీయత మన బలమునకు కీలకము. ఇది క్రమముగా ఆత్మీయాహారమును తీసుకొనుటద్వారా పోషించుకొనుచు, బలపరచు కొనలవలసిన లక్షణము. యెహోవా తన సంస్థద్వారా ఆయన వాక్యమును పఠించుటకు సమతూకమైన కార్యక్రమమును అందిస్తున్నాడు. వారములోని సంఘ ఐదు కూటములు ‘ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును పురికొల్పుతూ’ మనలను బలవంతులనుగా చేయుటలో ప్రముఖపాత్ర వహిస్తున్నవి.—హెబ్రీ. 10:24.
7 మనము వ్యక్తిగత మరియు కుటుంబ పఠనపు మంచి అలవాట్లను వాటితో జతపరచినట్లయిన కూటముల ద్వారా కలుగు ప్రయోజనములు రెట్టింపగును. ఒక కనీసగురిగా మనమందరము ప్రతిదినవచనమును చదివి పరిశీలించుట, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కార్యక్రమములో పొందుపరచబడిన బైబిలు పఠనమును క్రమముగా చేయుట, సంఘ పుస్తకపఠనము, కావలికోట పఠనమునకు సిద్ధపడుటను మనమందరము చేయవలెను. ప్రతి కుటుంబము అవి క్రమపద్ధతిలో జరుగునట్లు, దానినెట్లు వ్యవస్థీకరించుకొనవలెనో వారికై వారు నిర్ణయించుకొనవలెను. దానితోపాటు, కుటుంబ శిరస్సు వారి కుటుంబపు నిర్దిష్ట ఆత్మీయ అవసరతలకు అనుగుణ్యంగా ఉండునట్లు చూడాలి. ఈ విధంగా “ఇల్లు కట్టబడి. . . .స్థిరపరచబడును.” (సామె. 24:3) వ్యక్తిగతంగా, కుటుంబసమేతంగా, మన పఠన అలవాట్ల విషయంలో మనసుపెట్టి ఉన్నట్లయిన, యెహోవా మనలను ఆశీర్వదించునని, అనేక పరీక్షలను విజయవంతముగా సహించునట్లు ఆయన ఆత్మ సహాయముచేయునని మనము నమ్మకము కలిగియుండగలము.
8 పరిశుభ్రంగా ఉంటూ నిందకు అతీతులైయుండుడి: యెహోవా మనలను ఆయనకు సమీపస్థులమగుటకు ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నను, అదే సమయంలో దీనిని ‘సమస్త పాపములనుండి మనలను శుద్ధిచేయు’ యేసు చిందించిన రక్తములో విశ్వాసముంచుటద్వారా చేయవలెనని స్పష్టంచేయుచున్నాడు. (1 యోహా. 1:7; హెబీ. 9:14 కూడ చూడుము.) దేవుని వాక్యమును వ్యక్తిగతంగా చదువుట, మనము నేర్చుకొన్నదానిని అన్వయించుకొనుటద్వారా మనము మన విశ్వాసమును బలపరచుకొనుటలో కొనసాగగలము. ఆత్మీయాహారమును తీసుకొనుటలో విఫలమగుటచేతనో లేక దానిని తమ జీవితములలో అన్వయింపజేసి కొనుటకు ఎక్కువ ప్రయత్నము చేయకపోవుటవల్లనో కొందరు దానిని పోగొట్టుకొందురు. ఇది వారిని సాతాను ముట్టడులకు అనుకూలమైనవారిగా చేయును. కొందరు ఆత్మీయంగా బలహీనులై, తద్వారా నిష్క్రియకు లోనైరి. విచారకరంగా, ఇతరులు గంభీరమైన తప్పుకు లోబడి, వెలివేయబడిరి. పౌలు ఇలా హెచ్చరించెను: “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కొరిం. 10:12) మనము బుద్ధిపూర్వకంగా పఠనమును, కూటములకు హాజరగుటను, సేవను నిర్లక్ష్యము చేసినట్లయిన సులభంగా అపరిశుద్ధమైన ప్రభావములు మరియు శోధనలచే పట్టబడెదము.—హెబ్రీ. 2:1; 2 పేతు. 2:20-22.
9 మనకై మనము అన్ని విధములుగా పరిశుభ్రముగా ఉండుట ప్రాముఖ్యము: భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా, నైతికంగా. (2 కొరిం 7:1) మన చుట్టువున్న లోకము అనుదినము పెడదారిపట్టుచు భ్రష్టమైన స్థితికి దిగజారుతుంది. క్రితమెన్నటికంటెను ఎక్కువైన మోసకర పద్ధతులతో అపవాది మనలను తన వలలో వేసికొనుటకు పైపైకి వస్తున్నాడు. మనకై మనము ఆత్మీయంగా బలంగావుంచుకొనుట ద్వారా ‘అతను మనలను మోసపరచకుండునట్లు . . . సాతాను తంత్రములను’ ఎరిగి యుందుము. (2 కొరిం. 2:11) యెహోవా సంస్థనుండి మనము పొందు ఉపదేశము మరియు ఆలోచన చెడు ప్రభావములను గుర్తించి వాటిని ఎదిరించుటకు మనకు సహాయము చేయును.
10 సంఘములో నాయకత్వము తీసికొనువారు బలముగావుండి, పరిశుభ్రముగా ఉండుటలో ఇతరులకు మంచిమాదిరి చూపవలసిన బాధ్యతకలిగియున్నారు. పౌలు ఆ బాధ్యతను నొక్కితెలుపుతూ ఇలా అన్నాడు: “మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.” (హెబ్రీ. 13:7) నియమించబడిన పెద్దలు, పరిచారకులు, వారి వ్యక్తిగత ప్రవర్తనలోను కుటుంబ శిరస్సులుగా వారి బాధ్యతలను నిర్వహించుటలోను మాదిరికరముగా ఉండుట ప్రాముఖ్యము. “మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను . . . మాదిరిగా ఉండుము” అని గట్టిగా ప్రోత్సహించబడిన యౌవనుడుగు తిమోతివలె ఉండుటకు వారు పోరాడవలెను. (1 తిమో. 4:12; 1 పేతు. 5:3) గౌరవనీయమైన ప్రవర్తనను కాపాడుకొంటూ మంచి మాదిరికరంగా ఉండు బాధ్యతలో మిగతా మనమందరము పాలుకలిగి యున్నాము. క్రొత్తవారు తరచు మనలో చూచుదానినిబట్టే, సత్యమునుగూర్చి యెహోవా సంస్థను గూర్చి తీర్పుతీర్చెదరు. మనలో వారు చూచుదానిద్వారా యెహోవా పరిశుద్ధ సంస్థతో స్థానమును తేసికొనునట్లు ప్రోత్సహించబడులాగున మనము నిశ్చయతను కలిగియుండవలెను.
11 “మహాశ్రమలలో” తప్పించుకొను వారిని సమకూర్చు పని ఉద్రిక్తమవుతుంది. (ప్రక. 7:14) ఎవరైతే ఆత్మీయముగా బలంగావుండి తమ్మునుతాము పరిశుభ్రంగా ఉంచుకొంటారో వారే చివరకు రక్షించబడేది. ఎక్కువగా అది ఈ క్రింది వాస్తవములపై ఆధారపడివుంటుంది: (1) మంచి పఠన అలవాట్లను కలిగివుంటూ, దేవుని వాక్యమును ధ్యానించుట; (2) ప్రోత్సాహమునివ్వవలెనను కోరికతో ఒకరియెడల మరొకరు నిజమైన వ్యక్తిగత శ్రద్ధ చూపించుట; (3) యెహోవా నామమును ఘనపరచు పరిశుభ్రమైన ప్రవర్తనను కాపాడుకొనుటకు ఐక్యముగా కలసి పనిచేయుట. వీటిని చేయుట యెహోవా ఆశీర్వాదములను, ఈ లోకము అంతమునకొచ్చునప్పుడు రక్షణను అభయముగా ఇవ్వగలవు. ‘యెహోవా కాపాడు విశ్వాసులలో’ మనమును ఒకరమైయుండు నమ్మకమును కలిగియుండగలము.—కీర్త. 31:23.