యెహోవా సేవలో ఆనందించుట
1 దైవావేశముతో వ్రాస్తూ, “నా సేవకులు మంచి హృదయస్థితినిబట్టి ఆనందంతో కేకలు వేసెదరు,” అని తగినట్లుగానే, యెషయా దేవుని ప్రజలనుగూర్చి ప్రవచించాడు. (యెష. 65:14, NW) ప్రతిరోజు ఒకరు అనేకమైన ఒత్తిళ్లను, సమస్యలనెదుర్కోవలసి వస్తున్నప్పుడు నేనెలా ఆనందంగా ఉండగలను? అని అనేకమంది అడుగవచ్చు. మనమెదుర్కొనే ఆర్థికమైన, భావాత్మకమైన, మరితర భౌతిక సంబంధ కష్టాలతోపాటు, క్రైస్తవ ఆరాధన, సేవకు సంబంధించిన బాధ్యతలు కూడా ఉన్నాయి. ఈ బాధ్యతలన్నింటినీ, ఆధునిక దిన జీవితమందలి కష్టాలను ఎదుర్కోడానికి ప్రయత్నిస్తూ, వారెలా సంతోషంగా ఉండగలరని అనేకమంది ఆశ్చర్యపోతారు.
2 “మంచి హృదయస్థితి” ఆ విధంగా మన జీవితాల్లో సంతోషాన్ని పురికొల్పుతుందని యెషయా చెప్పిన ప్రేరేపిత మాటలను మీరు గమనించారా? భౌతిక సంబంధమైన ఆస్తులు, వినోదం, స్వతంత్రతలపై ఆనందమనేది ఆధారపడివుందని ప్రోత్సహించే లోక తత్వసిద్ధాంతానికి యిది భిన్నంగా ఉంది. వాస్తవమైన ఆనందం అలంకారిక హృదయం లేదా మన కార్యకలాపాలు, కోరికలు, అనురాగాలు, భావాలలో వ్యక్తంచేయబడే అంతఃపురుషుని నుండి వస్తుంది. అయితే ఆనందం అంటే ఏమిటి? ఇది ఈ విధంగా వర్ణించబడింది: “మంచిని సంపాదించుకున్నందున లేదా జరుగుతుందనే నిరీక్షణతో ఉప్పొంగిన భావావేశం; సంతోషకరమైన స్థితి; విజయానందం.” (ఇన్‌సైట్, వాల్యూమ్ 2, పేజి 119) వేగంగా సమీపిస్తున్న నూతనలోకాన్ని గూర్చి భావావేశంతోను ఆనందంతోను మనం ఉప్పొంగిపోమా? కాని, నిరంతరమూ మన జీవితాలను ముట్టడించేలా కన్పించే సమస్యల నడుమ ప్రస్తుతం మనం ‘సంతోషకరమైన స్థితిని’ ఎలా పొందగలం? అని మీరడుగవచ్చును.
3 జీవిత సమస్యలన్నింటినీ పూర్తిగా నిర్మూలం చేయడమనేది అసాధ్యం. కేవలం నూతన లోకం మాత్రమే, సమస్యలులేని స్థితిలో జీవించడానికి మనలను అనుమతిస్తుంది. కాని మన జీవితాల్లో ఆనందాన్ని పెంపొందించుకోడానికి తీసుకోదగిన మార్గాలున్నాయి. ఆనందమయమైన ప్రజలతో సహవసించడంద్వారా మన సంతోషాన్ని వృద్ధిచేసుకోవచ్చు. యెహోవా “సంతోషకరమైన దేవుడు” అని వర్ణించబడ్డాడు. (1 తిమో. 1:11, NW) యాకోబు 4:8 లోని ప్రోత్సాహాన్ని అనుసరించి, మన ఆనందాన్ని పెంపొందించుకోగలమా? “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును,” అని అది చెబుతుంది. ప్రార్థనద్వారా, ఆయన వాక్యాన్ని చదివి వ్యక్తిగతంగా పఠించడం, ఆయన చిత్తాన్ని చేయడంద్వారా మనం దేవునికి సమీపస్తులమౌతాము. యేసుకు ఆనందాన్ని చేకూర్చింది ఇదే. ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడాన్ని, ప్రీతికరమైన భోజనం చేయడంతో పోల్చాడు. (యోహా. 4:34) అదే రీతిలో మీరు కూడా మీ ఆనందాన్ని వృద్ధిచేసుకోగలరా?
4 ఏప్రిల్, ఆనందం పెంపొందిన కాలం: ఆనందమయ ఆత్మీయ కార్యకలాపంతో కూడిన నెలగా ఏప్రిల్‌ను తయారుచేయడానికి అన్ని సంఘాలు యోచన చేస్తున్నాయి. మన సేవకు సంబంధించిన మూడు రీతులను గురించి ప్రత్యేకంగా నొక్కిచెప్పబడుతుంది. (1) సహాయ పయినీర్ గూర్చి గంభీరంగా ఆలోచించమని మనం అందర్నీ ప్రోత్సహిస్తాం; (2) క్రొత్త బైబిలు పఠనాలను ఆరంభించే గురిని గూర్చి ఎక్కువ నొక్కిచెప్పబడుతుంది; (3) వీధిసాక్ష్యం ప్రాముఖ్యంగా చేయబడేచోట పత్రికనందించే ప్రత్యేక దిన సేవలో భాగం వహించాలని మీరు ప్రోత్సహించబడతారు. బహుశ ఈ విధమైన పరిచర్యలో భాగం వహించడంలోని ఆనందాన్ని మీరెన్నడూ అనుభవించి యుండకపోవచ్చు. ఈ ఏర్పాట్లకు పూర్ణహృదయంతో మద్దతునివ్వడంద్వారా ఏప్రిల్ నెలలో మీ ఆనందాన్ని పెంపొందించుకొనడానికి యిప్పుడే యోచన చేయండి.
5 సహాయ పయినీరింగ్: ఈ సేవా కార్యక్రమము మీకు అనుకూలంగా లేదని వెంటనే త్యజించేముందు, అది మీ జీవితంలో తీసుకువచ్చే ఆనందాన్ని పరిశీలించండి. సువార్త ప్రకటనలో వారు నిమగ్నమైనప్పుడు యేసు శిష్యులు అనుభవించిన ఆనంద భావాన్ని గూర్చి ఒక్క క్షణం ధ్యానించండి. మొట్టమొదట ఈ పనిని చేపట్టిన వారిలో కొందరు ఆనందంతో నింపబడిన స్థితిలో యేసునొద్దకు తిరిగివచ్చారు. ‘ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగివచ్చారు.’ (లూకా 10:17) మాట్లాడగల్గే తమ సామర్థ్యతను సందేహించకుండా ఉండేలా వారు నేర్చుకున్న సత్యాలను ప్రకటించడానికి వెళ్లారు. యేసు నుండి తాము నేర్చుకున్న మంచి విషయాలతో తమ హృదయాలను నింపుకొని, ఈ విషయాలను యితరులతో చెప్పడానికి వారు ఆతురతతో ఎదురు చూశారు. అసంతోషకరమైన అనుభవాలు, వారు మాట్లాడిన అనేకులలో ఆసక్తి లేకపోవడం అనేవి తమ ఆనందాన్ని తక్కువ చేయలేదు. ఈ పద్ధతిలో దేవుని సేవించుట యెడల వారికున్న మానసిక దృక్పథంద్వారా, వారు ఆయన హృదయాన్ని సంతోషపరుస్తున్నారని తెలిసికొనడంవల్ల అది సజీవంగా ఉంచబడింది.—సామె. 27:11.
6 దేవుని వాక్యంలోని మంచి విషయాలను బహిరంగంగా ప్రకటించాలంటే, ఒకరు యితరులకు బలాన్ని చేకూర్చేదానిని, జీవాన్ని నిలిపేదానిని ఉచితంగా యివ్వాలి. మంచి వాటిని యితరులకు యివ్వడంలో సంతోషం వుంది కాబట్టి, ఇది ఆనందాన్ని చేకూరుస్తుంది. అపొస్తలుడైన పౌలు క్రైస్తవ పరిచర్యను గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన సూచించిన నియమమిదే. “మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు—పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.” (అపొ. 20:35) వారు నేర్చుకున్న మంచి వాటిని యితరులకు యిచ్చుటలో పౌలు, ఆయన సహచరులు ఆనందాన్ని పొందారు, ఆలాగే ఈనాడు యెహోవా దేవుని సేవించే వారంతా అదే మానసిక దృక్పథాన్ని కల్గివున్నట్లైతే, ఆలాంటి ప్రోత్సాహకరమైన పనిని చేయడంలో ఆనందాన్ని పొందగలరు.
7 ఏప్రిల్‌లో ప్రాంతీయసేవను వృద్ధిచేసుకోవడంద్వారా మీ ఆనందాన్ని కూడా వృద్ధిచేసుకోడానికి మీరు యోచిస్తున్నారా? మన ప్రాంతం ఇంతకుముందే పూర్తిచేయబడింది, ప్రతిస్పందన అంత ప్రోత్సాహకరంగా లేదు; నేను ఖాళీగా వున్న సమయాన్ని లేదా బహుశ తీరిక సమయాన్ని ఉపయోగించాల్సి వస్తుందేమో; నేను నా షెడ్యూల్‌లో స్వయం త్యాగం చేయాల్సిన కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుందేమో అనేటటువంటి ప్రతికూలవైఖరితో మీ మనస్సును నింపవద్దు. ఔను, మీ ఆత్మీయతను మంచిస్థాయిలో ఉంచడానికి అవసరంలేని ఏదైనా పని విధానాన్ని మీరు మానుకోవాల్సి ఉంటుంది. కాని ప్రతికూల వైఖరిని కల్గియుండే బదులు, ప్రాంతీయ సేవను పెంపొందించుకోవడం వల్ల సాధించగల ఆనందాన్ని గూర్చి ధ్యానించండి. గుర్తుంచుకోండి, ఆనందమనేది ‘హృదయంలోని మంచి స్థితినిబట్టే’ కలుగుతుంది. (యెష. 65:14) యెహోవాను సంతోషపెట్టడం కొరకు, ఆలాగే యితరుల నిమిత్తం మీకై మీరు కృషిసల్పుతున్నారని తెలిసికోవడమనేది మీ అలంకారికమైన హృదయంలో లోతైన సంతృప్తిని కలుగజేసి, అది మీ జీవితంలో వెలుగును విరజిల్లజేస్తుంది.
8 దేవుని వాక్యంనుండి మీరు నేర్చుకున్న వాటిని ఇతరులకు ప్రకటించే సామర్థ్యంలేదని మీరు గ్రహించిన దేన్నిబట్టయినా మీరు ఏప్రిల్‌లో సహాయ పయినీర్ చేయకుండా ఉండేందుకు అనుమతించవద్దు. అలా చేసినట్లైతే, ఆయన సేవలోని ఆనందాన్ని తొలగించగల మానసిక దృక్పథాన్ని మీరు అనుమతిస్తారు. నైపుణ్యంగా మాట్లాడగల ఒక క్రైస్తవ సహోదరునితో మీకున్న మాట్లాడే సామర్థ్యాన్ని పోల్చుకోవద్దు. బదులుగా, దానిని మీరు పరిచర్యలో కలుసుకొనే వారితో అనగా క్రైస్తవులమని చెప్పుకుంటూ, దేవుని సత్యాన్ని యితరులతో చెప్పని ప్రజలతో పోల్చండి. మీకున్న సామర్థ్యాన్ని ఉపయోగించి, దాన్ని వృద్ధిచేసుకోడానికి ప్రయత్నించండి. దేవుడు తన ఉద్దేశాలను ప్రకటించడానికి లోకంలోని జ్ఞానులను లేదా గొప్ప ప్రసంగీకులను కాదుగాని, మాట్లాడుటలో ప్రత్యేకమైన నేర్పులేని దీనులను ఎన్నుకున్నాడన్న విషయం జ్ఞాపకముంచుకోండి. (1 కొరిం. 1:26-29) యేసు కాలంలో, పరిచర్యలో ఎక్కువ ఆనందాన్ని పొందిన తన శిష్యులు జాలరులవంటి సామాన్య ప్రజలే. సరైన మానసిక దృక్పథంతో వున్నట్లైతే, యెహోవాను సేవించే ఆనందము మీది కాగలదు.
9 ప్రస్తుతము మీరు ఎలాంటి మార్గాలు చేపట్టగలరు? మొదట, మీ పరిస్థితులను యథార్థంగా, ప్రార్థనాపూర్వకంగా విశ్లేషించండి. మీరొక క్రైస్తవ కుటుంబ సభ్యులైతే, భర్తతోగాని లేదా నడిపింపునిచ్చే తండ్రితోగాని దీన్ని మీరు కలిసి చేయవచ్చు. దీన్ని మీరు బహు కష్టమైన మెట్టుగా గుర్తించగలరు. రాజ్య ఆసక్తులను ముందుంచాలనే దృక్పథంతో మీ జీవన పద్ధతిని పునర్విమర్శించడానికి ధైర్యం అవసరం. దేవుని సేవను పెంపొందించే నిమిత్తం, ఉల్లాసవంతమైనవైనప్పటికీ అనవసరమైన కార్యకలాపాలను విడనాడాలంటే ఆత్మీయ బలం అవసరం. దేవుని సేవించడానికి సర్దుబాటు చేసుకోవడానికి యిష్టత చూపినట్లైతే అది ఆనందాన్ని చేకూరుస్తుంది. చురుకైన పద్ధతిలో యెహోవాను సేవించడానికి వున్న అవకాశాలను ఉపయోగించుకున్నందువల్ల వచ్చే ఫలితం 1 దినవృత్తాంతములు 29:9, 10 లో లిఖించబడింది. ‘వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడెను.’ ఏప్రిల్‌లో యెహోవా యిచ్చే ఆనందాన్ని అనుభవించడానికి యోచన చేయండి.
10 ఏప్రిల్‌లో సంఘం సాయంకాల సాక్ష్యం, వారం మధ్యలో చేసే సాక్ష్యపు పనితోపాటు ప్రత్యేకమైన ప్రాంతీయ సేవా ఏర్పాట్లను చేసుకోవాలి. ప్రాంతీయ సేవకొరకైన ఈ కూటాలకు మీరు హాజరవ్వడం యితరులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ షెడ్యూల్‌కు తగినట్లుగా ప్రాంతీయ సేవా ఏర్పాట్లకు సంబంధించిన సమయాలు అనుకూలంగా లేనట్లైతే, పెద్దలతో మాట్లాడండి, తద్వారా మీకు ప్రాంతీయ సేవకు అనువుగావున్న సమయంలో మీతోపాటు యితరులను ఏర్పాటు చేయడం సాధ్యంకావచ్చు.
11 ప్రార్థనాపూర్వకంగా, యథార్థంగా మీ పరిస్థితులనుగూర్చి తెలిసికొన్న తర్వాత సహాయ పయినీర్‌గా 60 గంటలు చేరుకోవడానికి సాధ్యం కాదని కనుగొన్నట్లయితే, నిరుత్సాహపడవద్దు. ఇతరులను పయినీర్ చేయడానికి ప్రోత్సహిస్తూ, వారికి ఆచరణయోగ్యమైన పద్ధతుల్లో మద్దతునిస్తూ ఆ నెలలో నెలకొన్న స్ఫూర్తిలో మీరు భాగం వహించండి. కనీసం మీ సేవను కొంచెమైనా బహుశ మీరు పెంపొందించుకోవచ్చు, తద్వారా మంచి మాదిరినుంచండి. పూర్ణహృదయంతో పురికొల్పబడి చేసిన సేవనుబట్టి యెహోవా సంతోషిస్తాడు. అనేకమంది తాము కోరిన విధంగా చేయడానికి అనుమతించని భౌతిక లేదా యితర హద్దులున్నాయి. అయినా, మనఃసాక్షికల్గి పూర్ణాత్మతో యెహోవాను సేవిస్తున్నందువల్ల ఆయనకు ఆనందాన్ని తెచ్చామని తెలిసికోవడాన్నిబట్టి వీరు తృప్తిని పొందగలరు.
12 బైబిలు పఠనాన్ని ప్రారంభించడం అదనపు ఆనందాన్నిస్తుంది: రాజ్య సువార్తను ప్రకటించాలనే ఆజ్ఞకు లోబడటం ఆనందదాయకమైనప్పటికీ, శిష్యులను చేసేవారుగా తయారైన వారికి మరెక్కువ ఆనందం వస్తుంది. (మత్త. 24:14; 28:19, 20) ఇతరులు శిష్యులుగా మారేలా బోధించమని ప్రస్తుతం ప్రఖ్యాతిగాంచిన ఆజ్ఞను యేసు యిచ్చినప్పుడు, ఆయన పురుషులు, స్త్రీలు, పిల్లలతో సహా 500 మందితో మాట్లాడుతున్నాడు. అదే బాధ్యత ఈనాడు గొప్ప గుంపుగావున్న క్రైస్తవ శిష్యులకు వర్తిస్తుంది.
13 మన సువార్త ప్రకటనకు యిదెలా వర్తించాలి? ఇంటింటను, బహిరంగంగాను సువార్త ప్రకటించడానికిగల ముఖ్య కారణాలలో ఒకదానిని మనం మెచ్చుకొనేందుకు ఇది సహాయపడుతుంది. లోకానికి సమీపిస్తున్న అంతాన్ని గూర్చి హెచ్చరించడంతోపాటు, గొర్రెలాంటి ప్రజలను కనుగొని, యేసుకు లోబడే శిష్యులుగా తయారైన వారికి అనుకూలమైన నిరీక్షణ కలదని వారికి బోధించడం కూడా మన గురియైవుంది. దేవునితో సహపనివానిగా ఉండడానికి, ఒక వ్యక్తి యెహోవాకు చురుకైన సేవకుడుగా తయారయ్యేంతవరకూ ఆత్మీయంగా ఎదగడాన్ని గమనించడం ఎంత ఆనందదాయకమైనది.—1 కొరిం. 3:6-9.
14 మనం నామకార్థంగా చేసే సేవతో తృప్తి పొందితే, అలాంటి ఆనందం ఎన్నడూ అనుభవింపలేము. నామకార్థ సేవ యెహోవాకు అంగీకారమైనది కాదు. ప్రేమతో ఆయనకు సమర్పించుకున్న హృదయంనుండి అది వచ్చేది కాదు, లేదా ఒకని పొరుగువానియెడల ప్రేమతోకూడిన ఆసక్తిని వ్యక్తంచేయదు. నామకార్థ సేవ రెండు విధాలుగా వెల్లడౌతుంది. ఒకరు పరిచర్యలో ఆనందించరు, కాబట్టి కొద్దిపాటి సేవతో తృప్తి చెందుతారు, అలాగే ఆసక్తిని అలవరచుకొనే కోరికను ప్రదర్శించరు. “ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది,” అని 1 తిమోతి 2:3, 4 లో లిఖించిన పౌలు మాటలకు అలాంటి దృక్పథం బాహాటంగా విరుద్ధమైనది.
15 రక్షణ పొందేందుకు సత్యానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలిసికొనేలా ఇతరులకు సహాయపడడంద్వారా యెహోవా చిత్తానికి తగినట్లుగా పనిచేయడానికి గల మన కోరికను ప్రదర్శించడానికి ఏప్రిల్‌లో మనమేమి చేయగలం? బైబిలు పఠనం ప్రారంభించే గురిని పెట్టుకోండి! పనిచేయు స్థలంలో, పాఠశాలలో, పొరుగువారితో, బంధువులతో లేదా యితరులతో ఇంతకు ముందు మీరు సత్యాన్ని గూర్చి మాట్లాడిన వారిని గూర్చి ఆలోచించండి. వారితో బైబిలు పఠనం ఆరంభించాలనే గురితో నిజంగా మీరు పనిచేశారా లేక కేవలం ఒక సంతోషమైన సంభాషణలో పాల్గొనడంతో తృప్తిపొందుతున్నారా? శిష్యుని తయారుచేయాలనే దృష్టితో గృహ బైబిలు పఠనం నిర్వహించడంద్వారా సత్యాన్ని బోధించడం అత్యంత ప్రభావవంతమైన పద్ధతి.
16 ఇంటింటి సేవా పనిలో పాల్గొన్నప్పుడు ఈ గురిని మనమెలా మనసులో కల్గియుండగలం? గొర్రెలాంటి వారిని కనుగొనాలనే తీవ్రమైన కోరికవుందని, బైబిలు పఠనం నిర్వహించడంద్వారా వీరు సత్యాన్ని గూర్చిన సరైన జ్ఞానాన్ని పొందేలా సహాయం చేయడానికి మీరు యిష్టపడుతున్నారని మీ ప్రార్థనద్వారా యెహోవాకు తెలియజేయండి. మీరు సాహిత్యాన్ని అందించినా, అందించకపోయినా ఆసక్తి కనుగొన్న ప్రతిచోటకు తిరిగివెళ్లండి. మొదటి సందర్శనలోనే దృఢమైన పునాదిని వేయడానికి నిశ్చయించుకోండి, మీ పునర్దర్శనానికి వీలుగా ఒక ప్రశ్నవేసి దానికి జవాబు చెప్పకుండా విడిచిపెట్టవచ్చు. సాధ్యమైతే, వారంలోపుకాకుండా కొద్ది రోజుల్లోనే పునర్దర్శించండి. పునర్దర్శనాలు చేయడంలో, బైబిలు పఠనాలు ఆరంభించడంలో విజయం పొందిన వారినుండి సహాయాన్ని కోరండి. యెహోవా ఆశీర్వాదం కొరకు అడుగుతూనే ఉండండి.—మత్త. 7:7-11.
17 పత్రికతో సాక్ష్యమిచ్చే ప్రత్యేక దినమందలి ఆనందం: వీధిసాక్ష్యాన్ని ప్రత్యేకంగా నొక్కిచెబుతూ ఇండియా అంతటిలోనూ శనివారం, ఏప్రిల్ 16, 1994 న పత్రికతో సాక్ష్యమిచ్చే ప్రత్యేక దినమౌతుంది. మీ పెద్దలు మీ సంఘానికి సంబంధించిన ఏర్పాట్లనుగూర్చి ప్రకటిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ప్రాంతీయసేవ కొరకైన కూటాలతో రోజంతా సేవలో గడిపేలా ఉంటుంది. ఆచరణయోగ్యమైతే, కనీసం వీటిలో ఒకటి బహుశ ఉదయం గుంపులో, సంఘంలోని వారంతా ఒకే ప్రదేశానికి ఆహ్వానింపబడి కలిసికట్టుగా సాక్ష్యమిచ్చేలా చేయగలరు. ఈ ప్రత్యేక దిన ప్రాంతీయసేవలో సంఘమందలి ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని వెచ్చించగల్గితే ఎంత ఆనందంగా ఉంటుంది.
18 ఈ ప్రత్యేక దినాన వీధి సాక్ష్యం కొరకు పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వీధి సాక్ష్యమిచ్చేందుకు పరిమితమైన ప్రాంతమున్న సంఘాలు పార్క్‌లు, బీచ్‌లు లేదా ఎన్నడూ సాక్ష్యమివ్వబడని ప్రాంతాల్లో ప్రజలు గుమికూడేచోట సాక్ష్యమివ్వడానికి ఏర్పాటుచేసుకోవచ్చు. ప్రజలను సమీపించేటప్పుడు నేర్పు కల్గివుండండి, ఉద్రిక్తపూరిత చర్చలను విసర్జించండి. “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి,” అని రోమీయులు 12:18 లో మనకు చెప్పబడింది.
19 వీధిసాక్ష్యంలో పాల్గొనేటప్పుడు ఆనందాన్ని కల్గియుండగలమా? ఈ రకమైన సేవకు సంబంధించి మీకు కొన్ని వినాయింపులు లేదా “భయం” ఉన్నట్లైతే మీరు అసాధారణమైనవారుకారు. బహిరంగ స్థలాల్లో ప్రజలను సమీపించి సువార్త ప్రకటించడానికి విశ్వాసం కలిగి, యెహోవాపై ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఈ మార్గాలు చేపట్టడానికి మీరు భయపడవచ్చు, కాని ఒకసారి మీరు ప్రయత్నిస్తే, ఆయన చిత్తాన్ని జరిగించుటలో శక్తిని, ధైర్యాన్ని యెహోవా ఇచ్చాడని తెలిసికోవడంద్వారా ఆనందం వస్తుంది. “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను,” అని వివరించిన ఫిలిప్పీయులు 4:13 నందలి మాటలనుండి మనం ఓదార్పును పొందగలము.
20 ఏప్రిల్‌లో మీ ఆనందాన్ని పెంపొందించుకోండి: “నా సేవకులు హృదయంలోని మంచిస్థితినిబట్టి ఆనందంతో కేకలు వేసెదరు,” అని యెషయా 65:14 లోని మాటల గొప్ప నెరవేర్పు మీ జీవితంలో నెరవేరగా మీరు చూసే నెలగా ఏప్రిల్ నిరూపించబడుగాక. మీరు ఈనాడు సృష్టికర్తను సేవించాలని కోరుకునే వారైతే, ఆయనకు ఏకభక్తినివ్వాలనుకుంటే, ఆయన కన్నులకు ఆనందం కలుగజేసే పనిని మీరు చేయాలనుకుంటే, ఆయన అంగీకారాన్ని, ఆయనిచ్చే బహుమానాన్ని పొందాలని కోరుకుంటే మీరు ఆ ఆనందాన్ని అనుభవించగలరు. ఆయన ఆత్మద్వారా, యెహోవాను తన ప్రజలకు చిహ్నమైన మంచి హృదయస్థితిని మీలో వృద్ధిచేయనీయండి. ఆయన ఉపదేశాలకు మీ హృదయాన్ని తెరవండి. ఆయన సేవయెడల సరైన మానసిక దృక్పథాన్ని మీలో పెంపొందించడానికి వాటిని అనుమతించండి. ఆయన వాక్యంలోని సువార్తను, జీవితాన్ని మార్చే దాని సత్యాలను విశ్వానికి గొప్ప దేవున్ని సేవించుటలోనే కేవలం కనుగొనగల ప్రత్యేకమైన ఆనందాన్ని మీలో వృద్ధిచేయనీయండి.