ప్రతి మంచి పని కొరకు మనల్ని మనం ఇష్టపూర్వకంగా అర్పించుకొనుట
1 ఒక లౌకిక ప్రచురణ యెహోవాసాక్షులను ఉదాహరిస్తూ, ఈ విధంగా చెబుతుంది: “సాక్షుల్లాగా తమ మతం కొరకు కష్టపడే మరే ఇతర సంఘ సభ్యులనైనా కనుగొనడం కష్టంగా ఉండవచ్చు.” యెహోవాసాక్షులు అలాంటి సిద్ధమనస్సుతో అంత కష్టపడి పనిచేస్తారెందుకని?
2 అత్యవసర భావంతో ప్రభావితం చేయబడ్డారన్నదే ఒక కారణం. భూమిపై తన పనిని పూర్తిచేయడానికి తనకు కొంతకాలమే ఉందన్న సంగతిని యేసు గుర్తించాడు. (యోహాను 9:4) మహిమపొందిన దేవుని కుమారుడు నేటి తన శత్రువుల మధ్య పరిపాలన చేస్తుండగా, తమ పనిని చేయడానికి తమకు కొంత సమయమే ఉందని యెహోవా ప్రజలు గ్రహిస్తారు. గనుక, వారు తమను తాము పరిశుద్ధ సేవ కొరకు ఇష్టపూర్వకంగా అర్పించుకుంటారు. (కీర్త. 110:1-3) కోతకోసి, ఫలాన్ని తీసుకురావడానికి అనేక మంది పనివారు అవసరముండగా వారి ప్రయత్నాలను తగ్గించుకునే ప్రసక్తే లేదు. (మత్త. 9:37, 38) కాబట్టి, పనిలో ఇష్టతను, శ్రద్ధను చూపించడంలో పరిపూర్ణ మాదిరినుంచిన యేసును అనుకరించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు.—యోహాను 5:17.
3 యెహోవాసాక్షులు యెహోవాకు పూర్ణహృదయంతో పనిచేస్తున్న మరో కారణం ఏమిటంటే, వారి ప్రపంచవ్యాప్త సంస్థ ఇతర గుంపులన్నింటి నుండి భిన్నంగా ఉంది. ప్రపంచ మత సంస్థలకు తమ అనుచరుల నుండి కొంత సమయం మరియు కొంత ప్రయత్నమే అవసరము. వారు ఏమి నమ్ముతున్నారనేది వాళ్ళ జీవితాలపై, ఇతరులతో వారు మెలిగే విధానంపై, లేదా జీవితాల్లో వారు చేసే ప్రయత్నాలపై అంతగా ప్రభావం చూపవు లేదా అసలు ప్రభావం చూపలేవు. నిజమైన విశ్వాసం యొక్క ప్రేరేపించే శక్తి కొరవడగా, తమ సంఘ కాపరుల నామమాత్రపు ప్రయత్నమైనా సరిపోతుందని వారికి హామీ ఇస్తూ, వారు ‘మృదువైన మాటలు పలకాలని’ వారిని బలవంతపెట్టారు. (యెష. 30:10) వారి మత నాయకులు ‘వారికి వినసొంపైనవి చెప్పడం’ ద్వారా ఉదాసీనతను మరియు ఆత్మీయ సోమరితనాన్ని కలుగజేయుటకు బద్ధులయ్యారు.—2 తిమో. 4:3.
4 యెహోవా ప్రజల మధ్య ఎంత తేడానో! మన ఆరాధనకు సంబంధించిన ప్రతిదానిలో ప్రయత్నం, శ్రమ, పని ఇమిడి ఉన్నాయి. ప్రతి రోజు మనం చేసే ప్రతి దానిలోను మనం నమ్మేదానిని అభ్యసిస్తున్నాము. సత్యం మనకు మరింత సంతోషాన్నిస్తున్నప్పుడు, దానికవసరమైనది చేయడానికి అందులో “యెంతో పోరాటము” ఇమిడి ఉంది. (1 థెస్సలోనీకయులు 2:2 పోల్చండి.) కేవలం దైనందిన జీవిత బాధ్యతలను నిర్వహించడంతోటే అనేకమంది ప్రజలు పని రద్దీలో పడిపోతారు. అయితే, ఈ చింతలు రాజ్యాసక్తులను ముందుంచడాన్ని నివారించేందుకు మనం అనుమతించకూడదు.—మత్త. 6:33.
5 మనం యెహోవా సేవలో చేయడానికి మనకు అప్పజెప్పబడిన పని ఎంత ప్రయోజనకరమైనది మరియు అత్యవసరమైనది అంటే అది ఇతర పనుల నుండి సమయాన్ని ‘కొని’ దానిని ఆత్మీయ విషయాల కొరకు మరింత లాభదాయకంగా ఉపయోగించడానికి మనం కదిలించబడతాము. (ఎఫె. 5:16) మన దైవభక్తి మరియు సిద్ధమనస్సు యెహోవాను ప్రీతిపరుస్తాయని తెలుసుకోవడం, కష్టమైన మన పనిని కొనసాగించడానికి మనకు గొప్ప ప్రేరేపణనిస్తుంది. ఇప్పుడు మనం పొందే గొప్ప ఆశీర్వాదాలు మరియు భవిష్యత్తు జీవితంలో రానున్న వాటిని గూర్చిన నిరీక్షణలతో మన కృతనిశ్చయము ఏమంటే, రాజ్యాసక్తుల కొరకు ‘ప్రయాసముతో పాటుపడడం’లో కొనసాగడమే.—1 తిమో. 4:10.
6 భక్తి మరియు స్వయం త్యాగ స్ఫూర్తి: నేడు అనేకమంది ప్రజలు మరి దేనికన్నా భౌతిక అవసరాలకు మరియు ఆసక్తులకు ప్రాముఖ్యతనిస్తారు. ఏమి తింటాము, త్రాగుతాము, లేదా ధరిస్తాము అనే విషయాలపై శ్రద్ధ కేంద్రీకరించడం పూర్తి సమర్థనీయమైనదిగా వారు భావిస్తారు. (మత్త. 6:31) అవసరాలకు ఉన్న వాటితో తృప్తిపడక, వారు ఇప్పుడు పూర్తిగా మంచి జీవితాన్ని అనుభవించాలని, ‘అనేక సంవత్సరాలకు, విస్తారమైన ఆస్తిని సమకూర్చుకుని తిని, త్రాగి, సంతోషించాలనే’ లక్ష్యంతో ప్రేరేపించబడుతున్నారు. (లూకా 12:19) చర్చికివెళ్ళే ఒక వ్యక్తి తన మతం కొరకు ఏదైనా చేయవలసి వస్తే, అది తమ హక్కులను అతిక్రమించినట్లుగా భావిస్తాడు. లేదా కొన్ని రకాల వస్తుసంపదను వెంటాడడాన్ని వదిలిపెట్టాలి లేదా తగ్గించాలి లేదా ఆనందదాయకమైన వస్తువులను వదులుకోవాలనే తలంపు సమ్మతము లేనిది. తనపై మాత్రమే శ్రద్ధ కేంద్రీకరించబడిన తన ఆలోచనతో ఉండడం వలన, స్వయం త్యాగ స్ఫూర్తిని అలవరచుకోవడం అవాస్తవమైనది, అసాధ్యమైనది.
7 మనం ఈ విషయాన్ని భిన్నంగా దృష్టిస్తాము. మనం మానవుని తలంపులను తలంచే బదులు, దేవుని తలంపులను తలంచేలా దేవుని వాక్యం మన ఆలోచనావిధానాన్ని ఉన్నతపరచింది. (యెష. 55:8, 9) శారీరక కోరికలను అధిగమించే జీవిత లక్ష్యాలు మనకున్నాయి. యెహోవా సార్వభౌమాధిపత్యం నిరూపించబడడం మరియు ఆయన నామం పరిశుద్ధపరచబడడం విశ్వమంతటిలో అతి ప్రాముఖ్యమైన విషయాలు. ఈ వివాదాలు ఎంత ఎక్కువ ప్రాముఖ్యమైనవంటే, తారతమ్యం చేస్తే “ఆయన దృష్టికి” అన్ని దేశాలు “లేనట్టుగానే” ఉంటాయి. (యెష. 40:17) దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేసే విధంగా మన జీవితాలను గడిపే ఏ ప్రయత్నమైనా వెర్రితనముగా దృష్టించబడాలి.—1 కొరిం. 3:19.
8 కొన్ని వస్తువులు అవసరమైనవిగా ఉండగా, ఇతర వస్తువులు మన రాజ్య కార్యక్రమాలను కొనసాగించేందుకు ఉపయోగకరమైనవిగా ఉన్నప్పటికీ, ఇవన్నీ నిజంగా “శ్రేష్ఠమైన కార్యములు” కావని మనం గ్రహిస్తాము. (ఫిలి. 1:9) వస్తు సంపదను సంపాదించే ప్రయత్నానికి హద్దులను ఏర్పరచుకుంటూ, ‘అదృశ్యములును, నిత్యములునైన’ వాటిపై మన హృదయాలను కేంద్రీకరించడానికి జ్ఞానపూర్వకంగా ప్రయత్నించడం ద్వారా మనం 1 తిమోతి 6:8 లోని ఉపదేశాన్ని అనుసరిస్తాము.—2 కొరిం. 4:18.
9 మనం దేవుని తలంపులను గూర్చి అధికంగా ఆలోచిస్తున్న కొలది, వస్తుసంపదను గూర్చిన చింత అంతగా తగ్గుతుంది. ఇప్పటికే యెహోవా మనకొరకు చేసిన వాటిని గూర్చి, భవిష్యత్తు కొరకు ఆయన వాగ్దానం చేసిన అద్భుతమైన ఆశీర్వాదాలను గూర్చి మనం ధ్యానించినప్పుడు, ఆయన మనల్ని అడిగిన ఏ త్యాగాన్నైనా చేసేందుకు మనం సంసిద్ధులమౌతాము. (మార్కు 10:29, 30) మన ఉనికిని బట్టి మనం ఆయనకు ఋణపడియున్నాము. ఆయన కరుణ మరియు ప్రేమ లేకపోతే, మనకు జీవితంలో ఇప్పుడు ఆనందము ఉండేదికాదు, ఎలాంటి భవిష్యత్తూ ఉండేది కాదు. ఆయన సేవలో మనం చేస్తున్నది ఏదైనా, ‘మనం చేయవలసినదే’ గనుక మనల్ని మనం అర్పించుకో బద్ధులమై ఉన్నామని భావిస్తాము. (లూకా 17:10) మనం “సమృద్ధిగా పంటకోయు”దుమని తెలుసుకొని, మనం యెహోవాకు ఏది తిరిగి ఇవ్వాలని కోరబడ్డామో అది మనం సంతోషంతో ఇస్తాము.—2 కొరిం. 9:6, 7.
10 ఇష్టపూర్వకంగా చేసే పనివారు ఇప్పుడు అవసరం: క్రైస్తవ సంఘం తన ఆరంభం నుండి విస్తారమైన పనికాలంలోనికి ప్రవేశించింది. సా.శ. 70లో యెరూషలేము పడద్రోయబడక ముందు అంతటా సాక్ష్యమివ్వబడవలసి ఉండినది. ఆ సమయంలో యేసు శిష్యులు “వాక్యము బోధించుటయందు ఆతురత గల”వారై ఉండిరి. (అపొ. 18:5) త్వరిత విస్తృతి వల్ల మరనేకమంది సువార్తికులకు, సామర్థ్యము గల కాపరులకు తర్ఫీదునివ్వడం, వారి సహాయాన్ని తీసుకోవడం అవసరమైంది. లోకపాలకులతో వ్యవహరించడంలో అనుభవమున్న పురుషులు మరియు అవసరమైన భౌతిక వస్తువుల సేకరణ, పంపకాల పర్యవేక్షణా సామర్థ్యం గల పురుషులు అవసరమయ్యారు. (అపొ. 6:1-6; ఎఫె. 4:13) కొందరు ప్రత్యక్షంగా సేవించగా, అనేకులు తెరవెనుకనే ఉండిపోయారు. అయితే వారందరూ ఆ పనిని సాధించేందుకు పూర్ణహృదయంతో కలిసి పనిచేస్తూ ‘తీవ్రంగా ప్రయత్నం చేశారు.’—లూకా 13:24.
11 తారతమ్యం చేస్తే, దాని తరువాతి అనేక శతాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా చురుకైన కార్యక్రమానికి అంత శ్రమ అవసరం లేకపోయినప్పటికీ, యేసు 1914లో రాజ్యాధిపత్యాన్ని తీసుకొన్నప్పుడు, రాజ్య కార్యక్రమాల పునరుద్ధరణ ఆరంభమైంది. భూవ్యాప్తంగా ఉన్న దేశాల్లోని సంసిద్ధత గల లక్షలాదిమంది ప్రజల సహాయం అవసరమయ్యేలా, రాజ్యాసక్తుల కొరకు పనివారి అవసరత ఎక్కువవుతుందని కొందరు మాత్రమే మొదట్లో గుర్తించారు.
12 మన వనరులపై వాటి గరిష్ఠ పరిమితి వరకు ఒత్తిళ్ళను తీసుకువచ్చేటటువంటి అనేక పథకాల్లో సంస్థ నేడు ఎంతో ఇమిడి ఉంది. రాజ్య పని అతి త్వరగా అభివృద్ధిని సాధిస్తుంది. మన కాలాల అత్యవసరత, ముగించవలసిన పనిని పూర్తిచేయడానికి మనం సహాయపడేందుకు, మనకున్న ప్రతి దానిని ఉపయోగించేందుకు మనల్ని పురికొల్పుతుంది. దుష్ట విధానమంతటి నాశనం మరింత సమీపమౌతుండగా, రానున్న రోజుల్లో మరింత విస్తారమైన పని కొరకు మనం ఎదురుచూస్తాం. అత్యావశ్యకమైన సమకూర్చే పనిలో ఇష్టపూర్వకంగా తనను తాను అంకితం చేసుకోవాలని యెహోవాకు సమర్పించుకున్న ప్రతి సేవకుడు పిలువబడుతున్నాడు.
13 ఏమి చేయవలసిన అవసరం ఉంది? “ప్రభువునందు చేయడానికి ఎంతో ఉంది” అని మనం యథార్థంగా చెప్పగలము. (1 కొరిం. 15:58, NW) అనేక ప్రాంతాల్లో పంట కోతకు వచ్చింది, గాని పనివారు కొంతమందే ఉన్నారు. మన ప్రాంతమంతటా బాగా సాక్ష్యమివ్వడంలో మన పాత్రను నిర్వహించడమే కాక, మరింత అవసరమున్న చోట పరిచర్య చేసే సవాలును ఎదుర్కొనేందుకు కూడా మనం ఆహ్వానించబడుతున్నాము.
14 ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని సాక్షులు ఇతర కార్యక్రమాల్లో కూడా తమను తాము సంసిద్ధతతో అర్పించుకోవడాన్ని చూడడం ఎంతో ప్రశంసనీయం. వీటిలో ఆరాధనా స్థలాలను నిర్మించడంలో స్వచ్ఛందంగా పనిచేయడం, సమావేశాల్లో సేవచేయడం, విపత్తు కలిగిన సమయాల్లో పునరావాస ప్రయత్నాలకు మద్దతునివ్వడం మొదలుకొని, రాజ్య మందిరాన్ని క్రమంగా శుభ్రం చేయడం వరకు చేరి ఉన్నాయి. చివర పేర్కొన్న కార్యక్రమాన్ని సంబంధించి, ప్రతి కూటం ముగిసిన తరువాత రాజ్య మందిరం శుభ్రంగాను, క్రమంగాను ఉండేటట్లు ఎల్లప్పుడూ చూసుకోవడం ముఖ్యం. పరిచారకులు చేసే పనిగా పరిగణించబడే వాటిని చేయడం లూకా 16:10 నందలి యేసు మాటల సరైన అవగాహనను కనబరుస్తుంది: “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.”
■ సంఘ కార్యక్రమాలకు మద్దతునివ్వడం: వ్యక్తిగత ప్రచారకులతో రూపొందిన ప్రతి సంఘం మొత్తం సంస్థయొక్క భాగంగా పనిచేయడంతో పాటు, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” నుండి నడిపింపును పొందుతుంది. (మత్త. 24:45) దాని విజయాలు ప్రతి సాక్షి ఎంత చేయడానికి ఇష్టపడతాడు, ఎంత చేయగలుగుతాడు అనే వాటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. తన ప్రాంతంలో సువార్త ప్రకటించబడడంపై, క్రొత్త శిష్యులను చేయడంపై, వారిని ఆత్మీయంగా బలపరచడంపై సంఘం శ్రద్ధ నిలుపుతుంది. మనలో ప్రతి ఒక్కరు ఈ పనిలో పాల్గొనవచ్చు. వ్యక్తిగత పఠనంలో, కూటాల్లో అర్థవంతంగా పాల్గొనడంలో, సంఘంలో అవసరతలో ఉన్న ఇతరులకు సహాయపడడంలో కూడా మనంతట మనం లక్ష్యాలను పెట్టుకోవచ్చు. మన సంసిద్ధతను కనబరచేందుకు ఈ కార్యక్రమాలు అనేక అవకాశాలను అందిస్తాయి.
■ పర్యవేక్షణా స్థానంలో ఉన్నవారు నాయకత్వం వహించడం: ప్రతి సంఘం యొక్క పర్యవేక్షణా పనిని, యెహోవా దాని నియమిత పెద్దలకు అప్పగించాడు. (అపొ. 20:28) ఈ పురుషులు ఈ ఆధిక్యతను పొందేందుకు అర్హులయ్యారు. (1 తిమో. 3:1) పెద్ద బాధ్యతలను వహించేందుకు అర్హతపొందే కొంత సామర్థ్యము సంఘంలోని ప్రతి సహోదరునికి ఉందన్నది నిజము. అనేకమంది సహోదరులు ఆత్మీయంగా ఎదుగుతున్నారు మరియు సంఘ పెద్దల నడిపింపు క్రింద, వారి ప్రేమపూర్వకమైన సహాయంతో ఇంకా ఎదగవలసిన అవసరముంది. ఈ పురుషులు బైబిలు మరియు మన ప్రచురణల శ్రద్ధగల విద్యార్థులుగా ఉండాలి. వారు ఆత్మాభిషక్త పెద్దలకు లోబడి, వారి విశ్వాసాన్ని అనుకరించి, అధ్యక్షులకు కావలసిన సుగుణాలను అలవరచుకోవడం ద్వారా తమ సంసిద్ధతను కనబరచగలరు.—హెబ్రీ. 13:7, 17.
■ పూర్తికాల సేవను చేపట్టడం: సంఘం ముఖ్యంగా సువార్తను ప్రకటించడానికే పనిచేస్తుంది. (మత్త. 24:14) ఆసక్తి గలవారు పయినీర్ల జాబితాలో చేరడం ద్వారా తమ ప్రయత్నాలను తీవ్రతరం చేసినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో! ఇందులో సాధారణంగా వ్యక్తిగత జీవితంలో సవరింపులు చేసుకోవడం ఇమిడి ఉంటుంది. ఈ ప్రత్యేక సేవా రంగంలో కొనసాగేందుకు వారు అదనంగా సవరింపులు చేసుకోవలసిన అవసరం ఉండవచ్చు. ఈ ఆధికత్యను గైకొన్నవారు, ఒక సంవత్సరం లేదా ఆ తరువాత ఏవో తాత్కాలిక నిరుత్సాహం వల్ల దానిని వదిలిపెట్టేబదులు, దానిని కొనసాగించడం వలన యెహోవా యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని కచ్చితంగా పొందుతారు. ప్రేమగల పెద్దలు మరియు పరిపక్వత గల ఇతరులు తమ మాటల ద్వారా క్రియల ద్వారా పయినీర్లను ప్రోత్సహిస్తూ, వారి సఫలతకు తోడ్పడగలరు. పాఠశాలను ముగించిన వెంటనే నేరుగా పయినీరింగులో ప్రవేశించే యౌవనస్థులు ఎంత చక్కటి స్ఫూర్తిని ప్రదర్శించారో! తమ లౌకిక బాధ్యతలు తగ్గిన వెంటనే క్రమ పయినీర్లుగా చేరిన పెద్దల విషయంలో కూడా అది నిజమే. సమర్పించుకున్న ఒక క్రైస్తవుడు సమకూర్చే పని వేగాన్ని యెహోవా త్వరితం చేస్తుండగా దానితో సహకరించడం అతనికి ఎంతటి సంతృప్తిని తెస్తుందో!—యెష. 60:22.
■ కూటం స్థలాల నిర్మాణాల్లోను, పాలనలోను పాల్గొనుట: అక్షరాలా, వందల కొలది ఆధునిక రాజ్యమందిరాలు అలాగే అనేక సమావేశ మందిరాలు నిర్మించబడ్డాయి. తమ సమయాన్ని, సామర్థ్యాలను స్వచ్ఛందంగా వెచ్చించిన మన సహోదర సహోదరీలు దిగ్భ్రమ కలిగించేలా ఎంతో ఎక్కువ పనిని చేయగలిగారు. (1 దిన. 28:21) ఇష్టపూర్వకంగా పనిచేసే వేలాదిమంది పనివారు అవసరమైన దేనినైనా చేసి ఈ వసతులను మంచిగా ఉంచుతున్నారు. (2 దిన. 34:8) ఈ పని పరిశుద్ధ సేవ యొక్క ఒక భాగం గనుక, సహాయం చేసేవారు తమంతట తాము ఇష్టపూర్వకంగా సమర్పించుకుంటూ, ఇంటింటా ప్రకటించేందుకు, సంఘంలో బహిరంగ ప్రసంగాలిచ్చేందుకు, లేదా సమావేశాల పనుల్లో సహాయపడేందుకు ప్రతిఫలం అడగనట్లుగానే, దీని కొరకు తాము చేసిన సేవకు ప్రతిఫలం కావాలని కోరుకోరు. ఈ స్వచ్ఛంద సేవకులు యెహోవా ఘనతకు ఆరాధనా స్థలాల నమూనాలను తయారు చేయడంలోనూ, నిర్మించడంలోనూ తమ సేవలను ఉచితంగా అందిస్తారు. చట్టబద్ధమైన ప్రమాణాల పనిని పూర్తిచేయడం, అకౌంట్స్ రికార్డులను తయారు చేయడం, కొనుగోలు చేసేందుకు వాణిజ్య సంబంధాలను పెట్టుకోవడం, అవసరమైన వస్తువులను లెక్క వేయడం వంటి పనుల్లో ఎంతో ఆసక్తిగా సహాయపడతారు. యెహోవా యొక్క నమ్మకమైన ఈ సేవకులు అందరూ తమ సామర్థ్యాలను, వనరులను యెహోవాకు సమర్పించుకున్నారు గనుక, పై ఖర్చులు చేయరు లేదా ఏదైనా విధంగా వారు చేసే సేవ నుండి నేరుగా కాని, మరే విధంగా గాని వస్తు సంబంధంగా లాభం సంపాదించాలని తాపత్రయపడరు. (మే 1992 మన రాజ్య పరిచర్య 4వ పేజీ, 10వ పేరా చూడండి.) ఈ పనికి “ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా” సేవ చేసే శ్రద్ధగల పనివారు అవసరము.—కొలొ. 3:23, 24.
15 అయితే, యెహోవా ప్రజల సంసిద్ధతను అసమానమైనదిగా చేసేదేమిటి? అది ఇచ్చే స్ఫూర్తి. వారు ఉదారంగా ఇవ్వడంలో డబ్బు లేక భౌతిక వస్తువులను మించినదే ఉంది, అంటే వారు ‘తమను తాము ఇష్టపూర్వకంగా అర్పించుకుంటారు.’ (కీర్త. 110:3) ఇదియే యెహోవాకు మన సమర్పణ సారము. మనం ఒక ప్రత్యేక విధంగా ప్రతిఫలం పొందుతున్నాము. ఎవరైతే మనకు ప్రతిఫలమిస్తారో వారు మనం చేసేదానిని ప్రశంసిస్తారు గనుక మనం ‘ఎక్కువ సంతోషాన్ని’ మరియు ‘సమృద్ధియైన పంటను’ అనుభవిస్తాము. (అపొ. 20:35; 2 కొరిం. 9:6; లూకా 6:38) మన గొప్ప ఉపకారి “ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించు” మన పరలోక తండ్రియైన యెహోవాయే. (2 కొరిం. 9:7) ఆయన మనకు ఎప్పటికీ నిలిచేటటువంటి ఆశీర్వాదాలతో వందరెట్లు ప్రతిఫలమిస్తాడు. (మలా. 3:10; రోమా. 6:23) కాబట్టి, యెహోవా సేవలో మీకు ఆధిక్యతలు లభ్యమైనప్పుడు, మీరు స్వచ్ఛందంగా సిద్ధపడి, యెషయా చెప్పినట్లు: ‘ఇదిగో నేను! నన్ను పంపుము’ అని మీరు జవాబిస్తారా?—యెష. 6:8.