సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి
1 యెహోవాసాక్షులుగా మనం యెహోవా నామానికి మహిమను తెచ్చేవారమై ఉండాలని మనం కోరుకుంటాం. మన ప్రవర్తన, మాటలు, కేశాలంకరణ, వస్త్రధారణ ఇతరులు సత్యారాధనను ఎలా దృష్టిస్తారు అనే దానిని ప్రభావితం చేయగలదని మనకు తెలుసు. మనం కూటాల్లో ఉన్నప్పుడు అది ముఖ్యంగా నిజం. కూటాల్లో చెప్పబడిన, చేయబడిన ప్రతిదీ సువార్తకు తగినట్లుగా ఉందని, యెహోవాకు మహిమను తెస్తుందని నిశ్చయపరచుకోవాలని మనం అనుకుంటాం.—ఫిలి. 2:4.
2 వస్త్రధారణ మరియు కేశాలంకరణల విషయాలను గూర్చిన లోక ప్రమాణాల్లో అనేకం క్రైస్తవులకు అంగీకారయోగ్యమైనవి కావు. సువార్త పరిచారకులు జాగ్రత్తగా శ్రద్ధనివ్వవలసిన విషయం ఇది. జూన్ 1, 1989, కావలికోట (ఆంగ్లం) పేజీ 20 ఈ విధంగా చెప్పింది: “మన వస్త్రాలు ఖరీదైనవై ఉండాలని లేదు, కాని అది శుభ్రంగా, అభిరుచికి తగ్గట్లుగా, అణకువగా ఉండాలి. మన పాదరక్షలు మంచిగా, చక్కగా ఉండాలి. అలాగే, సంఘ పుస్తక పఠనంతో సహా అన్ని కూటాల్లోను మన శరీరాలు శుభ్రంగా ఉండాలి, మనం పరిశుభ్రంగా, తగిన రీతిలో వస్త్రాలను ధరించేవారమై ఉండాలి.”
3 సమయపాలనమనేది ప్రేమపూర్వక దయకు మరియు శ్రద్ధకు సూచన. అప్పుడప్పుడు అనివార్యమైన పరిస్థితులు మనం కూటాలకు సమయానికి చేరుకోకుండా ఆటంకపరుస్తాయి. కాని అలవాటుగా ఆలస్యంగా రావడం కూటాల పవిత్ర సంకల్పం ఎడల గౌరవం లేకపోవడాన్ని మరియు ఇతరులకు ఆటంకం కలిగించకుండా ఉండవలసిన మన బాధ్యతను మనం గ్రహించలేకపోవడాన్ని చూపిస్తుంది. ఆలస్యంగా వచ్చేవారు తరచూ ఇతరులకు ఆటంకం కలిగిస్తారు మరియు కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందకుండా చేస్తారు. సమయపాలనం హాజరైనవారందరి భావాల ఎడల మరియు ఆసక్తుల ఎడల గౌరవాన్ని చూపిస్తుంది.
4 మన పొరుగువారి ఎడల ప్రేమ కూటాలు జరుగుతుండగా ధ్యానభంగాలను కలిగించకుండా మనలను జాగరూకులను చేస్తుంది. గుసగుసలాడడం, తినడం, చూయింగ్ గమ్ నమలడం, కాగితాలను చుట్టివేయడం, అలాగే మరుగుదొడ్డికి అనవసరంగా వెళ్ళడం ఇతరుల ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు, యెహోవా ఆరాధనా స్థలానికి చెందవలసిన గౌరవాన్ని తగ్గించవచ్చు. తమ సీట్లనుండి లేచి వెళ్ళవలసిన అత్యవసరం ఉన్నప్పుడు తప్ప, ఎవరైనా సంఘ వ్యవహారాలను చూడడం లేదా ఇతరులతో మాట్లాడడం సముచితం కాదు. దానికి బదులుగా అందరూ తమకు మరియు తమ కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా కూర్చుని, కార్యక్రమాన్ని వింటూ ఉండాలి. రాజ్య మందిరంలో పద్ధతులు లేకుండా ఉండేందుకు తావేలేదు, ఎందుకంటే “ప్రేమ . . . అమర్యాదగా నడువదు.”—1 కొరిం. 13:4, 5; గల. 6:10.
5 కూటాల్లో మన పిల్లల మంచి ప్రవర్తన అనేది కూడా యెహోవా నామానికి స్తుతిని మహిమను తెస్తుంది. తలిదండ్రుల సునిశిత పర్యవేక్షణ ఎంతో ప్రాముఖ్యం. పిల్లలు వినడానికి పాల్గొనడానికి ప్రోత్సహించబడాలి. చిన్న పిల్లలు ఉన్న అనేక తలిదండ్రులు ఇతరులకు అయుక్తంగా ధ్యానభంగం కలిగించకుండా తాము సులభంగా బయటకు వెళ్ళి, తమ పిల్లల అవసరాలను తీర్చగల్గే చోట కూర్చోవడానికి ఇష్టపడతారు.
6 “సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి” అని పౌలు బోధించాడు. (ఫిలి. 1:27) కూటాలకు హాజరైనప్పుడు మర్యాదగా ఉండేందుకు, ఇతరుల గురించి శ్రద్ధగలవారమై ఉండేందుకు ప్రయత్నం చేసేవారమై ఉందాము. అందరి సహకారం “మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొంద”డాన్ని నిశ్చయపరుస్తుంది.—రోమా. 1:12.