మీ సంఘంలోని బహిరంగ కూట కార్యక్రమానికి పూర్తిగా మద్దతునివ్వండి
1 కొన్ని సంవత్సరాలకు ముందు ఒక యువకునికి ఆ ప్రాంతంలోని సంఘ కూటాలను ప్రకటించే ఒక కరపత్రం లభించింది. ఆయన సత్యం కొరకు అన్వేషిస్తున్నాడు కాబట్టి, ఆ ఆదివారమే బహిరంగ కూటానికి హాజరు కావాలని తీర్మానించుకున్నాడు, రాజ్య మందిరానికి సమయానికి ముందే వెళ్ళాడు. ఒక ప్రచారకుడు అతన్ని ఆప్యాయంగా పలకరించాడు, వారు మాట్లాడుతుండగా అతన్ని బైబిలు పఠనాన్ని గూర్చి ఆయన అడిగాడు గాని, అతడు దాన్ని నిరాకరించాడు. అయితే, బాగా సిద్ధపడి యివ్వబడిన బహిరంగ ప్రసంగం వల్ల ప్రభావితుడై అతడు మనస్సు మార్చుకున్నాడు, కూటం తర్వాత అతడు బైబిలు పఠనాన్ని అంగీకరించాడు. ఈ యువకుడు త్వరగా అభివృద్ధి సాధించి, కొన్ని నెలల తర్వాత బాప్తిస్మం పొందాడు. ఈ అనుభవం నుండి మనం కనీసం మూడు సహాయకరమైన పాఠాలను నేర్చుకోవచ్చు.
2 మొదటిదేమంటే, బహిరంగ కూటం ప్రకటించబడింది. మీరు సంఘ కూట కార్యక్రమాలను ప్రకటించే ముద్రించబడిన కరపత్రాలను ఉపయోగిస్తారా? అధ్యక్షుడు తర్వాతి వారం యివ్వబడే బహిరంగ ప్రసంగ అంశాన్ని ప్రకటించగా, మీ ప్రాంతంలో మన ప్రస్తుత సాహిత్యాలను చదువుతున్నా, లేకున్నా ఆ అంశంలో ప్రత్యేక శ్రద్ధవున్నవారిని గూర్చి తలంచండి. కొందరు ప్రజలు సాహిత్యాలు చదవడానికి ఇష్టపడరు, లేదా ఎంతో కష్టంగా చదువుతారు, కాని వారు లేఖనాంశాన్ని గూర్చిన ప్రసంగాన్ని వినడానికి యిష్టపడవచ్చు.
3 రెండవదిగా, క్రొత్తగా వచ్చినవ్యక్తి ఆప్యాయంగా ఆహ్వానించబడ్డాడు. మీరు సాధ్యమైనంత త్వరగా రాజ్యమందిరానికి చేరుకున్నట్లయితే, మీరు మీ సహోదరులను, సహోదరీలను, అలాగే ఆసక్తిగలవారిని పలకరించగలరు. (హెబ్రీ. 10:24) ఎవరైనా క్రొత్తవారు మొదటిసారిగా వచ్చినట్లయితే, అక్కడ ఏం జరుగుతుందో అతనికి తెలియదు. మన కూటాలు పాట, ప్రార్థనలతో ఆరంభమౌతాయని వివరించి, కూటాలు ఎలా నిర్వహించబడతాయో అతనికి చెప్పండి. వీలున్నట్లయితే, మీ బైబిలును, పాటల పుస్తకాన్ని అతనికి కూడా చూపించడానికి అతన్ని మీ దగ్గర కూర్చోవడానికి ఆహ్వానించండి. కూటం ముగిసిన తర్వాత అతనికి ఏమైనా ప్రశ్నలున్నట్లయితే మీతో చర్చించవచ్చని చెప్పండి.
4 మూడవదిగా, ప్రసంగం యివ్వడానికి బాగా సిద్ధపడడం జరిగింది. మరింత ప్రేమను కలిగివుండి, మంచి పనులు చేయాలని ప్రేక్షకులను పురికొల్పడానికి, సంఘం తరపున బహిరంగ ప్రసంగమివ్వడానికి ఆధిక్యత పొందినవారు చాలా గంటలు అభ్యాసంచేసి, సిద్ధపడతారు. నేడు మనమందరం వత్తిడిలో ఉన్నాం. మనం సహనంతో ఉండడానికి మనకు సహాయం చేసే, సరిగ్గా మనకవసరమయ్యే, ఉపశమనాన్నిచ్చే సత్యాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. బహిరంగ ప్రసంగం ఎంత విజ్ఞానాన్ని అందించేదైనప్పటికీ, దాన్ని మనం శ్రద్ధగా వినకపోతే, మనకు ఏ మాత్రం ప్రయోజనం కలగదనడానికి సందేహం లేదు. ప్రసంగం శ్రద్ధగా వినడానికి అప్పుడప్పుడు యిబ్బందిగా ఉందా? మనం సమావేశాల్లో రాస్తున్నట్లుగానే, చిన్న నోట్సు రాసుకోవడం సహాయకరంగా ఉండవచ్చు. ఒక్కో లేఖనం చదివి, దాన్ని వివరిస్తున్నప్పుడు మీరు కూడా బైబిలు తెరిచి చూడాలని తీర్మానించుకోండి.
5 అనేక లేఖనాంశాలపై ఆధారపడిన వివిధ బహిరంగ ప్రసంగాలను సొసైటీ అందించింది. సంఘాధ్యక్షుడు లేదా ఆయన నియమించిన వ్యక్తిద్వారా, పెద్దలు సంఘంకొరకైన బహిరంగ కూట కార్యక్రమాన్ని సమన్వయపరుస్తారు. సొసైటీ తయారు చేసిన విషయాలు ప్రస్తుత ప్రాంతీయ అవసరాలను బట్టి ఉపయోగించబడతాయి. ఈ ప్రధానమైన వివరాలను వేటిని జార విడుచుకోవద్దు, మీ సంఘంలోని వారపు బహిరంగ కూటానికి పూర్తిగా మద్దతునివ్వండి.