మీకు ఆసక్తి కనిపించిన చోటికి తిరిగి వెళ్ళండి
1 మనలో అనేకులం చందాలను పొందడంలోను, పత్రికలను, బ్రోషూర్లను పంచిపెట్టడంలోను విజయం సాధించాం. అయితే మనం తిరిగి వెళ్ళి ఎక్కువ ఆసక్తిని రేకెత్తించడానికి ప్రయత్నం చేయడం చాలా ప్రాముఖ్యం. మనం అలా చేయడంలోని విజయం, మనం పునర్దర్శనం చేయకముందు ఎంత బాగా సిద్ధపడుతున్నామన్న దానిపై ఆధారపడి ఉండవచ్చు.
2 పెద్దలు ఏ విషయాలను గూర్చి వ్యధచెందుతారో చాలా మంది యౌవనస్థులు కూడా ఆ విషయాలను గూర్చే వ్యాకులపడతారని గుర్తుంచుకోండి. తేజరిల్లు! మే సంచికలో యౌవనస్థుల దృక్కోణంలో వారి ప్రస్తుత సమస్యలను పరిశీలించే శీర్షికలున్నాయి. ఈ శీర్షికలు జీవితంలో నిజంగా ముఖ్యమైనవేంటో గుణగ్రహించడానికి సహాయపడేలా యౌవనస్థులకు, వారి తల్లిదండ్రులకు పరిజ్ఞానాన్ని అందిస్తాయి.
3 మీరు మే 8వ సంచిక “తేజరిల్లు!” (పక్షపత్రికల సంచిక) అందించినట్లయితే, ఆ తదుపరి మళ్ళీ వెళ్ళి మే 22వ సంచికను అందించే పథకం వేయవచ్చు. మీరిలా చెప్పవచ్చు:
◼ “నేను మీకిచ్చిన గత సంచిక పిల్లల కొరకైన నిరీక్షణను గూర్చి చర్చించింది. భవిష్యత్తు కొరకు ఏ నిరీక్షణను యివ్వని లోకంలో మన పిల్లలు పెరగవలసి ఉన్నారు. వారిలో అనేకులు తిరుగబడి ప్రవర్తిస్తూ తమ కోపాన్ని ప్రదర్శిస్తారు. అయితే తమ సమతుల్యాన్ని కాపాడుకుంటూ ఉన్నత ఆదర్శాలను కొనసాగించేవారు కొందరున్నారు. కొత్త తేజరిల్లు!లోని యీ శీర్షిక ఒక హైకోర్టు 15 ఏండ్ల లోపు బాలుని విధానాన్ని ఎలా సమర్థిస్తుందో వివరిస్తుంది. అది చెప్పదలచుకున్న విషయాన్ని మీరు ప్రశంసిస్తారని నేను తలస్తాను.”
4 మీరు మొదట సందర్శించినప్పుడు, గృహస్థుడు పత్రికల్లో ఒక్కొక్కటే తీసుకున్నట్లయితే, మీరు తిరిగి సందర్శించినప్పుడు, యీ విధంగా చెబుతూ చందాను సేకరించాలని తీర్మానించుకోవచ్చు:
◼ “పోయిన సారి యీ భూమి భవిష్యత్తును గూర్చి మనం చేసిన చర్చ నాకు సంతోషం కలిగించింది. దేవుడు దుష్టత్వానికి, కష్టాలకు అంతం తెచ్చినప్పుడు, యిక్కడ ఎలాంటి జీవితం ఉంటుందో మీరు ఊహించగలరా? కావలికోట (లేదా తేజరిల్లు!) దేవుని రాజ్యం తెచ్చే ఆశీర్వాదాలవైపు క్రమంగా శ్రద్ధ మళ్ళించి, వాటిని వివరిస్తుందని మీకు తెలుసా? [మీరిచ్చి వెళ్ళిన పత్రికనుండో లేదా మీ దగ్గరున్న పత్రిక నుండో ఏదైనా ఒక అంశాన్ని చూపండి.] మీరు యీ పత్రికల్లో ఒకటి (లేదా రెంటిని) క్రమంగా పొందాలని నేను యిష్టపడతాను.”
5 మీరు తిరిగి వెళ్ళినప్పుడు, ఆ గృహస్థునికి తన స్వంత మతపరమైన సాహిత్యాలు వస్తున్నాయని, తనకవి చాలని ఆయన భావిస్తున్నాడని బహుశ, మీరు తెలుసుకుంటారు. అప్పుడు మీరిలా చెప్పవచ్చు:
◼ “మన మతమేదైనా, నేరము, ప్రాణాంతకమైన వ్యాధులు, వాతావరణ కాలుష్యం వంటి వ్యాకులతలవల్ల మనమందరం బాధించబడుతున్నాం, కాదంటారా? [జవాబు చెప్పనివ్వండి.] ఈ సమస్యలకు నిజమైన పరిష్కారమేమైనా ఉందని మీరు భావిస్తున్నారా? [2 పేతురు 3:13 చదవండి.] మా సాహిత్యాల ఉద్దేశం కావలికోట 2వ పేజీలో చెప్పబడింది. [ఎన్నుకొన్న ఒకటో రెండో వాక్యాలను చదవండి.] యెహోవాసాక్షులు కాని అనేక మంది ప్రజలు మా ప్రచురణలు అందించే బైబిలు ఆధార నిరీక్షణనుబట్టి వాటిని చదవడానికి సంతోషిస్తారు.” గృహస్థుని ప్రతిస్పందన అనుకూలంగా ఉన్నట్లయితే, మన బైబిలు పఠన కార్యక్రమాన్ని వివరించండి.
6 మీరీ విధంగా చెప్పవచ్చు:
◼ “క్రితంసారి నేను యిక్కడికి వచ్చినప్పుడు, మన ప్రపంచానికి భవిష్యత్తులో జరుగబోయే వాటిని గూర్చి మాట్లాడుకున్నాం. ఈ నివేదికను గూర్చి మీరేమనుకుంటున్నారు? [శ్రద్ధనాకర్షించే ఏవైనా యిటీవలి వార్తలను పేర్కొనండి.] ప్రజలు యిలాంటి విషయాలను విన్నప్పుడు, లోకానికి ఏం సంభవిస్తుందా అని ఆలోచిస్తారు, కాదంటారా? బైబిలులో 2 తిమోతి 3:1-5నందు ప్రవచించబడిన ‘అంత్య దినాల్లో’ మనం జీవిస్తున్నామని యిలాంటి విషయాలు సూచిస్తున్నట్లు మేము నమ్ముతాం.” ఉన్నతాంశాలను చదివిన తర్వాత, ఆ వివరణకు తగినవారిని చూశారా అని మీరడగవచ్చు. రీజనింగ్ పుస్తకంలోని 234-8 పేజీల్లోని ఏదైనా ఒక ఉపశీర్షికను ఉపయోగిస్తూ చర్చను కొనసాగించండి.
7 మనం బాగా సిద్ధపడి, వారికి సహాయం చేసే యథార్థమైన కోరికను కనబరచినట్లయితే, యథార్థ హృదయులు వింటారని మనం నమ్మకముంచగలము.—యోహాను 10:27, 28.