నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ప్రభావవంతంగా పరిచయం చేయుట
1 యేసు ఉపోద్ఘాతాలను ఉపయోగించడంలో ప్రతిభావంతుడు. ఆసక్తిని రేకెత్తించడానికి ఏం చెప్పాలో ఆయనకు తెలుసు. ఒక సందర్భంలో సమరయ స్త్రీతో కేవలం త్రాగడానికి మంచినీళ్ళు కావాలని అడుగుతూ సంభాషించడానికి చొరవ తీసుకున్నాడు. ఇది వెంటనే ఆమె శ్రద్ధనాకర్షించింది, ఎందుకంటే, ‘యూదులు సమరయులతో సాంగత్యము చేసేవారు కారు.’ కొనసాగిన సంభాషణ చివరికి ఆమె మరియు ఇతరులు అనేకులు విశ్వాసులు కావడానికి తోడ్పడింది. (యోహా. 4:7-9, 41) మనమాయన మాదిరి నుండి నేర్చుకోగలము.
2 నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందించడానికి సిద్ధపడేటప్పుడు మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘మా ప్రాంతంలోని ప్రజలకు ప్రస్తుతం ఆసక్తి ఉన్న విషయాలేవి? యౌవనున్ని, వృద్ధున్ని, పెద్ద మనిషిని, భర్తను లేదా భార్యను ఏది ఆకట్టుకుంటుంది?’ మీరు ఒకటికన్నా ఎక్కువ ఉపోద్ఘాతాలను సిద్ధపడి, సందర్భానికి తగినట్లుగా ఉంటుందనిపించే దాన్ని ఉపయోగించేందుకు పథకం వేసుకోండి.
3 కుటుంబ జీవితం క్షీణించిపోవడాన్ని గూర్చి అనేకులు శ్రద్ధ కలిగివున్నారు గనుక, మీరు ఈ విధంగా ప్పవచ్చు:
◼ “దైనందిన జీవితంలోని ఒత్తిళ్ళు, నేటి కుటుంబాలను విపరీతంగా పీడిస్తున్నాయి. వారు ఎక్కడనుండి సహాయాన్ని పొందగలరు? [జవాబు చెప్పనివ్వండి.] బైబిలు మనకు నిజంగా సహాయకరంగా ఉండగలదు. [2 తిమోతి 3:16, 17 చదవండి.] కుటుంబాలు నిలబడడానికి సహాయపడే ప్రయోజనకరమైన మార్గదర్శకాలను లేఖనాలు అందిస్తాయి. పరదైసు భూమిపై మీరు నిరంతరము జీవించగలరు అనే ఈ ప్రచురణలోని 238వ పుటలోని 3వ పేరాలో ఏమి చెప్పబడిందో గమనించండి.” పేరా 3 చదివి, దాన్ని అందించండి.
4 మీరు ఒక ప్రాంతీయవార్తా నివేదికను ఉపయోగిస్తున్నట్లయితే, ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “మీరు ఈ వార్తా [స్థానికంగా చర్చించబడుతున్న] నివేదికను గూర్చి విన్నారా? దానిని గూర్చి మీరేమనుకుంటున్నారు? [జవాబివ్వనివ్వండి.] దీని వలన ఈ లోకం ఏమౌతుందోనని మీరు వాపోవచ్చు, కాదంటారా? మనం అంత్య దినాల్లో జీవిస్తున్నామనడానికి రుజువుగా బైబిలు ఇలాంటి విషయాలనుగూర్చి ప్రవచించింది.” తర్వాత, నిరంతరము జీవించగలరు అనే పుస్తకములోని 150-3 పుటల నుండి సమాచారాన్ని పరిశీలించండి.
5 అనేకులు పెరుగుతున్న నేరమనే సమస్యను బట్టి కలత చెందుతున్నారు. మీరు “బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను” అనే పుస్తకం, పుట3లోని “నేరము/భద్రత” అనే ఉపశీర్షిక క్రిందవున్న మొదటి ఉపోద్ఘాతాన్ని ఉపయోగించుకోవచ్చు:
◼ “మేము ప్రజలతో వ్యక్తిగత భద్రతను గూర్చి మాట్లాడుతున్నాము. మన చుట్టూ నేరం ఎక్కువగా ప్రబలివుంది, అది మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. మీలాంటి, నాలాంటి ప్రజలు రాత్రులయందు, వీధుల్లో సురక్షితముగా ఉన్నట్లు భావించడానికి, ఏమవసరమని మీరనుకుంటారు?” మీరు కీర్తన 37:10, 11 చదివి, నిరంతరము జీవించగలరు పుస్తకము, 156-8పుటలను ఉపయోగిస్తూ, దేవునిరాజ్యం తెచ్చే ఆశీర్వాదాలనుగూర్చి మాట్లాడండి.
6 మీరు క్లుప్తంగా చెప్పాలనుకుంటే, “బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను” అనే పుస్తకంలో 4వ పుటలో ఉన్నటువంటి ఉపోద్ఘాతాన్ని ఉపయోగించవచ్చు:
◼ “బైబిలు మన కొరకు అందజేస్తున్న గొప్ప భవిష్యత్తును గూర్చి పరిశీలించమని మా పొరుగువారిని ప్రోత్సహిస్తున్నాము. [ప్రకటన 21:3, 4 చదవండి.] ఇది మీకు మంచిగా అనిపిస్తుందా? [జవాబివ్వనివ్వండి.] దేవునిరాజ్యం క్రింద విధేయతగల మానవజాతి అనుభవించబోయే ఇతర ఆశీర్వాదాలను ఈ ప్రచురణలోని 19వ అధ్యాయం ఉన్నతపరుస్తుంది.” తర్వాత నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందించండి.
7 ప్రభావవంతమైన ఉపోద్ఘాతాన్ని సిద్ధం చేసుకోవడం నీతికొరకు ఆకలిగొన్నవారిని సమీపించేందుకు మీకు సహాయపడగలదు.—మత్త. 5:6.