బ్రోషూర్లను ఉపయోగిస్తూ—దేవుని వాక్య బోధకులుగా ఉండండి
1 ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించే పనియందు భాగం వహించవలసిన బాధ్యత యెహోవాకు సమర్పించుకున్న ప్రతి దాసునికి ఉంది. పరలోకంలోను, భూమ్మీదను సర్వాధికారమున్నవాడే “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . వారికి బోధించుడి” అని ఆజ్ఞ ఇచ్చాడని మనం గుణగ్రహించినప్పుడు ఈ బాధ్యత యొక్క గంభీరత మరింత స్పష్టమవుతుంది. (మత్త. 28:18-20) కాబట్టి, సువార్త ప్రకటనా పనిలో పాలుపంచుకునేందుకు మనం బోధకులమవ్వవలసిన అవసరం ఉంది మరి!—2 తిమో. 2:2.
2 ఆగష్టు నెలలో బ్రోషూర్లను అందించేటప్పుడు మనం మన బోధనా సామర్థ్యాలను ఉపయోగించగలము. మనం వాటి నుండి కొన్ని ఆసక్తికరమైన లేఖనాధార తలంపులను ఎన్నుకుని, సంభాషణను ఆరంభించడానికి మనకు సహాయపడే కొన్ని వ్యాఖ్యానాలను సిద్ధపడవచ్చు.
3 “దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?” అనే బ్రోషూర్ను అందించేటప్పుడు మీరీవిధంగా చెప్పవచ్చు:
◼ “మేము మీ పొరుగువారిని చాలా మందిని కలిసినప్పుడు, నేరం, తీవ్రవాదం, హింస అకస్మాత్తుగా పెరుగుతూ ఉండడాన్ని గూర్చి వ్యాకులత చెందుతున్నారని కనుగొన్నాము. ఇది ఇంత పెద్ద సమస్యగా ఎందుకు మారిందనే దాన్ని గూర్చిన మీ అభిప్రాయమేమిటి? [జవాబు చెప్పనివ్వండి.] ఇది జరుగుతుందని బైబిలు ముందే చెప్పిందన్నది మనకు ఎంతో ఆసక్తికరమైన విషయం. [2 తిమోతి 3:1-3 చదవండి.] ఇది ‘అంత్య దినాల్లో’ జరగవలసి ఉందని గమనించండి. ఏదో అంతం కాబోతుందనే దాన్ని గూర్చి అది మనకు తెలియజేస్తుంది. అదేమని మీరనుకుంటున్నారు?” జవాబు చెప్పనివ్వండి. పేజీ 22కు త్రిప్పి అక్కడి చిత్రాన్ని చూపించి, అక్కడ ఎత్తి వ్రాయబడిన ఒకటో రెండో లేఖనాలను చర్చించండి. ఈ ఆశీర్వాదాలు త్వరలోనే కలుగుతాయని మనమెందుకు విశ్వసిస్తున్నామో వివరించడానికి తరువాత తిరిగి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోండి.
4 “జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?” అనే బ్రోషూర్ను అందించేటప్పుడు మీరు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “జీవించడంలోని నిజమైన ఉద్దేశాన్ని కనుగొనడానికి ప్రయత్నించడం చాలామంది ప్రజలకు కష్టంగా ఉంటుంది. కొందరు కొంత వరకు సంతోషాన్ని అనుభవిస్తున్నప్పటికీ, అనేకులు నిరాశ మరియు కష్టాలతో నిండిన జీవితాలను గడుపుతున్నారు. మనమీ విధంగా జీవించాలని దేవుడు ఉద్దేశించాడని మీరనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] ఇలాంటి లోకంలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడని బైబిలు చూపిస్తుంది.” పేజీ 21లోని చిత్రాన్ని చూపించి, ఆ తర్వాత 25, 26 పేజీల్లోని 4-6 పేరాలకు త్రిప్పి, ఆయన ఏమి వాగ్దానం చేశాడో వివరించండి. మీరు తిరిగి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నను లేవదీయండి: “దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడని మనమెలా నిశ్చయత కలిగి ఉండగలం?”
5 “భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!” అనే బ్రోషూర్ను, దాని ముందు, వెనుకనున్న కవరుపైని పూర్తి చిత్రాన్ని చూపించి, ఈ విధంగా ప్రశ్నిస్తూ అందించవచ్చు:
◼ “ఇలాంటి సంతోషంగల ప్రజలతో నిండి ఉన్న లోకంలో జీవించడానికి మీరు ఇష్టపడతారా? [జవాబు చెప్పనివ్వండి.] దేవుడు ప్రజలను ప్రేమిస్తున్నాడని, వారు ఈ భూమిపై నిరంతరము సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాడని బైబిలు మనకు చెబుతుంది.” నలభైతొమ్మిదవ బొమ్మకు త్రిప్పి, ఎత్తివ్రాయబడిన లేఖనాల్లో ఒకదాన్ని చదవండి. తరువాత 50వ చిత్రాన్ని చూపించి, మనం ఈ పరదైసులో జీవించాలని కోరుకుంటున్నట్లయితే మనమేమి చేయాలో వివరించండి. మీరు మళ్ళీ వెళ్ళి యేసుక్రీస్తునందు విశ్వాసమెందుకు ప్రాముఖ్యమై ఉన్నదో చర్చిస్తారని తెలపండి.
6 మనం ‘మన బోధకు శ్రద్ధ చూపించడం ద్వారా మన అభివృద్ధిని కనబరచినప్పుడు’ యెహోవా ఆనందిస్తాడు. (1 తిమో. 4:15, 16) “సువర్తమానము” వినాలని ఆశించేవారికి సహాయం చేయాలనే మన ప్రయత్నాల్లో బ్రోషూర్లు మనకు నిజంగా సహాయకరంగా ఉండగలవు.—యెష. 52:7.